సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

26, మే 2026, మంగళవారం

సిద్ధెంకి యాదగిరి తప్ష కథలులో సామాజిక జీవన చిత్రణ : ఒక సిద్ధాంతపర విశ్లేషణ” - డా. కె. కార్తీక్ సహాయ ఆచార్యులు




“సిద్ధెంకి యాదగిరి తప్ష కథలులో సామాజిక జీవన చిత్రణ : ఒక సిద్ధాంతపర విశ్లేషణ” మన్నించాలి. మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పటికే ఆలస్యమైంది. నా కథలపై విలువైన వ్యాసం రాసిన కార్తీక్ అన్నగారికి కృతజ్ఞతలతో....

సామాజిక వాస్తవాలను సాహిత్య దర్పణంలో ప్రతిబింబింపజేసే కథా సాహిత్యం కాలానుగుణంగా కొత్త దృక్కోణాలను ఆవిష్కరిస్తూ వస్తోంది. అలాంటి సాహిత్య ప్రవాహంలో

“సిద్ధెంకి యాదగిరి తప్ష కథలులో సామాజిక జీవన చిత్రణ : ఒక సిద్ధాంతపర విశ్లేషణ” (jetir link)అనే వ్యాసంతో ఆత్మీయ మిత్రుడు, విమర్శకులు, సహాయ ఆచార్యులు డాక్టర్ కె. కార్తీక్ గారు విశిష్టమైన విమర్శనా దృష్టిని ఆవిష్కరించారు.

2026 మార్చి 9, 10 తేదీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగులో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు “కథా సాహిత్యం - సామాజిక సదస్సు”లో ఈ పత్రాన్ని సమర్పించడం కథా సాహిత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కథలలో నిక్షిప్తమైన దళిత జీవనానుభవాలు, వర్గ సంబంధాలు, సామాజిక సంఘర్షణలు, అట్టడుగు మనుషుల మనోవేదనలు వంటి అంశాలను సిద్ధాంతపరంగా విశ్లేషిస్తూ వ్యాసం లోతైన అధ్యయనాన్ని ప్రతిబింబించింది.
ఈ విలువైన పరిశోధనా వ్యాసం Journal of Emerging Technologies and Innovative Research (ISSN 2349-5162; JETIR) ఏప్రిల్ 2026 సంచికలో ప్రచురితమవడం ఆనందకరం.
[JETIR అధికారిక వెబ్‌సైట్](https://www.jetir.org?utm_source=chatgpt.com) ద్వారా వీక్షించవచ్చు.
సాహిత్యాన్ని సామాజిక బాధ్యతతో మేళవిస్తూ, ఆలోచనలతో, పరిశోధనకు ప్రామాణికంగా నిలిచే ఈ గొప్ప వ్యాసాన్ని అందించిన గౌరవ కార్తీక్ అన్నగారికి ఎద నిండిన పాయిరాలతో....
జ్ఞానానికి జ్యోతి… సాహిత్యానికి సామాజిక స్పృహ… విమర్శకు విలువనిచ్చే విమర్శలో మేధావి… మన కార్తీక్ అన్నగారికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు.
హృదయపూర్వక అభినందనలు. జై భీమ్
✊.............................................................)

సిద్ధెంకి యాదగిరి “తప్ష కథలు”లో సామాజిక జీవన చిత్రణ: ఒక సిద్ధాంతపర విశ్లేషణ
- డా. కార్తీక్ కుక్కల
తెలుగు సహాయ ఆచార్యులు
SR & BGNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A)
ఖమ్మం.
7989232027
kartheek.k06@gmail.com



సారాంశం (Abstract):
                 తెలంగాణ ఆధునిక కథాసాహిత్యంలో గ్రామీణ వాస్తవికతను, అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని, వలస జీవన సంక్షోభాన్ని, లింగ అసమానతలను సజీవంగా ప్రతిబింబించిన రచయితల్లో సిద్ధెంకి యాదగిరి ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. ఆయన కథాసంపుటి తప్ష కథలు తెలంగాణ గ్రామీణ సమాజానికి సాహిత్య రూపంలో ఒక సామాజిక పత్రంగా నిలుస్తుంది. ఈ పరిశోధన పత్రం సామాజిక వాస్తవికత (Social Realism), సబాల్టర్న్ దృక్పథం (Subaltern Perspective), స్త్రీవాద విమర్శ (Feminist Literary Criticism) వంటి సిద్ధాంత కోణాలలో ఈ సంపుటిని విశ్లేషిస్తుంది. పేదరికం, అప్పు-వడ్డీ వ్యవస్థ, భూమి ఆధారిత వర్గ నిర్మాణం, వలస జీవనం, మహిళా మౌన నిరసన, వృద్ధాప్య ఒంటరితనం వంటి అంశాలు కథలలో నిర్మాణాత్మక సమస్యలుగా ఎలా ప్రతిఫలించాయో ఈ అధ్యయనం పరిశీలిస్తుంది. ఈ కథలు ప్రాంతీయ అనుభవాలను విశ్వమానవీయ చర్చలకు అనుసంధానించే శక్తి కలిగి ఉన్నాయని ఈ పరిశోధన నిర్ధారిస్తుంది.
కీలక పదాలు:  తెలంగాణ కథాసాహిత్యం, సామాజిక వాస్తవికత, దళిత-బహుజన దృక్పథం, గ్రామీణ జీవితం, లింగ అసమానత, వలస సంక్షోభం.

1. పరిచయం :
                 తెలంగాణ కథాసాహిత్యం సామాజిక ఉద్యమాల చరిత్రతో అంతర్భాగంగా ముడిపడి ఉంది. ముఖ్యంగా  తెలంగాణ ఉద్యమం 1969 నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 వరకు సాగిన దీర్ఘకాలిక సామాజిక-రాజకీయ ప్రక్రియ తెలంగాణ ప్రజల జీవితాలలో గాఢమైన మార్పులను సృష్టించింది. భాష, సంస్కృతి, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం వంటి అంశాలు ఈ ఉద్యమానికి నేపథ్యంగా నిలిచాయి. ఈ చరిత్రాత్మక పరిణామాలు తెలంగాణ సాహిత్యాన్ని, ముఖ్యంగా కథాసాహిత్యాన్ని, కేవలం కళారూపంగా కాక సామాజిక సాక్ష్యంగా మలిచాయి. ఈ నేపథ్యంలో  సిద్ధెంకి యాదగిరి కథలు తెలంగాణ పల్లెజీవితాన్ని లోతుగా ప్రతిబింబిస్తాయి. ఆయన రచించిన తప్ష కథలు కథాసంపుటి తెలంగాణ గ్రామీణ సమాజానికి ఒక సాహిత్య ప్రతిరూపం. ఈ కథలు కేవలం గ్రామీణ దృశ్యాల వర్ణనకే పరిమితం కాక, గ్రామీణ జీవితంలోని అంతర్మథనాలను, కుల-వర్గ సంబంధాలను, ఆర్థిక అసమానతలను, కుటుంబ నిర్మాణంలోని సంఘర్షణలను, మహిళల ఆత్మగౌరవ పోరాటాన్ని విశ్లేషణాత్మకంగా ఆవిష్కరిస్తాయి. తెలంగాణ సమాజంలో బహుజన వృత్తులు-చేతివృత్తులు, కూలీ వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత జీవన విధానం-సామాజిక నిర్మాణాన్ని నిర్ధేశించాయి. వలస కూలీల జీవన అనిశ్చితి, భూమిలేని రైతుల బాధలు, చిన్న కుటుంబాల ఆశలు-ఆకాంక్షలు యాదగిరి కథల్లో సజీవంగా ప్రతిఫలిస్తాయి. ముఖ్యంగా మహిళా పాత్రలు సామాజిక ఒత్తిడుల మధ్య తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వ్యక్తులుగా రూపుదిద్దుకోవడం ఆయన కథలకు ప్రత్యేకమైన మానవీయ లోతును అందిస్తుంది.అలాగే, తెలంగాణ ప్రాంతీయ భాషను సహజత్వంతో వినియోగించడం ద్వారా రచయిత స్థానిక సంస్కృతిని సాహిత్యరూపంలో నిలబెట్టాడు. బతుకమ్మ వంటి పండుగలు, గ్రామీణ ఆచారాలు, కుటుంబ బంధాలు కథలలో నేపథ్య అంశాలుగా కాక, జీవన తత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక చిహ్నాలుగా కనిపిస్తాయి.
                        ఈ విధంగా, సిద్ధెంకి యాదగిరి కథలు తెలంగాణ సమాజంలోని మార్పులు, మౌన స్వరాలు, అణగారిన వర్గాల అనుభవాలు మరియు ప్రాంతీయ గుర్తింపు కోసం జరిగిన అంతర్మథనాన్ని ప్రతిబింబించే సామాజిక పత్రాలుగా నిలుస్తాయి. అందువల్ల ఆయన కథలను అధ్యయనం చేయడం తెలంగాణ ఆధునిక సాహిత్యంలోని సామాజిక వాస్తవికతను అర్థం చేసుకునేందుకు అత్యంత అవసరం.

2. రచయిత పరిచయం మరియు సాహిత్య నేపథ్యం :  
                తెలంగాణ ఆధునిక కథాసాహిత్యంలో సామాజిక వాస్తవికతకు స్పష్టమైన స్వరాన్ని అందించిన రచయితల్లో సిద్ధెంకి యాదగిరి ముఖ్య స్థానం పొందారు. తెలంగాణ రచయితల సంఘంతో అనుబంధం కలిగిన ఆయన సాహిత్య ప్రయాణం ఉద్యమ చైతన్యంతో ముడిపడి ఉంది. గ్రామీణ అనుభవం, పల్లె సంస్కృతిపై లోతైన అవగాహన, దళిత-బహుజన వర్గాల జీవన సత్యాల పట్ల మానవీయ స్పందన ఆయన రచనలకు బలమైన పునాది. కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వలస కార్మికులు, గృహిణులు వంటి సాధారణ ప్రజల జీవితాల ద్వారా కుల-వర్గ అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం, కుటుంబ సంఘర్షణలను ఆయన సజీవంగా చిత్రించారు. ఈ దళిత-బహుజన దృక్పథం ప్రత్యక్ష రాజకీయ ప్రకటనగా కాక, జీవన వాస్తవాల రూపంలో వ్యక్తమవుతుంది.
                      తప్ష కథల సంపుటి (2016; పునర్ముద్రణ 2024) సుమారు పదిహేను కథల ద్వారా తెలంగాణ గ్రామీణ జీవితాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబిస్తుంది. పేదరికం, వలస, సంతానలేమి, మహిళా ఆత్మగౌరవం, వృద్ధుల ఒంటరితనం వంటి అంశాలు ప్రధాన ఇతివృత్తాలు. ప్రాంతీయ భాష, స్థానిక సంభాషణల సహజత్వం, గ్రామీణ సంస్కృతి చిత్రణ ఈ సంపుటికి ప్రత్యేకతను అందించాయి. సామాజిక వాస్తవికత ధోరణిలో వ్యక్తి అనుభవాన్ని సమాజ నిర్మాణంతో అనుసంధానించడం యాదగిరి రచనా వైశిష్ట్యం; అందువల్ల ఈ సంపుటి తెలంగాణ సమాజానికి ఒక సాహిత్య దస్తావేజుగా నిలుస్తుంది.
3. సామాజిక వాస్తవికత:
                 తెలంగాణ గ్రామీణ సమాజంలోని అంతర్గత జీవన స్రవంతిని లోతుగా ప్రతిబింబించిన కథాసంపుటిగా తప్ష కథలు నిలుస్తాయి. సిద్ధెంకి యాదగిరి సామాజిక వాస్తవికతను కేవలం సిద్ధాంతపర దృక్పథంగా కాక, జీవన అనుభవాల సాక్ష్యంగా ఆవిష్కరించారు. వ్యక్తిగత సంఘటనల వెనుక దాగి ఉన్న వర్గ, కుల, లింగ, ఆర్థిక అసమానతలను కథల ద్వారా వెలికి తీయడం ఈ సంపుటి ప్రత్యేకత.
3.1 పేదరికం-ఆర్థిక నిర్మాణం:
                “తేలని లెక్కలు”లో పేదరికం కేవలం ఆదాయ లోటుగా కాక, ఎప్పటికీ తీరని జీవన లోటుగా ప్రతిబింబిస్తుంది. కూలి జీవితం, వర్షాభావం, అప్పుల చక్రం- ఇవి వ్యక్తిని ఆర్థికంగా మాత్రమే కాదు, గౌరవ పరంగా కూడా దెబ్బతీస్తాయి. “సావు”లో మరణం కూడా ఆర్థిక భారంగా మారడం వర్గ అసమానతను స్పష్టం చేస్తుంది. “పంచుకోండ్రి”లో భూమి పంచుకోలు కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి; భూమి గ్రామీణ సమాజంలో గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. “రేపటి సూర్యుడు”లో పేదరికం మధ్య విద్య ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఇక్కడ పేదరికం నిర్మాణాత్మక సమస్యగా ఆవిష్కృతమవుతుంది.
3.2 వలస జీవనం-నగరీకరణ ప్రభావం:
                    ఈ సంపుటిలో వలస ఒక ఆర్థిక చర్య మాత్రమే కాదు; అది మానసిక–సాంస్కృతిక విభజన. “సంధిగ్ధం”లో గ్రామం-నగరం మధ్య నిర్ణయ అస్థిరత యువకుడి అంతర్మథనంగా రూపుదిద్దుకుంటుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరం, భావోద్వేగ బంధం - ఇవన్నీ అతనిలో సంఘర్షణ సృష్టిస్తాయి. “మార్పు”లో వలస అనంతరం విలువల మార్పు, కుటుంబ దూరం, సాంస్కృతిక విభజన స్పష్టమవుతుంది. “అంతర్మధనం”లో వలస ఒక అవకాశంగా కాక, తప్పనిసరి పరిస్థితిగా కనిపిస్తుంది. ఈ కథలు ఆధునికీకరణ ప్రభావాన్ని విమర్శాత్మకంగా పరిశీలిస్తాయి.
3.3 సంతానలేమి-కుటుంబ సంఘర్షణ:
             “విరిగిన కల”లో సంతానలేమి వ్యక్తిగత సమస్యగా కాక, సామాజిక అవమానంగా మారుతుంది. లింగ అసమానత నేపథ్యంలో భార్యపై నింద మోపబడటం పితృస్వామ్య నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. పేదరికం వైద్య సదుపాయాల లేమి ద్వారా సమస్యను మరింత తీవ్రమవుతుంది. “బుద్ది మాట”, “ఎంత కంతే” కథలలో కుటుంబ వ్యవస్థ ఒక రక్షణ కవచంగా కనిపించినప్పటికీ, అదే వ్యవస్థ ఒత్తిడి మూలంగా మారుతుంది. కుటుంబ స్థిరత్వం ఆర్థిక ఆధారాలపై నిలబడుతుందని రచయిత సూచిస్తారు.
3.4 మహిళా జీవితం-ఆత్మగౌరవం:
              ఈ కథలసంపుటిలో మహిళా పాత్రలు మౌన బాధితురాళ్లు కాదు; అంతర్గత దృఢత్వం కలిగిన వ్యక్తులు. “తప్ష”లో మహిళ తన గౌరవాన్ని మౌన ప్రతిఘటన ద్వారా నిలబెట్టుకుంటుంది. “విరిగిన కల”లో ఆమె మౌనం ఓటమి కాదు; స్వాభిమానం. “నాయినమ్మ”లో వృద్ధురాలి జీవితం ఆధునిక కుటుంబ నిర్మాణంలోని మార్పును తెలియజేస్తుంది. “మార్పు”లో వలస నేపథ్యంలో మహిళ ద్వంద్వభారం మోస్తూ కుటుంబాన్ని నిలబెట్టే శక్తిగా నిలుస్తుంది. స్త్రీ స్వరం ప్రత్యక్షంగా వినిపించకపోయినా, కథా నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది.
3.5 కుల-వర్గ నిర్మాణం:
               ఈ కథలలో కులవ్యవస్థ నినాదాల రూపంలో కాక, జీవన వాస్తవాల రూపంలో ప్రతిబింబిస్తుంది. “తప్ష”లో అణగారిన వర్గ స్వాభిమాన స్వరం వినిపిస్తుంది. “తేలని లెక్కలు”లో అప్పు-వడ్డీ వ్యవస్థ వర్గ చక్రాన్ని స్థిరపరుస్తుంది. “సావు”లో మరణంలోనూ వర్గ భేదం కనిపిస్తుంది. “అమరుల యాది”లో వర్గ చైతన్యం రాజకీయ గుర్తింపుతో ముడిపడుతుంది. కుటుంబ స్థాయిలో కూడా “ఎంత కంతే”లో ఆర్థిక అసమానత గౌరవాన్ని నిర్ణయిస్తుంది.
3.6 వృద్ధాప్యం-ఒంటరితనం:
           “నాయినమ్మ”లో వృద్ధురాలి జీవితం గతం-ప్రస్తుత వ్యత్యాసం ద్వారా భావోద్వేగాత్మకంగా చిత్రించబడింది. పిల్లల వలస, అణు కుటుంబ వ్యవస్థ వృద్ధులను ఒంటరిగా మిగులుస్తాయి. “సంధిగ్ధం”లో తల్లిదండ్రుల భయం, “మార్పు”లో వృద్ధుల ప్రాధాన్యం తగ్గిపోవడం, “సావు”లో మరణ గౌరవం కూడా ఆర్థిక స్థితిపై ఆధారపడటం - ఇవన్నీ ఆధునిక కుటుంబ నిర్మాణ మార్పులను సూచిస్తాయి.
3.7 గ్రామీణ సంస్కృతి-భాషా వాస్తవికత:
                   తెలంగాణ మాండలిక భాష ఈ కథలకు జీవం పోస్తుంది. సంభాషణల సహజత్వం, సామెతల వినియోగం, వర్గ ఆధారిత భాషా తేడాలు సామాజిక వాస్తవికతను బలపరుస్తాయి. భాష ఇక్కడ కేవలం శైలీ అంశం కాదు; అది సాంస్కృతిక గుర్తింపు. ఆచారాలు, వృత్తి ఆధారిత జీవనం, కుటుంబ వ్యవస్థ చిత్రణ కథలను వాస్తవికంగా నిలబెడతాయి.
3.8 భావనాత్మక నిర్మాణం:
                 ఈ కథలు బాహ్య సంఘటనల కంటే అంతర్మథనాలకు ప్రాధాన్యం ఇస్తాయి. “విరిగిన కల”, “తేలని లెక్కలు”, “సంధిగ్ధం” వంటి కథల శీర్షికలే చిహ్నాలుగా పనిచేస్తాయి. ముగింపులు కథను అపూర్ణంగా ఉంచే వాస్తవిక రచనా విధానం లో  ఉండి పాఠకుడిని ఆలోచనలో పడేస్తాయి. జీవితం అపూర్ణమనే భావన కథా నిర్మాణంలో ప్రతిఫలిస్తుంది.

4. సిద్ధాంతపర విశ్లేషణ (Theoretical Framework)
                  తప్ష కథల సంపుటిని కేవలం ఇతివృత్తాల స్థాయిలో పరిశీలించడం సరిపోదు; సిద్ధాంతపర దృక్పథంలో విశ్లేషించినప్పుడు దాని అంతర్గత నిర్మాణం, సామాజిక స్పృహ మరింత స్పష్టమవుతుంది. సిద్ధెంకి యాదగిరి కథలు ప్రాంతీయ అనుభవాలను విశ్వవ్యాప్త సాహిత్య చర్చలకు అనుసంధానించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ సంపుటిని ప్రధానంగా మూడు సిద్ధాంత కోణాలలో విశ్లేషించవచ్చు: (1) సామాజిక వాస్తవికత, (2) సబాల్టర్న్ దృక్పథం, (3) స్త్రీవాద సాహిత్య విమర్శ.
4.1 సామాజిక వాస్తవికత (Social Realism): సామాజిక వాస్తవికత సాహిత్యంలో వర్గ అసమానత, పేదరికం, దోపిడీ, శ్రమ జీవితం వంటి అంశాలను కళాత్మకంగా ప్రతిబింబించే ధోరణి. ఇది భావోద్వేగ అతిశయోక్తిని నిరాకరిస్తూ వాస్తవ జీవన నిర్మాణాలను వెలికితీయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది.
                ఈ కథల సంపుటిలో పేదరికం వ్యక్తిగత వైఫల్యం కాదు; అది నిర్మాణాత్మక ఆర్థిక సమస్య. “తేలని లెక్కలు”లో అప్పు- వడ్డీ వ్యవస్థ గ్రామీణ కూలి వర్గాన్ని ఎప్పటికీ బయటపడనీయని దోపిడీ చక్రంగా చిత్రితమవుతుంది. పాత్ర ఎంత కష్టపడినా “లెక్కలు” తేలకపోవడం వ్యవస్థాపిత అసమానతకు చిహ్నం. “సావు”లో మరణం కూడా ఆర్థిక భారంగా మారడం పేదరికం జీవితంలోని ప్రతి దశను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది. వర్గ అసమానత “పంచుకోండ్రి”లో భూమి ఆధారంగా గౌరవ విభజనగా కనిపిస్తుంది. భూమి ఉన్నవాడు ప్రతిష్టను పొందుతాడు; భూమిలేనివాడు శ్రమ జీవిగా మిగులుతాడు. “ఎంత కంతే”లో సంపాదన ఆధారంగా కుటుంబ గౌరవం మారడం వర్గ భావన కుటుంబ నిర్మాణంలోనూ పనిచేస్తుందనే సంకేతం. వలస జీవనం ఈ సంపుటిలో ఆధునిక సంక్షోభంగా ప్రతిబింబిస్తుంది. “సంధిగ్ధం”, “మార్పు”, “అంతర్మధనం” కథలు వలసను ఆర్థిక విముక్తిగా కాక, భావోద్వేగ విభజనగా చూపిస్తాయి. ఆధునికీకరణ వ్యక్తిని గ్రామ మూలాల నుండి దూరం చేసి కుటుంబ నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది; అంతర్మథనాన్ని పెంచుతుంది. ఇది సమకాలీన సామాజిక వాస్తవికత లక్షణాన్ని బలపరుస్తుంది.
4.2 సబాల్టర్న్ దృక్పథం (Subaltern Perspective): సబాల్టర్న్ సిద్ధాంతం ప్రధాన చరిత్రలో వినిపించని అణగారిన వర్గాల స్వరాన్ని వెలికి తీయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ సంపుటిలో ఆ స్వరం ప్రత్యక్ష నినాదంగా కాక, జీవన అనుభవాల రూపంలో వ్యక్తమవుతుంది.
              “తప్ష”లో అణగారిన వర్గానికి చెందిన పాత్ర తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే మౌన పోరాటం కథకు కేంద్రాంశం. ఇక్కడ ప్రతిఘటన బహిరంగ విప్లవం కాదు; అంతర్గత స్వాభిమాన ప్రకటన. ఇది Subaltern agencyకి ఉదాహరణ.“తేలని లెక్కలు”లో కూలి వర్గం అప్పు చక్రంలో చిక్కుకోవడం నిర్మాణాత్మక దోపిడీని తెలియజేస్తుంది. పాత్రకు స్వరం ఉన్నప్పటికీ పరిస్థితి మారకపోవడం Subaltern predicamentని సూచిస్తుంది.“అమరుల యాది”లో ఉద్యమం ద్వారా అణగారిన వర్గాల రాజకీయ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ప్రాంతీయ స్వాభిమాన పోరాటం ఇక్కడ Subaltern political awakeningగా రూపుదిద్దుకుంటుంది. వ్యక్తిగత బాధ సమూహ చైతన్యంగా మారే దశ ఈ కథలో స్పష్టమవుతుంది.
4.3 స్త్రీవాద సాహిత్య దృక్పథం (Feminist Literary Perspective):
                  స్త్రీవాద సాహిత్య విమర్శ సాహిత్యంలో మహిళ స్థితి, పితృస్వామ్య నిర్మాణం, లింగ అసమానతలను విశ్లేషిస్తుంది. తప్ష కథల లో మహిళా పాత్రలు కేవలం బాధితులు కాక, అంతర్గత దృఢత్వం కలిగిన వ్యక్తులుగా చిత్రితమవుతాయి.“విరిగిన కల”లో సంతానలేమి సమస్యలో నింద భార్యపై పడటం పితృస్వామ్య నిర్మాణానికి ఉదాహరణ. అయినప్పటికీ ఆమె మౌనం ఓటమి కాదు; అంతర్గత నిరసన. ఇది మౌన ప్రతిఘటన రూపంలో స్త్రీ స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది.“నాయినమ్మ”లో వృద్ధ మహిళ స్థితి ఆధునిక కుటుంబ నిర్మాణంలోని లింగ అసమానతను తెలియజేస్తుంది. గౌరవప్రదమైన జీవితం గడిపిన ఆమెను సమాజం పక్కకు నెట్టివేయడం వృద్ధ మహిళల అప్రతిష్టను సూచిస్తుంది.“తప్ష”లో మహిళ తన గౌరవాన్ని కాపాడుకునే శక్తిగా నిలుస్తుంది. గ్రామీణ సందర్భంలో స్త్రీ స్వరాన్ని సున్నితంగా ప్రతిపాదించడం ఈ కథ ప్రత్యేకత.
5. కథా శైలి – నిర్మాణ వైశిష్ట్యం:
                 తప్ష కథల సంపుటిలో సిద్ధెంకి యాదగిరి కథా శైలిని ప్రాంతీయ వాస్తవికతతో మేళవించి ప్రత్యేకమైన శిల్పరూపాన్ని సృష్టించారు. పైకి సాధారణ గ్రామీణ కథనాల్లా కనిపించినా, అంతర్గతంగా అవి బలమైన సామాజిక–మానసిక నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కథా ప్రవాహం ఆర్భాట రహితంగా, సహజత్వంతో సాగుతుంది; కానీ ప్రతి కథ అంతర్మథనంతో, సూచనాత్మక నిర్మాణంతో పాఠకుడిని ఆలోచనలో పడేస్తుంది. ఈ శైలిని ప్రధానంగా కథన పద్ధతి మరియు నిర్మాణ రూపం అనే రెండు కోణాలలో పరిశీలించవచ్చు.
5.1 కథన పద్ధతి (Narrative Technique):
             ఈ సంపుటిలో ఎక్కువ కథలు తృతీయ పురుష వర్ణన లో నిర్మితమవుతాయి. ఈ విధానం రచయితకు ఒక దూర దృష్టిని అందిస్తుంది; ఆయన పాత్రలతో ఏకీభవించినప్పటికీ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో జోక్యం చేసుకోరు. ఉదాహరణకు “విరిగిన కల”లో దంపతుల అంతర్మథనం సున్నితంగా ప్రతిబింబించబడుతుంది; రచయిత భావోద్వేగ అతిశయోక్తికి తావివ్వకుండా వాస్తవికతను నిలబెడతారు. అలాగే “తేలని లెక్కలు”లో కథానాయకుడి ఆర్థిక సంక్షోభం నిర్లిప్త శైలిలో చిత్రించబడటం సామాజిక వాస్తవికతను బలపరుస్తుంది. అంతర్ముఖ దృష్టి ఈ కథల ప్రధాన శిల్ప లక్షణం. “అంతర్మధనం”, “సంధిగ్ధం” వంటి కథలలో బాహ్య సంఘటనల కంటే పాత్రల మనోవ్యవహారం, అంతర్గత సంఘర్షణ ప్రధానాంశంగా నిలుస్తుంది. అంతర్ముఖ స్వగత పద్ధతి (internal monologue) ద్వారా పాత్రల భావజాలం పాఠకునికి చేరుతుంది. దీనివల్ల కథలు మానసిక గాఢతను సంతరించుకుంటాయి. సంభాషణలు సహజత్వంతో కూడినవిగా, తెలంగాణ ప్రాంతీయ భాషలో ఉంటాయి. “పంచుకోండ్రి”లో కుటుంబ తగాదాలు, “బుద్ది మాట”లో పెద్దల సలహాలు సంభాషణల ద్వారానే కథా ప్రవాహాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ సంభాషణలలో జీవన వాస్తవికత, వర్గ-సాంస్కృతిక నేపథ్యం ప్రతిఫలిస్తుంది.
5.2 నిర్మాణ రూపం (Structural Design):
                  ఈ సంపుటిలో కథలు సాధారణంగా ఒక కేంద్ర సంఘటన చుట్టూ నిర్మితమవుతాయి. “తేలని లెక్కలు”లో అప్పు, “పంచుకోండ్రి”లో ఆస్తి పంచుకోలు, “సంధిగ్ధం”లో వలస నిర్ణయం వంటి సంఘటనలు కథకు కేంద్రబిందువులుగా మారి, వాటి చుట్టూ పాత్రల జీవితం విస్తరిస్తుంది. చిన్న సంఘటన పెద్ద సామాజిక వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా రూపుదిద్దుకోవడం నిర్మాణ వైశిష్ట్యం.
                 ముగింపులు సాధారణంగా  కథను అపూర్ణంగా ఉంచే వాస్తవిక రచనా విధానం లో  ఉంటాయి. స్పష్ట పరిష్కారం ఇవ్వకుండా కథను ఆలోచనాత్మక స్థాయిలో ముగించడం వాస్తవిక జీవన స్వభావానికి దగ్గరగా ఉంటుంది. పాఠకుడు తానే ఆలోచించాల్సిన స్థితి ఏర్పడుతుంది. శీర్షికలే చిహ్నాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. “విరిగిన కల” అపూర్ణ ఆశలను, “రేపటి సూర్యుడు” ఆశావాద దృక్పథాన్ని, “తప్ష” అంతర్గత తపనను సూచిస్తాయి. శీర్షిక కథా భావానికి సంకేతంగా పనిచేస్తుంది.
6. భాషా వాస్తవికత మరియు ప్రాంతీయత:
               తప్ష కథల సంపుటిలో భాష కేవలం వాక్య నిర్మాణానికి పరిమితమైన సాధనం కాదు; అది సామాజిక వాస్తవికతను నిర్మించే ప్రాథమిక అంశం. సిద్ధెంకి యాదగిరి తెలంగాణ మాండలిక భాషను సహజత్వంతో వినియోగించడం ద్వారా కథలకు జీవం పోశారు. సంభాషణలు ప్రాంతీయ ఉచ్చారణ, స్థానిక పదజాలం, గ్రామీణ భావవ్యక్తీకరణలతో నిండివుంటాయి. ఈ సహజ సంభాషణలు పాత్రల సామాజిక నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.
                సామెతలు, లోకోక్తులు, గ్రామీణ ప్రయోగాలు కథలలో సాంస్కృతిక సజీవతను పెంపొందిస్తాయి. ఇవి కేవలం అలంకారాత్మక ఉపకరణాలు కాకుండా, జీవన అనుభవాల సంక్షిప్త రూపాలు. వర్గ ఆధారిత భాషా తేడాలు కూడా స్పష్టంగా ప్రతిఫలిస్తాయి . భూమి ఉన్నవారి మాటతీరు, కూలి వర్గ సంభాషణ, పెద్దల ఉపదేశ శైలి వంటి భిన్నతలు భాష ద్వారానే వ్యక్తమవుతాయి. దీనివల్ల భాష సామాజిక స్థితిగతుల సూచికగా పనిచేస్తుంది. అత్యంత ముఖ్యంగా, తెలంగాణ మాండలిక వినియోగం ఒక సాంస్కృతిక స్వాభిమాన ప్రకటనగా నిలుస్తుంది. భాష ఇక్కడ శైలీ అంశం మాత్రమే కాదు; అది ప్రాంతీయ గుర్తింపు, సామాజిక చరిత్ర, వర్గ అనుభవాల ప్రతినిధ్యం. ఈ విధంగా భాషా వాస్తవికత కథల విశ్వసనీయతను బలపరుస్తూ, ప్రాంతీయ అనుభవాలను సాహిత్య స్థాయికి తీసుకెళ్తుంది.
7.ముగింపు (Conclusion):
                   తప్ష కథల సంపుటి ఆధునిక తెలంగాణ గ్రామీణ జీవితానికి సాహిత్య–సామాజిక పత్రంగా నిలుస్తుంది. సిద్ధెంకి యాదగిరి ప్రాంతీయ అనుభవాలను విశ్వవ్యాప్త సామాజిక చర్చలతో అనుసంధానించడంలో ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఈ కథలు పేదరికం, వర్గ అసమానత, వలస జీవన సంక్షోభాలను వ్యక్తిగత దురదృష్టంగా కాక, నిర్మాణాత్మక సమస్యలుగా ప్రతిబింబించాయి. అణగారిన వర్గాల జీవితం సానుభూతి అంశంగా కాక, గౌరవం కోసం సాగిన మౌన పోరాటంగా రూపుదిద్దుకుంది. మహిళా పాత్రలు బాధితులుగా మాత్రమే కాక, అంతర్గత దృఢత్వం మరియు స్వాభిమానానికి ప్రతీకలుగా నిలిచాయి. తెలంగాణ ప్రాంతీయ భాష, సంస్కృతి, జీవన విలువలు కథలలో సజీవంగా నిలిచినప్పటికీ, ఆధునికీకరణ ప్రభావంతో సంభవిస్తున్న మార్పులను కూడా రచయిత సున్నితంగా ఆవిష్కరించారు. సరళ కథనం, మానసిక గాఢత, తెరచిన ముగింపులు ఈ సంపుటికి శిల్ప వైశిష్ట్యాన్ని అందించాయి.
                 మొత్తంగా చూస్తే తప్ష కథలు ప్రాంతీయ సాహిత్యాన్ని దాటి గ్లోబల్ సామాజిక వాస్తవికత చర్చలో నిలబడగల సృజనాత్మక శక్తిని కలిగి ఉన్న కృషిగా భావించవచ్చు. ఇది తెలంగాణ గ్రామీణ సమాజానికే కాదు, అణగారిన వర్గాల గౌరవ పోరాటానికి సాహిత్య స్వరూపం.
8. ఉపయుక్త గ్రంథ సూచి(References):
1. కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిక్ ఎంగెల్స్, ది జర్మన్ ఐడియాలజీ (న్యూయార్క్: ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1970).
2. రేమండ్ విలియమ్స్, మార్క్సిజం అండ్ లిటరేచర్ (ఆక్స్‌ఫర్డ్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1977).
3. జార్జ్ లూకాచ్స్, ది మీనింగ్ ఆఫ్ కాంటెంపరరీ రియలిజం (లండన్: మెర్లిన్ ప్రెస్, 1962).
4. రణజిత్ గుహ, సబాల్టర్న్ స్టడీస్ – వాల్యూమ్ 1 (ఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1982).
5. గాయత్రీ చక్రవర్తి స్పివాక్, “కాన్ ది సబాల్టర్న్ స్పీక్?” లో: Marxism and the Interpretation of Culture (ఉర్బానా: యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ప్రెస్, 1988), 271–313.
6. బి.ఆర్. అంబేద్కర్, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ (న్యూ ఢిల్లీ: నవయాన, 2014).
7. ఎలైన్ షోవాల్టర్, “ఫెమినిస్ట్ క్రిటిసిజం ఇన్ ది విల్డర్నెస్,” క్రిటికల్ ఇన్‌క్వైరీ 8, నెం. 2 (1981): 179–205.
8. సిమోన్ దె బోవార్, ది సెకండ్ సెక్స్ (న్యూ యార్క్: విన్టేజ్, 2011).
9. సిద్ధెంకి యాదగిరి, తప్ష కథలు (హైదరాబాద్: తెలంగాణ సాహిత్య ప్రచురణలు, 2016/2024).



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి