IX. 11. వాయసం
ప్రకృతిలో భగవంతుడు పుట్టించిన ప్రాణులన్నీ విలువైనవే. వేటి విలువ వాటికి ఉంటుంది. ప్రాణులన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించాలి. మనం ప్రతి ప్రాణినీ, వాటి ప్రత్యేకతలననుసరించి ఆదరించాలి. ‘కాకి’ కూడా ఒక ప్రాణి. అది నల్లగా ఉంటుంది. కాకి యొక్క విశిష్టతను చెపుతూ, కాకి పట్ల చులకన భావం ఉందనీ, అలా వ్యతిరేకభావం తగదని తెలియపరచడమూ, సృష్టిలోని ప్రతిప్రాణి గొప్పదని తెలపడమూ, ‘కాకి’ ప్రత్యేకతను తెలియజేయడమూ ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి శ్రీ మామిండ్ల రామగౌడు రాసిన ‘రస తరంగిణి’ ఖండకావ్య సంపుటిలోని పద్యాలివి.
కవి పరిచయం
కవి – మామిండ్ల రామగౌడు
జనన-మరణాలు – జననము : 14-01-1943 ; మరణం : 06-06-2003
జన్మస్థలము – ఆధునిక కవుల్లో మామిండ్ల రామగౌడు ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ‘వర్ని’ మండలం ‘రుద్రూరు’ లో జన్మించారు.
తల్లిదండ్రులు – తల్లి ‘బాలమ్మ’, తండ్రి ‘మల్లాగౌడు’ ‘
విద్యాభ్యాసము – ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయింది. తర్వాత వీరు బి.ఓ.ఎల్ పట్టా తీసుకొని, తెలుగు పండితుడిగా పనిచేశారు. తెలుగుభాషపై మక్కువతో 20 ఏళ్ళ వయస్సులోనే రచనలు చేశారు.
రచనలు –
శబరిమాత శతకం
నరసింహ శతకం.
కవి గౌడప్ప శతకం – వంటి భక్తి, నీతి శతకాలు రచించారు.
ఇవే కాక
రసతరంగిణి
కవితాసుధాలహరి
గౌడప్రబోధం – మొదలయిన రచనలు చేశారు.
బిరుదులు – గౌడు గారికి “సుకవిసుధాకర”, “మధురకవి”, “కవికోకిల” వంటి బిరుదులు ఉన్నాయి.
సన్మానాలు – గౌడుగారు పలు సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
ప్రవేశిక
సకల జీవులను మనిషి సమాదరించాలి. సర్వప్రాణుల పట్ల దయకలిగి ఉండాలి కాని మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకొంటున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి ఐనప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతుంది. దాని గురించి ఈ పాఠంలో చదువుకుందాం.
ఉత్పలమాల
|
||||||
భ |
ర |
న |
భ |
భ |
ర |
వ |
U I I |
U I U |
I I I |
U I I |
U I I |
U I U |
I U |
ఉత్పలమాల షట్కాట్ : శా మస (టేన్) 10 ఉత్పలమాల
లక్షణాలు : (వృత్త పద్యం) 1. పద్యంలో 4 పాదాలుంటాయి. 2. ప్రతి
పాదంలో భ, ర, న, భ, భ, ర, ‘లగ’ (వ) అనే
గణాలుంటాయి. 3. 10వ అక్షరం యతి స్థానం. 4. ప్రాస
నియమం ఉంటుంది. 5. పాదంలో 20 అక్షరాలుంటాయి. |
చంపకమాల
|
||||||
న |
జ |
భ |
జ |
జ |
జ |
ర |
I I I |
I U I |
U I I |
I U I |
I U I |
I U I |
U I U |
| ||||||
ఉత్పలమాల షట్కాట్ : శా మస (టేన్) 10 1. చంపకమాల
లక్షణాలు : (వృత్త పద్యం) 2. ఇందులో 4 పాదాలుంటాయి. 3. న, జ, భ, జ, జ, జ, ర అనే
గణాలు (21 అక్షరాలు)
ఉంటాయి. 4. ప్రతి
పాదంలో 11వ అక్షరం
యతి స్థానం. 5. ప్రాసనియమం
ఉంటుంది. |
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) కాకులను చులకనగా చూడడాన్ని బట్టి మానవ స్వభావం ఎట్లాంటిదని భావిస్తున్నారు ?
జవాబు:
మానవుడు విచిత్రమైన వ్యక్తి. తనకు సాయం చేసే పశుపక్ష్యాదులను తేలికగా చూస్తాడు. మానవుడు కృతఘ్నుడు, అనగా చేసిన మేలును మరచిపోతాడు..
మానవుడు ఎక్కువ మంది చుట్టాలున్న వాడిని చూచి, ‘వాడిది కాకి బలగం’ అని హేళనచేస్తాడు. కాని తాను మాత్రం, బంధువుల ఇళ్ళకు వెళ్ళి, వారి ఆదరణ పొందుతాడు.
ఎవరైనా తమ పిల్లలను ముద్దుగా, గారాబంగా చూస్తూ ఉంటే, ‘కాకిపిల్ల కాకికే ముద్దు’ అని వారిని మానవుడు హేళనగా మాట్లాడతాడు. ఎవరైనా తనపిల్లల్ని ఏమైనా అంటే మాత్రం, వారితో తగవులాడుతాడు.
మానవుడు తాను వదరుబోతును మించి, వాదిస్తాడు. కాని తాను ఆ వదరుపోతును, “లొట్టి మీద కాకి లొల్లి” అని హేళన చేస్తాడు.
పిల్లలు అల్లరిచేస్తే కాకి గోల అని చీకాకు పడతాడు.
కాకి తన్ను కావుమని దేవుణ్ణి ప్రార్థిస్తోంటే, మనిషికి ఆ ధ్వని, ముల్లులా గుచ్చుకుంటుంది. కాబట్టి మానవుని మనస్తత్వము విచిత్రమైనది. కృతజ్ఞత లేనిది.
ఆ) రామగౌడు కవితాశైలిని వివరించండి.
జవాబు: రామగౌడు కవితాశైలి:
రామగౌడు మంచి విద్వత్కవి. కాకి వంటి అల్ప జంతువును, తన కవితా ప్రతిభతో, వాదనాబలంతో మహోన్నతంగా, తీర్చిదిద్దాడు. సీస పద్యాలను మంచి రసవంతంగా, మంచి భావనా బలంతో, ప్రకృతి ప్రేమికునిగా, జీవకారుణ్యవాదిగా అద్భుతంగా రచించాడు.
కాకిని సంబోధిస్తూ ధ్వాంక్షము, బలిపుష్టము, వాయసము, మౌకలి, ఆత్మఘోషము వంటి వివిధ పర్యాయపదాలను అర్థవంతంగా ప్రయోగించడం, గొడుగారి పాండిత్యానికి ప్రబల నిదర్శనం.
కాకి అరచే ‘కాక కాక’ ధ్వనిలో, కవిగారికి అన్న కొడుకు పినతండ్రిని పిలిచే ఆత్మీయత కనిపించింది. మనిషిలో కలుపుగోలుతనం లేనందువల్లే, కాకిని చీదరించుకొంటున్నాడని కవిగారి భావన బాగుంది. నలుపున్న అందరినీ మెచ్చుకొని, కాకి నలుపును మాత్రం కాదనడం బాగోలేదని, కవి చక్కగా సమర్థించారు.
కాకిని నిందిస్తూ లోకంలో వాడే పదబంధాలలో ఉండే దోషాన్ని చక్కగా కవిగారు వెల్లడించారు.
కాకి, చుట్టాల కబురును తెచ్చే ప్రాణసఖుడని, దాన్ని గౌరవించారు. కోయిల ఎప్పుడో సంవత్సరంలో వసంత ఋతువులోనే కూస్తుంది. కాకి నిత్యం వచ్చి మనలను పలకరిస్తుంది. కోకిలను మెచ్చుకొని, కాకిని చులకనగా చూడడం తప్పని, కవిగారు తన ప్రతిభా సంపత్తితో మానవులను హెచ్చరించారు.
రామగౌడు గారు ప్రతిభా సంపన్నులైన ఉత్తమ కవిచక్రవర్తి.
ఇ) కాకి, కోకిల రెండూ నల్లనివే! అయితే ఒకదానిని ఆదరించి, ఇంకొకదాన్ని చులకనగా చూడడం గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు: కాకి, కోకిల -అభిప్రాయం
కాకి నలుపు. కోకిల నలుపు. ఈ రెంటికీ భేదము లేదు. కాని వసంత కాలం రాగానే, మామిడి చిగుర్లను తిన్న కోకిల, తియ్యగా కమ్మగా కూస్తుంది. కాని కాకి గొంతు బొంగురుగా, కర్ణకఠోరంగా ఉంటుంది. అందువల్లే కోకిలను ప్రజలు ఆదరిస్తారు. కాకిని చులకనగా చూస్తారు.
మరో కవి కోయిలకూ, కాకికీ తేడా ఇలా చెప్పాడు. “కాకి మనలను ఏమీ తిట్టలేదు. కోయిల ధనాన్ని పుచ్చుకోండి అని మనల్ని పిలువలేదు. మరి ఎందుకు కోయిలను ప్రేమిస్తున్నారంటే, దాని మధుర స్వరం వల్లనే కోయిలను జనం ఆదరిస్తున్నారు. దాని పరుష స్వరం వల్లనే కాకిని, విరోధభావంతో చూస్తున్నారు.
నిజానికి కోకిలకు తన గుడ్లను పిల్లలుగా చేసే శక్తి ఉండదు. కోయిల తన గ్రుడ్లను కాకి గూట్లో పెడుతుంది. కాకులు, అవి తన గ్రుడ్లే అనుకొని, వాటిని పొదిగి పిల్లలుగా తయారుచేస్తాయి. కోయిల పిల్ల గొంతెత్తగానే, వాటిని గుర్తించి “వాటిని గూటి నుండి కాకులు తరిమివేస్తాయి.
దీనినిబట్టి కోయిలకు ఆదరం కేవలం దానిగొంతు వల్లనే వచ్చింది. కాకిని దాని పురుషస్వరం వల్లనే, లోకం దాన్ని అనాదరంగా చూస్తోంది. నిజానికి కాకి మలిన పదార్థాలను మన ఇంటి నుండి దూరంగా తీసుకుపోయి, మనకు ఎంతో ఉపకారం చేస్తోంది.
ఈ) కాకులు సమైక్యంగా ఉంటాయి. దీనిపై మీ అభిప్రాయం సకారణంగా రాయండి.
జవాబు:కాకులు సమైక్యంగా ఉంటాయి -అభిప్రాయం
సాధారణంగా మానవులకంటే మూగజీవాల్లోనే సమైక్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాకుల్లో అది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఆహారం ఒక కాకికి కనిపిస్తే అన్ని కాకులను సమాయత్తం చేస్తుంది. అందరిని తీసుకొని వెళ్తుంది. ఉన్న ఆహారాన్ని అన్నీ కలిసి తింటాయి.
అంతేకాదు ఒక కాకికి ఆపదజరిగితే అన్ని కాకులు సానుభూతి తెలుపుతాయి. పడిపోయిన కాకిని సమీపించేవారిని కాళ్ళతో పొడుస్తాయి. కాకులకు ముందుచూపు ఎక్కువ. అందుకనే కాకులన్నీ ఐక్యంగా ఆహారాన్ని ముందుగానే జాగ్రత్త పరచుకుంటాయి. ఆహారాన్ని పరస్పరం అందిపుచ్చుకుంటాయి. విహారానికి కూడా కాకులు ఒక్కటిగా కలిసి వెళతాయి. శత్రువులపై ఒక్కటిగా దాడి చేస్తాయి. అందువల్ల కాకులు సమైక్యంగా ఉంటాయని పేర్కొనవచ్చు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) కాకి విశిష్టతను సొంతమాటల్లో రాయండి.
జవాబు: కాకి విశిష్టత
కాకి మానవులకు మంచి ఉపకారం చేసే పక్షి. కాకులు జనావాసాల నుండి చెత్తాచెదారాన్నీ, మలిన పదార్థాలనూ దూరంగా తీసుకుపోతాయి. ఆ విధంగా కాకులు మన పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడుతున్నాయి.
మనం కాకిని చీదరించుకుంటాం అయినా అది నొచ్చుకోదు. అన్న కొడుకు తన పినతండ్రిని, ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి ‘కాక’ అని అరుస్తుంది. అది తెలియక కలుపుగోలుతనం లేని మనం, కాకిని చీదరించుకుంటాము.
నిజానికి పాపాత్ముడి మనస్సులో పేరుకుపోయిన నలుపు కంటె, కాకి నలుపు కలుషితమైనది కాదు. శ్రీకృష్ణుడు నలుపు. ఈశ్వరుని కంఠం నలుపు. చంద్రుడి ముఖంలో మచ్చ నలుపు. మనుష్యుల తలలు నలుపు. అటువంటప్పుడు, కాకి నలుపును అసహ్యించుకోడం అనవసరం. అది తప్పు.
కాకి మన ఇళ్ళమీద వాలి, మన క్షేమ సమాచారాన్ని అడుగుతుంది. మనం చీదరించుకున్నా, కాకి మన ప్రాణ స్నేహితుడిలా వచ్చిపోవడం మానదు కాకిని మనం చీదరించి కొట్టినా, కాకి ఏ మాత్రం విసుక్కోదు. రాయబారివలె చుట్టాలు మన ఇంటికి వస్తున్నారన్న వార్తను తెస్తున్నట్లుగా గొంతు చింపుకొని తన నోరు నొప్పిపెట్టేటట్లు అరుస్తుంది.
ఎప్పుడో ఏడాదికొకసారి వచ్చి కూసే కోయిలను మనం మెచ్చుకుంటాం. అదే రోజూ వచ్చి మనలను పలుకరించే కాకిని మనం చులకనగా చూస్తాం. కాని కాకి నిజానికి మనకు ప్రాణస్నేహితుడిలాంటిది.
3. కింది ప్రశ్నకు సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
అ) మనుషులు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న కాకి మనుషుల గురించి తాను ఏమనుకుంటుందో ఊహించి కాకి స్వగతం రాయండి.
జవాబు:
కాకి అంతరంగం
ఈ మనుషులు శుద్ధ అమాయకులు. పరిశుభ్రత లేనివాళ్ళు. తాము తినగా మిగిలిన ఎంగిలి మెతుకులను పెరటిలో, వీధుల్లో వీరు పారపోస్తారు. లేదా పెంటకుప్పలపైనా, తమ ఇళ్ళల్లోనూ కుళ్ళిపోయిన, చెడిపోయిన పదార్థాలను వీళ్ళు పారవేస్తారు. అవి అలా కుళ్ళి దుర్వాసన పెరిగితే అంటురోగాలు వస్తాయని పాపం వీళ్ళకు తెలియదు కాబోలు.
ఇప్పటికే ఈ మనుషులు నానా రోగాలతో బాధపడుతున్నారు. అందుకే ఈ మనుష్యులకు శుభ్రత గురించి నేర్పుదామని వీళ్ళు పారవేసిన ఎంగిలి మెతుకులను, చెత్తా చెదారాన్ని వీరి ఇళ్ళ నుండి తీసికెళ్ళి దూరంగా నేను పారవేస్తున్నా. నేను వీళ్ళకు ఎంతో మేలు చేస్తున్నా. అయినా వీళ్ళు కృతజ్ఞత లేనివాళ్ళు. నన్ను ‘హాష్ కాకీ’ అంటూ దూరంగా తరుముతారు.
నేను మనుషులకు ప్రాణస్నేహితుడిని. వాళ్ళ ఆరోగ్యాల గురించి, నేను. అందుకే శ్రద్ధ తీసికొంటున్నా. కాని ఈ మనుష్యులు నన్ను చీదరించుకుంటూ, కర్రతో కొడతారు. నాపై బెడ్డలు విసరుతారు. బహుశా ఈ మనుషులు, నాకు వాళ్ళ ఎంగిలి మెతుకులు పెట్టి పోషిస్తున్నాం అనుకుంటున్నారేమో! నాకు వీళ్ళ మెతుకులే అక్కర్లేదు.
అడవులలో, దొడ్లలో ఎన్నో చెట్ల కాయలు, పళ్ళు ఉన్నాయి. నిజానికి అవి ఎంగిలివి కావు. నాకు బోళ్ళంత ఆహారం ఉంది. వీళ్ళు నన్ను కాకిగోల అని, కాకిబలగం అని, కాకిచూపు అని ఆక్షేపిస్తారు. ఈ మనుషులు చేసే గోల, నా గోల కంటే పెద్దది. మోటారు సైకిళ్ళ చప్పుళ్ళు, ఫ్యాక్టరీల కూతలు, రికార్డుల మోతలు ఎంతో శబ్ద కాలుష్యం. ఈ మనుషులు వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు.
నాకు ఈ మనుషులపై జాలి, దయ. అందుకే వీరి ఇళ్ళల్లో నేను మోడీ పిలుపు రాని క్రితమే, స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నా. నా మంచితనం వీళ్లకి ఎప్పుడు అర్థం అవుతుందో?
(లేదా)
ఆ) తన గురించి చులకనగా మాట్లాడడం తగదని కాకి మనుషులతో మాట్లాడింది. దీన్ని ఊహించి సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
కాకి – మనిషి సంభాషణ
మనిషి : ఛీ! కాకీ! నీకు బుద్ధి లేదా! పొమ్మంటే పోవేం! సిగ్గుండాలి. ఒకసారి చెపితే వినాలి. ఇంత సిగ్గులేకుండా ఎలా పుట్టావ్ ?
కాకి : మానవా! నీవు నన్ను తరమడం మానవా? నేను నీకు ఉపకారం చేద్దామనే రోజూ వస్తూ ఉన్నా. కాని నీవు కృతఘ్నుడివి. నీవు పారవేసిన మెతుకులు, పదార్థాలూ కుళ్ళిపోతే మీ మనుషులకు అంటురోగాలు వస్తాయని, జాలిపడి వాటిని ఏరి దూరంగా పడవేద్దామని నేను మీ ఇళ్ళకు వస్తున్నా. నీకు ఎందుకు అర్థం కాదు?
మనిషి : చాలులే. కాకీ! నీది దొంగ బుద్ధి. ఎంగిలి మెతుకులు తినడం మాని, ఇంట్లోకి వచ్చి మేము ఎండబెట్టుకున్న పప్పులు వగైరా పట్టుకుపోతావు. నీకు కారం వేయదేమో! మిరపకాయలు పట్టుకుపోతావు. మా చెట్లకాయలు -కొరికి పారవేస్తావు. నీవు మా ఆరవేసిన బట్టలపై రెట్టలు వేస్తావు. ఏవేవో తెచ్చి మా పెరట్లో పారవేస్తావు. మాంసం ముక్కలు, కోడి వెండ్రుకలు తెచ్చి పడవేస్తావు. నీవు చేసే శుభ్రం నాకు తెలియనిది కాదు.
కాకి : ఏం మనిషివయ్యా! నేను ఎక్కడనుండో ఏవో పనికి రాని పదార్థాలు తీసుకువెడుతుండగా మీ పెరట్లో మీరు పారవేసిన కుళ్ళు మెతుకులు నాకు కనబడతాయి. వాటిని కూడా దూరంగా పారవేద్దామని, మీ పెరట్లో దిగుతా. ఇంతలో నన్ను నీవు బెదరిస్తావు. నానోట్లో వస్తువులు మీ దొడ్లో జారిపడతాయి. దానికి కారణం నువ్వే ! తప్పు నా మీద దొర్లిస్తున్నావు!
మనిషి : నిన్న మా ఇంట్లో కొబ్బరిచిప్పలు తీసుకుపోయావు. మా తమ్ముడిని నీ ముక్కుతో పొడిచావు. మా దొడ్లో పళ్ళను కొరికి పారవేస్తున్నావు? నీవు ఇంక మా ఇంటికి రాకు.
కాకి : నేను మీ ఇంటికి రాకపోతే, నీకే నష్టం. నేను జీతం, నాతం లేకుండా నీ పెరట్లో, పరిసరాల్లో శుభ్రం చేసి, నీకు, ఉపకారం చేస్తున్నా. కృతజ్ఞతగా ఉండు. మనిషివి అనిపించుకో. కొంచెం దయగా ఉండు.
మనిషి : నిజమే కాకీ! నీవు చెప్పినది నాకు అర్థం అయ్యింది. రేపటి నుండి మనం స్నేహితులుగా ఉందాం. కోపం తెచ్చుకోకు.
III. భాషాంశాలు
పదజాలం
1. పాఠం ఆధారంగా కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) కాకి : ధ్వాంక్షము, బలిపుష్టము, వాయసము, మౌకలి, ఆత్మఘోషము, కరటము, చిరజీవి
ఆ) గృహం : ఇల్లు, కొంప, గీము, గేహము, భవనము
ఇ) సంతోషం హర్షము: సంతసము, ముదము, ప్రమోదము
ఈ) ముల్లు : కంటకము, ములికి , ములు
2. కింది వ్యుత్పత్తులకు సరైన పదాలు పాఠం ఆధారంగా గుర్తించండి.
అ) బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడేది. = బలిపుష్టము
ఆ) మాంసాన్ని కాంక్షించేది. =ధ్వాంక్షము
3. కింది వాక్యాల్లో ప్రకృతి, వికృతి పదాలు వేరువేరుగా ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.
అ) సిరి గలవారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటే అదే సంతసం.
జవాబు:
సిరి గలవారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటే అదే సంతసం.
ఆ) విజయం సాధించిన ఆనందం ఆ పక్కి మొగంలో కనిపించింది.
జవాబు:
విజయం సాధించిన ఆనందం ఆ పక్కి మొగంలో కనిపించింది.
ఇ) పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది.
జవాబు:
పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది.
ఈ) శ్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.
జవాబు:
శ్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.
ప్రకృతి – వికృతి
శ్రీ – సిరి
గృహం – గీము
పక్షి – పక్కి
ముఖం – మొగం
సంతోషం – సంతసం
4. కింది ఇచ్చిన జాతీయాలు, సామెతలను గుర్తించి, వాటిని వినియోగించే సందర్భాన్ని రాయండి.
కాకి బలగం
బాగా ఎక్కువ మంది బంధుజనం ఉన్నారనే సందర్భంలో పరిహాసం చేస్తూ దీన్ని వినియోగిస్తారు.
కాకిపిల్ల కాకికి ముద్దు : ప్రతి వారికీ తమ పిల్లలు ముద్దుగా కనిపిస్తారనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.
కాకిగోల :ఎక్కువగా వాగుతున్నప్పుడు, పెద్దగా మాట్లాడుతున్నపుడు దీన్ని వినియోగిస్తారు.
లొట్టిమీద కాకి లొల్లి : కల్లుకుండ మీద వ్రాలిన కాకి బాగా అరుస్తుంది. అలా తిండిపదార్థాల పక్కన చేరి, ఆ పదార్థం లభించనప్పుడు దాని కోసం చేసే అల్లరి అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.
మసిపూసి మారేడుకాయ చేయడం : మోసం చేసి ఒక వస్తువును మరొక వస్తువుగా నమ్మించడం అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.
వ్యాకరణాంశాలు
1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.
సవర్ణదీర్ఘ సంధి :
విషాగ్ని = విష + అగ్ని = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు, అవియే అచ్చులు పరమైన సవర్ణదీర్ఘములు ఏకాదేశంబగు.
ఉకారసంధి :
జవాబు:
దినములెన్ని = దినములు + ఎన్ని = ఉత్వసంధి
పాయసమొల్లక = పాయసము + ఒల్లక = ఉత్వసంధి
బోనమబ్బు = బోనము + అబ్బు = ఉత్వసంధి
గంతులిడును = గంతులు + ఇడును = ఉత్వసంధి
లిబ్బులబ్బగ = లిబ్బులు + అబ్బగ = ఉత్వసంధి
జల్లులిడడె = జల్లులు + ఇడడె = ఉత్వసంధి
ములుకులగును = ములుకులు + అగును = ఉత్వసంధి
తగవులాడు = తగవులు + ఆడు = ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి. సూత్రాలు రాయండి.
అ) దినములెన్ని= దినములు + ఎన్ని = ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఆ) తొడఁగొట్టి=తొడన్ + కొట్టి = ద్రుత ప్రకృతిక సంధి (లేక) సరళాదేశ సంధి
సూత్రము 1 : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఉదా : తొడన్ + గొట్టి
సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు.
ఉదా : తొడఁగొట్టి
ఇ) లొల్లియనుచు= లొల్లి + అనుచు = యడాగమ సంధి
సూత్రము : సంధిలేనిచోట అచ్చుకంటే పరమైన అచ్చునకు, యడాగమంబగు.
ఉదా : లొల్లి + య్ + అంచు = లొల్లియంచు
3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.
అ) ఎంగిలిమెతుకులు :: ఎంగిలియైన మెతుకులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) కాకిబలగం : కాకి యొక్క బలగం – షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) విషాగ్ని : విషము అనెడి అగ్ని – రూపక సమాసం
యమకాలంకారము :
కింది పద్య పాదాలలో ఒకే రకంగా ఉన్న మాటలు (పదాలు) గుర్తించి, రాయండి.
అ) లేమా ! దనుజుల గెలువగ
లేమా! నీవేల కడగి లేచితివిటురా.
లేమా లేమా
ఆ) పాఱజూచిన పరసేన పాఱఁజూచు.
జవాబు:
పాఱజూచు
పాఱజూచి
గమనిక : పై ఉదాహరణలలో మీరు రాసిన సమాధానాలు ద్వారా, మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉంటారు. ఒకే శబ్దంతో కూడిన పదాలు రెండుసార్లు వచ్చాయి కదా !
ఇటువంటి పదాలు ఒకే శబ్దంతో ఉన్నా, అర్థంలో తేడా ఉంటుంది. ఒక పదం వచ్చిన తరువాత మరలా అదేపదం రావడం గమనించారు కదా !
పై ఉదాహరణలో ‘లేమా’ అనే పదం రెండుసార్లు వచ్చింది.
మొదటి పాదంలో ‘లేమా’ అనే దాన్ని ‘స్త్రీ’ అనే అర్థంలో, రెండవ ‘లేమా’ అనే పదాన్ని ‘చాలమా’ (గెలువజాలమా) అనే అర్థంలోనూ ప్రయోగించడం జరిగింది.
అదే విధంగా “పాఱజూచు” పదం కూడా రెండు అర్థాల్లో ప్రయోగించబడింది. మొదటిదానికి “తేరిపారచూడటం” అని, రెండవదానికి ‘పారిపోవ చూస్తుంది’ అని అర్థం.
`ఇటువంటి పదప్రయోగం జరిగినట్లయితే, ‘యమకము’ అనే శబ్దాలంకారం అవుతుంది.
యమకం లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షణం : పదాలు తిరిగి తిరిగి వస్తూ, అర్థభేదం కలిగి ఉంటే, అది “యమకాలంకారం”. పదాల విరుపువల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత.
ఇ) మీ పాఠ్యభాగం ‘ధర్మపాలన’లో ‘యమకాలంకార’ పాదాలను గుర్తించి రాయండి. సమన్వయించండి.
జవాబు:
వేయునేటికి నలపాండవేయుసాటి
వింటికొరిగిన రిపురాజి వింటికొరగు
కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు
ఏలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె
యేలవలె నన్యులన, నా నృపాలుడలరు – మొదలైనవి.
4. కింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, లక్షణాలతో సమన్వయం చేయండి.
‘ఆ పురమేలు ‘మేలుబళి’ ! యంచు బ్రజల్ జయవెట్టుచుండ నా”
గమనిక :
పై పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల” పద్యపాదం.
యతిస్థానము 10వ అక్షరము. (ఆ – యం)
ప్రాసాక్షరము ‘ప’
ఈ పాదంలో 20 అక్షరాలున్నాయి.
ప్రాజెక్టు పని
అ) పక్షులకు సంబంధించిన కథ/గేయం/ కవిత సేకరించి రాయండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
చిలకమ్మ పెండ్లి (పాట)
చిలకమ్మ పెండ్లి అని – చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి – చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు – సందడి చేయగ
కాకుల మూకలు – బాకాలూద
కప్పలు బెకబెక – డప్పులు కొట్టగ
కొక్కొరో కోయని – కోడి కూయగా
ఝమ్మని తుమ్మెద – తంబుర మీటగ
కుహు కుహూయని – కోయిల పాడగా
పిల్ల తెమ్మెరలు – వేణువూదగా
నెమలి సొగసుగా – నాట్యం చేయగా
సాలీడిచ్చిన – చాపు కట్టుకొని
పెండ్లి కుమారుడు – బింకము చూపగ
మల్లీ మాలతి – మాధవీ లతలు
మైనా గోరింక – పెండ్లి కుమారుని
దీవిస్తూ తమ పూలు రాల్చగ
పెండ్లి కుమారుని = మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత – చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టే – చింతాకు పుస్తె..
– గిడుగు వేంకట సీతాపతి గారి రచన
(లేదా)
ఆ) పక్షుల గూళ్ళను పరిశీలించి వాటి గొప్పతనాన్ని గురించి, నివేదిక రాయండి.
జవాబు:
చిత్రగ్రీవుడు
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.
చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలను ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.
పావురాలు అప్పుడు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి.
హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.
వ్యుత్పత్త్యర్ధములు :
1) ధ్వాంక్షము = మాంసమును కాంక్షించేది
2) బలిపుష్టము = బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది (కాకి)
3) వాయసము = తిరుగుచుండునది (కాకి)
4) మౌకలి = ‘మూకలుడు’ అంటే యముడు మూకలునికి సంబంధించినది (కాకి)
5) ఆత్మఘోషము = కాకా అని తన పేరునే అరచేది (కాకి)
6) చిరజీవి = చిరకాలము జీవించేది (కాకి)
7) కరటము = ‘క’ అని పలికేది (కాకి)
2వ పద్యం
సీ॥ అందచందమ్ము లేదంచల నడగాదు
చిలుకల వలె గుల్కి పలుకఁ బోదు
పేదరికపుఁబుల్గు భేదభావము లేక
గడబిడతో భలే గంతులిడును
కొమ్మల మాటునఁ గులుకుచుఁ గమ్మని
రాగాలు దీయ స్వరాలు లేవు
లోకాన దీనులలోఁ గల శోకాలు
కన్నీటి గాథ లేకరువు పెట్టు
ఆ॥ వన్న కొడుకుఁ బిలుచువట్టులఁ బెరిమతో
‘కాక-కాక’ యంచుఁగేక వేయు,
కలుపుగోలు తనము తెలియనట్టి మనము
చీదరించుకొనినఁ జిన్నబోదు.
ప్రతిపదార్థం:
అందచందమ్ము = (కాకి) అందము, చందము
లేదు = కలది కాదు;
అంచల = హంసల
నడ = నడక వంటి అందమైన నడక
కాదు = కాదు
చిలుకలవలెన్ = చిలుకలవలె
కుల్కి = విలాసముగా కుదిలి
పలుకబ్రోదు (పలుకన్+పోదు) = మాట్లాడలేదు.
పేదరికపుఁబుల్గు (పేదరికము+పుల్గు) = చిన్నచూపు చూడబడే పక్షి అయినా
భేదభావము లేక = ఎల్లాంటి భేదభావమూ లేకుండా
గడబిడతోన = అల్లరితో (తొందరగా)
భలే = చక్కగా
గంతులిడును (గంతులు + ఇడును) = గంతులు వేస్తుంది
కొమ్మల మాటునన్ = కొమ్మల మఱుగున
కులుకుచున్ = కులుకుతూ
కమ్మని రాగాలు = కమ్మనిసంగీత రాగాలు
తీయస్వరాలు = తీయని ధ్వనులు
లేవు = లేవు (తీయగా కమ్మగా కోయిల వలె పాడలేదు)
లోకానన్ = లోకంలోని (ప్రపంచంలోని)
దీనులలోఁగల (దీనులన్ + కల) = దుఃఖితులలో కల
శోకాలు = ఏడ్పులు
కన్నీటి గాధలు = కన్నీరు తెప్పించే కథలు
ఏకరువు పెట్టున్ = వల్లె వేస్తుంది (దీనుల బాధలను చెపుతోందా అన్నట్లు బాధాకరంగా అరుస్తుంది)
అన్నకొడుకు = అన్నగారి కొడుకు తన పినతండ్రిని
పిలుచునట్టు = పిలుస్తున్నాడా అన్నట్లు
పెరిమతోన్ = ప్రేమతో
కాక- కాక యంచున్ = ‘కాక, కాక అంటూ
కేకవేయున్ = కేకలు వేస్తుంది
కలుపుగోలుతనము = అందరితో కలిసిమెలసి యుండడం
తెలియనట్టి = తెలియనటువంటి
మనము = మనము
చీదరించుకొనిన = కోపగించుకున్నా (చికాకుగా చూసినా)
చిన్నబోదు = (తాను) చిన్న పుచ్చుకోదు (బాధపడదు)
భావం :
కాకి గొప్ప అందచందాలు కలది కాదు. దాని నడక హంస నడకవలె అందంగా ఉండదు. అది చిలుకల వలె అందంగా పలుకలేదు. తక్కువగా చూడబడే పక్షి అయినా, ఎలాంటి భేదభావాలు చూపించకుండా గడబిడ చేస్తూ అందరి ఇళ్ళమీదా గంతులు వేస్తుంది.
కాకికి కొమ్మల చాటున దాగి, కులుకుతూ కోకిలవలె కమ్మగా తీయగా పాడే స్వరం లేదు. లోకంలోని దీనుల దుఃఖాలనూ, బాధలనూ తాను ఏకరువు పెడుతున్నట్లుగా, బొంగురుగా అరుస్తుంది. అన్నకొడుకు తన పినతండ్రిని ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి అరిచినా, కలుపుకుపోయే మనస్తత్వం లేని మనం, ఆ కాకిని చీదరించుకుంటాము. అయినా కాకి నొచ్చుకోదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి