సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

3, డిసెంబర్ 2023, ఆదివారం

VIII. 5. శతక సుధ

పాఠం ఉద్దేశం:

శతకపద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

ప్రక్రియ శతకం:

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ ఒకటి. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. ‘కొన్ని శతకాల్లో నూరుకుపైగా పద్యాలు ఉంటాయి ‘మకుటం’ ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా కూడా పద్యాలు ఉంటాయి. పద్యాన్నీ స్వయం ప్రతి పత్తిని కల్గి ఉంటాయి. నీతి, ధర్మం, సత్యం, అహింస, దేశభక్తి మొదలైన విషయాలను శతక పద్యాలు బోధిస్తాయి.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గి ఉంటుంది.

ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.



కవి పరిచయాలు:

1. కవి పేరు : బమ్మెర పోతన
రచించిన శతకం : నారాయణ శతకం
కాలము : 15వ శతాబ్దం
జన్మస్థలం : వరంగల్లు జిల్లా బమ్మెర వాసి
బిరుదు : సహజ పండితుడు
ఇతర రచనలు : ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం.
శైలి : మధురమైన శైలి. శబ్దాలంకార ప్రియత్వం.

2. కవి పేరు : శ్రీపతి భాస్కర కవి
రచించిన శతకం : చిత్త శతకం
కాలము : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఇతడు చాళుక్య యుగంలో వీరశైవమతాన్ని ఆచరించి, ప్రచారం చేసిన శ్రీపతి పండితుడి వంశీయుడని పరిశోధకుల భావన.

3. కవి పేరు : మారద వెంకయ్య
రచించిన శతకం : భాస్కర శతకం
కాలము : 17వ శతాబ్దం
విశేషాంశాలు : మారవి (మారద వెంకయ్య) ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.

4. కవి పేరు : కంచర్ల గోపన్న
రచించిన శతకం: దాశరథి శతకం
కాలము : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
ఇతర రచనలు : భద్రాచలం రామునిపై చక్కని కీర్తనలు రచించాడు.
విశేషాంశాలు : గోపన్న ‘రామదాసు’ గా కీర్తి పొందాడు ‘దాశరథీ కరుణాపయోనిధీ !’ అనే మకుటంతో పద్యాలు రాశాడు.


5. కవి పేరు : కాకుత్థ్సం శేషప్పకవి
రచించిన శతకం : నరసింహ శతకం
కాలము : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా ధర్మపురి
ఇతర రచనలు : నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీ రామాయణం మొదలైనవి
విశేషాంశాలు : “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు.

6. కవి పేరు : పండిత రామసింహకవి
రచించిన శతకం : విశ్వకర్మ శతకం
కాలము : 1855 – 1963
జన్మస్థలం : జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం.
ఇతర రచనలు : దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.
విశేషాంశాలు : ఈయన ఆశుకవిగా కీర్తి పొందాడు. ‘విశ్వపాలన ధర్మ ! శ్రీ విశ్వకర్మ !’ అనే మకుటంతో శతకాన్ని రచించాడు.

7. కవి పేరు : మరింగంటి పురుషోత్తమాచార్యులు
రచించిన శతకం : శ్రీ వేంకటేశ్వర శతకం
కాలము : 11.4. 1936 – 9.1.2011
జన్మస్థలం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం
ఇతర రచనలు : గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలైనవి.
విశేషాంశాలు : విద్వత్ కవి. ఈయన ‘వేంకటేశ్వరా !’ అనే మకుటంతో పద్యాలు రచించాడు.

8. కవి పేరు : వేంకటరావు పంతులు
రచించిన శతకం : శ్రీ బాకవరాంజనేయ శతకం
కాలము : 03.02.1937 – 26.08.1994
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి
ఇతర రచనలు : యక్షగానాలు, కీర్తనలు, గేయాలు
విశేషాంశాలు : తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ ! ఖలభంజన ! సాధుజనానురంజనా !” అనే మకుటంతో పద్యాలను రాశాడు.


ప్రవేశిక:

విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాల నుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.

అ) అందంగా ఉండాలంటే ఇది అవసరం
జవాబు. అన్నం

ఆ) పరువు అంటే అర్థం
జవాబు.గౌరవం

ఇ) సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది 
జవాబు. ఎ) అన్నం

ఈ) జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం
జవాబు.డి) సోయగం

ఉ) ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినద
జవాబు.ఎ) పరువు

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు ?
జవాబు.
అబద్ధం మనిషి హీనతకు నిదర్శనం. మన సంస్కృతిలో రాముడూ, హరిశ్చంద్రుడూ, గాంధీజీ, బలీ వంటి మహనీయులు సత్యవాక్య పాలకులుగా ఖ్యాతి గాంచారు. నీచమైన అశాశ్వతమైన సుఖాల కోసం, సంపదల కోసం అబద్ధం ఆడి మన వ్యక్తిత్వాన్ని, మన ఘనచరిత్రనూ మాపుకోవడం అవివేకం అని కవి భావించాడు.

ఆ) వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?
జవాబు.
వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలు :

దానధర్మాలు విరివిగా చేయడం,
అబద్ధాలు ఆడకుండడం,
గౌరవాన్ని కాపాడడం,
అందరితో స్నేహభావంతో మెలగడం.
ఇ) పెంపునదల్లివై ….. అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?
జవాబు.
పెంపున తల్లివై పద్య అంతరార్థం : ఈ సృష్టిలో అందరికీ భగవంతుడే తల్లీ, తండ్రీ, వైద్యుడూ. అతడే తన భక్తులకు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కనుక మానవ రూపంలో ఉన్న భగవంతుని గుర్తించాలి. అందరినీ గౌరవించి, ఆదరించాలి. భగవంతుని చిత్తశుద్ధితో ఆరాధించాలి.

ఈ) “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
కోరికలు అనంతం. అవి గుర్రాలలాంటివి. మనం ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటి గురించే ఆలోచిస్తుంటే వాటికై పరిగెత్తుతుంటే బతుకు ఉక్కిరి బిక్కిరి అయి, నరకంలా తయారు అవుతుంది. కనుక కోరికలను అదుపు చెయ్యాలి. ఆ కోరికలను అదుపుచేసే విశిష్టమార్గం సంతృప్తి. భక్తీ, త్యాగం, దానం ఇవి అన్నీ విశిష్టమార్గాలు. ఇవి మనను ప్రశాంతంగా ఉంచుతాయి.


2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) శతకకవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జవాబు.
శతకపద్యాలు రాయడానికి నాకు తోచిన కారణాలు :

శతకకవులు సమాజానికి హితం చెప్పదలచారు.
శతకకవులు ప్రపంచాన్ని, మానవ జీవనాన్ని బాగా అధ్యయనం చేశారు.
వారికి కొంత వైరాగ్యం కలిగింది.
తమకు కలిగిన భావాలను కవితాత్మకంగా ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారు.
ఈ జగత్తులో మంచి నడవడి, సత్యం, దానం, ధర్మం, భక్తి వంటివి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతాయనీ, మానవుని శాశ్వతుణ్ణి చేస్తాయనీ వారు గ్రహించారు.
అసత్యమూ, నీచమైన కోరికలూ, పిసినారితనం, ధనమదం, అధికార దర్పం వంటివి అశాశ్వతమనీ, మనిషిని అశాంతిలోకి నెట్టుతాయనీ గ్రహించారు.
కనుక ఏది శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుందో, ఏ అశాశ్వత ఆనందం కోసం మనిషి ప్రాకులాడుతున్నాడో తమ అనుభవాల ద్వారా తెల్పాలనుకున్నారు.
అందుకే శతకపద్యాలలో జీవన మూల్యాలు మూటగట్టి ఉంటాయి.
ఈ పద్యాలు రచించడం ద్వారా శతకకవులు మనిషికి సత్ జీవన మార్గాన్ని సూచించదలచారు.
శతకకవులు మేలైన పద్యాలు రచించి తెలుగు భాషకూ, సాహిత్యానికి గొప్ప సేవ చేశారు.
IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి.
(ప్రకటనలో పోటీ నిర్వహణ తేది, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి.)
జవాబు.

పాఠశాల బాలబాలికలకు పద్యాల పోటీకి ఆహ్వానం

ఈ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలలో తెలుగు భాషాసాహిత్యాల పట్ల అభిరుచి పెంపొందించేందుకుగాను తెలుగు పద్యాల పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని మాతృభాష పట్ల మీకున్న అభిరుచినీ, ఆసక్తినీ చాటుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.

1. పోటీల విభాగాలు :

పోటీలు సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో జరుగుతాయి.
ఆరు, ఏడు తరగతులు జూనియర్స్ విభాగం
ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు సీనియర్స్ విభాగం
2. పోటీ జరిగే తేది, స్థలం :
పోటీలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా x x x x xన ఉదయం 10.00 నుండి పాఠశాల గ్రంథాలయం హాలులో జరుగుతాయి.

3. పాల్గొనేవారికి సూచనలు :

పోటీలలో పాల్గొనేవారు xx x x x సాయంత్రంలోగా తమ తమ పేర్లు తెలుగు ఉపాధ్యాయులకు అందచేయాలి.
తెలుగు పద్యాలు ఎవరు రాగయుక్తంగా, భావయుక్తంగా ఎక్కువ పద్యాలు చెప్పగల్గుతారో వారికి మంచి బహుమతులు అందచేస్తాము.
బహుమతులు గెల్చుకున్నవారికి విశిష్ట అతిథుల చేతుల మీదుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా బహుమతులు అందచేయబడతాయి.
నిర్వహించువారు
తెలుగు విభాగం
××××× పాఠశాల.

V. పదజాల వినియోగం:

ప్రశ్న 1.
కింది వాక్యాలలోని సమానార్ధక పదాలను గుర్తించి, గీత గీయండి.
అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు.
ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.
జవాబు.
అ) దోషాలు = తప్పులు
ఆ) తేనె = మధువు

ప్రశ్న 2.
కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
జవాబు.
ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
సహృదయత = మంచి మనసు

అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
పరిమళం = సువాసన

ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
మైత్రి = స్నేహం

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

జవాబు.
ప్రకృతి – వికృతి
గుణం – గొనం
దోషం – దోసం
సుఖం – సుకం
పుణ్యెం – పున్నెం
అగ్ని – అగ్గి
వైద్యుడు – వెజ్జు
ధర్మం – దమ్మం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) దశేంద్రియ = దశ + ఇంద్రియ – గుణసంధి
ఆ) లక్షాధికారి = లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి

ఇ) పట్టెడన్నము= పట్టెడు + అన్నము – ఉత్వ సంధి

ఈ) రాతికంటు = రాతికి + అంటు – ఇత్వ సంధి

ఉ) చాలకున్న =చాలక + ఉన్న – అత్వసంధి

2. కింది విగ్రహవాక్యాలకు సమాసపదాలు రాసి, సమాసం పేరు రాయండి.

జవాబు.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) ఆకలిదప్పులు – ఆకలియు, దప్పియు – ద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రాలు – అన్నము, వస్త్రము – ద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియాలు – దశ సంఖ్య గల ఇంద్రియములు – ద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలు – నాలుగైన వేదాలు – ద్విగు సమాసం

ఛందస్సు – లఘువు, గురువు:

కింది వానిని చదివి తెలుసుకోండి.

పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.

అ) “లఘువు” – ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “I” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.


ఆ) “గురువు” – రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.
 3.కింది పదాలకు గురులఘువులు గుర్తించండి
జవాబు.
గణాలు :
గణం అంటే మాత్రల అక్షరాల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.
రెండు అక్షరాల గణాలు.
మూడు అక్షరాల గణాలు
కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.
 4.కింద పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.

అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
జవాబు.ఇందులో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఉత్పలమాల పద్యపాదము –

ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
జవాబు.ఇందులో న, జ, భ, జ, జ, జ, ర ‘అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది చంపకమాల పద్య పాదం. ‘పొ’ కి, ‘పు’ కి యతి స్థానం.


ప్రతి పదార్థాలు

మ॥ సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా !

ప్రతిపదార్థం:

మా నాథ ! = లక్ష్మీదేవికి భర్తయైన (మమ్మల్ని రక్షించేవాడా !)
నారాయణా ! = శ్రీమన్నారాయణా !
సతత + ఆచారము = సనాతన ఆచారమూ
సూనృతంబు = మంచి మాటా
కృషయున్ = దయా
సత్యవాక్కు = మంచి నడవడీ
నతి = గౌరవమూ
శాంతత్వము = శాంత స్వభావమూ
చిత్తశుద్ధి = చిత్తమునందు పవిత్రతా
కరమున్ + అధి + ఆత్మయున్ = మిక్కిలి భక్తితత్పరతా
ధ్యానమున్ = ధ్యానమూ
ధృతియున్ = దీక్షా
ధర్మము = ధర్మమూ
సర్వజీవ హితమున్ = సర్వ ప్రాణులకూ మేలు చేకూర్చుట అనే సద్గుణాలను
దూరంబు కాకుండ = దూరం కాకుండా
మీ నివాస సుఖమున్ = మీదైన నివాస సుఖం
సమ్మతికిన్ = సద్గతికి (మోక్షానికి)
చేరువ = దగ్గర కదా !

భావం : లక్ష్మీపతియైన శ్రీమన్నారాయణా ! నీ సన్నిధి మోక్షప్రదం. నీ సన్నిధిలో నున్నవానికి సకల సద్గుణాలూ దూరం కావు.

2వ పద్యం (కంఠస్థ పద్యం):

ఉ॥ బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా!

ప్రతిపదార్థం:

చిత్తమా ! = ఓ మనసా !
బీదలకు = పేదవారికి
అన్నవస్త్రములు = ఆహార వస్త్రాదులు
పేర్మిన్ = సంతోషంతో
ఒసంగుము = అందించు
తుచ్ఛ = నీచ
సౌఖ్యసంపాదనకై = సుఖములు పొందడానికై
అబద్ధములు = అబద్ధాలు
పలకు = పలుకవద్దు
వాదములు = వృథా ప్రసంగములు
ఆడన్ + పోకు = చేయవద్దు
మర్యాదన్ = గౌరవాన్ని
అతిక్రమింపకు = మీరవద్దు
పరస్పర మైత్రిన = ఇతరులతో స్నేహభావంతో
మెలంగుము = వర్తించు
ఇట్టివి + ఔ = ఇటువంటివే
వేదములు + అంచు + ఎఱుంగుము = వేదములని గ్రహించు
వివేకధనంబు + ఇది = ఇదే వివేకుల సంపద అని
నమ్ము = నమ్ము

భావం :
‘ఓ మనసా ! పేదలకు ఉదారంగా అన్న వస్త్రాలందచేయి. క్షణిక ఆనందం కోసం అబద్ధం చెప్పకు. వ్యర్థ ప్రసంగాలు చేయకు. గౌరవాలను మీరకు. అందరితో సఖ్యభావంతో మెలగు. వీటన్నిటి సారమే వేదాలని గ్రహించు’. అని తన మనస్సుకు ఆత్మబోధ చేసుకున్నాడు కవి.


II.

3వ పద్యం (కంఠస్థ పద్యం) :

చ|| చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా ! = ఓ భాస్కరుడా !
చదువు + అది = చదువు
ఎంత + కల్గినన్ = ఎంత ఉన్నా
రసజ్ఞత = ఔచిత్యం
ఇంచుక = ఒకింత
చాలక + ఉన్నన్ = లేకుంటే
ఆ చదువు = ఆ విద్య అంతా
నిరర్థకం = వ్యర్థం
ఎచ్చటన్ = ఎక్కడా
గుణసంయుతులు = సద్గుణ సంపన్నులు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = మెచ్చుకోరు
పదునుగ = మిక్కిలి నేర్పుతో
మంచికూర = మంచి కూర
నలపాకము చేసినన్ + ఐనన్ = నలుడే చేసినా
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = రుచి కల్గించే
ఉప్పు = ఉప్పు
లేక = వేయకపోతే
రుచి = రుచి
పుట్టగన్ + నేర్చునట + అయ్యా ? = ఎలా పుడుతుంది ?

భావం :
భాస్కరా ! ఎంత గొప్ప చదువులు చదివినా కొద్దిగా విచక్షణ లేకపోతే ఆ చదువు వ్యర్థం. సద్గుణులు ఎవ్వరూ మెచ్చుకోరు. నలుడే స్వయంగా వండినా కూరలో ఉప్పు వేయకపోతే రుచి పుడుతుందా ?

ఇక్కడ కవి విచక్షణను ఉప్పుతోనూ, గొప్ప చదువును నలుని వంటి వాని కూరతోనూ సామ్యం చూపాడు. విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించాడు కనుక ఇది అర్థాంతరన్యాసాలంకారం.

4వ పద్యం (కంఠస్థ పద్యం) :

ఉ॥ పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నిపా
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణా పయోనిధీ!

ప్రతిపదార్థం:

దాశరథీ ! = దశరథుని పుత్రుడైన ఓ రామా !
కరుణాపయోనిధీ ! = సముద్రమంతటి దయ కలవాడా !
పెంపునన్ = నన్ను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లివై
కలుషబృంద = పాప సమూహాల
సమాగమము = కలయిక
ఒందకుండ = నన్ను తాకకుండా
రక్షింపను = రక్షించడంలో
తండ్రివై = నాకు తండ్రివై
మెయి = నా శరీరంలో
వసించు = నివాసం ఉన్న
దశ + ఇంద్రియ = పది ఇంద్రియాలనే
రోగముల్ = రోగములను
నివారింపను = నివారించడానికి
వెజ్జువై = వైద్యుడవై
కృప గుఱించి = కృపతో
పరంబు = మోక్షం
తిరంబు + కాగ = నాకు శాశ్వతంగా లభించేటట్లు
సత్ + సంపదలు = ఉత్తమ సంపదలు
ఈయన్ = ఇచ్చుటకు
గతి నీవె = సద్గతి నీవే !

భావం :
దశరథ కుమారుడైన ఓ రామా ! దయా సముద్రా! నన్ను పెంచడంలో నీవే తల్లివి. పాపములు అంటకుండా రక్షించడంలో నీవే తండ్రివి. ఇంద్రియాలనే రోగాలు నివారించడంలో నా పాలిటి వైద్యుడివి. కృపతో నాకు మోక్షం శాశ్వతం చేసే గొప్ప సంపదలీయవయ్యా

5వ పద్యం (కంఠస్థ పద్యం) :

సీ॥ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే॥ తుదకు దొంగల కిత్తురో ? దొరలకవునొ ?
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ప్రతిపదార్థం:

భూషణ వికాస ! = ఆభరణములచే శోభించే వాడా!
శ్రీ ధర్మపుర నివాస ! = ధర్మపుర క్షేత్రంలో కొలువైన వాడా!
దుష్ట సంహార! = దుష్టులను సంహరించే వాడా!
దురితదూర ! = పాపాలు పోగొట్టేవాడా !
నరసింహా ! = ఓ నరసింహస్వామీ !
తల్లి గర్భము నుండి = పుట్టుకతోడనే
ఎవ్వర = ఎవరూ
ధనము తేరు = సంపదలు తీసుకురారు
వెళ్లిపోయెడు నాడు = మరణించేనాడు
వెంట రాదు = సంపాదించుకున్న దేదీ వెంటరాదు.
లక్ష + అధికారి + ఐన = ఎంత ధనవంతుడైనా
లవణము + అన్నమె కాని = ఉప్పూ అన్నాలే కాని
మెఱుగు బంగారంబు = ధగధగ మెరిసే బంగారం
మ్రింగన్ + పోడు = మ్రింగడు
విత్తము = డబ్బు
ఆర్జన చేసి = సంపాదించి
విఱ్ఱవీగుట + ఎ కాని = మదించి తిరగడమే తప్ప
కూడబెట్టిన = సంపాదించిన
సొమ్మున్ = డబ్బు
కుడువన్ + పోడు = తినడు
పొందుగా = ఒద్దికగా
మఱుగు + ఐన = ఎవరికీ కనబడని
భూమిలోపలపెట్టి = భూమిలో పాతిపెట్టి
దానధర్మము = దానమూ ధర్మమూ
లేక = లేక
దాచి దాచి = దాచిపెట్టి
తుదకు = చివరకు
దొంగలకు + ఇత్తురొ? = దొంగలపాలు చేస్తారో ?
దొరలకు + అవునొ ? = దొరలపాలు చేస్తారో ?
జుంటి + ఈగలు = తేనెటీగలు
తేనెన్ = తేనెను
తెరువరులకు = దారిని పోయేవారికి
ఇయ్యవా ? = ఇస్తాయి కదా !

భావం :
ధర్మపురి నివాసుడైన ఓ నృసింహా ! మనిషి పుట్టేటప్పుడు ఏమీ పట్టుక రాడు. పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోడు. ఎంత సంపాదించినా ఉప్పు, అన్నమూ తినాల్సిందే. లక్షలార్జించి అహంకారంతో వర్తించి, ఎవరికీ దానమీయక దాచి దాచి తుదకు దొంగలపాలో, దొరలపాలో చేస్తూ ఉంటారు. తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె తుదకు బాటసారుల పాలవుతుంది కదా !

ఇక్కడ ఒక విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పనైనది కనుక అర్థాంతరన్యాసాలంకారం.


III.

6వ పద్యం (కంఠస్థ పద్యం) :

*సీ॥ మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి ?
పశువుల దోషముల్ పాలకేమి ?
అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి ?
కప్పదోషము మౌక్తికములకేమి ?
వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి ?
వెలియైన వాని సద్విద్యకేమి ?
అపవిత్ర దోషంబు లగ్నిహెూత్రునకేమి ?
గుణదోషములవల్ల కులముకేమి ?
మలినమై చందనము పరిమళము జెడున
రాతికంటు గుడము మధురంబు జెడున
వినయములు జెడ మావృత్తి ఘనత జెడున
విశ్వ పాలన ధర్మ ! శ్రీ విశ్వ కర్మ!

ప్రతిపదార్థం:

విశ్వ పాలన ధర్మ ! = విశ్వపాలనమే ధర్మముగా కలవాడా !
శ్రీ విశ్వకర్మ = ఓ విశ్వకర్మా !
మొదలు = మొదలులో
కర్దమము + ఉంటె = బురద ఉంటే
మొగిలిపుష్పముకు + ఏమి = మొగలి పూవుకు వచ్చిన ముప్పేమి ?
పశువుల = పశువులకు
దోషముల్ = రోగాలుంటే
పాలకు + ఏమి = = పాలదోషం ఏమి ?
అరయన్ = విచారించగా
వైద్యుని కులంబు = వైద్యునికున్న కులము
ఔషధంబునకు ఏమి = మందులకంటదు కదా !
కప్ప దోషము = నీటిలో కప్ప ఉన్నంతమాత్రాన
మౌక్తికములకు + ఏమి = ముత్యాల కాంతి తగ్గుతుందా!
వృషభంబులు = ఎద్దులు
ఎట్లు + ఉన్న = ఎలా ఉన్నా
కృషి కర్మమునకు + ఏమి = వ్యవసాయ వృత్తికి ఇబ్బంది ఏమిటి ?
వెలియైనవాని. = వెలివేసిన కులస్థుని
సత్ + విద్యకు + ఏమి = విద్యకు కల్గిన నష్టమేమి ?
అపవిత్ర దోషంబులు = ఒకవేళ శుచీ శుభ్రం లేకపోతే
అగ్నిహెూత్రునకు + ఏమి = అగ్నికి వచ్చిన నష్టం ఏమి?
గుణదోషముల వల్ల = మనుషుల మంచిచెడుల వల్ల
కులముకు + ఏమి = ఆ కులానికి వచ్చిన నష్టం
చందనము = మంచి గంధం
మలినమై = మలినం అంటి
పరిమళము = సువాసన
మధురంబు = దాని తీపి
చెడున ? = పోతుందా ?
గుడము = బెల్లం
రాతికి + అంటు = రాతికి అంటుకుంటే
చెడున ? = పోతుందా ?
వినయములు = గౌరవాదరాలు
చెడన్ = తగ్గితే
మా వృత్తి = మాదగు వృత్తి
ఘనత = గొప్పదనం
చెడున ? = తగ్గుతుందా ?

భావం :
ఓ విశ్వకర్మా ! మొగిలిపువ్వు మొదలులో బురద ఉంటే మొగిలిపువ్వు సువాసన తగ్గుతుందా ? పశువు నల్లగా ఉంటే ఆ నలుపు పాలకంటుతుందా ? వైద్యుడు ఏ కులమైనా అది మందులకంటదు. కప్ప పక్కన ఉంటే ముత్యం కాంతి తగ్గదు. ఎద్దు ఎలా ఉన్నా వ్యవసాయానికి ఆటంకం కాదు. అధమ కులస్థుడైనవాడు నేర్చిన గొప్ప విద్యలకేమి లోటు? పాపపుణ్యాలు అగ్నికంటవు. ఒకరిద్దరు చెడ్డవాళ్ళున్నా ఆ కులానికి కల్గి నష్టం లేదు. మంచి గంధానికి కొంత మలినం అంటితే దాని పరిమళం తగ్గుతుందా ? బెల్లం రాతికి అంటితే దాని తీపి చెడుతుందా ? గౌరవాదరాలు తక్కువ చూపితే మా వృత్తికున్న గొప్పదనం మాసిపోతుందా ?

8. శతక సుధ

7వ పద్యం (కంఠస్థ పద్యం) :

ఉ॥ లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
ముక్కువలన్ సృజించుచు సమాయకుడై సుడులన్ పదేపదే
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె? వేంకటేశ్వరా!

ప్రతిపదార్థం:

వేంకటేశ్వరా ! = పాపహరుడైన ఓ దేవా !
మానవుండు = మానవుడు
లెక్కకు రాని = లెక్కలేనన్ని
కోరికల = కోరికలనే
రీతులలోన్ + పడి = విధానాలలో మునిగి
ఇటుల్ = ఈ విధంగా
మక్కువలన్ = కోరికలను
సృజించుచున్ కొత్త కొత్తగా కనిబెడుతూ
అమాయకుడై = మాయ తెలియనివాడై
పదేపదే = మరల మరల
సుడులన్ = సుడులలో
ఉక్కిరి బిక్కిరి + ఐ = ఉక్కిరి బిక్కిరి అయిపోతూ
తిరుగుచుండును+కాని = తిరుగుతూంటాడు కానీ
విశిష్టమార్గముల్ = మహత్తు కలిగిన దారులలో
త్రొక్కు = నడిచే
తలంపు = ఆలోచన
లేశము = కొద్దిగా అయినా
కుదుర్కొననీయడె = కుదురుగా నిల్పడు కదా !

భావం :
ఓ వేంకటేశ్వరా ! మానవుడు నిరంతరం నీచకోరికలనే సుడిగుండాలలో మునిగి ఉక్కిరిబిక్కిరియై పోతూంటాడు కానీ మంచి మార్గంలో నడుద్దామనే ఆలోచన కొద్దిగా అయినా చేయడు కదా !


8వ పద్యం (కంఠస్థ పద్యం) :

ఉ|| ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!

ప్రతిపదార్థం:

ఖలభంజన ! = పాపులను సంహరించేవాడా!
సాధుజన + అనురంజనా ! = సజ్జనులను సంతోషపెట్టే వాడా !
బాకవర + ఆంజనేయ! = బాకవర ఆంజనేయా !
ఆకలిదప్పులన్ = ఆకలి దప్పికలతో
వనట = వేదన
చెందినవానికి = చెందేవారికి
పట్టెడు + అన్నమో = పట్టెడంత అన్నమో
శాకమొ = కూరలో
నీరమో = మంచినీరో
ఇడి = ఇచ్చి
ప్రశాంతులన్ చేసిన = సంతృప్తిపరిస్తే
సర్వపుణ్యముల్ = సమస్త పుణ్యాల ఫలం
చేకురు = దక్కుతుంది
నీవు = నీవు
శ్రేయము+అటంచున్ = వారికి శ్రేయము (మేలు) కలగాలని
ఎంతయున్ = ఎంతో
మెచ్చెదవు = మెచ్చుకుంటావు కదా !

భావం :
బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా ! ఆకలి దప్పికలతో అలమటించేవారికి ఒకింత అన్నం, కూరా, మంచినీరిచ్చి ఆదరించినవారిని నీవు ఎల్లవేళలా వారి మేలు కోరుతూ ఎంతో మెచ్చుకుంటావు కదా !

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
1.కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

జవాబు.

శతకం పేరు కవి పేరు
1. సుమతీ శతకం బద్దెన
2. శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి
3. తెలుగుబాల కరుణశ్రీ
4. కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మం
5. వేమన శతకం వేమన
6. దాశరథీ శతకం కంచర్ల గోపన్న
7. సుభాషిత త్రిశతి ఏనుగులక్ష్మణ కవి
8. భాస్కర శతకం మారద వెంకయ్య
9. నారాయణ శతకం పోతన
10. చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...