సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

11, ఫిబ్రవరి 2023, శనివారం

11. గోలకొండ పట్టణం








గోలకొండ పట్టణం 
ఆదిరాజు వీరభద్ర రావు 




కింది లింక్ లు నొక్కి వినండి 





పాఠము ఉద్దేశం :
తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదవలేదు. వీటిలో గోలకొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం.... నాటి కోటల నిర్మాణం.... మంచినీటి వసతుల కల్పన... అద్భుత సాంకేతిక నిర్మాణాలు.... పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక,‌ వ్యాపారాలు..... ఆహారపు అలవాట్లు కోటలో జరిగిన కార్యకలాపాలు స్థాపించిన పరిశ్రమలు గోల్కొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు 1940 నాటి తెలంగాణ వచన రచన శైలిని తెలపడం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు: 
 ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతలు తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం.

 ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్ర రావు రాసిన 'మన తెలంగాణము' అనే వ్యాస సంపుటి లోనిది


రచయిత పరిచయం:
రచయిత పేరు ఆదిరాజు వీరభద్ర రావు జన్మించినది ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డాడు

 జననం : 16. 11. 1890 
మరణం:  28 . 9 .1973 
రచనలు:  ప్రాచీనాంధ్ర నగరములు,
 లలిత కథావళి, 
రత్నప్రభ, 
జీవిత చరితావళి, 
జీవిత చరిత్రలు, 
నవ్వుల పువ్వులు, 
మిఠాయి చెట్టు, 
షితాబ్ ఖాన్ మొదలైన
 ప్రత్యేకతలు: సంగ్రహాంద్ర విజ్ఞాన కోశం 50 వ్యాసాలు రాశారు.
హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకు ఎక్కాడు.
గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితం.

ఉద్యోగం: చాదర్ఘాట్ హైస్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా పని చేశాడు. 

లక్ష్మణరాయ పరిశోధక మండల కార్యదర్శిగా వ్యవహరించారు.

బిరుదు : తెలంగాణ భీష్ముడు

ప్రవేశిక : ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోల్కొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతికత నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోల్కొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశారు. ఆయన మాటల్లోనే గోల్కొండ పట్టణ విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి.


*****

కుతుబ్ షాహి రాజుల ప్రధాన రాజధానిగా గోల్కొండ ఉంది. లోపలి కోట రాజభవనాలు, మసీదులు మరియు ఒక కొండ పై పెవిలియన్ శిధిలాలను కలిగి ఉంది, ఇది 130 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది మరియు ఇతర భవనాల పక్షి యొక్క కంటి దృశ్యాన్ని అందిస్తుంది. గోల్కొండ కోట భారతదేశంలో అత్యంత అద్భుతమైన కోట సముదాయాలలో నిస్సందేహంగా ఉంది.








భారత దేశంలోని దక్షిణా పథంలో ఏకైక పట్టణంగా ప్రసిద్ది గాంచింది. ఈ గోలకొండ పట్టణం. 

గోలకొండ మూడు కోటలుగా ఉండేది.


మొదటి కోటరెండుకోటల మధ్య ఈ గోలకొండ పట్టణం విస్తరించి వుంది. 

దుర్గానికి సుమారు 7 మైళ్ళ కైవారము,

87 (ఎనభై ఏడు) బురుజులు,

8 (ఎనిమిది) దర్వాజలు ఉండేవి. 

సుమారు 4 (నాలుగు) మైళ్ళ విస్తీర్ణంలో ఈ పట్టణం వెలసింది. గోల్కొండ కోట ఇంజనీర్ :  ఆజాం ఖాన్


విశాలమైన వీధులు, మొహల్లాలతో ఈ పట్టణం వుండేది. 

అక్షి కమాన్,

దికాబ్ బాగ్,

కటోర హౌస్,

మీర్ జుమ్లా మహల్లా, 

మాదన్న మొహల్లా.... మొదలైనవి కలవు.


ధనవంతుల భవనాలు, ఉద్యోగస్తుల గృహాలు మరియు ఫకీర్లకు కూడా ఇళ్ళు ఉండేవి. 

ఆలయాలు,

సీదులు, 

స్నాన మందిరాలు, ఉద్యాన వనాలు ఉండేవి. 


తోటలు,

పాఠశాలలు,

జలాశయాలు,

నిటికాల్వలు,

అంతరాళనందనాలు ఉండేవి.

ఇవి బాబిలోనియాలోని నందనాన్ని పోలి వుండేది. 


యుద్ద భటులకు రెండు బారకాసులు ఉండేవి. 

ఈ పట్టణం అందంగా తీర్చి దిద్దడానికి కూలి కుతుబ్ షా, 

నాలుగో వాడు ఇబ్రహీం కుతుబ్ షా, 

ఐదోవాడు మహమ్మద్ కులి కుదుబ్ షా ఏడవ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా.... పాదుషాలు  శ్రద్ద తీసుకున్నారు. 


ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో 

కచేరి భవనములు,

ఉద్యోగస్తుల భవనంలు, దేవాలయములు, 

మసీదులు, 

ధర్మశాలలు, 

భిక్షా గృహములు, 

రమ్యో ధ్యానములు, 

పాఠశాలలు, స్నాన మందిరంలు, 

12 బిక్షా గృహములు నిర్మించెను. 

ఇవి 12 ఇమాములకు అంకితం చేయబడెను.



నగీనాబాగ్ = అందాల కుప్పయగు రమ్య ఉద్యానమణి.

షాహి మహల్ = రాజహార్మములు

దిల్ కుషా = మనోహరమైన మందిర రాజం (పారసీక దేశపు రాయబారికి అతని సిబ్బందికి బస)

బారకాస్ = యుద్ధ భటులకు ప్రత్యేకంగా రెండు బారకాస్ లు. ఉంచి

మిద్దెల మీది తోటలు roof of gardens


నీటిని సప్లై చేయు విధానం : 

నీటి కాలువలు 

జలాశయంలు 

కేళా కూళులు

జలపాతంలు


దొడ్డ బాల్బోవా వృక్షం: 

మజ్ను బురుజుకు వాయువ్యదిశయందు దొడ్డబాల్బోవా వృక్షం ఉండెను.

స్కంధ కైవారము 80 అడుగులు.

ఆ చెట్టు యొక్క తొర్రలో ఒక గుండ్రని బల్ల.

 దాని చుట్టూ నాలుగు కుర్చీలు వేసుకొని నలుగురు కూర్చుండి

 ఉపాహారం పుచ్చుకొనుటకు వీలగు

నంత విశాల ప్రదేశం కలదు.


ఈ బాల్బోవా వృక్షమును అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట.


కటోరా హవుజు ద్వారా మంచినీరు సరఫరా చేసే ఏర్పాటు వుండేది. ఇది గొప్ప వారికి విహార భూమి

 



 
ఆలోచించండి చెప్పండి 
ఆజాం ఖాన్ ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి?
పట్టణం అలంకార భూయిష్టంగా ఉండడం అంటే ఏమిటి?
గోల్కొండ కోట ఎందుకు అచ్చెరువు గొలుపుతున్నది?



II
ఒక చరిత్రకారుడు: 
హైదరాబాదు పట్టణంలో రమారమి "40000 ఇండ్లు ఉండి ఉండునని,
2 లక్షల ప్రజలు నివాసం" - లెక్క తేల్చాడు.
ఇందుకోసం మహమ్మద్ కులి కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడు.

మంచినీటి సౌకర్యం:   దుర్గ తటాకము నుండి భూమి లోపల మట్టి గొట్టంల ద్వారా నీటిని ప్రవహింపజేసి కఠోర హౌజ్ నింపుచుండిరి.
కటర హౌజ్ నుండి పలు ప్రాంతములకు నీరు సప్లై అగుచుండెను.

రాజప్రవేశం:
12 ద్వారములు దాటవలసి ఉండెను.
ఉమ్ రావులు, పెద్ద అధికారులు లోపలి కోటలో ఉండెదరు.

వర్తకం:
పట్టణంలోని బజారులలో చిల్లర వస్తువులు, 
తినుబండారములు, 
విలాస వస్తువులు, 
నగలు, 
నాణెములు విరివిగా అమ్మబడుచుండెను.

వనకప్పుంగవులు విదేశములతో వర్తకం చేయుచూ కుబేరసములు ఉండిరి. దొరకని వస్తువే లేకుండ ఉండెను.

వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లు కదా!
విదేశముల నుండి వచ్చేటి సరుకులు మచిలీపట్నం (బందరు) రేవు నుండి నేరుగా గోల్కొండకు వచ్చుచుండెను.

విదేశీ వ్యాపారం చేయు వారిలో డచ్చి వారు ప్రధానులు.

ఇబ్రహీం కులీ లి కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.

తుర్కిస్తాన్, 
అరేబియా,
పారసీకము మొదలగు దేశాల నుండి వర్తకము జరుగుచుండును.

పట్టణంలోనికి సర్కంతయు బంజారా దర్వాజ ద్వారానే వచ్చుచుండెను.

బంజారాలను లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలైన వస్తువులు తెచ్చుచుండుట చేత ప్రవేశ ద్వారమునకు "బంజారా దర్వాజా" అని పేరు వచ్చింది.

కొన్ని వస్తువులు ధరలు వివరాలు: 

హోను అనునది ఒక బంగారు నాణెము. (పెగోడా‌)
హోను= 4 రూ.లు
నాణెము = హోనులో 16వ భాగం
పెగొడాలలో అర్ధ / పావు భాగం ఉండెను.
ఇంకా పైసలు, గవ్వలు 


పైఠాన్ వస్త్రాలు, బందరు కలంకారి చీరలు ఎక్కువగా అమ్ముడు అవుతుండెను.
రంగుల కర్మాగారం డచ్చి వారు నడుపుచుండిరి.
ఇంకా ఉన్ని పరిశ్రమ, ఇనుప పరిశ్రమ
 మొదలైనవి కలవు.



రాకపోకలు: కొత్త వాడు వచ్చినచో వానికి ప్రవేశం చాలా దుర్లభం.

"దారోగా" అనుమతి పత్రం ఉండాలి.
లేదా రాజ ఉద్యోగులలో ఎవరి పరిచయమైనా ఉండాలి.
కొత్తవాడు రాగానే వాని వద్ద ఉప్పు గాని, పొగాకు గాని ఉన్నదేమోనని ఒళ్ళు బట్టలు బాగా తడివి చూచెదరు. ఈ రెండు వస్తువుల ద్వారానే రాజుగారికి అధిక రెవెన్యూ రాబడి.

గొప్ప అధికారులు కూడా వర్తకం చేయుచుండిరి.
మీరు జూమ్లా మంత్రి కొన్ని వజ్రపు గనులకు సొంతదారుడు.
అతని వద్ద 25 మనుగుల వజ్రాలు ఉండెను.

అక్కన్న సేనాని కొన్ని ఓడలకు సొంతదారుడయి ఓడల వ్యాపారం చేసెను.



ఆలోచించండి చెప్పండి: 
గోలకొండ వదిలి సామాన్య జనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు?
 గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి? 
గోల్కొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు?



III

గోలకొండ సాహిత్య సేవ:
ఇబ్రహీం కుతుబుషా విద్యా ప్రియుడు.
ఇతని ఆస్థానంలో కవులు పండితులు హిందువులలో మహమ్మదీయులలో ఉండిరి.
నిత్యం విద్య గోష్టి.
పండితులకు సన్మానం.

ఇబ్రహీం కుతుబ్షా చాలాకాలం విజయనగరమునందు రాజాధరణమును పెరిగిన వాడవుటచే ఆంధ్రభాషా మాధుర్యమును, ఆంధ్రభాషయంతో అభిమానం, ఆంధ్ర కవులను సత్కరించుచుండెను.

1. అద్దంకి గంగాధరుడు: 'తపతీ సుందరోపాఖ్యానం' 
అంకితం : ఇబ్రహీం పాదుషా
ఇబ్రహీం కులీ కుతుబ్ షా 
అసూరి మరిగంటి సింగరాచార్య మహాకవికి 'మత్తగందేభ సీతఛత్ర ముత్తమాశ్వ హాటకంబర చతురంతయాన యగ్రహారముల'ను ఇచ్చి సత్కరించినాడు.

ఇబ్రహీం బాదుషా సేనాని అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చ తెనుగు కబ్బం కృతి భర్త
పొన్నగంటి తెలగన ‘యయాతి చరిత్ర’ అచ్చ తెలుగులో రచించిన తొలి తెలుగు గ్రంథం.
7వ పాదుషా అబ్దుల్లా బాదుషా బ్రాహ్మణ భక్తి కలవాడు.
ఇతని చుట్టూ ఎల్లప్పుడు బ్రాహ్మణులు పరివేష్టి ఉండేవారు.
ఇతని ఆస్థానమునకు విద్వాసులు వచ్చు చుండిరి.
2. కందూరి రుద్రకవి: సుగ్రీవ విజయం 
3. సారంగు తమ్మయ్య వైజయంతి విలాసం

పట్టణంలో ఉత్తరభాగం నుండి జింకలవనం.
పెక్కు ద్రాక్ష తోటలు. జనవరి ఏప్రిల్ మాసంలో తక్కువ ఉండవచ్చును ద్రాక్షరసం ప్రీతికరమైన పానీయం.

గోల్కొండ పట్టణం లో 1589 ప్రాంతంలో మహమ్మారి పీడ సంబంధించినది.
సాధువులుపీర్ల పంజాలు తాపతులు పట్టుకుని ప్రజలతో ఊరేగిరి.
తత్ జ్ఞాపక చిహ్నంగా 1591లో చార్మినార్ నిర్మాణం గావించిరి.

ఉమ్రావుల పటాటోపం:
ఒకటో రెండో ఏనుగులు. వాటిపై గజములు పట్టుకొని ముగ్గురు భటులు 
అస్త్ర శస్త్రాలు ధరించిన 50, 60 మంది భటులు అశ్వరుడులై
బాకాలు సన్నాయిలు పాడుచు కొందరు
సురిటీలు విసురుట
గొడుగు పట్టుట
హుక్కా పీల్చుట 
కావడిలో జల పూర్ణకుంభములు
ఒక పల్లకి
భుజాలు మార్చుకోవడానికి ఇద్దరు బోయలు విడిగా నుందురు.
ఉమ్రావులు పల్లకిలో పడుకున్నప్పుడు చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని ఉండును.
తాంబూల చర్వణం 
హుక్కా పీల్చుచు కనబడుదురు 

గోల్కొండలో శిక్షలు
అతికఠినం 
జైలులో పెట్టు పద్ధతియు లేకుండా విచారణ చేయుట
 దోషులైతే శిక్షించుట నిర్దోషిలైతే విడిచిపెట్టుట.


250 సంవత్సరముల సకల సంపద వైభవములతో విరాజిల్లు ప్రపంచంలో మిరుమిట్లు గొలిపిన గోల్కొండ పట్టణము 1687వ సంవత్సరంలో ఔరంగజేబు చక్రవర్తి మోసముగా జయించి సర్వనాశనం గావించెను. అంతటితో గోల్కొండ పట్టణం అందచందములు వైభవములు ఠీవీ పరి సమాప్తి జరిగింది.

1. ‘కుతీయత్‌ కులీ’ పేరుతో అనేక కవితలు రచించాడు. ఇతని కలం పేరు ‘మానిని’. ‘దివాన్‌’ పేరుతో ‘ఉర్దూ’ కవిత్వాలు రచించాడు. తన కవిత్వాల్లో ‘హోళీ’ ‘బతుకమ్మ’ పండుగలను, తెలంగాణ ఆచార వ్యవహారాలను వివరించాడు. ఆయన కవిత్వంలో లౌకికవాదం, శృంగారం ఎక్కువగా ఉండేవి.
నేబతి కృష్ణమంత్రి ‘రాజనీతి రత్నాకరం’ గ్రంథం రచించాడు. ఇతడు మంత్రిగా, ఆస్థానకవిగా, మిత్రుడిగా మహ్మద్‌ కులీ కుతుబ్‌ షాకు పేరు తెచ్చాడు.
 ఎల్లారెడ్డి బాలభారతం, కిరతార్జునీయం ప్రసిద్ధ రచనలు.




కొన్ని ప్రత్యేక పదాలు: 

కఠోరా హౌస్‌:  ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. 

నగీనాబాగ్.  అందాలకు నెలవైన రమ్యమైన ఉద్యానవనం.

దిల్ కుషా భవనము: మనోహరమైన రాజ భవనము.

బారకాసులు: యుద్ధ భటుల నివాస స్థానం

బల్బోవా: 80 అడుగుల కైవారం గల స్కందము గల వృక్షం 

హోనులు: బంగారు నాణెం.


మైండ్ మ్యాపింగ్ - సులువు గుర్తించుకోవడానికి పై వీడియొ లింక్ నొక్కండి. 


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి. 

(లేదా)

గోలకొండ నవాబుల సాహిత్య సేవ ఎట్టిది ? 

(లేదా)

ఇబ్రహీం కుతుబ్షా సాహిత్య పిపాస గూర్చి వివరించండి. 

జవాబు:

“గోలకొండ పాదుషాలలో ఇబ్రాహీం కుతుబుషా విద్యా ప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రాహీం కుతుబ్షా చాలాకాలము విజయనగరము నందు రాజాదరణమున పెరిగినవాడగుటచే ఆంధ్ర భాషా మాధుర్యమును గ్రోలినవాడు ఆంధ్రభాష యందు అభిమానము గలిగి, ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరణోపాఖ్యాన” కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు.


ఇబ్రాహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివశించు చుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములను” ఇచ్చి సత్కరించినాడు. సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు “యయాతిచరిత్ర”కు కృతిభర్తయయి, ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు.

ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?

జ:నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితి

ఇబ్రహీం కుతుబ్షా తెలుగుభాష తియ్యదనం తెలిసినవాడు. తెలుగు భాషయందు అభిమానంతో తెలుగు కవులను, పండితులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధర కవి రచించిన ‘తపతీ సంవరణో పాఖ్యాన కావ్యము’ వీరికి అంకితమివ్వబడినది. వీరు మహాకవి ఆసూరి మరింగంటి సింగరాచార్యను చతురంతయాన అగ్రహారాలను ఇచ్చి సత్కరించారు.

మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ దీనిని పొన్నగంటి తెలగనార్యులు రచించారు. ఈ కావ్యానికి కృతిభర్త ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్. దీనిని రచించిన కవిని ఘనంగా సత్కరించారు. దీనిని బట్టి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు.

ఇ) “తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.

జ: తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి: 

పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తిను బండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. వ్యాపారులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరులతో సములయి ఉండిరి. అప్పుడీ పట్టణములో దొరకని వస్తువే లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే గదా ! భారతభూమి నలుమూలల నుండి వర్తకం సాగు చుండెను.

విదేశముల నుండి వచ్చెడి సరుకులు మచిలీపట్టణం నుండి నేరుగా గోలకొండకు వచ్చు చుండెను.ఇది కేంద్రంగా తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుబ్షా కాలములో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను.


ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?

జ: ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.

జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.

రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.

నీటి సమస్య : చెరువులు భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.

కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.

ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం.

విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతుల ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.

సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి, ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణ తో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరక ప్రాయంగా మారుతుంది.


 2. క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) గోలకొండ పట్టణము విశిష్టతను తెలుపండి.

జ: పట్టణమంటే గోలకొండ పట్టణమే అనే ప్రఖ్యాతి పొందింది. అందుకు కారణం గోలకొండ యొక్క అందచందాలు, వైభవం, విశిష్టతలు.

అందచందాలు : గోలకొండ పట్టణ నిర్మాణ పథకకర్త ఆజంఖాన్, పట్టణాన్ని మొహల్లాలుగా విభజించారు. వీధులు విశాలంగా ఉంటాయి. భాగ్యవంతులు, సరదార్ల మేడలు కోట లోపల ఉంటాయి. పట్టణానికి ఆ భవనాలన్నీ అలంకారాలుగా ఉంటాయి. నగీనాబాగ్ ఒక అందాలకుప్ప అయిన ఉద్యానవనం.

షాహిమహలులు అనే రాజహర్మ్యములు చాలా అందమైనవి. దిల్కుషా భవన సౌందర్యం వర్ణనాతీతం. ఉద్యానవన నిర్మాణాలు గోలకొండ పట్టణం అందచందాలను చాలా పెంచాయి. మిద్దెలమీది తోటలు శిల్పకళా నిపుణత్వానికి గీటు రాళ్ళు. ఈ ఉద్యానవనాలకు నీరు సరఫరా చేసే కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు చూసి ఆశ్చర్యపడని వారుండరు. బాల్బోవా వృక్షం పట్టణం అందాలను పెంచింది.

వైభవం : గోలకొండ పట్టణం వజ్రాలకు పుట్టినిల్లు. అక్కడి వ్యాపారులు మహాధనవంతులు. దేశవిదేశాలతో ఎగుమతి దిగుమతి వాణిజ్యం చేసేవారు. అప్పుడా పట్టణంలో దొరకని వస్తువు లేదు. వజ్రాల వ్యాపారం, ఓడల వ్యాపారం కూడా జోరుగా సాగేది.

విశిష్టత : కవులు, పండితులను పోషించేవారు. అనేక గ్రంథాలను రచింపచేసి, అంకితం పుచ్చు కొనేవారు. కవులను ఘనంగా సన్మానించేవారు. అగ్రహారాలిచ్చేవారు. జంతు ప్రేమికులు. ద్రాక్ష తోటలు పెంచేవారు. ఉమ్రావులు విలాసవంతంగా జీవించే వారు. శిక్షలు కఠినం.


3. క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక/సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.

జ: పర్యాటక క్షేత్రం – ఆదిలాబాద్ జిల్లా బాసర

పవిత్ర గోదావరీ నదికి సుమారు అరవై మైళ్ళ దూరంలో ఒక ఋష్యాశ్రమం ఉండేది. దానిని వ్యాస మహర్షి స్థాపించడం చేత దానికి “వ్యాసపురి” అని పేరు వచ్చింది. తరువాత ‘వాసర’ అని పిలువబడుతుండేది.

కాలక్రమంలో అదే ‘బాసర’ అని ప్రసిద్ధిపొందింది. ఇక్కడ సరస్వతీ దేవి దేవాలయం ఉంది. ఉత్తర భారతదేశంలో కాశ్మీరంలో, దక్షిణ భారతదేశంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో మాత్రమే సరస్వతీ దేవి దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్ నారాయణాంశతో జన్మించిన వేదవ్యాస మహర్షి మహాభారత భాగవతాది అష్టాదశ పురాణాలు, వ్యాఖ్యాన గ్రంథాలు రచించి, నాలుగు వేదాలను పరిష్కరించి మానవాళికి అందించిన మహోన్నతుడు.

అటువంటి వేదవ్యాసునికే ఒకసారి మనశ్శాంతి లేక సకల మునిగణ సేవితుడై ఉత్తరభారతదేశ యాత్రచేసి, దండకారణ్యానికి వచ్చాడట. కలిదోష నివారణ చేయగలిగిన గౌతమీ నదిలో స్నానం చేసి, సంధ్యా వందనము వంటి అనుష్ఠానాలను పూర్తిచేసుకుని, అమ్మను ప్రార్థించి సాకారముగా ఇక్కడనే నెలకొని ఉండమని శ్రీ సరస్వతీ దేవిని ప్రార్థించాడు. ప్రతిరోజూ గౌతమీ నదిలో స్నానము చేసి మూడు గుప్పెడులతో ఇసుక ను తెచ్చి ఒక చోట ఉంచేవాడు.

క్రమంగా అది మూడు మూర్తు లుగా మారి శ్రీ మహాసరస్వతీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాకాళి రూపాలతో ఆవిర్భ వించింది. అందులో శ్రీ మహా సరస్వతిని అధి దేవతగా మిగిలిన దేవతలను పరివార దేవతలుగా ఆరాధించేవాడు. తరువాతి కాలంలో తురుష్కులు దండయాత్రలలో ఈ మందిరాన్ని నాశనం చేయటం జరిగింది.

వీరశైవులైన ‘మాక్కజీ పటేలు’ సమూహము వాళ్ళను ఎదిరించారు. శిథిలమైన దేవాలయం పునరుద్ధరించబడింది. శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు శ్రీ సరస్వతీ దేవిని పునఃప్రతిష్ఠ చేసి పునరుద్ధరించారు. ఇక్కడ దత్తమందిరము, గణేశ మందిరము, ఏకవీర మందిరము, పాతాళేశ్వర మందిరము,

ఆంజనేయ మందిరము’ ఉన్నాయి. శ్రీ సరస్వతీదేవి ఆలయము కేంద్రంగా ఇంద్రేశ్వరము, సూర్యేశ్వరము, నారాయణేశ్వరము మొదలైన ఆలయ సముదాయ ముతో కూడిన మహాక్షేత్రము బాసర. ఇక్కడ ప్రతి సంవత్సరము విజయదశమికి, శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి శ్రీ సరస్వతీదేవిని దర్శించి, ఆమె అనుగ్రహంతో పిల్లలకు విద్యాభ్యాసాలు జరుపుకుంటారు. పల్లె వాసుల జాతరలు, శుభకార్యాలు కూడా జరుగు తుంటాయి.


III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) పుట్టినిల్లు: భారతదేశం కళలకు పుట్టినిల్లు.

ఆ) పాటుపడడం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో వీరులు పాటుపడ్డారు.

ఇ) పీడవదలడం కంసుని వధతో ఆ రాజ్యానికి పీడవదిలింది.

ఈ) తలదాచుకోవడం :కాశ్మీరీ పండిట్లు ఢిల్లీ పురవీధుల్లో తలదాచుకున్నారు.


2. క్రింది పదాలను వివరించి రాయండి.

అ) పటాటోపము : మితిమీరిన వస్త్రాలంకారణాన్ని పటాటోపం అని అంటారు. ‘పటము’ అనగా వస్త్రము అని అర్థం అనగా బాగా అలంకరించుకొని హడా వుడిగా తిరుగు అని భావం.

ఆ) అగ్రహారం : ఇబ్రహీం పాదుషా మహబూబునగరు జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి “మత్తగంధేభసితఛత్ర ముత్త మాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహార ములను” ఇచ్చి సత్కరించినాడు.

ఇ) బంజారాదర్వాజా : పట్టణంలోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును. బంజారాలు అనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటచే ప్రవేశద్వారమునకు బంజారా దర్వాజా అను పేరు వచ్చినది.

ఈ) ధర్మశాల : పుణ్యాన్ని పొందదలచి యాత్రికులకు, బాటసారులకు, అనాథలకు ఆశ్రయాన్ని కల్పించేందుకు నిర్మించబడిన వసతి గృహాలను ధర్మశాలలు అని అంటారు. ఇవి ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో కులమతాలకు అతీతంగా జనులు ఆశ్రయం పొందుతారు.


వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలలో సంధి పదాలను విడదీసి అవి ఏ సంధులో రాయండి.

అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిట కిటలాడుతాయి.

జ: దేవ + ఆలయాలు = దేవాలయాలు (సవర్ణదీర్ఘ సంధి)

ఆ) మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనస్సు లను ఆకట్టుకుంటాయి.

జ: రమ్య + ఉద్యానములు = రమ్యోద్యానములు (గుణ సంధి)


ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.


జ: ‘అశ్వ + ఆరూఢుడు = అశ్వారూఢుడు (సవర్ణదీర్ఘ సంధి)


ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.

జ: రాజ + ఆజ్ఞ (సవర్ణదీర్ఘ సంధి)


బహువ్రీహి సమాసము

క్రింది సమాసపదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.

అ) ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు.

ఆ) ముక్కంటి – మూడు కన్నులు కలవాడు.

ఇ) గరుడ వాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు.

ఈ) చతుర్ముఖుడు – నాలుగు ముఖాలు కలవాడు.

ఉ) పద్మాక్షి – పద్మం వంటి కన్నులు కలది.


పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు. రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని “బహువ్రీహి” సమాసం అంటారు.

ఉదా : ‘చక్రపాణి’ అనే సమాసపదంలో ‘చక్రము’ అనే పదానికి ప్రాధాన్యం లేదు. ‘పాణి’ (చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలో పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.

అన్యపదార్థ ప్రాధాన్యం బహువ్రీహి.


2. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను రాయండి.

ఉదా:  యాయాతి చరిత్ర - యాయాతి యొక్క చరిత్ర షష్టి తత్పురుష సమాసం.


అ) బ్రాహ్మణ భక్తి : బ్రాహ్మణుల యందు భక్తి - సప్తమి తత్పురుష సమాసం.

ఆ) నీలవేణి : నీలం వంటివేని కలది బహువ్రీహి సమాసం

ఇ) పుష్పగుచ్చము: పుష్పం యొక్క గుచ్ఛము - షష్టి తత్పురుష సమాసం

ఈ) గోల్కొండ పట్టణము : గోల్కొండ అనే పేరు గల పట్టణము - సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఉ) గరళకంఠుడు : గరళము కంఠమున గలవాడు - బహువ్రీహి సమాసం

ఊ) సుందరాకారములు : సుందరమైన ఆకారములు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఋ) దయాంతరంగుడు : దయతో కూడిన అంతరంగం గలవాడు - బహువ్రీహి సమాసం

ౠ) అందచందములు :అందమును చందమును - ద్వంద్వ సమాసం.


3. కింది వాక్యాలను వ్యవహార భాషలోకి మార్చండి.

ఉదా పట్టణము అలంకారముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుపడిరి.

పట్టణము అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటు పడ్డారు.


అ) ఈ మందిరము నందే పారసీకపు రాయబారికిని, అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేసిరి.

జవాబు: ఈ మందిరంలోనే పారశీక రాయబారికి, అతడి అనుచర వర్గానికి, బస ఏర్పాటు చేశారు (వ్యవహార భాష)


ఆ) నీటి కాలువలు జలాశములు జలపాతములు అచ్చెరువు గొలుపుచుండెను.
జవాబు నీది కాలువలూ, జలాశయాలలూ, జలపాతాలూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ఇ) పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండెను.
జ. పెద్ద అధికారుల నివాసాలు కోటలో ఉంటాయి.

ఈ) వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా!
జ. వజ్రాల గోల్కొండ పుట్టిల్లే కదా!

ఉ) పట్టణంలోనికి సర్కంతయు బంజారా దర్వాజ ద్వారానే వచ్చుచుండును.
జ. పట్టణంలోకి సర్కంతా బంజారా దర్వాజ ద్వారా వస్తూ ఉంటుది.


ప్రాజెక్టు పని ; మీ జిల్లాలోని వివిధ కోటల చిత్రాలు లేదా మీరు చూసిన కోట / ప్రాచీన గుడి / కట్టడం ఆధారంగా నివేదిక రాయండి ప్రదర్శించండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...