ప్రేరణ
చదవండి ఆలోచించండి చెప్పండి
ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహనివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను, సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.
ప్రశ్న 1.ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు. ప్రజ్ఞకు అనేక సందేహాలున్నాయి. పక్షుల్లా మనుష్యులు ఎందుకు ఆకాశంలో ఎగరలేకపోతున్నారు అనీ, గబ్బిలాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి అనీ ఇలా … చాలా సందేహాలున్నాయి. వాటినన్నింటినీ శాస్త్రవేత్తను అడిగి ఉంటుంది.
ప్రశ్న 2. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు. ప్రజ్ఞకు వచ్చిన సందేహాలన్నింటికి శాస్త్రవేత్త విసుగుకోకుండా జవాబులు చెప్పి ఉంటాడు.
ప్రశ్న 3.ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు.నేను కూడా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను. శాస్త్రవేత్త కావడానికి బాగా చదువుకోవడమేగాక పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. నేను చదివిన విషయాలను పరిసరాలతో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీక్షతో, కృషితో, శ్రద్ధతో బాగా చదువుకొని శాస్త్రవేత్తను అవుతాను. ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.
ప్రశ్న 4.అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణంపోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు. తెలుసు. ఆయనే డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం. మన మాజీ రాష్ట్రపతి.
ఇవి చేయండి
1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
‘ప్రేరణ’ అనే పాఠం పేరు వినగానే నీకేమనిపిస్తుంది?
జవాబు.
‘ప్రేరణ’ అంటే కదిలించే వ్యక్తి. ఎవరి మనసునైనా ఆకర్షించి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చి వారికి కొత్త స్ఫూర్తినిచ్చి కొత్తవిషయాల వైపు నడిపించి, కొత్తవిషయాలు కనుక్కోగలిగేటట్లు ప్రోత్సహించేటట్లు ప్రోత్సహించే శక్తిప్రేరణ.
ఈ పాఠం పేరు వినగానే తప్పకుండా ఇది ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన చరిత్ర అని నాకనిపించింది. ఆ వ్యక్తి క్రీడారంగంలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ, కళాసాహిత్యరంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, విద్యావైజ్ఞానిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ అయి ఉంటాడనిపించింది. ఆ వ్యక్తి గురించి త్వరగా చదివి తెలుసుకోవాలని అనిపించింది.
ప్రశ్న 2. అబ్దుల్ కలాం చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి. :
జవాబు.
ప్రవీణ్, లక్ష్మణ్ : మణి! అబ్దుల్ కలాం ఏ కాలంలో చదువుకున్నాడంటావ్?
మణి : బ్రిటిష్వారు మనదేశాన్ని పాలించే రోజులలోనే. అప్పటికింకా మనకు స్వరాజ్యం లేదు.
అంజలి, జయంత్ : అవును. ఆయన హైస్కూల్ చదువు రామనాథపురంలో జరిగింది.
శంకర్ : ఆయన పుట్టింది ధనుష్కోటిలో కదా! మరి రామనాథపురంలో చదవడమేమిటి?
అంజలి : ఇప్పటిలాగా అప్పుడు ఇన్నిన్ని పాఠశాలలు, కళాశాలలు లేవు. ఎలిమెంటరీ పాఠశాలలు కూడా చాలా తక్కువ ప్రదేశాలలో ఉండేవి. పై
చదువులు చదవాలంటే పొరుగూరుగాని, దగ్గరలో ఎక్కడ విద్యాలయం ఉంటే అక్కడికి వెళ్ళి చదువుకోవలసిందే.
మహేష్ : ఔను గాంధీగారు, పటేల్, చిలకమర్తివారు ఇలా అందరూ ఉన్న ఊరు విడిచి వెళ్ళి చదువుకున్నవారే.
రమణ : ఇప్పటిలాగా అప్పుడు కిండర్ గార్టెన్ చదువులు, ఇంగ్లీషుమీడియం చదువులు ఉండేవి కాదు. ప్రాంతీయ పాఠశాలలో ప్రాంతీయ భాషలోనే
విద్యాభ్యాసం జరిగేది.
శంకర్ : ఆంగ్లేయుల పాఠశాలలు, కళాశాలలో మాత్రం తప్పకుండా ఆంగ్లంలో చదవాల్సిందే. అంతేకాదు హయ్యర్ సెకండరీ క్లాసులలో కూడా ప్రాంతీయ భాష ఒక్కటిమాత్రం ఆ భాషలో చదవవచ్చు. తక్కిన సబ్జక్టులన్నీ ఆంగ్లంలోనే చదవాలి.
ప్రవీణ్ : అందుకనేనా ఎ.పి.జె. అబ్దుల్కాలాం అన్నిచోట్ల చదువవలసి వచ్చింది.
అంజలి : చూశారా! విద్యావిధానంలో ఆరోజుకీ ఈరోజుకీ ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో!
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాలను పూర్తిగా రాయండి.
(అ) కలామ్ తత్త్వశాస్త్ర గ్రంథాలు చదవడం
జవాబు.
నేను సెంటోసెఫ్ నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.
(ఆ) విజయానికి సూత్రాలు మూడు
జవాబు.
నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవితగమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు, జీవితంలో విజయం పొందడానికీ ఫలితాలు సాధించడానికీ నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది- అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.
(ఇ) సోదరి సహాయం
జవాబు.
ప్రవేశానికి ఎంపికైతే అయ్యానుగానీ అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారుగాజులు, గొలుసు కుదువపెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంలో ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికున్న ఏకైన మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే.
(ఈ) ప్రొఫెసర్ పక్కన కూర్చుని ఫోటో దిగడం
జవాబు.
ఎమ్.ఐ.టికి. సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొ. స్పాండర్కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందుకూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో వెనుక నిల్చున్నాను. ‘రా నాతోపాటు ముందుకూర్చో’ అన్నాడు. నేను ప్రొ. స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ‘నువ్వు నా బెస్టు స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొ.స్పాండర్తో కలసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.
2. కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.
భారతీయ జాతీయోద్యమ నాయకులలో బిపిన్చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయనిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులనూ పండితులను, తత్త్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
(అ) బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు (ఒప్పు)
(ఆ) బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి (తప్పు)
(పై పేరాలో బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు నిచ్చాడు అని ఉన్నది. అంటే ఆయన దానిని సమర్థిస్తున్నాడు. ప్రశ్నలో వ్యతిరేకిస్తున్నాడు అని ఉన్నది కనుక ఇది (తప్పు)
(ఇ) బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు (ఒప్పు)
(ఈ) బిపిన్ చంద్రపాలికి స్వాతంత్రోద్యమ కాంక్ష ఉంది. (ఒప్పు)
(ఉ) బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (ఒప్పు)
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) ‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం తండ్రి తన కుమారునితో అన్న మాటలివి. విజ్ఞానం కలిగి ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు. విజ్ఞానం అంటే ఇతరులను గురించి తెలుసుకోగలిగే శక్తి. మనం అందరితోనూ స్నేహంగా సత్సంబంధాలు కలిగి ఉండాలంటే వారిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. అలాగే చెడ్డవారి నుంచి దూరంగా ఉంటే ప్రమాదాలను తప్పించుకోగలుగుతాం. విజ్ఞానం కలవాడు ఇతరులను గురించి ఆలోచించగలిగినట్లే తనను గురించి తాను ఆలోచించగలుగుతాడు. అదే వివేకమంటే. వివేకవంతుడు తప్పక విజ్ఞానియై ఉంటాడు. కాని విజ్ఞానమున్నంత మాత్రాన వివేకి కావాలని లేదు. కాబట్టి తప్పకుండా వివేకం కలిగి ఉండాలని నా అభిప్రాయం.
(ఆ) ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి ?
జవాబు.
కోరిక అనేది ప్రతివ్యక్తికీ ఉంటుంది. ఐతే కోరిక బలంగా ఉంటేనే మనిషి దాన్ని తీర్చుకోడానికి ప్రయత్నిస్తాడు. అందుకే కోరిక గట్టిదై ఉండాలి. నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. కోరికను సాధించుకోగలను అనే గట్టి పట్టుదలతో తన మీద తను నమ్మకం కలిగి ఉంటే కోరికను సాధించుకోగలడు. ఆశ పెట్టుకోవడం అంటే చేసే ప్రయత్నాలలో ఒక్కొక్కసారి విఫలమైనా నిరాశపడకుండా తప్పక సాధిస్తాను అనే ఆశతో ముందుకు సాగడం. మనిషి ఎప్పుడూ ఆశాజీవిగానే ఉండాలి. కాబట్టి ఎవరైనా తన ప్రయత్నాలలో సఫలీకృతులు కావాలంటే పై మూడు అంశాల మీద పట్టు సాధించాలి.
(ఇ) “తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తి పరచడమే!” ఈ మాటలు ఎవరినుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
(లేదా)
కలాం ఉపాధ్యాయుల గొప్పదనాన్ని చెప్పిన సందర్భం వివరించండి.
జవాబు.
తనను ప్రోత్సహించిన ఎమ్.ఐ.టి. ఉపాధ్యాయులను ఉద్దేశించి అబ్దుల్కాలాం చెప్పిన మాటలివి. ఎమ్.ఐ.టి. లో చదివేటప్పుడు అబ్దులలాం ఆలోచనలను తీర్చిదిద్ది, కలాం సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ముగ్గురు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కే.ఏ.వి. పండలై, ప్రొఫెసర్ నరసింగరావుగారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ వారి ఆశయం మాత్రం ఒక్కటే. అది- తమ చైతన్యంతోనూ, అకుంఠిత సంకల్పంతోనూ, విద్యార్థుల జ్ఞాన తృష్ణని సంతృప్తిపరచడం ఒక్కటే వారందరి ఆశయం. ఇది ఆ ఉపాధ్యాయుల గొప్పదనాన్ని తెలియచేస్తోంది. తనను తీర్చిదిద్దిన అలాంటి గురువులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చూపిన కలాం వ్యక్తిత్వం గొప్పదని తెలుస్తుంది.
(ఈ) ప్రొ. శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తిచేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు. ప్రొ. శ్రీనివాసన్ అబ్దుల్ కలాంకు యుద్ధవిమానం మోడల్ తయారుచేసే పని అప్పగించారు. అది ఆయన స్నేహితులతో కలిసి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వంతు పని తొందరగానే జరిగినా స్నేహితులవైపు నుండి ఆలస్యం జరిగిందని నా కనిపిస్తుంది. నేనైతే పనిచేయడానికి ముందు స్నేహితులతో పనితీరు గురించి ఎంత సమయంలో ఏ పని పూర్తిచేయాలి అనే విషయం గురించి క్షుణ్ణంగా చర్చిస్తాను. అందరూ ఒకరి పనిని మరొకరు పరిశీలిస్తూ, సమిష్టి బాధ్యతతో పని పూర్తయ్యేలా బాధ్యత తీసుకుంటాము.
ప్రతివారిని వారు చేయవలసిన పనిలోని భాగాలను ముందుగానే ప్రణాళిక తయారుచేసి సమయనిర్దేశంతో సహా సిద్ధం చేయిస్తాను. ఆ ప్రణాళికను బట్టి మొత్తం పని పూర్తికావడానికి ఎంత సమయం కావాలో ఆలోచించుకుని ఆ ప్రకారంగా పనులు జరుగుతున్నవో లేదో పర్యవేక్షిస్తూ ముందుగానే నావంతుగా ఎక్కువ సమయం పనిచేసి అనుకున్న దానికన్న ముందుగానే పని పూర్తిచేసి స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తాను. వారిని ప్రోత్సహిస్తూ వారికి సాయం చేస్తూ నిర్ణీత సమయంకంటె ముందుగానే పనిపూర్తిచేసి ఉపాధ్యాయునికి అప్పగిస్తాను.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. కలాం తన ఆశయసాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం చిన్నతనంలో కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూసి తను కూడా అలా ఎగరాలనుకొనేవాడు. ఆకాశంలోని రహస్యాలు తెలుసుకోవాలని ఆయనకు ఆసక్తి. కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాలపై పట్టు సాధించమని గురువు ఇయదురై సోలోమోన్ ఇచ్చిన ఉపదేశం మనసులో కుదుర్చుకున్నాడు. తన ఆశయం నెరవేర్చుకోడానికి ఎంతో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ రోజుల్లో కాలేజీలో ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమానాలను చూస్తూ ఎక్కువ కాలం గడుపుతూ తన ఆశయాన్ని బలపరచుకున్నాడు. కోర్సు పూర్తి కాగానే సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేశాడు. ప్రొఫెసర్ ఇచ్చిన అతి తక్కువ సమయంలో పూర్తిచేసి అందరి మన్ననలు పొందాడు. వ్యాసరచన పోటీలో ‘మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం’ అనే వ్యాసాన్ని తమిళంలో రాసి మొదటి బహుమతి పొందాడు. ఆ విధంగా కలాఁ తన ఆశయసాధనలో కృతకృత్యుడయ్యాడు.
(లేదా)
కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
కలాం రామనాథపురంలోని హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో అతనిలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ముందుముందు జీవితంలో రాబోయే అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఆయనకేమీ తెలియదు. అక్కడి ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆయనకు మార్గదర్శకుడైనాడు. కలాంకు ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా చిన్నప్పటినుండి ఎంతో ఆసక్తి. పై చదువుల గురించి, ప్రొఫెషనల్ చదువులగురించి ఆయనకేమీ తెలియదు. అందుకే తిరుచినాపల్లిలో ఉన్న సెంట్ జోసఫ్ కాలేజీలో ఇంటర్మీడియెట్, బి.ఎస్.సి. చదివాడు. చివరి సంవత్సరంలో ఇంగ్లీషు సాహిత్యం మీద ఇష్టం కలిగి మంచి మంచి పుస్తకాలు, తత్త్వశాస్త్ర గ్రంథాలు చదివేవాడు. టాల్స్టాయ్, స్కాట్, హార్డీ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆ సమయంలోనే ఆయనకు భౌతికశాస్త్రం పట్ల ఇష్టం ఏర్పడింది.
కానీ తన కలలు నిజం చేసుకోవాలంటే ఫిజిక్స్ కాదు ఇంజనీరింగ్ చదవాలని అర్థం చేసుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రవేశం లభించింది. కాని డబ్బు సమస్య ఎదురైంది. సుమారు 10వేల రూపాయలు కావలసి వచ్చింది. తండ్రికి శక్తి లేదు. సోదరి జొహారా తన బంగారు గొలుసు, గాజులు తాకట్టుపెట్టి డబ్బు ఇచ్చింది. ఎం.ఐ.టిలో చేరిన తరువాత స్కాలర్షిప్ సంపాదించుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నతరహా యుద్ధ విమానాన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసి ప్రొఫెసరు మన్ననలు పొందాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ పనిచేశాడు. ఈ విధంగా అబ్దుల్ కలాం విద్యాభ్యాసం సాగింది.
2. ‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్కలాం ఏమి రాసి ఉంటారు? (అదనపు ప్రశ్న)
అబ్దుల్ కలాం ప్రాజెక్టు పని పూర్తిచేస్తున్న కాలంలో ఎం.ఐ.టి. తమిళ సంఘం వారు వ్యాసరచన పోటీ నిర్వహించారు. కలాం ఆ పోటీలో పాల్గొన్నారు. “మన విమానాన్ని మనమే చేసుకుందాం” అనే అంశం మీద వ్యాసం రాశారు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. కలాం ఆ పోటీలో గెలిచి ప్రఖ్యాత తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు సంపాదకుడైన దివాన్ చేతులమీదుగా మొదటి బహుమతి అందుకున్నారు. ఆ వ్యాసంలో కలాం ఇలా రాసి ఉండవచ్చు “ఆకాశంలో విహరించడమంటే ఇష్టంలేని వాళ్ళుండరు.
పక్షులైతే రెక్కలతో ఎగురుతాయి. మనిషికి రెక్కలు లేవు గనుక పక్షి ఆకారం కలిగి రెక్కలున్న వాహనంలో అదే విమానంలో కూర్చుని ఆకాశంలో ప్రయాణించవచ్చు. ఈ విమానాన్ని ఎలా తయారుచెయ్యాలంటే ఏరోనాటిక్స్ క్షుణ్ణంగా అభ్యసించాలి. స్వేచ్ఛకు – తప్పించుకోడానికీ, చలనానికీ-గమనానికీ, పక్కకి జారడానికీ – ప్రవహించడానికీ మధ్యగల తేడా తెలుసుకోవడంలోనే విజ్ఞానశాస్త్ర రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. యుద్ధ విమానం తయారు చెయ్యాలంటే ఏరో డైనమిక్ డిజైనింగ్, చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామగ్రి మొదలైన అంశాలమీద దృష్టి పెట్టి తయారు చేయాలి………..” ఈ విధంగా వ్యాసం సాగి ఉండవచ్చునని నా భావన.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అట్లాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి. గోపాలరావు తాతగారు మంచి మనస్సున్న వైద్యుడు
జవాబు.
బాధతో మూలుగుతూ వచ్చే ప్రతి రోగికి ఆయన ఒక సోదరుడు
నవ్వుతూ, ప్రేమతో మాట్లాడుతూ ఉంటే
వారిబాధ తెలుసుకొని, ధైర్యం చెబుతూ ఉంటే
నేను కూడా పెద్దయ్యాక డాక్టరు నవుదామనుకుంటున్నా
రోగులకు, పేదలకు సేవచేసి తరించాలనుకుంటున్నా!
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం
చేయండి.
మిత్రులారా! గురువు ఉత్తముడైనంత మాత్రాన సరిపోదు. గురువెట్లా ఉన్నా శిష్యుడు చురుగ్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలి. ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ కోరిక బలంగా ఉండాలి. చెయ్యగలనన్న నమ్మకంతో సాధిస్తానన్న ఆశతో పనిచేస్తే తప్పక సాధించగలరు. మీలో విశ్వాసం గట్టిగా ఉంటే మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకోగలరు. అన్ని విషయాల మీద దృష్టి పెట్టి తెలుసుకుంటూ ఉండండి. విజ్ఞానం పొందండి. విజ్ఞానంతోపాటు వివేకం కూడా చాలా అవసరం. వివేకం లేకపోతే విజ్ఞానం వ్యర్థం. ఎప్పుడూ సకాలంలో పనులు పూర్తిచేసుకోవాలి. ఉపాధ్యాయుల మన్ననలు పొందాలి. మీరు సాధించదలచిన లక్ష్యాన్ని మనసులో చక్కగా కుదుర్చుకొని తగినంత కృషి చేసి దాన్ని చేరుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, వైఫల్యాలు ఎదురైనా నిరాశపడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. మీ అందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.
పదజాల వినియోగం
1. కింద గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
(అ) ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
ఔత్సాహికుడైన = ఉత్సాహవంతుడైన
ఉత్సాహవంతుడైన వాడు మొదలు పెట్టిన పనిని తప్పక పూర్తి చేస్తాడు.
(ఆ) జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక కలవాడు.
దేవుని గురించి తెలుసుకోవాలనే కోరిక గల నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను చేరాడు.
(ఇ) సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష
ఆకాంక్ష = కోరిక
సుజాతకు మదర్ థెరిసాలాగా సంఘసేవ చేయాలని కోరిక.
(ఈ) అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
వాగ్దానం : మాట యివ్వడం
రోజూ ఆలస్యంగా నిద్రలేచే గౌతమి ఇకపై త్వరగా లేస్తానని తల్లికి మాట ఇచ్చింది.
(ఉ) బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
ప్రత్యామ్నాయం = బదులు / మాఱు
వరద సమయాలలో ప్రజలకు తలదాచుకోవడానికి ప్రభుత్వం సురక్షితమైన బదులు (మాఱు) ఏర్పాట్లు చేస్తుంది.
(ఊ) వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
ప్రభావితం చేయు = స్ఫూర్తి కలిగించు
గొప్పగొప్ప వ్యక్తుల బోధనల వలన స్ఫూర్తి కలవారమైన మనం కూడా గొప్పవాళ్ళం కాగలుగుతాం.
2 ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.
ఉదా: ఏరోనాటికల్ ఇంజనీర్
ఈ పాఠంలోని శాస్త్ర సంబంధమైన పదాలు :
సైన్సు వాయుపదార్థాలు నిర్మాణం
విజ్ఞానశాస్త్రం గతిశీలత
ఫిజిక్స్ ఏరోప్లేన్
ఇంజనీరింగ్ యుద్ధవిమానం
సాంకేతిక విద్య ఏరోడైనమిక్ డిజైన్ అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలు చోదనం అర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్
3. కింది వాక్యాలలో సమానార్థకాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
(అ) ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి
(ఆ) భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు.
భూమి, వసుధ, ధరణి
(ఇ) ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలైంది. నెలకు దాదాపు పదివేలు సంపాదిస్తున్నాడు.
జవాబు.ఇంచుమించు, సుమారు, దాదాపు
(ఈ) కిరణ్ు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమిస్తాడు. పరీక్షఫలితాలు రాగానే తన కాంక్ష ఫలించిందని సంతోషించాడు.
జవాబు.
కోరిక, ఆకాంక్ష, కాంక్ష.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను విడదీయండి. సంధులను గుర్తించండి.
(అ) మొదలయ్యింది = మొదలు + అయింది (ఉత్వసంధి)
(ఆ) మేల్కొల్పాడంటే = మేల్కొల్పాడు + అంటే (ఉత్వసంధి)
(ఇ) ఉంటుందని = ఉంటుంది + అని (ఇత్వసంధి)
(ఈ) నాకిప్పటికీ = నాకున్ + ఇప్పటికీ (ఉత్వసంధి)
(ఉ) నైపుణ్యముందో = నైపుణ్యము + ఉందో (ఉత్వసంధి)
2. కింది వాక్యాలు చదవండి. గీతగీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి. రాయండి.
ఉదా : (అ) ఆదిత్య మంచి బాలుడు. (ప్రథమావిభక్తి)
(ఆ) సూర్యనారాయణశాస్త్రిగారితో నడిచాను. (తృతీయావిభక్తి)
(ఇ) ఆయనను ఒప్పించలేకపోయాను. (ద్వితీయావిభక్తి)
(ఈ) ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. (చతుర్థీవిభక్తి)
(ఉ) గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది. (షష్ఠీవిభక్తి)
(ఊ) చెరువులయందు ఉన్న తామరలు సౌందర్యాన్నిస్తాయి. (సప్తమీవిభక్తి)
(ఋ) ఓ బాలలారా! కలలు కనండి.
ప్రాజెక్టు పని:
1. మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెట్లా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుక్కొన్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు.
నాకు నచ్చిన శాస్త్రవేత్త, కనుక్కొన్న విషయాలు : వ్యాసం ఢిల్లీలో జంతర్మంతర్ గురించి తెలియని వాళ్ళుండరు. ఇది అద్భుతమైన నిర్మాణం. దీని నిర్మాణం 17వ శతాబ్దిలో జరిగింది. దీని సృష్టికర్త రాజపుత్రరాజు జయసింహుడు. మొగల్ రాజు ఔరంగజేబుకు పరమ మిత్రుడు. జయసింహుడికి శాస్త్రీయ దృక్పథం ఏర్పడడానికి కారణం ఒక మహమ్మదీయ వనిత అని చెబుతారు.
ఆమె ఒక వెన్నెల రాత్రి కోట పై భాగన ఆయనతో విహారం చేస్తూ “చంద్రుడికీ మనకూ ఎంత దూరం? చంద్రుడు, సూర్యుడు, భూమి, నక్షత్రాలు- వీటి మధ్య గల సంబంధం ఎలాంటిది?” అని అడిగిందట. ఏదో ఉబుసుపోకకు అడిగిన ప్రశ్నే అయినా జయసింహుడిలో ఆలోచన రేకెత్తించింది. ఆయనలో నిద్రపోతున్న శాస్త్రజ్ఞుణ్ణి మేలు కొలిపింది.
పర్షియన్ అరబిక్ యూరోపియన్ భాషలలో ఉన్న ఖగోళ గణిత గ్రంథాలన్నీ సమగ్రంగా చదివాడు. యూరప్ న్నుంచి టెలిస్కోప్ తెప్పించాడు. స్వయంగా వాటిని రూపొందించడం మొదలుపెట్టాడు. భూభ్రమణ విధానం, భూమి వాలి ఉన్న స్థితి- వాటి కారణాలుగా దొర్లిన లోపాలు సరిచేసి మహమ్మదీయ, హిందూ పర్వదినాలను కచ్చితంగా నిర్ణయించాడు. ఈ పరిశీలనలన్నీ ‘బిజ్ మహమ్మద్ షాహి’ అనే గ్రంథంగా వెలువరించాడు.
ఖగోళ నిర్మాణాలను నిశితంగా పరిశీలించడానికే ఈయన జంతర్ మంతర్లను ఢిల్లీ, జైపూర్, వారణాసి, ఉజ్జయినీ నగరాల్లో నిర్మించాడు. ఈ జంతర్ మంతర్ల గురించి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు చర్చించుకుంటూనే ఉన్నారంటే జయసింహుని శాస్త్రపరిజ్ఞానం లోతేమిటో మనకు అర్థమౌతుంది. ఆయన రూపొందించిన యంత్రాలలో సమ్రాట్ంత్ర, రాయతంత్ర, జయప్రకాశ్ చెప్పుకోదగ్గవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి