బాల వ్యాకరణం చదవండి.
*తెలుగు వ్యాకరణము*
*సులభ భాషలో తెలుగు వ్యాకరణం-4*
〰〰〰〰〰〰〰
*5. ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.*
☛☛☛☛☛☛☛☛☛☛☛
*[ప్రౌఢవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం సూత్రం - 1]*
☛☛☛☛☛☛☛☛☛☛☛
ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు.
ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః క ఖ గ ఘ ఙ చ ౘ ఛ జ ౙ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ
*పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం ఆవిర్భవించిన తరువాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ప్రౌఢవ్యాకరణం అని మరొక వ్యాకరణగ్రంథం వ్రాసారు. బాల వ్యాకరణంలో కొన్ని విషయాలలో అసమగ్రత ఉన్నదని భావించి ఆ లోటుపాట్లను పూర్తిచేయటానికి బహుజనపల్లివారు ప్రౌఢవ్యాకరణం వ్రాసారు. మనం వీలైన చోట్ల ఈ వ్యాకరణగ్రంథం నుండి కూడా నేర్చుకుందాం.*
*ఈ ప్రౌఢవ్యాకరణం లోని సూత్రం బాలవ్యాకరణం సంజ్ఞాపరిఛ్ఛేదంలో ఉన్న మూడవ, నాలుగవ సూత్రాల సమాహారం. అంటే ఆ సూత్రాల కలగలుపు అన్న మాట. మొత్తం వర్ణమాలను ఇక్కడ పట్టిల రూపంలో చూడండి.*
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ*
*ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః* --
*క ఖ గ ఘ ఙ*
*చ ౘ ఛ జ ౙ ఝ ఞ*
*ట ఠ డ ఢ ణ*
*త థ ద ధ న*
*ప ఫ బ భ మ*
*య ర ల వ శ ష స హ ళ*
*ఈ పట్టిక ప్రకారం తెలుగులో అచ్చులు 19. హల్లులు 25 +2 +9 = 36*
*అచ్చులూ హల్లులూ కలిపి మొత్తం వర్ణాలు 19 + 36 = 55*
*ఈ సూత్రానికి బహుజనపల్లివారి వివరణ ఈ విధంగా ఉంది.*
1. *ౡకార గ్రహణము సంస్కృత ప్రాకృత భాషా వ్య్తాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్ర శాస్త్ర ప్రసిధ్ధము..*
2. *యవలల వలె రేఫంబును ప్రయత్నభేదంబుచే ద్వివిధంబు గాన శబ్దశాసనాదులచేత నలఘురేఫము వర్ణాంతరముగా గ్రహింపబడదయ్యె.*
3. *క్షకారము సంస్కృతవ్యాకరణముల యందును, నిఘంటువుల యందును, షాంతపద మధ్యమునందుఁ బఠింపఁబడుటం జేసి యది వర్ణాంతరము గాదు;* *సంయుక్తాక్షరమని తెలియవలయు.*
*మనం క్రిందటి టపాలోనే ఈ క్రింద చెప్పిన మాటలు చదువుకున్నాం.*
*ౡ అనే ఏకాక్షరశబ్దం సంస్కృతంలో ఉంది కాని తెలుగులో లేదు. ఐటె దీనిని తెలుగు వర్ణమాలలో ఎందుకు చేర్చుకున్నట్లు అన్న ప్రశ్న వస్తుంది తప్పకుండా. ఈ ౡకారము సంసృత వ్యాకరణంలో ఉంది. ప్రాకృత వ్యాకరణం లోనూఉంది. ఈ వర్ణం కేవలం మంత్రశాస్త్రంలో తప్ప ప్రయోగంలో లేదు. అక్కడ అవసరం కాబట్టి సంస్కృతవర్ణమాలలో ఉంది. కవులు కావ్యారంభంలో మాతృకాపూజచేయటానికి ఈశాన్యమూలను వ్రాయవలసిన అచ్చుల సమామ్నయంలో ఈ వర్ణమూ ఉంది కాబట్టి దీనికి సంస్కృతంలో ఉన్నట్లే తెలుగులో కూడా ఒక అక్షరరూపం ఇవ్వవలసి వచ్చింది. అంతకంటే ఈ వర్ణానికి విశేషప్రయోజనం ఏమీ లేదు.*
*య ర ల వ లను గురించి లఘువులూ అలఘువులూ అని రెండు రకాలున్నాయి. వీటి గురించి బాలవ్యాకరణం 18వ సూత్రంలో వస్తుంది. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వర్ణమాలలో శకటరేఫం అంటే నండి ఱ చేర్చలేదు. ఇది సూరి గారు కొత్తగా చేసిన వర్గీకరణం కాదు. నన్నయగారు చేసినదే.*
*క్షకారం ఒక వర్ణం కాదు. సంయుక్తాక్షరం. బహుజనపల్లివారు క్షకారం ఎందుకు ప్రత్యేకమైన వర్ణంగా వర్ణమాలలో చేరదో చెప్పారు. (క్షకారం వర్ణమాలలో ఉందనే వాదన కూడా ఉంది.)*
*వర్ణమాలలోని కొన్ని అక్షరాల గురించి విడిగా ఒక టపాలో చదువుకుందాం. ప్రస్తుతానికి వర్ణమాల ఎలా ఉన్నదని వ్యాకరణం చెబుతున్నదీ తెలుసుకుంటే చాలు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి