చదవండి ఆలోచించి చెప్పండి
గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తిడిని చేశాడు.
ప్రశ్నలు:
1.కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.గోల్కొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉన్న వ్యక్తే కంచర్ల గోపన్న.
2. అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జ.ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడని, సీతారాములకు విలువైన నగలు చేయించాడని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే అభియోగం ఉంది.
3. గోపన్న ఎట్లా బంధవిముక్తుడయ్యాడు ?
జ.శ్రీరాముడే స్వయంగా మారువేషంలో తానాషా వద్దకు వచ్చి, గోపన్న చెల్లించాల్సిన డబ్బును చెల్లించాడు. దాంతో గోపన్నకు బంధవిముక్తి కలిగింది.
4.గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జ. గోపన్న వంటి భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, తుకారాం వంటి వారి గురించి తెలుసు. వారంతా భగవంతుని సేవలో తరించారు.
ఆలోచించండి – చెప్పండి:
1.‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి’ అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జ. .కల్పవృక్షం, మేరుపర్వతం, కామధేనువు, చింతామణి వంటివి దగ్గర ఉంటే తరగని సంపదలను అనుగ్రహిస్తాయి. అవి దగ్గరుండగా పరులధనముతో పని ఏమి ? పరమేశ్వరుని యందు భక్తి ఉంటే సకల సంపదలు కలుగుతాయని కవి ఆశయం.
2. ‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జ. భక్తుడు తాను నమ్మిన దైవమునందే నిశ్చలమైన భక్తి కలిగి ఉంటాడు. భగవంతుడే భక్తునికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడే అండగా ఉండగా ఇతరుల ధనాన్ని ఎట్లా ఆశిస్తాడు ? ఎన్నటికి ఆశింపడని భావం.
ఆలోచించండి- చెప్పండి:
1.శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జ. లోకంలో చిలుక, హంస, చకోరం, తుమ్మెద మొదలైనవి శ్రేష్ఠమైన వాటినే ఆశ్రయిస్తాయిగాని అల్పములైన వాటిని ఆశ్రయింపవు. అట్లే శివభక్తులు కూడా ఉన్నతంగా ఉంటారేగాని అల్పములైన వాటిని కోరరు. అందుకే కవి శివభక్తులను పైవాటితో పోల్చాడు.
ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జ. ప్రజలు పన్నుల ద్వారా ధనం చెల్లిస్తేనే రాజు దగ్గర ధనం ఉంటుంది. అది రాజు సంపాదించింది కాదు. అది పరుల ధనమే. అందుకే భక్తుడు ఆ ధనాన్ని పరులకే ఇస్తున్నానని చెప్పాడు.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
1.“అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” – దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జ. భక్తులు భగవంతునియందే అచంచలమైన భక్తిని కల్గియుంటారు. భక్తులకు భగవంతుని సేవే ధనం. పేదవానిలో కూడా భక్తులు భగవంతుడిని దర్శిస్తారు. వారికి ఏనాడు ధనాశ ఉండదు. తనకున్న సంపదనంతా దైవానికి అర్పిస్తారు. మనసా, వాచా, కర్మణా దైవసాన్నిధ్యాన్నే కోరుతారు.
రఘుమహారాజు లాంటి మహారాజులు విశ్వజిత యాగాన్ని చేసి సంపదనంతా త్యాగం చేశారు. పోతన వంటి భగవత్ భక్తులు ఏనాడు ధనాశకు లోనుకాలేదు. జీవితాంతం భగవంతుడినే సేవించారు. ఈ రకంగా భగవత్ భక్తులు ఎన్నడునూ ధనాశకు లోను కారని తెలుస్తున్నది.
2.ద్విపదను రాగయుక్తంగా పాడండ.
జ.
3.బండారి బసవన్న
జ.ద్విపదకు రెండే పాదాలు ఉంటాయి. పద్యాలవలె నాలుగు పాదాలు ఉండవు. పాడుటకు వీలుగా ఉంటాయి. -ఉపాధ్యాయుని శిక్షణలో చక్కని రాగంతో పాడేలా ప్రయత్నించండి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.
అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జ.బిజ్జలుడు బసవన్నను పిలిపించి ఖజానా ఖాళీ చేస్తున్నందుకు మందలించాడు. తన ధనాన్ని తనకు అప్పగించి వెళ్ళమని బిజ్జలుడు బసవన్నను హెచ్చరించుచున్న సందర్భంలోని వాక్యమిది.
ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?.
జవాబు.ఈ వాక్యం బసవన్న రాజుతో పలుకుచున్న సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని ఎన్నడునూ ఆశింపనని, ఉన్నతంగా జీవిస్తానని, తామరపూల సువాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను కోరదు కదా ! అని చెప్పాడు.
ఇ) సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా ?
జ.ఈ వాక్యాన్ని బసవన్న రాజుతో పలికిన సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని కోరనని, ఆ అవసరం కూడా లేదని, సింహం ఎక్కడ గడ్డి మేయదని ఉదాహరణగా చెప్పిన సందర్భంలోనిది.
2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
అ) ఖరము =గాడిద
ఆ) కూడు =తిండి
ఇ) గంగిగోవు పాలను ____భక్తి_____ తో పోల్చాడు. జ.
ఈ) ఈ పద్యాన్ని _____వేమన____ రాశాడు.
ఉ) ఈ పద్యం ___వేమన______ శతకంలోనిది.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) బంధారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జ. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. అతనికి శివుణ్ణి మించిన దైవం లేదు. లోకంలో శివభక్తే శాశ్వతమైందని నమ్మేవాడు. శివునియందు భక్తి ప్రపత్తులను కల్గియుంటే సకల సంపదలను అనుగ్రహిస్తాడనే విశ్వాసం కలవాడు. ఇతరుల ధనమును ఆశింపనివాడు. తన నిజాయితీని నిరూపించుకోవడా ‘నికి వెనుకాడని భక్తశిఖామణి. ఈ లోకంలో భక్తి మాత్రమే శాశ్వతమైందని నమ్మిన గొప్ప శివభక్తుడు. దేనికీ, ఎవరికీ చలింపని ధీరగుణసంపన్నుడు.
ఆ) బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు ?
జ. మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ. అందులోను నిజాయితీగాను, నిర్భయంగాను మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. నిర్భయంగా మాట్లాడే వానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తాను జీవితంలో తప్పుచేయకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించకపోవడం లేదా దొంగిలించకపోవడం, ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కల్గి ఉండడం. ఇటువంటి లక్షణాలు కలిగినవాడు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలుగుతాడు.
ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
జ. భక్తుడు ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటాడు. భగవంతుని మీద తనకు గల భక్తినే సంపదగా గుర్తిస్తాడు. భక్తినే కల్పవృక్షంగాను, కామధేనువుగాను, చింతామణిగాను భావిస్తాడు. ఇతరుల ధనాన్ని ఎన్నటికీ ఆశింపడు. పరుల సంపదను పాములాగా చూస్తాడు. భక్తినే తగిన ధనంగా తలచుకొని జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా జీవిస్తాడు.
ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి ?
జ. పాలసముద్రంలో క్రీడించే హంస మడుగుల్లోని నీరు త్రాగడానికి ఇష్టపడదు. నిశ్చలమైన భక్తి గల భక్తునికి భక్తి మాత్రమే ధనం. దేవుడుంటే సర్వస్వం ఉంటాయాని నమ్మకం. భగవంతునిపట్ల భక్తిని కల్పవృక్షంగాను, చింతామణిగాను, కామధేనువుగాను భావిస్తారు.
అట్లే భక్తుడు కూడా ఉన్నతమైన భక్తిని ఆశ్రయిస్తాడుగాని అల్పమైన పరుల ధనాన్ని ఆశించడు. హంస చెడును వదిలి మంచిని స్వీకరించినట్లు నమ్మకం గల భక్తుడు హంస లాంటివాడు. జీవితంలో ఉన్నతంగానే జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. పరుల ధనవ్యామోహం ఉండదని అర్థం.
2.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
జ. భగవంతునిపైగల నిశ్చలమైన ప్రేమకే ‘భక్తి’ అని పేరు. ఇది నిష్కల్మషంగా ఉంటుంది. తోటివారికి ఆదర్శంగా ఉంటుంది. భక్తుడు భగవంతుని సేవ చేస్తాడు. భగవంతుని సేవలో తారతమ్యాలు ఉండవు. సంపదలు, చదువు, వైభవము మొదలైనవి భక్తి మార్గంలో కనిపించవు. నిజమైన భక్తునికి కొన్ని మహోన్నతమైన లక్షణాలు ఉంటాయి. వాటిలో కొన్ని –
- అన్ని ప్రాణులయందు దయ కలిగి ఉండడం.
- ఎవ్వరినీ, ఏదీ, ఎప్పుడూ యాచింపకుండడం.
- నాది, నావాళ్ళు అనే మమకారం వీడి, మనది అనే విశాల భావనను కల్గి ఉండడం.
- మానవసేవే మాధవసేవగా భావించి పేదలయందు భగవంతుడిని దర్శించి, వారిని సేవించడం.
- ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మహిళలను గౌరవభావంతో చూడగలగడం.
- దానధర్మాన్ని తాను ఆచరించడం. తన సమాజానికి అంకితభావంతో సేవ చేయడం.
- పరిపూర్ణమైన భక్తిని, జ్ఞానమును పొందగలగడం.
- ఎవ్వరినీ ద్వేషింపకుండడం; చేసే ప్రతి పనిని భగవంతునికే అర్పిస్తూ చేయండి.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జ.
బసవన్న : మహారాజా ! మీకు ఇవే నా నమస్కారాలు. మీకు అన్నింట జయం కలుగుగాక.
రాజు : బసవన్నా ! నీకు ఇది తగునా ! ఇంతటి అధర్మానికి పాల్పడతావా !
బసవన్న : రాజా ! నేనేమి చేశాను. నాకు తెలిసి ఏ పాపం చేయదు.
రాజు : బసవన్నా ! నీవు బుకాయించకు. మా ధనాన్ని నాకు అప్పగించి వెళ్ళు.. ఇక నీ ప్రధాని పదవిచాలు. నన్ను ఎవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. పరుల ధనాన్ని అపహరింపదలచావు. ఇది నీకు తగునా ? ఇతరుల ధనాన్ని తీసుకోనని ప్రతిజ్ఞ చేశావు. ఇది నీకు తెలియదా ? ఇక ఇన్ని మాటలు ఎందుకు ? మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళు.
బసవన్న : రాజా ! మీ ఆరోపణల్లో నిజం లేదు. నేను మీ ధనాన్ని అపహరించలేదు. పరమేశ్వరునిపై భక్తి అనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వంటివి నా దగ్గర ఉన్నాయి. అలాంటి నాకు మీ సంపదలతో ఏమవసరం ? పాలసముద్రంలో విహరించే రాజహంస మురికిగుంటలోని నీటిలో విహరించడానికి ఇష్టపడుతుందా ! భగవంతుని ధనాన్ని భగవంతునికే అర్పించాను. నేను అపహరించలేదు. నీవు కాదనుకుంటే ధనాన్ని లెక్కించుకోండి.
రాజు : భటులారా ! బంగారు నాణాలతో కూడిన ఆ పెట్టెలను తీసుకొనిరండి.
భటులు : చిత్తం మహారాజా ! (కొద్దిసేపటి తర్వాత) మహారాజా ! ఇవిగో ఆ పెట్టెలు.
రాజు : ఈ పెట్టెకున్న తాళాలు తీయండి. ధనాన్ని లెక్కించండి. (తెరచిచూస్తారు)
భటులు : మహారాజా ! అద్భుతం ! మహాద్భుతం ! ధనం మొత్తం ఉంది. ఇంకా ఎక్కువగానే ఉంది.
రాజు : బసవన్నా ! నీవు ధన్యుడివి. నీ భక్తికి తిరుగులేదు, నన్ను క్షమించండి.
V. పదజాల వినియోగం:
1.గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.
అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం
ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.సింహం
ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.రాజులు
2.కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
అ) ఆశ్చర్యం | ఎ) బత్తి |
ఆ) భక్తి | బి) దెస |
ఇ) దిశ | సి) పుడమి |
ఈ) పృథ్వి | డి) అచ్చెరువు |
అ) డి
ఆ) ఎ
ఇ) బి
ఈ) సి
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1.కింది పట్టికను పూరించండి.
జవాబు.
సంధి పదం-విడదీసి రాయండి.-సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
1. కనకాచలం = కనక + అచలం – సవర్ణదీర్ఘ సంధి
2. క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
3. నాకొక = నాకు + ఒక – ఉత్వసంధి
4. కాదేని = కాదు + ఏని = ఉత్వసంధి
5. అతనికిచ్చెను = అతనికి + ఇచ్చెను – ఇకారసంధి
6. పుట్టినిల్లు = పుట్టిన + ಇಲ್ಲು – అత్వసంధి
7. ఏమిటిది = ఏమిటి + ఇది – ఇత్వ సంధి
8. నాయనమ్మ = నాయన + అమ్మ – అత్వసంధి
గుణసంధి:
2. కింది పదాలను విడదీయండి.
ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)
ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)
పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”
- ‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’. - ”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
- ‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి