vi. 4. లేఖ
లేఖా రచనను పరిచయం చేస్తూ తెలంగాణాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం “లేఖారచన” ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలుంటాయి.
_______________________________________________________________________
ప్రవేశిక
వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధోవికాసానికి బాటలు వేస్తుంది. మానసిక చైతన్యాన్ని కల్గిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువల్ల అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖా రూపంలో ఉన్న ఈ పాఠం చదువండి.
_______________________________________________________________________
I
వేముల,
10.10.2014.
ప్రియమైన లలితకు,
లలితా! ఎట్లున్నవు? నేను ఇక్కడ మంచిగున్న, ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడిపిల్లలం అందరం సంబురంగ విహారయాత్రకు పోయి వచ్చినం. అక్కడ మేం చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్న.
సెలవుల మొదటిరోజే యాత్రకు అన్నీ తయారు చేసుకొని సాయంత్రం బడికి చేరుకున్నం. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది. రాత్రి భోజనం చేసి అందరం వరుసగ బస్సు ఎక్కినం. నేను కిటికీ పక్కన కూర్చున్న. మా అమ్మానాయినలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులోనే నిద్రపోయినం. తెల్లారేసరికి నాగార్జునసాగర్ చేరుకున్నం.
బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. అందరం స్నానంచేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడటానికి పోయినం. అబ్బ ఎన్ని నీళ్ళో!... పెద్ద సముద్రం వలె కనిపించింది... చూడటానికి రెండు కండ్లూ చాలలేదు. చెప్పలేని ఆనందం వేసింది. డ్యాం చాల పొడవుగ ఉన్నది.
ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా! అని ఆశ్చర్యం వేసింది. అక్కడే ఫలాహారం తిని స్టీమరుమీద నాగార్జునకొండ చూడటానికి పోయినం. నీళ్ళపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబురంగ ఉండెనో! స్టీమరు నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరలు నామీద పడి శరీరం ఝల్లుమన్నది. చుట్టూ ఎటు చూసినా నీళ్ళే! అటూ ఇటూ ఎత్తైన కొండలు. మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందేకాని చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమరు ఒడ్డుకు చేరింది. ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగనే అందరి కేకలతోటి ఆ ప్రాంతమంత మారుమోగింది. మేమందరం కొండను ఎక్కి చూస్తే అక్కడ విశాలంగ ఉన్న పార్కు కనిపించింది. ఎన్నోరకాల అందమైన పూలమొక్కలు కనిపించినయి. ఆ పార్కు,ఖండాలను, వస్తువులను చూసినం, కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమరులో తిరుగు ప్రయాణం అయినం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలు దేరినం.
మధ్యలోనుండి కొద్దిదూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించినయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధమతానికి చెందిన ఎన్నో కళా ఖండాలను వస్తువులను చూసినం కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరిగి ప్రయాణం అయినం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్ కు బయలుదేరినం.
ఆలోచించండి-చెప్పండి.
శైలజకు తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పి ఉంటారో ఊహించి చెప్పండి.
ఇంత గొప్ప నిర్మాణం ఎట్లా కట్టారా! అనడం వెనుక అంతర్యం ఏమిటి?
II
తెల్లారేసరికి, హనుమకొండ చేరుకున్నం. అక్కడ ముందుగ వేయిస్తంభాల గుడికి పోయినం. గుడి చాలావరకు శిథిలమైంది.. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినయి. అయినా ఆ అద్భుతమైన కట్టడాలు ఎంత ముద్దుగున్నయో! అక్కడ పెద్ద
నందివిగ్రహం, శివలింగం ఉన్నయి. అటుతర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నం. అక్కడ స్వయంభూదేవాలయం, ఖుష్మహల్, నాట్యమండపం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు కనిపించినయి. ఎంత బాగున్నయో! అవన్నీ చూస్తుంటే ఇంత అందంగ రాతిశిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి.
ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అనీ శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందనీ ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందనీ చెప్పారు. ఆ కోటంతా కలియ తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్ములను మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నమా! అని అనిపించింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని 'శిలాతోరణం' కనిపించింది. అది ఎంత బాగున్నదో! కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోటనుంచి నాకు రాబుద్దికాలేదు. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలో తయారుచేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించినయి. వాటిని చూసి అక్కడినుండి బయలుదేరినం.
రామప్ప దేవాలయం చేరుకున్నం. ఆ గుడిని గణపతిదేవుని సేనాని రేచర్లరుద్రుడు కట్టించిండట! ఇక్కడున్న శిల్పాలు ఎంతో అందంగా ఉన్నయి. ఆ శిల్పాలు మరిచిపోలేని అనుభూతిని కలిగించినయి. అక్కడొక పెద్ద నందివిగ్రహం ఉన్నది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు అనిపిస్తుంది. అదే దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసల విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చినయి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కలిగించింది. అక్కడి నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నం. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్ళు తియ్యగున్నయి. ఆరాత్రి అక్కడనే ఉండి తెల్లారుజామున కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్టకు పోయినం.
తెలుగు భాషకు కీర్తిప్రతిష్ఠలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలున్న శాసనాల్ని చూసినం. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. ఈ పద్యాల ఆధారంగనే మన తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిందట. అక్కడి నుండి సింగరేణి బొగ్గుగనులు చూడటానికి పోయినం. ఆ పరిసరాలను
చూస్తుంటే 'సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం' అన్న పాట గుర్తుకొచ్చింది. మేమందరం అక్కడున్న బొగ్గుబావులను చూసినం, అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నం. వీరి కష్టం మన ఇండ్లలో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నం. అక్కడినుంచి బయలుదేరి శాతవాహనుల రాజధానియైన కోటిలింగాల చేరుకున్నం.
చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుకరేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించు కున్నం. శాతవాహన వంశపు తొలిరాజు- శ్రీముఖుని నాణెములు అక్కడ దొరికినయట. ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాదుకు పోయినం.
_______________________________________________________________________
ఆలోచించండి చెప్పండి
ఆనాటి విగ్రహాలకు శిలలను వాడినారు కదా! మరి ఈరోజుల్లో విగ్రహాల తయారీకి వేటిని వాడుతున్నారు?
'సింగరేణి కార్మికుల కష్టం మన ఇండ్లకు కాంతిగా మారింది' అంటే మీకేమి అర్థమైంది?
_______________________________________________________________________
III
ఎప్పటినుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగ ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలెన్నో ఉన్నయి. మొదట మేము చార్మినార్కు చేరుకున్నం. ఆనాటి రాజు కులీకుతుబ్షా ప్లేగువ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించిండట. అద్భుతమైన వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. నాలుగుదిక్కుల నాలుగు గోపురాలున్నయి. వాటినే మినార్లు అంటరని తెలిసింది. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ
వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉన్నది. తరువాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినం. అక్కడ ప్రాచీన
వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నింటినో భద్రపరిచారు. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాలలో వాటి వివరాలు రాసుకున్నం. అక్కడున్న వాటన్నింటిలో తలుపుతీసి గంటకొట్టే గడియారం బొమ్మ చాలాబాగుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని పించింది. ఆ తరువాత గోలుకొండ కోటకు పోయినం. కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లుకొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం చాలా గమ్మత్తనిపించే ముచ్చట.
అక్కడి నుంచి హుస్సేన్సాగర్కు
చేరుకున్నం. వినాయకచవితి విగ్రహాల
నిమజ్జనోత్సవం ఇక్కడనే జరగడం మనం
టీవీల్లో చూస్తం కదా! ట్యాంక్ బండ్ మీద
నిలబడి అక్కడి అందాలను చూసినం. అక్కడ
ఎందరో మహనీయుల విగ్రహాలున్నయి.
చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన
డైరీలో
చిరునా Bom
36
ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. ఆ సాయంత్రం బిర్లా మందిర్కు పోయినం. అది పాలరాతితో కట్టిన వేంకటేశ్వరుని గుడి. ధగధగ మెరిసే విద్య్యు దీపాలతో వెలిగిపోతున్నది. అక్కడినుంచి చూస్తే మిలమిల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆతర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు బయలుదేరినం.
ఉదయం తొమ్మిది గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నం. కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పదనం తెలుసుకోవాలని అనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదట. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ మట్టికోటను కట్టించిండట. కోట లోవల చెన్నకేశవస్వామి గుడి ఉన్నది. గుడిముందర 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకొంటున్నది. చినసోమభూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ (ఎనిమిది మంది) కవులు ఉండేవారట.
కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రంవరకు పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రికి చేరుకున్నం. అక్కడ మర్రిచెట్టు దాదాపు మా ఊరంత పెద్దగున్నది. ఆ చెట్టుకింద తిని అక్కడున్న జింకలపార్కు, ఎక్వేరియం, మ్యూజియం లను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినం.
ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగుండనిపించింది. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్న. యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్న. తప్పక చూడగలవు. అమ్మనాయినలకు నమస్కారాలు తెలుపగలవు. ఉంటా మరి...
చిరునామా:
కె. లలిత
6వ తరగతి, జి.ప. ఉ. పాఠశాల, రంగాపురం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ - 501 508.
ఇట్లునీ ప్రియమిత్రురాలు,
ఎస్.శైలజ
_______________________________________________________________________
ఆలోచించండి-చెప్పండి.
ప్రాచీన వస్తువులు భద్రపరచడం వల్ల కలిగే ఉపయోగాలేమిటి?
మధుర జ్ఞాపకాలను డైరీలలో ఎందుకు రాస్తారు?
యాత్ర ముగించుకొని ఇంటికి వస్తుంటే శైలజకు ఎందుకు బాధ కలిగియుండవచ్చు?
__________________________________________________________________________________________
ఇవి చేయండి.
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. హైదరాబాద్, వరంగల్ వంటి దర్శనీయ స్థలాల గురించి తెలుసుకున్నారు కదా! మరి మీ ప్రాంతంలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి చెప్పండి.
జవాబు.
మాది సిద్దిపేట జిల్లా. సిద్దిపేటలోని కోమటి చెరువు, కోటిలింగాల దేవాలయము, అనంతసాగర్ సరస్వతీ క్షేత్రము, వర్గల్ సరస్వతి క్షేత్రము, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం, సింగరాయ లొద్ది, పుల్లూరు నరసింహస్వామి దేవాలయం, కూడవెల్లివాగు శనిగరం చెరువు మొదలైనవి సిద్దిపేట జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం1. కింది వాక్యాలు చదివి వాటికి సంబంధించిన స్థలాల పేర్లను పాఠంలో వెతికి రాయండి.
అ. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా! అని ఆశ్చర్యం వేసింది.
జవాబు.ఇది నాగార్జునసాగర్కకు సంబంధించినది. సాగర్ ఆనకట్ట నిర్మాణం గురించి చెప్పిన మాటలు.
ఆ. తొలి కందపద్యాలు ఇక్కడ శిలపై చెక్కబడి ఉన్నవి.
జవాబు.బొమ్మల గుట్ట గురించి చెప్పిన సందర్భంలో చెప్పిన విషయాలు.
ఇ. మమ్మల్ని మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా! అని అనిపించింది.
జవాబు.వరంగల్ కోట.
ఈ. అక్కడున్న బొగ్గు బావులను చూసినం.
జవాబు.సింగరేణి బొగ్గు గనులు.
ఉ. అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు.
జవాబు.చార్మినార్ గురించి.
2. కింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. “విజ్ఞానయాత్రల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంది.” దీనిని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
విద్యార్ధులలో విజ్ఞానాన్ని పెంపొందించుటకు విజ్ఞాన యాత్రలు తోడ్పడతాయని లేఖ పాఠం ఆధారంగా రాయండి.
జవాబు.
విజ్ఞానం కొరకు చేసే యాత్రలు విజ్ఞానయాత్రలు :
అనేక ప్రదేశాలు తిరగటం వల్ల విషయావగాహన పెరుగుతుంది.
ఆయా ప్రదేశాలలోని భాష, అక్కడి ప్రజల ఆచారాలు, ఆహార అలవాట్లు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి.
చారిత్రక విషయాలు అవగతం అవుతాయి.
నిర్మాణాలు, కట్టడాలవల్ల ఆనాటి వాస్తు, శిల్పకళ మున్నగు విషయాలు తెలుస్తాయి.
ఆనాటి పండుగలు, జన జీవనం తేటతెల్లం అవుతాయి.
నదులు’ వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తాయి.
దేవాలయాలలో వాస్తుకళ, సాంకేతిక పరిజ్ఞానం, కట్టడ నిర్మాణాలు (తెలుస్తాయి) ప్రత్యక్షంగా దర్శిస్తారు.
పాతకాలం నాటి నీరుపారుదల విధానం, చెరువుల నిర్మాణం సాగు, తాగునీటి విధానాలు తెలుస్తాయి.
క్రమశిక్షణ పెరుగుతుంది. స్నేహభావం, సోదర భావం, సర్దుబాటు ధోరణి పెరుగుతాయి.
III.స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ఉత్తరాల ద్వారానే కాకుండా నేటికాలంలో సమాచారాన్ని పంపడానికి వేటిని ఉపయోగిస్తున్నారు?
జ. నేటి కాలంలో సమాచారాన్ని పంపడానికి ఫోన్ సంభాషణ చేయుచున్నాము. ఈ మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్. ఇంస్టా,ఎక్స్ సామొదలమాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంపుచున్నాము.
.
ఆ) యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏయే జాగ్రత్తలు పాటించాలి?
జ. యాత్రలకు వెళ్ళేటప్పుడు సరిపడే దుస్తులు. పేస్టు, బ్రష్, కాస్ట్యూమ్స్ (నూనె, దువ్వెన, పేస్ పౌడర్, రబ్బర్లు) మరియు దుప్పట, బ్యాగు, చాలినంత డబ్బు ముందస్తు చర్యగా అవసరమైన ఔషధాలు తీసుకువెళ్లాలి.
ఇ. పురాతన కట్టడాలు, నదులు, దేవాలయాలు మొదలైనవాటిని చూడటానికి పోయినపుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఎందుకు?
జ. వినోదం వెంట విషాదం ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలకు అపాయం జరగవచ్చు. పురాతన కట్టడాల పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడం వల్ల జారి పడవచ్చు. లోపలికి వెళితే విష పురుగులకు బలి కావచ్చు. నదుల పక్కనుండి వెళితే కళ్ళు తిరిగి అందులో పడిపోవచ్చు. లోతు తెలియకుండా నీళ్లలోకి దిగితే నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా కొట్టుకొని పోవచ్చు. దేవాలయాల వద్దకు వెళ్ళినప్పుడు భక్తి భావంతో ఉండాలి. కొన్ని ప్రదేశాల్లో అనుమతి లేని చోట్ల ఫోటోలు వీడియోలు తీసినట్లైతే అరెస్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి అన్నిచోట్ల తగు జాగ్రత్తలతో ఉన్నప్పుడే వినోదం ఎల్లప్పుడూ జ్ఞాపకంగా ఉంటుంది లేదంటే విషాదంగా మిగిలిపోతుంది.
ఈ. శైలజకు యాత్ర ఇంకొన్ని రోజులుంటే బాగుండు అని ఎందుకు అనిపించింది?
జ. శైలజ కు యాత్ర ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండును అని అనిపించిన మాట వాస్తవం. ఆయా ప్రదేశాలను సందర్శించినప్పుడు కలిగే గొప్ప అనుభూతి, ఆనందంతోపాటు మానసిక ఉల్లాసం కలిగింది అందుకే శైలజ యాత్ర ఇంకొన్ని రోజులు ఉండాలని కోరుకుంది.
2 కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
'విజ్ఞానయాత్రల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంది' దీనిని సమర్థిస్తూ రాయండి.
జ. విజ్ఞాన యాత్రల వల్ల విద్యార్థులలో విజ్ఞానం పెంపొందుతుంది. ఆయా ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడి స్థానీయ చరిత్ర అవగతం అవుతుంది. ఆ కట్టడాల నైపుణ్యము తెలిసిపోతుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వల్ల చదివిన అంశానికి అనుగుణంగా స్పష్టత ఏర్పడుతుంది
IV. సృజనాత్మకత/ప్రశంస
మీరు చూసిన యాత్రా విశేషాలను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
సిద్దిపేట,
దివి. x x x x x x.
ప్రియమైన స్నేహితురాలు సాయిశృతికి,
నీ మిత్రురాలు రాయునది. నేను క్షేమం. ఈ మధ్య మా పాఠశాల విద్యార్థులను మా ‘సార్లు’ భద్రాచలం తీసుకువెళ్ళారు. భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి రామాలయం చాలా ప్రసిద్ధి పొందింది. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న దీనిని నిర్మించాడు. చుట్టూ దండకారణ్యం ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పర్ణశాల ఉన్నది. భద్రగిరిపై నిర్మించబడిన దేవాలయం ఇది. జటాయువుపాక, దమ్ముగూడెం, శబరిగిరి మొదలైనవి దర్శనీయ స్థలాలు. ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మేమందరం గోదావరిలో స్నానం చేసి, అన్నీ చూసి వచ్చాము. అక్కడి వాతావరణం ఎంతో బాగుంది. నీవు చూసిన యాత్రను గురించి రాయకోర్తాను.
ఇట్లు,నీ ప్రియ మిత్రురాలు,బి. శ్రావ్య,సిద్దిపేట.
చిరునామా :
వి. సాయిశృతి,
6వ తరగతి,
రంగాపురం,
మంచాల మండలం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
V. పదజాల వినియోగం:
1. కింది పదాలు చదువండి. వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి.
అ. గుడి = దేవాలయం, కోవెలఆ. ఆనవాళ్ళు =గుర్తులు, జాడలు, చిహ్నములుఇ. ఆనందం =సంతోషం, హర్షం.ఈ. ప్రథమ =మొదటి, ఆదిఉ. సందర్శించుట =చూచుట
2. కింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ. అనుభూతి
జవాబు.విహారయాత్రలలో పొందే అనుభూతులు మరచిపోలేనివి.
ఆ. ఆకర్షణ
జవాబు.రామప్పగుడిలో నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
ఇ. కమ్మగా
జవాబు.కమ్మగా వండిన గారెలు నోరు ఊరిస్తాయి.
ఈ. జ్ఞాపకం
జవాబు.ఇష్టపడి చదివిన విషయం జ్ఞాపకం ఉండిపోతుంది.
ఉ. దర్శనం
జవాబు.పురాతన కట్టడాలు, ఆలయాల దర్శనం మనసుకు ఆనందం.
ఊ. ప్రాచీనం
జవాబు. గోల్కొండ కోట చాలా ప్రాచీన కట్టడం
ఋ. యాత్ర
జవాబు.మా విహారయాత్ర సుఖంగా సాగింది.
ౠ. మహనీయుడు
జవాబు.గాంధీ వంటి మహనీయుడు పుట్టిన దేశం మనది.
3. కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి.
అ. దుర్గం, కోట, ఖిల్లా, జాగ
జవాబు.జాగ అనేది స్థలం.
(దుర్గం, కోట, ఖిల్లా – పర్యాయపదాలు)
ఆ. గుడి, బడి, దేవాలయం, మందిరం
జవాబు. బడి చదువు నేర్పేది బడి.
గుడి, దేవాలయం, మందిరం – పర్యాయపదాలు
ఇ. శిల, రాయి, దండ, బండ
జవాబు. దండ
ఈ. గాలం, నీరు, జలం, సలిలం
జవాబు. గాలం గాలం చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు.
(నీరు, జలం, సలిలం – పర్యాయపదాలు)
ఉ. కన్ను, నేత్రం, రెప్ప, నయనం
జవాబు.
రెప్ప రెప్ప కంటిలో భాగం. మిగతా
(కన్ను, నేత్రం, నయనం – పర్యాయపదాలు)
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. మీకు తెలిసిన స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలను రాయండి.
అ. స్త్రీలింగ పదాలు
జవాబు. అంజన, గిరిజ, వనజ, లక్ష్మి, హేమ, నాగమణి
ఆ. పుంలింగ పదాలు
జవాబు. వినాయకుడు, చక్రపాణి, విష్ణువు, హరి, చెన్నయ్య, రమణ.
ఇ. నపుంసకలింగ పదాలు
జవాబు. పుస్తకం, గోడ, చెట్టు
విభక్తి ప్రత్యయాలు :
కింది వాక్యాలను గమనించండి.
అ. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి, బతుకమ్మ పండుగ ప్రతీక.
ఆ. హోళి పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఇ. పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.
ఈ. వాణి పూజ కొరకు పూలను కోసింది.
ఉ. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం.
పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదువండి.
ఉదా : పీర్ల ఇత్తడి వెండి తయారుచేస్తారు.
పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తున్నది. ‘పీర్ల ఇత్తడి వెండి’ అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదువండి.
“పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు”. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని “విభక్తి ప్రత్యయాలు” అంటారు.
📦 విభక్తి ప్రత్యయాలు
ప్రత్యయాలు విభక్తి
డు, ము, వు, లు ప్రథమా విభక్తి
ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి ద్వితీయా విభక్తి
చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్) తృతీయా విభక్తి
కొఱకు(న్), కై (కోసం) చతుర్థీ విభక్తి
వలన(న్), కంటె(న్), పట్టి పంచమీ విభక్తి
కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్) షష్ఠీ విభక్తి
అందు(న్), న(న్) సప్తమీ విభక్తి
ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి