సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

25, ఆగస్టు 2023, శుక్రవారం

VIII-4. అసామాన్యులు

పాఠం ఉద్దేశం:

అన్ని వృత్తుల సమష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజసేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తులవారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రక్రియ – వ్యాసం:

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘వ్యాసం’ ఒకటి. చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక మొదలైన రంగాలకు సంబంధించిన అంశాలు వ్యాసంలో చర్చింపబడతాయి. వ్యాసాలు సామాజిక స్పృహను కల్గిస్తాయి. సమాజాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తాయి. వ్యాసంలో విశ్లేషణ ప్రధానంగా ఉంటుంది.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ, శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.

ప్రవేశిక:

శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే! అన్ని వృత్తుల మేలుకలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం !

III స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు’ – అని ఎట్లా చెప్పగలరు ? రాయండి.
జ.
హారం లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబగళ్ళు ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో, ఏమి తినగూడదో, మనకు ఆదివాసులే చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలలో కొందరు ఆదివాసులు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినేముందు, వారు ఆ జంతువులనూ, వాటి ఆహారపు అలవాట్లనూ పరిశీలించారు. తర్వాతనే ఫలానా జంతువు మాంసం తినవచ్చునని వారు తేల్చి చెప్పారు.


కోయలు, గోండులు, చెంచులు వంటి గిరిజనులకు ఉన్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు. ఆదివాసులు కూడా శాస్త్రజ్ఞులే, వారికి రోగాలు వస్తే, చెట్ల మందులతోనే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల ఆదివాసులే గురువులై మనకు మార్గదర్శకులయ్యారు.

ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
జ.
కుమ్మరి వాని చక్రం నుంచి, బంకమట్టి నుంచి, మనం నిత్యం ఉపయోగించే కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, ప్రమిదలు వస్తున్నాయి. మెత్తటి మట్టి, బూడిద లేదా రంపం పొట్టు, సన్న ఇసుకను కలిపి బంకమట్టిని తయారుచేస్తారు. ‘వారు కాళ్ళతో తొక్కి, చెమటోడ్చి సిద్ధం చేసిన బంకమట్టిని కుమ్మరిసారెపై పెడతారు.

కుమ్మరి చక్రం తిప్పుతూ, చక్రం మీద పెట్టిన బంకమట్టిని తన చేతివేళ్ళ కొనలతో నేర్పుగా నొక్కుతాడు. ఆశ్చర్యంగా అనుకున్న రూపాలు వస్తాయి. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతాడు. తర్వాత ‘కుమ్మర ఆవము’లో పెట్టి, బురదమట్టితో కప్పుతాడు. కొలిమిని మండిస్తాడు. వేడి అన్ని పాత్రలకూ సమానంగా అందుతుంది. మట్టి ‘పాత్రలన్నీ కాలి, గట్టిగా తయారవుతాయి.

ఇ) “రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి.
జ.
రైతులు మనకు అన్నదాతలు. రైతు దేశానికి వెన్నెముక. అతనికి కోపం వస్తే మనకు అన్నం దొరకదు. రైతు నడుంవంచి కష్టించి పాడిపంటలు పెంచుతున్నాడు. తాను పస్తులు ఉండి, మన కడుపులు చల్లగా ఉండేటట్లు మనకు రైతు తిండి పెడుతున్నాడు. రైతు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాడు. తాను ఎండకు ఎండినా, వానకు తడిచినా, చలికి వణకినా ధైర్యంతో కష్టపడి, రైతు పంటలు పండించి మన పొట్టలు నింపుతున్నాడు.

మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు అనేవి చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషికి ఫలాలు. రైతులు రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, శ్రమిస్తేనే మనం హాయిగా తింటున్నాము. అందుకే లాల్ బహుదూర్ శాస్త్రిగారు “జై జవాన్, జై కిసాన్” – అన్నారు. కాబట్టి రైతులు మనకు అన్నదాతలు.

ఈ) “దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం” – దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జ.
మన శరీరంలో కళ్లు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు అన్నీ సరిగా పనిచేస్తేనే మన శరీరం పనిచేస్తుంది. శరీరానికి ఈ అవయవాలు అన్నీ ముఖ్యమే. సంఘంలో అనేక వృత్తులవారు ఉన్నారు. కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, మంగలి, చర్మకారుడు, సాలె, కురుమలు, రజకుడు వంటి ఎందరో వృత్తి పనివారలు ఉన్నారు.

ప్రతి వృత్తి పవిత్రమైనదే. ఏ వృత్తినీ మనం చిన్న చూపు చూడరాదు. మన ఇంట్లో శుభకార్యం జరగాలంటే, మంగళ వాద్యాలు వాయించేవారు కావాలి. కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ కావాలి. అంటే అన్ని వృత్తులవారు సహకరిస్తేనే ఏ పనులయినా జరుగుతాయి. ఒకరికొకరు తోడ్పడితేనే సమాజం నడుస్తుంది. రైతులు పొలం దున్నాలంటే నాగలి కావాలి. దాన్ని వడ్రంగి చెక్కాలి. కమ్మరి దానికి గొర్రు తయారుచేయాలి. రైతుకు చర్మకారులు చెప్పులు కుట్టాలి. సాలెలు బట్టలు నేయాలి. కంసాలి, వారికి నగలు చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. ఇలా అన్ని వృత్తులవారూ సహకారం అందిస్తే, సమాజం సక్రమంగా నడుస్తుంది.

ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను, అన్ని వృత్తులవారు కలిసిమెలిసి తయారుచేసుకొనేవారు. వారు తమ కులాలను మరిచిపోయి, అక్క, బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకొనేవారు.
తిరిగి గ్రామాల్లో అటువంటి తియ్యని జీవితం రావాలి. శరీరం నడవడానికి అవయవాలు అన్నీ ఎంత ముఖ్యమో మనిషి జీవనానికి అన్ని వృత్తులవారి శ్రమ కూడా అంత ముఖ్యం అని గుర్తించాలి.



2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” – అని ఎట్లా చెప్పగలరు ? కారణాలు వివరిస్తూ రాయండి.
జ.
నిత్య జీవితంలో మనిషి పక్కమనిషి మీద ఆధారపడి బతకక తప్పదు. పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడటం అనేది మన సంస్కృతిలో గొప్ప విషయం.

మన ఇంట్లో పెళ్ళి అయితే మంగళవాద్యాలు కావాలి. కుండలు, ప్రమిదలు కావాలి. నగలు కావాలి. వంటల వారు కావాలి. పెండ్లి చేయించేవారు కావాలి. బట్టలు కావాలి. లైటింగ్ ఏర్పాట్లు కావాలి. అలంకరణ చేసేవారు కావాలి. ఈ పనులన్నీ చేసేవారు ఉంటే తప్ప, మన వద్ద డబ్బు ఉన్నా పెళ్ళి జరుగదు. దీనిని బట్టి మనం సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నాం అని గ్రహించాలి.

రైతు పంటలు పండించాలి. ఆ పంటలను బజార్లకు తీసుకురావాలి. వాటిని వర్తకులు అమ్మాలి. అప్పుడే మనం వాటిని కొని, అనుభవించగలం. రోగం వస్తే వైద్యులు కావాలి, ఇళ్ళు కట్టడానికి తాపీ పనివారు, వడ్రంగులు, ఇనుప పనివారు, విద్యుచ్ఛక్తి పనివారు, కుళాయిలు అమర్చేవారు కావాలి. ఇండ్లలో పనిచేసే పనివారు కావాలి. దీనిని బట్టి మనం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్నాం అనీ, పరస్పరం ఆధారపడటం మన సంస్కృతిలో గొప్ప విషయం అనీ గ్రహిస్తాము.

మనిషిని మనిషిగా గౌరవిద్దాం. తోటి మానవునిలో దాగియున్న ప్రతిభను గుర్తిద్దాం. మనసారా అభినందిద్దాం. ఆ గొప్పదనాన్ని అందుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకే మన పెద్దలు “శ్రమ పునాదిపైనే అభివృద్ధి భవనం ఆధారపడి ఉంటుంది” అని అంటారు. శ్రమించడానికి ఎవరూ సిగ్గుపడకూడదు. సోమరితనంతో శ్రమించకపోతేనే సిగ్గుపడాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చూడగలగాలి. మనమంతా శ్రమను గౌరవంగా చూడడం నేర్చుకోవాలి.



IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) మీ గ్రామంలోని ఒక వృత్తిపనివారి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
ఉదా ॥ 1. నమస్కారం! మీ పేరేమిటి ?
జ.
ఉదా : 1. నమస్కారం! మీ పేరేమిటి ?
2. మీ వృత్తి వల్ల ఆదాయం బాగుందా ?
3. ప్రస్తుతం మీ చేనేత వృత్తి ఎలా ఉంది ?
4. మీ వృత్తిలో ఆధునికతను జోడిస్తున్నారా ?
5. చేనేత వస్త్రాలకు ఆదరణ ఎలా ఉంది ?
6. ముడి సరుకును ఎక్కడి నుండి తెస్తారు ?
7. మీ వృత్తికి ప్రభుత్వ సహకారం ఉందా ?
8. కుటుంబ సభ్యులంతా ఈ వృత్తిలో ఉన్నారా ?

V. పదజాల వినియోగం:

1. కింది పదాలకు సొంతవాక్యాలు రాయండి.

అ) చేదోడు వాదోడు :వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు చేదోడు వాదోడుగా ఉంటారు.

ఆ) చాకచక్యం :పనుల్లో చాకచక్యం ప్రదర్శిస్తే విజయం తథ్యం.

2. కింది పట్టికలోని ప్రకృతి, వికృతులను గుర్తించి వేరుచేసి రాయండి.


ప్రకృతి – వికృతి
ఉదా : విద్య – విద్దె
అ) గౌరవం – గారవం
ఆ) ఆహారం – ఓగిర
ఇ) భక్తి – బత్తి
ఈ) రాత్రి – రాతిరి

3. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.

అ) చెట్టు : .తరువు, చెట్టు, మహీరుహం

ఆ) పాదము :చరణము, అడుగు, అంఫ్రి

ఇ) శరీరం :దేహం, తనువు, కాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

వాక్యం

అసమాపక క్రియ, సమాపక క్రియ

ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది. వెళ్ళి కొన్నది
1. రాజు పద్యం చదివి, భావం చెప్పాడు. చదివి చెప్పాడు
2. వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది. గీసి వేసింది
3. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. ఎక్కి వెళ్ళింది
4. రంగయ్య వచ్చి, వెళ్ళాడు. వచ్చి వెళ్ళాడు
5. వాళ్ళు అన్నం తిని, నీళ్ళు తాగారు. తిని తాగారు

సంక్లిష్ట వాక్యం :

కింది వాక్యాలు చదువండి. కలిపి రాసిన విధానం చూడండి.
ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.

2. కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జ.విమల వంట చేసి, పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కున్నది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.


రవి ఊరికి వెళ్ళి, మామిడి పండ్లు తెచ్చాడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.

ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

3. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జ.
రజిత అన్నం తిని, బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జ. వాళ్ళు రైలు దిగి, ఆటో ఎక్కారు.

ఇ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జ. రాజన్న లడ్డూలు తెచ్చి, అందరికీ పంచాడు.



సంయుక్త వాక్యం :

కింది వాక్యాలు చదువండి. కలిపి రాసిన విధానం పరిశీలించండి.
ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

4. కింది వాక్యాలను కలిపి రాయండి.
అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జ. అతనికి కనిపించదు అందువల్ల చదువలేడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.

పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.

సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క శైలజ చెల్లెలు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా ?
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా ? – రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

5. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు, తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు. సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము తేలేము.
జ.మేము రాము, తేలేము.




పాఠ్యభాగ సారాంశం:

ఆదివాసులు లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు కూడా శాస్త్రజ్ఞులే. వారికి రోగాలు వస్తే చెట్ల మందులతోనే నయం చేసుకుంటారు.

మన దేశంలో సాంప్రదాయంగా ఎన్నో వృత్తులు ఉన్నాయి. ప్రతి వృత్తిలోను మంచి పనితనం ఉంది. అన్ని వృత్తులవారు పరస్పరం సహకరించుకోవాలి. అప్పుడే సమాజం ప్రగతి వైపు పయనిస్తుంది. కుమ్మరులు కుండల తయారీలో చెప్పుకోతగిన పనితనం కనబరుస్తారు. స్వర్ణకారులు అందమైన ఆభరణాల తయారీలో తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వడ్రంగులు గృహోపకరణ సామగ్రిని అందంగా ఆవిష్కరిస్తారు.

రైతులు పంటలు పండించి ప్రజలకు అన్నం పెడుతున్నారు. చర్మకారుడు చెప్పుల తయారీలోను, ఢంకల తయారీలోను తన పనితనాన్ని చూపుతున్నాడు. అన్ని వృత్తుల వారు పరస్పరం సహకరించుకోవాలి.








*******************************************

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

వివిధ వృత్తిపనులవారు పాడుకొనే పాటలను సేకరించండి. ఒక పాటపై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి, ప్రదర్శించండి.

1. కర్షకగీతం
జ.
రైతే దేశానికి వెన్నెముక
అతడలిగితే లేదు మనకు అన్నమిక
కోటివిద్యలు అన్ని కూటికొరకన్నారు
కూడుగోడును బాప రైతన్నలున్నారు.
నడుమొంచి కష్టించి పాడిపంటలు పెంచి
పొట్ట చల్లగుండంగ పోషించు అన్నదాత
తానేమొ పస్తులుండి తిండిపెడుతున్నాడు.
సమాజ గమనానికి సాయపడుతున్నాడు.
రాత్రనక పగలనక ఆత్రంగ పనిచేస్తూ
సోమరితనమొద్దని చాటిచెప్పే ధీరుడు
ఎండకు ఎండినా వానలో తడిసినా
చలిలో వణకినా సమస్యలతో నలిగినా
సడలని స్థైర్యంతో సస్యములనందిస్తూ
జాతిసేవలో పునీతుడై నిలచిన || రైతే ||

2. కుమ్మరిపాట
రా రండోయ్ ! రా రండోయ్ !
కుండలు, ముంతలు చేతము రా రండోయ్
గిరగిర బరబర చక్రం తిప్పుతు
వడివడిగ చేతులు ఆడిస్తూ
బంకమట్టికి ఆకృతులనిస్తూ
నిండైన పనితనం చూపిద్దాం !
ఇళ్ళకు వన్నెలు తెచ్చే ప్రమిదలు
మంచినీళ్ళకువాడే కూజాలు
పెళ్ళిళ్ళకు వాడే ముంతలను చేయండోయ్
ఇళ్ళల్లో వాడే తొట్లను చేయండోయ్. ॥రా రండోయ్ ||

అభిప్రాయం :
రైతే దేశానికి వెన్నెముక …………….. అనే గేయం ప్రభావోత్పాదకంగా ఉంది. రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు. రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి పంటలు పండిస్తాడు. అకాలవర్షాలకు పంటలను పోగొట్టుకున్నా ధైర్యాన్ని కోల్పోడు. రైతు త్యాగానికి ప్రతీకగా నిలుస్తాడు. సోమరితనాన్ని దూరం చెయ్యమని ఉపదేశిస్తాడు. నవసమాజ నిర్మాణానికి నాయకుడిగా చరిత్రలో రైతు నిలబడతాడు.

ప్రశ్న 1.
మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయండి.
జ.
మన దేశంలో ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి. ఎందరో తమ తమ వృత్తులను నమ్ముకొని జీవిస్తున్నారు. మన సాంప్రదాయక వృత్తులను ఇప్పటికీ కొందరు చేస్తున్నారు. ఈ వృత్తుల్లో నాకు ఇష్టమైనది చేనేత వృత్తి. ఒకసారి నేను జగిత్యాల, సిద్దిపేట మొదలైన ప్రాంతాల్లోని చేనేత పనివారిని కలిశాను. వారి జీవనం చాలా దుర్భరంగా ఉంది. ప్రస్తుతం చేనేత వృత్తుల వారికి ఆదరణ తగ్గింది. కొంతమంది చేనేత పనివారు జీవన భృతి లేక కుటుంబాన్ని పోషించలేక, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం తిరిగి చేనేత పనివారికి ఆశ్రయం కల్పించాలి. వారు తయారుచేసే వస్త్రాలను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. ముడిసరుకును తక్కువ ధరలకే అందించాలి. వారి ఋణాలను ప్రభుత్వం రద్దు చేయాలి. అప్పుడే చేనేత వృత్తులవారు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు.

I. అవగాహన – ప్రతిస్పందన:

అపరిచిత గద్యాలు:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చారిత్రక నవలలో యుద్ధాలు, సాహస కృత్యాలు, ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయి. నవలలోని నాటకీయత నవలను నాటక స్థాయికి తీసుకువెళ్తుంది. చారిత్రక నవలలో కేవలం చారిత్రక సంఘటనలు ఉంటే, అది చరిత్ర మాత్రమే అవుతుంది. కల్పనలు అధికమైతే, అది కాల్పనిక నవల అవుతుంది. చారిత్రక నవలలో చరిత్ర సంఘటనలకు తగు మాత్రం కల్పనలు జతజేసి, కథను రసవత్తరంగా మలచడంలోనే రచయిత ప్రతిభ తెలుస్తుంది. దేశ, కాల ప్రమాణాలు పాటించకుండా రాసే నవలలను చారిత్రకాభాస నవలలు అంటారు. వీటిని సాహిత్య చరిత్ర అంతగా పట్టించుకోదు. ఇవి కాలక్షేపానికి పనికొస్తాయి. గాని, ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.


చారిత్రకాభాస నవలలని వేటిని అంటారు ?
జ.
దేశ,కాల ప్రమాణాలు పాటించకుండా రాసే నవలలు.

 2.
సాహిత్య చరిత్ర వేటిని పట్టించుకోదు ?
జ.
చారిత్రకాభాస నవలలను

 3.
కాల్పనికతలు ఎక్కువగా ఉండే నవలలేవి ?
జవాబు.
కాల్పనిక నవలలు

4.
కాల్పనిక నవలల ప్రయోజనం ఏమిటి ?
జ.
కాలక్షేపం

ప్రశ్న 5.
చారిత్రక నవలలో ఏమేం ఉంటాయి ?
జ.
యుద్ధాలు, సాహస కృత్యాలు, ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయి.


పరిచిత గద్యాలు:

1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అన్ని వృత్తుల సమష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే ! కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజన జాతులకున్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందుల తోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలతో చేసే వైద్యమే ఆయుర్వేదం. కుమ్మరి మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుకను కలిపి బంకమట్టిని తయారుచేస్తాడు. ఇనుముతో నిత్యం సహవాసం చేసే కమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు.

ప్రశ్నలు:

1.
దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచినవేవి ?
జ.
వృత్తులు

ప్రశ్న 2.
ఎవరు ప్రకృతి జ్ఞానం కలవారు ?
జవాబు.
గిరిజనులు

ప్రశ్న 3.
వనమూలికలతో చేసే వైద్యం ?
జవాబు.
ఆయుర్వేదం

ప్రశ్న 4.
బంకమన్ను తయారుచేసేదెవరు ?
జవాబు.
కుమ్మరి

ప్రశ్న 5.
శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నవారెవరు ?
జవాబు.
కమ్మరులు



2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సమాజానికి ఎనలేని సేవ చేసిన దళితులను అంటరానితనం పేరిట దూరంగా ఉంచారు. గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల కృషి ఫలితంగా వీరికి రాజ్యాంగపరమైన రక్షణ లభించింది. స్త్రీల ప్రసవ సమయంలో, పురుడు పోయడంలో, తల్లీ బిడ్డల సంరక్షణలో మంత్రసానులుగా మంగలి స్త్రీల పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం. మురికి బట్టలు శుభ్రం చేసే రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరుగవు. భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిగారు ‘జై జవాన్, జై కిసాన్’ అన్న నినాదమిచ్చాడు.

ప్రశ్న 1.
అంటరానివారిగా ఎవరిని సమాజానికి దూరంగా ఉంచారు ?
జ.
దళితులను
2.పురుడు పోసే వారిని ఏమని పిలుస్తారు ?
జవాబు.
మంత్రసాని


ప్రశ్న 3.
శుభాశుభ కార్యక్రమాలు ఎవరు లేకుండా జరుగవు ?
జ.
రజకులు

ప్రశ్న 4.
ఎవరి కృషి ఫలితం దళితులకు రక్షణ లభించింది ?
జ.
గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల ఫలితంగా

ప్రశ్న 5.
‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఎవరన్నారు ?
జ.
లాల్ బహుదూర్ శాస్త్రి.



3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాద్ ప్రసిద్ధి. వాటికి అద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్ళతో అలంకరిస్తారు. ఇక నిర్మల్ వర్ణ చిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. వెండి నగిషీ కళను ‘ఫెలిగ్రీ’ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. వరంగల్ జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
హైదరాబాద్ వేటికి ప్రసిద్ధి ?
జ.
లక్క గాజులకు

ప్రశ్న 2.
వర్ణ చిత్రాలకు ప్రసిద్ధమైన ప్రాంతం ?
జ.
నిర్మల్

ప్రశ్న 3.
వెండి నగిషీ కళను. ఏమంటారు ?
జ..
ఫెలిగ్రీ

ప్రశ్న 4.
సన్నని వెండి దారాలతో వస్తువులు ఎక్కడ తయారు చేస్తారు ?
జవాబు.
కరీంనగర్

ప్రశ్న 5.
‘పెంబర్తి’ దేనికి ప్రసిద్ది ?

లోహ సామగ్రికి


4. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

గోలకొండ ప్రభువుగా అబుల్ హసన్ తానీషా సింహాసనం అధిష్ఠించడానికి మాదన్న పరోక్ష కారకుడు. తానీషా మాదన్న మంచితనాన్ని, కర్తవ్య నిష్ఠను చూసి ప్రధానమంత్రిగా నియమించాడు. పరిపాలన భారాన్నంత తన భుజస్కంధాలపై వేసుకున్నాడు మాదన్న. ఎంతో ముందుచూపుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. గ్రామాలకు బాటలు వేయించాడు.

బాటకు రెండు వైపులా చెట్లను పెంచే ఏర్పాటు చేశాడు. బాటసారులకు సత్రాలు కట్టించాడు. విద్యాలయాలకు, వైద్యాలయాలకు ఎంతో ప్రోత్సాహాన్నందించాడు. వజ్రాలకు గనియైన గోలకొండను ప్రపంచంలో గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చాడు. అధికారులలో లంచగొండితనాన్ని నియంత్రించాడు. ఇంగ్లీషువారు బహుమతుల రూపంలో మాదన్నకు లంచమివ్వజూపగా నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
గోలకొండ ప్రభువు ఎవరు ?

అబుల్ హసన్ తానీషా

ప్రశ్న 2.
గోలకొండకు ప్రధాని ఎవరు ?
మాదన్న

ప్రశ్న 3.
గోలకొండ దేనికి ప్రసిద్ధి ?
వజ్రాలకు

ప్రశ్న 4.
మాదన్నకు లంచం ఇవ్వబోయినవారు ?
జవాబు.
ఇంగ్లీషువారు

ప్రశ్న 5.
బాటసారుల కోసం వేటిని కట్టించారు ?

సత్రాలు



II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జాతి సేవలో పునీతుడైన ‘గొప్ప వ్యక్తి రైతు’ సమర్థిస్తూ రాయండి. (4 మార్కులు)
రైతే దేశానికి వెన్నెముక. మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు వంటివేవీ సులువుగా వచ్చిపడేవి కావు. చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషి ఫలం, ఎండనక, వాననక రేయింబగళ్ళనక రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమిస్తేనే మనం హాయిగా తినగలుగుతున్నాం.

భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిగారు ‘జై జవాన్, జై కిసాన్’ అన్న నినాదం సమాజానికి రైతు చేసే సేవ ఎంత గొప్పదో తెలుపుతుంది. రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు. అకాల వర్షాలకు పంటలను పోగొట్టుకున్నా ధైర్యాన్ని కోల్పోడు. రైతు త్యాగానికి ప్రతీకగా నిలుస్తాడు. నవ సమాజ నిర్మాణానికి నాయకుడిగా చరిత్రలో రైతు నిలబడతాడు. అందుకే “జాతి సేవలో పునీతుడైన గొప్ప వ్యక్తి రైతు” అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రశ్న 2.
కులవృత్తులు నేడు అంతరించిపోవడానికి కారణమేమి ?
జవాబు.
అన్ని వృత్తుల సమష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే ! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యులుగా కనిపించేవాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించాలి.

గౌరవించాలి. ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తీ పవిత్రమైందే. దేన్నీ చిన్నచూపు చూడకూడదు. అన్ని వృత్తుల వాళ్ళు సహకరిస్తేనే ఏ కార్యాలైనా చక్కగా జరుగుతాయి. అందరూ పరస్పరం సహకరించుకొంటేనే సమాజం నడుస్తుంది.

అంతే కానీ ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా ఉంటే సమాజ అభివృద్ధి కుంటుబడుతుంది. ‘శ్రమ’ పునాదిపైనే ‘అభివృద్ధి’ భవనం ఆధారపడి ఉంటుంది అన్న సంగతి మరచిపోవడం, సోమరితనం, తక్కువ అభిప్రాయం అనే అంశాల వల్ల కులవృత్తులు అంతరించడానికి ప్రధాన కారణాలు.



ప్రశ్న 3.
‘అసామాన్యులు’ పాఠం ఆధారంగా మీకు నచ్చిన ఏదైనా వృత్తి గొప్పదనం గూర్చి రాయండి.
జవాబు.
శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం? ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే ! శ్రమను గౌరవంగా భావించాలి. శ్రమ సంస్కృతితో జీవించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. సమాజంలో అన్ని వృత్తులూ గొప్పవే. వారిలో పారిశుద్ధ్య పనిచేసే వారిని చూస్తే ఎంతో బాధ్యతతో మెలుగుతున్నారనిపిస్తుంది. పారిశుద్ధ్య వృత్తి పనివారలు రోజూ రోడ్లు చిమ్ముతూ, పరిశుభ్రతకై పాటుపడుతున్నారు.

“ఒక్క రోజీవు వీధుల నూడ్వకున్న, తేలి పోవును పట్టణాల సొగసు, బయట పడునమ్మ బాబుల బ్రతుకు లెల్ల, ఒక్క క్షణమ్మీవు గంప క్రిందకును దింప” అంటూ పారిశుద్ధ్య పనివారలను హీనంగా చూసే సమాజ దుర్నీతిని కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి విమర్శించారు. “మాకు జనని బాల్యమ్మందున, జీవనీ!” అంటూ రోడ్లు ఊడ్చే బాలికలో మాతృమూర్తిని దర్శించారు.

ప్రశ్న 4.
పల్లె సమగ్రాభివృద్ధికి, వృత్తులు అవసరమా ? మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు.
పల్లె సమగ్రాభివృద్ధికి వృత్తులు అవసరమే. దీనిలో ఎటువంటి వేరొక ఆలోచన అవసరం లేదు. చేతికి ఉన్న వేళ్ళు అన్నీ ఒకే ఆకారంలో ఉండవు. కాని ఏదేని పని చేసేటప్పుడు అన్నిటి సహకారం ఉంటేనే ఆ పని బాగా చేయగలం. అలాగే సమాజం ఏ ఒక్కరితోనో సాగదు, ఆగదు. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధించ వీలవుతుంది. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. పల్లెలు అంటే పల్లెలలోని ప్రజలు, వారి వృత్తులు.

ప్రతి వృత్తి పవిత్రమైనదే. ఏ వృత్తినీ మనం చిన్న చూపు చూడరాదు. మన ఇంట్లో శుభకార్యం జరగాలంటే, మంగళ వాద్యాలు వాయించేవారు కావాలి. కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ కావాలి. అంటే అన్ని వృత్తులవారు సహకరిస్తేనే ఏ పనులయినా జరుగుతాయి. ఒకరికొకరు తోడ్పడితేనే సమాజం నడుస్తుంది.

రైతులు పొలం దున్నాలంటే నాగలి కావాలి. దాన్ని వడ్రంగి చెక్కాలి. కమ్మరి దానికి గొర్రు తయారుచేయాలి. రైతుకు చర్మకారులు చెప్పులు కుట్టాలి. సాలెలు బట్టలు నేయాలి. కంసాలి, వారికి నగలు చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. ఇలా అన్ని వృత్తులవారూ సహకారం అందిస్తే, సమాజం సక్రమంగా నడుస్తుంది.

ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను, అన్ని వృత్తులవారు కలిసిమెలిసి తయారుచేసుకొనేవారు. వారు తమ కులాలను మరిచిపోయి, అక్క, బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకొనేవారు.

తిరిగి గ్రామాల్లో అటువంటి తియ్యని జీవితం రావాలి. శరీరం నడవడానికి అవయవాలు అన్నీ ఎంత ముఖ్యమో మనిషి జీవనానికి అన్ని వృత్తులవారి శ్రమ కూడా అంత ముఖ్యం అని గుర్తించాలి.



ప్రశ్న 5.
‘అసామాన్యులు’ అంటే ఎవరు ? వారిని అలా ఎందుకు పిలవాలో మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు.
ఎటువంటి ప్రత్యేకతలు లేని సర్వ సాధారణమైన వ్యక్తిని ‘సామాన్యుడు’ అంటారు. దీనికి భిన్నమైన వ్యక్తులు ‘అసామాన్యులు’. అసామాన్యమైన ప్రతిభ గలవారిని ‘అసామాన్యులు’ అనవచ్చు. పేరులోనే ‘మాన్య’త ఉంది కాని సమాజంలో నేడు ఎందరో అసామాన్యులైన ‘మాన్యులు’ సామాన్యులుగా చూడబడుతున్నారు. వారి గొప్పదనాన్ని గుర్తించే ‘నేర్పు, ఓర్పు’ నేడు సమాజంలో లోపించాయి.

పూర్వకాలంలో గ్రామాలు స్వయం సమృద్ధంగా వెలిగినాయి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తుల వారూ కలసిమెలసి తయారు చేసుకొనేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. మానవత్వం చాటిన మధుర జీవితం వాళ్ళది. సమాజ శ్రేయస్సును కాంక్షించే వృత్తులను కులవృత్తులుగా స్వీకరించిన వారందరూ అసామాన్యులే. అలా పిలవడంలో న్యాయం ఉంది..

ఆదివాసులే లేకపోతే వనమూలికల గూర్చి ఎవరికీ ఏమీ తెలిసేది కాదు. కుమ్మరులు కుండల తయారీలో చెప్పుకోతగిన పనితనం కనబరుస్తారు. స్వర్ణకారులు అందమైన ఆభరణాల తయారీలో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వడ్రంగులు గృహోపకరణ సామగ్రిని అందంగా ఆవిష్కరిస్తారు. రైతులు పంటలు పండించి ప్రజలకు అన్నం పెడుతున్నారు. చర్మకారుడు చెప్పుల తయారీలోను, ఢంకల తయారీలో తన పనితనాన్ని చూపుతున్నాడు. వీటి అందం వెనుక ఎందరి కష్టం నైపుణ్యం ఉందో గ్రహించాలి. కనుక వీరందరూ ‘అసామాన్యులు’ అని నేనూ ఏకీభవిస్తాను.

ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1. శ్రమ సంస్కృతిలో జీవించే వడ్రంగి గొప్పతనాన్ని తెలియజేయండి.
జవాబు.
వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి తోడ్పడతాయి. అన్ని వృత్తుల సమష్టి జీవనమే సమాజం. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే ! అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. శ్రమ సంస్కృతిలో జీవించే వడ్రంగి పనితనం అసాధారణమైనది. వ్యవసాయదారులకు కావల్సిన నాగలి, గుంటక, గొర్రు వంటి పనిముట్లకు ఎలాంటి కలప సరిపోతుందో వడ్రంగులు పరిశీలిస్తారు. కొయ్యను సరైన రూపాలలో తీసుకొని రావడానికి వీళ్ళు ఎంతో శ్రమిస్తారు.

వడ్రంగులు సమాజానికి అందించిన మరో సౌకర్యం బండి. ఇది ఇటు వ్యవసాయానికి, అటు ప్రయాణానికి పనికి వస్తుంది. ఇంటి నిర్మాణానికి ‘ అవసరం అయ్యే దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు వీరి పనితనం వల్లనే ఆకర్షణీయంగా తయారవుతాయి. మనం వాడుకొనే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు, అలమరలు ఇలా ఎన్నో వడ్రంగుల చేతుల్లో రూపొందినవే. అందుకనే వాళ్ళను ‘దారు శిల్పుల’ని అంటారు. ఈ వస్తువులన్నీ మార్కెట్లో అందంగా అమ్మకానికి ముస్తాబై ఉన్నాయంటే, దీనివెనుక వడ్రంగుల కష్టం, నైపుణ్యం ఎంతో ఉంది. ఈ వస్తు సామగ్రిని చూస్తున్నప్పుడు వడ్రంగులను తలచుకోవడం మన ధర్మం. వారి నైపుణ్యాన్ని, గొప్పదనాన్ని గౌరవించడం మన బాధ్యత.


III. సృజనాత్మకత:

ప్రశ్న 1.
మీరిప్పటి వరకు తెలుగులో ఎన్ని పాఠాలు చదువుకున్నారో, వాటిలో మీకు నచ్చిన పాఠం ఏదో దాని గురించి వివరిస్తూ, మీ మిత్రునికి / మిత్రురాలికి లేఖ రాయండి.
జవాబు.

లేఖ

సిద్దిపేట,
X X X X X.

ప్రియ మిత్రుడు విష్ణుకు/స్నేహితురాలు వైష్ణవికి,

నేను క్షేమం నీవు క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. తెలుగు పాఠాలన్నీ ఒక రివిజన్ పూర్తి చేసాము. పాఠాలన్నీ చదువుతుంటే ఆ కవులు, రచయితలు ఎంత కష్టపడి, ఇష్టపడి రాసారో, అంత బాగున్నాయి. వీటిలో ఏ పాఠం ఇష్టమని అడిగితే ఒకసారి ఆలోచించాలనిపిస్తుంది. వేటికవే అంత బాగున్నాయి. కాని వీటిలో ‘మాట్లాడే నాగలి’ పాఠం నన్ను ఎంతో ఆకర్షించింది.’ దీనిలో ప్రధానాంశం జంతు ప్రేమ.

ప్రకృతిని చూస్తూ – పెరిగిన మనం, ఉత్తేజితులమైన మనం, జ్ఞానాన్ని పొందిన మనం, తిరిగి ప్రకృతికి ఏమీ ఇవ్వట్లేదని అనిపించింది. మనం చాలా స్వార్థపరులం కదూ ? ‘ఓసెఫ్’ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ‘కన్నన్’ లాంటి ఎద్దును నేను పెంచి, అలాగే చూసుకోవాలనిపించింది. ఇదీ …………… నా విషయం. మరి నీ సంగతి ఏంటి? ఇలాగే నీకు నచ్చిన పాఠం గురించి రాస్తావు కదూ.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు/స్నేహితురాలు,
కంచిభొట్ల సమీర్/సమీర.

చిరునామా :
S. విష్ణు / వైష్ణవి,
8వ తరగతి,
బోధన్, ఆదిలాబాద్ జిల్లా.


IV. భాషాంశాలు:

పదజాలం:  పర్యాయపదాలు:


ఆకాశం –నింగి, నభం, గగనం

ప్రశ్న 2.
బంగారం : హేమం, సువర్ణం, కాంచనం


వ్యవసాయం – సేద్యము, కృషి, సాగు

ప్రశ్న 4.
కుప్పలు –రాసులు, ప్రోగులు


కష్టం – ఇక్కట్టు, శ్రమ

నానార్థాలు:

ప్రశ్న 1.
గురువు –ఉపాధ్యాయుడు, బృహస్పతి, తండ్రి

ప్రశ్న 2.
వ్యవసాయం – కృషి, ప్రయత్నం, పరిశ్రమ


ప్రశ్న 3.
శక్తి – బలం, సామర్థ్యం, పార్వతి

ప్రశ్న 4.
పాదము –చరణం, పద్యపాదం, వేదభాగం

ప్రశ్న 5.
తాత –తండ్రి తండ్రి, తల్లి తండ్రి, బ్రహ్మ

ప్రశ్న 6.
ఫలం – ___________
జవాబు.
పండు, ఫలితం, ప్రయోజనం


వ్యుత్పత్త్యర్థాలు:

ప్రశ్న 1.
గురువు :అజ్ఞానాంధకారమును తొలగించువాడు’ (ఉపాధ్యాయుడు)

ప్రశ్న 2.
హాలికుడు : _హలముతో పొలము దున్నువాడు (రైతు)

ప్రశ్న 3.
వేత్త : బాగా తెలిసినవాడు. (జ్ఞాని)

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
ఆశ్చర్యం – అచ్చెరువు
త్యాగం – చాగం
భక్తి – బత్తి
దృష్టి – దిష్టి
కార్యం – కార్జం
ఆహారం – ఓగిరం
గౌరవం – గారవం
రూపం – రూపు
భూమి – బూమి
విద్య – విద్దె
కులం – కొలం
అటవి – అడవి
ఆకాశం – ఆకసం
శక్తి – సత్తి
ప్రయాణం – పయనం
స్త్రీ – ఇంతి
రాత్రి – రాతిరి
ప్రాణం – పానం



వ్యాకరణాంశాలు:

సంధులు:

1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది.
ఉదా : శుభాశుభ = శుభ + అశుభ
రాజ్యాంగ = రాజ్య + అంగ
భారతావని = భారత + అవని

2. యణాదేశసంధి :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు క్రమముగా య, ర, ల,వ లు ఆదేశమగును.
ఉదా : ప్రత్యక్షము = ప్రతి + అక్షము
ప్రత్యేక = ప్రతి + ఏక
అత్యంత = అతి + అంత

3. గుణసంధి :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
ఉదా : బ్రహ్మేంద్ర = బ్రహ్మ + ఇంద్ర
అతిశయోక్తి = అతిశయ + ఉక్తి

4. వృద్ధిసంధి:
అకారమునకు ఏ, ఐ లు పరమైనప్పుడు ఐకారమును, ఓ, ఔ లు పరమైనప్పుడు ఔకారమును ఏకాదేశంగా వస్తాయి.
ఉదా : శ్రమైక = శ్రమ + ఏక
వసుధైక = వసుధ + ఏక

5. ఇత్వసంధి : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఉదా : రాత్రనక = రాత్రి + అనక
ఏదైనా = ఏది + ఐనా
ఇదొక = ఇది + ఒక

6. ఉత్వసంధి :
ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధియగు.
ఉదా : పగలనక = పగలు + అనక
కార్యాలైనా = కార్యాల + ఐనా
వారెందరు = వారు + ఎందరు
వెన్నెముక = వెన్ను + ఎముక



సమాసాలు:

సమాసపదం-విగ్రహవాక్యం-సమాసం పేరు

1) మర్రిచెట్టు – మర్రి అనే పేరు గల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయం
2) గొప్పశక్తి – గొప్పదైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయం
3) మట్టిపాత్రలు – మట్టివైన పాత్రలు – విశేషణ పూర్వపద కర్మధారయం
4) దేశీయ వైద్యం – దేశీయమైన వైద్యం – విశేషణ పూర్వపద కర్మధారయం
5) చిన్నచూపు – చిన్నదైన చూపు – విశేషణ పూర్వపద కర్మధారయం
6) ఆపాదమస్తకం – పాదముల నుండి మస్తకము వరకు – అవ్యయీభావ సమాసం
7) కోటి విద్యలు – కోటి సంఖ్య గల విద్యలు – ద్విగు సమాసం
8) మధుర జీవనం – మధురమైన జీవనం – విశేషణ పూర్వపద కర్మధారయం
9) గొప్ప విలువలు – గొప్పవైన విలువలు – విశేషణ పూర్వపద కర్మధారయం
10) అతిశయోక్తి – అతిశయమైన ఉక్తి – విశేషణ పూర్వపద కర్మధారయం
11) రేయింబగళ్ళు · రేయి, పగలు – ద్వంద్వ సమాసం
12) ప్రసవ సమయం – ప్రసవము యొక్క సమయం – షష్ఠీ తత్పురుష సమాసం
13) రైతుల కృషి – రైతుల యొక్క కృషి – షష్ఠీ తత్పురుష సమాసం
14) జంతుచర్మం – జంతువుల యొక్క చర్మం – షష్ఠీ తత్పురుష సమాసం
15) ప్రతిరోజు – రోజు రోజు – అవ్యయీభావ సమాసం
16) శాస్త్రజ్ఞుడు – శాస్త్రమును తెలిసినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం

కఠిన పదాలకు అర్థాలు:

I.
దృష్టి = చూపు
ప్రతిభ = గొప్పదనం
ప్రత్యక్షం = ఎదురు
మార్గం = దారి
జీవకోటి = ప్రాణి సమూహం
ఆదివాసులు = గిరిజనులు
అతిశయోక్తి = ఎక్కువగా చేసి చెప్పడం
ఆయుష్షు = ఆయుర్దాయం
జానపదులు = గ్రామీణులు
ప్రాచుర్యం = ప్రచారం
కృషి = ప్రయత్నం
నైపుణ్యం = నేర్పరితనం
మురిసిపోవు = ఆనందపడు
అద్భుతం = గొప్పదనం
ఆవిష్కరణ = ప్రకటన, వెల్లడి
చాకచక్యం = నేర్పరితనం

II.

ఆపాదమస్తకం = పాదముల నుండి తల వరకు
మూస = బంగారమును కరిగించడానికి ఉపయోగించే ఒక విధమైన పాత్ర
ఆకృతులు = ఆకారాలు
సున్నితం = సుకుమారం
నిత్యం = ఎల్లప్పుడు
ఉత్పత్తి = పుట్టుక
కీలకం = ముఖ్యము
దారు శిల్పులు = చెక్కతో శిల్పములను తయారు చేసేవారు.
ఆకర్షణీయంగా = అందంగా
చర్మం = తోలు
ఔదార్యం = ఉదార స్వభావం
ఒడుపు = ఉపాయం, నేర్పరితనం
ముప్పు = ఆపద
దేహము = శరీరము
జీవనము = బ్రతుకు
వక్కాణించుట = చెప్పుట.
కాటికి = శ్మశానానికి
వాద్యం = సంగీత పరికరం
ఎనలేని = సాటిలేని
కోణం = అంచు, మూల.


III.

క్షురకులు = తలవెంట్రుకలను కత్తిరించేవాడు
క్షురము = కత్తి
అవగాహన = తెలియడం
గాట్లు = గాయాలు
చిట్కాలు = మెలకువలు
తైలం = నూనె
ప్రసవ సమయం = కాన్పు సమయం
పరిజ్ఞానం = మిక్కిలి తెలివి
సుదీర్ఘం = చాలా పొడవైన
వ్యవహారం = విషయం
కాయకష్టం = శారీరక శ్రమ
ప్రమేయం = సంగతి
తల్లడిల్లు = కలత చెందు
పాట్లు = కష్టాలు
జవాను = సైనికుడు
కిసాను = రైతు
నినాదం = పిలుపు
పస్తులు = ఉపవాసాలు
సడలని = తొలగని
స్థైర్యం = చలింపని మనస్సు
పునీతుడు = పవిత్రుడు
శుభకార్యం = మంచిపని
ఎవరికివారే యమునాతీరే (జాతీయం)
ఒక పనిని గూర్చి కొంతకాలం కలసి వుండి, ఆ పని పూర్తి అయిన తరువాత ఎవరి పాటికి వారు విడిపోయారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు.
అభివృద్ధి = ప్రగతి
సోమరితనంతో = బద్ధకంతో
సౌందర్యం = అందము




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...