సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

19, జనవరి 2024, శుక్రవారం

VI.8. చెరువు

1.పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు.
పై బొమ్మలో నది లేదా చెరువులో ప్రయాణిస్తున్న పడవ ఒడ్డున ఉన్న ఇళ్ళు, చెట్లు కన్పిస్తున్నాయి.
2. ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి ?
జవాబు. ప్రజలకు చెరువుల అవసరం ఎంతో ఉంది. తాగునీటికి, ఇతర జీవిత అవసరాలైన స్నానం చేయడం, బట్టలుతకటం వంటి వాటికి, వ్యవసాయానికి చెరువుల నీరు అవసరం ఉంది. పల్లెటూరి కల్పవల్లులు చెరువులే.
 3. ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది ?
జవాబు. ప్రస్తుతం చెరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. చెరువుల బాగోగులను ఎవరూ పట్టించుకోవటం లేదు. అవి జల కాలుష్యంతో మురికి కాల్వలుగా తయారయ్యాయి.
4.చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి.
జవాబు. చెరువులు పల్లెలకు ప్రాణాలు. చెరువులు సంస్కృతికి, సంప్రదాయాలకు నిలయాలు. అనేక వృత్తులకు ఆధారం. చెరువులో పెరిగే చేపలు, తాబేళ్ళు వంటి వాటికి, వాటి ఒడ్డున ఉండే చెట్లమీద పెరిగే పక్షులకు, కీటకాలకు చెరువులే ఆధారం.


పాఠం ఉద్దేశం:

తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోను చెరువులున్నాయి. అవి ప్రజావసరాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు. వృత్తులకు ఉనికిపట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకొంటే అవి మనలను సంరక్షిస్తాయని తెల్పడము, తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలుపడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

ప్రవేశిక:
నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును! వ్యవసాయానికి ప్రధాన వనరును! బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకునిమ్మని నాలో చేర్చుకుంటాను! మళ్ళీ రా ! వినాయకా అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆటవిడుపును. పశుపక్ష్యాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని నేను! ఇంతకూ నేనెవరో చెప్పలేదుకదా! పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును!! నా హృదయాంతరంగ భావాన్ని చెబుతా వినండి.
1

తెల తెల వారుతున్నది.... సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నడు. వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శమాదిరి హాయిగ ఉన్నది. పక్షుల కిలకిలలు మంగళవాద్యంలాగ మారుమ్రోగుతున్నయి. ఆహారం కొరకు రెక్కబలం చూపుతూ ఆకాశంలో దూసుకువెళ్ళే పక్షులు బద్దకానికి స్వస్తి పలుకమంటున్నయి. పశువులు సమైక్యతను చాటుతూ నావైపుగా బిరబిర అంగలు వేస్తున్నయి. రైతులు నన్ను పలకరించుకుంట తమ పొలాలకు వెళుతున్నరు. ఇంతకు నేనెవరిని అనుకుంటున్నరా? మీరనుకుంటున్నది నిజమే!

నేను చెరువును. సమాజానికి కల్పతరువును. అన్ని వృత్తులూ కొనసాగడానికి ఆధారాన్ని, ఉత్పాదక శక్తులకు ఊతాన్ని, వ్యవసాయానికి ప్రధానమైన వనరును. ఆబాలవృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాన్ని వినోదాన్ని పంచే వేదికను. సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను. సామెతలు, జాతీయాలు, పాటలకు జన్మస్థలాన్ని, పరోపకారభావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని, మనుషులనేకాదు, పశుపక్ష్యాదులను కూడా సమాదరించే సమతాకేంద్రాన్ని, సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని, నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్న. పొద్దుపొద్దున్నే ఈ పోరేమిటి? అనుకోకండి ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగ ఉంటది. మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతయి.

ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గువోయాలె. నాకట్ట గట్టివడంకనే ఇండ్గోలడలు పైకి లేస్తయి. "నీరేప్రాణాధార" మన్నడు ఒక కవి. అన్నిటికీ నీరు కావలసిందే కదా! 'నిలువ నీడకై తరువు, నిలువ నీటి చెరువు' ఉండవల్సిందే. నీరులేక ఊరు ఎట్లబతుకుతది? మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు తాగునీరు. పంటపొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావులేకాదు ఊరిలోని మంచినీళ్ళ బావులు కూడా కళకళలాడేది నావల్లే. భూగర్భజలానికి నేను శ్రీరామరక్ష. నేనుంటే వండిన కుండున్నట్లే.

నాలుగు ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఆ వ్యవసాయానికి ఆధారకేంద్రాన్ని నేను నిండితే అందరికి చేతినిండా పనే. మత్స్యకారులు నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నరు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో సన్నాశ్రయించి హాయిగా బతుకుతున్నరు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణాశక్తిని 'పరోపకారార్థమిదం శరీరమ్' - అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణను. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం.

నా నీరే కాదు. నా మట్టి కూడా మీకెంతో ఉపయోగపడుతది. నా ఒండ్రుమట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువు. అందుకే దీనిని బండ్లమీద ఎక్కించి రైతులు సగౌరవంగా పొలాలకు తోలుకుంటరు. నాలోని ఔషధగుణాలు ఆయుర్వేదవైద్యులకెరుక. నా ఒండ్రుమట్టి చికిత్సతో తీవ్రజ్వరాలు కూడా మటుమాయమైతయి

సంస్కృతితో ముడివద్ద జీవితం నాది. బతుకమ్మ పండుగకు నావైభోగం ఇంతంతనరానిది. అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నాదగ్గరికే వస్తరు తల్లిగారింటికి వచ్చినట్లు, తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూలవల్ల నీటికాలుష్యం దూరమైతది. మన సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలున్నయి. బతుకమ్మను నానీటిలోనే వదులుతరు. అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగ ఉంటది. వినాయక చవితి సందర్భంగా గణపతిమూర్తులు నా ఒడికే చేరుతయి. నా మీద మీకు ఎంత ప్రేమో. నాకు ఎట్లాంటి నష్టం కలుగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్టించి పూజిస్తరు. వాసలు పడకుంటే నాకట్ట మీద 'విరాటపర్వం' చెప్పిస్తరు.
కవులు, కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో! కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంత చైతన్యం! ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలేసుకుంట. ఎందరో చిత్రకారులు నాదృశ్యాలను చిత్రించి భేషనిపించుకున్నరు. భజనబృందాలు, కోలాటాల గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బడిముబ్బడి చేస్తరు.

________________
ఆలోచించండి – చెప్పండి
 1.‘మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి’ అనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు. చెరువు తనను గురించి వివరించాలనుకుంది. తన ప్రత్యేకతలను చాటాలనుకుంది. ఉదయాన్నే లేవగానే మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి కదా! అప్పుడు చెపితే ఆ మాటలు మనకు చక్కగా అర్థమౌతాయి. చెరువులను చక్కగా సంరక్షించుకోండి. పల్లెలకు నీటి వనరు చెరువు అని చెప్పటం “మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి” అనటంలోని ఆంతర్యం.
2.భూగర్భజలానికి నేను ‘శ్రీరామరక్ష’ అని చెరువు అనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు?
జవాబు.
శ్రీరామరక్ష అంటే రక్షణ, దన్ను అని అర్థం. చెరువులలోని నీరు భూమిలోనికి ఇంకి భూగర్భజలాలు నిలువ ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి చెరువులు భూగర్భజలాలకు శ్రీరామరక్ష అని అంగీకరించాలి.
______________________
II
పిల్లలకు నేనొక ఆటస్థలాన్ని. అబ్బో! వీళ్ళను చూడండి. బోకెపెంకలను నానీటిపై విసురుతున్నరు. అవి కప్పల్లాగా దుంకుతూ పోతున్నయి. ఆ విసరడంలో ఎంత ఒడుపుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిలో ఏ నైపుణ్యముంటదో కదా! అవకాశం వస్తే తప్ప బయటపడదు. పిల్లలకైతే నా నీటిలో ఈతకొట్టాలని ఎంత ఆత్రమో!  కొన్నిసార్లు అది బెడిసికొట్టి ప్రాణాలకే ముప్పుతెచ్చిన సంఘటనలు నాకింకా గుర్తున్నయి. 'అతి సర్వత్ర వర్జయేత్' అతి ఎప్పుడూ పనికిరాదు. మీదు మిక్కిలి నీటిదగ్గర, నిప్పుదగ్గర సాహసం చేయొద్దని పెద్దలు 'చెవినిల్లుగట్టుకొని' మరీ చెప్పారు.

నా అలుగు పారినపుడు ప్రజల కండ్లల్లో వెలుగును చూసితీరాల్సిందే. అక్కడ ఒక జాతర వాతావరణమే! ఉరకలు వేస్తూ దుంకి ముందుకు సాగే నా నీరు కార్యశీలియైన ఉత్సాహవంతుని లక్షణాన్ని చెప్పకనే చెపుతది. ఆ'రామసక్కని' దృశ్యాన్ని చూడడానికి రెండు కండ్లు చాలవు. చూసేవాళ్ళు కొందరైతే, నా నీళ్ళలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు. అలుగుకట్టమీది నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు. ఎక్కడో పట్టుదప్పి నీళ్ళలో జారిపడితే అక్కడి వాళ్ళంతా గొల్లున నవ్వుతరు. పడినవాళ్ళు నీళ్ళపాలే కాదు, నవ్వులపాలౌతరు కూడా.
సుందరంగా సుకుమారంగా విచ్చుకున్న తామరపూలు నా సిగలోపెట్టుకున్నట్లు లేవూ? వినాయకచవితికి వచ్చిందంటే నా తామరలకు భలేగిరాకీ, వాటిని కోసుకుపోవడానికి జనం ఎగబడతరు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవుతరు. విశేషమైన అభివృద్ధిని 'తామర తంపర'గా పేర్కొంటరు, నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే "నీటికొలది తామర” అన్న సామెత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెకలతో నా రంగస్థలంపై సంగీత కచేరి చేస్తుంటయి. అంతవరకు అవి ఎక్కడుంటాయో తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని

ఎప్పుడు సంపద కలిగిన 
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్ 
తెప్పలుగ చెరువునిండిన 
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

అనే జీవితసత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండు బద్దెన. నన్నాశ్రయించుకొని చేపలు తమ ఉనికిని భద్రపరచుకొంటాయి. కొన్ని సార్లు చేపలవేటకై గాలంతో వచ్చినోళ్ళు గంటలతరబడి నాకట్టమీద కూచోవడం మీరు చూసే ఉంటరు. ఏ పని సాధించాలన్న, సహనం కావాలన్న గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలె.

నేను ఎండకాలంలో సన్నబడుత. అప్పుడు చేపలకు, కప్పలకు చాలా ఇబ్బంది. అంతవరకు నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నయో గుర్తుబట్టడమే కష్టం. కాని ఇప్పుడుమాత్రం తెలిసిపోతది. అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో 'కప్పలు చేపలు బయట పడ్డయి'. అనే పదబంధాన్ని వాడుతరని మీకు తెలుసా! 'చెర్లో బర్లను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు', 'గుండెచెరువైంది', 'గాలం వేయడం', 'గండి కొట్టడం' వంటివి నానుండే పుట్టుకొచ్చినయి.

నాకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డరు? మనసున్నవారికి నా నీళ్ళు శ్రమజీవుల చెమటతీరుగు కనిపిస్తయి. నా నీళ్ళను తమ పొలాలకు పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమైతరు రైతులు. నాకు గండిపడినప్పుడు కలిసికట్టుగ కష్టపడి నన్ను బాగుచేస్తరు. ఈ ఐకమత్యమే నేను కోరుకునేది. 'కలసి ఉంటే కలదు సుఖం.' అన్నరు కదా! మన పెద్దలు, పల్లెల్లోనే కాదు పట్నాల్లోనూ నా సేవలకు లోటేలేదు. ఉదయం సాయంత్రం ఎంతోమంది నా ఒడ్డుకే విహారానికి వస్తరు. నా అలలను తాకి వచ్చే చల్లని గాలిస్పర్శకు మురిసి పోతుంటరు. కొందరు అక్కడక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడువుతరు. వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ, చిరు వ్యాపారులు పొట్టపోసుకుంటరు. నామీద పడవలను నడుపుతూ జలవిహారంలోని ఆనందాన్ని వచ్చిన ఆదాయం-ఉభయ తారకంగ ఉంటది.
------------------------------------
అలోచించండి-చెప్పండి

'.‘రామసక్కని’ దృశ్యం చెరువు దగ్గర ఏయే సందర్భాలలో కనిపిస్తుంది ?
జవాబు. చెరువు దగ్గర రామసక్కని దృశ్యం చెరువులోకి అలుగు పారేటప్పుడు కన్పిస్తుంది. అలాగే వర్షం పడినప్పుడు కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది.

 చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగింది. ఎందుకు ?
జవాబు.శ్రమ జీవులు తమ కష్టంతోనే చెరువును తవ్వి నీరు నిల్వఉండేట్లు చేశారు. అందుకే వారి కష్టం నుండి కారిన చెమటలే నా నీళ్ళు అని చెరువు చెప్పుకున్నది
----------------------------------

III
ఇవన్నీ ఎట్ల ఉన్నా ఈమధ్య నా పరిస్థితి ఏమి బాగలేదు. నా బతుకు చిత్తుబొత్తెంది. విశాలంగా, స్వచ్ఛంగా ఉన్న నన్నుజూసి కండ్లలో నిప్పులుపోసుకుంటున్నరు. శానతనం జూపి నాపై దురాక్రమణలు జరిపేవాళ్ళు కొందరు. నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు. 'అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ము నాకే రానీ' అన్నట్లు స్వార్ధంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నరు. పూడిక సరిగా తీయడం లేదు. వెరసి 'గంగాళమంత ఉండే దాన్ని తాంబాళమంత' అయిన. నేను నిండితే మీ కడుపులు నిండుతయి. నేను ఎండితే మీకదుపులు ఎండుతయి. ఇదీ మన అనుబంధం. ఈ అనుబంధాన్ని మరిచిపోయి నన్ను కలుషితం చేస్తున్నరు. పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల ప్రభావం వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతున్నది. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థపదార్థాలు నా నీటిని విషంగా మారుస్తున్నయి. ఈ నీటిని తాగిన పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతుంటే నేను విలవిలలాడిపోతున్న, నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జల ప్రభావంవల్ల రోగాల బారిన పడుతున్నరు. ప్లాస్టిక్ వంటి వ్యర్థపదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుస్తున్నయి. నా పరిస్థితి 'నానాటికి తీసికట్టు నాగంబొట్లు' అన్నట్లున్నది.

వినాయక చవితి వచ్చిందంటే నాగుండె గుభేలుమంటది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్లో రసాయనిక రంగులతో రూపొందించిన వినాయకమూర్తులను వందల సంఖ్యల్లో నాలో నిమజ్జనం చేస్తున్నరీజనం. ఇక నా పరిస్థితి ఎంతదుర్భరంగా ఉంటదో మీరే ఊహించండి. 'అల్లందిన్న కాకోలె' ఎంత మొత్తుకున్న ఎవరూ పట్టించుకుంటలేరు. వెనుకటికి నా మట్టితో వినాయకులను చేసేవారు. దానివల్ల పర్యావరణానికి ప్రమాదం కలిగేది కాదు. కాని ఇప్పటి ఈ విపరీత ధోరణులు ప్రాణుల మనుగడకే సవాలు విసరుతున్నయి. బ్రతుకు దినదినగండంగా మారుతున్నది. నాగరికత వెర్రితలలు వేయగూడదు.

ఇవన్నీ చెపుతుంటే నాపై కన్నెర్ర చేస్తరెందుకు? 'చేసేవి లోపాలు చెపితే కోపాలు' అన్నట్లున్నది మీ వ్యవహారం. కనీసం ఇప్పటికైనా జాగ్రత్తపడుతరని నా ఆశ. 'చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే' ఏం లాభం. మళ్ళీ మళ్ళీ చెపుతున్న 'చెరువును పొమ్మనడమంటే కరువును రమ్మనడమే'.

తరతరాల చరిత్రకు నేను 'మౌన సాక్షిని'. నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు. నాపైన వారికి ప్రత్యేకశ్రద్ధ. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికీ చెక్కుచెదరలేదు. అవి ఎంతో విశాలమైనవి. మంథనిలో 'శిల సముద్రం' అని చెరువుంది. వనపర్తి రాజులు ఏకంగా 'సప్తసముద్రాలు' అని పేరుపెట్టుకున్నరు చెరువులకు. పెద్దచెరువులను 'సముద్రం'గా పిలిచే సంప్రదాయం తెలంగాణలో ఉంది.

కాలమేదైనా, నాకేమైనా మీకొరకే జీవిస్తున్నా. వానకాలంలో నేను నిండి, పంటలు పండటానికి సహాయపడుతున్న. నా నీళ్ళనే కాదు మీకళ్ళకు, మనసుకు ఆనందాన్నీ పంచుతున్న. వెన్నెలకాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్ములను పరవశింపజేస్తున్న. ఎండాకాలంలో మత్స్యకారుల ఆర్థికబలాన్ని పెంచుతున్న. ఇంతగా మీకు సహాయపడే నన్ను చిన్నచూపు చూడడం న్యాయమా? ఇప్పటికైనా మీకు సోయిరావాలె. నన్ను రక్షించడమంటే మిమ్ములను మీరు రక్షించుకోవడమే. అందుకే చివరిగా మీ గదువవట్టి చెప్పుతున్న! చెట్లను పెంచండి. తద్వారా వర్షాలను ఆహ్వానించండి. నేను నిండేటట్లు మీ బతుకు పండేటట్లు చూసుకొండి.


----------------------------------------
ఆలోచించండి-చెప్పంది.
5.చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే మనమేం చేయాలి?
జవాబు. చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే వాటిని దురాక్రమణ చేయకుండా కాపాడాలి. పూడికను ఎప్పటికప్పుడు తీస్తుండాలి. పొలాలలో వేస్తున్న రసాయనాలు చెరువుల్లో కలవకుండా చూడాలి. ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాలు, రసాయనాలు చెరువులో కలవకుండా జాగ్రత్త పడాలి. చెరువు ప్రక్కన మలమూత్ర విసర్జన చేయడం, గుడ్డలు ఉతకడం, పశువులను, వాహనాలను కడగడం చేయకుండా చూడాలి.
 6.“చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు. చెరువులు తరతరాల చరిత్రకు, సంఘటనలకు మౌనసాక్షులు. ఏనాడో కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం చెరువులు నేటికీ మౌనసాక్షులుగా నిలిచి ఉన్నాయి. మంథనిలో ‘శిలసముద్రం’ చెరువుంది. వనపర్తి రాజులు చెరువులను సముద్రాలని వ్యవహరించేవారు. ఆయా కాలాల్లోని మనుషులు చనిపోయిన, ఆ కాలం నాటి చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆ కాలం నాటి సంఘటనలను నిశ్శబ్దంగా చూసాయని అర్థం.
---------------------------------

ఇవి చేయండి.
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. బడిలో ఉపన్యాసపోటీ నిర్వహిస్తున్నారు. మీరు కింది అంశాల్లో దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో దాని గురించి చెప్పండి.
(అ) చెరువులే జీవనాధారం.
జవాబు.మా బడి ఉపన్యాసాల పోటీలలో నేను చెరువులే జీవనాధారం అన్న అంశంపై మాట్లాడాలనుకుంటున్నాను. గ్రామాలలో ప్రతి ఊరికి ఒక చెరువు తప్పక ఉంటుంది. చెరువులు సమాజానికి కల్పతరువులు. ప్రజల తాగునీటికి, సాగు నీటికి, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్ష్యాదులకు, దాహాన్ని తీర్చేవి చెరువులే! చెరువులు గ్రామ సౌందర్యానికి తొలిమెట్టు. పిల్లలకు వేసవిలో ఆటవిడుపు. చెరువు లేని గ్రామం చెట్టు లేని గ్రామం ఉండదు. నిలువ నీడకై తరువులు నిలువ నీటికై చెరువులు ఉండవలసిందే!

(ఆ) చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత.
జవాబు. చెరువులు గ్రామాలకు కల్పతరువులు. వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. వ్యర్థ పదార్థాలతో, రసాయనాలతో చెరువులు కలుషితం కాకుండా చూసుకోవాలి. చెరువు గట్లను ఎప్పటికప్పుడు తెగిపోకుండా రక్షించుకోవాలి. త్రాగునీరు, సాగునీరు అందించటంతో పాటు పలు ప్రయోజనాలున్న చెరువులను రక్షించుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలి. గ్రామీణ సంస్కృతీ సంపదలను నిలబెట్టుకోవాలి.

(ఇ) చెరువులు మన సంస్కృతి కేంద్రాలు.
జవాబు. చెరువులు మన సంస్కృతికి కేంద్రాలు. బతుకమ్మ పండుగ చెరువుతోనే ముడివడి ఉంది. గ్రామంలోని అమ్మలక్కలందరూ తల్లిగారింటికి వచ్చినట్లు చెరువు వద్దకే వస్తారు. పలురకాల పూలతో చెరువును అలంకరిస్తారు. ఆ పూలు చెరువులోని కాలుష్యాన్ని నివారిస్తాయి. ఇక వినాయక చవితి విషయం చెప్పనక్కర లేదు. వినాయక మూర్తులను చెరువులోనే కలుపుకుంటారు. వానలు కురవకపోతే చెరువు కట్టపై విరాట పర్వం చెప్పిస్తారు. కవులు, కళాకారులు, కథలు, పాటలు, పద్యాలు చెరువుపైనే రాస్తారు. చెరువును చిత్రకళాకారులు అందంగా చిత్రిస్తారు. సామాజిక సంస్కృతిలో చెరువులు ఒక భాగం అయ్యాయి.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం


1. పాఠంలోని 4, 8, 14, 20 పేరాలు చదివి, వాటికి శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని 4, 5 కీలకపదాలు రాయండి.

4వ పేరా శీర్షిక : ‘నీరే ప్రాణాధారం’. ఊపిరి, నీరే ప్రాణాధారం, తరువు, చెరువు, బతుకుతది, కళకళలాడేది. శ్రీరామరక్ష.

8వ పేరా శీర్షిక : ‘చెరువులు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు!’. కళాకారులు, గాయకులు, చైతన్యం, ముక్కున వేలేసుకొను, చిత్రకారులు, చిత్రించి, భేషనిపించుకొను, ఆటపాటలు, ఇబ్బడిముబ్బడి.

14వ పేరా శీర్షిక : ‘చెరువులు – పద బంధాలు’ సన్నబడుత, ఇబ్బంది. గుర్తు పట్టటం, తెలిసిపోతది, బయట పడింది. పుట్టుకొచ్చినవి.

20వ పేరా శీర్షిక : ‘చెరువులు మన మౌన సాక్షులు’ ఉదారంగా, ప్రత్యేక శ్రద్ధ, చెక్కుచెదరలేదు. విశాలమైన, సప్త సముద్రాలు, సంప్రదాయం.

2. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు రాయండి.

నేలపై కురిసే వర్షం నిలువచేయడానికి అనువైన చెరువులు, కుంటలు, ఆనకట్టలు లేకపోవడం వల్ల మనకు వర్షపు నీరు ఉపయోగపడకుండా వృథాగా సముద్రంలోకి పోతున్నది. చెరువుల పునర్నిర్మాణం ప్రజల మనుగడతో ముడిపడిన కీలకాంశం. ప్రకృతి ప్రసాదంగా ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి, వాటికి పూర్వవైభవం తెచ్చే పనిని ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రభుత్వం స్వీకరించింది. రాజుల కాలంలో తవ్వించిన చెరువులే ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారం. నీటి లభ్యత కొరవడకుండా చూసుకోవడం ప్రతి తరం బాధ్యత. స్థానిక ప్రజలను నీటిని పరిరక్షించటంలో భాగస్వాములను చేయాలి. నీటికొరత ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. చెరువులు, నదుల, భూగర్భవనరుల నుంచి మనం తోడే ప్రతి లీటరు నీటికి రెట్టింపు ప్రయోజనం కలిగేటట్లు వ్యవహరించాలి.

వర్షం నీటిని నిలువచేయడానికి అనువైనవేవి ?
వర్షం నీరు మనకు ఉపయోగపడకుండా పోతోంది ? ఎందుకు ?
తెలంగాణ సంపదలుగా గుర్తింప తగినవి ఏవి ?
ప్రభుత్వం చెరువులకు పూర్వవైభవాన్ని తేవటానికి ఆరంభించిన పథకం ఏది ?
నీటిని పరిరక్షించటంలో ఎవరిని భాగస్వాములను చేయాలి ?
మన ఆర్థిక వికాసాన్ని దెబ్బతీసే విషయం ఏమిటి ?
ఎవరు త్రవ్వించిన చెరువులు ఇప్పటికీ జీవనాధారంగా ఉన్నాయి ?
చెరువులు, నదులు, భూగర్భ జలాల వాడుకలో ఎట్లాంటి ప్రయోజనాన్ని ఆశించాలి ?

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి ? నిండుగా ఉండటానికి మనం ఏం చేయాలి ?
జవాబు. చెరువులు వానాకాలంలో నిండుగా ఉంటాయి. మంచిగా వానలు కురిస్తే చెరువులు నెలలు నిండిన బాలింతరాలుగా ఉంటాయి. చెరువులు నిండుగా కళకళలాడుతూ ఉండాలంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచితే చక్కటి వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే చెరువులు నిండుతాయి. చెరువులలో ఎప్పటికప్పుడు పూడికను తీయించాలి. చెరువు గట్లకు రక్షణ కల్పించాలి. ఆక్రమణలకు గురికాకుండా చూడాలి. ఫ్యాక్టరీ రసాయనాలు, ఎరువులు చెరువులో కలవకుండా చూడాలి. కాలుష్యం చెరువుల దరి చేరకుండా చూడాలి. గ్రామాలలోని మురుగునీరు చెరువులోకి చేరనీయకూడదు. అప్పుడే చెరువులు నిండుగా ఉండి గ్రామాలకు సౌందర్యాన్ని, సుఖసంతోషాలను, ధనధాన్యాలను ఇస్తాయి.

(ఆ) చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళలో వెలుగులు ఎందుకు వస్తాయి?
జవాబు. అలుగులంటే చెరువు నీరు నిండి బయటకు పారుటకు పెట్టిన తూములు. అలా అలుగులు పారితే ప్రజలలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఎందుకంటే నీటితో నిండిన చెరువులు సమాజానికి కల్పతరువులు కదా! చక్కగా అలుగుల ద్వారా నీళ్ళు ప్రవహిస్తే పంటలు వేసుకోవటానికి అనుకూల సమయం వచ్చిందని అర్థం. జలకళ సిరులను కురిపిస్తుందన్న ఆనందం. నీరే ప్రాణాధారం. చెరువుల అలుగులు పారితే నీటి కరువు తీరినట్లే. అలుగులు పారుతున్నప్పుడే గ్రామాలు రామసక్కని దృశ్యాలను అందిస్తాయి. మనం సిరిసంపదలతో తులతూగుతుంటే బంధుగణం మన వద్దకు వస్తారు. అట్లే చెరువులు నిండుగా ఉంటే కప్పలు, జలచరాలుచేరి, తామరలు వికసించి అందాన్నిస్తాయి. అందుకే అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగులు చూస్తాము.

(ఇ) మీ ఊరి చెరువు కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు. చెరువులు సమాజాలకు కల్పతరువులు. అవి కాలుష్యానికి గురైతే గ్రామాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే చెరువు గట్టులను జాగ్రత్తగా కాపాడాలి. వాటిని ఆక్రమణలకు గురికాకుండా చూసుకోవాలి. గ్రామంలోని మురికి నీరు చెరువులలోకి చేరకుండా ఆపాలి. ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ రసాయనిక పదార్థాలను చెరువులలో పడేయకూడదు. ఎప్పటికికప్పుడు చెరువులలో పూడికను తొలగిస్తుండాలి. అప్పుడే చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉంచగలం.

(ఈ) చెరువుల వలన కలుగు లాభాలను రాయండి.
జవాబు. చెరువులు సమాజానికి కల్పతరువులు. అన్ని వృత్తులు సాఫీగా సాగటానికి వనరులు. వ్యవసాయానికి ప్రధానమైన నీరు ప్రజలకు, పశుపక్ష్యాదులకు దాహాన్ని తీర్చేవి చెరువులే! నీరే ప్రాణాధారం. ఆ నీటిని అందించేవి చెరువులే. చెరువులు ఉంటే భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయి. చెరువులు విహారస్థలాలు కూడా! చెరువులలో జలవిహారం కోసం పడవలను నడిపి పొట్టపోసుకుంటారు. చెరువులు నీటితో పాటు ప్రకృతి సౌందర్యాలను అందిస్తున్నాయి. వేసవి కాలంలో మత్స్యకారులకు ఆర్థిక బలాన్నిస్తున్నాయి. బహువిధ ప్రయోజనకారులు చెరువులు. వాటిని రక్షించుకుంటే సమాజాలు రక్షింపబడతాయి.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) “చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు. చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నది నిజం. చెరువులు గ్రామాలకు కల్పతరువులు. అన్ని వృత్తులు కొనసాగటానికి ఆధారాలు. ఉత్పాదక శక్తులకు ఊతాలు. వ్యవసాయానికి ప్రధానమైన వనరులు. ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాలు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికలు. పరోపకారాన్ని చాటే పవిత్ర రూపాలు. మనుషులకే కాక పశుపక్ష్యాదులకు, జలచరాలకు ఆవాసాలు. సమాజంతో చెరువుల బంధం విడదీయరానిది. నిలువ నీడకై తరువులు – “నిలువ నీటికై చెరువులు” ఉండవలసిందే. మనకు నాలుగు ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాలి.
వ్యవసాయం చేయాలంటే నీరుండాలి. వర్షపునీటిని నిలువవుంచుకొని వ్యవసాయానికి నీటిని అందించేవి చెరువులు. చెరువులు లేని పల్లెలను, గ్రామాలను మనం ఎక్కడాచూడం. వ్యవసాయానికి, తాగునీటికి, సకల జీవకోటికి ఆధారభూతమైనవి చెరువులు. చెరువులను చక్కగా కాపాడగలిగితే అవి మనలను కాపాడతాయి. అందుకే చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి.

(ఆ) ‘సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది’ అని చెరువు ఎందుకన్నది?
జవాబు. చెరువు జీవితం గ్రామీణ సంస్కృతికి నిలయం. బతుకమ్మ పండుగకు చెరువు వైభోగం ఇంతింత అనరానిది. తెలంగాణ మహిళలు బతుకమ్మలతో తల్లిగారింటికి వచ్చినట్లు చెరువు వద్దకు వస్తారు. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతో చెరువులను సింగారిస్తారు. ఈ పూలు నీటి కాలుష్యాన్ని నివారిస్తాయి. బతుకమ్మ చెరువులో తేలియాడుతుంటే ఉయ్యాలపై ఊగుతున్నట్లుటుంది. ఇక వినాయక చవితిని గురించి చెప్పనక్కర లేదు.
చెరువులో ఉండే తామరలు వినాయకునికి అలంకారమౌతాయి. గణపతి మూర్తులు చివరకు చెరువు ఒడికే చేరుతాయి. చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని కట్ట మైసమ్మను పూజిస్తారు. వానలు పడకపోతే చెరువు కట్టలపై ‘విరాట పర్వాన్ని’ చదివిస్తారు. చిత్రకారులు చెరువు పై పలు చిత్రాలు వేస్తారు. పెద్దలు భజన బృందాలు, కోలాటగుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు చెరువుకు ఆనందాన్నిస్తారు. పిల్లలకు చెరువు ఆటస్థలం. చెరువులేని గ్రామం లేదు. అందుకే తన జీవితం సమాజ సంస్కృతిలో భాగం అని చెరువు చెప్పుకొంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

 1. చెరువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయండి.
జవాబు. చెరువును నేను చెరువును
గ్రామాలకు కల్పతరువును
పల్లెల అభివృద్ధి నా ధ్యేయం
సంస్కృతి సంప్రదాయాలకు నిలయాన్ని
జీవుల దాహార్తిని తీర్చే వలయాన్ని ||చెరు||

వ్యవసాయానికి మంచి వనరును
పర్యాటకులకు విహార స్థలాన్ని
కళాకారులకు ప్రేరణనిచ్చే
రూపం నాది నిలువ నీటికై నేనున్నాను. ||చెరు||

బతుకమ్మ పండుగ వైభోగం
గణపతి స్వామి నిమజ్జనం
కట్టమైసమ్మ పూజా విధానం
నాతోనే ఇవి సాకారం. ||చెరు||

మత్స్యకారులకు జీవన భృతిని
సహజ వనరును ఎరువును నేను
రోగాలను హరించే ఔషధాన్ని నేను ||చెరు||

2. పాఠం ఆధారంగా ‘చెరువు’ మాట్లాడుతున్నట్లుగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు. గ్రామ సౌందర్యానికి ఆధారాన్ని, వ్యవసాయానికి ప్రథమ వనరును బతుకమ్మను సాగనంపి, విఘ్నేశ్వరుని ఆహ్వానం పలికే సమాజానికి కల్పతరువును. నేనెవరనుకుంటున్నారు. చెరువును. నా గురించి చెబుతాను వినండి. నేను చెరువును, గ్రామాలకు వెలుగును, అన్ని వృత్తుల వారికి ఆధారాన్ని, పిల్లలను, పెద్దలను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, పరోపకారం నా వృత్తి. నా మనుగడ మీకు ప్రవృత్తి కావాలని ఆశిస్తున్నాను.
మీకు తెలుసా నేను ఎందరికో జీవనాధారాన్ని, నా నీరే కాదు నాలోని మట్టి కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నాలో ఉన్న ఒండ్రుమట్టి చాల సారవంతమైంది. అది మీ పంట పొలాలకు ఎరువు. ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది. నేను మీ సంస్కృతి సంప్రదాయాలకు పండుగలకు నిలయాన్ని. నాలో ఎన్నో జలరాశులు, జలజీవాలున్నాయి. పిల్లలకు నేనొక ఆటస్థలాన్ని. హాయ్ పిల్లలు నా దగ్గర సాహసం చేయకండి. అది మీకే ప్రమాదం. నాలో అలుగులు పారినపుడు నన్ను చూడండి. అది ఒక రామసక్కని దృశ్యం అవుతుంది. నన్ను కలుషితం చేయకండి – నన్ను ఆక్రమించి ఇళ్ళ నిర్మాణం చేయకండి. నా ఒడ్డులగు గట్టులను రక్షించండి. నేను మీకు రక్షణగా ఉంటాను…..

V. పదజాల వినియోగం

1. కింది పదాలు, వాక్యాలు చదవండి.
చెవినిల్లు గట్టుకొని, ఉర్కబోయి బోర్లపడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, కుండబద్దలుకొట్టినట్లు, వండిన కుండ, గాలం వేయడం, గుండె చెరువైంది, తామరతంపర, కన్నెర్ర.

పై వాటిలో ఉన్న తేడాలు ఏమిటి ? వాటిని ఏమంటారు?

జాతీయం: ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదా : చెవినిల్లుకట్టుకొని, గుండె చెరువైంది.

సామెత: సామ్యతనుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. ఉదా : కుండబద్దలు కొట్టినట్లు; ఉర్కబోయి బోర్లపడ్డట్టు.

2. కింది వాటిలోని జాతీయాలను గుర్తించండి. వాటిని వివరించండి.

కోరిక, పండ్లుకొరుకు, కొట్టినపిండి, మొసలికన్నీరు, మాధుర్యం, తలలో నాలుక, కలుగు, పూసల్లో దారము, చెరువు, నిండుకుండవోలె, జాతర, చల్లగాలి

మొసలి కన్నీరు : దొంగకన్నీరు. లేని బాధ నటిస్తూ ఏడవడాన్ని, బాధను చూపడాన్ని మొసలి కన్నీరు అంటారు.
నిండుకుండ వోలె : గంభీరంగా తొణకక బెణకక ఉండే మనస్తత్వాన్ని గురించి చెప్పటానికి దీనిని ప్రయోగిస్తారు.
పండ్లు కొరుకు : కోప భావాన్ని వివరించడానికి ఈ జాతీయాన్ని వాడతారు.
పూసల్లో దారము : పూసలలో దారమంటే పూసలకు దారమెలా ఆధారమో అలా. ఆధారంగా నిలవాలని చెప్పటానికి ప్రయోగం చేస్తాం.
తలలో నాలుక : అందరితో కలివిడిగా కలిసి పోవటాన్ని చెప్పటానికి ఈ పదం ఉపయోగిస్తాం.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : విద్య = వి, ద్ + య్ + అ
(A) అక్క = అ, క్ + క్ + అ
(B) ముగ్ధ = ము, గ్ + థ్ + అ
(C) మూర్ఛ = మూ, ర్ + చ్ + అ

కింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి.
(అ) ఇప్పటికైనా జాగ్రత్తపడుతారని ఆశ.
(ఆ) నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధి చెందుతుంది.
(ఇ) అవి ఎక్కడుంటాయో తెలియదు.

పై వాక్యాలలో ఇప్పటికైనా అనే మాటలో మొదటిపదం – ఇప్పటికి, రెండవ పదం – ఐనా
నీళ్ళెంత అనే మాటలో మొదటిపదం – నీళ్ళు , రెండవ పదం – ఎంత
ఎక్కడుంటాయో అనే మాటలు మొదటిపదం – ఎక్కడ, రెండవ పదం – ఉంటాయో

పై వాటిని ఇట్లా విడదీయవచ్చు.

ఇప్పటికైనా = ఇప్పటికి + ఐనా
నీళ్ళెంత = నీళ్ళు + ఎంత
ఎక్కడుంటాయో= ఎక్కడ + ఉంటాయో
ఇట్లా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు.

2. కింది పదాలను విడదీసి రాయండి.

(అ) ప్రజలెంత = ప్రజలు + ఎంత
(ఆ) నేనెవరిని = నేను + ఎవరిని
(ఇ) రేమిటి = పోరు + ఏమిటి
(ఈ) నాకింకా = నాకు + ఇంకా
(ఉ) ఇవన్నీ = ఇవి + అన్ని
(ఊ) సోమనాద్రి = సోమన + అద్రి

ప్రాజెక్టు పని
1. వివిధ పత్రికల్లో వచ్చిన (పర్యావరణ) ప్రకృతిని వర్ణించే గేయాలు/వ్యాసం/కవితలను సేకరించండి. తరగతి గదిలో పాడి/చదివి వినిపించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : వివిధ పత్రికల్లో వచ్చిన (పర్యావరణ) ప్రకృతిని వర్ణించే గేయాలు / కవితలు సేకరించడం.

2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXX
(ఆ) సమాచార వనరు : వివిధ దినపత్రికలు
(ఇ) చదివిన పుస్తకం : వాల్మీకి రామాయణం

3. సేకరించిన విధానం : వివిధ దినపత్రికలు చదివి పర్యావరణానికి సంబంధించిన గేయాలు సేకరించడం జరిగింది.

4. నివేదిక :

ఈ తోట మా తోట
ఇంపుల మూట
ప్రీతిరసముల ఊట
ప్రియముల బాట
చిన్ని మొక్కలు మాకు
చిన్ని తమ్ముళ్ళు
చిన్ని తీవలు మాకు
చిన్ని చెల్లెళ్ళు
నిజమైన ప్రేమతో
నీళ్ళు పోస్తాము
గాటంపు ప్రీతితో
కలుపు తీస్తాము

ఇరవైన కరుణతో
ఎరువు వేస్తాము
శ్రద్ధగా దిన దినం
వృద్ధి చేస్తాము
చిగురు వేసిననాడు
చిటి విందు మాకు
మొగ్గ తొడిగిన నాడు
మురిపెంబు మాకు
కలకల లాడిన
కలుగు వేడుక మాకు
మిలమిల మెరసిన

మోదమ్ము మాకు
చిగురాకు తెంపము
చెలిమితో మేము
ఎవరు గిల్లిన గాని
ఎవరు తెంపిన గాని
మము కొట్టినట్లుండు
మనసులో మాకు
మా చిన్ని మొక్కలు
మము చేర బిల్చు
మము జూచి పుష్పాలు
మందహాసము చేయు

5. ముగింపు : ప్రకృతిలో మొక్కలు, పక్షులు, జంతువులు ఎన్నో ఉన్నాయి. ప్రకృతిని రక్షించుకోవడం మన ధర్మం.

అర్ధాలు

స్పర్శ                   = తాకుట, స్పృశించుట
మంగళవాయిద్యం = సన్నాయి చప్పుడు
స్వస్తి                = ముగింపు
అంగలు            = అడుగులు
కల్పతరువు       = కోరికలను తీర్చే చెట్టు
ఊతము           = ఆధారము
ప్రేరణ.               = ప్రోత్సాహము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి