సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

9, అక్టోబర్ 2023, సోమవారం

IX- V. శతక మధురిమ

v శతక మధురిమ

 పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతక పద్యాలలో ప్రతిపద్యం చివర మకుటం ఉంటుంది. శతక పద్యాలు అంటే ఏ పద్యానికి అది స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్ల భూపాలీయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఉత్పలమాల, ఏకప్రాస శతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలు ఉన్నాయి.

కుల శైలంబులు పాదు పెల్లగిల్ల దిక్కూలంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదం చద్భంగి నుప్పొంగి నన్
జలజాత ప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దల కంచలబ్జడు చొప్పుడప్పడు భవద్భక్తుడు సర్వేశ్వరా!
-యథావాక్కుల అన్నమయ్య

భావం: సర్వేశ్వరా! కుల పర్వతాలు ఉన్మూలమయ దిక్కుల అంచులలో పడిపోయనా సముద్రాలు తీరాలను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తమ గతులు తప్పినా నీభక్తుడు చలించడు అదే విధంగా ఉబ్బిపోడు. ఇదంతా జ్ఞానికి ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా ఒక్క శివభక్తి మనసున నాటుకుంటే చాలు మనమెవరమన్న సంగతి అనగా తాను ఎవరో తెలుసుకొనే జ్ఞానాన్ని కలిగిఉంటాడు శివభక్తుడు.!

శా . జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాడవుట హింసారంభకుండవుట మి
థ్యాతాత్పర్యము లాడు టన్నియు బరద్రవ్యంబు నాశించి యీ 
శ్రీ తానెన్ని యుగంబు లుండ గలదో శ్రీకాళహస్తీశ్వరా!‌. - ధూర్జటి.


చెవికిం కుండల మొప్పు కాదు శృతమే చేదమ్మి కిన్గంకనం
బు విబుషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్ 
బ్రవి లేపంబులు గావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ
లవితేంద్రాతిగ వైభవా! సురభిమల్లా! నీతి వాచాస్పతీ!
 - ఎలకూచి బాలసరస్వతి

ఉ.భూపతికాత్మ బుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా!
- మారద వెంకయ్య

చం. ధనము, ధనాభిమానము, సదా ధన తృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటే పేదకడు ధన్యుడు, సజ్జనా
ప్తిని శమియించు వెంకటపతీ! అఖిలాండ పతీ! శ్రియఃపతీ!

మత్తేభం. గరమునచ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీ యాత్మలో
మురియంబోకు మనుష్యదుర్విషమున్మూలింపుమా ముందు యీ
నరులందుండు విషమ్ము సూదినిడనైన్సంధి లేదో ప్రభూ
హర శ్రీ వేములవాడ రాజఫణి హరా! రాజరాజేశ్వరా!
-గౌరీభట్ల రఘురామ శర్మ.

శా. ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్పుతో దేశికా
దేశంబుందలఁదాల్చి యోగ విధులర్థిన్ సల్పుచున్ భవ్యమౌ 
నాశీర్వాదము నొజ్జచేఁ బడసితానందంగనౌ నంచితం బౌశాంతంబును నచ్యుతార్చిత పదాబ్జా! చంద్రమౌళీశ్వరా!
-ఇమ్మడిజెట్టి చంద్రయ్య



I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
అ) ధన తృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి.
జ. ధన తృష్ణ అనగా ధన దాహం. ధన సంపాదన కోసం మనుషులు అడ్డదారులు తొక్కుతారు. సత్పురుషుల సాంగత్యం నుండి విడివడుతారు. లంచగొండి తనం పెరగడం, ఆశ్రిత బంధుపక్షపాతం వీటికి కారణాలు.
ధనము పై దురాశ అంత తేలికగా నశించదు. సత్పురుషుల సహవాసం మంచి మాటల వల్ల క్రమంగా ధనము పై దురాశ పోతుంది. సంపాదించినది మనిషి చనిపోయిన రోజు వెంట రాదని తెలియజేయాలి. నీతి నిజాయితీ కీర్తి మాత్రమే విలువ తెస్తాయని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ధన తృష్ణ క్రమక్రమంగా తగ్గిపోతుంది.

ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి?
జ. బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం మనిషికి మిన్న అని చెప్పారు పెద్దలు. చెవులకు శాస్త్ర పాండిత్యం అందాన్ని ఇస్తుంది కానీ బంగారు కుండలాలూ అందాన్ని ఇవ్వవు. బంగారు కడియాల వల్ల చేతులకు అందం రాదు దానధర్మాల వల్లనే సౌందర్యములపడుతుంది. మానవునికి సుగంధ లేపనాలు శోభను ఇవ్వవు. శాస్త్ర పండిత్యము, దానము, పరోపకారము అనేవి మనిషికి నిజమైన అందాన్నిస్తాయి.


ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి?
జ. ఆపదలకు కారణం మన ప్రవర్తన.
ప్రవర్తనలో మార్పు వచ్చినట్టయితే ఆపదలు రానే రావు. 
బిడ్డ వలె కోడలిని చూడాలి.
కార్మికులను భాగస్తులుగా పెంచి లాభంలో వాటా ఇవ్వాలి.
దళితులను తమ సహోదరులుగా భావించాలి. 
పరమతస్తులను తన వారివలె ప్రేమించాలి.
జీవులందరికి తన వలె చూసుకుని ప్రేమించాలి.

ఈ) .‘ధనికుని కంటే పేద గొప్ప కదా !’ దీని గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ఉత్పల సత్యనారాయణాచార్య “ధనము, ధనాభిమానము, శ్రియఃపతీ !” అను పద్యంలో ‘ధనికుని కంటే పేద కడు ధన్యుడు” అన్న వారి అభిప్రాయంతో నేను గొంతు కలుపుతున్నాను. ఎందుకంటే ధనం, ధనంపై అభిమానం, ఎల్లప్పుడు ధనం సంపాదించాలనే కోరిక అనే ఈ మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. కాని పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్నా మంచివారికి దగ్గరగా ఉండటం వల్ల అది కూడా నశిస్తుంది. కనుక ధనికుని కంటే పేద గొప్ప కదా !

2) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
అ) 'శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, విమర్శిస్తాయి' వివరించండి.
జ. సమాజంలోని ప్రతి విషయం కవిత్వమై ప్రతిబింబిస్తుంది. మంచిని కొనియాడుతుంది. చెడును విస్మరించాలి అని నొక్కి చెబుతుంది. సంఘంలో ఉన్న అనేక దురాచారాలను కవులు ఎత్తిచూపుతారు. శతక పద్యాలలో శతక కవులు మంచి చెడులను ప్రతిబింబంగా చూపుతారు. 
    మన శతక పద్యాలలో దూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతక పద్యంలోని నాటి సంఘంలోని మనుషులు ఇతరుల సంపాదన ఆశించి ఎలా జీవిస్తున్నారో చెప్పాడు. పరద్రవ్యాన్ని ఆశించి జోస్యాలు చెప్పడం. అబద్దాలాడడం. వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం. చాడీలు చెప్పడం. హింసను ప్రేమించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. నేటి కాలంలో కూడా ఇవన్నీ ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.
అందె వెంకటరాజం గారు అత్తా కోడళ్ళ పంచాయతీలు. కర్మాగారాల్లో అలజడులు. దళితుల పట్ల అగ్రవర్ణాల చూపే అరాచకాలు. అనేక అంశాలను ఎత్తిచూపారు. ఇది నేటి సమాజాన్ని విమర్శిస్తున్నట్లుగా ఉంది. 
        ఈశ్వరుడు విషయము మింగడం వలన లాభం ఏమీ లేదని కవి పేర్కొంటూ నేటి మనుషులలో అవినీతి, అరాచకం, లంచగొండితనం, దురాచారాల వంటి విషం పెరిగిపోయింది. వాటిని ఈశ్వరుడు మింగితే బావుండును అని విమర్శించాడు.
 కాబట్టి శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. విమర్శిస్తాయి.


3. శతక మధురిమలోని ఏదైనా ఒక పద్యం ఆధారంగా ఒక నీతికథను తయారుచేయండి.
జవాబు:
భక్తులే కాదు మనుషులన్న వారెవ్వరైనా పద్ధతిని, నీతిని తప్పకూడదని సర్వేశ్వర శతకపద్యం చెబుతోంది. నీతి, నిజాయితీలు మనిషి ఉన్నతికి దోహదపడతాయనేదే ఈ కథ.

నిజాయితీ

రామాపురంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని, వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు రాజయ్య ఆ అడవిలో నది ఒడ్డునున్న పెద్ద చెట్టెక్కి కట్టెలు కొడుతుండగా చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు, మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నించాడు. కాని గొడ్డలి దొరకలేదు. ఎంతో బాధతో భగవంతుణ్ణి మనసులో ప్రార్థించాడు. తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు.

అతని ప్రార్ధనను విని గంగాదేవి ప్రత్యక్షమై, “ఎందుకు బాధపడుతున్నావు” అని అడిగింది. “తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు” అని బాధపడ్డాడు. ”సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి ?” అని బంగారు గొడ్డలిని చూపించింది. “నాది కాదు తల్లీ !” అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి దేవత వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి?” అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ఎదుట నిలిచి “ఇదేనా ?” అన్నది. రాజయ్య సంతోషంతో “అమ్మా ! ఇదే నా గొడ్డలి” అని ఆనందంతో పరవశించాడు.
రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది.
నీతి : నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది.


 (లేదా)
పాఠంలోని పద్య భావాల ఆధారంగా విద్యార్థుల్లో నీతి విలువల పట్ల అవగాహన పెంచడానికి ఒక కరపత్రాన్ని తయారు చేయండి.


      

విద్యార్థులు - నీతి నియమాలు

విద్యార్థి సోదరులారా! 

పెద్దలు సూచించిన నీతి నియమాలు పాటిద్దాం. దైవ భక్తి కలిగి ఉందాం. ఐశ్వర్యం శాశ్వతం కాదు. ర్యాంకుల కోసం, క్రీడల కోసం, తప్పుదారులు తొక్క వద్దు. తోటి విద్యార్థులపై నిందారోపణలు చేసి హింసను ప్రేరేపించకూడదు. దేశభాషలందు వెర్రి తను మంచిది కాదు. విద్య ప్రధానం అలంకారాలు అవసరం లేదు. పరోపకారమే అసలైన అలంకారం తెలుసుకోండి.

మీరు తలపెట్టే కార్యాన్నిసాధించడం కోసం కష్టపడి పని చేయండి మీ ఆలోచన ఆచరణాత్మక రూపకంగా మార్చుకోండి. మన చుట్టూ మనల్ని నిందించే మనుషులు ఎక్కువగా ఉంటారు. వారిని జాగ్రత్తగా గమనించండి. దళితుల్ని సోదరులుగా భావించండి. పరమతల వారిని ప్రేమించండి జీవులందరిని మీలాగే చూసుకోండి పెద్దలపట్ల గౌరవాన్ని పెంపొందింప చేయండి శాంతి సత్యం అహింసలకు ప్రధాన స్థానం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. 

 

ఇట్లు 

విద్యార్థి మిత్రులు.

 

III. భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. ఆపద = కష్టం
ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో వ్యవహరించాలి.
ఆ. నిక్కం : అవగాహన చేసుకొని చదివినదే నిక్కమైన చదువు.
ఇ. ఒజ్జ : అన్ని విద్దెలకు ఒజ్జ ఆ బొజ్జగణపయ్య.
ఈ. తృష్ణ : అర్జునుని గెలవాలన్న తృష్ణతో కర్ణుడు పరశురాముని శిష్యుడయ్యాడు.
ఉ. విభూషణము : నెమలి ఈక అదృష్టం ఏమిటంటే శ్రీకృష్ణుని విభూషణం కావడమే.

2. అర్థాలు:

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1.తృష్ణ=దప్పిక

2.సజ్జనుడు: మంచినే కోరుకుంటారు – గీత గీసిన పదానికి అర్థం
జవాబు: సత్పురుషుడు.

3.“మహి= భూమి 

 4. ఆకసమున శీతభానుడు వెన్నెల కురిపిస్తున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
జవాబు:చందమామ

 5. అబద్ధములు – అనే అర్థం వచ్చే పదం
జవాబు:మృషలు

6.మంత్రులు – అనే అర్థం వచ్చే పదం
జవాబు. ప్రధానులు

7.కొండెములాడు వానితో స్నేహం వద్దు – గీత గీసిన పదానికి అర్థం
జవాబు: చాడీలు చెప్పేవాడు

 8.“పరద్రవ్యం” అంటే అర్థం
జవాబు: ఇతరుల సొమ్ము

 9.ఉర్వి అంటే ధరణి అనే అర్థం. ఇటువంటి అర్థం వచ్చే మరొక పదం
జవాబు: భూమి

3. ప్రకృతి వికృతులు గుర్తించండి.
ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పు కాదేమో అని తెలిసి దోసం చేయడం తప్పు.
  1. దోషం - దోసం
  2. సింహం - సింగం
  3. కార్యము - కర్జము
  4. కలహము - కయ్యం 

1. భాషాంశాలు – వ్యాకరణం
  1. కలహాగ్నులు =  కలహ+అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
  2. వెంకటేశ్వర = వెంకట + ఈశ్వర = గుణ సంధి
  3. కుండల మొప్పు = కుండలము  + ఒప్పు =  ఉత్వ సంధి 
  4. యోధులనేకులు = యోధులు  + అనేకులు = ఉత్వ సంధి 

కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి
  1. కార్యదక్షులు - కార్యమునందు దక్షుడు - సప్తమి తత్పురుష సమాసం 
  2. మూడు దోషాలు - మూడు అయిన దోషాలు - ద్విగు సమాసం 
  3. కర్మశాల - కర్మం కొరకు శాల - చతుర్థి సమాసం 
  4. ఆశా పాశం - ఆశ అనెడి పాశం - రూపక సమాసం



అదనపు సమాచారం:
. వాక్యాలు :
 1.రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు. రామకృష్ణారావు జైలుకు వెళ్ళారు. పై వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే.
జవాబు: రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.

2. పాండవులు అరణ్యవాసం చేశారు. పాండవులు అజ్ఞాతవాసం చేశారు. పై వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే...
జవాబు:పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.
3.సామాన్య వాక్యాలు ఏవి ? 
జవాబు:చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
4.“నేను ఈ ఇడ్లీలు చేశాను” అంది హైమ – ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే
A) హైమ అన్నది “నేను ఈ ఇడ్లీలు చేశాను,” అని హైమా అన్నది
జవాబు: తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన  మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై  డా. మండల స్వామి  రాసిన సమీక్షా వ్యాసాన్ని  ఈ రోజు తేది: ...