సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

25, జూన్ 2024, మంగళవారం

VII. 3. శతక సుధ


ప్రశ్న1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు? ఏమి చేస్తున్నారు?
జవాబు.
పై బొమ్మలో గురువు, విద్యార్థులు ఉన్నారు. గురువు బోధిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారు.

ప్రశ్న 2.
శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు?
జవాబు.
శిష్యులు తమకు తెలియని విషయాలపై ప్రశ్నలు అడిగి ఉండవచ్చు.

ప్రశ్న 3.
గురువుగారు ఏం చెప్తుండవచ్చు?
జవాబు.
గురువుగారు విద్యార్థులకు అర్థం అయ్యేలా సందేహాలు తీర్చుచూ ఉండవచ్చు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన కొన్ని నీతివాక్యాలు చెప్పండి.
జవాబు.

  1. కలసి ఉంటే కలదు సుఖం.
  2. నిజాన్ని మాట్లాడండి.
పాఠం ఉద్దేశం

శతకాలు నైతికవిలువలను పెంపొందింప జేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థు లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం.

పేజీ 20

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం నూరు/నూటికి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతకపద్యాలలో పద్యానికి 'మకుటం' ఉంటుంది. ఇవి 'ముక్తకాలు'. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.

ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్నసత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలున్నాయి.

కవి పరిచయం

1. సుమతి శతకం - బద్దెన. లౌకికనీతులను అతిసులువుగా

కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన 'సుమతి' శతకంతోపాటు 'నీతిశాస్త్ర ముక్తావళి' అనే గ్రంథాన్ని రాశాడు.

(13వ శతాబ్దం)

2 . దాశరథి శతకం - కంచెర్ల గోపన్న. రామదాసుగా పేరుపొందిన

కంచెర్ల గోపన్న 'దాశరథీ కరుణాపయోనిధీ' అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మంజిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.

17వ శతాబ్దం

18వ శతాబ్దం

3&4. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం కాకుత్సం శేషప్పకవి, జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం, ఈయన రచనలు. జనవ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహశతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది.

పేజి 21

5. వేమన శతకం - వేమన. వేమన పద్యం రాని తెలుగువాళ్ళు ఉండరు. సహజకవిగా ప్రసిద్ధిపొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో - నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.

17వ శతాబ్దం

6. నగ్నసత్యాలు శతకం- రావికంటి రామయ్యగుప్త. 'కవిరత్న' ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు, వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.

17.6.1936

30.3.2009

7. శ్రీశ్రీనివాస బొమ్మల శతకం డా|| ఆడెపు చంద్రమౌళి. హనుమకొండ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు 'కవిశశాంక'. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు. సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత.

7.4.1939

28.9.2009

8. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం - శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన 'యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!' అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితోపాటు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి.

20వ శతాబ్దం

విద్యార్థులకు సూచనలు

* పాఠంలోని బొమ్మలు చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

* పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.

* అర్థంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.

* పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు - అర్థాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.

పేజి 22

ప్రవేశిక
పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన (లయ) మానసిక ఆనందాన్నిస్తుంది. నైతికవిలువలను పద్యాల ద్వారా నేర్చుకొని జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? శతక పద్యాల తోటలోకి వెళ్లాం! నైతిక పరిమళాల్ని ఆస్వాదిద్దాం!

I
ఆఁ కొన్న కూడె యమృతము తాఁ గొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్ సోఁ కోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁదు సుమతీ!

- సుమతి శతకం, బద్దెన.
తాత్పర్యాలు

1. ఓ మంచి బుద్ధి గలవాడా! బాగా ఆకలివేసినపుడు తిన్న అన్నమే అమృతంవలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి, ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు.

*2. చం

వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా 
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేదురు ఁజెందెను లేళ్ళు, తావినో 
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా 
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!

- దాశరథీ శతకం, కంచెర్ల గోపన్న.
భావం. కరుణాసముద్రుడా! దశరథపుత్రుడా! శ్రీరామా! తనమేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టిభ్రమకులోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చాంచల్యాన్ని దూరంచేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుము.


* 3.

సీ॥ లోకమందెవడైన లోభిమానవుడున్న     
   భిక్షమర్థికిఁ చేతఁ బెట్టలేడు. 
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని

                                యొరులు పెట్టగఁ జూచి యోర్వలేడు. 

దాత దగ్గర జేరి తన ముల్లె వొయినట్లు 
                            జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు 
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు 
                            మేలుకల్గినఁజాల మిడుకుచుండు

తే.గీ॥ శ్రీరమానాథ! యిటువంటి కౄరునకును 
భిక్షుకుల శత్రువని పేరుబెట్టవచ్చు 
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! 
దుష్టసంహార నరసింహ దురితదూర!
            - నరసింహశతకం, కాకుత్థ్సం శేషప్పకవి.

భావం: 3. ఆభరణాలచే ప్రకాశించేవాడా! శ్రీ ధర్మపురంలో నివసించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! ఓ నరసింహా! పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లె (సొమ్ము) పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టుదానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడుతాడు. ఓ శ్రీరమానాథా! ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చుకదా!
--------------------------------------------------------------
అలోచించండి- చెప్పండి.

వంశానికి కీర్తి తేవడమంటే మీకేమర్ధమైంది?
చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది?
* 'భిక్షుకులకు శత్రువు లోభి' అన్న
కవి అభిప్రాయాన్ని మీరు
ఏకీభవిస్తున్నారా? ఎందుకు?
చాడీలుచెప్పడం మంచి అలవాటు కాదు. ఎందుకో చెప్పండి?
------------------------------------------------------------
పేజీ 23.

*4.

ఏనుగు బోవఁజూచి ధ్వనులెత్తుచుఁగుక్కలు గూయసాగుచో 
దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే 
మానవులందు సజ్జనుడు, మత్తులు కొందరు గేలి చేయు చో 
ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ నృకేసరీ!
-నృకేసరి శతకం, కాకుత్థ్సం శేషప్పకవి.
భావం:4.
ధర్మపురి నరసింహా! ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలిచేసినా, అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం.
★5.
తన మదిఁ గపటము గలిగిన 
తన వలెనే కపటముండుఁ దగ జీవులకున్ 
తన మది కపటము విడిచిన 
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!
-వేమన శతకం, వేమన.
భావం
5. ఓ వేమా! తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సునుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే. కనిపించడు కదా!

* 6. ఆ.వె||

ధనమదమ్ము చేత దానవుండై పోయి 
పేదవాడు పడెడు బాధ గనక 
కష్టపెట్టువారు కలకాల ముందురా 
కల్లగాదు రావికంటిమాట!
-నగ్నసత్యాలు శతకం, రావికంటి రామయ్యగుప్త.
భావం:
6. ధన బలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక, వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా! ఇది నిజం అని కవి భావన.
------------------------------------------------------------
ఆలోచించండి- చెప్పండి.

* ఏయే గుణాలు అలవరుచుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది?
* సజ్జనుని లక్షణాలు ఏమిటి?
* గేలి చేయడమంటే మీకేమర్థమైంది?
* ధనమదమ్ము వంటి ఏయే గుణాలు కలిగిఉంటే దానవులౌతారు?
------------------------------------------------------------
 పేజి 24.
III
* 7. ఆ.వె|| సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము 
కమలనయన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము 
చిద్విలాస భాస! శ్రీనివాస!

- శ్రీ శ్రీనివాస బొమ్మలశతకం, డా|| ఆడెపు చంద్రమౌళి.
భావం:
7. ఓ శ్రీనివాసా! జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు కమలాల వంటి కన్నులు కలవాడా! నిన్ను కనులారా చూడనివ్వు. ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు.

* 8. చం॥ జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనమ్ములన్న సూ 
క్తిని వెలయింప సత్యమని దివ్యపురావిభవైక నవ్య దీ 
ప్తిని గలిగింప మాతృపదపీఠి శిరంబు త్యజించు తెంపు నీ 
వనిశము గూర్పు యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!

- శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం, ధూపాటి సంపత్కుమారాచార్య.
భావం. 8. యాదగిరివాసా! నరసింహా! లక్ష్మీదేవికి భర్త అయినవాడా! ప్రభో! జన్మనిచ్చిన తల్లి. జన్మభూమి స్వర్గం: కంటె మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు.

------------------------------------------------------------
ఆలోచించండి-చెప్పండి.
* 'విజ్ఞానము విశ్వశాంతికొరకు' దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి?
* 'జనని, జన్మభూమి స్వర్గం కన్న మిన్న' అని కవి ఎందుకన్నాడు?
------------------------------------------------------------

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

(అ) ‘సత్పురుషుల స్నేహం అవసరం’. ఎందుకు?
జవాబు.

  1. మంచి వారితో స్నేహం ఎప్పుడూ మంచినే కల్గిస్తుంది.
  2. గంధం చెట్టు అడవిని గంధపు వాసనతో వ్యాప్తి చేసినట్లు మంచివారు తన మంచితనాన్ని వ్యాప్తి చేస్తారు.
  3. మంచివారితో స్నేహం వలన ధైర్యము కలుగుతుంది.
  4. చక్కగా మాట్లాడే నైపుణ్యం వస్తుంది.
  5. మనలోని బుద్ధిమాంద్యం తొలగుతుంది.
  6. అన్యాయం, అధర్మం, అసత్యములకు దూరంగా ఉంచుతుంది.
  7. మనకు మంచి కీర్తి లభిస్తుంది.
  8. మంచివారి స్నేహం వలన లోకంలో సాధించలేనిది లేదు.

(ఆ) ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి. ఎందుకు?
జవాబు.

  1. జననీ, జన్మభూమి స్వర్గం కంటే విలువైనవి.
  2. తల్లి తన పొట్టలో 9 నెలలు తన శరీరం నుండి అన్ని అవయవాలను తయారుచేసి, మోసి చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె చూపే సహనం, ఓపిక, ప్రేమ ఎవరూ చూపలేరు.
  3. అందరికంటే తన బిడ్డ అందమైనదిగా భావించి జీవితం చివరి వరకు ప్రేమను ఇచ్చేది తల్లి కాబట్టి చాలా విలువైనది తల్లి.
  4. పుట్టిన నేల స్వర్గం కంటే చాలా గొప్పది.
  5. ఎక్కడికెళ్ళినా తన జన్మస్థానంలో ఉన్నన్ని విశేషాలనే ఎప్పుడూ గొప్పగా చెప్పాలి! అందుకే స్వర్గంతో సమానం.

(ఇ) ధనం బాగా ఉంటే ఏమేం మంచిపనులు చేయవచ్చు?
జవాబు.

  1. ధనం బాగా ఉంటే చాలా మంచిపనులు చేయవచ్చు.
  2. పేదవారికి ప్రతినిత్యము అన్నదానము చేయవచ్చు.
  3. పేదవారికి ఇళ్ళు వాకిళ్ళు నిర్మించి ఇవ్వవచ్చు.
  4. సమాజంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
  5. పాఠశాలలను నెలకొల్పి అందరికి చదువు చెప్పించవచ్చు.
  6. సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడే అనేక మంచి కార్యాలు చేయవచ్చు.
  7. నీటివసతి, రవాణా వసతులను కల్పించవచ్చు.
  8. వైద్యం చేయించుకోలేని వారికి వైద్యశాలలు నెలకొల్పవచ్చు.
  9. మనసుంటే ఎన్ని పనులైనా చేయవచ్చును.

(ఈ) ‘లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు’. ఎందుకు?
జవాబు.

  1. లోభి (పిసినారి) తాను సంపాదించిన దానిని తాను అనుభవించడు, ఎవరినీ అనుభవించనివ్వడు. అందుకనే సంతోషంగా ఉండలేడు.
  2. లోభికి ఎప్పుడూ దానగుణము లేకపోవడం వలన ఆ దాచిన ధనము తేనెటీగ తాను పెట్టిన తేనె వలె చివరకు ఇతరుల పాలగును.
  3. దాత దానము చేసినా తన సొమ్ము పోయినట్లుగా బాధపడతాడే కాని సంతోష పడడు.
  4. లోభి ఇతరులకు మేలు జరిగితే దుఃఖ పడతాడు.
  5. లోభికి ఎప్పుడూ విచారమే ఎందుకనగా ఎవరూ అతని పిసినారితనాన్ని ఇష్టపడరు.
  6. లోభి ఎంతకూడబెట్టినా సంతృప్తి లేకపోవడం వలన, ఇంకా కూడబెట్టాలనే కోరికతో ఎప్పుడూ దిగులుపడుతూ విచారంగా ఉంటాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. పాఠంలోని శతకపద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి?
జవాబు.

(అ) నిజమైన వ్యక్తి :
1. మనము దానగుణము కలిగి ఉండాలి.
2. కష్టాలను ఓర్చుకొనే గుణాన్ని అలవరచుకోవాలి.
3. ధైర్యంతో ముందుకు వెళితేనే దేనినైనా సాధించగలం.

(ఆ) స్థిరమైన బుద్ధి :
1. ఏనుగు, చేప, పాము, జింక, తుమ్మెదలు తమ బలహీనత వలన ఇతరులకు దొరికి పోతున్నాయి.
2.మానవుడు తనలోని ఆరు శత్రువులను (కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల) జయించినపుడే దేవతగా గౌరవించబడతాడు.

(ఇ) దాత :
1. లోభి తాను తన సొమ్ము దానం చేయడు.
2. దాత తన సొమ్ము దానం చేస్తున్నా చెయ్యనివ్వడు.
3. అట్టి పిసినారిని మనం దూరంగా ఉంచాలి.

(ఈ) సజ్జన స్వభావం :
1. మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి.
2. మంచి పవర్తన అందాన్నిస్తుంది.
3. గౌరవాన్ని కలిగిస్తుంది.
4. కీర్తి పెంపొందింపచేస్తుంది.

(ఉ) స్నేహశీలత :
1. మంచివారి స్నేహం చెయ్యాలి.
2. మంచి స్నేహం మానవతను పెంచుతుంది.
3. అనేక మంచి గుణాలను కలిగిస్తుంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1 పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారుచేయండి. రాయండి. ప్రదర్శించండి.
జవాబు.

  1. ఆకలి రుచి ఎరుగదు.
  2. విసుగు లేకుండా ఇచ్చేవాడే దాత.
  3. కష్టాలను ఓర్చుకొన్నవాడే మనిషి.
  4. ధైర్యసాహసాలు కలవాడే వీరుడు.
  5. మనస్సును అదుపు చేయగలిగేవాడే గొప్పవాడు.
  6. కష్టపెట్టువాడు కలకాలం ఉండడు.
  7. మంచి వారితో స్నేహం చేయాలి

2. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి.

(అ) ధరిత్రి : భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోతవల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం. జవాబు. భూమి, నేల, అవని

(ఆ) తావి : పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికుండదు? సువాసనలు సంతోషాన్నిస్తాయి.
జవాబు.
తావి, పరిమళం, సువాసన

    3. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి.

(అ) శ్రీ : సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కోరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం.
జవాబు.
శ్రీ : సాలెపురుగు, సంపద

(ఆ) ధనము : గోపాలుడు విత్తము తీసికొని అంగడికి వెళ్ళాడు. పాడిసంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.
జవాబు.
ధనము : విత్తము, సంపద

4. కింది పేరాను చదవండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి.

(నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి)

సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది. చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.

ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ఓర్పు ను ప్రశంసించారు.

VI. 2. స్నేహబంధము


2. స్నేహబంధం

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

1.బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఉన్నారు.

2.ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు ?
జవాబు.ఉపాధ్యాయిని చెప్పే మాటలు వింటూ, స్నేహం విలువను తెలుసుకున్నారు. టీచరు గారు ముగ్గురు పిల్లలకు నచ్చజెప్పగా ఆ ముగ్గురు నాలుగో విద్యార్థికి తమ దగ్గరున్న డబ్బులలో వాటా ఇచ్చారు.

 3.పై బొమ్మ చూస్తే మీకే భావన కలిగింది ?

జవాబు.అందరూ స్నేహంగా ఉండాలని, కష్టాల్లో పాలు పంచుకోవాలనే భావన కలిగింది.

పాఠం ఉద్దేశం

స్నేహమమనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘కథ’ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టు కొనే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణుశర్మ ‘పంచతంత్రం’ ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన ‘మిత్రలాభం’లోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం.

ప్రవేశిక

“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడ కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు ? చిత్రాంగుడు ఎవరు ? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది ? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

------------------------------------------------------------

I

ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. 

కాకి పేరు లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం.తాబేలు పేరు మంథరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి.

ఒకరోజు ఒక జింక భయంతో పరుగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టుమీది కెగిరింది. ఒక కొమ్మమీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని, స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులోనుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులోనుండి బయటికి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. "నువ్వెవరివి? ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు?" అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది.

జింక మెల్లగా గొంతు సవరించుకొని "నేను చిత్రాంగుణ్ణి" అన్నది. "ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా, నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి" అని వేడుకొన్నది.

అప్పుడు తాబేలు, "చిత్రాంగా ! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తియ్యటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏలోటూ ఉండదు. అందరం హాయిగా ఉందాం" అన్నది.

   ఎలుక, కాకి, "ఔనౌను" అని అన్నాయి.

చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి • నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి.

ఆలోచించండి-చెప్పండి.

తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారుకదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడుతారో చెప్పండి.

కలిసిమెలిసి ఉండడం వలన కలిగే లాభం ఏమిటి?

IX. 1. ధర్మార్జునులు - డా. సిద్దెంకి





చదువండి అలోచించి చెప్పండి

                 కుజనుల్ గొందరు రేగి యీ వసుమతిన్ క్రూరస్వభావంబుతో 

సుజనాళిన్గడు గుందజేయునెడ రాజుల్ వారి వారింపకే 
నిజ దౌర్బల్యము జూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో 
త్రిజగత్కారణ! భక్తపాలన! హరా! శ్రీగుంటుమల్లేశ్వరా!

- యర్రం విశ్వనాథం గుప్త


ప్రశ్నలు

1. సజ్జనుల బాధలను నివారించే వాళ్ళెవ్వరు?

2. దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి?

3. ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు?



(ఊహాచిత్రం) 17వ శతాబ్దం

పాఠం నేపథ్యం, ఉద్దేశం

పాండవుల నియమావళిననుసరించి, అర్జునుడు తీర్ధయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్యవిస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెండ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనలతో పెంచి, 'విజయవిలాసం' అనే ప్రబంధాన్ని చేమకూర వేంకటకవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు.

కోరిన కోర్కెలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరు గాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచిలక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు అజ్ఞాపరిపాలనావ్రతాన్ని, అర్జునుని పౌరుష, సత్త్వస్వభావాలనూ ప్రతిమానవుడు అలవరచుకోవలసిన మంచిలక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం.

ధర్మార్జునులు 

ధర్మరాజు మరియు అర్జునుడు. వీరిరువురు పాండవులు. ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. (పాండవాగ్రజుడు ధర్మరాజు). నడిపివాడు అర్జునుడు. (పాండవ మధ్యముండు అర్జునుడు). వీరిరువురి గుణగణాలను తెలియ జేయడం కోసమే ఈ పాఠం. 


నేపథ్యం:
ప్రతి పద్య చమత్కారచణుడు చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసం అనే కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగాణాల గురించి తెలిపే సందర్భంలో అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహన శీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు అజ్ఞాపరిపాలనా వ్రతాన్ని గూర్చి ప్రభోదించడం ఈ పాఠం ఉద్దేశం.


ప్రక్రియ పరిచయం: 

ధర్మార్జునులు ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. ప్రబంధం అనగా ఇతిహాస, పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధంలో వర్ణన ప్రధానం.

కవి పరిచయం: 

కవి పేరు : చేమకూర వెంకటకవి 

కాలం :17వ శ.

ఆస్థానం : ‘విజయభవన’ అనే కవి పండిత సభగల తంజావూరు రాజు అభినవ భోజడు అనే బిరుదు గల రఘునాథ నాయకుని ఆస్థాన కవి.

రచనలు : 1. సారంగధర చరిత్ర 

                 2. విజయ విలాసం(రఘునాథ నాయకునికి అంకితం) . ధర్మరాజు తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మ నిరతి ఎటువంటిదో ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు.

శైలి: ప్రతిపద్య చమత్కృతి

 



ప్రవేశిక

ప్రాచీన కాలం నుంచీ రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలనా తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మనదేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలయినాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు, ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. “యథా రాజా తథా ప్రజాః” రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి, ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరులపట్ల, ప్రజలపట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకొనేటందుకు ఈ పాఠం చదువండి.

                         I

'ఉ. ఆ పురమేలు 'మేలు బళి!', యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా 

జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు; సత్య భా 

షా పరతత్త్వకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి 

ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై.

1) యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు, శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వారస్వాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడమనే విద్యపట్ల ఆసక్తిగల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును, గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా 'మేలు, బళి!' అంటూ జేజేలు పలుకుతున్నారు.

సీ. అవలఁ బోయిన వెన్కనాడు టెన్నఁడు లేదు               మొగము ముందఱ నంట మొదలెలేదు, 

 

మనవి చెప్పినఁ జేయకునికి యెన్నఁడు లేదు,        కొదవగా నడుపుట మొదలెలేదు,

 

చనవిచ్చి చౌక చేసినది యెన్నఁడులేదు,   

      పదరి హెచ్చించుట మొదలెలేదు,

 మెచ్చినచోఁ గొంచె మిచ్చుటెన్నడుఁ లేదు,                    మొకమిచ్చకపు మెచ్చు మొదలెలేదు.

తే. మఱియుఁ దొల్లిటి రాజుల మహిమలెన్న 

నితడెఁపో సార్వభౌముఁడ ప్రతిముఁ డనఁగఁ 

బ్రజలఁ బాలించె సకల దిగ్భాసమాన 

కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు.

2) ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడటం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం మంచిమాటలు చెప్పడం మొదటి నుంచీ లేదు. ఏదైనా సాయంకోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండటం ఎప్పుడూ లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు. పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద యిచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూలేదు. యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు. పండితులను, ప్రవీణులనూ మెచ్చినప్పుడు వారికి తక్కువ యివ్వడమనేదే లేదు. ముఖప్రీతికోసం ఎవరినీ మెచ్చడం అసలే లేదు. అట్లాగే పూర్వకాలపు సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులకు తన కీర్తి కాంతులను ప్రసరింపజేస్తూ (పాండురాజు జ్యేష్ఠకుమారుడగు ధర్మరాజు) ప్రజలను పాలించేవాడు.


ఆలోచించండి-చెప్పండి.

'ఆజ్ఞాపరిపాలనా వ్రతం' అంటే ఏమిటి? మీ అభిప్రాయం చెప్పండి.

'మొకమిచ్చకపు మెచ్చు!” అంటే మీరేమనుకుంటున్నారు?

మంచి వారిని ఎందుకు అనుసరించాలి?

.........  

II

సీ. ఎంత లెస్సగ నున్న నంత వేడుకె కాని 

          ప్రజల కల్మికసూయపడుట లేదు 

తనుఁ గొల్వవలెనందఱను ప్రియంబేకాని 

         మానిసి వెగ టించుకైన లేదు 

నిచ్చ వేఁడిన నర్థికిచ్చు చిత్తమె కాని 

          మునుపింత యిచ్చితి ననుటలేదు; 

రేవగల్ ధర్మమార్జించు దృష్టియే కాని 

         న్యాయంబు దప్పిన నడకలేదు;

తే. కలఁడె యిటువంటి రాజులోకమున నెందు? 

జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల 

నేలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె; 

యేలవలె నన్యు? లన నా నృపాలుఁడలరు.

3) ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంతగా సంతోషపడేవాడు కానీ ప్రజల సంపదలను చూసి అసూయపడేవాడు కాదు. అందరితో కలిసిమెలసి ఉండటం ఇష్టమేకాని, ఎవరిపై అసూయ కలిగినవాడు కాదు. తన్ను వేడుకునే యాచకులకు దానం చేసేవాడే కాని, ముందు ఇచ్చాను కదా! అని సాగనంపేవాడు కాదు. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టీకాని, న్యాయం తప్పి ప్రవర్తించేవాడు కాదు. ఇటువంటిరాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? (లేడు) సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండల మంతటినీ ఈ గొప్ప గుణాల ధర్మరాజే శాశ్వతంగా పాలించాలి. ఇతర రాజులెందుకు? అని ప్రజలు అనుకునేటట్లు ఆ ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు.

ఉ. కోపమొకింతలేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా 

రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంత్రుఁడు; నూతన ప్రియా 

టోపములేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁ గా 

ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందనున్?

4) కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం. సత్యస్వరూపుడు, మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. మంచిచెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. కొత్త విషయాలపట్ల ఆడంబరాలులేని స్థిర స్వభావం గలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు (ద్వాపరయుగం వాడు అని కూడా) అని అనవచ్చునా? (అనకూడదు.) కృతలక్షణుడు (కృతయుగలక్షణుడు) అని అనాలి.

ఆలోచించండి-చెప్పండి.

స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి?

'కొంగు బంగారం' అనేమాట ఎప్పుడైనా విన్నారా? అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి.

 

III

కం.

దుర్జయ విమతాహంకృతి 

మార్జన యాచనకదైన్యమర్దనచణ దోః 

ఖర్జులు గలరతనికి భీ 

మార్జున నకుల సహదేవులను ననుజన్ముల్.

అనవచ్చునా? (అనకూడదు.) కృతలక్షణుడు (కృతయుగలక్షణుడు) అని అనాలి.

5) ఆ ధర్మరాజు నలుగురు తమ్ములు ఓటమినెరుగని వారిగా పేరొందిన శత్రువులనైనా ఓడించడానికీ, యాచకుల దీనత్వం పోగొట్టడానికీ ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి వుంటారు. ఈ నలుగురు సోదరులు చాలా పరాక్రమం గలవారు.

కం

పంచామర తరులో! హరి 

పంచాయుధములో! గిరీశు పంచాస్యములో 

యంచున్ సకల జనంబులు 

నెంచన్ బాండవులు వెలసిరేవురు ఘనులై.

6) అయిదు దేవతా వృక్షాలో, విష్ణుమూర్తి అయిదు ఆయుధాలో, ఈశ్వరుని అయిదు ముఖాలో అని లోకులు పొగిడేటట్లుగా పాండవులు ఐదుగురూ గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు.

చ. ఒరిమయు, భక్తియున్, నెనరు నోర్పుఁ, గనంబడఁ, బెద్దపిన్నయం 

తరువులెఱింగి, మాట జవదాఁటకె, చెయ్యుల వేఱులేక, యొం 

డొరుల మనమ్ములో మెలఁగుచుండిరి, "పాండు కుమారులెంత నే 

ర్పరు? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ!" యనన్.

7) స్నేహభావం, భక్తి, ప్రేమ, సహనమూ కనబడేటట్లు, పెద్దాచిన్నా అనే వ్యత్యాసాలు తెలుసుకొని, ఒకరిమాట ఒకరు మీరకుండ, చేసే పనులలో భేదాలు లేకుండా, ఒకరి మనసుననుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్లు. “పాండుకుమారులు ఎంతో నేర్పరులు. ఈ లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమా" అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు.


...........

ఆలోచించండి- చెప్పండి.

అసూయపరులంటే ఎవరు? వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి.

* 'దానగుణం మనిషికి అవసరం' ఎందుకో మీ అభిప్రాయాలు చెప్పండి.

* యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు. ఎందుకో చెప్పండి.

IV

ఉ. అన్నలపట్లఁ దమ్ముల యెడాటమునన్ సముఁడంచు నెన్నఁగా 

నెన్నిక గన్నమేటి, యెదురెక్కడలేక నృపాల కోటిలో

 వన్నెయు వాసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి, సాత్త్వికుల్ 

దన్నుఁనుతింపఁగాఁ దనరు ధార్మికుఁడర్జునుఁ డొప్పునెంతయున్

8) అన్నలపట్ల, తమ్ములపట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరుపొందిన ఘనుడు. రాజులందరిలో ఎదురులేనివానిగా ప్రసిద్ధి, గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు. సాత్త్వికులు కూడా ప్రశంసించేవిధంగా అర్జునుడు ధర్మప్రవర్తన కలిగి వుండేవాడు.

'చ. అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్ 

బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్ 

క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్ము నం, 

దతని కతండె సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్.

9) అందంలో జయంతుని (ఇంద్రుని కుమారుడు) వంటివాడు. దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన (విష్ణువుకు) కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వతరాజపుత్రిక పార్వతికి భర్తయైన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడేవీరుడు. నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి (మరింకెవ్వరూ సాటికాదు). అటువంటి అర్జునుడిని పొగడటం సాధ్యమా? (సాధ్యంకాదు అని భావం).

(చేమకూర వేంకటకవి ప్రతిపద్యము చమత్కృతికి నిదర్శనం. ఈ కవి మనం వాడుకొనే శబ్దాలతోనే సులభంగా రెండు అర్థములను సాధిస్తాడు. ఉదాహరణకు ఈ పద్యంలో జయంతుని తమ్ముడు అర్జునుడు - ఇక్కడ జయంతుడు ఇంద్రుని కుమారుడు, సౌందర్యానికి లోకప్రసిద్ధుడు. అర్జునుడు ఇంద్రుని వరపుత్రుడు కాబట్టి జయంతుడు, అర్జునుడు సోదరులు అందంలో జయంతుని వంటివాడని శ్లేష సాధించబడింది. అట్లే ఈ పద్యములో ప్రతి పాదానికి శ్లేష ఉన్నది.)

తే. పాఱఁ జూచినఁ బరసేన పాఱఁజూచు 

వింటి కొరిగిన రిపురాజి వింటికొరుగు, 

వేయు నేటికి? నలపాండవేయు సాటి 

వీరుఁడిలలేడు; ప్రతి రఘు వీరుఁడొకఁడు.)

10) తేరిపార జూస్తే చాలు శత్రుసైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది. విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రుసమూహం వీర స్వర్గం దారిపడుతుంది. ఇక వేయి మాటలెందుకు? ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడేకాని, ఈ లోకంలో మరొకడులేడు.


 ఆలోచించండి-చెప్పండి. పది

* 'ప్రాణసఖుడు' అని ఎవరినంటారు? వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి?

'ధర్మప్రవర్తన కలిగి వుండటం' అంటే ఏమిటి?

* స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి

సారాంశం:

ధర్మరాజు యమధర్మరాజు వరపుత్రుడు. తాను యిచ్చిన ఆజ్ఞలను తనుకూడా పాటించే స్వభావం గలవాడు. శాంతి, దయ, నిజం చెప్పడం, మంచి వారిని ఆదరించి పోషించడం, దానగుణం, నిశిత పరాక్రమం కలిగి విద్యపట్ల ఆసక్తి గలవాడు. ఇతరులెవరైనా ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి, ఎదురుగా లేనప్పుడు చాటుగా వారిని గూర్చి చేడుగా మాట్లాడడం చేసేవాడు కాదు. ఏదైనా సాయం కోరితే సంపూర్ణంగా సహాయం చేసేవాడు. ఒకరిపట్ల పరిచయమైన మొదట్లో ఎక్కువ మర్యాదగా వుండి తర్వాత్తర్వాత అమర్యాదగా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు.
దానగుణం, ధర్మ ప్రవర్తన కలిగి అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. ప్రజలు గొప్పగా సిరి సంపదలతో ఉంటె సంతోషపడేవాడు. కోపం కొంచెం కుడా లేని సత్య స్వరూపుడు మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. స్థిర స్వభావం గలవాడు.
ధర్మరాజు నలుగురు తమ్ములు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరిని ఐదుగురిని పాండవులు అంటారు. వీరు ఓటమినే ఎరుగని పరాక్రమం గలవారు. అయిదు దేవతా వృక్షాలో, విష్ణుమూర్తి ఐదు ఆయుధాలో ఈశ్వరుని ఐదు ముఖాలో అని పొగిడేంత గొప్ప గుణవంతులు పాండవులు. పాండవులంతా ఒకరి మనసెరిగి ఒకరు నడుచుకుంటూ, పనులలో భేదాలు లేక, పెద్దా చిన్న వ్యత్యాసాలెరిగి మాట మీరకుండా, స్నేహభావంతో భక్తి , ప్రేమ, సహనంతో ఏంతో నేర్పుగా ఉండేవారు.
అన్నల పట్ల, తమ్ముల పట్ల సమాన భావాలు గలిగి, ఎదురులేని పరాక్రమంగల వానిగా పేరొంది ధర్మ ప్రవర్తన గలిగినవాడు పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడు. దయాగుణంలో గరుడ ధ్వజుడైన కృష్ణునికి ప్రాణమిత్రుడు. యుద్ధవిజయాలలో శివునికి పోటీ పడే వీరుడు. ఈ భూమండలంలో అతనికి అతడే సాటియైన అర్జునుని పొగడడం అసాధ్యం.
అర్జునుడు తేరిపార చూస్తే చాలు, శత్రుసైన్యం పారిపోవడానికి సిద్ధమవుతుంది. విల్లుఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారి పడుతుంది. ఇక వేయి మాటలెందుకు? ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే కాని, ఈ లోకంలో మరొకడు లేదు.