సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

10, ఆగస్టు 2023, గురువారం

IX - 3 వలసకూలి

ix  వలసకూలీ

చదువండి – ఆలోచించి చెప్పండి 


ఊరిలో నీకిల్లు లేదు – ఊరి వెలుపల పొలము లేదు
కూలి నిర్ణయ మింతని లేదు – కూలి పని స్థిరమైనది కాదు
ఆలుపిల్లల నేలేదెట్లా – అనే చింత నిన్నిడదోయి వ్యవసాయకూలి.
బతుకు దెరువు లేక నీవు – భార్యపిల్లల నొదిలి పెట్టి
బస్తి చేరి రిక్షలాగి – బలముగ జ్వరమొచ్చి పంటే
కాస్త నీకు గంజినీళ్ళు – కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి.
– సుద్దాల హనుమంతు




1.ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి ? రాసింది ఎవరు ?
జ:ఈ పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి. ఈ గేయాన్ని “సుద్దాల హనుమంతు” రాశాడు.

2. కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి ?
జ:'కూలిపని' అంటే ఏ రోజుకు ఆ రోజు, ఎవరికైనా ఏదో పని చేసిపెట్టి, ఆ పనికి కూలి తీసుకోవడం. ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజూ కూలిపని ఎక్కడ దొరకుతుందో. అని వెతుక్కోవాలి. ఒక్కొక్క రోజు ఏ పని దొరకదు. వర్షం రోజు వచ్చిన ఎవరూ కూలిపని చెప్పారు. కూలిపని కోసం నిత్యం వేటాడాలి.

ఒకరోజు పని ఉంటుంది. మరొకరోజు ఏ పని ఉండదు. లేదా ఏ రిక్షాయో అద్దెకు తీసుకుని దాన్ని తొక్కుతూ జీవనం సాగించాలి. అందుకే కూలిపని స్థిరమైనది కాదు.

3. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ?
జ:కూలిపని దొరికితే, వచ్చిన కొద్ది డబ్బుతో ఏదోరకంగా సంసారం నడుపుకుంటారు. డబ్బు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఋణాలు తీసుకుంటారు. ఏమీ దొరకకపోతే, కాసిని మంచినీళ్ళు తాగి, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. లేదా, ఏ రిక్షాయో తొక్కి దానితో వచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో రిక్షా అద్దె కట్టి, మిగిలినది ఉంటే దానితో బతకాలి.

 4.ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ?
జతాము ఉంటున్న ఊళ్ళలో సరైన వ్యవసాయపనులు, తమ వృత్తిపనులు లేకపోవడం వల్ల, నగరాల్లో కూలి బ్రతకడానికి గ్రామీణ జనం, తమ ఊర్లు వదలి నగరాలకు పోతారు.

వర్షాలు లేకపోతే వ్యవసాయపనులు గ్రామాల్లో దొరకవు. వ్యవసాయ ఆదాయం లేకపోతే, పెద్ద రైతులు చేతివృత్తులవారికి తగిన పనులు చూపించలేరు. అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి నగరాలకు వలసపోతారు. పిల్లల చదువుల కోసం కొందరు గ్రామాలు వదలి నగరాలకు వెడతారు. గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు బొత్తిగా లేకపోవడం వల్లనే ప్రజలు ఊళ్ళు వదలిపోతున్నారు.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించినది. “లయాత్మకంగా ఉండి, ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం”. ఈ గేయం, పల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే ‘గేయం’.
ప్రస్తుత పాఠ్యభాగం, డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది.

కవి పరిచయం

01.01.1929
24.02.2003

పాఠ్యభాగము : ‘వలసకూలీ !’

కవి : డా॥ ముకురాల రామారెడ్డి

దేని నుండి గ్రహింపబడింది : కవి రాసిన ‘హృదయశైలి’ గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.

జననము : వీరు 01.01.1929న జన్మించారు.

జన్మస్థలము : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ‘ముకురాల’ గ్రామంలో వీరు జన్మించారు.

రచనలు :

మేఘదూత (అనువాద కవిత్వం),
దేవరకొండ దుర్గం,
నవ్వేకత్తులు (దీర్ఘకవిత),
హృదయశైలి (గేయ సంపుటి),
రాక్షసజాతర (దీర్ఘకవిత),
ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం),
తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగునవి రచించారు.
పరిశోధనా గ్రంథం : “ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం” అనే అంశంపై పరిశోధనా గ్రంథం వెలువరించారు.

సన్మానాలు:

వీరి ‘విడిజోడు’ కథకు, కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు.
ఆకాశవాణి ఢిల్లీ వారు 1967లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి, సన్మానం చేశారు.

ప్రవేశిక

మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన. ఆశ. కానీ ………….
కాలం కలిసి రాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే …………
అందంగా ఉండవలసిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే ……………..

బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి ….
మనసును పంచుకొనేటందుకు మనుషులు లేక,
బాధను పంచుకొనేటందుకు బంధువులు లేక,
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థజీవితాలను గురించి,
ముకురాలవారు రాసిన గేయం చదువుదాం.




ఆలోచించండి – చెప్పండి. 

1.'గొడ్ల డొక్కలు గుంజడం' అంటే మీకు ఏమి అర్థమైంది ?
జ. గొడ్లు అంటే పశువులు. 'డొక్కలు గుంజడం' అంటే వాటి పొట్టలు తిండిలేక లోపలకు నొక్కుకుపోవడం. పశువులకు తిండిలేక వాటి శరీరాలు ఏండిపోయి, వాటి డొక్కలు లోపలకు దిగిపోయాయన్నమాట. ఆ పాలమూరు జిల్లాలో వర్షాలు లేనందున, ప్రజలకు తిండి, పశువులకు గ్రాసం లేకపోయిందని నాకు అర్థమయ్యింది.

2.కోస్తా ఏర్పాటు ఎవరు, ఎందుకు వెళ్ళారు ?
జ:కోస్తా ఏర్పాటు పాలమూరు కూలీలతో పాటు, ఒక జాలరి వెళ్ళాడు. పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు. కృష్ణాష్టమి వెళ్ళిపోయింది. పశువులకు ఆహారం లేదు. వాగుల్లో నీళ్ళులేక వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. వానపడుతుందన్న ఆశ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో, కోస్తా దేశంలో కూలి ఎక్కువగా దొరుకుతుందని, కూలి పని చేసుకొనేవారు, కోస్తా తరువాత వెళ్ళిపోయారు.

3.పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి ?
జ. పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై 'జీవిస్తారు. పశువుల పాడిపై ఆధారపడతారు. వర్షాలు పడకపోతే, వ్యవసాయం పనులుండవు.. పశువులకు మేత దొరకదు. కూలివారికి కూలిపనులు దొరకవు. మొత్తంపై వర్షాలు లేక, వ్యవసాయం పనులు లేకపోవడం, వ్యవసాయం వల్ల, పాడిపంటల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండటం, అనేవే పల్లె బ్రతుకుల కష్టాలకు కారణాలు.


1.కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది ?
జ. కృష్ణానదిపై ఎగువన ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంటపొలాలకు అందుతాయి. ఆ నీళ్ళు లభ్యమైతే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు వర్షాధారంగా జీవించవలసిన పనిలేదు. హాయిగా కృష్ణాజలాలతో తమ పొలాల్లో పంటలు పండించు కోవచ్చు. ప్రస్తుతం ఆనకట్ట నిర్మించనందువల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పాలమూరు జనం కూలీలుగా మారిపోయారు.

2.'చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళి పోయిందని' కవి ఎందుకు ఆవేదన చెందాడు ?
జ. సామాన్యంగా వర్షాలు శ్రావణ భాద్రపద మాసాల్లో ఎక్కువగా పడతాయి. కార్తీక పౌర్ణమి వచ్చే నాటికి వర్షాలు పూర్తిగా వెనుకపడతాయి. కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిందంటే, ఇంక ఆ సంవత్సరానికి వర్షాలు లేనట్లే లెక్క

ఇక చీకు మబ్బుల ముసురు సంగతి చూద్దాము. ఆ ప్రాంతంలో మబ్బులు ముసురుకున్నాయి. కానీ అవి- చీకుమబ్బులు. అంటే చితికిపోయిన చిన్న చిన్న మబ్బులు అన్నమాట. దట్టమైన నల్లని మబ్బులు కావు. అందుకే చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షం పడలేదన్నమాట.

అంతవరకూ పెద్ద వర్షం లేదు. కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ సంవత్సరం వర్షం పడదు. అందుకే సరైన వర్షం రాలేదని కవి ఆవేదన పడ్డాడు.


ఇవి చేయండి

I అవగాహన – ప్రతిస్పందన

 1.ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
జ. ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో వలసవెడుతూ ఉంటారు.

కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగేనీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం వలసలు పోతారు.
కొన్ని ప్రాంతాల వ్యవసాయపనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే సావకాశం లేక, ఏదైనా పని చేసుకొని బ్రతుకవచ్చనే ఆశతో, నగరాలకు వలసపోతారు.
తాము నివసించే ప్రాంతాలలో విద్యా వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆ సౌకర్యాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం, జీవనభృతి కోసం, అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే, ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు గ్రామ ప్రాంతాలనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కూలీలకు వ్యవసాయపనులు లేనప్పుడు, పనికి ఆహారపథకం వంటి పథకాల ద్వారా, ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలి.
 2.పాఠం చదవండి. 'అంత్యానుప్రాస' పదాలు రాయండి.
జ. ఎన్నడొస్తవు లేబ రీ
పాలమూరి జాల రీ !
గొడ్ల డొక్కలు గుంజి నా
వానపాములు ఎండి నా
సరళా సాగరం నిండేది కాదని
కోయిల సాగరం నిండేది కాదని
గుడిసెకు విసిరి పోతివా
నడుం చుట్టుక పోతివా
మరిగి రాకనె పోతివా
చారు మరిచే పోతివా
కర్మ మెం దుకు
వేయ నం దుకు
మొక్కుతు పోతివా
కోస్తదేశం పోతివా

 3.కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే కాకుండా కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది.

దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి 'మిషన్ కాకతీయ' అనే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది.

ప్రశ్నలు :

ఎ) పై పేరా దేని గురించి చెప్తున్నది ?
జ:పై పేరా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తున్నది.

ఆ) 'మిషన్ కాకతీయ' అంటే ఏమిటి ?
జ:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను ప్రారంభించింది. దానికి 'మిషన్ కాకతీయ' అని పేరు పెట్టింది.

ఇ) తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారు?
జ:తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దానితో తెలంగాణ గ్రామాలు కరువుపీడిత గ్రామాలుగా మారడంతో, తెలంగాణ ప్రజలు వలసలు వెడుతున్నారు.

ఈ) వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి?
జ.తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా, వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి.

ఉ) చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?
జ. :చెరువుల అభివృద్ధి కోసం కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు కృషి చేశారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉంటుందో ఊహించి రాయండి.
జ:పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం కోసం సాగునీటి వసతి లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చింది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేయడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు.



ఆ) ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు?
జ: గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావాలంటే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూకమతలుగా మారాయి. ఆ చిన్నరైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులూ చూపించలేరు.

రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.


గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు నేడు గ్రామాల్లో లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన వస్తువులు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం లేదు.

అందువల్ల పిల్లలకు ఉద్యోగసంపాదనకు తగిన చదువులు చెప్పించడానికీ, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికీ, తాము సుఖంగా జీవితాలు గడపడానికీ, ప్రజలు గ్రామాలు విడిచి, నగరాలకు వలసలు పోతున్నాయి.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి ఉండటం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది.

పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు.

ఇ) “ఎప్పుడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ” అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి.
జ:'లేబరీ' అంటే పనిచేసుకొని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలి, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల వాగులు, వంకలూ ఏండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకునే పనిలేకుండా పోయింది.

కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పనిలేక, కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని, ఎప్పుడొస్తవు లేబరీ అని రాశాడు.

ఈ) గ్రామాల్లో ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది ?
జ. గ్రామాల్లో పంటచేలకు సాగునీటిని అందిస్తే బీడు భూములన్నీ చక్కని పంటపొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువుల నిర్మాణం పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే, ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తిపనివారలకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్యా వైద్య రవాణా సౌకర్యాలు కల్పిస్తే, గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది.


గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాలి. కోళ్ళు, మేకలు, గొట్టాలు వంటివాటిని పెంచాలి. సేంద్రియ మందులను తయారుచేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయంపోషకంగా తయారుచేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషిచేయాలి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ఎ) “వలసకూలీ” గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
'వలసకూలీ' గేయ సారాంశాన్ని రాయండి.
(లేదా)
జ. 
ఓ పాలమూరి జాలరీ ! కూలి ఎక్కువ ఇస్తారని, కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువులు డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. అయినా చినుకుపడే ఆశలేదని కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

వానపడదు. సరళా కోయిల సాగరాలు నిండనే నిండవు. చౌట మడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అనీ, కూలి బాగా ఇస్తారనీ, కోస్తాకు వలసపోయావా !
ఓ జాలరీ ! నావ, గాలం గుడిసెలో పడేసి నీలాను వల తీసుకొని, మన్నెంకొండ దేవుడు వేంకటేశ్వరుడికి మొక్కుతూ, కోస్తాకు వెళ్ళావా ! తిరిగి ఎప్పుడొస్తావు ?

మెరిగె, బొచ్చె చేపలకు అలవాటుపడి, చందమామల, పరకపిల్లల చారు మరిచిపోయావా ! కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా పక్కన ఆనకట్ట కట్టకపోడం వల్లనే కదా !

నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు, జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు ? ఎప్పుడొస్తావు ?

(లేదా)

ఆ) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
జ: వలసకూలీలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు.

వలసకూలీలకు గ్రామాల్లో ఉన్న రేషనుకార్డులు, పింఛన్లు వంటి సౌకర్యాలు, వలసలకు వారు వచ్చిన నగరాల్లో కూడా కల్పించాలి.
వలసకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వారికి ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇవ్వాలి.
వలసకూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. అధికారులు వలస కూలీలకు రేషన్‌కార్డులు ఇచ్చి, వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి.
వలసకూలీల పిల్లలకు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
నగరాల్లో వలసకూలీలు ప్రయాణం చేయడానికి సిటీబస్సుల్లో కన్సెషన్ టిక్కెట్లు ఇవ్వాలి.
ప్రభుత్వం చేసే పనులకు వలసకూలీలకు పనిలో ప్రాధాన్యత ఇవ్వాలి. వలసకూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సౌకర్యాలు కల్పించాలి.
వలసకూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదికి రెండుసార్లు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
వలసకూలీల కష్ట సుఖాలను మునిసిపల్ కౌన్సిలర్సు తెలిసికొని, ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజేయాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/గేయం రాయండి.
జ. :
కూలీ గొప్పగ ముట్టుతుందని
నగర మార్గమై సాధనమ్మని
గ్రామం విడిచి పట్నవాసము
దారి పడితివి అయ్యోపాపము !

ఉన్న ఊరిలో పనులు లేవయా
కన్న తల్లిని విడిచి నావయా.
అమ్మ నాన్నలు దూరమయ్యిరీ
బంధు లందరూ నిన్ను విడిచిరీ

తిండి కోసమీ తిప్పలు తప్పవు
నగరములో మరి పనులు దొరకేనా ?
కడుపు నిండుగా తిండి దొరకెనా ?
ఉండడానికి ఇల్లు దొరకేనా ?

రోడ్డు పక్కనే చోటు దొరకెనా
అమ్మ నాన్నలు గుర్తుకొచ్చిరా
భార్యా బిడ్డలు గుర్తుకొచ్చిరా
అయ్యో కంటను కన్నీరొచ్చేనా

ఎవరైనా నీ పనిని మెచ్చెనా
కడుపు కోసమా ఇంత పరీక్ష
అయ్యా ఎందుకు నీకీ శిక్ష
కండబలమూ ఉన్నవాడవు

మొండితనమూ పట్టినాడవు
కలుగును తప్పక నీకు విజయము
దైవము తోడగు నీకిది నిజము.

(లేదా)

ఆ) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.

సిద్దిపేట,
తేది:--/--/---.

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.


విషయం: వలసలు అరికట్టుటకు తీసుకోవlసిన చర్యల గురించి లేఖ  


ఆర్యా,

నమస్కారాలు. నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల ఎందరో. గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వము కింది సాయం చేస్తే వలసలను అరికట్టవచ్చు.

గ్రామాల్లో ప్రజలకు సాగు, త్రాగునీరు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
గ్రామాల నుండి రవాణా సౌకర్యాలు కల్పించాలి.
గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహారపథకం ద్వారా 365 రోజులూ పనులు చూపించాలి. ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
ప్రతి గ్రామానికి రోజూ 24 గంటలూ విద్యుచ్ఛక్తి సదుపాయం కల్పించాలి. ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామాలకూ ఆర్.టి.సి బస్సు సౌకర్యంగా ఉండాలి.

వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి. వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి. ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకురండి.

ఇట్లు,
భవద్విశ్వసనీయుడు,
పి. రాజా,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
సిద్దిపేట.

చిరునామా:

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.


III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి.
జ:మస్తుగ = అధికంగా
వాక్యప్రయోగం : ప్రభుత్వం దగ్గర మస్తుగ డబ్బు ఉంది.

ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది.
గడువు = కాలవ్యవధి
వాక్యప్రయోగం : ఈ నెల పదవ తారీకు వరకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే గడువు ఉంది.

ఇ) పల్లెదారి పంట పైరు లతో అందంగా ఉన్నది.
జ:పైరు = సస్యము
వాక్యప్రయోగం : ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడబడ్డాయి.

2. కింది పదాలు/వాక్యాలు వివరించి రాయండి.

ఎ) గొడ్లడొక్కలు గుంజినా…
జవాబు:
వివరణ : 'గొడ్లు' అంటే పశువులు. 'డొక్కలు' అంటే వాటి పొట్టలు. గుంజడం అంటే 'లాగడం'. పశువులకు కడుపునిండా తిండి లేకపోతే, వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తం మీద పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోవడాన్ని 'గొడ్లడొక్కలు గుంజడం' అంటారు.

ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని........
జ:వివరణ : చెర్లు అంటే చెరువులు. కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల 'పర్రెలు పడింది' అంటే నెరలు తీసింది అనగా బీటలు పడిందని భావం.

ఇ) పైరులన్నీ వరుగులయ్యే….
జ:వివరణ : పైరులు పచ్చగా ఉంటాయి. 'వరుగులు' అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే, బాగా ఎండు అవి వరుగులు అవుతాయి. పైరులు నీరులేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావము.


ఈ) జల పిడుగు…….
జ:వివరణ : పిడుగు ఆకాశం మీద నుండి వర్షం వచ్చేటపుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డప్పటికీ ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు. మరణిస్తాడు.

ఇది 'జలపిడుగు'. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి 'జలపిడుగు' అంటే పిడుగువలె వచ్చిపడిన 'వరద ఉధృతి' అని భావం. తుపాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుపాను, నదుల వరద "జల పిడుగులు" అని భావం.

3. కింది వ్యాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి.

ఎ) మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి అసలు నెరవేరుతాయి.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

ఆ) సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగల గుండెలు పగిలాయి.
జవాబు:
సింహాలు (ప్రకృతి) – సింగలు (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి.

అ) ఎట్లని
జవాబు:
ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఆ) కాలమంటూ
జవాబు:
కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఇ) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

శబ్దాలంకారాలు :

అంత్యానుప్రాస

కింది వాక్యాలను పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
........ గొడ్లడొక్కలు గుంజినా
........ వానపాములు ఎండినా
........ గుడిసెకు విసిరి పోతివా
………. నడుం చుట్టుక పోతివా
..... ఎన్నడొస్తవు లేబరీ ;
……. పాలమూరి జాలరీ!

గమనిక : పై పాదాలు చివర అక్షరాలు, పునరుక్తమైనాయని గమనించారు కదా ! అక్షరాలు పునరుక్తమవడాన్ని “అంత్యానుప్రాస” అంటారు.

అంత్యానుప్రాస లక్షణం : పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరల్లో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసాలంకారం.

ప్రశ్న 2.
అభ్యాసము : పాఠంలోని అంత్యానుప్రాసాలంకార పంక్తులను గుర్తించి రాయండి.
జవాబు:

ఎన్నడొస్తవు లేబ రీ
పాలమూరి జాల రీ !
గొడ్లడొక్కలు గుంజి నా
వానపాములు ఎండి నా
సరళాసాగరం నిండేది కాదని
కోయిలసాగరం నిండేది కాదని
గుడిసెకు విసరి పోతివా
నడుం చుట్టుక పోతివా
దిక్కు మొక్కుకు పోతివా
కోస్తదేశం పోతివా
మరిగి రాకనె పోతివా
చారు మరిచే పోతివా
........ కర్మ మెందుకు
……. వేయ నందుకు

సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి.
ఉదా : భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం.
గమనిక : పై 'భద్రాచలం' అంటే సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా! 'అచలం' అంటే కొండ అని అర్థం. 'అచలం' అనేది నామవాచకం.
'భద్ర' అనేది పేరు. అనగా “సంజ్ఞ”.
సంజ్ఞనే సంభావన అని అంటారు.
ఈ విధంగా పూర్వపదం (మొదటి పదం)లో సంభావన ఉన్నట్లయితే, ఆ సమాసపదాన్ని “సంభావన పూర్వపద కర్మధారయ సమాసము” అని అంటారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి, విశ్లేషించండి.
రూపక సమాసం
జవాబు:

సరళా సాగరం – విశ్లేషణ : 'సరళా' అనే పేరు గల సాగరం.
కోయిల సాగరం – విశ్లేషణ : 'కోయిల' అనే పేరు గల సాగరం
కోస్త దేశం – విశ్లేషణ : 'కోస్తా' అనే పేరు గల దేశం
మన్నెం కొండ – విశ్లేషణ : 'మన్నెం' అనే పేరు గల కొండ
మెరిగె చాప – విశ్లేషణ : 'మెరిగె' అనే పేరు గల చేప
బొచ్చె చాప – విశ్లేషణ : 'బొచ్చె' అనే పేరు గల చేప
కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి.

ధనాలన్నింటిలో శ్రేష్ఠమైనది విద్యాధనం.
పై గీత గీసిన పదములో విద్యకు ధనమునకు భేదం లేనట్లు చెప్పబడింది.
“విద్య అనేడు ధనం” అని 'విద్యాధనం' అంటే సమాసానికి అర్థం.
'విద్యాధనం' అనే సమాసపదంలో, 'ధనం' అనేది ఉపమానం.
'విద్యాధనం' అనే సమాసపదంలో, 'విద్య' అనేది 'ఉపమేయము'.

అభ్యాసము : కింద గీత గీసిన సమాసపదాలలోని ఉపమాన, ఉపమేయాలను గుర్తించండి.

1. “దయాభరణము” ను ధరించినవాడు భగవంతుడు.
వివరణ : “దయాభరణము” అనే సమాసపదంలో, 'ఆభరణము' అనే పదం ఉపమానము. 'దయ' అనేది ఉపమేయం.

2. పేదలపై కృపారసము కలిగియుండాలి.
వివరణ : 'కృపారసము' అనే సమాసపదంలో, "రసము" అనే పదం, 'ఉపమానం', 'కృప' అనేది ఉపమేయము.
గమనిక : ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని, ఉపమేయమందు ఆరోపించడాన్ని, 'రూపక సమాసం' అంటారు. లేదా “అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

ప్రశ్న 4.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాజంలో గుర్తించండి.

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

అ) పాలమూరు జిల్లా – 'పాలమూరు' అను పేరు గల జిల్లా – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) ఆ) సాగరం – 'సరళ' అనే పేరు గల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) మన్నెంకొండ – 'మన్నెం' అనే పేరు గల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ ) కీర్తికన్యక – కీర్తి అనే కన్య – రూపక సమాసం
ఉ) జ్ఞానజ్యోతి – జ్ఞానము అనే జ్యోతి – రూపక సమాసం

ప్రాజెక్టు పని

మీ గ్రామంలో లేదా వాడలో వలసకూలీల వద్దకు/ వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకుని, వాళ్ళ కష్టసుఖాల గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి.
జ:నేను మా గ్రామంలోని వలస కూలీల వద్దకు, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో, ఏ కారణాలతో వచ్చారో ప్రశ్నావళి ద్వారా వివరాలను తెలుసుకున్నాను. కరవుకాటకాల వల్ల, ఉపాధి అవకాశాలు లేనందువల్ల, కూలీ పనులు లేని కారణంగా వలస వచ్చినట్లుగా గ్రహించాను. వారు ప్రతి రోజు దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అర్థమయ్యింది. అందువల్ల ఇలాంటి వలసకూలీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను అందివ్వాలి. సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వారిని మనలో ఒకరిగా గుర్తించాలి. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించాలి.

(లేదా)

కార్మికుల, కూలీల బతుకు జీవనం గురించి వచ్చిన కథ/కవిత/గేయం/ పాటలను సేకరించి, నివేదిక రాయండి. చదివి వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.


గేయ పంక్తులు – భావం

I

1వ గేయం

కూలి మస్తుగ దొరుకుతాదని!
కోస్తదేశం పోతివా!
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

కూలిమస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని (కూలి ఎక్కువగా వస్తుందని)
కోస్తదేశం పోతివా = కోస్తా ప్రాంతానికి వెళ్ళావా ?
(ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా వరకూ సముద్రతీర ప్రాంతాన్ని కోస్తా దేశం అంటారు. ).
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
(లేబరర్ = LABORER = కూలివాడు)
పాలమూరి జాలరీ = పాలమూరు జిల్లాలోని
బెస్తవాడా ! (మహబూబ్ నగర్
జిల్లాలో ఉండే బెస్తవాడా !)
(జాలరి = చేపలు పట్టేవాడు)

భావం:కూలి బాగా ముడుతుందని, కోస్తా దేశం వెళ్ళావా ? ఓ పాలమూరి జిల్లా జాలరీ ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

2వ గేయం

గోకులాష్టమి దాటిపోయినా, గొడ్లడొక్కలు గుంజివా,
వాగులల్లో, వంకలల్లో వానపాములు ఎండినా,
చినుకురాలే ఆశలేదని, చెర్లుకుంటలు పర్రెవడెవని
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా!

ఎన్నడొస్తవులేబరీ,
పాలమూరి. జాలరీ!

భావార్థం :

గోకులాష్టమి = కృష్ణాష్టమి (గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమినాడు వస్తుంది) (శ్రావణమాసం వెళ్ళిపోతున్నా వర్షాలు రాలేదన్నమాట)
దాటిపోయినా = వెళ్ళిపోయినా
గొడ్లడొక్కలు గుంజినా = పశువుల శరీరాలు, లోపలకు లాగుకుపోయినా; (తిండిలేక వాటి పొట్టలు ఎండి లోతుకు పోయినా)
వాగుల్లో, వంకలల్లో = సెలయేఱులలో, చిన్న ఏఱుల్లో ఉండే
వానపాములు ఎండినా = వానపాములు ఎండిపోయినా (చాలాకాలంగా ఆ వాగులలో, వంకలలో నీరు లేనందున, ఆ మట్టిలోని వానపాములు సైతం ఎండిపోయాయన్న మాట)
చినుకురాలే ఆశలేదని = వానచినుకు పడుతుందని ఆశ ఇంక లేదని ;
చెర్లుకుంటలు = చెరువులూ, గుంటలూ
పర్రెవడెనని = బీటలు తీశాయని ; (నెఱ్ఱలు పడ్డాయని)
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా ఇస్తారని
కోస్తదేశం పోతివా ! = కోస్తాకు వెళ్ళావా !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా! ఎప్పుడు తిరిగి వస్తావు ?
పాలమూరి జాలరీ = పాలమూరులో ఉండే ఓ బెస్తవాడా!

భావం: ఓ పాలమూరు జాలరీ ! కృష్ణాష్టమి వెళ్ళిపోయినా, పశువుల డొక్కలు ఎండిపోయినా, వాగులలో, వంకలలో, వానపాములు ఎండిపోయినా, ఇక్కడ వర్షపు చినుకు నేలపై రాలిపడే ఆశ కనబడటల్లేదని, చెరువులూ, గుంటలూ బీటలు తీశాయనీ, అక్కడ కూలీ బాగా దొరుకుతుందనీ, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావో చెప్పు.

3వ గేయం

చాలు వానే పడదు సరళాసాగరం నిండేది కాదని,
చౌట మడుగులె యెండె, కోయిలసాగరం నిండేది కాదని,
పైరు లన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లాలో ఉండే జాలరివాడా !
చాలు = ఇంక ఆశలు చాలు
వానే పడదు = ఈ సంవత్సరం ఇంక వాన పడదు
సరళాసాగరం = ‘సరళాసాగరం’ అనే నీటిమడుగు
నిండేది కాదని = ఈ సంవత్సరానికి ఇంక నిండదని;
చౌట మడుగులె = చౌడు నేలల్లో ఉన్న నీటిమడుగులే;
ఎండె = ఎండిపోయాయని;
‘కోయిల సాగరం’
నిండేది కాదని = ‘కోయిల సాగరం’ మడుగు ఇక ఈ సంవత్సరం నిండదని
పైరులన్నీ = పంటచేలన్నీ
పరుగులయ్యే
(వరుగులు + అయ్యే) = వరుగులవలె ఎండిపోతే,
పల్లెలో = గ్రామంలో
బతికేది ఎట్లని = జీవించడం ఎలా అని,
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి బాగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తాకు వెళ్ళావా (సముద్రతీర ప్రాంతం)
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! ఇంక వానపడదని, సరళా సాగరం ఇంక నిండదని, చౌడు నేలల్లో నీటిగుంటలు ఎండిపోయాయనీ, కోయిల సాగర్ ఇంక నిండదని, పైరులన్నీ వరుగుల్లా ఎండిపోయాయనీ, ఇంక పల్లెల్లో బ్రతకడం కష్టమనీ, కూలి ఎక్కువగా దొరకుతుందనీ, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! తిరిగి ఎప్పుడు వస్తావు ?

II

4వ గేయం

కొడిమెలూ, గాలాల గడెలూ గుడిసెకు విసిరిపోతివా!
నజాకతు నైలాను వలనే నడుం చుట్టుక పోతివా,
తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతు పోతివా,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లా బెస్తవాడా!
కొడిమెల = నావలూ (చేపల బుట్టలు)
గాలాల గడెలు = చేపలను పట్టే గాలముల, కఱ్ఱులూ
(గడె = చేపలు పట్టేసాధనం).
గుడిసెకు విసిరిపోతివా = నీవు ఉండే తాటియాకుల ఇంటిలోకి విసరిపడేసి వెళ్ళిపోయావా ?
నజాకతు, నైలాను వలనే = సున్నితమైన నైలాను దారంతో అల్లిన వలను మాత్రం.
నడుం చుట్టుక పోతివా = నీ నడుముకు చుట్టుకొని వెళ్ళావా ? (కూడా తీసుకువెళ్ళావా అని భావం)
తిరిగి = వెళ్ళిపోతూ వెనుకకు తిరిగి
మన్నెంకొండ దేవుని = మన్నెంకొండలో వేలిసిన వేంకటేశ్వరుడి
దిక్కు మొక్కుతు పోతివా = ధిక్కు చూస్తూ దండం పెడుతూ వెళ్ళావా ?
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తా దేశానికి వెళ్ళావా ?
ఎన్నడొస్తవు లేబరీ = కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ పాలమూరి జాలరీ ! పడవలు, గాలాల కఱ్ఱులు →గుడిసెలోకి విసరిపోయావా ? సున్నితమైన నైలాను వలను నీ నడుముకు చుట్టుకొని వెళ్ళిపోయావా ? వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి మన్నెంకొండ వేంకటేశ్వరుడి వైపు చూసి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయావా ? కూలి బాగా వస్తుందని, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? కూలివాడా ! ఎప్పుడు తిరిగివస్తావు ?

5వ గేయం

మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనె పోతివా,
చందమానుల, పరక పిల్లల చారు మరిచే పోతినా,
ఎన్నడోస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

మెరిగే చాపకు = మెరిగె అనే చేపలకూ
బొచ్చె చాపకు = ‘బొచ్చెలు’ అనే చేపలకూ (మెరిగెలు, బొచ్చెలు కోస్తాలో దొరికే చేపలు).
మరిగి = అలవాటుపడి (కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగె, బొచ్చెలు అనే చేపలు తినడానికి అలవాటుపడి)
రాకనె పోతివా = తిరిగి పాలమూరు. రాకుండా పోయావా ?
చందమామల, పరక పిల్లల= చందమామలు, పరకలు అనే చేపపిల్లలతో పెట్టే;
చారు మరిచే పోతివా = చారు రుచి మరచిపోయావా!
పాలమూరి జాలరీ = ఓ పాలమూరి జాలరీ !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగెలు, బొచ్చెలు అనే చేపలకు అలవాటుపడి, తిరిగి ఇక్కడకు రాకుండా పోయావా ? ఇక్కడ దొరికే చందమామల, పరక పిల్లల చారు రుచిని మరచిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

TS 9వ తరగతి తెలుగు గైడ్ 3వ పాఠం వలసకూలీ

6వ గేయం

కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంత వరకూ వేయవందుకు
ఏడ ఉంటివొ లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం:

కోస్తబెస్తల = కోస్తా తీరంలోని చేపలు పట్టే బెవాండ్ర
పడవలల్లో = పడవలలో
కూలివయ్యిన కర్మమెందుకు = కూలిగా పడి ఉండవలసిన కర్మము నీకు ఎందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను = కృష్ణా నదిపై ఎగువ భాగాన (పై భాగాన) ఆనకట్టను
ఇంతవరకూ వేయనందుకు = ఇంతవరకూ కట్టనందువల్లనే కదా !
ఏడ ఉంటివొ లేబరీ = ఓ కూలివాడా ! ఎక్కడ ఉన్నావు ?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరీ ! ఎప్పుడు తిరిగి పాలమూరు వస్తావు ?

భావం : కృష్ణా నదిపై ఎగువన ఆనకట్ట కడితే, పాలమూరు జిల్లాకు నీరు వచ్చేది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదని గేయకర్త అభిప్రాయం.

7వ గేయం

ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటె,
చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళిపాయె,
ఇటే పోయిన జనం – అంతా అటే చచ్చే కాలమంటు,
జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెవంటా
ఎక్కడుంటివి లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం :

ఇంటికొస్తానన్న గడువుకు = నీవు ఇంటికి తిరిగి వస్తానన్న కాలవ్యవధికి;
ఇప్పటికి వారాలు దాటే = ఇప్పటికే వారాలు దాటిపోయాయి
చీకు మబ్బుల = చితికిపోయిన చిన్న చిన్న మబ్బుల
ముసురులో = ఎడతెగని చిరు వానలో
కార్తీకపున్నం = కార్తీక పౌర్ణమి
వెళ్ళి పాయె = వెళ్ళిపోయింది
ఇటే పోయిన జనం = ఇక్కడి నుండి కోస్తా వెళ్ళిన జనము
అంతా అటే చచ్చే కాలమంటు = అంతా అక్కడే చచ్చే కాలము వచ్చిందన్నట్లు;
జలపిడుగు పొర్లాడి = ‘నీటి ఉధృతి’ అనగా గోదావరి నది వరద పొంగి
భద్రాచలం మెట్లకు తాకెనంటా = భద్రాచలంలోని శ్రీరామ పాదాలను తాకిందట కదా !
ఎక్కడుంటివి లేబరీ = ఓ కూలివాడా! ఎక్కడ ఉన్నావు?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ కూలివాడా ! నీవు ఇంటికి తిరిగివస్తానన్న కాలవ్యవధి, ఇప్పటికే వారాలు దాటిపోయింది. చిన్నమబ్బుల ముసురువానలో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి కోస్తా ప్రాంతానికి వెళ్ళిన జనం, అంతా అక్కడే చచ్చే కాలం వచ్చినట్లు, గోదావరి వరద భద్రాచలంలోని రామ పాదాలను తాకిందట. నీవు ఎక్కడ ఉన్నావు ? ఓ జాలరీ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

పాఠం నేపథ్యం

తెలంగాణ రాష్ట్రంలో నీటివసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు, నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. బతుకుభారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి.

1977లో తూర్పు తీరప్రాంతానికి వలస వెళ్ళిన, కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుపానుకు గురై తిరిగిరాలేదని, వాళ్ళెక్కడున్నరో జాడతెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...