శ్లేషాలంకారం
ప్రాజెక్టు పని
అలజడి జీవితాలు. జనాకాశానికి వేలాడుతున్న నిరాశల ఆకలి. రజాకార్ల దురాగాతాలకు రక్షణ కరువైన సమాజం రజాకార్లకు వంతపాడే జాగీర్థారీ వ్యవస్థ. పన్నుల రూపంలో పల్లెల వెన్నువిరుస్తున్న కౄరత్వం. మట్టి మనుషుల ఎట్టి బతుకులు. లుప్తమవుతున్న మానవత్వాన్ని, నైతిక విలువల్ని, సమాజం చిన్నాభిన్నమవుతున్న అనేక కోణాలు కనబడుతాయి.
ముస్లిం సంప్రదాయాల్లో ఉన్న ఛాందస భావాలు. అత్యుత్తమమైన వున్నత విలువలు కలిగిన మహమ్మదీయ కుటుంబాలు. హిందూ ముస్లిం సఖ్యత. ఒకవైపు రాజకీయం ప్రేరేపిస్తున్న అల్లరి. ఇంకా వినాశనం చేస్తున్న విధ్వంసం. మరొకవైపు అరాచకంలోనూ ఆత్మీయత వెల్లువల్ని చూడవచ్చు. కథకుడు నెల్లూరి కేశవ స్వామి తన కథల్లో అక్షరీకరించాడు.
పసిడి బొమ్మ కథా సంపుటి 1969లో వెలువరించారు. ఈ పుస్తకాన్ని భాసరబట్ల కృష్ణారావుకు అంకితం చేశారు. ఛార్మినార్ కథా సంపుటి వెలువరించారు. వెలుతురులో చీకటి సుప్రసిద్ధ నవల.
ఆనాటి సామాజిక చిత్రణ, మానసిక సంఘర్షణలకు నిజాం రాజ్య పరిణామాలకు నిలువుటద్దం కేశవస్వామి కథలు. భారత యూనియన్‌లో విలీనమై స్వతంత్య్ర రాష్ట్రంగా 8 సం॥లు కొనసాగిన హైద్రాబాద్ రాష్ట్రం భాషపేర మోసం చేయబడిరది. అనేక పోరాటాలు, విరామమెరుగని పోరుబాటలు, అమరుల వీరత్వం వల్ల ప్రత్యేక రాష్ట్రం అరువై ఏళ్లకు కాని సిద్ధించింది కాదు.
ఈ కథలకు, ముందు మాట రాసిన గూడూరి సీతారం గారు వివరిస్తూ ‘స్వామి కథలు అలనాడు హైద్రాబాద్ రాజ్యంలోని గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబు వజ్రాల వంటివని పేర్కోన్నాడు. నెల్లూరి కేశస్వామి కథలు మనసుల్లో అల్లుకొనే కథలు, చదవడం వలన ఆనాటి సమాజంని అర్థం చేసుకోవచ్చును. ఇవి చదివి ఆచరించాల్సినంత సందేశము ఇందులో ఉంది.
ఈ కథ ముస్లిం కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్న దుస్థితిని తెలుపుతుంది కథలు అరబ్బు షేక్‌లకు అమ్ముకోబడిన ‘అమీనా’ వల్ల కాస్త ఆర్థిక సౌలభ్యం తెలుపుతుంది. ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న క్రమంలో తన పాత ప్రియున్ని కలుసుకుంది. నికాహ పేరు ఇద్దరికి విషమిచ్చి చంపిచేయబడుతారు. అరువై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఈ తంతు కొనసాగుతుందని పేపర్లో వార్తలు ప్రచురించబడుతున్నాయంటే కేశవ స్వామి ఎంత స్రష్టనో ద్రష్టనో అవగతమవుతుంది.
నెల్లూరి వారి ఎంపిక చేసిన కొన్ని కథల్ని మనకు పుస్తకరూపంలో అందించినందుకు నేషనల్ బుక్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు. తెలంగాణ ఆనాటి జీవితాల్ని అక్షరబద్దం చేసి మనకందించిన నెల్లూరి కేశవస్వామి సదా పూజ్యనీయుడు. స్వామిగారి కథల్ని ఆనాటి తెలంగాణ జీవితాల్లో ఉన్న బహుముఖ కోణాల్ని దర్శించవచ్చు. కాలంపైన రజాకార్ల బర్రలు వాతలు తేలినట్లు కనవడ్తయి. విలీన సంబురాలు ఎగసిపడుతయి. రజాకార్లు వదిలివెల్లిన బానిసతనం కూడా దర్శనమిస్తున్నాయి. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఆనాటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతాం. తెలంగాణ మట్టిపొత్తిళ్ళని తట్టిలేపిన కథలు. ఈ కథల్లోని నీతిని అందరు ఆచరించటమే వారికిచ్చే అసలైన గౌరవం.
హైద్రాబాద్ విలీనమవుతున్న సందర్భంలో రాసిన కథ ‘యుగాంతం’ ఖాసీం రజ్వీ దురంతాలు. హిందూ ముస్లింల అలజడులు వివరించడు. ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టిన కథ ‘యుగాంతం’ కథను ప్రత్యేకంగా చెప్పాలి. భారత్ పాక్ విడిపోయినపుడు ఆనాటి పరిస్థితులు, సంక్షోభాలు హత్యకాండను ‘తమస్’ నవలలో చిత్రించినట్లు హైద్రాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమవుతున్నపుడు అలాంటివే సంఘటనలకు ఉదాహరణ. సామాజిక మార్పు. రాజరిక వ్యవస్థ అంతం నూతన దశలోకి సమాజం. మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలకు అధ్బుతంగా చిత్రించాడు.
యుగాంతం కథ:నొక్కి వినండి
పోలీస్ యాక్షన్ ప్రారంభమైందనీ తెలియగానే హిందువుల గుండెల మీది కుంపటి తీసేసినట్లైంది. నగరమంతా కర్వ్యూ విధించారు. రాత్రి పదిగంటలపుడు తలుపుకాడ్కి వచ్చి ‘‘స్వామీ! స్వామీ!!’’ అనే పిలుపు విన్నాడు. తల్లి వారిస్తున్న దిలావర్ అని నిర్ధారణ కొచ్చి లోపలికి ఆహ్వానించాడు. స్వామీని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
‘‘ఏమైందనడిగితే నిజాం లొంగిపోయాడని జవాబిచ్చాడు. ఇవ్వన్ని ఇప్పుడెందుకు?’’ స్వామి తల్లి భోజనం పెట్టింది కడుపు నిండా తిన్నాడు.
స్వామి దిలావర్‌ని ఇప్పుడు చెప్పుమనగానే ‘‘యూనియన్ సైన్యాలు నల్లగొండకు చేరుకున్నాయి. అతికష్టమ్మీద లారీ మీద రెండు మైళ్ళు వచ్చాను. ఆ లారీఫేలయింది. మరో లారి ఆపి ఇక్కడకు చేరుకున్న’’అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు.
‘‘సైన్యం వారు నిన్నేమంటారు?’’ అని ఎదురు స్వామి ప్రశ్నించాడు. నేను నిజాం రజాకార్‌ని మన క్లాస్‌మేట్ ఇక్బాల్ మా నాయకుడు. మేము ఉపనాయకులం. నల్లగొండలో దాడులన్ని మా ఆధ్వర్యంలో జరిగేవి.’’ అని అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పసాగాడు.
దిలావర్‌ని కాపాడుటక కొరకు శతవిధాల కృషిచేస్తాడు.
పోతూ పోతూ ఒక మూటను వదిలి వెళ్ళిపోతాడు. మాటను విప్పి లెక్కిస్తే మూడువేల హాలి(నిజాం) కరెన్సీ ఉంది. దిల్లూ కోరిక మేరకు పన్నెండు వందల రూపాయల కల్దార్(భారత) కరెన్సీ గా మార్చాడు. దిలావర్ అత్త గారింటికి వెళ్లి ఆరాతీశాడు. అతని కోసం ఎవరు రాలేదు.
‘‘దిల్లూ! ఇప్పుడు .. ఈ వేళప్పుడు బయటకు వెళ్తున్నావా?’’ అని స్వామి అడిగాడు.
‘‘అవును మక్కా మస్జిద్‌కు నమాజ్‌కు చదువడానికి వెళ్తున్నాను. ఆ మస్జీద్‌లో నమాజు చదవటం ఆఖరు సారేమో’’ అంటూ స్వామి చేతుల్లోకి తీసుకున్నాడు. స్వామికి అర్థం కాలేదు. సమయం లేకపోవడం వలన వివరణ అడిగే ప్రయత్నం చేయలేదు. దిలావర్ మళ్లీరాలేదు.
పదిరోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. డియర్ స్వామి నీకు నీనుంచి కనపడనంత దూరం వచ్చేసినందుకు క్షమించుమని, అమ్మకు చెప్పలేక వచ్చినందుకు బాధపడ్తాడు. తాను బతుకాలంటే కొత్త జీవితం ప్రారంభించడానికి, పాక్ వెళ్తున్నాని చెబుతాడు. తన భార్య రంకుతనం వల్ల తన బతుకు నాశనమైందనీ, తాను మరో పెళ్ళితో నూతన జీవితం ప్రారంబిద్దామనుకుంటే పోలీస్ యాక్షన్‌తో అంతా తలకిందులైందంటాడు. నేను తెచ్చిన సొమ్ముకు నువ్వే వారసుడివి. కానీ నువ్వు తీసుకోవని తెలుసు. ఆ దోపుడు సొమ్మును బీదలకు ఎలాగైనా అందిస్తే అందించగలవు.’’ అని చెప్పినట్లుగా ఉత్తరం వచ్చింది.
స్వామి తనకు తెలిసిన కలెక్టర్‌కు కొల్లగట్టిన సొమ్మును అందజేస్తాడు.
2. రూహీఆపా:
బంధాలకు, బంధుత్వాలకు పట్టం కట్టిన మరోకథ ‘‘రూహీఆపా’’లో విలువలు వివరించాడు.
ముజ్రాలనే బోగం సానులకు కన్నెరికం జరిపించడం గొప్పవేడుక. రాధ సంగీతం మాస్టారుతో లేచిపోయింది. రాథ స్థానంలో రాధ చెల్లెలు రమణిని ముస్తాబ్ చేసింది తల్లి. (నవాబును చూసిన రమణీ కూడా నవాబంటే ఇలా ఉండాలనుకుంది. సంగీతం, పాట పాడి వినిపించగానే నవాబు గారు రమణీ తల్లితో మాట్లాడి పల్లెంలో నోట్ల కట్టలు పెట్టి వెళ్ళిపోయాడు.)
‘‘వారానికి రెండు సార్లు నవాబుగారి దేవిడి(భవంతి)కి వెళ్ళాలి. ఆయన పేరు యూసుఫ్ నవాబ్. చాలా ధనవంతుడు. ఏమంటావే?’’ అని తల్లి అడిగితే నీయిష్టం అని రమణి అన్నది.
. ‘‘నీ పేరు రమణి బాగాలేదు. రూహీ అని పిలువచ్చునా?’’ అని నవాబు అడిగితే ‘‘సరే మీ ఇష్టం’’ అని అంగీకరించింది. అలా రెండేళ్ళుగడిచాయి.
ఒకనాడు దేవిడి పోయే వరకు నవాబు పోలిన వ్యక్తి కూర్చున్నాడు. రూహిని గమనించి ప్రక్క వ్యక్తి లేచి నిలబడి ప్రతి సంస్కారంతో నమస్కారం చేశాడు. ఇతను చోటే నవాబు సలీం ఉద్దీన్‌ఖాన్ అని పరిచయం చేసాడు యూసుప్ నవాబ్.
పరిచయం జరుగుతున్నపుడు ‘‘అవును నాన్న గారు! మీరు చెప్పింది అక్షరాల నిజం’’ అనగా రూహీ ఉలిక్కిపడ్డది.
నేను బొంబాయికి వెళ్తున్న. తిరిగి రావడానికి వారం పది రోజులు పట్టవచ్చునని యూసుప్ చెప్పాడు. కచ్చేరి అనంతరం తిరిగి వచ్చిన రూహీకి సలీం ముఖం గుర్తురావడంతో ‘అబ్బా! ఎంత అందంగా ఉన్నాడో. ఒక్క చూపులోనే తన మనస్సు దోచుకున్నాడు...’’ అనుకుంటూ మధుర స్మృతులతో రాత్రి గడిచిపోతుంది. తెల్లతెల్లవారుతుండగా నిద్రపట్టింది రూహీకి.
‘‘రమణీ! రమణీ!! నవాబ్ సాబ్ నిన్ను తీసుకురమ్మనరట.’’ లేపింది తల్లి.
నవాబ్ సాబ్ బొంబాయి పోలేదా? అనుకొని గబగబా తయారై కారులో వెళ్ళిపోతూ‘‘నవాబ్ సాబ్ ఊరికి వెళ్లలేదా?’’ అని అడిగింది.
‘‘నిన్ను పిలిచింది చోటే నవాబ్’’ అని కార్ డ్రైవర్ ఉత్తరమివ్వగానే కారపమంది. కారాగింది. నవాబ్ గారి లేని సమయంలో నన్ను పిలిపించారే. తన కిది ఇష్టంలేదు. మరి తాను ఇప్పుడేం చేయాలి? ఆలోచనలు ఆపి మొండిగా ముందుకు కారు సాగిపోయింది.
దేవిడి ముందు కారు ఆగగానే ‘‘ఆదాబ్! మీ కోసమే ఎదురు చూస్తున్నాను. నాన్న లేనపుడు మీరు రావడం ఇబ్బంది పడ్తున్నారా? కారు తెప్పించమంటారా?’’ అనగానే లేదన్నట్లు తలూపింది.
‘‘ఒకమారు లోపలికి వస్తారా?’’ అని దీనంగా అడగ్గానే భయం భయంగా అదిరిపడే ఎదతో చోటే నవాబును అనుసరించింది రూహీ. చీకటింట్లోకి వెళ్ళారు. భయమెక్కువైంది. మరింత చీకటి గదిలోకి తీసుకువెళ్తున్నాడు. సలీం స్విచ్చ్ వేయగానే గది దేదిప్యమానమైంది. పెద్ద పట్టె మంచం, గులాబి తెర. రూహీకి మనసు మనసులో లేదు. అటువైపు చూడుమని తెల్లటి వస్త్రం కప్పబడి ఉన్న గుడ్డను తొలగించి ఫోటో చూపించాడు.
‘నేను ఫోటో ఎపుడు దిగలేదే? నా ఫోటో ఎక్కడది!’ అని ఆలోచిస్తుండగా...
‘‘ఈమె, మా అక్క రూహీ ఆపా’’ అని పరిచయం చేశాడు.
రమణీ వణికిపోయి ఒల్లంతా చెమటతో హాల్లోకి ఉరికి వచ్చి సోఫాలో చతికిల పడింది.
‘‘ఇపుడు అర్థమయిందనుకుంటాను. మిమ్మల్ని రూహీ అని ఎందుకు పిలిచారో? మీరంటే ఎంత ఆపేక్షో....’’ అని చెబుతున్నాడు.
‘‘దయచేసి కారు తెప్పించండి. ఇంటి కెళ్ళాలి’’
సలీం రూహీ మొఖం చూసి ‘‘సరే’’ అంటూ డ్రైవర్‌కి కేకేశాడు. కారులో దబాలున కూర్చున్న రూహీ చెయ్యి ఊపుతున్న సలీంని చూడలేదు. రమణీ కాదు రూహీ ఆపా.
3. వంశాంకురం : అలీఖాన్ సంపన్నుడు. ఆలీఖాన్ కొడుకు ఇమ్రాన్‌ఖాన్ అభ్యుదయవాది. ఒకనాడు భోజనం చేస్తున్నపుడు నజ్మాని పెళ్లి చేసుకోవాలని ఆలీఖాన్ హుకుం జారీ చేస్తే తిండి మధ్యలోంచి వెళ్లి బెడ్రూంలో కుమిలిపోతాడు.
ఓదార్చుతున్న తల్లితో నజ్మా పట్ల నాకా ఉద్దేశ్యం లేదు. నేను స్వంత చెల్లెలుగా భావించుకున్నాను.
అంతలోనే ఆలీఖాన్ వచ్చి ‘‘చూడు బేటా! నీ దోస్తులు హిందువులని తెలుసు. వాళ్లు మేనమామ, మేనత్త, చివరకు తోడబుట్టిన అక్క కూతుర్ని పెళ్ళి చేసుకుంటారు. మా తమ్ముడు చనిపోయేటపుడు, తన కూతురుని నీకు పెళ్లి చేస్తానని హామి ఇచ్చాను. నీవు పాటించాల్సిందే’’ అని వెళ్లిపోయాడు.
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఏడాది తిరక్కుండానే కనడానికి నజ్మా హైద్రాబాద్ కి వస్తుంది.
నొప్పులు తీవ్రమైనపుడు డా. దేశాయి కోరిక మేరకు బొంబాయి నుండి డా. అబిదాను రప్పించారు. అన్ని రకాల పరీక్షలు చేస్తుంది. ఉత్సాహంతో ఇమ్రాన్ ఖాన్ అడుగుతుంటే దాటవేస్తూ క్యాంటీన్‌లో, కార్లో, చివరకు ఎయిర్ పోర్ట్‌లో చెబుతానంటది. ఎయిర్‌పోర్ట్‌లో అన్ని విషయాలు డా. దేశాయికి చెప్పాను వెళ్లి కలువుమంటది.
ఆలీఖాన్‌కి వంశాంకురం కావాలని పట్టు. ఇమ్రాన్‌ఖాన్‌కు తన భార్య(నజ్మా) కావాలంటాడు. ఒక షరతు. మళ్లీ గర్భవతి కాలేదని చెప్పినా నాకు నజ్మానే కావాలంటాడు. కడుపు మసిలిపోతున్న ఆలీఖాన్‌ను అతని భార్య ఓదార్చింది. నజ్మా బతికి బయట పడ్డది. నజ్మాకు రాత్రింబగళ్ళు సేవచేస్తున్నాడు.
ఒకరోజు ఆలీఖాన్ నజ్మా తల్లిని పిలిపించుకున్నాడు. మనకు వంశాంకురం కావాలి. ఇమ్రాన్‌కు మరో పెళ్ళి చేస్త. నజ్మా మొదటి భార్యగానే ఉంటుందని చెపుతున్నపుడు నజ్మా తల్లి ఇంటికి పరిగెత్తింది.
తల్లీబిడ్డలు అలుముకొని కుమిలి కుమిలి ఏడుస్తుంటారు.
వచ్చిరాగానే మీ నాన్న పిలుస్తున్నాడని తెలుపగానే నజ్మా ఇంటి నుండి ఇమ్రాన్ ఖాన్ వెళుతాడు. తన తండ్రిని ధిక్కరించి నజ్మా ఇంటి వైపు వస్తుంటాడు.
‘‘ప్రియమైన ఇమ్రాన్! నన్ను కంటికీ రెప్పల కాపాడుకుంటున్నావు. సంతోషం.నేనుండగా నువ్వు మరో పెళ్ళి చేసుకోవు. పెద్దనాన్న తన మాట నెగ్గించుకోవటానికి ఎంతకైనా తెగిస్తాడు. నేను మధ్యలో వచ్చాను. మధ్యలో పోతున్నా. నీ ఒళ్ళో కన్నుమూయాలని ఆశపడ్డ. నేనుండగా మరో పెళ్ళి చేసుకోవు నువ్వు. ఈ పాటికే పెద్దనాన్నకు ధిక్కరించి వచ్చే స్తుంటావు. చివరి ఊపిరి వరకు నిన్ను స్మరించే... నీ నజ్మీ’’ అంటూ లేఖ రాసి కొనఊపిరితో కొట్టుకాడుతది. మానసిక సంఘర్షణలను అంతర్గత దృక్కోణాలను అక్షరీకరిస్తాడు.
4. అదృష్టం:
మనుషుల్ని విధిరాతలు ఎంత వరకు నియంత్రిస్తాయో, ఎంత వరకు ప్రభావితం చేస్తాయో తెలియజేసే మంచి కథ ‘అదృష్టం’ చదివితే అవగతమవుతుంది.
వాసు, ఖాసీం ఇద్దరు చిన్నప్పటి క్లాస్‌మెట్‌లు. వాసుని ఖాసీం తన ఇంటికి తీసుకువెళ్తాడు. నీది అదృష్టంరా అని పరస్పరం అనుకుంటు ఉంటారు.
ఖాసీం ఒక కథ చెబుతుంటాడు. ‘‘ఒక కలెక్టర్ సంతానం లేక ముగ్గురు పెళ్ళాలను చేసుకున్నాడు. చివరి భార్యకు ఆయనకు పాతికేళ్ళ తేడా. అదే ఆఫీసులో ఒక క్లర్క్ కోశాధికారంలోంచి పదివేలు డ్రా చేసి గుర్రాప్పందాల్లో ఖర్చు చేసి బందీ అవుతాడు. క్లర్క్ భార్య కలెక్టర్ కాల్లమీద పడి వేడుకోగానే సరే అని విడిపిస్తానని హామి యిచ్చినాడు. అతను ఆమెను మోసగించి జీడిమెట్ల ప్రాంతంలో అత్యాచారం చేస్తాడు. ఆమెను కారు ఇంటి వద్ద దించిపోతుంది. అవమాన భారంతో గాజులు దంచుకొని తాగి చనిపోతుంది. భార్యను చూసి భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పిల్లాడు అనాధగా మిగిలాడు.
ఈ విషయం తెలుసుకున్న చిన్న భార్య బాధ భరించలేక కలెక్టర్ వేటకు పోయి పులివాత పడ్తాడు. బేగం సాబ్ సంతాన హీనురాలు కాబట్టి ఆస్తికి వారసురాలు కాదు. పెళ్ళికి తన భర్త రాసిచ్చిన ఆస్తి తనకు చెందాలని నిర్ణయం తీసుకుంది. ఆస్తి ఇవ్వలేదని అత్తింటిపైన, నా జీవితం నాశనము చేశారని తల్లి గారికి చిల్లి గవ్వ చెందకూడదనుకుంటది. మా మతంలో దత్తత లేదు. ఆసర్రాప్(క్లర్క్) కొడుకును పెళ్ళాడింది.’’
మధ్యలో కల్పించుకొన్న వాసు ‘‘మరి వయసు?’’ అని అడిగాడు.
‘‘ఏమంత పెద్దది గాదు, పది పన్నెండేడ్లు తేడా. అది మా మతంలో నిషిధ్దం కాదు.’’
ఇంతకీ ఈ కథ ఎందుకు చెబుతున్నావు అని వాసు అడిగాడు ఇంకా అర్థం కాలేదా? ఆ అనాధను నేను. ఆమె నా భార్య. ఇప్పుడు చెప్పు నువ్వు అదృష్టవంతుడివా? నేనా? అంటున్నపుడు కాసీం కళ్లునిండాయి.
5. విముక్తి కథ:
నేను ఎలాగు ఉంటే ఏమిటి? నాకు శీలవతి అయిన భార్య కావాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ అందుకు విరుద్ధంగా, వాస్తవంగా జీవించడానికి కొందరే ఇష్టపడుతుంటారు. అలాంటివారే అభ్యుదయవాదులు. సంపన్నులైన ముస్లింలు పెళ్లికి ముందు దాసీల జీవితాలను నాశనము చేస్తున్న విధానాన్ని తులనాడుతూ అభ్యుదయవాదులు ఏవిధంగా అండగా నిలుస్తున్నారో తెలుపడానికి ఆధారం ‘విముక్తి కథ.’ ఇందులో రచయిత మంచి చెడు రెండు కోణాలను ఆవిష్కరిస్తాడు.
బేగం సాహేబ్ యాజమానురాలు. తన పెద్ద కుమారునికి పెళ్లికి ముందు జగ్గును పంపి సిరాజ్‌తో సృష్టికార్యం జరిపిస్తుంది. ఈ తంతును గమనించి ఉన్నత చదువు చదివిన అన్న సిరాజ్ ను నిలదీస్తే అందరిచేత సుల్తాన్ ఎక్కిరించబడ్డాడు. జగ్గు గర్భం ధరించింది. జగ్గు జీవితం నాశనమైంది.
తమ ఇల్లలో దాసీలను ఆట వస్తువులుగా వాడుకునే ఆచారాన్ని పటా పంచెలుచేయ్యాలనే ఆలోచన తట్టింది. ఇస్లాం చరిత్రలో ఎం.ఏ పూర్తి చేసుకొని ఇల్లు చేరాడు సుల్తాన్.
సీరాజ్‌కు చేసినట్లే సుల్తాన్‌కు షీరాతో సృష్టి కార్యం చేయించాలనుకున్నారు. సుల్తాన్ తిరస్కరించాడు. తెల్లారి అక్క భర్త షౌకత్ వచ్చి ఏం. ప్రొఫెసర్ గారు నిన్న నీకోసం షీరాను పంపితే వద్దన్నావేంది? దాన్ని అంతంగా అలంకరించింది. మీ అక్కయ్యే అని చెపుతున్నపుడు. షీరాతో నా పెళ్ళి జరిపించమన్నాడు. ‘‘ఆహ్హాహ్హ’’ అని హేళనగా నవ్వి అది దాసిది.
కోపంతో ‘‘వెళ్ళిపో నా గదిలోంచి’’ అని వెళ్ళగొట్టాడు. కుటుంభ సభ్యులందరిలో సుల్తాన్ పలుచనయ్యాడు. పరిస్థితులను తనకనుకూలంగా మలుచుకోవాలని నిశ్చయించుకున్నాడు.
అక్కకు తప్పైందని చెప్పి బావను బతిమాలాడు. అమ్మను బుజ్జగించాడు. పరిస్థితులు సద్దుమణిగాయి. షీరాతో రోజు స్వర్గసీమలో తేలియాడుతున్నాడు. పదో రోజున ప్రొఫెసర్ నుంచి లేఖ వచ్చింది. ఆలీఘడ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆ లేఖ సారాంశం.
అమ్మ ఇంకొక్క కోరిక ఆగ్రా, అజంతా, ఎల్లోరా చూస్తానమ్మా! అని అడిగినపుడు సరే అంటుంది. అమ్మ దాసి దాన్ని షీరాను పంపవా? దాసీయే కదా సరే అని తల్లి తనకొడుకు సంతోషాన్ని కాదనలేకపోయింది. సుల్తాన్, షీరా ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోతూ ఒక ఉత్తరం రాసాడు.
‘‘అమ్మకు పాదాభివందనాలు, మన దుర్మార్గపు నవాబు ఆచారాల నుంచి బయటపడ్డాను. రెండవది నేను పెళ్ళి చేసుకున్నాను. నువ్వు నాకోసం పెంచి పెద్ద చేసిన షీరా నీ కోడలు. మమ్మల్ని వెతకొద్దు. షీరాను చిన్నకోడలుగా స్వీకరించే రోజున తప్పకుండా వస్తాము." లేఖలో నివేదించి వెళ్ళిపోతాడు.
6. కేవలం మనుషులం:
మానవత్వమే మహోన్నతమనీ తెలియజెప్పే కథ ‘‘కేవలం మనుషులం’’ కథ. కవల్, బిల్కిస్‌లు ఇద్దరు వైద్య విద్యార్థులు ప్రేమలో పడతారు. పెళ్ళికి ఒప్పుకుంటారు. కాని మా మత ప్రకారం పెళ్ళి చేయాలని అటు హిందువులు, ఇటు ముస్లిం పెద్దల వాదులాటతో పెళ్లి పెండింగ్‌లో పడ్డది. చెప్పా పెట్టకుండా మారేజ్ ఆక్ట్ ప్రకారం నెల రోజుల గడువు కూడా పూర్తయింది. మారేజ్ పూర్తి అయింది. మేము పెళ్ళి చేసుకున్నాం. మా దృష్టిలో మతం వ్యక్తిగత విషయం. పెళ్లి సామాజిక వ్యవస్థ. మానవత్వమే మతం. మానవ సేవే ధ్యేయం. మేం కేవలం మనుషులమని స్నేహితుల మధ్య ప్రమాణం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. మతాల సరిహద్దులని చెరిపిన స్నేహం, పెళ్ళిగా మార్చుకున్న ఆదర్శం.
7.ప్రతీకారం
నవాబ్ సాబ్, నవాబ్ సాబ్ బేగం దంపతులు వీరి కొడుకు నవాబ్ పాషా. లచ్చుబాయి వంట మనిషి. ఈమె.... కొడుకు పాషు. లచ్చుబాయి నవాబ్ పాషాకు పాలు పట్టింది. నవాబ్సాబ్ లచ్చుబాయి కొడుకు పాషు.
బేగం నవాబ్‌పాషా తల్లీ కొడుకులు ఎప్పుడు అవమానిస్తుంటారు. పాషు తల్లితో ఇంత అవమానంతో ఇక్కడ జీవించటమెందుకంటే
తల్లీ లచ్చుబాయి ‘‘కర్మరా బాబు కర్మ’’ అని ఎప్పట్లాగే చెప్పి బాధ పడ్తది.
వంట మనిషిగా ఉన్న లచ్చుబాయి దగ్గుతూ నెత్తురుకక్కినపుడు ఆమెను ఇంట్లోంచి తరిమేస్తారు. హకీంసాబ్ అను వైద్యుడు వైద్యం చేస్తుంటాడు. రోజూ ఆయాసంతో బాధ పడ్తుంటది. పాషు రాత్రంతా మేలుకుంటాడు.
ఒక రోజూ రాత్రి నవాబ్ సాబ్ లచ్చూబాయితో గుసగుసలాడుతూ ‘‘త్వరలో నీకు నయమై పోతుంది. మంచి వైద్యం చేయిస్తాను’’ అని భరోసా చెబుతున్నపుడు పాషు గురించి అడుగుతది..
‘‘పాషు పాషు గురించి నువు నిశ్చితంగా వుండుమని’’ చెప్పి వెళ్లిపోతున్నపుడు పాషుకు మెలుకువ వస్తది. తెల్లారె సరికి లచ్చుబాయి చనిపోయింది.
లచ్చుబాయి హిందువా? ముస్లిమా? దహనం చేయాలా? ఖననం చేయాలా? అని చర్చిస్తున్నపుడు ఏడుపు ఆపి వింతగా వింటున్నాడు పాషు. బుడన్‌ఖాన్‌తో సహా అందరు నిఖా చేసుకుంది కాబట్టి ముస్లిమని తీర్మానించారు. బాబాను అడిగి తన గతం గురించి తెలసుకుని బాధపడ్తాడు పాషు. తానే నవాబ్ పెద్ద కొడుకునని నిర్దారించుకుంటాడు. నవాబ్ సాబ్ మంచాన పడ్డపుడు పాషు పరపతి పెరిగింది గుడ్డిరాణితో నవాబు పాషాకి పెళ్ళి జరిగింది.
చమ్కీ అను దాసి అన్నం తెస్తే చల్ పో అని పాషు వెళ్లగొట్టిండు. చీకట్లో ఆకలితో మెలుకువ వచ్చింది. మృదువైన వేళ్లతో నోటికడ్డంగా పెట్టి పాషును లేవనివ్వలేదు గుడ్డిరాణి.
‘‘ఏ గుడ్డిరాణీ నవాబ్ పాషా?’’ అని అనగానే వాడో నపుంసకుడు(హిజ్రా) అని చెప్పింది.
‘‘నవాబ్ పాషా...! నవాబ్ పాషా!! గెలుపు నాదే! గెలుపు నాదే!! గుడ్డిరాణి(దుల్హాన్ పాషా)ని కబంధ హస్తాల్లో కసిగా బంధించాడు. దాంతో ప్రతికారం తీర్చుకున్నాడు పాషు.
ఈ కథా సంపుటిలో మొత్తం 11 కథలు కలవు. పసిడి బొమ్మ, ‘అలవాటు’, ‘అభిమానం’, ‘పరీక్ష’ ‘అక్కయ్య పెళ్ళి’ కథలు, మానసిక కథలు, సంఘర్షణాత్మకంగా చిత్రించబడ్డాయి. ‘ఆఖరి కానుక’, ‘పరీక్ష’ ‘అతిథి’, ‘భరోస’.....మొదలగునవి అన్ని వివిధ పార్శాలను ప్రతిబింబించాయి.
- డా. సిద్దెంకి యాదగిరి 9441244773.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి