1.పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.చిత్రంలో ముగ్గురు వ్యక్తులున్నారు. ఇది బుర్రకథ చెబుతున్న దృశ్యం. మధ్యలో ఉన్నవారిని కథకుడు అనీ, అటూఇటూ ఉన్నవారిని వంతలు అని పిలుస్తారు.
2.వారు ఏం చేస్తున్నారు?
జవాబు.వారిలో మధ్యలో ఉన్నవాడు అడుగులు కదిలిస్తూ అభినయిస్తూ బుర్రకథ చెబుతున్నాడు. అటూఇటూ ఉన్న వంతలు అతడిని అనుసరిస్తూ వంత పాడుతున్నారు.
ప్రశ్న 3.
ఇట్లాంటి ప్రదర్శనను మీరు ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు.ఇలాంటి ప్రదర్శనను ఒకసారి మా స్నేహితుని బడిలో వాళ్ళ పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శిస్తుంటే చూశాను. నాన్న నడిగితే దీనిని బుర్రకథ అంటారని, ఇది మన ప్రాచీన జానపద కళల్లో ముఖ్యమైనదని చెప్పాడు.
పాఠం ఉద్దేశం:
ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీవిద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాలపట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, “బుర్రకథ”వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం “బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంతపాడేవాళ్ళు ఉంటారు. వచన గేయరూపంలో కథను చెపుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు.
ప్రవేశిక:
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి, విద్యకు దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయపడటానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికీ ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని, ముందడుగువేస్తారు. అట్లాంటి ఒక సీతకథను పాఠం చదివి తెలుసుకుందాం
ఆలోచించండి – చెప్పండి ( Page No.95)
1.“కొత్త వింత-పాత రోత” సామెత ఏఏ సందర్భాలలో వాడుతారు?
జవాబు.కొత్త విషయాలు ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. కొత్తవి కనబడగానే అప్పటిదాకా వాడుతున్న పాతవాటిని వదిలేస్తాం. కొత్త డిజైన్లతో దుస్తులు రాగానే పాతవి వదిలేస్తాం. నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇలాంటివన్నీ కొత్తవి బాగున్నాయని పాతరోల్ అనీ మార్చేస్తాం. ఇలా ఎన్నో సందర్భాలలో కొత్తవింత పాతరోత అనే సామెత వాడుతాం.
2.ఆ ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చదివించకపోవడానికి కారణాలేమిటి? మిత్రులతో చర్చించండి.
జవాబు.1) మూఢ నమ్మకాలు
2) ఆడపిల్లమీద పెట్టే ఖర్చు వృథా అనే దురభిప్రాయం
3) ఆడపిల్లలకు అయ్యే ఖర్చు ఎక్కువ అనే అభిప్రాయం కారణాలు.
ఆలోచించండి – చెప్పండి ( Page No.98)
1. ఈ ఆడపిల్లలు ఇంటివద్ద ఏయే పనులు చేస్తూ తమ ఇష్టాలు కోల్పోతున్నారు? చర్చించండి.
జవాబు.సాటి పిల్లలతో ఆడుకోవాలనే కోరిక, బాగా చదువుకోవాలనే కోరిక, విహారయాత్రలకు వెళ్ళాలనే కోరిక కోల్పోతుంది. + సీతను
2.దాచిన తల్లి మనసు ఎటువంటిది? దీనిపై మాట్లాడండి.
జవాబు.శ్రావణి టీచర్ ఊళ్ళోకి రాగానే బడి ఈడు పిల్లలను వెతుకుతూ ఊళ్ళోకి బయలుదేరింది. సీత యింటికి రాగానే సీతను తల్లి లోపల దాచిపెట్టింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది. పిల్లలను బడికి పంపిస్తే తను ఇబ్బంది పడాలి. తరువాత పుట్టిన పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరు అని తల్లి భయపడింది. అందుకే సీతను దాచింది.
3.స్త్రీ గొప్పదనమేమిటి?
జవాబు.మానవజన్మలో ఆడజన్మ చాలా గొప్పది. ఎందుకంటే స్త్రీకి ఓర్పు ఎక్కువ. అందరితో స్నేహంగా ఉంటుంది. అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. అంత గొప్పతనమున్న ఆడపిల్లను చక్కగా పెంచితే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందుతాయి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.101)
1.టీచర్ ఆదర్శ మహిళల గురించి సీత తల్లికి ఎందుకు చెప్పి ఉంటుంది?
జవాబు.బడికి పంపాల్సి వస్తుందని సీత తల్లి సీతను దాచిపెట్టి ఇంట్లో ఎవరూ లేరని అబద్ధం చెప్పింది. శ్రావణి టీచర్కు అర్థమయింది. సీత తల్లి అవసరం కోసం అలా చేసిందే కాని ఆమె చెడ్డది కాదని టీచర్ గ్రహించింది. అందుకే ఆదర్శ మహిళల గురించి చెప్పింది. అది వింటే తప్పకుండా తల్లి మనసు మారుతుందని టీచర్ అభిప్రాయం.
ప్రశ్న 2.
చదువుకున్నవాళ్ళు ఎట్లా ఆలోచించాలని సీత ఇష్టాల ద్వారా తెలుసుకున్నారు?
జవాబు.
సీత ఇష్టాలు పాఠం ద్వారా చదువుకున్న వారి ఆలోచనలు ఎలా ఉండాలో మనకు కింది విధంగా తెలుస్తుంది. ఆడపిల్లలను చిన్నచూపు చూడకూడదు. అన్నింటిలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. చదువుల్లోనూ పదవుల్లోనూ కూడా ఆడపిల్లలు మగవారితో సమానమే. వాళ్ళలోని ప్రతిభను అందరూ గౌరవించాలి.
3.సీత ఇష్టాలు తెలుసుకున్నారు కదా! సీతవలె అమ్మాయిలు ఎట్లాంటి ఇష్టాలు కలిగి ఉండాలి?
జవాబు.
అమ్మాయిలందరూ ఈ రోజులలో పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలనీ కోరుకోవాలి. సాంకేతిక విద్యలపైన వైద్య విద్యలపైన మక్కువ చూపించాలి. మగవారితో సమంగా ఎటువంటి ఉద్యోగమైనా చెయ్యగలగాలి. అంతరిక్షంలోనూ, సముద్రంలోనూ, నేలపైనా కూడా ముందుకు దూసుకు వెళ్ళాలి. ఇలాంటి ఇష్టాలు కలిగి ఉండాలి.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు ? కారణాలు చెప్పండి.
జవాబు.ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. పురాణాల్లో మైత్రి గార్గి వంటి పండితులున్నారు. చరిత్రలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితలు, మాంచాల, చానమ్మ వంటి వీరపత్నులు, ఆధునిక కాలంలో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ వంటి స్వరాజ్య సమర యోధులూ ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో అంతరిక్షం నుంచి జలాంతర సీమల వరకూ ప్రతి పనినీ చేయగల సమర్థులైన మహిళలు, క్రీడా రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే.
2. శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు.శ్రావణి టీచర్ వంటి వారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఎంతో ప్రేమగా పాఠాలు చెబుతారు. ముఖ్యంగా మా తెలుగు ఉపాధ్యాయులు సమాజసేవ గురించి, మానవతా విలువల గురించి, క్రమశిక్షణ గురించి పదేపదే చెబుతారు. బడికి రాని పిల్లల తల్లిదండ్రులకు నచ్చ జెప్పి పిల్లలు బడికి వచ్చేలా చేస్తారు.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. ‘కొత్త వింత – పాత రోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి ?
జవాబు.“పాతంటే రోతగా ఉందా ?” “పాతలేందే కొత్తెక్కడుంది ?” “కొత్త కొత్త అంటున్నారు, కొత్త చెత్తంతా పాతలోంచే కదా వచ్చింది” “పాతంటే రోతని నేనన్నానా ?” మొదలైన వాక్యాలు “కొత్త వింత పాత రోత’ అనే అర్థాన్నిస్తాయి.
2. పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు.రాజు – రోజా పోట్లాడుకుంటూ అనే మాటలు నాకెంతో నవ్వు తెప్పించాయి. తిక్క సన్నాసీ అని పిలవడం, కొత్త చెత్త పాతలోంచే వచ్చింది అనడం, కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అరుస్తున్నావనడం, రాజు ఒకటో తరగతిలో ఉండగానే పెద్ద లెటర్స్ 26 చదివానని అనడం, అవేంటని అడిగితే ABCD అని చెప్పడం ఇవన్నీ ఈ పాఠంలో ఎంతో నవ్వు పుట్టించిన అంశాలు.
3. కింది పేరా చదివి క్రింది పట్టికను పూరించండి.
1940 ప్రాంతంలో తెలంగాణాలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది. వితంతువులకోసం వసతిగృహాలు ఏర్పాటు చేసింది. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి మొదలయిన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషి చేశారు. అఘోరనాథ చటోపాధ్యాయగారి భార్య వరదసుందరీదేవి నాంపల్లిలో బాలికలకోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజనీనాయుడు గారి తల్లి.
జవాబు.
సంఘ సంస్కర్తలు రచయిత్రులు సంస్థలు
సుమిత్రాదేవి రత్నదేశాయి లేడీ హైదరీల క్లబ్
ఈశ్వరీబాయి సోదరీ సమాజం
సంగెం లక్ష్మీబాయి ఆంధ్ర యువతీమండలి
ఆంధ్ర మహాసభ
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధికోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు.శ్రావణి టీచర్ రామాపురం అనే గ్రామంలో బడిలో టీచర్ గా చేరింది. ఆమె పిల్లల అభివృద్ధికోసం పాటుపడేది. బడిలో పిల్లలకు పాఠాలు నేర్పడమే కాకుండా మంచి మంచి కథలు చెప్పడం, ఆటలాడించడం, పాటలు పాడించడం, మంచి సూక్తులు వినిపించడం వంటివి చేశారు. పిల్లలను తన సొంత బిడ్డలలాగా చూసుకున్నారు. బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను బడిలో చేర్పించారు.
ఆ. ‘బుర్రకథ’ ప్రదర్శన విధానం గురించి రాయండి.
జవాబు.బుర్రకథ మన ప్రాచీన జానపద కళారూపాలలో ఒకటి. ముఖ్యమైనది కూడా. ఇందులో ఒక ప్రధాన కథకుడు ఇద్దరు వంతలు ఉంటారు. చారిత్రక విషయాలు గాని, జానపద విశేషాలు గాని వీరుల చరిత్రలు గాని ఇతివృత్తంగా పాటల రూపంలో సాగుతుంది బుర్రకథ. ఎక్కడికక్కడ గతిమారుతూ వేరు వేరు ఊత పదాలతో కథ సాగుతుంది. భళా భళి, సై, తందాన తాన వంటి ఊతపదాలుంటాయి. చిన్న చిన్న అడుగులు లయబద్ధంగా వేస్తూ అభినయం చేస్తూ సొంతంగా పాటపాడుతూ తంబుర మీటుతూ చిరుతలతో తాళం వేస్తూ బుర్రకథ చెప్పడానికి గొప్ప ప్రతిభ కావాలి.
ఇ. పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఆడపిల్లల పరిస్థితులను గురించి రాయండి.
జవాబు.ఆడపిల్లలు పుట్టారంటేనే బాధపడే రోజులవి. ఐనా పూట గడవని స్థితిలో ఉన్న పేదలు ఆడపిలను కూడా పనిలోకి పంపుతున్నారు. లేదా పెద్దవాళ్ళు పనికి పోతూ చిన్న పిల్లల బాధ్యత ఆడపిల్లలకు అప్పగిస్తున్నారు. ఆ కొంచెం ఆధారం పోతుందేమోనని వాళ్ళను దాచేసి, టీచర్లు పిలవడానికి వచ్చినా పంపడం లేదు. ఇలా ఆడపిల్లలను చదివించకపోవడం వల్ల వాళ్ల ఉజ్జ్వల భవిష్యత్తును మసి చేస్తున్నారు.
ఈ. “పెద్దలు పనికి – పిల్లలు బడికి” అనే నినాదాన్ని గురించి రాయండి.
జవాబు.పెద్దలు తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పిల్లలను పనిలోకి తీసుకుపోకూడదు. పిల్లలచేత పనిచేయించడం నేరం. అలా పని చేయిస్తే చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు. పెద్దలు పనిలోకి వెళుతూ పిల్లలను బడికి పంపించాలి. ప్రభుత్వం ఉచితంగా చదువుచెప్తూ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా కల్పించింది. అలాంటప్పుడు పిల్లలను తామేమీ భరించక్కరలేదుగనుక చక్కగా బడికి పంపించాలి అని తెలియజేస్తుంది. ఈ ‘పెద్దలు పనికి పిల్లలు బడికి’ అనే నినాదం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో సమాధానం రాయండి.
అ. “సీత ఇష్టాలు” కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.రామాపురం అనే పల్లెటూళ్ళో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతుల కూతురు సీత. సీతకొక తమ్ముడు, ఒక చెల్లెలు. శివయ్య, గౌరమ్మ పనికిపోతూ సీతకు చిన్నపిల్లల బాధ్యత అప్పగించారు. అందుకే సీత బడికెళ్ళి చదువుకోలేక పోయింది. వాళ్ళ ఊరికి శ్రావణి అనే టీచరు వచ్చి సీతను బడికి పంపమని తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. వాళ్లు ఒప్పుకొని సీతను బడికి పంపారు. సీత చక్కగా చదువుకొని అన్నిటా మొదటి స్థానం సాధించింది. పక్క ఊరికి పోయి పై చదువులు చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించింది. మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. పిల్లల చదువుకోసం, స్త్రీలకు మేలుచేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపే “నినాదాలు” రాయండి.
జవాబు.ఎన్నో జన్మల పుణ్యఫలం – ఆడపిల్లే శ్రేష్ఠం
ఆడవాళ్ళంటే ఓర్పు – ప్రతిపనిలో వారిదే నేర్పు
ఆడపిల్ల ఉన్న ఇల్లు – ఆనందాల హరివిల్లు
ఆడపిల్ల తక్కువ కాదు – మగపిల్లవాడు ఎక్కువ కాదు.
ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడండి. – సమాజాన్ని ముందుకు నడపండి.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాలను చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.
అ. మండలంలో అభివృద్ధిపనులు నిర్వహించే అధికారి = మండలాధికారి
ఆ. నాయకత్వం వహించేవారు = నాయకులు
ఇ. ఉపన్యాసం ఇచ్చేవారు -.వక్తలు
ఈ. హరికథ చెప్పేవారు - హరికథకులు
ఉ. శిక్షణను ఇచ్చేవారు-శిక్షకులు
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది పదాలలో సమాపక, అసమాపక క్రియాభేదాలు గుర్తించండి. మరికొన్ని అసమాపక క్రియలు రాయండి.
అ. వెళ్ళి, వచ్చి, తెంపి, తిని, చూసి అసమాపక క్రియలు
తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు – సమాపక క్రియలు
జవాబు.
ఆడి, పాడి, విని, చేసి, వండి, వడ్డించి, నడిచి, పరుగెత్తి, నిద్రించి, మేలుకొని
సమాపక, అసమాపక క్రియలను ఉపయోగించి వాక్యాలు రాయండి.
సమాపక క్రియతో వాక్యాలు అసమాపక క్రియతో వాక్యాలు
1. పాప చాక్లెట్ తిన్నది. 1. పిల్లలు బడికి వెళ్ళి, చదువుకుంటారు.
2. జ్యోతి నాట్యం చేసింది. 2. పోస్టుమాన్ వచ్చి, ఉత్తరం ఇచ్చాడు.
3. అత్త నాకోసం స్వెటర్ అల్లింది. 3. అమ్మ దారం తెంపి, పూలు కట్టింది.
4. జానకి కూరలు తెచ్చింది. 4. నాన్న అన్నం తిని, ఆఫీసుకెళ్ళారు.
5. రామారావు పద్యాలు రాశాడు. 5. తాడును చూసి, పాము అనుకున్నాను.
2. ఈ కింది వాక్యాల్లో ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విధ్యర్థక వాక్యాలను గుర్తించండి. తగిన విరామ చిహ్నాలను ఉంచండి.
అ. దెబ్బ ఎట్లా తగిలింది.
ఆ. అమ్మో ఎంత పెద్ద పామో
ఇ. తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి.
ఈ. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో
ఉ. పండుగ నాటికి గుడిని అలంకరించండి.
ఊ. మీది ఏ ఊరు
ఆశ్చర్యార్థక వాక్యాలు : ఆ) అమ్మో! ఎంతపెద్ద పామో! ఈ) నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో !
ప్రశ్నార్థక వాక్యాలు : అ) దెబ్బ ఎట్లా తగిలింది ? ఊ) మీది ఏ ఊరు ?
విధ్యర్థక వాక్యాలు: ఇ) తప్పకుండా ఇంటిపని పూర్తిచేయాలి. ఉ) పండుగ నాటికి గుడిని అలంకరించండి.
ప్రాజెక్టు పని:
మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, మీకు నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి. జవాబు. మా ప్రాంతంలో సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము మొదలైన కళారూపాలు నేర్పుతారు. కొన్ని ప్రదర్శనలు కూడా జరుగుతాయి. వాటిలో నాకు నచ్చిన కళారూపం నాట్యం, ఇందులో సాహిత్యం, సంగీతం, నృత్యం అనే మూడు సమాన ప్రాధాన్యం కలిగి ఉండి వినడానికి చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇందులో ఆహార్యం ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రశ్న 1.
సీతకథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. అటువంటివాళ్ళను గురించి చర్చించండి
జవాబు.
సీత కథ విన్న తరువాత మొదట్లో జాలి కలిగినా తరువాత ఆమె సాధించిన విజయాలకు ఎంతో ఆనందం కలిగింది. “ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్”. అన్నట్లు ఆడపిల్లలని చులకన చేయకుండా సీత లాంటి వాళ్ళను చదివిస్తే వారికీ, వారి కుటుంబానికే గాక దేశానికి మంచి పేరు తేగలరు అనిపించింది.
2.‘సీత’ లాంటివాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు.మన దేశంలో సీతలాంటి వాళ్ళెందరో ఉన్నారు. ఎందుకంటే మన దేశంలోని బడుగువర్గాల వారందరూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే గాని రోజు గడవని పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపించకుండా చిన్న పిల్లల సంరక్షణను కొంచెం ఎదిగిన పిల్లలకు అప్పగించడం, ఎదిగిన పిల్లల్ని పనిలోకి పంపించడం సర్వసాధారణం. దీనివల్ల ఎంతో మంది సీతలు చదువుకొనే భాగ్యం కోల్పోతున్నారు.
3.“ఆలస్యం అమృతం విషం” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు.
ఆలస్యం = ఆలస్యం చేస్తే, అమృతం = అమృతము కూడా, విషం = విషంగా మారిపోతుంది. ఏ పని ఎప్పుడు చెయ్యాలనుకున్నామో ఆ సమయానికి చేసెయ్యాలి. అలా చెయ్యకపోతే పని అనుకున్నట్లు జరగక పోవడం కష్ట నష్టాలు వాటిల్లడం జరుగుతుంది. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు. మన పాఠంలో ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకుందామా మూడవబిడ్డ కోసం చూద్దామా అని ఆలోచించే లోపలే ఆలస్యం అయిపోయి మూడవ బిడ్డ పుట్టింది.
4.మీరు చదువుకొని ఏం కావాలనుకొంటున్నారు ? ఎందుకు ?
జవాబు.నేను చదువుకొని టీచర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డాక్టరునైనా, ఇంజనీరునైనా, శాస్త్రజ్ఞుణ్ణనా, మరే ఉన్నతాధికారినైనా తయారుచేసేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తే సమాజానికి చక్కని పౌరులనందించి దేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర వహిస్తారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. తాము నేర్చుకున్నది ఇతరులకు అందిస్తారు. అందుకే నాకు ఉపాధ్యాయుణ్ణి కావాలని ఉంది.
5.ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి
జవాబు.మన సమాజంలో మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ అనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానులే. మగపిల్లల కంటే బాగానే ఆడపిల్లలు చదవగలరు. అన్ని పనులు సమర్థవంతంగా నెరవేర్చగలరు. ఏ ఉద్యోగంలోనైనా రాణించగలరు. రాజ్యాలైనా ఏలగలరు. ఆడపిల్లలకు ఓర్పు, ఇతరులపట్ల స్నేహభావం, ప్రేమ ఎక్కువ. ఏ విషయంలోనూ ఆడపిల్లలు మగ పిల్లలకు తీసిపోరు. కనుక ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ సమానమే.
6.బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు.బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోపక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తూ కథ చెబుతాడు. వంతలు దక్కీలు వాయిస్తూ తందానతాన, సైసై అంటుంటారు. బుర్రకథలో మొదట కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు. జానపద కళల్లో బుర్రకథకు ప్రముఖ స్థానం ఉంది. సమాజంలోని సమస్యలను చెప్పి ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహించింది.
7.సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు.నాకు బాగా చదువుకోవడమంటే ఇష్టం. వార్తాపత్రికలలో వచ్చే పజిల్స్ పూర్తి చేయడమంటే ఇష్టం. బొమ్మల కథల పుస్తకాలు బాగా ఇష్టపడతాను. తల్లిదండ్రులకు సహాయపడుతూ నానమ్మ తాతయ్యకు కబుర్లు చెబుతూ సంతోషపెట్టడం ఇష్టం. బాగా చదువుకొని టీచర్నై మా టీచర్ గా ఆదర్శంగా నిలబడి సమాజాన్ని తీర్చిదిద్దడం విద్యార్థులను మంచి పౌరులుగా తయారుచెయ్యటం ఇష్టం. అందరితో స్నేహంగా ఉంటూ సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం. ఆటలాడడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం, బొమ్మలు తయారు చేయడం కూడా ఇష్టమే.
అర్థాలు
దంపతులు = భార్యాభర్తలు / ఆలుమగలు
పైడి = బంగారము
బీజము = విత్తనము
మేలు = మంచి / ఉపకారము
శ్రీలు = సంపదలు
సంగ్రామము = యుద్ధము
సమరము = యుద్ధము
పర్యాయపదాలు
దంపతులు – భార్యాభర్తలు / ఆలుమగలు
ఇష్టము = వాంఛ,కోరిక
సంగతి = విషయము, సమాచారము
మేలు = మంచి, శుభము
పైడి = పుత్తడి, బంగారము
వ్యతిరేక పదాలు
కొత్త × పాత
చైతన్యము × జడత్వము
తొలి × చివరి
జయము × అపజయము, పరాజయము
ఉత్తముడు × అధముడు
మంచివాడు × చెడ్డవాడు
కష్టము × సుఖము
ఇష్టము × అనిష్టము
ముందు × వెనుక / తర్వాత
బలము × దుర్బలం / బలహీనము
ప్రకృతులు – వికృతులు
రూపము – రూపు
కథ – కత, కద
ప్రయాణము – పయనము, పైనము
రత్నము – రతనము
కష్టము – కస్తి,కసటు
భారము – బారకము
శాస్త్రము – చట్టము
స్వతంత్రము – సొంతము
భరము – బరువు
సూక్తులు – సుద్దులు
పుణ్యము – పున్నెము, పున్నియము
రాజు – రాయలు
రాట్టు – ఱేడు
అక్షరము – అక్కరము, అచ్చము
విజ్ఞానము – విన్నాణము, విన్ననువు
సంధులు
దినోత్సవము – దిన + ఉత్సవము – గుణ సంధి
విద్యార్థిని – విద్యా + అర్థిని – సవర్ణదీర్ఘ సంధి
కొత్తెక్కడ – కొత్త + ఎక్కడ – అత్వ సంధి
చెత్తంతా – చెత్త + అంత – అత్వ సంధి
వద్దని – వద్దు + అని – ఉత్వ సంధి
కొత్తవని – కొత్త + అని – ఇత్వ సంధి
తగవులాడు – తగవులు + ఆడు – ఉత్వ సంధి
తమ్ముడన్నట్లు – తమ్ముడు + అన్నట్లు – ఉత్వ సంధి
దంపతులున్నారు – దంపతులు + ఉన్నారు – ఉత్వ సంధి
ఎక్కువాయె – ఎక్కువ + ఆయె – అత్వ సంధి
అంకితమై – అంకితము + ఐ – ఉత్వ సంధి
వాళ్ళెందుకు – వాళ్ళు + ఎందుకు – ఉత్వ సంధి
అనుకున్నంత – అనుకున్న + అంత – అత్వ సంధి
సాధ్యమవుతుంది – సాధ్యము + అవుతుంది
ఈడున్న – ఈడు + ఉన్న – ఉత్వ సంధి
ఒక్కొక్క – ఒక్క + ఒక్క – ఆమ్రేడిత సంధి
వాళ్ళింటికి – వాళ్ళ + ఇంటికి – అత్వ సంధి
అభ్యున్నతి – అభి + ఉన్నతి – యణాదేశ సంధి
మాటలన్ని + మాటలు + అన్ని – ఉత్వ సంధి
ప్రభావితులైన – ప్రభావితులు + ఐన – ఉత్వ సంధి
చిన్నక్క – చిన్న + అక్క – అత్వ సంధ
ప్రధానోపాధ్యాయులు – ప్రధాన + ఉపాధ్యాయులు – గుణ సంధి
చేయాలని – చేయాలి + అని – ఇత్వ సంధి
ఎంపికయింది – ఎంపిక + అయింది – అత్వ సంధి
చక్కనమ్మ – చక్కని + అమ్మ – ఇత్వ సంధి
సీతమ్మ – సీత + అమ్మ – అత్వ సంధి
జరిగిందక్కా – జరిగింది + అక్కా – ఇత్వ సంధి
సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
1. పుణ్య ఫలము పుణ్యము యొక్క ఫలము షష్ఠీ తత్పురుష సమాసము
2. మానవ జన్మ మానవుల యొక్క జన్మ షష్ఠీ తత్పురుష సమాసము
3. నలుగురు గొప్పవాళ్ళు నలుగురు సంఖ్య గల గొప్పవాళ్ళు ద్విగు సమాసము
4. స్వరాజ్య సమరము స్వరాజ్యము కొరకు సమరము చతుర్థీ తత్పురుష సమాసము
5. మహిళల మార్గము మహిళల యొక్క మార్గము షష్ఠీ తత్పురుష సమాసము
6. పదహారేళ్ళు పదహారు సంఖ్యగల ఏళ్ళు ద్విగు సమాసము
7. ఇంటిపనులు ఇందలి పనులు సప్తమీ తత్పురుష సమాసము
8. చదువుల తల్లి చదువులకు తల్లి షష్ఠీ తత్పురుష సమాసము
9. నాలుగురాళ్ళు నాలుగు సంఖ్య గల రాళ్ళు ద్విగు సమాసము
10. శత్రువినాశము తల్లియు, తండ్రియు ద్వంద్వ సమాసము
11. రామకథ శత్రువుల యొక్క వినాశము షష్ఠీ తత్పురుష సమాసము
1. అ. క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజాచైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పే వారిని “కథకుడు” అనీ, ఆయనకు రెండుపక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను “వంతలు” అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు.
ప్రశ్నలు:
1. బుర్రకథ ఎటువంటి కళారూపం ?
జవాబు.జానపద కళారూపం
2. బుర్రకథలో ఎన్ని పాత్రలు ఉంటాయి ?
జవాబు.
మూడు పాత్రలుంటాయి.
3. కథ చెప్పేవారిని ఏమంటారు ?
జవాబు.ప్రధాన కథకుడు
4. ప్రక్కలనున్నవారిని ఏమంటారు ?
జవాబు.వంతలు
5. బుర్రకథ చెప్పిన వారి పేరేమిటి ?
జవాబు.కృష్ణవేణి
ఆ. క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
పరమానందయ్యగారు శిష్యులను తన వద్దనే ఉంచుకొని చదివిస్తారు. వారిమీద ఆయనకు ఎంతో అభిమానం. శిష్యులకు గురువు అంటే ఎంతో గౌరవం, చనువు. వారి మధ్య సంబంధం తండ్రీబిడ్డల సంబంధం కంటె గొప్పది. ఆయన వారి తప్పులను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు.
ప్రశ్నలు:
1. ఈ పేరాలో గురువుగారి పేరేమిటి ?
జవాబు.పరమానందయ్య
2. గురు శిష్యుల బంధాన్ని ఏ బంధంతో పోల్చారు ?
జవాబు.తండ్రీబిడ్డల బంధంతో
3. గురువు శిష్యులను ఎలా చూసేవారు ?
జవాబు.ఎంతో అభిమానంగా
4. శిష్యులకు గురువుపై ఎటువంటి భావం ఉండేది ?
జవాబు.గౌరవం, చనువు
5. శిష్యులు ఎక్కడ ఉండేవారు ?
జవాబు.గురువుగారి దగ్గర
2. కింది వాక్యాలను సరైన వరుసలో పేరాగా రాయండి.
1. ఆ తెలుగు నాట రామాపురమనేది ఒక పల్లెటూరు.
2. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత.
3. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులున్నారు.
4. శ్రీలు విలసిల్లిన భారత భూమిలో, రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల.
5. సీతను బడికి పంపాలనుకుంటూండగానే వాళ్ళకు మరో అబ్బాయి పుట్టాడు.
జవాబు.శ్రీలు విలసిల్లిన భారత భూమిలో, రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురమనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటూండగానే వాళ్ళకు మరో అబ్బాయి
పుట్టాడు.
3. ఈ క్రింది పేరాలు చదివి వాటికి ఐదేసి ప్రశ్నలు రాయండి.
అ. అంగవైకల్యం తప్పుకాదు. అది ఆయాపరిస్థితులలో వెనుకపడడమే. వారికి చేయూతనిచ్చి పైకి తీసుకురావలసిన బాధ్యత మనందరిదీ. ఒక చల్లని మాట, ప్రేమతో కూడిన చల్లని స్పర్శ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే మన చేతనైనంతలో వారిలో ధైర్యాన్ని నింపుదాం.
1. అంగవైకల్యం అంటే ఏమిటి?
2. ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది?
3. మనం వారిలో ఏం కలిగించాలి?
4. మన బాధ్యత ఏమిటి?
5. ఈ పేరాకు శీర్షిక రాయండి.
ఆ. ఉత్తానపాద మహారాజు పెద్ద భార్య సురుచి, చిన్న భార్య వినీత. పెద్ద భార్య కుమారుడు ధ్రువుడు. రాజు చిన్న భార్యను, ఆమె కుమారుడు ఉత్తముడిని ఎక్కువ ప్రేమించేవాడు. పక్షపాతం కలిగి ఉండేవాడు. సురుచిని, ధ్రువుని అవమానించేవాడు. అందుకే ధ్రువుడు శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేశాడు.
1. రాజుకు ఎంతమంది భార్యలు ?
2. ఉత్తముడు ఎవరి కుమారుడు ?
3. రాజుకు ఎవరియందు పక్షపాతం ?
4. ధ్రువుని తల్లి ఎవరు ?
5. ధ్రువుడు ఎవరిని గురించి తపస్సు చేశాడు ?
4. క్రింది వాక్యాలలో గీతగీసిన పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.
అ. కొత్త నీరొచ్చి ……………………….. నీటిని కొట్టేసింది.
జవాబు.కొత్త × పాత
ఆ. పట్టణాల కంటె ……………………….. అందంగా ఉంటాయి.
జవాబు.పట్టణాలు × పల్లెలు / పల్లెటూళ్ళు
5. ప్రకృతి వికృతులను మార్చి రాయండి.
అ. మీరు కథలు చెప్పుకోడమేనా ? నాక్కూడా ……………………….. చెబుతారా ?
జవాబు.కథలు (ప్ర) – కతలు (వి)
ఆ. నాన్న పుస్తకంలో ఎన్నో సూక్తులు చదివి, ఆ ……………………….. అన్నీ నాకు చెబుతారు.
జవాబు.సూక్తులు (ప్ర) – సుద్దులు (వి)
6. గీతగీసిన పదానికి అదే అర్థం ఇచ్చే పదం ఖాళీలో రాయండి.
అ. ఉత్తములు కార్యసాధకులు. ఆ ……………………….. మనకు ఆదర్శం.
జవాబు.ఉత్తములు = గొప్పవాళ్లు
ఆ. సంఘానికి సేవచేసిన సంస్కర్తలను చూసి నేను కూడా ……………………….. సేవ చేయాలనుకున్నాను.
జవాబు.సంఘానికి = సమాజానికి
7. సమాసాల పేర్లు రాయండి.
అ. పూటగడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయె.
జవాబు.తల్లిదండ్రులు = తల్లియు, తండ్రియు – ద్వంద్వ సమాసము
ఆ. అక్షరమాల లోని అక్షరాల సంఖ్య ఎంత ?
జవాబు.అక్షరమాల = అక్షరముల యొక్క మాల – షష్ఠీ తత్పురుష సమాసము
8. సంధులు గుర్తించండి.
అ. అమ్మా నేను ఎక్కాలన్నీ చదివాను.
జవాబు.
ఎక్కాలు + అన్నీ = ఉత్వసంధి
ఆ. తల్లిదండ్రులు పిల్లల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తారు.
జవాబు.అభి + ఉన్నతి = యణాదేశ సంధి
ఇ. రమ తెలివితేటలకు ప్రధానోపాధ్యాయుడు ముగ్ధుడైనాడు.
జవాబు.
ప్రధాన + ఉపాధ్యాయుడు = గుణసంధి
9. గీత గీసిన పదాల ఆధారంగా వ్యతిరేక వాక్యాలు రాయండి.
అ. నీవు చెప్పినది కొంతవరకే అర్థమయింది.
జవాబు.
అర్థమయింది × అర్థం కాలేదు
నీవు చెప్పినది పూర్తిగా అర్థం కాలేదు.
ఆ. ఇవాళ నాతో సినిమాకు వస్తావా ?
జవాబు.
వస్తావా × రావా
ఇవాళ నాతో సినిమాకు వస్తావా ? రావా ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి