సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

13, మార్చి 2023, సోమవారం

2. అయోధ్య కాండ


2. అయోధ్యా కాండ


శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు
కైకేయికి మంధర దుర్బోధ
కైకేయి కోరికలు:
దశరథుడు మూర్ఛిల్లడం
కైకేయికి శ్రీరాముని హామీ
సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష
వన ప్రయాణం
గుహుని ఆతిథ్యం
చిత్రకూట నివాసం
దశరధుని మరణం
భరతుని దుఃఖం
చిత్రకూటానికి భరతుడు ప్రయాణం
పితృవాక్య పాలన
శ్రీరాముని పాదుకలతో పరిపాలన
అత్రి, అనసూయ, సీత

కీలక పదాలు : 






శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు: 
 శ్రీరాముడు అయోధ్యా నగర వాసులకు ప్రాణప్రథమయ్యాడు.
దశరధుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగించి, తాను విశ్రాంతి తీసికొనవలెనని సంకల్పించాడు. 
 చైత్ర పుష్యమినాడే పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. పుర వాసులంతా హర్షించారు.
సకల సంభారాలు సిద్ధమౌతున్నాయి.  వశిష్ఠుడు రామునకు పట్టాభిషేక దీక్షనిచ్చి సీతారాములను ఉపవసించమని, మరునాడే పట్టాభిషేకమని చెప్పాడు. సీతారాములు శ్రీమన్నారాయణ మూర్తిని పూజించి, హోమాది కర్మలు చేసి, నియతమానసులై ఉపవసించారు. అయోధ్యానగర వాసులు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి సంబరాలు చేసికొనసాగారు.

కైకేయికి మంధర దుర్బోధ:  కైకేయి అరుణపు దాసి మంథర.     అయోధ్య నగరం ఆనందాన్ని చూసి తన కళ్ళలో నిప్పులు కుమ్మరించుకుంది.    కైకేయికి రామ పట్టాభిషేకం గురించి తెలియజేసింది.    కైకేయి బహుమానాలు అందజేసింది.

దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని కైకేయిని ప్రశ్నించింది మంథర.    నాకు రాముడు, భరతుడు సమానము.
 "రాముడు పట్టాభిశక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏమిటి' అని కైకేయి ప్రశ్నించింది.
రాముడు రాజయితే రాజమాత కౌసల్య  అవుతుంది. 
నీవు నీ  జీవితకాలమంతా కౌసల్యకు దాసివని కైకకు మంథర నూరిపోసింది.
కైకేయి మనసు మారింది.
ఎప్పుడో కోరిన కోరికలు తీర్చాలని
రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపాలి. భరతునికి పట్టాభిషేకం జరగాలని దశరథుని కైకేయి కోరింది.

కైకేయి కోరికలు: కైక సకలాలంకారాలూ త్యజించి కోపగృహంలో విషణ్ణవదనయై ఉంది. 
అడిగిందిస్తానని రామునిమీద, తాను చేసుకున్న పుణ్యం మీద ఒట్టు పెట్టి చెప్పాడు. 
పూర్వం దేవాసుర యుద్ధంలో దశరథుడు తనకిచ్చిన రెండు వరాలు ఇప్పుడు చెల్లించాలని కోరింది. ఆ రెండు కోరికలు -
 (1) భరతుని పట్టాభిషేకము
 (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. కైకేయి మాటలు విని దశరథుడు కుప్పకూలిపోయాడు. 
అది అధర్మమనీ, అందుకు భరతుడు కూడా సమ్మతించడనీ, అంతే గాక తాను పట్టాభిషేకాన్ని అందరిముందూ ప్రకటించాననీ, కనుక ఆ రెండు కోరికలను ఉపసంహరించుకోమనీ కైకను బ్రతిమాలాడు. నిందించాడు. అయినా కైక తన పట్టు వీడలేదు.

మరునాడు వశిష్ఠుడు, సుమంతుడు పట్టాభిషేకం జరిపించడానికి దశరథుని వద్దకు వచ్చారు. దశరథుడు దీనుడై నోటమాటరాని స్థితిలో ఉన్నాడు. 
కైకయే రాముని పిలిపించి దశరథుని సమక్షంలోనే అంతకుముందు దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది. 
రాముడు కించిత్తైనా దుఃఖం లేకుండా తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్ళడానికి తాను సిద్ధమనీ, వెంటనే భరతుని పిలిచి పట్టం కట్టమనీ చెప్పాడు.

సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష:
కౌసల్యా లక్ష్మణుడూ రాముని వనవాసాన్ని నిరోధింప యత్నించారు.  
తండ్రి మాట నిలబెట్టడం లక్ష్మణుని బాధ్యత కూడాననీ, 
భర్త మాట నిలబెట్టడం కౌసల్య ధర్మమనీ వారిద్దరికీ నచ్చచెప్పి రాముడు వనవాస దీక్షకు ఉద్యుక్తుడయ్యాడు.
సీత తాను కూడా వనవాసానికి రామునితోడుగా వస్తానన్నది. సుకుమారియైన రాజబిడ్డకు వనవాసం దుస్సహమని రాముడు చెప్పినా సీత వినలేదు.- 
తనకు వనవాస యోగమున్నదని జ్యోతిష్కులు చెప్పారు. రాముడు తోడుంటే తనకు కష్టాలు, భయాలు ఉండనే ఉండవు. తనను తోడు తీసుకువెళ్ళకుంటే రాముడు భార్యను రక్షించుకోవడం చేతకాని భయస్తుడే – ఇలా మొండిగా వాదించి సీత రాముని వెంట బయలుదేరింది. 
తల్లి అనుజ్ఞ తీసికొని, అన్నతో వాదించి, వనవాస సమయంలో అన్నా వదినల సేవ జేయడానికి లక్ష్మణుడు కూడా వారివెంట ప్రయాణమయ్యాడు.

వన ప్రయాణం:

సీతా రామ లక్ష్మణులు తమ సంపదలను అందరికీ దానాలు చేశారు. 
రాముడు తన ఆభరణాలను సుయజ్ఞునికీ, సీత తన ఆభరణాలను సుయజ్ఞుని భార్యకూ ఇచ్చారు. తల్లిదండ్రుల సెలవు తీసుకొన్నారు. 
కటువుగా కైక వారికి నారచీరలు ఇప్పించింది. 
అన్నను సేవించమని సుమిత్ర లక్ష్మణునికి ఆనతిచ్చింది. 
సుమంత్రుడు రథంపై వారిని తీసుకొని ప్రయాణమైనాడు. 
 దశరథుడు నేలపై బడి యేడుస్తున్నాడు. సుమిత్ర కౌసల్యను ఓదార్చింది. అయోధ్యాపుర వాసులు వారిని వెంబడించసాగారు. వెనుదిరగడానికి నిరాకరించారు.

తమసానది ఒడ్డున మొదటి రాత్రి విశ్రమించిన సీతారామలక్ష్మణులు ఎలాగో అయోధ్యాపుర వాసులను ఏమరచి, చీకటిలో కోసలదేశం దాటిపోయారు. 
వేదశృతి, గోమతి, స్యందిక నదులను దాటి గంగానది ఒడ్డున ఉన్న శృంగిబేరపురం చేరుకున్నారు. ఒక చెట్టుక్రింద విశ్రమించారు.

గుహుని ఆతిథ్యం:

బోయ రాజైన గుహుడు సపరివారంగా వచ్చి రాముని కౌగిలించుకొని ఉత్తమమైన ఆతిథ్యాన్ని అందించాడు. 
తన రాజ్యాన్ని ఏలుకోమని రాముని ప్రార్థిచాడు. 
రాముడు వనవాస దీక్షలో ఉన్నందున వారు సమర్పించిన భక్ష్యాదులను నిరాకరించి, రాజుగారి గుర్రాలకు మాత్రం మేత ఇమ్మన్నాడు. 
సీతారాములు మాత్రం నేల మీదే విశ్రమించారు. వారిని చూచి లక్ష్మణుడు దుఃఖించాడు.

వెనుకకు వెళ్ళడానికి మనసొప్పని సుమంత్రునికి నచ్చజెప్పి రాముడు అతనిని అయోధ్యకు పంపాడు. 
గుహుడు ఏర్పాటు చేసిన నావలో సీతారామలక్ష్మణులు గంగానదిని దాటారు. సీత గంగమ్మకు నమస్కరించి తమను కాపాడమని ప్రార్థిచింది.

చిత్రకూట నివాసం:

సీతారామలక్ష్మణులు ప్రయాణం కొనసాగించి గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగ వద్ద భరద్వాజాశ్రమాన్ని చేరుకొన్నారు. 
ముని వారిని ఆదరించి అక్కడే వనవాస కాలాన్ని గడపమన్నాడు. కాని అది జనావాసాలకు సమీపంలో ఉన్నందున అక్కడ ఉండడానికి రాముడు ఇష్టపడలేదు.

భరద్వాజ మహర్షి సూచన ప్రకారం వారు ఒక తెప్ప తయారు చేసుకొని యమునానదిని దాటి వెళ్ళారు. 
వారు చిత్రకూటం అనే సుందరమైన ప్రదేశం చేరుకొన్నారు. 
అక్కడ లక్ష్మణుడు దృఢమైన పర్ణశాలను నిర్మించాడు. 
రాముడు మాల్యవతీ నదిలో స్నానం చేసి, వాస్తు పూజావిధులు నెరవేర్చాడు. అక్కడ వారి నివాసం ఆరంభమైంది.

దశరధుని మరణం: దశరథుడు గతంలో మునిబాలకుని పొరపాటుగా చంపినందుకు ఆ బాలకుని తల్లిదండ్రులు పెట్టిన శాప ఫలితమే ఈ మరణం.

సుమంత్రుడు గుహుని వద్ద వీడ్కోలు తీసికొని శోకదగ్ధమైన అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు. పరితపిస్తూ అంతఃపురానికి వెళ్ళి దశరథునికి జరిగినది వివరించాడు. దశరథుడు కృశించి దీనుడై దుఃఖిస్తూ ఉన్నాడు.

దశరథుడు తన యౌవనంలో శబ్దవేధ విద్యలో ప్రజ్ఞుడు. 
ఒకమారు కారుచీకటిలో అతను నీటిలో శబ్దాన్ని బట్టి, ఏదో ఏనుగు తొండంతో నీళ్ళు త్రాగుతుందనుకొని బాణం వేశాడు. 
మునికుమారుడు అంధులైన తన తల్లిదండ్రులకోసం కుండలో నీరు పట్టుడం వల్ల ఆ శబ్దం వచ్చింది. 
దశరథుని బాణానికి ఆ మునికుమారుడు మరణించాడు. పశ్చాత్తాపంతో హతాశుడైన దశరథుడు ఆ ముని కుమారుని తల్లిదండ్రులకు తన వల్ల జరిగిన తప్పిదం విన్నవించాడు. 
వారు కొడుకు శవంపై బడి విలపించారు. దశరథుడు కూడా పుత్రశోకంతోనే కాలం చేస్తాడని ఆ తండ్రి శపించాడు.
ఈ శాప వృత్తాంతాన్ని కౌసల్య, సుమిత్రలకు చెప్పి దశరథుడు తన దుష్కృత్యానికి తగిన ఫలం అనుభవిస్తున్నానని శోకించాడు. రామునికోసం విలపిస్తూనే మృతిపొందాడు.

భరతుని దుఃఖం:

అయోధ్య మరింత శోకంలో మునిగిపోయింది. 
వెంటనే రాజ్యాభిషేకానికి రమ్మని వశిష్ఠుడు గిరివ్రజంలో మేనమామల ఇంట్లో ఉన్న భరతునికి కబురు పంపాడు.
 భరతుడు దుస్వప్నం కారణంగా వ్యాకులచిత్తుడై ఉన్నాడు. అతనికి జరిగిన సంగతులు అన్నీ చెప్పకుండా దూతలు అయోధ్యకు తోడ్కొనివచ్చారు.
 కైకేయి భరతునికి త్వరగా పట్టాభిషేకం చేయించుకోమని తొందర చేసింది. 
దశరథుడు మరణించిన సంగతీ, సీతారామలక్ష్మణులు అడవులకు పోయిన సంగతీ చెప్పింది. అంతా తన కొడుకు మేలు కోసమే చేశానని చెప్పింది.

కోపంతోనూ, రోషంతోనూ, దుఃఖంతోనూ భరతుడు మండిపడ్డాడు. అధర్మానికి ఒడిగట్టిన తల్లిని తీవ్రంగా నిందించాడు. రాముని వనవాసం మాన్పించి తిరిగి అయోధ్యకు పిలచి పట్టం గట్టి, తాను అన్నను సేవిస్తానని ఖండితంగా చెప్పాడు. తనకేమీ తెలియదని అమాత్యులతో చెప్పి దుఃఖించాడు. మన్నించమని కౌసల్యను వేడుకున్నాడు.

వశిష్ఠుని ఆదేశంపై భరతుడు తండ్రికి అగ్ని సంస్కారం చేశాడు. 
పండ్రెండో దినాన శ్రాద్ధ కర్మలన్నీ పూర్తి చేశాడు. 
పధ్నాలుగవ నాడు భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని రాజోద్యోగులు కోరారు. 
భరతుడు వారికి నమస్కరించి, నిరాకరించాడు. 
రాముడే రాజు కావాలని, రాముని అయోధ్యకుతెచ్చి అభిషిక్తుడిని చేసి తాను మాత్రం తల్లి కోరికకు వ్యతిరేకంగా అడవులకు పోతానని దృఢంగా అన్నాడు.

చిత్రకూటానికి భరతుని ప్రయాణం:

రాముణ్ణి రాజుగా చేయడానికి అయోధ్యకు పిలవాలని భరతుడు సపరివారంగా బయలు దేరాడు. దారిలో గంగాజలంతో తండ్రికి తర్పణం చేశాడు. 
గుహుని కలసి జరిగిన సంగతులు తెలిసికొని విలపించాడు. 
గంగను దాటి భరద్వాజాశ్రమం చేరుకొని మునిని ప్రసన్నం చేసుకొన్నాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో ఉన్నారని తెలిసికొన్నాడు.

చిత్రకూటంలో సీతారాములు మందాకినీ పరిసర సౌందర్యం చూసి పరవశిస్తున్నారు. 
పెద్ద కోలాహలం విని లక్ష్మణుడు చెట్టుపైకెక్కి గొప్ప సైన్యాన్ని చూశాడు. 
కోవిదార ధ్వజాన్ని బట్టి అది భరతుని సైన్యమే అని గ్రహించాడు. తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి భరతుడు ససైన్యంగా వస్తున్నాడని భావించి రోషంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అయితే భరతుని ధర్మ నిరతిని సంశయింపవద్దని రాముడు లక్ష్మణునికి చెప్పగా అతను తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు.

సైన్యాన్ని దూరంగా ఉంచి, భరతుడు, శత్రుఘ్నుడు, గుహుడు, వశిష్ఠ మహర్షి, సుమంత్రుడు, మరి కొందరు అమాత్య బ్రాహ్మణ ప్రముఖులు రాముని పర్ణశాలకు చేరుకున్నారు. 
భరత శత్రుఘ్నులు సీతారామలక్ష్మణుల పాదాలపైబడి శోకంతో నోట మాట రాక విలపించారు.

పితృవాక్య పాలన:

 పుత్రశోకంతో తండ్రి మరణించిన వార్త తెలియగానే రాముడు మూర్ఛిల్లాడు. 
పిదప లేచిన రాముడు అమితంగా దుఃఖిస్తూ మందాకినీ జలాలతో దశరథునికి తర్పణం వదిలాడు. 
 దశరథుని భార్యలు కూడా పర్ణశాలకు చేరుకున్నారు. 
రాముడు, లక్ష్మణుడు తల్లులకు పాదాభివందనాలు చేశారు. 
సీత కన్నీటితో వచ్చి అత్తల కాళ్ళకు మ్రొక్కింది.

భరతుడు దీనుడై రాముని పాదాలకు మ్రొక్కి – “నేను నీ భృత్యుడిని. నీకు చెందవలసిన రాజ్యాన్ని నేను పొందలేను. నాపై దయ వుంచి నీ రాజ్యం నీవు గ్రహించి మమ్ములను అనుగ్రహించు” అని కోరాడు. 
అప్పుడు రాముడు “తండ్రి నీకు రాజ్యమూ, నాకు వనవాస దీక్షా ఇచ్చాడు. ఇద్దరమూ వాటిని అలా అనుభవించాల్సిందే” – అని బదులు చెప్పాడు.

ఎవరెన్ని విధాలుగా చెప్పినా వనవాసం విరమించుకోవడానికి రాముడు అంగీకరించలేదు. తండ్రి ఋణం తీర్చుకోవడానికి, ఆయనకు అసత్య దోషం అంటకుండా ఉండడానికి అదే మార్గమని స్థిరంగా చెప్పాడు.

శ్రీరాముని పాదుకల రాజ్యం:       
శ్రీరాముని తిరస్కారంతో భరతుడు దర్భలు పరచుకొని అడ్డంగా పడుకున్నాడు. అన్నయ్య తన ప్రార్థన అంగీకరించే వరకు అన్నం నీళ్ళు ముట్టనన్నాడు. 
రాముడు భరతుని అనునయించి పితృఋణం తీర్చుకునే ధన్యత నుండి తనను దూరం చేయవద్దని కోరాడు. 
ఖిన్నుడైన భరతుడు ధర్మమార్గమేదో నిర్ణయించి ఆజ్ఞాపించమని రాముని పాదాలపై వాలాడు. 
రాముడు భరతునకు రాజధర్మం బోధించి, రాజ్యం చేయమని ఆదేశించాడు. 
ప్రలోభం వల్ల చేసిన కైక తప్పిదాన్ని మరచి తల్లిని భక్తితో సేవించమని చెప్పాడు.

భరతుడు శ్రీరాముని పాదుకలను అనుగ్రహించమని కోరాడు. 
అందుకు రాముడు సమ్మతించాడు. 
పధ్నాలుగు సంవత్సరాలు తాను కందమూలాలు మాత్రం తింటూ, నగరం బయటనే నివసిస్తూ, అన్నగారి పాదుకల పేరునే రాజ్యం చేస్తానని భరతుడు చెప్పాడు. 
పధ్నాలుగు సంవత్సరాలు అయిన మరునాడు రాముడిని చూడకపోతే తాను అగ్నిలో దూకుతానన్నాడు. అందరికీ నమస్కరించి పాదుకలు శిరసున ధరించి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో భరద్వాజ మహర్షికి జరిగిన విషయం విన్నవించాడు.

అందరినీ అయోధ్యకు పంపి భరతుడు తాను మాత్రం నందిగ్రామంలోనే ఉండిపోయాడు. పాదుకలకు సకల రాజమర్యాదలూ జరిపించాడు. తాను నారచీరలు ధరించి అన్నగారి పాదుకల పేరున రాజ్యపాలన సాగించాడు.

అత్రి, అనసూయ, సీత: 
సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని దర్శించారు. అత్రి భార్య అనసూయ. ఆమెకు సీత పాదాభివందనం చేసింది. అనసూయ సీతకు పతివ్రతా ధర్మాలను ఉపదేశించి మహత్తు గల పూలదండ, చందనం, వస్త్రాభరణాలు ఇచ్చింది. అనసూయ కోరికపై సీత తన స్వయంవరం, కళ్యాణం కథను ఆమెకు చెప్పింది. అనసూయ మురిసిపోయింది. ఆమె ఇచ్చిన వస్త్రాభరణాదులు ధరించి సీత ఆమెకు మరల పాదాభివందనం చేసింది.

మరువాడు వారివద్ద సెలవు పుచ్చుకొని సీతారామలక్ష్మణులు, సూర్యుడు మేఘ మండలంలో ప్రవేశించినట్లు, ఇంకా దట్టమైన అరణ్యంలో ప్రవేశించారు.


_----------------------------------

వ్యాసరూప ప్రశ్నలు:
 శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు ఏమిటి?
జ.  పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్య తనను తాను అలంకరించుకుంది.

అది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు కుమ్మరించుకుంది.మందర దుర్భోధ వల్ల కైకేయి మనసు మారింది. రాముడు 14 సంవత్సరాలు వనవాసం. భరతునికి పట్టాభిషేకం చేయాలని కైకేయి దశరధుని కోరింది.

పితృ వాక్య పరిపాలన రాముడికి దశరధుని దగ్గర తీసుకున్న రెండు వరాలను గురించి రామునికి చెప్పింది.    రాముడు తండ్రి మాటలను గౌరవించి వనవాసానికి బయలుదేరాడు.
 రాముని తో పాటు సీతా లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు

ప్రశ్న 1. శ్రీరముని గుణగణాలను వివరించండి.
శ్రీరాముడు సద్గుణరాశి. వినయంలోనూ,  రూపంలోనూ గుణంలోనూ శ్రేష్టుడు. మహావీరుడు. మృదుస్వభావి. శరణన్న వారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించని వాడు. దీనులను ఆదుకునే వాడు.
 కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల విచ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేని వాడు కలలో ఆరితేరిన వాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన  మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై  డా. మండల స్వామి  రాసిన సమీక్షా వ్యాసాన్ని  ఈ రోజు తేది: ...