- ఆచార్య కె. రుక్నుద్దిన్
బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి: ( Page No.89)
ప్రశ్నలు:
1.బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతున్నది.
2.స్తూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.ఏదైనా ఉద్యమంలో పాల్గొని, అమరులైన వారిని, లేక వారిని కాపాడటంలో ప్రాణాలను అర్పించిన వీరజవానులను స్మరించుకోవడం కోసం స్థూపాలను నిర్మిస్తారు.
3.స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.వీరోచితంగా పోరాడి అమరులైన వారిని స్మరించుకోవడానికి గుర్తుగా ఘనంగా నివాళులు అర్పిస్తారు.
4.అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు. ఏ ఆశయసాధన కోసం పోరాడి అమరులు అయ్యారో, వారి ఆశయాలను, ఆకాంక్షలను తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ పిడికిలి బిగించి చేతిని పైకెత్తి నివాళులు అర్పిస్తారు.
పాఠం నేపథ్యం, ఉద్దేశం:
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు.
(1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి.) తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ – గేయం:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో గేయ కవిత ఒకటి. ఇది రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మాత్రా ఛందస్సు ఎక్కువగా వాడతారు. ఒక పల్లవి, కొన్ని చరణాలు ఉంటాయి. కొన్ని గేయాల్లో శబ్దాలంకారాల ప్రయోగం ఎక్కువగా ఉంటుంది.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య కె. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.
కవి పరిచయం:
కవి పేరు : ఆచార్య కె. రుక్నుద్దీన్
పాఠ్యభాగం పేరు : అమరులు
కాలం : 2.5.1947 – 26.5.2013
జన్మస్థలం : నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.
పరిశోధనాత్మక గ్రంథం : జానపద సాహిత్యంలో అలంకార విధానం.
పాఠ్యభాగ గ్రంథం : విప్లవఢంకా
ఇతర రచనలు : ప్రయాణం, సూక్తిసుధ, శెలిమె, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం
సత్కారాలు : వివిధ సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు.
విశేషాంశాలు : బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాదిగా, పాలమూరు ఆణిముత్యంగా కీర్తి పొందారు.
ప్రవేశిక:
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో
తెలుసుకుందాం.
పాఠ్యభాగ సారాంశం:
తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా ! మీకు జోహార్లు. వీరులారా ! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు. శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది.
మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా ! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.
ఆలోచించండి – చెప్పండి. ( Page No.91)
1.‘మాకై అసువులు బాసిన’ అనటంలో మాకు అంటే -ఎవరు?.
జవాబు.‘మాకై అసువులు బాసిన’ అనడంలో ‘మాకు’ అంటే తెలంగాణ ప్రజలమైన మాకు’ అని అర్థం. తెలంగాణ రాష్ట్రసిద్ధికై ప్రాణత్యాగం చేశారని కవి ఉద్దేశం.
2.‘జోహారులు’ అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం? ఎందుకు సమర్పించాలి ?
జవాబు.‘జోహారులు’ అంటే నివాళులు అని అర్థం. సామాజిక సేవలోను, ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను తీర్చే విషయంలో ప్రాణాలను అర్పించిన మహనీయులకు ఆత్మశాంతి కలగాలని మనమంతా ఘనంగా నివాళు లను అర్పిస్తాము.
ఆలోచించండి – చెప్పండి: (Page No.92)
1.“కడుపు పంటల – కడుపు మంటల్” దీనిని గురించి మీకేమి అర్థమయింది ?
జవాబు.“కడుపు పంటలు” అంటే కన్నతల్లికి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వడం. కడుపులో పుట్టినందుకు మంచి ఆనందాన్ని కల్గించడం. ‘కడుపు మంటలు’ అంటే కడుపులో బాధ. అనగా పుత్రశోకంతో తల్లికి మాటలతో చెప్పనలవికాని దుఃఖం కలుగుతుంది. దీనినే కడుపు మంటలు అని అంటారు.
2.“పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు. సజ్జనులు పరిపాలకులు అయినప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వారు ప్రాంతీయ అసమానతలు చూపరు. కాని పాపాత్ములు పరిపాలించినట్లైతే విద్వేషాలు కలుగుతాయి. సామరస్య భావం లోపిస్తుంది. అరాచకం పెరుగుతుంది. అందుకే ఆంధ్రుల పాలనను పరోక్షంగా ‘పాపాత్ముల పాలన’ అని కవి చెప్పాడు.
ఇవి చేయండి :
I. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
1.తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణపై పెత్తనం చెలాయించాలని కొందరు ప్రయత్నించారు. ఉద్యమాల సందర్భంగా ఎందరో అమరులైనారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
నిజాం నవాబును వ్యతిరేకించింది తెలంగాణ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి దూరం అయింది. ఎన్నో అవమానాలను తెలంగాణ ప్రజలు అనుభవించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది యువకులు బలిదానం చేశారు.
ముఖ్యంగా గత పదమూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రోద్యమము మహోగ్రంగా సాగింది. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి విద్యావంతులు, గద్దర్ వంటి ప్రజాగాయకులు, చంద్రశేఖర్రావు వంటి ధీరనాయకులు ప్రముఖపాత్ర పోషించారు. చంద్రశేఖర్రావుగారు ప్రత్యేక పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఆయన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్ర ప్రభుత్వం కదిలింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు పోరాటం చేశారు. సకలజనుల సమ్మె తెలంగాణ పోరాటంలో ప్రముఖపాత్రగా చెప్పవచ్చు. ఈ ప్రయత్నాల మూలంగా 2.06.2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలంతా సహకరించాలి. అమరవీరుల త్యాగాలను మనం మరచిపోకుండా ఉండాలి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.
అ) సకలజనుల సమూహములు.
జవాబు. ఈ వాక్యం గేయంలో మొదటి భాగంలోని మూడవ చరణంలోని మూడవ పాదంలో ఉంది. తెలంగాణ రాష్ట్రసాధన కోసం అమరులైన వారికి సకలజనావళి నివాళులు అర్పించే సందర్భంలోనిది.
ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు. ఈ వాక్యం గేయంలోని రెండవ భాగంలోని రెండవ చరణంలో చివరి వాక్యంగా ఉంది. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎంతో మంది తమ రక్తాన్ని ధారపోశారు. వారి రక్తం పాపాత్ముల పరిపాలన పటాపంచలౌ పర్యంతం శాంతింపదని తెలియజేయు సందర్భంలోనిది.
ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు. ఈ వాక్యం గేయంలోని రెండవ భాగంలోని నాలుగవ చరణంలో చివరి వాక్యంగా ఉంది. అమరవీరులు పెట్టిన రక్తపుతిలకం అధికారమదాంధుల పాలిట యమపాశమని కవి హెచ్చరించుచున్న సందర్భంలోనిది.
ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.ఈ వాక్యం గేయంలోని మూడవ భాగంలోని మూడవ చరణంలోని చివరి వాక్యంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం నిలుస్తామని, అమృతవీరుల ఆత్మలలో అమృతవర్షం కురిపిస్తామని కవి తెలియజేయు సందర్భంలోనిది.
2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకలజనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో,బలిదానాలు చేయవద్దని చెప్పింది. ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.
ప్రశ్నలు :
అ) తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు. ఆంధ్రపాలకుల కబంధ హస్తాలనుండి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులను పెంపొందించుకోవడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది.
ఆ) ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు. విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకలజనులు పాల్గొన్నారు.
ఇ) ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని.
ఈ) ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.ఆబాలగోపాలం అంటే జనులు అందరు అని అర్థం.
ఉ) అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటానికి మనమంతా కృషిచేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా !” అని ఎందుకు సంబోధించాడు ?
జవాబు. తెలంగాణ ప్రజల్లో ఆవేశం, ఆక్రోశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ ప్రజలు అణచివేతలను, అవమానాలను సహించరు. అరాచక శక్తులపైన, అధికారమదాంధులపైన రుద్రులౌతారు. తెలంగాణ ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రాణాలను లెక్కచేయరు. అమరులై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. అందుకే కవి అమరులను ప్రశంసిస్తూ “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా !” అని చెప్పాడు.
ఆ) అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కవులు, కళాకారులు, ఉద్యోగులు, ప్రజలందరు సంఘటితంగా ముందుకు నడిచారు. ఉద్యమం శాంతియుతంగానే నడిచింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, రాష్ట్రం త్వరగా ఏర్పడాలనే కోరికతో ఎందరో అమరులు అయ్యారు. వారి త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.
అమరవీరుల కుటుంబాలను ప్రజలు ఆదుకోవాలి. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా అమరవీరుల కుటుంబాలకు ఇళ్ళు కట్టించాలి. వారి కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలి. ఈ రకంగా ప్రభుత్వము, ప్రజలు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. అప్పుడే మనం తగిన విధంగా వారిని గౌరవించినట్లు అవుతుంది.
ఇ) అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు. అధికారం అనేది ప్రజలకు సేవలందించేందుకు వినియోగించాలి. కాని కొందరు అధికారమదంతో ప్రవర్తిస్తారు. ప్రజలను హీనంగా చూస్తారు. మానవహక్కులను హరిస్తారు. ప్రాంతీయ అసమానతలను ప్రదర్శిస్తారు. విచక్షణను కోల్పోయి అహంకారంతో ప్రవర్తిస్తారు.
గ్రామీణ ప్రాంతాల వారిని హీనంగా చూస్తారు. సాధారణ ప్రజలకు విద్యావకాశాలను కల్పించరు. తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తారు. అవినీతిని ప్రోత్సహించి ప్రజాధనాన్ని కొల్లగొడతారు. అధికార మదాంధుల ప్రవర్తన సమాజానికి హాని కల్గిస్తుంది.
ఈ) కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎందరో యువకులు, సాధారణ ప్రజలు బలిదానం చేశారు. వారి త్యాగాలు మరువలేనివి. వారి త్యాగాల మూలంగానే రాష్ట్రం సాకారమైంది.
కవి ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలని స్మరించాడు. వారి త్యాగాల నుండి రాష్ట్ర ప్రజలు స్పూర్తిని పొందాలని ఆశించారు. వారి రక్తతర్పణం అధికారమదాంధులపాలిటి యమపాశం కావాలని ఆవేశంగా ప్రకటించారు. వారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ సాధిస్తామని, వారి ఆత్మలు శాంతించే విధంగా అమృత వర్షం కురిపిస్తామని ప్రతిజ్ఞ చేయడంవల్ల కవిలోని ఆవేశం తీవ్రస్థాయిలో ఉందని అర్థం చేసుకున్నాను.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు. భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం మహోన్నతమైందిగా పేర్కొనవచ్చు. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతో కాలం నుండి ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలచింది. తెలంగాణ రాష్ట్రసాధనలో అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణపై జరిగిన ఉద్యమాలు శాంతియుతంగా జరగడం దేశమంతటిని ఆకర్షించింది.
సాయుధ తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరులైనారు. అయినా అప్పటి కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని ప్రదర్శించింది. తన దమననీతిని ప్రదర్శించింది. తెలంగాణ ప్రాంతాన్ని అవమానించింది. మలిదశ ఉద్యమంలో ఎందరో పాల్గొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు, వ్యాపారులు ఒక్కతాటిపైకి వచ్చారు. సకలజనుల సమ్మెను సమర్థవంతంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందరో విద్యార్థులు ఉద్యమంలో భాగంగా అమరులైనారు.
శ్రీకాంతాచారి లాంటి వారి ఆత్మబలిదానం ఎందరికో స్ఫూర్తిని అందించింది. మరెందరో పోలీసుల తుపాకీగుండ్లకు బలై అమరులైనారు. వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సిద్ధించింది. అమరవీరుల త్యాగాలను మనం విస్మరింపకూడదు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారు కోరుకున్న బంగారు తెలంగాణను సాధించాలి. అంతవరకు ప్రజలు విశ్రమించకుండా కృషిచేయాలి.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత / గేయం రాయండి.
జవాబు.
కవితలు :
1. “మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”
2. “తెలంగాణ ప్రజలు సల్పు / తెలంగాణ ఉద్యమాన్ని
రౌడీ అలజడి అంటూ బాకాలూదెడి ఆంధ్రుల
దెంతపాటి సభ్యతంట | తెలంగాణ “యాస” నెపుడు
యీసడించు భాషీయుల / సుహృద్భావన ఎంతని”
గేయం :
జయహో అమరులారా !
జయజయ జయహో త్యాగనిరతులారా !
మరువదు మీ త్యాగం ఈ జగతి
చిరంజీవులుగా ఉన్నారండి గుండెల్లో.
త్యాగానికి మారుపేరుగా
పౌరుషానికి ప్రతీకలుగా
ఉరకలు వేశారు, పరుగులు తీశారు,
పరాయి పాలనకు చరమగీతం పలికారు. ||జయహో||
ఓ అన్నలారా ! ఓ అమ్మలారా !
మాన్యులారా ! మహనీయులారా !
తెలంగాణ వీర పురుషులారా !
ఆత్మగౌరవాన్ని నిలిపిన ధీరులారా ! ||జయహో||
అవమానాలు ! తిరస్కారాలు
ఛీత్కారాలు, దోపిడీలు
సాగవు ఇకపై ముందుకు
నవ తెలంగాణ సాధకులారా ||జయహో||
V. పదజాల వినియోగం:
1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.
అ) సమూహం = గుంపు, బృందం, సముదాయం
ఆ) అసువులు = ప్రాణాలు, ఉసురులు, ఊపిరులు
ఇ) స్వేచ్ఛ =స్వాతంత్య్రం, స్వతంత్రత
ఈ) సఖులు = స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు గల నానార్థాలు వేరు వేరు అర్థాలు) రాయండి.
అ) ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు. సంవత్సరం, వాన
ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు. పాలు, నీరు
3.కింది వృత్తంలోగల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి
జవాబు.
ప్రకృతి – వికృతి
1. భాగ్యం – బాగ్గెం
2. ఆకాశం – ఆకసం
3. శ్రీ – సిరి
4. ప్రతిజ్ఞ – ప్రతిన
VI. భాషను గురించి తెలుసుకుందాం:
సంధులు:
1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.
అ) ఉద్రేకాస్త్రం =ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘ సంధి
ఆ)మొట్టమొదలు=మొదట + మొదలు = ఆమ్రేడిత సంధి
ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం = సవర్ణదీర్ఘ సంధి
ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి
ఉపమాలంకారం :
కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి.
ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.
పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది కదా ! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :
ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒక విధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
“ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”
2. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.
అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. ‘గురితప్పకుండడం’ అనేది సమానధర్మం’.
ఆ) తోటలో పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
పిల్లల్ని సీతాకోకచిలుకలతో పోల్చారు. “అటూ ఇటూ తిరగడం” అనేది సమానధర్మం
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
1. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
I. ప్రాథమిక వివరాలు
ప్రాజెక్టు పేరు :
ప్రాజెక్టు సంఖ్య :
II. సమాచార సేకరణ విధం:
ఇంటర్వ్యూ ద్వారా /
అభ్యసనం ద్వారా / క్షేత్ర పర్యటన ద్వారా :
ప్రాజెక్టులో పాల్గొన్న వారి పేరు/ విద్యార్థి పేరు :
తరగతి :
క్రమసంఖ్య :
III. చదివిన అంశం / సంక్షిప్త వివరణ:
జవాబు.ఉద్యమాగ్ని చల్లారిన విశ్రమించలేదు.
వివక్షను నిలదీయుట విస్మరించలేదు
తోడు ఎవరు లేకున్నా తొవ్వ తీసినాడు.
ఆంధ్రవలస పాపాలను రాసిపెట్టినాడు
విద్రోహం మూలాలు విప్పి చెప్పె దీక్ష
విడువని జయశంకరెపుడు తెలంగాణ రక్ష ||తెలంగాణ చెరువుతీరు మన జయశంకరు సారూ॥
తెలంగాణ వాదాన్ని తీర్చి దిద్దినావు
మారుతున్న తరానికి మార్గం చూపావు
అరువదేండ్ల తెలంగాణ మనాదివే నీవు
మలిదశ పోరాటానికి పునాదివే నీవు
భావాలను వెదజల్లిన వెల్లువ వైనావు
తెలంగాణ పాటలకు పల్లవి వైనావు
ఒడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు ||తెలంగాణ చెరువుతీరు మన జయశంకరు సారూ||
వివరణ: జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ వాదాన్ని బలాన్ని ఎప్పుడు వినిపిస్తుండేవాడు. తెలంగాణలో మారుతున్న కాలాన్ని మార్గదర్శనం చేసినాడు. తోడు ఎవ్వరు లేకున్నా ఒంటరిగానైనా తెలంగాణ సిద్ధాంతాన్ని మోసుకెళ్లాడు. తెలంగాణ వాదాన్ని 60 ఏళ్లుగా కొనసాగించాడు. చెక్కుచెదరని చెరువు తీరు ధైర్యం ఇచ్చారు. జయశంకర్ సార్ మీరు చాలా గొప్పవారు.
నేర్చుకున్న అంశాలు: జయశంకర్ సార్ పాట నేర్చుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి కీలక భూమిక నేను తెలుసుకున్నాను. ఎవరైనా సరే ఒక అంశాన్ని చేపడితే సాధించే వరకు విశ్రమించకూడదని విషయాన్ని గ్రహించాను.
III. ప్రదర్శన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి