ధర్మార్జునులు
ధర్మరాజు మరియు అర్జునుడు. వీరిరువురు పాండవులు. ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. (పాండవాగ్రజుడు ధర్మరాజు). నడిపివాడు అర్జునుడు. (పాండవ మధ్యముండు అర్జునుడు). వీరిరువురి గుణగణాలను తెలియ జేయడం కోసమే ఈ పాఠం.
నేపథ్యం:
ప్రతి పద్య చమత్కారచణుడు చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసం అనే కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగాణాల గురించి తెలిపే సందర్భంలో అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహన శీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు అజ్ఞాపరిపాలనా వ్రతాన్ని గూర్చి ప్రభోదించడం ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ పరిచయం:
ధర్మార్జునులు ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. ప్రబంధం అనగా ఇతిహాస, పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధంలో వర్ణన ప్రధానం.
కవి పరిచయం:
కవి పేరు : చేమకూర వెంకటకవి
కాలం :17వ శ.
ఆస్థానం : ‘విజయభవన’ అనే కవి పండిత సభగల తంజావూరు రాజు అభినవ భోజడు అనే బిరుదు గల రఘునాథ నాయకుని ఆస్థాన కవి.
రచనలు : 1. సారంగధర చరిత్ర
2. విజయ విలాసం(రఘునాథ నాయకునికి అంకితం) . ధర్మరాజు తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మ నిరతి ఎటువంటిదో ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు.
శైలి: ప్రతిపద్య చమత్కృతి
ఉ. ఆపుర 'మేలు మేలు బళి!', యంచు ప్రజల్ జయ వెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుడు, శాంతి దయాభరణుండు; సత్యభా
షా పర తత్త్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన వి
ద్యా పరతంత్ర మానసడు ధర్మ తనూజుడుగ్రతేజుడై
సారాంశం:
ధర్మరాజు యమధర్మరాజు వరపుత్రుడు. తాను యిచ్చిన ఆజ్ఞలను తనుకూడా పాటించే స్వభావం గలవాడు. శాంతి, దయ, నిజం చెప్పడం, మంచి వారిని ఆదరించి పోషించడం, దానగుణం, నిశిత పరాక్రమం కలిగి విద్యపట్ల ఆసక్తి గలవాడు. ఇతరులెవరైనా ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి, ఎదురుగా లేనప్పుడు చాటుగా వారిని గూర్చి చేడుగా మాట్లాడడం చేసేవాడు కాదు. ఏదైనా సాయం కోరితే సంపూర్ణంగా సహాయం చేసేవాడు. ఒకరిపట్ల పరిచయమైన మొదట్లో ఎక్కువ మర్యాదగా వుండి తర్వాత్తర్వాత అమర్యాదగా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు.
దానగుణం, ధర్మ ప్రవర్తన కలిగి అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. ప్రజలు గొప్పగా సిరి సంపదలతో ఉంటె సంతోషపడేవాడు. కోపం కొంచెం కుడా లేని సత్య స్వరూపుడు మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. స్థిర స్వభావం గలవాడు.
ధర్మరాజు నలుగురు తమ్ములు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరిని ఐదుగురిని పాండవులు అంటారు. వీరు ఓటమినే ఎరుగని పరాక్రమం గలవారు. అయిదు దేవతా వృక్షాలో, విష్ణుమూర్తి ఐదు ఆయుధాలో ఈశ్వరుని ఐదు ముఖాలో అని పొగిడేంత గొప్ప గుణవంతులు పాండవులు. పాండవులంతా ఒకరి మనసెరిగి ఒకరు నడుచుకుంటూ, పనులలో భేదాలు లేక, పెద్దా చిన్న వ్యత్యాసాలెరిగి మాట మీరకుండా, స్నేహభావంతో భక్తి , ప్రేమ, సహనంతో ఏంతో నేర్పుగా ఉండేవారు.
అన్నల పట్ల, తమ్ముల పట్ల సమాన భావాలు గలిగి, ఎదురులేని పరాక్రమంగల వానిగా పేరొంది ధర్మ ప్రవర్తన గలిగినవాడు పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడు. దయాగుణంలో గరుడ ధ్వజుడైన కృష్ణునికి ప్రాణమిత్రుడు. యుద్ధవిజయాలలో శివునికి పోటీ పడే వీరుడు. ఈ భూమండలంలో అతనికి అతడే సాటియైన అర్జునుని పొగడడం అసాధ్యం.
అర్జునుడు తేరిపార చూస్తే చాలు, శత్రుసైన్యం పారిపోవడానికి సిద్ధమవుతుంది. విల్లుఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారి పడుతుంది. ఇక వేయి మాటలెందుకు? ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే కాని, ఈ లోకంలో మరొకడు లేదు.
కంఠస్థ పద్యాలు - భావాలు
*ఉ. ఆ పురమేలు ‘మేలు బళి!’, యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు; సత్య భా
షా పరతత్త్వకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుడై.
ప్రతి పదార్థములు:
ఆజ్ఞాపరిపాలనవ్రతుడు
ఆజ్ఞా = జారీ చేసిన ఆజ్ఞ ప్రకారం
పరిపాలన = లోబడి పరిపాలన గావించాలన్న
వ్రతుడు = దీక్ష వ్రతం కలవాడు
శాంతి దయాభరణుండు
శాంతి = శాంతము
దయ. = దయ అన్న మహా గుణాలు
ఆభరణుండు. = భూషణాలు లేదా ఆభరణాలుగా కలవాడు
సత్య భాషా పరతత్వ కోవిదుడు
సత్య భాషా = నిజం చెప్పడంలోని
పరతత్వ =అత్యున్నతమైన స్వరూపాన్ని
కోవిదుడు = బాగా తెలుసుకున్నవాడు
సాధు జనాదరణుండు
సాధుజన = సాధువులగు మంచి వారలను
ఆదరణుండు = ఆదరించి పోషించేవాడును
దాన విద్యాపరతంత్ర మానసుడు
దాన విద్యా = దానం చేయడం అనే విద్య అందు
పరతంత్ర = ఆసక్తిగల
మానసుడు = మనసు గలవాడైన
ధర్మ తనూజుడు =యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు
ఉదగ్రతేజుడై
ఉత్ + అగ్ర = మిక్కిలి తీక్షణమైన
తేజుడు + ఐ = పరాక్రమముగలవాడై
ప్రజల్ = ప్రజలు
మేలు బళి = మేలు బళి అని
అంచున్ = ప్రశంసిస్తూ
జయవెట్టుచుండన్
జయ = జయజయ ధ్వనులు
పెట్టుచుండన్ = పెడుతుండగా
ఆ పురము = ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని
ఏలున్ = పాలిస్తూ ఉండేవాడు
తాత్పర్యము: యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తానుకూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలు ధరించినవాడు. నిజం చెప్పడంలోని సారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడమనే విద్యపట్ల ఆసక్తిగల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా ‘మేలు, బళి!’ అంటూ జేజేలు పలుకుతున్నారు.
*ఉ. కోపమొకింతలేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా
రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంత్రుఁడు; నూతన ప్రియా
టోపములేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁ గా
ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందనున్?
ప్రతి పదార్థాలు:
కోపము = కోపం
ఒకింత = కొంచమైనా
లేదు = లేదు
బుధకోటికి = పండితుల సమూహానికి
కొంగుబసిండి
(కొంగు + పసిడి) = కొంగును మూట కట్టుకొని ఉన్న బంగారం వంటి వాడు; (ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఉపయోగించదగిన బంగారమే కొంగుబంగారం)
సత్యమా = సత్యమును చెప్పడం అంటే
రూపము = దాని సరూప స్వభావమే అతడు. అంటే సత్య గుణవంతుడు అన్నమాట
తారతమ్యములు = మనుషులలో ఉన్న హెచ్చుతక్కువలు (వ్యత్యాసంలు / తేడాలు)
ఎరుంగన్ = తెలుసుకోవడంలో
స్వతంత్రుడు = స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేవాడు (ఎవరో చెప్పిన మాటలు వినేవాడు కాదు మంచి చెడ్డలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అని అర్థం)
నూతన ప్రియాటోపము;
నూతన ప్రియ= కొత్త వారి యందు ప్రేమను చూపించే
ఆటోపము = గర్వము తొందరపాటు
లేని = లేనటువంటి
నిశ్చలడు = స్థిర స్వభావ స్వరూపం గలవాడు (కొత్తవారిని కొత్త విషయాన్ని వింతగాను పాతను రోతగాని చూడకుండా మంచిని స్వీకరించే వాడు)
ఇట్లు = ఈ విధంగా
కృత లక్షణుడై = ప్రసిద్ధమైన లక్షణాలు గలవాడై (కృతయుగంలో ఉండదగిన లక్షణాలు గలవాడై అని కూడా అర్థం చేసుకోవాలి)
చెలంగగాన్ = ప్రవర్తిస్తుండగా
అలధర్మ నందననున్ = యమధర్మరాజు కుమారుడైన ఆ ధర్మరాజును (ధర్మమును ఆచరించడానికి సంతోషం పొందే వాడిని)
ద్వాపర లక్షణుడు = సంయుక్తమైన లక్షణాలు కలవాడు కాదని (ద్వాపరయుగంలో ఉండదగ్గ లక్షణాలు కలవడం కూడా చెప్పుకోవాలి)
అనగన్ వచ్చునొకో = అని చెప్పవచ్చునా అనకూడదని భావం
తాత్పర్యము: కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం. సత్యస్వరూపుడు. మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. మంచిచెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. కొత్త విషయాలపట్ల ఆడంబరాలు లేని స్థిరస్వభావం గలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు (ద్వాపరయుగంవాడు అ నికూడా) అనిఅనవచ్చునా? (అనకూడదు.) కృతలక్షణుడు (కృతయుగలక్షణుడు) అని అనాలి.
*చ. అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్
బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్ము నం,
దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్.
ప్రతిపదార్థాలు:
అతని = ఆ అర్జునుని
నుతింపన్ = పోగడడానికి
శక్యమే = సాధ్యమవుతుందా (సాధ్యం కాదని భావము ఎందుచేతనంటే అతడు)
సోయగమ్మునన్ = అందంలో జయంతుని తమ్ముడు = సౌందర్యానికి ప్రసిద్ధి పొందిన (ఇంద్ర పుత్రుడగు జయంతుని వంటివాడు) కృపా రసమ్మునన్ = దయారసములో పతగ = పక్షి
కుల = జాతికి
అధిప = ప్రభువైన గరుత్మంతుని యొక్క
ధ్వజని = జెండగా గల గరుడ ధ్వజుడైన విష్ణుమూర్తికి లేదా కృష్ణుని పోలినవాడు)
ప్రాణసఖుండు = ప్రాణ స్నేహితుడు
సమిజ్జయంబునన్;
సమిత్ = యుద్ధములందలి
జయంబునన్ = విజయాలలో
క్షితిధర = పర్వత రాజు యొక్క
కన్యకా = కూతురైన పార్వతి యొక్క అధిపతి = భర్త అయినా ఈశ్వరుడికి ప్రతి జోదు = పోటీ ఎదిరించే వీరుడు లేనివాడు
చతురబ్ధి పరీతమహీతలమ్మునన్
చతుః + అబ్ధి = నాలుగు వైపులా
పరీత = వ్యాపించి ఉన్న సముద్రం
మహీ తలమ్మునన్ = భూ మండలం పైనా
అతనికిన్ = అతనికి (ఆ అర్జునునికి)
అతండె= అతడే
సాటి = సమానుడు
తాత్పర్యము: అందంలో జయంతుని (ఇంద్రుని కుమారుడు) వంటివాడు. దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన (విష్ణువుకు) కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వతరాజపుత్రిక పార్వతి భర్తయైన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు. నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి (మరింకెవ్వరూ సాటికాదు). అటువంటి అర్జునుడిని పొగడటం సాధ్యమా? (సాధ్యంకాదు అని భావం).
జయంతుడు= ఇంద్రుని పెద్దకొడుకు (జయంతుని తమ్ముడు మన్మథుడు. ఇతడు అతి సౌందర్యవంతుడు. అర్జునుడు ఇంద్రుని వరపుత్రుడు.)
పతగ కులాధిపధ్వజుడు;
పక్షి = పక్షి
కుల= సమూహానికి రాజైన గరుత్మంతుని(గ్రద్ధ) చిహ్నాన్ని జెండాగా గలవాడు. విష్ణువు.
క్షితిధర కన్యకాధిపతి= పర్వత రాజ పుత్రిక అయిన పార్వతి యొక్క భర్త. శివుడు.
పంచామర తరులు= ఐదు దేవతావృక్షాలు. (పారిజాతము, మందారము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము - ఇవిదేవవృక్షములు)
హరి పంచాయుధములు= శంఖము(పాంచజన్యము), చక్రము(సుదర్శనము), గద(కౌమోదకి), ఖడ్గము(నందకము), చాపము(శార్ఙ్గము).
గిరీశు పంచాస్యములు= శివుని అయిదు ముఖాలు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము.
II వ్యక్తీకరణ - సృజనాత్మకత:
కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో రాయండి.
అ)పాండవుల గురించి కవి ఏమని వర్ణించారు? ఎందుకు?
జ.: పాండవుల గుణగణాలు:
పాండవులు ఐదుగురు ధర్మరాజు పెద్దవాడు వీరంతా కలిసికట్టుగా ఉంటారు.
పాండవులు స్నేహభావము, సోదర భావము, భక్తి, ప్రేమ, ఓర్పు కనపడేటట్లు పెద్ద చిన్న అనే తేడాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు జవదాటకుండా మసులుకుంటారు.
ఒకరిని మరొకరు నొప్పించుకోరు. ప్రేమ కలిగి ఉంటారు.
సుఖసంతోషాల్లోనే కాదు కష్టసుఖాల్లోనూ పాలుపంచుకునే వ్యక్తిత్వం పాండవులది.
పాండవులు ఓటమిరగనివారు. సమస్యను అధిగమించడానికి అహర్నిశలు కష్టపడతారు.
శత్రువులను ఓడించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు.
లేదనకుండా యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
వీరు గొప్ప పరాక్రమంతులు.. అన్నదమ్ములంటే వారే అని లోకం ప్రశంసించే విధంగా అన్యోన్యంగా ఉంటారు.
జ. ధర్మార్జునులనే శీర్షిక తగినది.ధర్మరాజు అర్జునుల స్వరూప, స్వభావాలను దాన, వీర, బల, పరాక్రమాలను, గుణ, తత్వాదులను విషాదపరుచుచున్నందున ఈ శీర్షిక సముచితంగా ఉంది. ఈ పాఠం లో మొత్తం పది పద్యాలు ఉన్నాయి. నాలుగు పద్యాలు ధర్మరాజు సుగుణాలను. అతని పరిపాలన విధానాన్ని వర్ణించారు. 5 6 7 పద్యాలలో పాండవుల గుణగణాలను వివరించారు. 8 9 10 పద్యాలలో అర్జునుని సుగుణాలను, సొగసును, దయా హృదయాన్ని, అతడి యుద్ధ పరాక్రమ విజయాలను వర్ణించారు. ధర్మరాజు గురించి అర్జునుడు గురించి ఎక్కువ భాగం విశేషంగా వివరించడం వలన ధర్మార్జునులనే పేరు పెట్టడం తగిన విధంగా ఉన్నదని భావిస్తున్నాను.
జ. పాండవులు ఉదార స్వభావులు:
ఉదార స్వభావం అనగా దాతృత్వము దయా గొప్పతనము గాంభీర్యము నేర్పరితనము మొదలైన అర్థాలు ఉన్నాయి. ధర్మరాజుకు శాంతి, దయ ఆభరణాలుగా ఉన్నాయి.సాధు జనులను ఆదరిస్తాడు. దాన విద్యలో విశేష ఆసక్తిగలవాడు. యాచకులకు అడిగినదానికంటే అధికంగానే ఇచ్చేవాడని కవి తెలిపాడు. ప్రజలకు ఉన్న సిరిసంపదలను చూసి అసూయపడేవాడు కాదు. తను ఇచ్చిన ఆజ్ఞను తాను కూడా కట్టుబడి ఉండే విధంగా తన న్యాయ ప్రవర్తనను కాపాడుకుంటున్న వాడు. అన్యాయము కూటిలము కుట్రలు ఈర్ష అసూయలు వారిలో లేవు. పండితులకు ధర్మరాజు కొంగు బంగారం. ప్రతి అవసరాలతో తీర్చేవాడై ఉన్నాడుఈ అర్థాలు పాండవులలో అత్యధికంగా ఉండడం వలన ఉదార స్వభావులు అని పిలవచ్చు. పాండవులను దేవతా వృక్షాలుగాను, పంచ ఆయుధాలుగాను కవి పేర్కొన్నాడు. కల్పవృక్షం దేవతా వృక్షం ఎంతోమంది కోరిన కోరికలను తీర్చుతుంది వీరు అలాగే తీర్చుతున్నారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి.
III భాషాంశాలు: పదజాలం
సొంత వాక్యాలు
సోయగం = అందం
పూలసోయగం అందరిని ఆకర్షిస్తుంది.
ఏవురు = ఐదుగురు మంది
పాండవులు ఏవురు సోదరులు
వెగటు = అసహ్యం
అతి వినయం వెగటు కలిగిస్తుంది.
బుధుడు = పండితుడు
మా తెలుగు సార్ మహా బుధుడు
2. వ్యుత్పత్తి అర్థాలు
తనూజుడు - తన దేహము నుండి జనించినవాడు.
నృపాలుడు = నరులను పాలించువాడు
నందనుడు= (ఆనందం) సంతోషం కలిగించువాడు
3. పర్యాయపదాలు
అ) క్షితి: ధరణి, భూమి, వసుధ, నేల, పుడమి ధరకు
ఆ) కుమారుడు: తనుజుడు పుత్రుడు నందనుడు
మొగము : ఆననము, వదనము, వక్త్రము,
పురము : పట్టణము, నగరము, ప్రోలు
4. ప్రకృతి వికృతులు
అ)ధర్మము - దమ్మము
ఆ) ఉపాధ్యాయుడు -ఒజ్జ
ఇ) ఆజ్ఞ - ఆన
ఈ) భాష - బాస
5. నానార్ధాలు గుర్తించండి.
అ) రాజు, ప్రభువు, ఇంద్రుడు
ఆ)ప్రియం, హెచ్చు, ఇష్టం
ఇ)దిక్కు, దిశ, ఆశ్రయం
ఉ) చిత్తము, మనసు, ఇష్టం
వ్యాకరణాంశాలు
కర్మధారయ సమాసం :
కింది సమాస పదాలను విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అ)ఉదగ్రతేజం - ఉదగ్రమైన తేజం
ఆ) తోల్లిటి రాజులు - తొలివారలైన రాజులు
ఉదగ్ర, తొల్లిటి అనే పదాలు పూర్వపదాలుగా ఉన్నాయి. ఇవి విశేషణాలు. విశేషణం అనగా నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతుంది.
ఉత్తర పదాలను పరిశీలిస్తే వరుసగా తేజం రాజులని ఉన్నాయి. ఇవి నామవాచకాలు. అనగా విశేష్యాలు.
విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తించాలి.
అ) తమ్ము కుర్రలు - కుర్రలైన తమ్ములు
ఆ)కార్మిక వృద్ధులు - వృద్ధులైన కార్మికులు
విశేషణ ఉత్తర పదంగా ఉండే కర్మధారయమే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం.