సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

15, జూన్ 2026, సోమవారం

ధిక్కార స్వరమే జూపాక సుభద్ర గారి 'రిజర్వేషన్ భోగి' కథలు నవతెలంగాణ 15.06.2026

ధిక్కార స్వరమే జూపాక సుభద్ర గారి 'రిజర్వేషన్ భోగి' కథలు నవతెలంగాణ 15.06.2026

— డా. సిద్దెంకి యాదగిరి.


జై భీమ్ మిత్రులారా

వర్తమాన కాలంలో దళిత పరిమళాలు వెదజల్లుతున్న ప్రఖ్యాత రచయిత్రి కాలమిస్టు వక్త బహుముఖ ప్రజ్ఞాశాలి జూపాక సుభద్ర గారి 'రిజర్వేషన్ బోగీ' కథలపై నా విశ్లేషణ ఈరోజు అనగా తేదీ 15.6.2026 న నవ తెలంగాణ లో ప్రచురితమైంది.

ప్రచురించిన

నవ తెలంగాణ సంపాదకులు కట్కొజ్జుల ఆనంద చారి గారికి జై భీములు తెలియజేస్తూ

-----------------------------------------------------------

ధిక్కార స్వరమే జూపాక సుభద్ర గారి రిజర్వేషన్ భోగి కథలు

_____________________________________


అచ్చం మాదిగ బతుకుల్ని అచ్చరాల్తో అలికిపూసి పూదిచ్చి, సదువ సంబూరంగ మాయితనపు ఎతల్ని మీసాన్నత పరిమళంగా రాస్తున్న లంద పొద్దుపొడ జూపాక సుభద్ర. జాంబవంతుని సాహితీ వారసురాలు, కవయిత్రి, కాలమిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎట్టి బతుకుల ఎదల్ని తట్టి, మట్టి మనుషుల జీవితాలను అలుకల పోతలుగా మహాకావ్యాలుగా రాస్తున్న రచయిత్రి. 'రాయక్క మాన్యమ', 'రిజర్వేషన్ భోగి' (2021) కథా సంపుటాల్ని వెలువరించింది. ఇందులో పదిహేను కథలు. బతుకులు అనేకం. వాడకట్టు బతుకుల అవమానాలు, ఆక్రందనలు, అన్యాయాలపై తిరుగుబాట్లు కనబడుతాయి. ధిక్కార స్వరం భాస్వరంలా మండుతది.


 దళితుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అనుభవాలు. వివక్షలే విషవలయాలై వేధిస్తుంటాయి. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేసే మనుషుల మధ్య జీవితం కత్తిమీద సాములాంటిదే. నిజం చెప్పడానికి కూడా అగ్గిలా మండి నిగ్గదీసి అడిగే ధైర్యం ఉండాలి. తప్పుల్ని నిప్పులతో కడిగే నిబద్ధత కావాల్సిందే. అలాంటి ధైర్యంకల రచయిత్రికి ఎదురైన రైలు ప్రయాణపు అనుభవాన్ని చిత్రించిన కథ 'రిజర్వేషన్ భోగి'. రచయిత్రి భోగిలోకి వెళ్లి తన రిజర్వు సీటు కోసం వెతుకుతుంది. 'హలో ఇది రిజర్వేషన్ డబ్బా! తెలిసే ఎక్కినవా? జెండల్ డబ్బా గాదు. పో. పో.' అన్నడు. 'పెద్దమనిషోలే ఉన్నవ్, బుద్ధిలేదా? నువ్వు కూసున్న బెర్తు నాది. రిజర్వు చేస్కుంటేనే గదా ఇందులోకి వొచ్చింది.' అని ఇయ్యర మయ్యర ఉతికింది. సంజాయిషి ఇచ్చుకోబోయిండు. పరాయిదేశంలో నల్లోడని దించేయబడ్డ గాంధీ జాతివివక్షకు పెద్ద చరిత్ర. నాలాంటి నల్ల, బక్క మొకాలు రిజర్వేషన్ టిక్కెట్‌తో ఎక్కినా సొంత దేశమోల్లే జనరల్ భోగిలోకి తరిమే అవమానాలు కూడా 'వార్త' కాదెందుకో... అని నిద్దురలేని కళ్లతో స్టేషన్లో దిగింది రచయిత్రి. నల్లగున్న వారందరు దళితుల్లాగే కనబడుతరనీ, నల్లగున్నా కొంత చదువుకుని ఉద్యోగం చేసిన వాళ్లకే ఇంత అవమానాలు జరుగుతుంటే, ఎండలో ఎండి నల్లగయిన మనుషులను తెల్లవర్ణం మాటలతో హింసిస్తూనే ఉన్నారనడానికి ఈ కథే సాక్ష్యం.


 కాలగర్భంలో కలిసిన మట్టి తల్లుల మనుగడ ఆనవాళ్ల కోసం, కాగితాల్లో ఆ పేరును వెతుకులాడిన కూతురు ఆరాటం చిత్రించిన జూపాక సుభద్ర కథ 'ఆనవాళ్లు ఆగమైన అవ్వ'. పాస్‌పోర్టు తీయాలనుకున్న రచయిత్రి . తల్లిదండ్రుల వివరాలలో వారిని ధృవీకరించే పత్రాలు జతచేయాలి. ఎట్టి తల్లి చెమట చుక్కల పునాదుల మీద ఎదిగిన బిడ్డ, కనపడని తన అవ్వ పేరు కాగితం మీద వెతుకులాట సురువు చేసింది. ఇంట్లో చూసింది. పంచాయితీ ఆఫీసుకు పోయింది. రికార్డులు చూసింది. దొరకలేదు. 'మా అవ్వ చరిత లేకపోతే మాయే. అమె పేరు కూడా రికార్డుల్లో లేకపోవుడు జూసి పరేషానైంది.' పదహారేండ్లు ముందున్న ఓటరు లిస్టును వెతికింది. 'మబ్బును, మంచును దులుపుకునే సూర్యకాంతివోలే కనక వీరమ్మ అని కనబడ్డది. దుక్కం, సంబురం కలెబడి యెగదన్నినయి' అని రచయిత్రి చెప్పుకున్నది. ఆనవాళ్లు లేని జీవితాలు మట్టి తల్లులవే అని నిర్ధారించిందీ కథ.


 ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ వాటిని అధిగమించాలనే కోరిక బలమైతది. ఒకప్పటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితుల్లో జాతరలో జరిగిన మార్పుల్ని చిత్రించిన కథ 'తీర్థం బోతన్న తిమ్మక్క'. రచయిత్రి చదువుకునేటప్పుడు జాతరకు పోలేని పరిస్థితులు. ఇంటర్ పాసయినంక మొక్కుకోసం అవ్వయ్యలే తీసుకెళితే తీర్థం పోయింది. ఉన్నతోద్యోగిగా వెళ్లితే భౌగోళిక పరిస్థితులను చూసి మనసు భరించలేదు. నాడు హోటళ్లు, వైన్ షాప్‌లు లేవు. అడవి కాంక్రీట్‌గా మారింది. పోలీసోల్ల నిఘా తాకిడి పెరిగింది. తల్లుల చుట్టూ గద్దెలు మొలిచినయి. బారికేడులు పహారా కాస్తున్నయి. చెట్లు పోయినయి. సెల్ టవర్లొచ్చినయి. సౌలత్‌ల పేర ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. అర్చక వ్యవస్థను తీసుకొచ్చి అస్తిత్వాలకు గోరీ కడ్తున్న ప్రయత్నాలను ఆపాలని చూస్తుంటే తీవ్రంగా 'మా అడివిని బరిబాత జెయ్యొద్దు, కల్తి జెయ్యొద్దు సమ్మక్క సారక్కల్ని' అనే నినాదాలు చెవుల్లో మోగుతున్నయి. మారిన పరిస్థితుల్ని ఏకరువు పెట్టిందీ కథ.


 పనిమనిషికి కులం తెలియగానే చెప్పక చెయ్యక పనికి రాలేకపోయిన కథ 'కూటికి పేదనైనా...'. ఉపేంద్ర, శారదలకు పనికి కుదిరింది శారద. నాగాలు నాగాలు పెట్టినా జీతంలో కోతలేదు. మిగిలిన అన్నం కూర తీసుకపోయేది. ఒకనాడు ఉపేంద్ర అక్క హాస్పిటల్‌కి వచ్చింది. ఆ తరువాత నాలుగు రోజులుగా శారద రాలేదు. అక్కను అడిగితే కులం అడిగింది. చెప్పిన. 'బువ్వకూర' గిన్నె అన్నే పారేసి 'సీ. సీ... థూ... థూ..' అనుకుంట వెళ్లిపోయింది. పనిమనిషి చెప్పిన విషయాలు అక్క ద్వారా తెలుసుకున్నది. అప్పుడు అర్థమయ్యింది ఉపేంద్రకు. కూటికి పేదనైనా కులానికి తక్కువనా? అని ప్రశ్న వేసినట్లే అనిపించింది.


 రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల సర్పంచ్‌లయిన సాదకబాధకాలను రికార్డు చేయడానికి ఒక ఎన్జీవో సభ్యురాలు ప్రయత్నమే జూపాక సుభద్ర కథ 'రాణిర్కమ్'. అధికారం అనుభవిస్తున్న ఆధునిక అట్టడుగు బడుగు బలహీన వర్గాల స్త్రీల మనస్తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించాలనే ఉద్దేశంతో రచయిత్రితో ఎన్జీవో అమృత ఇంటర్వ్యూ చేయడానికి ఊరికి చేరుకుంది. సర్పంచి ఇంట్లో లేదు. పనికి పోయిందని తెలిసింది. రచయిత్రి పెద్దమ్మ ఊళ్లోకి వెళితే కలువడానికి వెళ్లారిద్దరు. 'ఏడికొచ్చిండు' అని ఒక పెద్దాయన. 'గదే మాదిగిర్కెమ్ ఉపసర్పంచిగున్న మన పటేలు చందారెడ్డి లెక్కలు బొక్కలు జూత్తడాయే' అని ఒకరు. 'నీ తల్లి... గీల్లను సర్పంచులను జేత్తే సర్పంచిగిరిని విజ్జద్దీస్తుండు' అని మరొకరన్నరు. సర్పంచి వచ్చింది. బాగోగులు అడిగింది. 'గట్లనే మనల హేళన చేస్తరు. పని లేనప్పుడే ఆ కూలి, ఈ కూలి జేస్త. ఎట్ల బత్కాలె. యెన్కముందటేమి లేనోల్లమైతిమి' అని చెప్పిన ఆత్మవిశ్వాసానికి, చైతన్యానికి ఆశ్చర్యపోయింది. ఇంటర్వ్యూ చేస్తూ 'రాజిర్కమ్ కాదు. రాణిర్కమ్' అని అమృత అంటూ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ కథ నేటి రాజకీయాలను అద్భుతంగా చిత్రిస్తుంది. ముందు ముచ్చట పెట్టి వెనుక వెక్కిరిస్తారు. ఛీత్కరిస్తరు. అంటరాని కులమైనా సరే అవసరాన్ని బట్టి అనుకూలంగా మార్చుకుంటరు.


 సర్పంచ్ అయినంక వలపోస్తున్న అప్పుల బతుకును చిత్రించిన జూపాక సుభద్ర కథ 'ఓ సర్పంచి వల(స)పోత'. 'సర్పంచ్ అయినంక అప్పులోల్లు సీర్కతినిరి. భూమి బాయె. పంటలు బాయె. కూలీలు దొరుకుతలేవు. ఇంటిల్లాదులమంతా సిటీకొచ్చినం బిడ్డా!' అని చెప్పుతున్న సొదంత వింటుంటే సర్పంచిగా నిలబెట్టి భూమి బోగొట్టి పట్నంలకు బికారిగా తరిమిన పటేలు మీద కోపమొచ్చింది. దళితులను ఆర్థికంగా దెబ్బకొట్టి ఊళ్లోంచి వెళ్లగొట్టే పరిస్థితులను కనబడని వ్యవస్థ ఎప్పుడూ పనిచేసూనే ఉంటదని చెబుతుంది.


 కులం అవమానిస్తుంది. ఆగ్రహిస్తుంది. శిక్షిస్తుంది. వివక్ష ఊరుదాటి అడవికి పాకింది. కులం తెలిశాక గిరిపుత్రులు ఎలా అవమానించారో తెలిపిన కథ 'అడవిని విడువని అంటు'. అడవిలోకి వచ్చిన దోస్తుకు స్టీలు ప్లేట్‌లో అంబలి ఇస్తది. తాగుతున్నప్పుడు ఊరుపేరు, తండ్రి పేరడుగుతది. సంటి నర్సయ్య బిడ్డను అని చెప్పుతది. 'ఏంది సంటి నర్సని బిడ్డవా? సీ.. మాదిగొల్లా... స్టీలు పల్లాల పోసి తాగుమని ఇత్తావే బోసిడి' అని సదక్క తల్లి తిడ్తది. కొడుతది. 'వావ్వొ సత్తినే' మొత్తుకుంటు ఉరికింది సదక్క. అడివిలో అంటరాని తనం వెంటాడింది. వేధించింది.


 మైక్రో ఫైనాన్స్‌లు బీదలను అవసరానికి ఆదుకుంటున్నామనే భ్రమలో సర్వనాశనం చేస్తాయనే విషాదాన్ని జూపాక సుభద్ర కథ 'మైక్రో సిటీలల్ల మన్నువడ' వివరిస్తది. ఇది ప్రపంచీకరణ ముసుగులో పెట్టుబడిదారుల వ్యాపారమే మైక్రో ఫైనాన్స్. వరంగల్, మెదక్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ దురాగతాలకు ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. అలాంటి బాధిత కుటుంబాలలో మిర్చీ మిల్లులో దినసరి కూలీలుగా బతుకుతున్న లచ్చక్కల బతుకులు.


 ఎవల తిండి వాల్లు తినాలె. పక్కోల తిండిని ఓర్వాలె అని చెప్పిన గౌరవం. పిల్లలు తినాలని బడిలోకి నీసుకూర పంపిన తల్లి లక్ష్యమే మంచి ఆరోగ్యమని తెలిపే కథ 'నీసు నియ్యతి'. పెద్దకూర తినొద్దనీ పిలగాల్లను కొడుతుండని బాధపడుతది. 'మనలాంటి తల్లిదండుల్ని తీసుకపోయి తినవెడుదాం పా' అని తీర్మానించుకోవడం ఆహారపు అలవాట్ల మీద గిరిగీతలొద్దు అనే సంకేతం. ఈ కథ మార్పుకు సూచనగా నిలబడుతుంది.


 మన గూడేలు తినే తిండిని ప్రపంచమంత తింటుంది. మనం తింటే వాళ్లకెందుకు బాధ? బీఫ్ తినెటోల్లే ఇంటెలెక్చువల్స్ అయిండని చర్చకు పెట్టిన కథ 'బీఫ్ బిందాస్'. ఆహార అలవాట్లను ప్రకటిస్తూ యూనివర్సిటీలలో బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారనీ మాట్లాడుకుంటారు. బీఫ్ తింటే చంపే ఫాసిజం దేశంలోనే ఉందనీ, 'అమ్మా! కడుపునిండ, కరువుతీర తినాలె' అని బ్యాగు తీసుకొని బయల్దేరింది అని చెబుతున్న తల్లి.


 కాయిసు పడిన కూరను తిననియ్యని కానూను వొచ్చిందనీ తెలిపే కథ 'ముద్దకూర'. బిడ్డకు ప్రాణప్రదమై పెద్దకూరను పట్నం తెస్తున్ననని చెప్పుతూ 'పెద్దకూర దినే బత్కినం. తినొద్దంటే ఏందిని బత్కాలే. తిన్నోల్లను, కోసినోల్లను కొట్టి సంపుతుండట. గాడేన్నో నడ్సినట్లు మనకాడ నడుత్తదా! మనోల్లూ కుంటరా! యిది మన తిండిరా! కోసుడు కోసుడే, తినుడు తినుడే... రేపో మాపో కూర గూడ పంపిత్త బిడ్డా..' అని ఫోన్ పెట్టిండు నాయిన. చివరి మూడు కథలు ఆహారపు అలవాట్ల మీద పెత్తనమేమిటని బలహీనుల గొంతుకలయి ప్రశ్నిస్తున్నయి. తిని బత్కిన కూరను తినకుండ చేసుడేందని తిరుగుబాటు ప్రకటిస్తున్నాయి.


 గిరిగీసుకునే చదివే కథలు కావివి. చదువుతుంటే కాసింత మార్పును తెస్తాయి. ఇప్పుడు వీస్తున్న వివక్షల్ని విలపిస్తది. బాధల్ని తలపోస్తది. తిరుగుబాటైతది. చెమ్మనింపి మనిషిని మనీషిగ చేస్తయి జూపాక సుభద్ర కథలు. మాదిగ మనసును అక్షరాల్లో ఆవిష్కరించే సజీవ సాక్ష్యాలు. అనుభవాల వర్ణనలు కావు. నిజాలు. ప్రతిఘటన. 'రిజర్వేషన్ భోగి' కథలు జిద్దును, చెమ్మను, ఆత్మగౌరవ మార్పుపట్ల ఆకాంక్షను ప్రతిబింబిస్తాయి. ఆహారం, అస్తిత్వం, అధికారం, ఆత్మవిశ్వాసం వంటి విభిన్న కోణాల్లో చూపిన జీవన చిత్రణ పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. అనుభవాల నిజాయితీ, భాషలోని సహజత్వం ఈ కథలకు ప్రత్యేకత. ఈ కథలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలు.


- డా. సిద్దెంకి యాదగిరి 


రిజర్వేషన్ భోగి కథలు నవతెలంగాణ 15.06.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి