"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"
వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషను కాదని ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని తెలుగు స్థానంలో ప్రవేశపెట్టడం వల్ల తెలుగు భాష క్రమక్రమంగా మానవ మస్తిష్కాల్లోంచి కనుమరుగు కాక తప్పని పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలుగు భాష కుంటుపడే పరిస్థితి దాపురించింది.
ఒక గీతను మలపకుండా చిన్నగా చేయాలంటే దాని పక్కన పొడుగు గీత గీస్తే సరి. అది యాంత్రికంగా, సాంకేతికంగా, దృశ్యమానంగా చిన్నగా మారిపోతుంది.
అట్లాగే
ప్రభుత్వం తప్పనిసరి చేయని మాధ్యమం విషయములో జరిగిన జరుగుతున్న ఒక సంఘటనను మనం ఉదహరించుకుందాం.
పాఠశాల స్థాయిలో ప్రభుత్వం తెలుగుతోపాటు ఆంగ్ల మాధ్యమమును ప్రవేశపెట్టింది. ఫలితంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 99% పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యార్థులు చదువుతున్నారు. తత్ఫలితంగా తెలుగు మాధ్యమాన్ని ఏర్పడకుండా ఎత్తివేసారు.
2025-2026 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాష తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకోవడం తెలుగు భాషాభిమానుల గుండెల్లో విధ్వంసం సృష్టించింది. సంస్కృత భాష ప్రవేశ పెట్టడం వల్ల తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర కనుమరుగు కావడం తథ్యం. ఇప్పటికే కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు సంస్కృతం కాదనీ తెలుగు భాష ఐచ్ఛికంగా ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృత భాష ప్రవేశపెడితే తెలుగు పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా పోదు.
తెలుగు కంటే నిజానికి సంస్కృత భాష చాలా సంక్లిష్టమైన భాష. అలాంటిది సంస్కృతంలోని ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మించడం కార్పోరేటు మాయాజాలంలోని ఒక వ్యూహం.
ప్రైవేట్ విద్యాసంస్థలకు తలొగ్గిన ప్రభుత్వం ప్రజా విధానానికి, తెలుగు మాతృభాషకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవడం బాధకరం.
తెలంగాణ రాష్ట్రం జాతీయ విద్యా విధానం -2020 (NEP-2020) 2025-2026 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఆ స్కీములో జాయిన్ అయింది. తత్ఫలితంగా అపార్ (Automatic Permanent Academic Account Registry) కార్డుల కోసం విద్యార్థుల వివరాలను నిక్షిప్తం చేస్తూనే ఉంది.
NEP- 2020 ప్రకారం ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యమిస్తున్నా తెలంగాణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం తెలుగు భాషను అవమానించడం కాకపోతే మరేమిటి ?
గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న జాతీయ సాధన సర్వే (NAS National Assessment Survey) తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. NAS Report-2021 ప్రకారం తెలుగు భాషలో మహ3వ తరగతి భాషా సామర్ధ్యాలలో జాతీయ సగటు 62%, తెలంగాణ 48%గా నమోదయింది. 5వ తరగతి భాషా సామర్ధ్యాలలో జాతీయ సగటు 55%, తెలంగాణ 43%గా నమోదయింది. 8వ తరగతిలో 53% జాతీయ సగటు 48% తెలంగాణ సగటుగా ఉంది. దాదాపు 65 శాతం మంది విద్యార్థులు తెలుగులో ఒక వాక్యం తప్పుల్లేకుండా రాయలేని దుస్థితి నెలకొని ఉంది. అక్షరమాల, గుణింతాలు, ఒత్తులు రాయలేని వారే మూడో తరగతి వరకు ఉన్నారు. 8వ తరగతి వరకు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని బాగు చేయాల్సింది పోయి సంస్కృతాన్ని బలవంతంగా రుద్దడం ఒక తొందరపాటు చర్య కాకపోతే మరేమిటి? తెలుగులో పాఠశాల స్థాయిలో కవితలు, పాటలు, కథలు రాసే విద్యార్థులు ఉన్న తెలుగును కాదని సంస్కృత భాషను రుద్దడం గర్హనీయం.
సంస్కృతం నేర్చుకోవడానికి ఉదాహరించడానికి తప్ప ఉపయోగపడని, సంభాషణకు అననుకూలమైన సంస్కృతం ప్రవేశపెట్టడం అంటే విద్యార్థులను రెంటికీ చెడ్డ రేవడులుగా మార్చడమే కదా!
మార్కుల కోసమే ఎంచుకున్న సంస్కృతంలో 95% మార్కులు సాధించాక కూడా, మాట్లాడలేని, తమ అభిప్రాయాలను రాయలేని విద్యార్థులు చాలామంది ఎదురవుతారు. ఇలాంటి స్పష్టత లేని ఉదాహరణలు చాలా తారసపడతాయి.
మరి సంస్కృత భాషలో అంత స్కోరింగ్ ఎలా అవుతుందంటే దేవ నాగరిల్లిపులో కాకుండా తెలుగు, హిందీ ,ఇంగ్లీష్ ఏ భాషలోనైనా రాయవచ్చు. పరీక్షలో భట్టిపట్టే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు.
ఆ ప్రశ్నలలో తార్కిక ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టి, విభేదించటము, కారణాలు రాయడం, సృజనాత్మక అంశాలు కాకుండా ఎక్కువగా బట్టి జవాబులు అడుగుతారు. అవి రాయడం వల్ల అత్యధిక మార్కులు స్కోర్ అవుతాయి. ఇక కార్పొరేట్ కళాశాలలు సంస్కృత భాషకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం సంస్కృతాన్ని ఉద్ధరించడానికి కాదు. వారి స్వలాభం కోసమే. మిగతా సబ్జెక్టు లాగా కాకుండా, సంస్కృత అధ్యాపకుని లేదా ఉపన్యాసకుని సంవత్సరం అంతా విధుల నిర్వహణకు తీసుకోరు. చివరి మాసంలో నియమించుకొని ఒక నెల జీతంతో సంవత్సర కాలం చెప్పాల్సిన సిలబస్ అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నెలలో చెప్పించి వదిలేస్తారు. పదాలకు వాక్యాలకు అర్థం రాకున్నా విద్యార్థులు బట్టి పట్టి జవాబు రాస్తారు. మంచి మార్కులు వస్తాయి.
ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగును తొలగించి సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం సరికాదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉన్నత పాఠశాల స్థాయి వరకు తెలుగు తప్పనిసరి చేశారు దానిని కొనసాగించాలి.
సంస్కృతం ప్రవేశపెట్టడానికి కారణం "మాకు భాషా స్వాతంత్రం కావాలి మాపై తెలుగుని రుద్ద వద్దు"అని కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులతో కార్పొరేట్ కళాశాలలు రెచ్చగొట్టించి అల్లర్లు చేయిస్తున్నాయి. ఇది ప్రాంతీయతకు గొడ్డలు పెట్టు. అలాంటి వారిని సంస్కృత పాఠశాలలో వేద పాఠశాలలో చేర్చి సంస్కృతాన్ని దేవ నాగరీ లిపిలోనే అభ్యసింపజేయడం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల్లో ఒకటి. అంతేకానీ తెలుగు భాషను బలి తీసుకోవద్దని ఒర్రంగ గొంతుకోయవద్దని భాషాభిమానులు నిరసిస్తున్నారు.
సంస్కృత భాషాభిమానులు అదే ఆ నిరసనకారులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి "తమిళం మా మీద రుద్ద వద్దు" అని నిరసించగలరా? ఒకవేళ నిరసించి ఉండగలరా? తమిళనాడులోని పరిస్థితి ఒరిస్సాలో కర్ణాటకలో కూడా అదే పునరావృతం అవుతుంది. అంతెందుకు మొన్నటికి మొన్న ఏప్రిల్ ఏడో తారీఖు నాడు మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో ఉన్న ధోమ్ భీవ్లి ఊరిలో రాత్రిపూట పూనం గుప్త ఆమె స్నేహితురాలు జ్యోతి చౌహన్ ఆమె చేతిలో 9 నెలల బిడ్డ స్కూటీ మీద వెళుతున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిలో కొందరు కూర్చుని ఉండగా బండి నడుపుతున్న పూనం వారిని చూసి excuse me అంది. గొడవ బగ్గున రాజుకుంది. "మరాఠీ మాట్లాడతావా? మా చేతుల్లో చస్తావా? దాడి చేశారు. గొడవ ఆపడానికి వచ్చిన పూనం భర్తను కొట్టారు. (సోర్స్: Sai Vamshi Facebook wall నుంచి) అట్లాంటి సంఘటనే మహారాష్ట్రలో నవనిర్మాణ సేన మరాటి మాట్లాడని ఒక సెక్యూరిటీ మీద విరుచుకుపడ్డ సంఘటన ఏప్రిల్ మాసంలోనే జరిగింది.
మహారాష్ట్రలో జరిగినట్లు
కొద్దిమంది సంస్కృత భాష వద్దన్నందుకు 4 కోట్ల తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతంలోని తెలుగు ప్రజలు విద్వేషంతో రగిలిపోతే ఆ పరిస్థితుల్లో ఆపగలిగే వారు ఎవరైనా ఉంటారా?
తెలంగాణ నేల మీద ఘనత వహించిన మహారాజులు, చాళుక్య ప్రభువులు ఉర్దూ నవాబులు తెలుగు సాహిత్య సేవ చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ. ఢిల్లీ గద్దె పెకిలించిన చరిత్ర తెలంగాణకు ఉంది. నియంతృత్వాన్ని నిర్మూలించిన ఘనత తెలంగాణ భాషకు ఉంది.
అనాలోచిత నిర్ణయాలు పక్కన పెట్టండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉత్తరాది వారి కోసం తెలుగు భాషను ఉత్త భాష చేయకండి. ప్రపంచ భాషలలో 16వ స్థానం ఉన్న తెలుగు భాషను అధో పాతాల్లోనికి తొక్కకుండా ఉన్నత స్థితిని కలిగించండి.
తెలుగు భాషను తప్పనిసరి చేయండి.
-డా. సిద్దెంకి యాదగిరి