సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

మండల స్వామి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మండల స్వామి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2024, ఆదివారం

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన 
మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై 

డా. మండల స్వామి 
రాసిన సమీక్షా వ్యాసాన్ని 
ఈ రోజు తేది: 19-05-2024 సృజన క్రాంతి దిన పత్రికలో ప్రచురించిన గౌరవ సంపాదకులు కె. విల్సన్ రావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐🌹🌹🌹🙏🙏🤝🤝


*వెతలకు వెలుతురు చూపిన “మూడు గుడిసెల పల్లె” కథలు*

     ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన కథల పుస్తకం మూడు గుడిసెల పల్లె. ఇందులో పదిహేను కథలున్నవి. ఊరితో విడదీయలేని అనుబంధం, కరోనా తెచ్చిన అవస్థలు, స్ఫూర్తివంతమైన అంబేద్కర్ జీవితం, ఆదర్శ ఉపాధ్యాయుడి జీవితం, సామాజిక, రాజకీయ చైతన్యం, దళిత స్పృహతో అస్తిత్వ చైతన్యంతో రాసిన కథలున్నవి. ఈ కథలన్నీ సిద్దిపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాట్లాడే భాషని, వారి జీవన విధానాన్ని, పేద ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో రాసిన కథలుగా దర్శనమిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, బాధలు, అవమానాలు, కలలు, ఆశయాలు, ఆకాంక్షలు చూపిస్తూ, సామాజిక స్పృహతో, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సంఘర్షణలతో తనదైన కోణంలో రచయితగా విభిన్నస్వరంతో వినిపించిన కథలివి.

     ఈ కథల ద్వారా ఎక్కువగా దళిత స్పృహ, దళిత చైతన్యం, సామాజిక చైతన్యం వైపు బాగా ఆలోచింప చేస్తాడు. అట్లా రాసిన కథల్లో ఒకటి 'అంటరాని బతుకమ్మ.' తెలంగాణ జన జీవన సంస్కృతిలో బతుకమ్మ పండుగ సందర్భంగా కింది కులాల వారికి ఎదురవుతున్న అవమానాల నుంచి ఆత్మగౌరవ వైపు నడిపించే కథ ఇది. దొరల, పటేల్ల, భూస్వాముల ఇండ్లల్లో కింది కులాలవారు పూలు సేకరిస్తారు. అనాదిగా పూలను సేకరించే దగ్గర కష్టపడినప్పటికీ ఆ పూలతోనే అల్లిన బతుకమ్మ ఆట దగ్గర మాత్రం తగిన చోటు సంపాదించుకోలేని తనాన్ని నిరసించి, కొత్త ఆలోచనల వైపు మళ్ళిస్తుందీ కథ. ఊర్లోని జంగమయ్య మర్రి కాడ అంబేద్కర్ దేవుడిని నిలుపుకొని అంబేద్కర్ చౌరస్తాగా మార్చినం. ఈ బతుకమ్మ ఆట దళితులు ఆడడమేందని కమ్యూనిటీ హాల్ దగ్గర కుల పెద్దలు వ్యతిరేకించినప్పటికీ మారుతున్న కాలం, నవ యువ విద్యావంతుల కొత్త ఆలోచనలు చూసి అర్థం చేసుకొని, అంబేద్కర్ విధానాల స్ఫూర్తితో వాళ్లు కూడా ఒప్పుకుంటారు. గంగ నీళ్లు తెచ్చి గౌరమ్మ చెయ్యాలె. పోచమ్మకాడ బతుకమ్మ ఎయ్యాలె. దాని ప్రకారమే చేద్దామని నిర్ణయించుకుంటారు. పంతులు సూచన మేరకు గ్రామ యువకులు రాజు, మహేష్ ఇద్దరూ టూవీలర్ మీద వంద కిలోమీటర్ల దూరం ఉన్న ధర్మపురికి వెళతారు. ఆ గోదారి నీళ్లలో దిగుతుంటే మహనీయుడు అంబేద్కర్ మహద్ చెరువులోకి దిగిన ఉద్యమ అనుభూతి వారికి కలుగుతుంది. వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకుని తన్మయత్వంతో జై భీం, జై భీం అంటారు. ఆ తర్వాత తడిబట్టలతో గుడిలోకి పోయి దండం పెట్టుకొని, గోదారి నీళ్లు క్యాన్ లో నింపుకొని వస్తారు. గ్రామంలో జరిగిన చిన్న సంఘటనల వలన దళితులు కొందరిలో అనుమానాలు సందేహాలు వస్తాయి. అయినా అన్నింటినీ పక్కకు పెట్టి చివరికి దళిత కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి కమ్యూనిటీ హాల్ వద్ద ఆత్మగౌరవ గాలులు పీలుస్తూ, బతుకమ్మ ఆటను ఆడుకోవడం జరుగుతుంది. ఈ కథలో అంటరాని బతుకమ్మగా ముద్ర పడి, బతుకమ్మ ఆటకు దూరంగా ఉన్న దళితులకు మనో ధైర్యం పెంచిన కథ ఇది. అనివార్యంగా అంబేద్కర్ ఆలోచనా తత్వాన్ని దళితుల్లో ఎట్లా పెంచాలో చూపిస్తూ కథకుడు విజయవంతంగా కథను మలిచారు.

      స్వంత ఊరితో విడదీయలేని అనుబంధాన్ని ఎంతో ఆర్ధ్రతతో చెప్పిన కథ 'ఆఖరి కోరిక.' ఈ కథలో ఊరు ప్రాజెక్టులో మునుగుతుందని తెలిసి ఆరవ తరగతి విద్యార్థిని నవీన స్కూల్ మానేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న వెంకటయ్య సార్ ఆలోచించి మరో విద్యార్థి నితిన్ ని వెంట బెట్టుకొని నవీన కోసం ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు. ఊరిలో బద్ధి పోషవ్వ అనే ముసలవ్వ వెంకటయ్య సార్ కి ఒడవని ముచ్చటోలే చెప్పుకున్న తీరని ఆవేదనే ఈ కథ. తక్కువ పాత్రలతో హృదయవిదారకంగా సాగుతూ కంటతడి పెట్టిస్తుంది. ఊరంటే గుంపు అనీ, సబ్బండ కులాల సమూహమనీ, పోషవ్వ స్పృహ కల్పిస్తుంది. మాదిగోళ్లు లేకుంటే పీనుగ లేవదీ, పీరి లేవది. ఈ ఊరిలోనే అన్ని కులాల వారు, అన్ని మతాలవారు అన్నదమ్ములోలె కలిసి బతికినమనీ, పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా అందరమూ కలిసిమెలిసి బతికినమనీ తన తొంబై ఏళ్ల జ్ఞాపకాలకు కన్నీళ్లను కలగలిపి మనలనూ కంట తడిపిస్తుంది. అనుబంధాల అల్లికకు ప్రతీకగా నిలిచిన ఊరు ఈరోజు మాయమైతుందంటే తట్టుకోలేక పోతుంది. చివరికి పోషవ్వ చనిపోయినా తన ఆఖరి చూపుకు ఎవరు వచ్చి తన పిల్లలకు ధైర్యం చెప్తారనీ, ఊరుతో తనకున్న సంబంధం మాయం చేస్తుందనే బాధనంతా చెప్పుకుంటది. తాను ఎక్కడ చచ్చినా కూడా ఇక్కడనే (ఆ ఊరిలోనే) పాతి పెట్టమని అంటుంది. అది తప్పు కాదని అంటుంది. ఆ అమాయకపు మాటలకి కన్నీళ్ల పర్యంతమైతాడు వెంకటయ్య సార్. నువ్వు నా తల్లి లాంటి దానివని నీకు ఏమి జవాబు చెప్పలేనమ్మా అని విద్యార్థిని నవీనను బడికి రోజూ పంపమని చెప్పి వెళ్ళిపోతాడు.

     'లందస్నానం' అనే కథలో అనేక మలుపులు ఉన్నాయి. ఉత్కంఠ ఉన్నది. ఈ కథలో కమలయ్య తన గ్రామంలో, తన మాదిగ కులంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, తన వల్ల జరిగిన దోషానికి బాధపడుతున్నానంటూ, మనమందరం విడిపోకుండా అన్నదమ్ముల వలె కలిసి ఉందామని, తన కులస్తులందరికీ వేడుకుంటాడు. ఇట్లా చెప్పడంతో తన కులస్తులందరిలో ఆకాశమంత సంబరం కనబడుతది." ఆ వాతావరణాన్ని చూపిస్తూ అందరి మనుసులు లందస్నానం చేసిన తోలులా శుద్ధీకరించబడి స్వచ్ఛంగా నిగనిగలాడుతున్నయి. మా ఊరి వాగు పెద్దగుండు మీది నుంచి పారినట్లు వచ్చిన శబ్దంలా చప్పట్లు, కేకలు కరతాళ ధ్వనులు. ఆనందానికి హద్దుల్లేని సంతోషాలు. వంద డప్పులు ఒక్కసారి గంతేసి కొట్టినట్లు వేడుక. ఇదే అసలైన దసరా. ఇదే అసలైన బతుకమ్మ. అలాయి బలాయిలు. ఆలింగనాలు. కరచాలనాలు. తీరొక్క రంగులు పూచిన పూలతోటలా కమ్యూనిటీ హాల్లో పేర్చిన బతుకమ్మలా మనసులు కొత్త శోభను సంతరించుకున్నాయి." ఈ ముగింపు కథకుడి సమర్థతకు, స్పష్టతకు నిలువెత్తు నిదర్శనం.

     గ్రామ రాజకీయాలలో దళితుల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూపించే కథ ' 'మూడు గుడిసెల పల్లె' ఈ కథలో ఆ గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలనే రాజకీయ కుట్రతో తెలివైన, దళిత మహిళ సరితను సర్పంచ్ పదవికి ఎన్నిక కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్ చేసిన మోసం, ఆడిన నాటకం కథలో చూస్తాము. పటేల్ కి భజన చేసిన వ్యక్తులే ఆ పదవికి ఎన్నికవుతారు. ఆ పదవినే పటేళ్లు తమ పదవిగా మార్చుకొని అధికారాన్ని చలాయిస్తుంటారు. సామాజిక చైతన్యం, దళిత చైతన్యం మెండుగా ఉన్న దళితులను రాజకీయ పదవులను అనుభవించకుండా అడ్డుకునే పటేళ్ల పితలాటకాన్ని బయటపెట్టిన కథ ఇది.

     చదువు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేది అసలైన విద్య అని, జీవితంలో ఎదురయ్యే అనేక కష్టనష్టాలను చదువుతోనే జయించవచ్చని నిరూపించే చక్కని కథ 'గెలుపు గీతం'.ఈ కథలో చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఓదయ్య సార్ ఉపాసముండి, కన్నీళ్లు మింగి, అనేక కష్టాలెదుర్కొని, కన్న కలలు తీర్చుకుని ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడని, కష్టాల కొలిమిలో కాలినోల్లే సొక్కం బంగారమైతరని, అందుకు ప్రేరణగా ఓదయ్య సార్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని హెడ్మాష్టర్ విద్యార్థులకు హిత బోధ చేస్తాడు.

     కరోనా వచ్చిన వ్యక్తి పట్ల సొంత మనుసులే ఎంత అమానవీయంగా ప్రవర్తించారో నిరూపించిన 'రుణం' కథ. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో, వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయో చిత్రించిన 'పిడుగు' కథ. అంబేద్కర్ జీవితంలో నుండి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో తెలియజేస్తూ అంబేద్కర్ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యాయుడి కథ ఆచరణ. కరోనా వచ్చినపుడు గ్రామ సమస్యలు పరిష్కరించలేని తీర్మానం కథ. 

     కులమతాల చర్చ వచ్చినప్పుడు నిన్ను కోస్తే రక్తం, నన్ను కోస్తే పాలు ఒస్తాయా? మనుషులందరికి రక్తమే వస్తది. మనుషులంతా ఒక్కటే. కులాలు మనం పెట్టుకున్నం అని బెస్త నరసయ్య మామ చెప్తుంటాడు. ఆయన చనిపోయినప్పుడు కుల మతాలకతీతంగా అందరి చేత కన్నీళ్లు తెప్పించిన 'బెస్త నరసయ్య మామ' కథ మనసులను కదిలిస్తుంది.
 ఒకే పాఠశాలలో చదివిన పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాక ఆత్మీయ పలకరింపుల ఆధారంగా నడిచిన కథ 'ఆరుకోట్ల అందగాడు'. ఈ కథలో టెన్త్ ఫెయిల్ అయినోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తుండగా, మార్కులు బాగా తెచ్చుకున్న విద్యార్థులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సర్దుబాటు జీవితాలు గడుపుతుంటారు.

     దళితులకు కిరాయి ఇల్లు ఇవ్వడానికి ఇతర కులాల్లో కొందరు వెనకా ముందు ఆలోచిస్తారన్న విషయం అందరికీ తెలుసు. కానీ 'పుండకోరు' కథ ద్వారా దళితులు కూడా ఇవ్వరని కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు.

     ఈ కథల్లో ఉపయోగించిన భాష, సామెతలు, పలుకుబడులు, పోలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. పల్లెల్లో ఎక్కువగా వినబడే సామెతలు "బెల్లం మీద ఈగలు వాలినట్లు, ఊరంతా ఒక్కటి ఊరవిస్కే ఒక్కటి, కూట్లే రాయి తియ్యనోడు ఏట్లే రాయి తీసిండంట, ఏం లేని ఇత్తారు ఎగిరెగిరి పడ్డదట అన్ని ఉన్న ఇత్తారు అనిగి ఉన్నదట, ఉరికి ఉరికి పసుల కాస్తే పొద్దూకుతాది, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషవ్వ తల్లి కొడుతది, సల్లకొచ్చి ముంత దాసినట్లు ఉంటది, చెవిటోని ముందట శంఖూదుతున్నట్లే, కొంచెపోని కొంగు పడితే మంచోని మానం పోయినట్లు, పిట్ట బెదిరించి బట్ట గుంజుకుపోయినట్లు, మూలుగులు మునుపటోల్నే తిండి ఎప్పటోల్నే, దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండంట" ఇట్లాంటి సామెతలు (ఊర్లలో శాస్త్రాలు అంటారు) కోకొల్లలుగా ఉన్నాయి.

     సిద్దెంకి కేవలం తన కథల కోసం సృష్టించాడా అనిపించేవి కూడా ఉన్నాయి. అవి "గునుక పువ్వసొంటి నెరిసిన తల, శెరువు నిండితే అత్తరు పల్లి ఎండితే తుత్తురు పల్లి, ఉన్క మీది రోకలోలె, పెంట తవ్వితే పెంకాసులు ఎల్లుతయి, ఎద్దు ఎగురంగనే గంట ఎగురుతాది, వంద కోయిలలు ఒక్కసారి పాడుతున్నట్లు వెయ్యి రామ చిలుకలు కోరస్ అందిస్తున్నట్లు, వాళ్లు బూమ్మీద నిలవడరు మాట మీద నిలవడ్తరు, సేతుల తున్క కాకి తన్నుకవోయినట్లు" వంటి సరి కొత్త పోలికలు ఎన్నో సందర్భానుసారంగా, చమత్కారంగా ఉపయోగించడం వలన కథలను పాఠకుడు హాయిగా చదువుతాడు. 

     సిద్దిపేట, గోనేపల్లి ప్రాంతానికి చెందిన కొన్ని మాండలిక పదాలు వొల్షన్ని=ఎక్కువ, పంజిర్కం=వాదులాట, సరాంచి=గొంతుపెంచి, కైకిల్లు=కూలి,దడ్వత్=భయాన (డిపాజిట్), బకాట్ని=బక్క పశువులని, పుల్కాషి=అమాయకత్వం, ఉన్క=పొట్టు, కోత్కాలు=కోపం, జెమ్మటాలు, చెంగలియ్యాలె మొదలగు అనేక పదాలతో కథలు నిండి ఉన్నవి. ఈ పదాలతో ఈ ప్రాంతపు మాండలిక పదకోశం తీసుకు రావచ్చు.

     ఎవరికి సమాజం నుండి తీవ్ర సంఘర్షణ ఎదురవుతుందో, ఎవరి హృదయాలు గాయ పడుతాయో, ఎవరి మనసులు కలిచి వేస్తాయో అట్లా ఈ రచయితకు అనేకానేక స్వీయ అనుభవాల్లోంచి ఒడువని ముచ్చటగా వచ్చిన కథలివి. మన బాధలు మనమే రాసుకోవాలి. మన గాథలు మనమే చెప్పుకోవాలి అన్నట్లు సిద్దెంకి తన గ్రామం, జీవితం, భాష, ప్రాంతం, కులం, గ్రామీణ కళలు, అస్తిత్వాన్ని కలగలిపి చుట్టూ ఉన్న పల్లె వెతలను పట్టి చూపిన ఉత్తమ కథల పుస్తకం మూడు గుడిసెల పల్లె. దళితుల బాధలే కాదు తెలంగాణ పల్లె సమాజం బాధలూ ఉన్నాయి. ఈ కథలు తప్పకుండా చదవాల్సినవి. చదువుతున్నపుడు మనం ఆ పల్లెల్లో తిరుగుతున్నట్లే అనిపిస్తది. బాధపడుతున్న మనిషి ఎదురుగా కూర్చుని బాధలు వింటూ మాట్లాడుతున్నట్టే ఉంటది. ఇందులో పల్లె జీవన సౌందర్యం, శ్రామిక సంస్కృతి, బాధలు, వర్తమాన స్తితిగతులు, అస్తిత్వమై మాట్లాడుతాయి. ముచ్చెట పెడుతాయి. ఈ కథల్లో సగానికి ఎక్కువగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నవే ఉన్నాయి. అంటే ఈ కథలన్నీ కథనంలో, వస్తువులో, శిల్పంలో, ఎంత బలమైనవో చూడవచ్చు.

  పుస్తకం పేరు: మూడు గుడిసెల పల్లె కథలు. పేజీలు : 152. సెల్ : 9441244773

     *డా. మండల స్వామి* 
          9177607603

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...