సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

12, మార్చి 2023, ఆదివారం

పీడనను చిత్రించిన కథలు








పీడనను చిత్రించిన కథలు

ఒకే సమాజంలోనూ జీవిస్తున్న ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాల్ని, సంఘర్షణల్ని కథలు వ్యక్తీకరిస్తాయి. దళిత, దళితేరజీవితాల్లో అటువంటి వైరుధ్యాలు కోకొల్లలు. కొన్ని వైరుధ్యాలని చూసిన పిదప మౌనంగా ఉండడం చాలా కష్టం. అట్లాంటి మౌనాన్ని బద్దలుచేస్తూ నా మిత్రుడు డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి ఈ కథల్ని రాశాడు. సిద్దెంకి  యాదగిరి రాసిన ఇవి కథలు మాత్రమే కాదు గుండెలోతుల్లో సంచరిస్తున్న బాధల్ని, గాథల్ని తనదైన భాషా శైలితో కథలుగా మలిచాడు. ఈ కథలు తాను జీవిస్తున్న, అనుభవిస్తున్న వ్యవస్థ పట్ల అపరిమితమైన కన్సర్న్‌తో రాసినవి. దుగ్ధతో యావతో, కోపంతో రాసిన కథలు కావు. 

ఈ కథలన్నింటికీ మనిషే అడ్రస్‌. ఆ అడ్రస్‌ గల్లంతవుతున్న మనిషిని ‘‘డిఫెన్స్‌’’ చేయడం కోసమే ఈ కథలు రాశాడు. ఈ కథలు చదివిన తర్వాత ఊరు కోల్పోయిన మనిషి, నిరాశ్రయులైన మనిషి, పీడితుడైన మనిషి, కరోనాతో నిరాదరణకు గురైన మనిషి, వంచింపబడిన దళితుడు, 
రాజకీయవివక్ష ఎదురుకున్న దళిత స్త్రీ, మంచి మనసున్న విద్యార్థి, ఏ కల్మషం లేని ఉపాధ్యాయుడు అందరూ కనపడతారు. ఉట్టిగా కనబడడమే కాదు వారితో సంభాషిస్తున్నట్లుగా ఈ కథలు ఉంటాయి. వారికి భరోసాను ఇస్తాయి. గుండె ధైర్యాన్ని కూడా ఇస్తాయి. మార్పు అనివార్యమనే ఒక మేలుకొలుపును పట్టిస్తాయి.

ఈ కథ సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. ఈ కథలు వేటికవే ప్రత్యేకమైనవి. కథనంలో, శైలిలో, భాషా సౌందర్యంలో ఒక్కో కథా ఒక్కో నేపథ్యాన్ని తెలియజేస్తుంది.
మన కండ్ల ముందర జరుగుతున్నది అభివృద్దే కాదని, అభివృద్ధిలాగా కనిపిస్తుందని ఒక ‘‘ఎపిఫని’’ అర్థం అవుతుంది. ఎపిఫని అంటే ఒక నిజమైన సత్యం ‘సాక్షాత్కరించడం’.  నిజానికి ఈ మాయ వ్యవస్థలో ‘అసత్యం’, ‘సత్యం’ లాగా కనిపిస్తుందని ‘‘ఆఖరి కోరిక’’ కథ చదివితే అర్థమై కన్నీళ్లు వస్తాయి. జీవితం పాతదే కానీ వేదనలే కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఈ సందర్భాన్ని చాలా బలమైన కథగా మలిచాడు సిద్దెంకి.

గత కాలపు జ్ఞాపకాలను నెమరువేస్తూ బలమైన శైలిలో ఈ ‘ఆఖరు కోరిక’ కథను రాశాడు. ఈ కథలో వెంకటయ్య అనే ఉపాధ్యాయుడు ఊరు ప్రాజెక్టులో మునుగుతుందని తెలిసి ఒక విద్యార్థి బడి బంద్‌ చేసి ఇంటి దగ్గరే ఉంటాడు. సారు ఊల్లకు పోయి విద్యార్థి ఎందుకు రాలేదని తల్లిదండ్రులను కలుస్తాడు. అక్కడ పోశవ్వ అనే ముసలి అవ్వ మాట మాట కలుపుతూ సారు... ఊరు పోతుందంట కదా. ఇంకా చదివి ఏమి లాభం? అని ఊరుతో, ఇల్లుతో, వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ ఇల్లు గోడలకు, దూలానికి ఉండే చరిత్రను చెపుతుంది. వాసానికి  ఉండే అనుభవాన్ని  కూడా ఆర్తితో వేదనతో వలపోస్తుంది. బతుకు మర్మం ఇప్పుతుంది. ‘పందిరి మీద గుండు పడ్డట్టు’ ఇంత పెద్ద చెరువు ఎందుకు సారు మాకు అనే ప్రశ్న బలంగా వేస్తుంది. మా ఉనికే లేనటువంటి అభివృద్ధి ఎవరికోసమని ఎందుకోసమని ప్రశ్నిస్తుంది. నిత్య సత్యాలతో నిప్పులు చెరుగుతుంది. వెంకటయ్య సారు అవ్వ ప్రశ్నలకు నిస్సహాయుడైపోతాడు. 
  
       నీళ్లు వచ్చినా పూర్తిగా బతికే స్థితి లేనప్పుడు కొందరి అభివృద్ధికై మేమెందుకు త్యాగం చేయాలన్న ప్రధాన ప్రశ్నకు సమాధానం శూన్యమే. ఈ కథలో గోసలు ఎతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఊరు మునిగితే వచ్చే కష్టాలు, పడే బాధలు, పోగొట్టుకున్న గుర్తులు, చెల్లాచెదురయ్యే జీవితాలు అన్ని గుర్తుకు వస్తాయి. మనిషి చుట్టూ అల్లుకున్న వెలుగులను ఆర్తితో గుర్తుచేశాడు. దోపిడి పరాయి ప్రభుత్వాలే కాదు సొంత ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయని నిరూపించిన కథ ఈ ‘ఆఖరి కోరిక’ కథ.
తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రోది చేసుకొని తెలంగాణ కలను సాకారం చేసుకున్నది. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఒక ప్రధానమైన పండుగ. ఈ పండుగలో ఉండే వివక్షతను అంటరానితనాన్ని నిరసిస్తూ ‘అంటరాని బతుకమ్మ’ అనే కథ రాసిండు. 

సిద్దెంకి ఏ విలువల్ని ముఖ్యంగా ఎవరి విలువల్ని గౌరవిస్తున్నాడు అనేది ఈ కథ చదివితే అర్థమవుతుంది. నిర్మాణ పరంగా ఈ కథ చాలా సహజమైన శైలిలో నడిచి, అధరహో అనిపిస్తుంది. కథను నిర్మించిన పద్ధతి పాఠకుడిని కట్టిపడేస్తుంది. కథ అల్లిక కృత్రిమంగా లేదు. చలికాలం మంట పెట్టుకొని చేతులు కాపుకుంటూ మాట్లాడినంత సులభ సంభాషణగా ఈ కథ నడిచింది. నిజానికి ఉన్నత కులాల వాళ్ళు బతుకమ్మను పేర్చితే ఆ బతుకమ్మ పేర్చడానికి కావలసిన పూలు అన్నీ కూడా కింది కులాల వాళ్లే తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడులేని అంటరానితనం బతుకమ్మ పేర్చేటప్పుడు మాత్రం బాగా గుర్తుకు వస్తుంది. అందుచేత కింది కులాల స్త్రీలు ఇన్నొద్దులు ఎక్కువోళ్ల  కోసం పువ్వులు తెంపినం. ఇప్పుడు మనకోసం తెంపుతున్నము. మనకోసం మనం బతుకమ్మ ఆడాలి. ఇన్నొద్దులు శాతకానట్లు చేతులు ముంగట పెట్టుకుని ఆడిటోళ్ళను చూశాం అని అనుకుంటారు. అంతా ఆడటానికి రెడి అవుతారు. తీరా బతుకమ్మ ఆడడానికై పూలు తెంపడానికి వెళితే తేనెటీగలు ఒకరికి కుట్టినయ్‌. దళితులు బతుకమ్మ ఆడటానికి పూలు తెంపితే తేనెటీగలు కుట్టినాయి అనే భయం పుకారుగా వ్యాపించింది. ఇది అపశకునంగా భావిస్తారు. కాబట్టి దళితులు బతుకమ్మ ఆడొద్దని పెద్ద మనుషులు అనుకుంటారు. అట్లను మైసయ్య మనవడు రాకేష్‌ బండి నడుపుతూ జారిపడ్డాడు. దెబ్బలు తగులుతాయి. ఇవన్నిటికి బతుకమ్మకు ఏ సంబంధం లేదని మన తప్పిదాల వల్లనే ఇట్లాంటివి జరుగుతాయని చదువుకున్న పోరగాండ్లు పెద్దవాళ్లకు సదిరి చెప్తారు. తీరా బతుకమ్మ ఆడాలని యూత్‌ తీర్మానిస్తారు. పెద్దలను ఒప్పిస్తారు. పెద్దవాళ్లు సంతోష పడతారు. చేయక చెడిపోయినా చేసి బాగుపడాలని పెద్దోళ్ళు సంబరపడతారు. ఇది కథ. ఈ కథలో అవమానాల మూలతత్వాన్ని ఎరుక పరుస్తాడు. కథకుడికి కలిగిన అనుభూతిని పాఠకుడికి కూడా కలిగిస్తున్నాడు. జరగాల్సిన దానికి జరిగిన దానికి మధ్య ఏర్పడిన ‘ఖాళీ’ని పూడ్చే విధంగా పై కథ ను తీర్చిదిద్దాడు సిద్దెంకి.

అట్లాగే గ్రామాల్లో దళితులకు జరిగే రాజకీయ వివక్షతను పట్టించే కథ ‘మూడు గుడిసెల పల్లె ‘కథ. ఈ కథలో పటేల్‌ ఊరు సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేయాలనే     ఉద్దేశంతో కుట్రతో దళిత కులానికి చెందిన సరిత అనే ఉత్తమ గుణాలున్న మహిళను సర్పంచ్‌ కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్‌ చేసినటువంటి మోసం, ఆడినటువంటి నాటకాన్ని బయట పెట్టిండు. అదే దళిత కులానికి చెందిన రాజు మిగతా కొంతమందితో నామినేషన్‌ వేయించి విత్‌ డ్రా కావాలంటే లక్ష రూపాయల డబ్బు  సరిత ఇవ్వాలని తీర్మానించిండు. చివరకు సరిత, సరిత భర్త శంకర్‌ డబ్బులు ఇవ్వలేక పోటీ చేయరు. పటేల్‌ పెంపుడు కుక్కలుగా మసిలే వ్యక్తులే ఆ పదవిలో కుదురుకుంటారు. ఏమి చేసైనా సరే పటేళ్లు తమ బానిసలనే రాజకీయంగా అందలం ఎక్కిస్తారు. కానీ చైతన్యవంతమైనటువంటి దళితులను రాజకీయ పదవులు అనుభవించకుండా అడ్డుకుంటారని ఈ కథ ద్వారా తెలియజేసిండు. ఈ కథలో తేలిపోయే వస్తువు లేదు. తన ఉనికి కోసం బలవంతుల మెప్పుకోసం అధికార గుర్తింపు కోసం కాకుండా తన గుండెల్లో తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలను, ఎతలను విప్పి చెప్పాలనే ఉద్దేశం బలంగా కనపడుతుంది. 

ద్రోహం చేసే వ్యక్తుల కళ్ళు తెరిపించాలనే తపన రచయితకు బలంగా ఉంది.   ఈ కథలో అల్లిక పూర్తిగా పటిష్టంగా ఉంది. ఏమాత్రం నీరసంగా కృత్రిమంగా లేదు. చిన్నపిల్లవాడు వందల మంది స్త్రీలు ఉన్న తన తల్లి దగ్గరికి ఎంత సహజంగా కన్ఫ్యూజ్‌ కాకుండా వెళతాడో అంతే సహజంగా పాఠకుడిని కథాంశంలోకి తీసుకుపోగల నేర్పరితనం సిద్దెంకి కి ఉన్నది అని నిరూపించిన కథ.పల్లెలో అగ్రకుల రాజకీయ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గతంగా సూత్రంగా తెలిపిండు అని భావించాలి.

విద్యార్థుల్లో మంచి స్ఫూర్తి నింపే కథ ‘‘గెలుపు గీతం’’ కథ. చదువు అన్ని సమస్యలకు పరిష్కారం చూయించును. ఎన్ని కష్టాలనైనా చదువుతో జయించొచ్చు అని నిరూపించే  కథ ఇది. ఇక్కడ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చదువు గురించి చెప్పిన ఒక కొటేషన్‌ గుర్తుకు చేస్తాను.
  ‘‘you may forgot the material benefit of our culture.But we cannot forgot educational benifit’’ అంటే మనం వస్తు గత ప్రయోజనాలను వదులుకోవచ్చు కానీ, చదువు అందించే ఏ ప్రయోజనాన్ని వదులుకోకూడదు అని అంబేద్కర్‌ చెప్పాడు. సరిగ్గా ఈ అంశానికి అతికినట్టుగా ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఈ కథలో చాలా పరిమితంగా పాత్రను సృష్టించాడు. ఒకే సంఘటన కథలో    ఉంది. కథాంశం పాఠకుడికి తొందరగా చేరుతుంది.

‘పిడుగు’ కథలో అనేక మలుపులున్నాయి. ఏమవుతుందో అనే టెన్షన్‌ పాఠకుడికి కలుగుతుంది. సిద్దెంకి యాదగిరి కథల్లో సాధారణ మహిళా పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాంటి స్త్రీ పాత్రే లింగమ్మ. లింగమ్మ చాలా కలుపుగోలు మనిషి. ఇగురం గలది .మానవ సంబంధాలు  చెడిపోకుండా మాట మాట్లాడుతుంది.  కసురుకోదు. ఇసురుకోదు. మనిషిని అభిమానిస్తుంది. లింగమ్మ బిడ్డ అంజమ్మ. చదువు పట్ల చాలా శ్రద్ధ గలది. చదివి జీవితంలో తానేంటో నిరూపించాలనుకుంటుంది. కానీ పల్లెల్లో చదువు కంటే ముఖ్యంగా పెళ్లి మీదే వాడకట్టు మనుషుల ఆలోచన ఉంటుంది. లింగమ్మ అత్త చావుకు దగ్గర అవుతుంది సచ్చే ముందర మనవరాలి పెండ్లి చేసి నాలుగు అక్షంత లేసి చావాలనుకుంటుంది. కోడలిని తొందరగా పెళ్లి చేయమని ఒత్తిడి చేస్తుంది. అందుకోసం అత్తమామలు సంపాదించిన ఎకరం భూమిని 14 లక్షలకు అమ్మి డబ్బును బ్యాంకు నుండి ఇంటికి తెస్తుంది. అదే రోజు అంజమ్మ అన్నం తినకుంటా టీవీ చూస్తున్న సందర్భంలో నోట్ల రద్దు అంశం టీవీలో వస్తుంది. డబ్బులు చెల్లవని రెండు లక్షల వరకే బ్యాంకులో తీసుకుంటారని, మిగతా డబ్బులు పనికిరావని అంజమ్మ వార్తల్లో వింటుంది. ఇట్టి విషయం అమ్మ లింగమ్మకు చెబితే గుండె పగిలి చస్తుందని తన గుండెల్లోనే దాచుకుంటుంది. అంజమ్మ టెన్షన్‌ పడుతుంది. నిద్రపట్టదు చాలా ఆందోళనకు గురవుతుంది. సామాన్యులకు ప్రభుత్వాలు సృష్టించే సమస్యల వలయాల ఆధారంగా కథ రూపు దిద్దుకున్నది. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎన్ని కష్టాలను అనుభవించారో ఈ కథ ద్వారా సిద్దెంకి బలంగా వ్యక్తీకరించారు. ఈ కథలో దళిత ఈస్థటిక్స్‌ చాలా బలంగా పలికించాడు. తెలంగాణ భాషా సౌందర్యం అదనపు బలంగా పలికింది. జీవితం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం ఉంది కాబట్టే సిద్దెంకి ఇట్లాంటి కథ రాయగలిగిండు. నిజాయితీ కొట్టొచ్చినట్లు ఈ కథలో కనపడిరది. అందరి జీవితాలు ఉన్నతంగా తయారు కావాలనే తాపత్రయం ఈ కథ వెనుక ఉన్న బలమైన కథనం.

‘‘ఆరు కోట్ల అందగాడు’’ కథలో ఒకే పాఠశాలలో చదివిన పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాక జరిగే సంభాషణ ముచ్చట్ల ఆధారంగా కథను నడిపించాడు. విచిత్రమేమంటే టెన్త్‌ ఫెయిల్‌ అయినవాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ప్లాట్లు కోట్లు సంపాదించాడు. క్లాసులో మంచి ర్యాంకులు వచ్చి బాగా చదివిన విద్యార్థులు చిన్నపాటి ఉద్యోగంచేసి కుటుంబ పోషణకు పరిమితమైన స్థితిని చూయించాడు. ఈకథలో ఉద్యోగం అనేది మనిషిని పరిమితమైన స్థాయిలో ఎలా బంధిస్తుందో చెప్పిండు. కథావస్తువు తెలిసిన జీవితమే. చాలామంది పెద్దలు ‘కథకు ముడిసరుకు జీవితమే’ అంటారు. అట్లాంటి జీవితాలు ఎన్నో సిద్దెంకి కథల్లో రూపుదిద్దుకున్నాయి.

అంబేద్కర్‌ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యాయుడి కథ ‘ఆచరణ’ కథ. ఈ కథ చాలామంది ఉపాధ్యాయులు చదవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ జీవితంలో నుండి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో ఈ కథ తెలియజేస్తుంది. 

‘రుణం’ కథ ఈ కథల్లో చాలా భిన్నమైన కథ. ఈ కథలో నేటివిటీ బాగా కనిపిస్తుంది. కరోనా వచ్చిన వ్యక్తి పట్ల ఎంత అమానవీయంగా సొంత మనుషులే ప్రవర్తించారో నిరూపించిన కథ. ఈ కథలో డాక్టర్‌ కత్తి మల్లయ్యగారి పాత్ర చాలా స్ఫూర్తివంతంగా ఉంది. దాదాపు చావుకు దగ్గరగా పోయిన వ్యక్తిని డాక్టర్‌ కత్తి మల్లయ్య గారు బతికించి మళ్లీ పూర్వపు స్థితికి తీసుకువచ్చారు. బతకడానికి ఒక భరోసానిచ్చిన  అంశం అందరి డాక్టర్లకు మాత్రమే కాదు మనందరికీ కూడా ఆదర్శం.

ఈ కథల్లో సిద్దెంకి వాడిన పద సంపద భాషా సొబగు అందరిని ముగ్దుల్ని  చేస్తుంది. సందర్భానికి అనుగుణంగా జాతీయాలను, నుడులను సామెతలను ఎంత గొప్పగా వాడారో. ఈ సామెతలు  కచ్చితంగా అసహజంగా మాత్రం లేవు. సందర్భానికి అదనపు బలాన్ని మెరుపులు చేకూరుస్తున్నాయి. మచ్చుకు కొన్ని సామెతలను ఇక్కడ పేర్కొంటున్న దినడమంత్రాన నాలుగు వెంట్రుకలు వచ్చిన అవ్వ ఎగిసి పడుకుంటూ కొప్పులు పెట్టినట్లు ఉంది.
ఆరాటం గళ్ళ అప్ప తొర్ర ఎప్పుడొచ్చినా చిప్ప తొర్ర.
అంబేద్కర్ను మొక్కుడే, మనకు బతుకమ్మ లేదంటే తొక్కుడ.ే 
నల్ల వెంట్రుకలని పాపితే తెల్ల వెంట్రుకను ఊడబీకినట్లు.
మూలుగులు మునుపటోల్నే తిండి ఎప్పటిల్నే.
తెలిస్తే మొలిచినట్టు దిఊరంతా ఒక దిక్కు ఊసుగంలోడు ఒక దిక్కు. 
పిట్ట బెదిరించి బట్ట గుంజుకపోయినట్లు.
రసీదు తప్పితే మసీదు దితోలుడిగిన ముసలి భవిష్యత్తును పోతపోస్తది.
దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండంటా.
మాటకు సత్యం మందుకుపథ్యం.
అతనికి ఆగం ఎక్కువ ఆలోచన తక్కువ.
రాయిని లక్క లక్కను చేసిండు.
పులి బక్కగైనా సారుకలు తగ్గినట్లే. 
కష్టాల కొలిమిలో కాలినోల్లే సోకం బంగారమైతరు.
సదివినోళ్లకు సన్మానం లేదంటే అవమానం లాంటి సామెతలు కథకు 10 చొప్పున విరివిగా పడ్డాయి. ఇన్ని సామెతలు ఉట్టిగనే పడవు. సామాన్యులు మాట్లాతుంటే గొప్ప గ్రహింపు ఉంటేనే ఇది సాధ్యం.  

అట్లాగే ఒక డిక్షనరీకి సరిపోయేటాన్ని తెలంగాణ భాషా పదాలు కూడా ఈ కథల్లో దొరుకుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏదైనా ఉంది అంటే తెలంగాణ భాష సాహిత్య గౌరవాన్ని పొందడం. అది సిద్దెంకి లాంటి వాళ్లు బతికిస్తున్నందువల్లే ఈ గౌరవం దక్కింది.

దాదాపుగా ప్రతి కథలో వ్యవస్థల మధ్యన జరిగిన ఘర్షణ ఉంది. ఘర్షణ లేకుండా కథ రాస్తే ఆ కథకుడికి ఒక నిర్దిష్ట జీవిత నేపథ్యం, ఒక నిర్దిష్ట చూపు లేనట్టే లెక్క. ఈ కథలకు ఒక సామాజిక నేపథ్యం ఉంది. సామాజిక ప్రతిఫలం ఆశిస్తూ అంతర్గత ఘర్షణను బలంగా వ్యక్తీకరించిన కథలు ఇవి. సామాన్యుల కలలు సాఫల్యం కావాలని సామాన్యుడు ఉన్నతంగా జీవించాలని ఆశించి రాసిన కథలు.

కల చెదిరిన మనుషులకు, ఆ కలల్ని చెదరగొట్టిన మనుషులను పట్టిస్తాడు. ముఖ్యంగా శత్రువు ఎవరో మిత్రువు ఎవరో అర్థం చేయించడానికి ఒక వంతెనలాగా సిద్దెంకి కథలు ఉన్నాయని బలంగా నేను నమ్ముతున్నాను. నా దృష్టిలో చెదిరిన జీవితాలను సాహిత్యంలో ఒంపడమే రచయిత కథకుడి పని. ఆ పనిని బలంగా చేస్తున్న సిద్దెంకి  యాదగిరికి నా జై భీమ్‌లు.

 9493319878
           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...