సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

పసునూరి పాటకి ఎర్ర ఉపాలి తొలి పురస్కారం

https://epaper.navatelangana.com/c/58445129
*పసునూరి పాటకి ఎర్ర ఉపాలి పురస్కారం*

వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే వరంగల్ పట్టణం ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విలువలకు కేంద్రంగా భాసిల్లింది. అనేక ఉద్యమాలకు ఆయువుపట్టు వెలుగొందింది. వరంగల్ లో కమ్యూనిస్టు ఉద్యమం కంచుకోటగా ఉన్న కాలంలో పుడుతూనే ఆ స్ఫూర్తి నింపుకున్నాడు పసునూరి రవీందర్.

 పాఠశాల స్థాయి నుంచి బాల కళాకారునిగా మొదలైన ప్రస్థానం పదేళ్ల ప్రాయంలోనే ప్రజా నాట్య మండలి కళా వేదికల మీద గజ్జ కట్టి గళమెత్తారు. 

 ఇంటర్మీడియట్ స్థాయిలో సృజన కారునిగా కొన్ని పాటలు రాయడం మొదలుపెట్టాడు. డిగ్రీలో విద్యార్థి ఉద్యమానికి పాటలు రాసి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఆలోచనను తనదైన దృక్పథాన్ని అందించాడు. విద్యార్థి దశ నుండే అనేక సమస్యలను తనదైన వాణిలో బాణీలో వేదికల మీద, సమావేశాలలో ఉర్రూతలూగించాడు. 

 విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన అమరుల గురించి వామపక్ష పోరాటాల్లో నేల రాలిన త్యాగాలను, విడిచివెళ్లిన మిగిలిన వారి కలలను, తన కలం, గళం పాటల ప్రవాహం సంగమంలాసాగేది. ఆనాటి గీతాలు నేటికీ ప్రజలు పాడుకుంటున్నారు అంటే పసునూరి అక్షరాలు ఔచిత్యానికి, పదునైన భావజాలానికి నిదర్శనం. ఇట్లా విద్యార్థి యువజన కార్మిక కర్షక సమస్యల మీద పసునూరి రచించిన పాటలు ప్రజల నాలుకలలో ఇల్లు కట్టుకున్నాయి.

 ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో పసునూరి రచించిన "జై కొట్టు తెలంగాణ" పాట లక్షలాదిమంది హృదయాల్లో వేళ్ళూనుకపోయింది. కాలర్ ట్యూన్, రింగ్టోన్ అయి ఖండాంతరాలకు వ్యాపించి ప్రతి ఫోన్ లో ఉద్యమ స్మరణయి బీజాక్షర మంత్రం లాగా స్ఫూర్తి నింపేది. ఈ పాట మీద పోటీపరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి. యూట్యూబ్ లో మూడు మిలియన్లలకు పైగా వ్యూస్ దాటాయంటే ఆ పాట ప్రజాదరణను మనం అంచనా వేయవచ్చు.

వారి కొన్ని పాటల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
 'ఊరు వాడ ఏకమయి జై కొట్ట రండిరో జై కొట్టు తెలంగాణ /ఇయ్యరమయ్యర వాళ్ళు రయ్యన ఎగేసిండ్రో జై కొట్టు తెలంగాణ' అని తెలంగాణ వాదాన్ని నింపుతాడు.
 'విద్యార్థి ఉద్యమ పోరు కెరటాలు వీరులు మా శూరులోయమ్మ చదువుతూ పోరాడి నేలకొరిగారు' అని తెలంగాణ ఉద్యమ కాలంలో అసువులు భాసిన విద్యార్థి యువకుల అమరత్వం గురించి ఆలపిస్తాడు.

 తెలంగాణ అధికారం ఆత్మగౌరవంతో గోల్కొండ కోటలో జరుపుతున్న జెండా వందనాన్ని గానం చేస్తూ
‘గోలుకొండ నిండుగా నవ్వింది / జెండా పండుగ జై జై అంటుంది / పది జిల్లాల పబ్బతి పడుతుంది' అని తెలంగాణ సంబరాన్ని సంతోషాన్ని అస్తిత్వాన్ని ప్రకటిస్తారు.

 ఊరు వాడ అంతా బోనాలు మట్టి బిడ్డల బోనాలు.. ‘చెమట చుక్క బోనాలు / సేను సెలక బోనాలు అని బోనాల ఆత్మ తత్వాన్ని వివరించాడు.

 'కడుపుతీపి నీ కన్న ప్రేమను కాసుల తేగలవా? / కడదాకా రాగలవా' అని విదేశాలకు వెళ్తున్న బిడ్డలకు కాసుల వేటలో విదేశాలకు పంపుతున్న తండ్రులకు గొప్ప మానవ సంబంధాలు వివరించే అత్యున్నత సందేశాన్ని అందిస్తాడు.

 పోలవరం ప్రాజెక్టు కడుతుంటే ఆ కట్టడాలు చూసి, విలపిస్తున్న కవిస్వరం దుఃఖ భాస్వరమైతాడు.
‘రేలా పాటలు రాగం మూగబోయినాది. / దిగులుతో గూడెం కునుకు మరచి నాది. మన పై ఒక దుఃఖపు తెరను విసురుతాడు.

 జర్నలిస్ట్ గా వర్క్ చేయడం వల్ల జర్నలిస్టు విలువలను పెంపొందించడానికి ‘నమ్మబోకు నకిలి వార్తను నమ్మబోకు ఫేక్ వార్తలు’ అంటాడు.

 గద్దచ్చి కోడిపిల్ల నెత్తుక పోయినట్లు / ఉరి మీద రాబందు ఉరుమి ఉరిమి చూసినట్లు
ఆడపిల్లల కన్నోల్లారా’ అని ప్రస్తుత కాలంలో దుష్కృత్యాలను, మానవ అక్రమ రవాణా పరిస్థితిని తెలియజేస్తారు.

 'అన్నీ తానై నోడు ఆశల దీపమైనోడు నాన్న / పేరు లేని శిల్పి లాగా కడదాకా బ్రతికేటోడు నాన్న' అని నాన్న యొక్క విశిష్టత చక్కగా విశ్లేషిస్తాడు.

 బహుజన ఉద్యమంలో పసునూరి దారి విభిన్నం. వినూత్నమైన అభివ్యక్తి. ఆలోచనతో ఆశే స్పూర్తిని రగిలించాయి. బహుజన నేతల త్యాగాలను అంకిత భావాన్ని ఆచరణ నేటి తరానికి కర్తవ్యాన్ని బోధించేది సందేశం ఇస్తున్నాయి.

 స్వేరో అనగా ఆకాశమే హద్దుగా సాగిపో అనే సూక్తితో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు పసునూరి పాట ప్రార్ధన గీతం.బుద్ధుని జ్ఞానబోధలం / శ్రమణుల తేజ దీప్తులం / సర్వమంగళం
బాబాసాహెబ్ బిడ్డలం / బాధ్యత వీడని సాహసులం / జై హో స్వేరో' అని లక్ష్యాన్ని గురి పెట్టిన అస్త్రంలా మస్తిష్కంలో వాస్తవ విషయాలను సంధిస్తాడు.

ఈ స్వేరో అంథమ్ నిత్యం రెండున్నర లక్షలకు పైగా విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలల్లో ఆలపించడం పసునూరి సృజనకి దక్కిన అరుదైన ఘనత.

కళాకారులలో కొంతమంది రాస్తారు. మరికొంత మంది పాడతారు. రాసి పాడేవాళ్ళే వాగ్గేయకారులు. పసునూరి ఈ కాలపు బహుజన వాగ్గేయకారుడు. ఇప్పటి వరకే వందకు పైగా పాటలు రాసి పలు ఆల్బంలలో స్వయంగా పాడి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. పదాల్లో పస. పాటల్లో వాసి. ఆదరణలో మేటిగా ఉన్న పాటలు సినీ ఇండస్ట్రీలో తాకాయి. సంత, విరాట పర్వం, ప్రొడక్షన్ నెంబర్ వన్ వంటి సినిమాలలో బహుళ ఆదరణ పొందాయి. బతుకమ్మ పండుగ సందర్భాల్లో పసునూరి రచించిన పాటలకు లక్షల్లో వ్యూస్ లభించాయి.

అభిరుచి మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో పాట మీద పీహెచ్డీ పూర్తి గావించి విమర్శకుల ప్రశంసలు పొందారు. గ్రంధానికి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ఉత్తమ పరిశోధన గ్రంథంగా ఎంచి సురవరం ప్రతాపరెడ్డి అవార్డు యాభై వేల రూపాయలు లభించాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఉత్తమ గ్రంధాల్లో పరిశోధన పుస్తకం ఒకటి గా గణుతికెక్కింది. ఈ సాధికారమైన పరిశోధన గ్రంథం. ఆ తర్వాత కూడా పాటకవుల మీద తన కలం వినిపిస్తూనే ఉన్నాడు. పాటకవుల కొత్త పుస్తకాలకు ముందు మాటలు రాస్తూ వారిని సాహిత్యాకాశంలో కి శాంతి కపోతంలా సాహిత్యాకాశంలో కి ఎగురేస్తున్నాడు.
పాటల విమర్శకునిగా పసునూరి కృషి వాగ్గేయకారుడిగా సృజన అద్వితీయం, అజరామరం.
ఇట్లా ఉద్యమ పాటకు యుక్తిని ఆలోచనలు అంకిత భావాన్ని కొత్త తరానికి కొత్త దృక్పధాన్ని అందజేస్తున్న పసునూరి రవీందర్ కి ఎర్ర ఉపాలి అవార్డు దక్కడం అభినందనీయం.

అక్షరాల అగ్గిబరాటా, జంబుద్వీప స్వాప్నికుడు. మనువు విరోధం పై నిరసన అలంకారమై అంకితమైన నిప్పుల తప్పెట. జీవితమంతా ధిక్కారమై బతికిన ఎర్ర ఉపాలి నేనే. పాటై, పదమై, కవితై జంబుద్వీప కలలు కన్న ఆధునిక వాగ్గేయకారులు

ఇండియన్ బాబ్ మార్లే ఎర్ర ఉపాలి తొలి అవార్డ్ పసునూరి రవీందర్ కు ఈ నెల 21 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రధానం చేస్తున్న సందర్భంగా... 

 *డా. సిద్దెంకి యాదగిరి* 
 9441244773

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...