అనేక జీవితాలకు ఆవాసం ‘‘మర్రి చెట్టు’’ కథలు
డా॥ సిద్దెంకి యాదగిరి 9441244773
బతుకు సంఘర్షణలు అతికినట్లుగా కథల్లో జొప్పించడం అంత సులువైన పనికాదు. లుప్తమవుతున్న ఆత్మీయతలను అక్షరీకరించడం తేలికైనదీకాదు. సంక్లిష్టమైన వ్యక్తీకరణలను అలవోకగా అత్యంత సహజంగా తీర్చిదిద్దడం, పాత్రల మనస్తత్వాలు స్వభావోక్తంగా మలచడం కథకులు మన్నే ఏలియాకి దక్కుతుంది.
ఏలియా కథలు ఒకరకమైన కొత్తదనంతో కూడి ఉంటాయి. వస్తు నవ్యత, కథనంలో ప్రత్యేక శైలి మిళితమై ఉంటాయి. కథా వస్తువును ఎంచుకునే విధానంలోనే వినూతనత్వం, అభివ్యక్తిలో నూతనోత్సాహం వారి సొంతం. ఏలియా కథా శైలిలో చదివించే గుణం, ఆకట్టుకునే స్వభావం ప్రధాన లక్షణం.
మన్నె ఏలియా కథలను పరిశీలిస్తే పాత్రల స్థితిగతులు అంతర్భాహ్య పరివర్తనలు, తెరమీద చూపే నాటకీయత అక్షరాల్లో ఆవిష్కరించబడుతుంది. ఆ కథలు చదువుతుంటే మన పక్కింటి వారో, మనకు అత్యంత ఆప్తులో ముచ్చటపెట్టినట్లు, మాట్లాడినట్లే ఉంటుంది. అంశం పెద్దదైనా, చిన్నదైనా కథను క్లుప్తంగా చెప్పడం వారి ప్రత్యేకత. గుర్తుండిపోయేలా రాయడం మరొక ప్రత్యేకత.
‘మరి చెట్టు’ మన్నె ఏలియా తొలి కథా సంపుటి. పద్నాలుగు కథల సమాహారమే మర్రిచెట్టు. అనేక జీవులకు ఆవాసం మర్రిచెట్టు. లెక్కలేనన్ని అనుబంధాలతో అల్లుకున్న జీవితాలుగా కనపడుతాయి. ప్రతికథ పఠనీయ జీవితంలా దృశ్యీకరణ చేయబడింది.
చెట్టు మానవ మనుగడకు సాక్షిభూతంగా నిలుస్తుంది. చెట్టుతో జీవనం, చెట్టుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ రాసిన కథ మర్రి చెట్టు. ఈ కథలో దండేపల్లికి పోతా అనుకున్నా ఒక వృద్ధురాలు రాజవ్వ. బస్సెక్కింది ఆమెకు దండేపల్లి స్టేజి అంటే మర్రిచెట్టు అని గుర్తు. ఆ మర్రిచెట్టు కొట్టివేయబడ్డది. మర్రిచెట్టు కనబడలేదు. నేను దిగాల్సిన చోటు కాదని నిశ్చయించుకుంది. బస్సు ముందుకు పోయింది. కొంత దూరం వెళ్ళాక కండక్టర్ గుర్తు చేస్తే తప్ప తను స్టేజి దాటి పోయిన విషయం రాజవ్వకు గుర్తు రాలేదు. అట్లా గుర్తుకొచ్చి అనేక శాపనార్ధాలు పెట్టింది. బిడ్డ ఇల్లు చేరిన తర్వాత బిడ్డతో అదే విషయాన్ని రాజవ్వ చర్చిస్తుంది. రోడ్డు వెడల్పు వల్ల తీసివేసారని తెలియజేస్తుంది. ‘‘ఈని రోడ్డు మీద మన్నువడ. దాన్ని తప్పించి ఎయ్యరాక పోయిందా? మస్తు జాగుంది కదా! సక్కదనపు చెట్టును పొట్టన పెట్టుకున్నరు.’’ అని నిట్టూర్చుతుంది. ఆ నిట్టూర్పు రాజవ్వ ఒక్కతిదే కాదు. ఆ చెట్టుతో అనుబంధం ఉన్న అనేక మందిది. మర్రిచెట్టు చుట్టూ ఉన్న జీవితాన్ని, గుర్తుల్ని జ్ఞాపకాలని అలవోకగా ఆవిష్కరించింది.
మనుషుల మధ్య భౌతిక ఆర్థిక సామాజిక అంతరాలున్న మాట నిజమే. సమాజంలో అసలైన శ్రీమంతుడు ఎవరు అనే ప్రశ్నతో ఎంఏ తత్వశాస్త్రం చదువుతున్న విద్యార్థికి ఒక సందేహం కలిగింది. ఇంట్లో తాతయ్య దంపతులది షష్టి పూర్తి మహోత్సవం. పండుగలోనూ సత్తిగాడేడీ అని చూసే వాళ్ళ సహానుభూతిలోంచి బతుకుతత్వము బోధచేసిన కథ ‘‘శ్రీమంతుడు’’.
సంఘర్షణలను చిత్రించడంలో రచయితది అందెవేసిన చేయి. రెండు సిద్ధాంతాల మధ్య, రెండు వైఖరుల మధ్య ఆలోచనాత్మకంగా సాగుతుంటదీ ఈ కథ. ఆర్థిక శక్తిని ఆలంబనగా జీవించే అనేకమంది ఉన్నారు. జీవితం సంపాదన వెంటబడి కడుపునిండా తిండి తినరు. కంటినిండా నిద్రపోరు. అలాంటి వాళ్ళు ఎలా శ్రీమంతులని రచయిత పాత్రల ద్వారా పరివర్తన చేయిస్తాడు. ఇది నిజ జీవితంలో నుంచి సైదాంతిక అంశాలను పాత్రలు మాట్లాడుకుంటుంటే పాఠకులకు అర్థమవుతాయి. ఈ కథలో సత్తిగాడు పాత్ర నిరుపేద. అతనికి ఎవరూ లేరు. ఏ రకమైన ఆస్తి లేదు. కష్టం చేస్తాడు కడుపు నిండా తింటాడు. కంటి నిండా నిద్రపోతాడు. డబ్బు సంపాదించాలనే ఒత్తిడి లేదు. అన్ని తనకే కావాలి అనే ఆపేక్షాలేదు. ఉన్నంతలో తృప్తి పడుతున్నాడు. అందువల్ల ఆస్తిపాస్తులు లేకుండా జీవించే ఇతడే గొప్ప శ్రీమంతుడనీ తత్వ శాస్త్ర విద్యార్థికి అర్థమవుతుంది.
కథ సాహిత్యంలో పేరు ఎన్నికగాంచిన కథ ‘‘దిద్దుబాటు’’. ఆ కథలో పేకాటకు వ్యసనపరుడైన గోవిందరావుని కమీలీని తన మంచితనంతో భర్తను, తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటది. అలాంటి సంస్కారవంతమైన కథ నేటి పల్లెల్లో కూడా ఉందని తెలియజేసే కథ ‘‘లచ్చవ్వ’’. లచ్చవ్వ, బక్కయ్య భార్యా భర్తలు. బక్కయ్య తాగుబోతు. తాగిన తర్వాత బాధలు పెట్టడం, పంచాయతి చేయడం మామూలే. ఓపికతో భరించిన లచ్చవ్వ మంచితనంతో భర్తను మార్చుకుంటుంది.
వస్త్రం కంటే దేహము దేహం కంటే ప్రాణం గొప్పవే కదా అని చెప్పే అన్ని మత గ్రంధాలు చెప్పిన సారాంశాన్ని ఆధారం చేసుకుని రాసిన కథ ‘హత్య’. ఒక జీవిని మరొక జీవి హత్య చేయరాదనీ చెప్పుతుంది. ప్రశాంత్ రాత్రి లాంతర్ వెలుతురులో చదువుతున్నప్పడు అనుకోకుండా గడ్డి చిలుక ఎగిరి మీద పడుతుంది. వెల్ల గొడుతాడు. మళ్ళీ వెళ్లగొడుతాడు. అట్లా కోపంతో ఆ గడ్డి చిలుకని చంపేస్తాడు. ఎందుకు చంపావు. నీకు ఇబ్బంది పెడితే చంపేస్తావా? మరొక జీవిని చంపే అధికారం నీకేవరికిచ్చారు? అటునుండి ప్రశ్నిస్తుంది. అని పరి పరి విధాలుగా అడుగుతుంది. తప్పైంది అని ఒప్పుకో అని ప్రశ్నిస్తుంది. ఒప్పుకున్న ప్రశాంత్ కి నిద్దుర పడుతుంది. అలా ప్రశ్నించింది ప్రశాంత్ అంతరారాత్మ. ఇది బాల సాహిత్యం కథనా? అనిపించకమానదు. ఈ కథ నడపడంలో రచయిత ప్రతిభ కనపడుతుంది.
బాధ్యతా రాహిత్యం వల్ల, ప్రేమలోపం వల్ల ఏర్పడ్డ బతుకులు చితికిపోతాయని, బతుకు పేదరికంలోకి ఈడ్వబడుతుందనీ తెలిసిన తర్వాత మనసు శకలలుగా విరిగిపడుతుంది. పాఠకుని మనసుని పిండివేస్తుంది. మనసు బాధించే కథలద్వారా రచయిత దుఃఖపు తెరను మనమీదికి విసిరే కథ ‘ఎర్రపూల గౌను’. విజయ్ భార్య చనిపోతే శైలజని లక్ష్మి కొరకు రెండో పెళ్లి చేసుకుంటాడు. విజయ్ మామ కార్గిల్ లో చనిపోవడం వలన పెద్ద ఇల్లు కొంటాడు. శైలజకి బిడ్డ ప్రిన్సి పుట్టే వరకు గారాబంగా చూస్తది. ఆ తరువాత పనిమనిషిగా చూస్తది. బడికి పంపది. విరామం లేకుండా పని చెప్పుతూనే వుంటది. అలసట లేకుండా పని ఎంత చేసినా ఆమె పట్ల కనికరం చూపది. బండ చాకిరి చేసినందుకు కాను మిగిలిన రాత్రి అన్నం, పాచిపోయిన పదార్థాలు పెడుతది. తండ్రి విజయ్ నోరు ఎత్తడు. నిజానికి శైలజ అనుభవిస్తున్న ఆస్తికి వారసురాలు లక్ష్మి. అనుభవిస్తుంది శైలజ. ప్రిన్సి ఎర్రపూల గౌను వేసుకుంటే బాగా కొడుతది శైలజ. ఆ గౌనును బలవంతంగా విప్పదీసి వాకిట్లో వేసి కాలపెడుతుంది. మూలన ఒక వైపున ఏడుస్తున్న లక్ష్మి వీపుపైన వాతలు తండ్రిని వెక్కిరిస్తుంటాయి. తండ్రి అవేవీ పట్టినట్టుగా ఉంటాడు. కొన్ని జీవితాలు ఉత్తాన పతాన స్థితులకు ఉదాహరణగా విషాదంతో ముగించబడిందీ కథ.
జీతగాన్ని కనీసం మనిషిగా చూడని మనస్తత్వం కలిగిన యజమానులు ఉంటారు. మనుషులు పంచని ప్రేమని పశువులతో స్నేహం చేసి ఆ లోటును ఎలా తీర్చుకుంటారో తెలిపే కథ 'మల్లిగాని కుక్క'. తనను అమితంగా ప్రేమించే యజమాని కుక్క చనిపోతే దానిని సమాధి చేసి స్నానం చేసిండు. బొంద వద్ద ఆగరుబత్తీలు పెట్టిండు. రంది ఎక్కువైంది. కుక్క గురించే రాత్రంతా ఆలోచిస్తూ అలానే పడుకున్నాడు. దాని జ్ఞాపకాలతో శాశ్వత నిద్రలోకి జారు కున్నాడు. పొద్దు పొడిసింది. మంద ఒకవైపు అల్లరి చేస్తుంది. ఓ తాగుబోతు లేవురా అని లేపేవరకు ఎప్పుడో చనిపోయాడు. కట్టె సర్సుకపోయాడు. మల్లిగాని మంచితనానికి ఊరు ఊరంతా కదిలి వచ్చింది. ఊరి జనమే సావు జేసింది. ఎవరికి రానంత జనం వచ్చింది. రామ సక్కదనం సావొచ్చింది. ఊల్లో ఉండాల్సిన మనిషి ఊరవతలికి, ఊరవతల ఉండాల్సిన కుక్క పెరట్లో ఘోరి కట్టబడిందనీ’’ దహనం చేసి ఊరు దిక్కు మరలిన జనం అనుకోవడం మల్లిగాని మంచితనాన్ని అత్యంత సహజంగా చిత్రించాడు రచయిత.
వ్యవస్థను ప్రశ్నించిన కథ ‘అపచారమపచారం’ అంటరాని వారి నీడను తాకనివ్వని సమాజంలో దళితులకు నీళ్లివ్వని బావిలో పంది పడ్డది. తాకితే మైలపడుతదనే భావన అందరిలో ఉంది. అది గుడిముందటి బావి. ఆ బావి దళితులకు నీళ్ళివది. నీళ్లివ్వని బావిలోకి దిగి పందిపిల్లను తీయడానికి దళితుడైన చిన్రాజిగాడు ఉచితంగా తీయడానికి ఒప్పుకుంటాడు. తీసినంక నాదొక కోరిక పూజారికి పటేల్ కు రెడ్డికి తెలియజేస్తాడు. నేను శుబ్బురంగా స్నానం చేసి గుళ్లోని నందిని తాకుత అంటాడు. సరే కానీ అని ఒప్పుకుంటారు. పటేల్, పూజారి ముందైతే పందిని తియ్యిరా అని పురమాయించి ప్రణాళిక ప్రకారం గుడి మెట్లనుకూడా తాకనివ్వరు. ఈ వ్యవస్థ మీ ‘థూ ’ అని ఉమ్మేస్తాడు. మనుషులని మనుషులుగా చూసే సమాజం కోసం ఘవెళుతాడు. అలా చేసింది ఒక్క చిన్రాజిగాడేనా? ఆ పాత్రేనా? కాదు ముమ్మాటికి అది అంటరాని ఆక్రోశంగా చిత్రించడం అద్భుతంగా సాగుతుంది.
కళలను ప్రేమించే వాళ్లకు వాయిద్యాల మీద ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నా ప్రాణం అంటారు. పంబాల భీములు ప్రాణం ఎక్కడుందో తెలిపే కథ ‘జమిడికె’. ఈ కథ చదువుతుంటే చాసో వాయులీనం కథ గుర్తుకు రాకమానదు. రాజ్యం, వెంకటప్పయ్య భార్య భర్తలు. రాజ్యం ఆరోగ్యం కోసం వాయులీనాన్ని అమ్మి జరీ అంచు చీర తెస్తాడు. రాజ్యం ఆ తల్లి పోతూ పోతూ ప్రాణం పోసింది. చీరా, రవికె గుడ్డ పెట్టిందని రాజ్యం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏలీయా కథ జమిడికెలో ఎత్తుకు పై ఎత్తు వేసి జమిడికెను కాజేయాలనీ చూసిన పట్నం సార్ ఇస్తున్న ఐదువందల రూపాయలను వద్దనీ మొకమ్మీద కొట్టిండు బీములు. ‘‘ఇందామని రాలే. నా జమిడికె కొందామనీ వచ్చిండు’’ అని భార్యకు చెప్పుతడు. నా ప్రాణముండంగ నా జమిడిక ఎవరికియ్యననడం గొప్ప అవ్యాజ్యమైన ప్రేమకు పరాకాష్టగా పేర్కోంటాడు.
పేదరికం వింత పాఠశాల లజ్జ కానబడది అని అన్న గుర్రం జాషువా మాటల్ని గుర్తుకు వచ్చేలా రాసిన కథ ‘కొత్తంగి’. ఈ కథ చదువుతుంటే రాయిలాంటి మనసున్నా లక్కలా కరుగాల్సిందే. హృదయాల్ని అంకుశంతో పొడిసినట్లుగా చిత్రించిన కథ. తల్లీ కొడుకుకు బట్టలు కొనివ్వలేని దరిద్రంలో ఉంటుంది. పండుగకు పోయేటప్పుడు బంధువు కొడుకుది కొత్తంగి వేసుకొనిపోతారు. తిరిగి వచ్చేటప్పుడు బస్టాండ్‌లోనే పెయిమీదికేలి కొత్తంగి తీసుకుంటది బంధువు. పిల్లాడి వీపు మీద అంగిలేదు. బరివాతల వున్నాడు. తల్లి కొడుకును తన కొంగుకప్పుకొని తెల్లవారుతుండంగా ఊళ్లోకి వస్తుంటది. కొడుక్కు చలి పెడుతుంటది. సానుపు చల్లే వాళ్లు ఏమైందేందని అడుగుతారు. దాటవేసుకుంటూ వెళుతుంటది. ఇంటికి పోవడానికి మక్కపెరట్ల నుంచి వెళుతుంటే తెనుగు చిన్నయ్య కంకులు దొంగతనం చేసినావే. ఎన్నాళ్లు ఈ దొంగతనం చేస్తున్నవే అని తిడుతాడు. అంగి గురించి చెప్పినా వినిపించుకోడు. అట్లా ఇజ్జత్ అంతా పోతుంది. గుడిసెలో ఎక్కడ దాసినవో అని గుడిసె అంతా వెతుకుతాడు ఏమీ దొరుకదు. వాడకట్టంతా అవమానం పాలైతది. కొడుక్కు కొత్తంగి కొనాలనుకుంటది. రాత్రంతా ఆలోచిస్తుంటది. సోమవారం అంగడిలో కొంటది. అది కల అని తెలుసుకొని బాధపడుతది. ఒకవైపు సలికి కొడుకు బాధపడుతూనే ఉంటడు.
ఆదిలాబాద్ జిల్లాలోని దండెపల్లిలో మొదలైన ఏలియా కథా ప్రస్తానంలో పచ్చని పల్లెతనం పుష్కలం. బతుకు పదన అమోఘం. తిరుగుబాటు పదునూ అమేయం. మనుషులు మనుషులుగా పరిగణించని సమాజంపై వారి పాత్రలే ధర్మాగ్రహం ప్రకటిస్తాయి. ఏలియా కథ పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. తదాత్మ్యం చేయిస్తుంది. కథలు చదువుతుంటే, ఆ బాధలు వింటుంటే మన మనసు లోంచి కొత్త మనిషిపుట్టుకొస్తాడు పుటం పెట్టిన బంగారంలా. అచ్చమైన బతుకులు. స్వచ్చమైన జీవితాలు లిఖించే ఏలియా ఎన్నటికైనా తెలుగు కథా సాహిత్యానికి, తెలంగాణ జీవితానికి చిరానామాగా తప్పకుండా మిగులుతాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి