సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

2, డిసెంబర్ 2024, సోమవారం

బతుకుల్ని కాగడా చేసిన కొమ్ము కథలు

బతుకుల్ని కాగడ చేసిన ‘కొమ్ము’ కథలు. నీవు తెలంగాణ ఈ పేపర్ లింకు

బతుకుల్ని కాగడా చేసిన కొమ్ము కథలు 

చూపులకు అందని కడగండ్ల బతుకుల్ని కండ్లను కాగడా చేసి మనసుకు చూపిస్తూ, మానవీయ పరిమళలాలు వెదజల్లుతూ మహోన్నతంగా ఆవిష్కరించేది దళిత కథ. అక్కడక్కడ ప్రచురించబడిన కథల్ని సాహిత్య నుదుటిపై భాసికముగా అలంకరించి భవిష్యత్తుకి అందించాలనీ జంబూ సాహితీచే దళిత కథా వార్షిక 2020లో ప్రారంభించబడిరది. ఆ పరంపరలో ఈ సంకలనం ‘కొమ్ము’ నాలుగవది.

 కొమ్ము శబ్ధం ద్వారా వేడుక (పెళ్ల్లి, పండుగ,...) ప్రారంభం అయ్యిందనీ తెలిపే ఒక వాయిద్యం. ఇది డప్పు చప్పుల్ల మధ్య అనివార్యంగా ఉంటుంది. యుద్ధ సన్నద్ధతను తెలిపే బూర ధ్వని కొమ్ము ద్వారానే హెచ్చరిస్తారు. కొమ్మును పలికించేవారు కొమ్ములవారు. కొమ్ములవారు లేనిచోట మాదిగలే దీనిని పలికిస్తారు. కొమ్ము ఇంటి పేరు గలవారు ఉన్నారు. 

ఊపిరితిత్తులు కొలిమి తిత్తులుగా మారితేనే కొమ్ము బలంగా పలుకుతుంది. కొమ్ము సమూహిక జీవనంలో భాగమైంది. ‘సింగినాదం జీలకర్ర’ అనే జాతీయం దీనివలన్నే పుట్టింది. సింగినాదమంటే శృంగనాదం. శృంగం అంటే కొమ్ము. కొమ్ము నాదం వినపడగానే జీలకర్ర ఓడరేవుకు వచ్చిందనీ ఆనాటి ప్రజలకు తెలిసేదన్నమాట. మిగ్గు కొమ్ము వృత్తి సంబంధమైంది. పసుపు కొమ్ము, అల్లం కొమ్ము మొదలైనవి ఆచార వ్యవహారాలలో భాగమైనవి. లుప్తమవుతున్న విలువల్ని పెంపొందించాలనీ దళిత అస్తిత్వం కలిగిన ఈ పేరు ఈ సంకలనానికి నిర్ణయించనైనది. 

ఈ సంకలనంలో కాలం వడపోసిన కన్నీళ్ల బతుకులు, విధ్వంసాలు, ఆత్మగౌరవమూ, ఆత్మ విమర్శ, ఆధునిక కుల వివక్ష పార్శ్వాలు, ముసుగులు చించేయడమూ, దళితేతరులకు మద్దతుగా నిలవడం వల్ల ఇవి దళిత కథా విస్తృతిని చూపుతున్నాయి. 

ఇందులో లబ్ధప్రతిష్టులైన సతీష్‌ చందర్‌, జూపాక సుభద్ర మొదలగు కథకుల నుంచి ఇప్పుడిప్పుడే రాస్తున్న కథకుల కథలున్నాయి. పుట్ట పెంచల్దాస్‌, దుర్గాని రాజు కథలు ఆశావాదాన్ని కలుగజేస్తున్నాయి. వాటిలోని కొండంత కథలను తడిమి చూద్దాం. 

అందమైన రోజిలిన్‌లు నిత్యజీవితంలో జీవితాన్ని కోల్పోయి తారసపడి మా ఈ దుస్థితికి మీరు కారణం కాదా అని ప్రశ్నిస్తున్నపుడు మనలోనే మనం మదన పడుతుంటాం. తల్లి మనసెరిగిన డెలీలా ఆమె ఆకాంక్షను నెరవేర్చినందుకు పూల తీగలా ఉంటే ఎవరైనా నలిపేస్తారు ముల్లులా ఎలా జీవించాలో బోధించే సతీష్‌ చందర్‌ కథ ‘ముల్లు’ ప్రతి ఒక్కరికీ నిజంగా ప్రబోధమే... 

వద్దని వారించిన వచ్చే చుట్టంలాంటి నెల స్త్రీలను ఆచారాలు వ్యవహారాల మాటున కట్టుబాట్లు ఎలా హింసిస్తాయో తెలుపుతూ ప్రత్యామ్నాయ పరిష్కారం దిశగా ఆలోచింపజేసే జూపాక సుభద్ర కథ ‘అంటు- ముట్టు’ మహిళాలోకానికి ప్రత్యామ్యాయ దిశా నిర్ధేశనమే... 

ఆదర్శాలను వల్లిస్తూ ఆచరణలో చూపించని ప్రతి ఒక్కరూ పిసినార్లే. మహా పిసినారిగా ముద్రపడ్డ బుచ్చయ్యలు మనకు చాలా మంది కనిపించవచ్చు. అయినవాళ్ల శవాల మీదపడి నగలు దోచుకునే వాళ్ళ వ్యక్తిత్వం బట్టబయలు, మరోవైపు తన భార్యమీదున్న నగలు తీయొద్దని చెప్పడం అత్యుత్తమ వ్యక్తిత్వానికి మహోన్నత రూపుకట్టిన డా. పసునూరి రవీందర్‌ కథ ‘బుచ్చయ్య బతుకు మర్మం’ మనుషుల డొల్లతనాన్ని ఎండగడుతుంది.

వలస పోవడం అంటే కనబడని శత్రువైన పేదరికాన్ని జయించడంలో భాగమే. వలస కార్మికుల చావులు కుక్కల కంటే హీనం. ఎంత వద్దనుకున్నా వలస పోతున్న కొడుకును చూసిన తండ్రి కలిగిన అనుభూతినీ ఆర్ద్రంగా చిత్రించిన ఇండ్ల చంద్రశేఖర్‌ కథ ‘బేల్దారి’ మనసును పిండే ఆర్థ్రతతో సాగుగుతుంటది. 

బలహీనులపై బలవంతుల ఆరాచాకలు, దౌర్జన్యాలు, బాధితుల కన్నీళ్ళు చూడలేక ఆక్రందనలు వినలేక మౌనంగా ఉన్న చెట్టు కాలంబు రాగానే కాటేసి తీరాలన్న ఉపదేశమిస్తూ బలహీనుల బలమై నిలిచిన చెట్టు ప్రతీకారం ఎలా తీర్చుకుందో తెలిపే మన్నె ఏలియా కథ ‘‘సాక్షి’’ ధిక్కార తత్వాన్ని నేర్పుతుంటది 

కొన్ని అలవాట్లు మనసు మీద ఎంతటి తీవ్రతరం చూపుతాయో అవే ప్రాణానికి ఆధార భూతమై ఉంటాయో, సలహాల మీద బోధించే సైన్‌ బోర్డుల మీద తిరుగుబాటు ప్రకటించిన ఎండపల్లి భారతి కథ ‘పానాదరువు’ తినే జర్దా మా ప్రాణానికి ఆధారమంటుందో కథ చదివితే అర్థమవుతుంది.

కథ చదివాక వాక్యం వెంటాడకపోతే అడగండి. హిజ్రాలు అనగానే ఒక రకమైన అసహ్యం, జుగుప్సాకరమైన అవహేళన కలిగి, పైకి పరిమళంగా కనిపించే దుర్గంధ సమాజంలో మనం ఉన్నామా అని మనల్ని ప్రశ్నిస్తూ బుద్ధి చెప్పి, గుణానికి తెచ్చే మానవత్వాన్ని మహోన్నత పతాకగా నిలిపిన సోలోమోన్‌ విజయ్‌ కుమార్‌ కథ ‘సిలుమంతూరి గేటు దగ్గర కొజ్జా’ హ్యూమనిజానికి ఒక నమ్మకమైన చిరునామా గా ఎలా మారిందో చదవాల్సిందే.

నిస్వార్ధంగా జీవితాలను అర్పించిన తల్లిదండ్రులని పట్టించుకోలేని పిల్లల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా వదిలిపెట్టడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో జీవితమంతా ఒంటరిగా జీవించిన రామలచ్చుం పై విశ్వాసం గల బ్రౌని కుక్క మరణంలోను ఒంటరిగా విడిచిపెట్టలేదనీ, చదువుతుంటే ఎద బరువెక్కించే రత్నాకర్‌ పెనుమాక కథ ‘కాండ్రేగుల రావలచ్చుం కొట్టు’ ఆత్మీయత పంచే మనిషి ఎప్పుడూ ఒంటరికాదనీ జీవితానంతరం కూడా సమూహమనీ రుజువు చేస్తుంది.. 

కుట్రలు పసిగడితే కదా ప్రమాదం తప్పి ప్రమోదం మిగిలేది. కాలాలు మారినా మనుషులు మారకపోవడమే పెను ప్రమాదమని వివక్ష విపరీతమై విజృంభిస్తుంది. ఎన్నికల్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోల్పోయిన జీవితాలను చక్కదిద్దిన సవాలే కె.పి లక్ష్మీనరసింహ కథ ‘యువనాయకత్వం’ నేటి తరానికి కర్తవ్య దీక్ష.

జీవితాలు అంకితం చేసిన ఉపాధ్యాయులు అనేక జీవితాలను నిలబెట్టారు. సరిగ్గా అలాంటి కథ కల్లోలమైన పాఠశాలలోనూ జీవితంలోనూ డ్రాప్‌ అవుట్‌ అయిన విద్యార్థిని లలిత గురించి తెలుసుకున్న సీత టీచర్‌ నిండు గర్భిణీగా నిర్గాంత పోయినా జీవితాన్ని నిలుపాలనీ దీక్షబూనుతది. తన బిడ్డకు జన్మనివ్వాలనే సమయం మరోవైపు కనబడని బిడ్డలాంటి లలిత కోసం లేబర్‌ రూములో ఆయాసపడుతున్న వేదనే డిజి హైమావతి రాసిన కథ ‘మూసిన తలుపులు’ పాఠకుడే ప్రసవ వేదన పడేంతగా మలచిన తీరు మానవ హోమమే.

తనవాళ్ల కోసం జీవితం ధారపోసింది గీత. చెల్లెలు పిల్లల్ని అనాధలు చేసి వెళ్లిపోయినప్పుడు ముప్పైఐదేళ్లు నిండిన గీత తన తల్లి మాట విని, తాను పెళ్లి చేసుకోవద్దని గీసుకున్న గీతదాటి ఆలోచిస్తూ, వాసుతో పిల్లల కోసం కొత్త జీవితాన్ని ప్రారంబించాలనుకోవడమే డా. మండల స్వామి కథ ‘బతుకు గీత’ భవిష్యత్తుకు పునాది.

వేద కాలం నుంచి నేటి వరకు కులం మారితే శిక్ష మారుతుంది. అగ్రవర్ణాలకు అన్నిచోట్ల మినహాయింపులు. చేయని తప్పులకు శిక్షలు, నిమ్న వర్గాలకు జరుగాల్సిన న్యాయంలో కూడా అన్యాయమే అని సరిగ్గా నిరూపణ చేసిన కెంగార మోహన్‌ కథ ‘నీ కృప నాకు చాలు’ కుల వివక్షల తారతమ్యాలను ప్రతిబింబించింది. 

ఆత్మవిశ్వాసం నింపితే ఏద్కెనా సాధించగలరనీ, కష్టాన్ని నమ్ముకుని కాలంతో కనబడితే జీవితం మెరుగు అవుతుంది అని తెలియజేసే సమ్మోహిత నినాదం సిస్టర్‌ అనసూయ కథ ‘విక్టరీ ఇస్‌ యువర్స్‌.’ గెలుపు సత్తా నీవనీ తెలుపుతుంది.

ఆత్మవిశ్వాసం నింపాలి కానీ ఎవరైనా ఏద్కెనా అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయగలరనీ దేశ గురువు చెప్పిన బోధను ఆచరించి అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిన సామాన్యుడే అసమాన్యుడ్కె గీసిన జీవితాన్ని డా. గాదె వెంకటేష్‌ కథ ‘దేశ గురువు’ బోధించిన తీరు సమయోచితంగా ఉంది.

 కుల పంకిలము ఎక్కడికెళ్లినా వెంటాడుతది. వేటాడుతది. ఆ పంకిలము ఇతర మతాల మధ్య దూరి స్వచ్ఛమైన ప్రేమను కాలరాస్తది. మాదిగ రాజయ్యను పెళ్లి చేసుకుంటా అన్నందుకు పరువు హత్యగావింపబడిన జరీనా లాంటి బలహీనులను సజీవంగా కాల్చివేస్తదని మన కళ్ళకు చితిమంటను, ముక్కుపుటాలకు కమురువాసనను చూపే రాజు దుర్గాని కథ ‘మాదిగ రాజయ్య’ మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమభావుటా రెపరెపలాడాలనీ కోరుకుంటదో కథ వివరిస్తది.

ఒక ప్రత్యేకమైన జీవితం ఉపకులాలది. చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని వివిధ రూపాల్లో వివరిస్తారు.అలాంటి జీవితాన్ని ఈ మధ్య కాలంలో గంధం విజయలక్ష్మి, గడ్డం మోహాన్‌ రావు లాంటి వారు రాసింది అతికొంచెమే. ఇంకా రాయల్సిన కలలు, జీవితమూ మిగిలే ఉంది. ఆ లోటును పూడ్చుతూ సినీగేయ రచయిత పుట్ట పెంచల్దాస్‌ రాసిన ‘యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయా’ కథ మాలదాసరి జీవితాన్ని ఆవిష్కరించింది. రాయలసీమ కుల మాండలికంలో అద్భుతంగా సాగింది.

విద్యార్థులకు ఏదైనా అపాయం జరిగితే ఓర్చుకోలేని సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ లోకం ఉన్న ఈ సమాజంలో అనుకోకుండా చనిపోయిన విద్యార్థి గురించి విలపిస్తున్న ఉపాధ్యాయుడి అంతరంగ ఆవిష్కరణ తప్పెట ఓదయ్య కథ ‘పుట్టెడు ఎత’. చదువుతున్నంత సేపు ఒక దుఃఖపు తెరను మనల్ని ఆవహిస్తుంది. ఆవరిస్తుంది. అతలాకుతలం చేస్తుంది. మారని పరిస్థితి గురించి మనసు మారాం చేసేలా రాయడం కథకుడి ప్రత్యేకత.

ఎగువ గేరి ఆడ కుక్క దిగువ గేరి మగ కుక్కతో సాంగత్యం అత్యంత సహజమైంది. జంతువులలో ఆమోదయోగ్యమైనది కూడా. ఆ రెండు కుక్కలు మాట్లాడుకుంటూ ఛి.. ఛి.... వాళ్లు మనుషులు. వాళ్లకంటే హీనులు మరొకరు లేరని మాట్లాడుకుంటున్న తీరు మానవులకి బుద్ధి చెబుతున్నట్లుంది. కుక్కల జీవన విధానానికి పరాకాష్టగా చిత్రించిన వైనం, గేరిలో చారిత్రక రాజకీయ పరిణామ క్రమాలను కుక్కలు చర్చిండం నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్న విధంగా అక్షరీకరించిన గుడిపల్లి నిరంజన్‌ ‘రచ్చకట్ట’అంబేడ్కర్‌ కలలు కన్న రేపటి రాజ్యాధికారానికి ఆలంబన నిలిచింది.

అనుబంధాలు అల్లుకున్న ఊరు ముంపు గ్రామమై మునిగిపోతున్నందుకు, ప్యాకేజీలు రాకపోవడం వల్ల చితి పేర్చుకొని చనిపోయిన స్థలాన్ని దర్శించి, అక్కడి ప్రజల దు:ఖంతో మమేకమవ్వడం మానవత్వం కలిగిన ఉపాధ్యాయ బృందం అక్కడి మట్టితో విలపించిన విషాదగీతం డా. సిద్దెంకి యాదగిరి కథ ‘నిలువెత్తు దుఃఖం’ బాధితుల ఓదార్పుకు స్వాంత్వన, సహచింతన, తదాత్మయం మానవత్వానికి నిదర్శనం. 


ప్రతీకలు, ఉపమానాలు, సౌందర్యాత్మక వాక్యాలు మచ్చుకు కొన్ని. 
‘తెగులొచ్చిన చేలో మొలకల్లా వున్నాయి మూతి మీద వెంట్రుకలు! ఇలాగే ముల్లులా బతకవే.. నా బంగారమా?’, ‘అంటరాని తనం ఆకాశాన్ని మించిన దుక్కం’, ‘ఏడుపు రాకున్నా ఏడుస్తున్నట్టు నటిస్తున్నోళ్లే ఎక్కువున్నరు’, ‘బంగారు భవిష్యత్తుని పెట్టెలో పెట్టి సమాధులతోటకి మోసుకెళ్తున్న నలుగురు మనుషుల్లా కనిపించాయి ఆ బస్సు చక్రాలు డెవిడ్కి’, ‘శవాన్ని చూడడానికి వెళ్లుతున్న వాళ్లకి జాతరకువెళ్తున్నట్టే వుంది.’, ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ’, ‘గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది’, ‘చివరికి చావులో మాత్రం ఒంటిరిది కాలేదు’, ‘శూన్యంలో శబ్దం ప్రవహించనట్లు ఏదో నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవహించింది’, ‘భవిష్యత్తును చూస్తూ మంచు పర్వతంలా కరిగిపోయింది గీత’, ‘ఏడ్పుతో చెరువు కట్ట దద్దరిల్లుతుంది’, ‘ఛీ, ఛీ మనుషులు. వాళ్ల గురించి చెప్పుకోవడం సిగ్గుచేటు’, ‘చూపు ఆనని గాజు కళ్ళ ముసలామె బాధ’. ‘ఆమెను ఓదార్చుతుంటే మనసు మహా సముద్రం అయ్యింది’ లాంటి మొదల్కెన వాక్యాలు ఆయా కథలకు బలం చేకూర్చాయి. 
 ప్రాణమున్న మనిషిని కాదనీ ప్రాణములేని రాయిరప్పని కొలిచే భక్తి తత్వం నేడు దేశంలో పొర్లి పారి మనుషుల పై దాడికి తెగబడుతున్న పరిస్థితులు మారి మనుషులుగా గుర్తించాలనీ, విలువనివ్వాలనీ, మనుషుల ఆచార, ఆహార, వ్యవహార సంప్రదాయపు అలవాట్లకు భరోసా ఇవ్వాలనీ, మనుషులందరూ ఏకవర్ణమే అనీ సాటి మనిషిని మనిషిగా గౌరవించాలనీ ఊదుతున్న శబ్దమే ఈ కొమ్ము. ఇంతకు ముందులా ఈ దళిత కథా వార్షికను సాదరంగా ఆహ్వానిస్తారనీ ఆశిస్తున్నాం.


         మీ 
                సంపాదకులు, 
జంబూ సాహితీ,
     డా॥ సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌, తప్పెట ఓదయ్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విద్యా హక్కు (RTE) చట్టం, 2009 యొక్క ప్రధాన లక్షణాలు

విద్యా హక్కు ( RTE) చట్టం , 2009 యొక్క ప్రధాన లక్షణాలు భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ...