సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

22, నవంబర్ 2024, శుక్రవారం

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు.

వారిపై నేను రాసిన వ్యాసం వీలు చూసుకుని చదువుతారనీ.....

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి 
నేడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 

భాస్కర్!
నీ మథర్ లాంగ్వేజ్ సౌండ్ 
డప్పు దరువే నీ బ్రాండ్ 
సూర్యుణ్ణి జబ్బ కేసుకొని 
భూదేవర వేదిక మీద 
మొగులు శ్యాందిరికింద 
తాత జాంబవంతుని మనువడివై 
చిందులు తొక్కి నింగినంటిన నీ ఆట
చిర్రా చిటికిన పుల్లల ధ్వని మాంత్రికుడా
నవరసాలు పలికించిన నైపుణ్యవంతుడా 
జాతికి కీర్తి తెచ్చిన  ఘనుడా  
డిల్లీ పీఠాలు గెలిచిన ధ్వనుడా!
జజ్జనకల జనలతో నీకు నీలి సలాం

పండుగకు పబ్బానికి పెళ్లికి సావుకు ప్రతి కార్యంలో ముందు నడిచేది డప్పు. తను మేల్కొని ప్రజలను మేల్కొల్పేది చాటింపు లేదా దండోరా. దండోరా వేసేది డప్పే. డప్పును తప్పెట అని కూడా పిలుస్తారు. అన్ని సంగీత వాయిద్యాలు కంటే ముందు పుట్టిన డప్పు ప్రపంచీకరణ ముప్పులో డప్పు వెనుకబడిన మాట నిజమే అయినా డప్పు డప్పే.
 అధునాతనమైన సంగీత పరికరాలు ఎన్ని వచ్చినా డప్పు ముందు దిగదుడుపుగానే ఉన్నాయి. మరుగున పడుతున్న కాలంలో డప్పుకు పోయిన పరువును నిలబెడుతున్న కళాకారుడు అందే భాస్కర్. 

 ఆకాశంలో వేలాడే సూర్యుణ్ణి డప్పు కుదురుగా తన భుజానికి వేసుకొని ఆకాశంలో ఒక అడుగు, భూమి మీద మరో అడుగు అన్నట్లు జాంబవంతునిలా చిందేస్తున్న కళాకారుడు అందె భాస్కర్. అందె భాస్కర్ డప్పు మీద జతులు వాయిస్తుంటే పండిత పామర జనరంజకంగా ఉంటుంది. సంగీత సామ్రాట్టులకి కూడా సంబ్రమాశ్చర్యాలు కలిగించే నైపుణ్యం వారి సొంతం. అతని కళా ప్రదర్శన తీరుతెన్నులను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. వారు పలికించే దరువులు, జతుల తీరు ఆబాల గోపాలానికి ఆనందాన్ని పంచుతాయి. మానసిక ఉల్లాసమే కాదు, ఆ శబ్దానికి ముసలోడైనా పడుచుదనంతో ఎగిరి గంతులు వేస్తుంటారు. అందె భాస్కర్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, దేశ విదేశాలలో అంతర్జాతీయ వేదికలపైన శబ్దాన్ని శూన్యంలో కూడా కాంతి వేగంలా పయనింపజేసిన  ప్రతిభ భాస్కర్ పుట్టు విద్య. మలేషియాలోని తెలుగు సంఘం వారి దీపావళి వేడుకలలో వీరి ప్రదర్శనను ఆ దేశ ప్రధాని వీక్షించారు. 

అందె భాస్కర్ మారుమూల పల్లెటూరైన అందె గ్రామం మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లాలో దుర్భర దారిద్యంలో కొట్టుమిట్టాడుతున్న శాంతమ్మ బాలయ్య దంపతులకు  జన్మించాడు. అందే గ్రామం కూడవెళ్లి వాగు పరివాహక ప్రాంతం. భాస్కర్ పుట్టే నాటికి ఆ ప్రాంతమంతా సిరులొలికే పాడిపంటలకు నెలవైనది. గలగల పారే వాగొడ్డున అనుభవించిన ఆకలి జీవితమమూ, అవమానాల బ్రతుకూ ఉంది. ఆ ప్రాంతం చైతన్యవంతమైంది. ధిక్కారానికి చిరునామా. త్యాగాలకు, తెగింపులకు వీలునామా అని చెప్పుకోదగ్గ ప్రాంతంలో కుల వివక్ష కుటీల్లం మాత్రం పోలేదు. అవమానాలలోంచి సన్మానాన్ని స్వప్నించిన భాస్కర్ చిత్తశుద్ధిని కొనియాడవలసిందే.
భాస్కర్ బాల్యంలో తన తండ్రి బాలయ్య కొడుతున్న డప్పు దరువులు చూసి అనుకరించాడు. ఆచరించాడు. నేర్చుకున్నాడు. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని తన కళ గురించి గొప్పగా చెప్తాడు. ఆటను శబ్దాన్ని జతులను విశ్వవ్యాప్తం చేయాలని కలలుగన్న సంకల్పవంతుడు. అంకుఠిత దీక్ష కలిగిన సంపద్వంతుడు.   పలుకోణాలలో పరిశోధించి అనేక కొత్తకోణాలను ఆవిష్కరిస్తున్న డప్పు కళాకారుడు. 
 తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద విభాగంలో "తెలంగాణ జానపద కళారూపాలు - సంగీత వాయిద్యాల ప్రాధాన్యత" అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాడు. అభిరుచి కలిగిన రంగంలో ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో వీరి ప్రతిభను గుర్తించిన CCRT (Centre for Cultural Resources and Training) స్కాలర్ షిప్ అందజేస్తున్నది.
నిరంతరం నేర్చుకుంటూ అనేకమందికి డప్పు వాయించే విద్యను బోధిస్తూ దశ దిశలా వ్యాపింపజేస్తున్న కృషికి నిలువెత్తు రూపం అందె భాస్కర్. డప్పును మోగించేది పురుషులు మాత్రమే. డప్పుల తయారి విధానములో స్త్రీల పాత్ర అమోఘం. వారూ వాయించాలని పట్టుబట్టాడు. భాస్కర్ పట్టుదల ఆ పరిస్థితిని తిరగరాసింది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ గారి ప్రోద్బలంతో పదిహేను వందల మంది ఆడబిడ్డలకు డప్పు దరువులను నేర్పించిన దీక్షా దక్షిత వారిది. గత సంవత్సరం నారీ శక్తి పేరుతో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ మట్టికళా రూపం 20 మంది ఆడబిడ్డల చేత ఢిల్లీలో ఆదిమ ధ్వని వినిపించాడు.  
ఆగస్టు 2022లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళల ప్రదర్శనలలో భాగంగా భాస్కర్ కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కందుల దుర్గేష్ "జానపద సామ్రాట్" అనే బిరుదును ఇచ్చి సన్మానం గావించారు.

సంగీత వాయిద్యాలలో సంగీత కళాను నైపుణ్యాలలో విశేష ప్రతిభ కనబరిచే కళాకారులకు ఏటా ఇచ్చే బహుమతులలో భాగంగా సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2022- 23 సంవత్సరానికి భాస్కర్ ని ఎంపిక చేసింది. ఈ అవార్డు ప్రారంభమై 74 సంవత్సరాలు  గడుస్తున్నా ఇప్పటివరకు షెడ్యూల్ కాస్ట్ కు  వరించలేని స్థితిలో భాస్కర్ ని వరించడం అంటే తెలంగాణ కీర్తిగా జాతి సంపదగా పరిగణించాలి. ఈ పురస్కారం కింద 25 వేల రూపాయల నగదు శాలువాతో సత్కారం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారులు సాధించిన ఒక విజయం గా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులు అందజేశారు.  ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం ఈనెల నవంబర్ 22 రోజున ఢిల్లీలో జరిగే ఒక వేడుకలో  బహుకరించనున్నారు.

తన విశేషమైన డప్పు కళా నైపుణ్యంతో ఎంతో కీర్తి పొందుతున్న అందే భాస్కర్ డప్పు కళకు పెట్టని కిరీటమై వెలుగొందుతాడని భరోసా కల్పిస్తున్నాడు. అందె భాస్కర్ జాతి శిఖలో జానపద సామ్రాట్. ఆ పురస్కారం స్వీకరించబోతున్న వేళ డప్పు భాస్కర్ కి హృదయ పూర్వక అభినందనలు.

-డా. సిద్దెంకి యాదగిరి
జంబూ సాహితీ

డప్పు కళా సామ్రాట్ అందె భాస్కర్ ఈ పేపర్ విజయక్రాంతి లింకు 

22-11-2024.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...