సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

సుందరకాండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుందరకాండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, అక్టోబర్ 2023, ఆదివారం

సుందరకాండ




సుందరకాండ 




సముద్ర లంఘనం 
లంకా నగర ప్రవేశం
అంతఃపురంలో సీతాన్వేషణ
అశోకవనంలో సీతమ్మ దర్శనం
త్రిజటాస్వప్నం
శ్రీరామ వర్ణన
రాక్షసులను దండించడం
రావణునితో సంవాదం
లంకా దహనం
తిరుగు లంఘనం
రామునకు సీత జాడ తెలుపుట


సముద్ర లంఘనం :    హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు.  పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, ఒక్కుదుటున లంఘించాడు. అ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా, హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు.

రామ కార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసికోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షింపదలచి, మృత్యుగహ్వరంలాంటి తన నోరు తెరచి అతని దారికి అడ్డు నిలచింది. యుక్తిగా ఆమె నోట ప్రవేశించి, మళ్ళీ బయటకు వచ్చి, ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి, కడుపును చీల్చి వేసి, అప్రతిహతంమైన రామబాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు.


లంకా నగర ప్రవేశం: ద్వారం వద్ద లంకా నగరాధిదేవత లంకిణి అతనిని అడ్డగించింది. హనుమంతుడు ఆమెను దండించాడు. అతడు కారణజన్ముడనీ, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లనుందనీ లంకిణి గ్రహించింది. ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి, ఎడమ కాలు ముందుంచి, హనుమంతుడు మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెతుకసాగాడు. ఆ సమయంలో చంద్రోదయం జరిగి, లంకానగరం మరింత శోభాయమానం అయింది.

అంతఃపురంలో సీతాన్వేషణ: తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.


అశోకవనంలో సీతమ్మ దర్శనం: శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూచాడు. ఆమె ఏకవస్త్రయై, ధూమావృతమైన అగ్ని శిఖవలె, మిధ్యాపవాదువలన భంగపడిన కీర్తివలె, మేఘాచ్ఛాదితమైన చంద్రబింబంవలె ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.

త్రిజటస్వప్నం: సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -


అశోక వనములో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు "వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.

ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. 

శ్రీరామ వర్ణన:  సీతకు తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
 రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం (హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్ప) ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.

అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి (యుద్ధానికి కాదు) పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి సూర్య చంద్రుల వలె, అగ్ని వాయువులవలె లంకను నాశణం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.

రాక్షసులను దండించడం:  హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.
వర్షంలాంటి అక్షకుమారుని బాణాలు హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుజ్జునుజ్జయ్యింది.

ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడూను. అతడు తండ్రికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా నటించాడు. ఆ విధంగా రావణునితో సంభాషించ దలచాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయారు.

రావణునితో సంవాదం: హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుని మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతుంది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు, లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు. అంతే కాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీను శతృవులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు. కనుక, దండించి వదలమని సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి వూరంతా త్రిప్పమని ఆనతిచ్చాడు.

లంకా దహనం: మండుచున్నలంకను చూచుచున్న హనుమంతుడు
రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు.

ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకను భయభ్రాంతమొనర్చి, రావణుని మదమణచి, సీతకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.

తిరుగు లంఘనం:  మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. - "కనుగొంటిని సీతమ్మను; ఆమె రాక్షసుల బంధీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.
ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించుట సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.


రామునకు సీత జాడ తెలుపుట: ఓ రామా! సీతామాత ఏకవేణియై, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...