సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

సింగరేణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సింగరేణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2024, శనివారం

VIII. 10. సింగరేణి


సింగరేణి 

1. కింది గేయాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇష్టదేవతకు దండం పెట్టి

గనిలోనికి నువు అడుగుపెట్టి

బళ్ళున బొగ్గు కూలుత ఉంటే

ప్రాణాలకు వెనుకాడక నువ్వు

రక్తమాంసాలు చెమటగ మార్చి

టబ్బుల్లోన బొగ్గు నింపుతవ్

జాతికి వెలుగులు అందిస్తుంటవు

“నల్లసూర్యుని”వై వెలుగొందుతవు.

అ) గేయం ఎవరిని గురించి తెలుపుతుంది ?

జవాబు.బొగ్గు గనిలో కార్మికుని గురించి తెలుపుతున్నది.

ఆ) ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు ?

జవాబు.గనిలో ప్రమాదం జరగకుండా కాపాడమని ఇష్టదేవతకు దండం పెడతారు.

ఇ) కార్మికుడిని ‘నల్ల సూర్యుడు’ అని ఎందుకన్నారు ?

జవాబు.బొగ్గుగనుల్లో మసి పూసుకొని శ్రమిస్తాడు కనుక.

ఈ) జాతికి వెలుగు అందించడమంటే ఏమిటి ?

జవాబు.బొగ్గుతో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది.

ఉ) తెలంగాణలో బొగ్గుగనులు ఎక్కడున్నాయి ?

జవాబు.

సింగరేణి, మణుగూరు, గోదావరి ఖని, బెల్లంపల్లి, భూపాలపల్లి, మందమర్రిలలో బొగ్గుగనులు ఉన్నాయి.

2. కింది పేరాను చదువండి. అయిదు ప్రశ్నలను తయారుచేయండి.

తెలంగాణ ‘బట్టల అద్దకం’ విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నత దశలో ఉండేది. కాని దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్టనష్టాలకు గురి చేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటుపడిన ఈనాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది.

జవాబు.

ప్రశ్నలు :

అ) పై పేరాలో ఏ ప్రదేశాన్ని, ఏ పరిశ్రమ గురించి ప్రస్తావించారు ?

ఆ) ఒకప్పుడు తెలంగాణలో ఉన్నత దశలో ఉన్న పరిశ్రమ ఏది ?

ఇ) అద్దకం పరిశ్రమను కష్టనష్టాలపాలు చేసిన అంశాలేమిటి ?

ఈ) ఏది అతిశయోక్తి కాదు ?

ఉ) పై పేరాకు శీర్షికను పెట్టండి.


II. స్వీయరచన:

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)

ప్రశ్న 1. నిత్య జీవితంలో బొగ్గు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ?
జవాబు.
ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. రోడ్లు వేయడానికి · ఉపయోగించే తారును, ప్లాస్టిక్ను, తలకు రాసుకునే సువాసన నూనెలను, బట్టల అద్దకాలకు వేసుకునే రంగులను ఈ బొగ్గు నుండే తయారుచేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా పంటపొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు ఈ నేలబొగ్గు నుండి తయారవుతుంది. ఇలా బొగ్గు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.బొగ్గును తవ్వి తీయడంలో ఎవరెవరు పనిచేస్తారు ?
జవాబు.
సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్ (మొకద్దం) షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్ మెన్, లైన్ మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మద్దూరులు అందరూ కలిసికట్టుగా పనిచేసి బొగ్గును తవ్వి తీస్తారు.

ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)

ప్రశ్న 1. శ్రమ జీవనం గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
శ్రమలో ఆనందం ఉంది. శ్రమయే ఆనందానికి రాజమార్గం. ప్రతి ఒక్కరూ తమ పని చేసుకుంటే ఈ ప్రపంచం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అందుకే పెద్దలు ‘సన్యాసివలె జీవించు, ఎద్దువలె కష్టపడు’ అంటారు. కాంతి కావాలంటే, దివిటీ వెలిగించాలి కదా ! చీకటి నిండిన గర్భగుడిలో దేవుడు లేడు. నడిరోడ్డుపై రాళ్ళుకొట్టే ప్రతి శ్రమ జీవి చెంత ఆయన ఉంటాడు. ఇది గుర్తించిన ప్రతివ్యక్తి సోమరితనాన్ని వీడతాడు.

శ్రమించి సాధించేవే సుఖాలను అందిస్తాయి. అయితే శ్రమించే వారంతా సుఖపడరు. శ్రామికులు చెమటోడ్చి సౌకర్యాలనందించే ఉత్పత్తులను పెంచుతారు. అది మిగిలిన జగత్తు కంతా ఆనందాన్నిస్తుంది. పరిశ్రమలు నడవాలంటే యంత్రాలతో సమానంగా కార్మికులు శ్రమ పడాలి. అందుకే ‘శ్రమజీవే జగతికి మూలం ………………… చెమటోడ్చక జరగదు కాలం’ అన్నారు.

“శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిస అవుతుంది” అన్న గాంధీ మాటల్లోని అర్థాన్ని గ్రహించి శ్రమపడటం వల్ల సంతోషాన్ని అందుకోవచ్చు. శ్రమను తగ్గించే యంత్రాలను తయారు చేయడం ద్వారా ఆధునిక మానవుడు విసుగు అనే నరకాన్ని సృష్టించుకుంటున్నాడు. నిరంతరం ప్రవహించే నది వలె మనిషి నిరంతరం శ్రమిస్తే ఫలితాలు వాటంతవే వస్తాయి. పరిశ్రమల్లో కార్మికులు, పొలాల్లో కర్షకులు కష్టించి పనిచేసి దేశ అభివృద్ధికి పాటు పడుతున్నారు.

మనంతట మనం పని చెయ్యం, పనిచేసే వారిని చేయనివ్వం, వారిని విమర్శించి, తప్పులెంచి అవహేళన చేస్తాం. మనజాతి పతనానికిదే ముఖ్య కారణం.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.ఒక దేశం తనకున్న సహజ వనరులను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక ఉత్పత్తుల్లో అత్యంత శక్తినివ్వగల మహత్తు నేల బొగ్గుకు ఉన్నది. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదని వినియోగించుకునే విజ్ఞానంపైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది అని చెప్పడానికి నేలబొగ్గును అనేక విధాలుగా వినియోగించుకొని నవ నాగరికతను సంతరించుకున్న భారతదేశమే ఉదాహరణ.

అ) “బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు.” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
జవాబు.తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలు, రైతు కూలీలకు చెందిన కుటుంబాలు బొగ్గు గనుల ప్రాంతాలకు వలస వచ్చారు. బొగ్గు గనుల్లో నుండి నేల బొగ్గును తీయడం అత్యంత క్లిష్టమైన, శ్రమతో కూడిన ప్రమాదభరితమైన ప్రక్రియ. రేయనక, పగలనక భూమి పొరల్లో పనిచేస్తున్న కార్మికులది శక్తికి మించిన శ్రమ. ప్రాణాలను పణంగా పెట్టి రక్తమాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో పని చేస్తుంటారు.

గనుల్లో గాలి, వెలుతురు లేక గని కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. కేవలం ఇదంతా పొట్టకూటి కోసం చేసే పని. ప్రమాదపు అంచుల్లో మృత్యువుతో పోరాడుతూ వారు చేసే బొగ్గు తీసే పని బుక్కెడు బువ్వ కోసం చేస్తున్న బతుకు పోరాటమే.

ఇ) పగలు, రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలె పని చేయటం అంటే ఏమిటి ?
జవాబు.కార్మికుల పనితో అన్వయించి రాయండి. బొగ్గు గనుల్లో పని రాత్రింబవళ్ళు కొనసాగుతూనే ఉంటుంది. గడియారం ముల్లు ఆగకుండా ఎలా తిరుగుతుందో బొగ్గు కార్మికులు భూమి పొరల్లో పని చేస్తూనే ఉంటారు. కోడికూతకు ముందే నిద్రలేచి పోయేవాళ్లు కొందరు, పగలు మూడు గంటలకు పోయేవాళ్ళు కొందరు. నడిరాత్రికి పోయేవాళ్ళు కొందరు. ఈ విధంగా మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తారు. ఎండా, వాన, చలితో సంబంధం లేకుండా ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు చేసే పనిని గడియారం ముళ్లతో పోల్చవచ్చు.

ఈ) డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి ?
జవాబు.1841లో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామస్థులు భూమిని తవ్వుతుండగా భూగర్భ బొగ్గు ఉన్నట్లు తెలిసింది. భారత ప్రభుత్వ భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు మొదలు పెట్టింది. వాటి ఆధారంగా 1871లో డా॥ కింగ్ అనే భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గు భూమి లోపల ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని వెల్లడించాడు.

1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ సంస్థవారు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. ఈ బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు బ్రాంచి రైల్వే లైను వేసి దానికి ‘సింగరేణి కాలరీస్’ అని పేరు పెట్టారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జవాబు.సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయిన వారు ఉత్పత్తి చేస్తున్న నేలబొగ్గు ద్వారా వెలువడే విద్యుత్తును అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాము. ఇదే బొగ్గు అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది, రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబరు (తారు), ప్లాస్టిక్, సువాసన తైలాలు, బట్టల అద్దకానికి ఉపయోగించే రంగులు, పంట పొలాలకు ఉపయోగించే రసాయనిక ఎరువులు ఇవన్నీ నేలబొగ్గు నుండి తయారైనవే. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ బొగ్గుతో నడుస్తున్న పవర్ హౌసులు, సిమెంటు కర్మాగారాలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఎంతోమందికి ఉద్యోగాలను కల్పించి ఎందరికో జీవనాధారం అవుతున్నాయి. ఈ విధంగా సింగరేణి కార్మికులకు, మనకు పరోక్ష సంబంధం ఉందని చెప్పవచ్చును.

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు.
జయహోూ కార్మికా ! జాగ్రత్తలు పాటించండి ! జై తెలంగాణా !

కార్మిక సోదరులారా ! మీరు దేశానికి సేవ చేస్తున్నారు. మీరు నల్ల సూర్యులవంటివారు. మీ సేవలు జాతికి అవసరం. మీ అందరి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. గనుల్లోకి వెళ్ళేముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోండి. మీ కుటుంబాలకు అండగా ఉండండి.

కొన్ని జాగ్రత్తలు :

  1. అనుకూలమైన, నాణ్యమైన బూట్లను ధరించాలి.
  2. నెత్తిమీద లైటుతో ఉన్న టోపీని పెట్టుకోవాలి.
  3. ఊపిరితిత్తుల పరీక్షలను చేయించుకోవాలి. ముందు జాగ్రత్తగా ‘మందులు వాడాలి.
  4. కళ్ళకు అనువైన కళ్ళజోళ్ళను వాడాలి.
  5. ఒంటరిగా గనుల్లోకి వెళ్ళవద్దు. ప్రాణంమీదకు తెచ్చుకోవద్దు.
  6. నెలకు ఒకసారి వైద్య పరీక్షలను చేయించుకోవాలి.
  7. వ్యక్తిగత బీమా సౌకర్యాన్ని పొందాలి.
  8. నీరు ఊరుతున్న గనులవద్దకు తక్షణమే వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి.

ఇట్లు
సింగరేణి కార్మిక సేవా సమితి

జవాబు.

(లేదా)

సింగరేణి గనులు / కార్మికుల గురించి ఒక పాట రాయండి.

జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై కల్పవల్లీ
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి
జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
తెలంగాణములో గోదావరి వడి జన్మించినది మన సింగరేణి
ఖమ్మం కరీంనగర్ వరంగల్ హైదరాబాద్లో విరసిల్లినది సింగరేణి
నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముద్దు బిడ్డ అయినది
జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై కల్పవల్లీ
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి
జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
ప్రతి ప్రగతికి మూలం విద్యుత్తు, విద్యుత్తుకు మూలం బొగ్గు కదా !
అ సిరులను తీసిన సింగరేణి దక్షిణ భారత ప్రగతికి వరమే… సింగరేణి
భరతావని సేవలో తరియించి ఆఆఆ
భరతావని సేవలో తరియించి నూరేళ్లను దాటిన ఘణ చరితా, ఘన చరితా ॥ జై సింగరేణి ॥
కష్టములు నష్టములు తాను ఇష్టంగా చేయించే కదా సఖ్యతతో సమైఖ్యతతో ఓ
కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞఫలం ఇదిగా ॥ జై సింగరేణి ॥
మహెూజ్వల భవితకు స్పూర్తి ఇదే
మహెూజ్వల భవితకు స్పూర్తి ఇదే
సాగాలి రథం చైతన్యపథం సాగాలి రథం చైతన్యపథం || జై సింగరేణి ॥
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి ఆఆఆ
ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం… సింగరేణి
చెందును శ్రమ ఫలం అందరికీ ఆఆఆ… ఆఆ… చెందును శ్రమ ఫలం అందరికీ
జయజయజయ హెూ శ్రమ విజయమూ
జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లీ
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ


V. పదజాల వినియోగం:

1. కింది ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ఉదా : కోడికూత

పల్లె ప్రజలు కోడికూత కు ముందే లేచి పనులు మొదలుపెడతారు.

అ) చెమటోడ్చు

జవాబు.చెమటోడ్చు = శ్రమపడు

శ్రామికులు రోజంతా చెమటోడ్చి సంపాదించినది కనీస అవసరాలకే సరిపోదు.

ఆ) మూలస్తంభం

జవాబు.మూలస్తంభం = ఆధారం

ఖనిజ సంపదలు దేశాభివృద్ధికి మూలస్తంభాలు.

ఇ) బతుకుపోరు

జవాబు.బతుకుపోరు = బ్రతుకు కోసం చేసే పని

పల్లెల నుండి ఎందరో బ్రతుకుపోరు చేస్తూ వలసలు పోతున్నారు.

ఈ) మసిబారు

జవాబు.మసిబారు = కనిపించకుండా పోవడం

చేతివృత్తుల ప్రాధాన్యత తగ్గి వారి బ్రతుకులు మసిబారుతున్నాయి.

ఉ) తలమానికం

జవాబు.తలమానికం = ముఖ్యమైనది

భారతదేశంలో సింగరేణి తలమానికం వంటిది.

2. కింద ఇవ్వబడిన పట్టికలోని పదాలకు పర్యాయపదాలు రాయండి

అ) తనువు =శరీరం, మేను, దేహం

ఆ) భూమి = పుడమి, ధరణి, వసుధ

ఇ) రేయి =రాత్రి, నిశీథిని, యామిని

ఈ) సువాసన = సౌరభం, సుగంధం, పరిమళం

3. కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి, వికృతులను రాయండి.

అ) అచ్చెరువు (వికృతి) = ఆశ్చర్యం (ప్రకృతి)

ఆ) ఖని (ప్రకృతి) =గని (వికృతి)

ఇ) జంత్రము (వికృతి) = యంత్రము (ప్రకృతి)

ఈ) ప్రాణం (ప్రకృతి) = పానం (వికృతి)


VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధి పేరు రాయండి.
అ) కావాలి + అంటే = కావాలంటే – ఇత్వ సంధి
ఆ) మూల + ఆధారం = మూలాధారం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) ప్రాంతము + అంతా = ప్రాంతమంతా – ఉత్వ సంధి
ఈ) ఎప్పుడు + ఎప్పుడు = ఎప్పుడెప్పుడు – ఉత్వ సంధి
ఉ) మహా + ఉద్యమం = మహోద్యమం – గుణసంధి

2. కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి. సమాసం పేరు రాయండి.
విగ్రహవాక్యం – సమాసపదం – సమాసం పేరు
అ) మానవుని యొక్క నాగరికత = మానవ నాగరికత – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) సాధ్యం కానిది = అసాధ్యం – నఞ తత్పురుష సమాసం
ఇ) రక్తమును, మాంసమును = రక్తమాంసాలు – ద్వంద్వ సమాసం
ఈ) నేలలోని బొగ్గు = నేలబొగ్గు – షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) మూడైన పూటలు = మూడు పూటలు – ద్విగు సమాసం



డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...