సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

వెరీ గుడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వెరీ గుడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, డిసెంబర్ 2022, ఆదివారం

వెరీ గుడ్ కథ డా. సిద్దెంకి యాదగిరి

మిత్రులందరికీ నమస్కారం, జై భీమ్ లు. 
నా కథ వెరీ గుడ్డు. నవతెలంగాణ సోపతి  ఆదివారం అనుబంధం లో ప్రచురితం. ప్రచురించిన యాజమాన్యానికి, సంపాదకులకు, ఆనందచారి గారికి, కృతజ్ఞతలు. కథ చదివి అభిప్రాయం చెప్పగలరు. 

వెరీ గుడ్డు
స్టీల్‌ పల్లాలు పట్టుకొన్న విద్యార్థులు ఆకలి సమరంలో ఆయుధాలు ధరించిన యుద్ధ వీరుల్లా కనబడుతున్నారు. 
ప్రాకృత వేషం ధరించిన అన్నపూర్ణమ్మలా లచ్చవ్వ అన్నం వడ్డిస్తుంటే అప్పుడప్పుడు అన్నం చెమ్చా బవుగొని గిన్నెకి తాకి కన్‌ కన్‌ మనే శబ్ధంతో గాజులు  గళ్ళు మంటున్నాయి. 

కిష్టవ్వ ఒకచేత చార్‌ పోస్తుంది. మరోచేత గుడ్డు పెడుతుంది. పిల్లల మొఖాల్లో పట్ట పగలు ఆనందాలు పొంగుతున్నయి. వంటోల్ల సంబూరమ్‌ తిండి పెడుతుంటే తిన్నంత తృప్తి అవుతుంది. 

ఆ స్కూల్లో పీఈటిలేడు. మధ్యాహ్న భోజనం వద్ద హెచ్చెమ్‌,  ఒక సారు రోజూ పర్యవేక్షిస్తారు. 

లాక్‌ డౌన్‌ ఎత్తేసిండ్రు. అన్నీ వ్యాపార సంస్థలతో పాటు స్కూళ్లూ తెరిచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాల ప్రారంభమైంది. పాఠశాలలో మధ్యాహ్నభోజనమూ ప్రారంభమయ్యింది. రోజు మార్చి రోజు గుడ్డు, మెనూ ప్రకారం మాధహ్నభోజనం అందజేస్తున్నారు. కరోన భయం వల్ల విద్యార్థులు పలుచ పలుచగా బడికి హాజరవుతున్నారు.
‘మేక్‌ ఏ లైన్‌, కీప్‌ క్వైట్‌’ లైన్‌ తప్పుతున్న పిల్లలను నర్సింలు సార్‌ హెచ్చరిస్తున్నాడు. విద్యార్థులు ఫాలో అవుతున్నారు.  

‘ఇయ్యాల్ల గుడ్డుతో కడుపునిండ తినొచ్చు. ఎన్నాళ్ళకు దొరికింది గుడ్డు. గుడ్డు కోసమైన బడి ఉంటే ఎంత బాగుండు? బడి ఉంటే ఇప్పటికి ఎన్ని గుడ్లు తిందుమో?’ ఒకడి మనసులోని మాట.

‘కరోనా రోగమేనాయే బడి తెరుస్తరా? గుడ్డు పెడుతరా? లైన్లో ముందన్నోని ప్రశ్నకు జవాబు

‘మా అమ్మకు, మా నాయినకు పని దొరుకక తిండికే తిప్పలైంది. కూరగాయలు, కిరాణం లేవు. రేషన్‌ బియ్యం. పచ్చిపులుసు, దప్పుడమ్‌, చారుతో రోజూ తినలేక సచ్చినమ్‌. ఆకలిబాధకు తినలే. బతికేతందుకు తిన్నమ్‌. మేం తిన్నది గడ్డి అనొచ్చు.’ మొదట అన్నోడి నోట వాస్తవం.  
‘లేటైన సరే! గుడ్డు పెడుతుండ్రు. ఇప్పటికిదే సంతోషం. ఇన్ని రోజులదంతా ఇయ్యల్ల తినరాదూ!’ ఊరిల్లు ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా వెనుకోడి జవాబు.  
‘దొరికిందే పరమాన్నం. తినకపోతే ఎట్లరా? కుమ్ముడే.’

‘ఔనౌను. నిజమే! తినడానికే బతుకుతున్నాం’ అని మరికొంతమంది నమ్మ పలుకుతున్నారు. గుసగుస అన్నట్లే కానీ బాహాటంగా మాటలు వినిపిస్తున్నాయి.

‘అటునుంచి నర్సింలు సార్‌, ఇటె జూస్తుండు రా! హెచ్చెమ్‌ సార్‌ మల్లీ వస్తుండురా. సైలెన్స్‌ రా’ అని పరస్పరం హెచ్చెరికలు చేసుకున్నారు. నిశ్శబ్ధం అలుముకుంది. చక్కగా నిలుచున్న సైనికుల్లా ఉన్నారు. 

గుడ్డు పెట్టుకుంటున్నారు. కొంతమంది వద్దంటున్నారు. మరికొంత మంది గుడ్డు పెట్టుకోవాల్నో, వద్దో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. వద్దనే వారిలో ఆడపిల్లలు, మగపిల్లలూ ఉన్నారు. వద్దనే పిల్లలు సార్లు దృష్టించని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలు అన్నం పెట్టుకొని తింటున్నారు. 

ఎవరో వచ్చారని తెలియగానే హెచ్చెమ్‌ రామ కృష్ణసార్‌, నర్సింలుసార్‌కి చెప్పి, ఆఫీస్‌లోకి  వెళ్ళాడు. 

ఆ స్కూల్లో లంచవర్‌, లీసర్‌ పీరియడ్‌లో తప్ప ఫోన్‌ మాట్లాడరు. వొచ్చిన ఫోన్‌ని నర్సింలు సార్‌ ఎత్తి మాట్లాడుతున్నాడు. అట్లా గుడ్డు వద్దనుకునే పిల్లలు పెట్టుకోకుండానే వెళ్ళి పోయారు.
‘‘మేం లెక్క కొద్ది పెడ్తాంటే వొద్దంటరు. గుడ్డు పెట్టలేదనీ తల్లిదండ్రులకు ఫిరాదైతరు. ఇదేం బాగోతం. మీ పళ్ళెంల పెట్టినంక పారెయ్యిరి. మూల్గులు మునుపటోల్నే తిండి ఎప్పటోల్నే అన్నట్లుంది. మమ్ముల గుడ్డు పెట్టలేదనీ సాటింపు చెయ్యిండ్రి’’ అని కిష్టవ్వ ఉరుముతుంది.

ఫోన్‌ కట్‌ చేసి నర్సింలు సార్‌ ‘‘ఏమైందేమైంది’’ అని ఆరాతీసిండు.
‘లేకపోతే ఏంది సార్‌. పోరలు గుడ్డు తినుమంటే తినరు. పెట్టలేదనీ తల్లి తండ్రులకు చెప్పుతరు. ముందుగాల చెప్పరు. బిస్కెట్‌ ప్యాకెటో ఇంకేదో తెద్దామంటే ముందగాల చెప్పరు. బడికి దుకాణానికి దూరమాయే. ఈ ఊళ్లె అడ్డగోలు పిరమాయే.  ఇప్పటికిప్పుడు ఏం తేవొస్తది సారూ! ఈ పిల్లలు భయం ఉన్నట్లే చేసినపని చేసినట్లే. తినేది తినుకుంటూనే జోలెకేవడో చేసే అంటరు సూడు గట్ల ఉంటది. మాకో బదునామ్‌ ఎందుకు సారూ’ అని రూపాయి బిల్లెలుపు బొట్టున్న నొసలు విరుచుకుంటూ, కనుబొమ్మలు ఎగరేస్తూ వివరిస్తంది లచ్చవ్వ.
‘‘లచ్చవ్వా! ఇదసలే కరోనా కాలం. తినోటోల్ల వొద్దు అనొద్దు. తిననోళ్ల తినుమని బలవంత పెట్టొద్దు. వాళ్ళ ఇష్టమే మన ఇష్టం. ఎవ్వరేమనరు. నిజమే మనం పెట్టకపోతే మనకు మాట.’’ అని సార్‌ వివరిస్తున్నాడు. 
‘‘పిల్లలూ! అందరూ గుడ్డు తినాలి. బలవర్దకమైన, సమతులా ఆహారం. కరోనాను నివారిస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. బలమొస్తది. ఖచ్చితంగా తినాలి. మీకోసమే చెప్పుతున్న.’’ అని నర్సింలు సార్‌ బంతిగా కూర్చుండి భుజిస్తున్నవిద్యార్థులకు గుడ్డు వల్ల కలిగే లాభాలు చెప్పిండు. 
గుడ్డు పెట్టుకొన్నారు. తింటున్నారు. మారు అన్నం కోసం వస్తున్నారు. తిన్నవాళ్ళతో, తినని వాళ్ళూ నవీన్‌, అనిల్‌ లు ఇద్దరున్నారు. 

ఇద్దరు గుడ్డు పెట్టుకోగానే భోజనం తింటున్నట్లు చేస్తున్నారు. గుడ్డు జేబులో పెట్టుకొని బడి దాటుతున్నారు. 

‘తినని వాళ్ళు గుడ్డు పెట్టుకోరు. తినే వాళ్ళు గుడ్డు పెట్టుకుంటారు, తింటారు. వీళ్ళు గుడ్డు పెట్టుకుంటున్నారు.

 తింటలేరు. తినకపోతే పారేయాలి. పారేస్తలేరు. గుడ్డును ఏమి చేస్తున్నారో తెలుస్తలేదు. మిగతా పిల్లలకు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. గుడ్డు తినకుండా ఎక్కడికి, ఎందుకు తీసుకుపోతున్నారు?’అని నవీన్‌, అనిల్‌ల దోస్తులు నితిన్‌, అజయ్‌లు ఆలోచిస్తున్నారు. ఈ విషయం నర్సింలు సార్‌ కి చెప్పిండ్రు. 
ఇదే విషయాన్ని నర్సింలు సార్‌, హెచ్చెం రామ కృష్ణ సార్‌కి చెప్పిండు. 

ఈ రోజు మధ్యాహ్నం భోజనం నిర్వహణలో రమేశ్‌ సార్‌ ఉన్నాడు. 
‘మర్నాడు బుధవారం రోజున భోజన సమయంలో పల్లాలు కడుక్కొని క్యూ లైన్‌ లో నిలబడ్డ విద్యార్థులతో ‘‘గుడ్డు పెట్టుకున్నోళ్ళు, పెట్టుకొనోళ్ళు అందరూ తింటే మంచిది. తినాలి కూడా. కొందరు గుడ్డు పెట్టుకొని తినకపోవడం మంచిది కాదు. బయటికి తీసుక పోతున్నారట. ఎవరెవరు తీసుకపోతున్నారో నాకు తెలిసింది. గతం గతః. నిన్నటివరకు తీసుక పోయిన  వారు ఈరోజు తీసుక పోవద్దు. తీసుకపోతే బాగుండది.  ఆ పద్ధతి మానుక్కోవాలి. గుడ్డు మీ కోసమే పెడుతున్నం. మీరు తినాలి. అదే న్యాయం. అదే ప్రభుత్వ ధ్యేయం. ఇవ్వాల్ల ఎవ్వరు తినరో నాకు అట్లే తెలిసి పోతుంది. ఎక్స్ట్రా లు చేయొద్దు. 
డిడ్‌ యూ అండర్స్టాండ్‌?’’ అని బొటన వేలు ఎత్తి ప్రశ్నించిండు.
పిల్లలు రెస్పాన్స్‌ ఇవ్వక ముందే ‘‘పెద్ద సారు మంచిగనే చెప్పుతుండు.’’’  

‘‘పిల్లల మునుపటోలే భయంల ఉంచుతలేడు. అరేయ్‌ అని గుడ్లు తెరిస్తే ఒక్కొకని లాగులు తడుసు.’’ అని వంట మనుషులు చర్చించుకుంటున్నారు.

‘‘యెస్సార్‌’’ అని కోరస్‌గా తంబూ ఎత్తారు పిల్లలు.

‘‘ఒ కె గుడ్‌’’అన్నాడు హెచ్చెం 
హెచ్చెం చూసే వరకు ‘ఎందుకీ గోల’ అనుకోని అతి కష్టమ్మీద నవీన్‌, అనిల్‌ లు తంబు ఎత్తారు.

‘‘కానివ్వండి’’ అన్నాడు రామకృష్ణ సార్‌.  
నవిన్‌, అనిల్‌లని బోన్‌లో నిలుచో బెట్టిన ముద్దాయిల్లా చూస్తున్నారు మిగతా విద్యార్థులు. 

అన్నంతినేటప్పుడు ఎప్పటిలాగా నవీన్‌, అనిల్‌లు గుడ్డు తినలేదు. గుడ్డు దాసుకున్నారు. బయటకి తీసుకెళ్లారు. సార్ల కంటపడకుండా గేట్‌ దాటి. 
లంచ్‌ బ్రేక్‌ పూర్తి అయ్యేలోపల బడిలో చేరుకున్నారు. అప్పటికే కొంతమంది విద్యార్థులతో తెలుసుకున్న హెచ్చెం కోపం నశాలానికి అంటింది. ఇద్దరినీ పిలుసుకున్నాడు. ఆరా తీశాడు. ఎంతకీ చెప్పుతలేరు. భయంతో ఏడుస్తున్నారు. 
హెచ్చెం బాగా ఆలోచించాడు. శుక్రవారం రోజున మధ్యాహ్నభోజనంలో గుడ్డు పెట్టారు. యథావిధిగా తినేవాళ్లు తిన్నారు. తిననివాళ్ళు తినలేదు. నవీన్‌, అనిల్‌లు తినలేదు. ఎప్పటిలాగా గుడ్డు దాచుకున్నారు. తీసుకెళుతున్నారు. పిల్లలు పట్టించుకోలేదు.  
హెచ్చెం స్టాఫ్‌ తో చర్చించి, ఒక నిర్ణయం తీసుకొన్నారు కనుక్కుందామనీ. ఆ బాధ్యతను నర్సింలు, రమేశ్‌ లకు అప్పగించారు. 

నవీన్‌ వెళ్తుంటే అనుమానం రాకుండా నర్సింలు సార్‌ వెంబడిరచాడు. ఎప్పటిదో ఇల్లు. వానకు ఉరుస్తది. సందుల్లోంచి సూర్యకిరణాలు ఇంట్లోకి దూరుతాయి. మట్టితో అలికిన ఇల్లు. నిద్ర చోటేరుగదు. ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు నివాసం ఏదైనా నివాసమే. నవీన్‌ ఇంటికి చేరిండు నర్సింలు సార్‌. ఇంటి ముందు కూలిన పందిరి తండ్రి సచ్చిపోతే తల్లి సంకలో ఏడుస్తున్న పిల్లలా చెల్లా చెదరైనట్లు ఉంది. చిన్న దర్వాజ. ఒకటే తలుపు. తీసుకొని లోపలికి పోయిండు నవీన్‌.
హెచ్చెంసార్‌ ఆగమేఘాల మీద నవీన్‌ ఇంటికి బండి మీద చేరుకున్నాడు.
‘‘అమ్మమ్మా! లేవు’’ అంటూ పిలుస్తున్నాడు. మేలుకరాలేదు. 
కప్పిన బట్టల్లో మనిషి ఉన్న ఆనవాల్లు లేవు. బట్టలు పొరలు పొరలుగా తొలగిస్తున్నాడు. మంచంలో దీనంగా పడుకున్నది నవీన్‌ అమ్మమ్మ కనకవ్వ. మరొకరి ఆసరా లేకుండా లేవది. కూర్చోదు. అవుతలకి పోదు. ఇవుతలకి రాదు. అన్నీనవీన్‌, అతనితల్లి కలిసి చేస్తారు. 

నవీన్‌ నాన్నఅనుకోని ప్రమాదంలో చనిపోతే అమ్మ తీసుకొచ్చి సాదుతుంది. తల్లి అమాయకురాలు. ఏ పనైనా చెప్పితే చేస్తది. చెప్పక పోతే చెయ్యది. కూలికి వెళ్ళితేకూడా అంతే. ఎంత ఇస్తే అంతే. చలాకీతనం లేదు. లెక్కలు రావు. అన్నీకనకవ్వ చూసుకునేది. 

సర్కార్‌ దావఖాన పుణ్యమా బతికింది. ఇప్పుడు కనకవ్వకు కరోనా సోకి చావు అంచులు చూసొచ్చింది. సచ్చి పుట్టింది. నీరసంగా తయారైంది. మందులు లేకపోతే బతుకడం కష్టమన్నారు డాక్టర్లు. ఆమెకి మంచి తిండి పెట్టాలి. పైసలు లెవ్వు. పరపతిలేదు. ఆస్తి అసలేలేదు. ఎట్లా సాధ్యం. నవీన్‌ తల్లి తెచ్చే కూలి డబ్బులు గోలీలకు, మందులకు, సరిపోతలేవు. ఉన్నంతలో బడిలో గుడ్డు తెస్తున్నాడు. తినపెడుతున్నాడు. 
తిన్నా, తినకున్న కనకవ్వకు మందులు తెస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆమె బతుకుతుంది. వాళ్ళకి ఆమె బతుకడమే కావాలి. అమ్మ ఆకలి తీర్చడానికి నానా తంటాలు పడుతున్నాడు. నవీనుకి సైగలతో గుడ్డు వొద్దని చెప్పింది. వినడు. బతిమాలి తినవెడ్తడు. 

ఒక్కరెక్క తలుపు తీసుకుంటూ లోనికి వెళ్ళి, ‘‘అమ్మమ్మ లేవు.’’ అని పిలిచాడు.
చిన్నగా మూలుగులతో తెరిచిన కళ్లతో చూసింది.  

నర్సింలుసార్‌ సాటుగా గమనిద్దాము అన్నుకున్నాడు. ముక్కలైన బతుకును చూసేసరికి మనసు లక్కలా కరిగిపోయింది. దుఖభరితమైన సన్నివేశం చూసి చలించిపోయాడు. తాను చిన్న దర్వాజకు వొంగి ఇంట్లోకి ప్రవేశించాడు.   
సార్‌ని చూసి నవీన్‌ భయపడుతున్నాడు. అప్పుడే హెచ్చెం రామకృష్ణ సార్‌ బండిదిగి ఇంట్లోకి వొచ్చిండు. వస్తూనే నర్సింలు సార్‌ ద్వారా తెలుసుకున్నాడు. హెచ్చెం మనసు కన్నీళ్లతో తడిసిపోయింది. 

‘‘భయపడకు నవీన్‌. నిన్ను సాదిన నీ తల్లి తల్లికి ప్రాణం పోస్తున్నవు. భేష్‌. ఆయుషు ఆరువాల్లు. ఏదుకునుడు ఏడు పాళ్ళు. నీ కృషి తప్పకుండ ఫలిస్తుంది. మీ అమ్మమ్మ మళ్ళీ మామూలు అవుతుంది. ఇక నుంచి మీ అమ్మమ్మ వైద్య ఖర్చులు, నీ చదువు ఖర్చులు నావి. భయపడకు’’ అన్నాడు. 

‘‘నవీన్‌! మీ అమ్మమ్మకు గుడ్డు తినపెడుతుంటే నా మనసు ముక్కలు చెక్కలవుతుంది బిడ్డా! మీ అమ్మ బాగయ్యే వరకు నెలకు పౌష్టికాహారం నేను అందజేస్త అని అప్పటికప్పుడే ఐదువందల నోట్లు రెండు కనకవ్వ చేతిలో పెట్టిండు పెద్దసార్‌.  మాట్లాడే శక్తిలేని కనకవ్వ నాలుగుబొట్లు కన్నీళ్లు కార్చింది. 
ఇంకా భయం పోలేదు. కలా, నిజమా అర్థమవుతలేదు నవీన్కి. వణుకుతుండు. భయంతో వణుకుతుండు. కాళ్ళ మీద పడ్డాడు. నవీన్‌ కన్నీళ్లు బొట్లు బొట్లుగా హెచ్చెంకాళ్ళు కడిగాయి.  

‘‘వొద్దుర నవీన్‌’’ అని లేపి హెచ్చెమ్‌ రామకృష్ణ సార్‌ నవీన్నుదగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు.  నువ్వు వెరీ గుడ్డు.’’ అని......
     Dr. Siddenky Yadagiri 9441244773



డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...