సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

రమణజీవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రమణజీవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2025, బుధవారం

రమణజీవి కథ – సముద్రం

చిత్రకారుడిగా పేరుగాంచిన రమణ జీవి కవి, కథకులు. 'ఒత్తు థ', 'సింహాలపేట' అనే కథ సంపుటాలు వెలువరించారు.
వారు అక్టోబర్ 2011లో రాసిన 

'సముద్రం' కథ.
రచయిత పిచ్చాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినప్పుడు అతనికి ఒక పత్రిక వారు తమ ప్రత్యేక సంచిక కోసం కథ రాయమని ఈమెయిల్ ద్వారా కోరుతారు. ఆ విషయాన్ని వారి భార్య అతనికి తెలియజేస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ కథ రాస్తాను అని మాట ఇస్తాడు రచయిత. రచయిత చెప్తుంటాడు. అతని భార్య కథ రాస్తుంటుంది. 

చిన్నపిల్లల కథలు ఎలా చెప్పినా వాళ్లు స్వీకరిస్తారు. పెద్దవాళ్లకు కథలు చెప్పాలంటే ఒళ్ళు దగ్గర ఉంచుకోవాలి. పిల్లల్లా మోసపోరని నిశ్చయించుకుంటాడు. కళ్ళు మూసుకుని భార్యతో కథ చెప్తుంటాడు.

అంతకు ముందటి వారం నుంచి రచయితకు ఒకటే కల వేధిస్తుంది. దేవుడు తనకోసం చేసుకున్న అద్దములా తళ తళ మెరిసిపోతున్న దృశ్యమే సముద్రమని నిర్ధారించుకుంటాడు. 

రాజు దేశాధినేతగా అతడి ప్రజలకు ఇవ్వగలిగిన బహుమతి ఏదైనా ఉంటే అది సముద్రమేనని ఒకరోజు సభలో ప్రకటిస్తాడు. అలా ప్రకటిస్తున్న సమయంలో అందరూ ఉద్వేగంతో కెరటాల్లా లేచి నిలబడ్డారు. సముద్రపు హోరు అప్పుడే మొదలైనట్టు అనిపించింది దేశాధినేతకు. ఖజానా అంతా ఇనుప గునపాలుగా మారింది. తాము చేస్తున్న పని ఈ భూమి మీద ఎవరు కల కూడా కనలేనిదని లక్షల గునపాలు తన్మయత్వం చెందుతాయి. 

రచయిత కళ్ళు తెరిచేసరికి ఓ ఇద్దరు నర్సులు, ఓ అటెండర్ గుమిగూడి శ్రద్ధగా వింటున్నారు. కళ్ళు మూసుకొని మరల కథ కొనసాగిస్తూ...

తవ్వకం కొనసాగుతుంది. ప్రజలు మరియు రాజు దీక్ష తగ్గలేదు. ఆ పనిలో మనుషులు మరణిస్తున్నారు. ఆ పని కొనసాగించడానికి కొత్తవాళ్లు పుడుతున్నారు. దేశాధినేత వృద్ధుడైనా ఆ ప్రజలు సముద్రం తవ్వుతూనే ఉన్నారు. ఈ విషయం ఇతర దేశాలకు హేళనగా, నవ్వులాటగా తోచింది. ఆ దేశాన్ని పిచ్చివాళ్ళ దేశంగా ప్రకటించారు. ఆక్రమిద్దామని అనుకున్నారు కానీ అంతా ఇనుము మయమని వెనక్కి తగ్గారు. 

సముద్రం తవ్వుతున్నారని సముద్రానికి తెలియగానే గాలిని పంపింది. గాలివి గాలి సమాచారం అనీ, పక్షిని పంపి అసలు విషయం తెలుసుకుంది.

సముద్రం ఎలా తయారయ్యిందో యుగాలైనా తనకే తెలియదే అని ఆలోచిస్తూ రెండు తాడిమానులెత్తుతో ముందుకు దూకింది. అలా పరుగులతో ముందుకు కదులుతున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రజలకు జూలు విదిల్చి కదిలి వస్తున్న మహామృగంలా సముద్రం కనిపించింది. 

ఈ ఆరడుగుల ప్రాణులు బానిసలేంకర్మ తనని సమూలంగా నాశనం చేయగలరని పసిగట్టిన సముద్రం కోపంతో రగిలిపోయింది. 
పిచ్చి వాళ్ల దేశాన్ని సమీపించింది. అక్కడ మనుషులు జాడ లేదు. పరిపాలన లేదు. చిన్ని చిన్ని మృగాలు ఇష్టా రాజ్యాంగా తిరుగుతున్నాయి. ఆదేశం చనిపోయిన శవంలా ఉంది.

 యంత్రాలతో సముద్రాన్ని తవ్వుతున్న మతి లేని వాళ్లను చూసి ఆశ్చర్యపడింది. వాళ్లని ముంచేద్దామని చూసి మహాప్రళయంలో పొర్లుతుంటే ప్రజలు మోకాళ్ళ మీద గజగజ వణుకుతున్నారు. వారిని చూసిన సముద్రం మెత్తబడ్డది. సముద్రం తన ప్రమేయం లేకుండా ఆలోచించింది. ఓపిక వస్తున్న కొత్త నీటితో ఆ ప్రాంతం తడిసిపోయింది. అది తన కన్నీరేనని తెలుసుకొని బరువుగా వెనుదిరిగింది. ఆ కన్నీరే ఆ పిచ్చి వాళ్ల దేశంలో సముద్రంగా మిగిలిపోయింది. అప్పటినుంచే సముద్రపు నీరు ఉప్పుగా మారింది.

కథ ముగించగానే వింటున్న ప్రతి కన్ను ఒక సముద్రం లాగా తోచింది రచయిత కంటికి. 

ఈ కథ రిజర్వాయర్ల నిర్మాణంలో నిరాశ్రయులవుతున్న ప్రజల బాధల్ని పరాకాష్టగా ప్రతికాత్మకంగా వివరించింది. రాజు వృద్ధుడైన, ఎంతోమంది చనిపోయినా సముద్రం తవ్వడమనేది అనాలోచిత చర్యగా విశ్లేషించబడింది. సముద్రం తవ్వడం కోసం ఆ దేశ ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. బంగారం ఖర్చుయింది. సంపద కరిగిపోయింది. అప్పులు పెరిగాయి. ఇతర దేశాల వారి నవ్వులాటలు ముందు, హేళనల ముందు జారిపడ్డట్లైంది. 

దిగుబడి నిచ్చే పంట పొలాలు సముద్రం కోసం సేకరించబడ్డాయి. పంటలు పండడం లేదు. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆదేశం పిచ్చి వాళ్ల దేశంగా మారిపోయింది. అందరికీ కన్నీరే మిగిలింది. ఆ కన్నీరే  ఆ పిచ్చి వాళ్ళ దేశంలో సముద్రంగా మిగిలిపోయింది. అప్పటినుంచి సముద్రం నీరు ఉప్పగా మారిపోయింది.

పిచ్చాసుపత్రిలోని రచయిత కథ ముగించగానే ప్రతి కన్నుల్లోనూ ఒక సముద్రంగా రచయితకు తోచడం ప్రతి ఒక్కరిలో నిర్వాసితుల బాధలను చూడడం, వారు చలించి కన్నీరు పెట్టుకోవడం సామాజిక దృక్పథాన్ని, సానుభూతి ప్రకటిస్తూ పంచుకున్న బాధ్యతలను ఆవిష్కరించింది.

//పిచ్చి లో జోగుతున్న సమాజానికిపిచ్చివాడైన కథకుడు చికిత్స తీసుకుంటూ పిచ్చి కుదిర్చే చికిత్స చేయడమే కథ.//

ఈ కథలో పోలికలు వర్ణనలు కథ వాతావరణం పాఠకుడి ఊహకందకుండా ఉన్నాయి. పాఠకులనే కాదు కథకులను ఆలోచింపజేసే విధంగా రచించిన రచయితకు అభినందనలు. 

– డా. సిద్దెంకి
*******************
ఇలాంటి అనేక ఆలోచనత్మకమైన 
#చింతనకథలు 
#అజయ్ ప్రసాద్ గారి
B Ajay Prasad  సంపాదకత్వంలో వెలువడిన
 #అపురూప కథలను తప్పక చదవండి. 

ప్రతుల కోసం దర్శించండి.
#pustakam.in 7989546568 
₹275+పోస్ట్ పేజీ అదనం.



"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"

"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"  వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషను కాదని ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని తెలుగు స్థానంల...