సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

ఎర్ర ఉపాలి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎర్ర ఉపాలి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

నిప్పుల ఉప్పెన - ఎర్ర ఉపాళి పాటలు Erra Upali

జంబూ ద్వీప సాహితీ చక్రవర్తి 
పదాలను తోలు నీళ్ళల్ల ముంచి 
పనిరాయి మీద
 వాటం చూసి గూటం గుద్దుతూ  
చిందేసిన ఆధునిక ఆది జాంభవుడు 
మొగులు శ్యాందిరి కింద గోసంగి తానై 
పాటల పరవల్లతో కొంగవాలు కత్తి తిప్పిన 
ఎర్ర డాలు మొగులు దనదన ఏగే డప్పు
నిప్పుల తప్పెట 
ఎర్ర ఉపాలి అన్నకు వినమ్రంగా ....

 

నిప్పుల ఉప్పెన - ఎర్ర ఉపాళి పాటలు

ఈ నిఖిల చరచరా జగత్తులో నాదం పుట్టించి, సునాదంగా, వినోదంగా మార్చి అనాదరణకు గురైన మాదిగ జాతిని మహోన్నత నీతిగా ఎవరెస్టంత ఎత్తున కీర్తి కిరీటమ్మీద మాదిగ తత్త్వాన్ని నిలిపిన మహాకవి. ఎత శిథిలాల్లో మరుగునపడిన తరతరాల అంటరాని చరిత్రను, ఈ దేశ మూలవాసి తత్త్వాన్ని విప్పడానికి పొడుస్తున్న సూర్యున్ని జబ్బకు తగిలించి చిర్రా సిటికెన పుల్లతో నిప్పుల తప్పెట మోగిస్తూ తరాల తండ్లాటను నిరసిస్తూ అస్తమించని అక్షర రవి.  

నింగిమీద ఓ అడుగు. నేలమీద ఓ అడుగు. గాయాల్లోంచి నినదించే బాధల్తో కైగట్టి, గేయం చేసిన నిండు పున్నమి పండు వెన్నెల. మట్టితత్త్వం చెప్పిన ఎట్టి మాదిగోళ్ళ తట్టిలేపిన ఎలుతురు కిరణం. అలుపెరుగని రణం ఆత్మగౌరవ నిరోధం  పైన. అంటరాని తనంపైన. తన పల్లవుల్ని ఉల్లములో దించే బాణాలుజేసి, చరణాలని మండే పారాయణం చేసిన గుండె గూడెం గొంతికె. 

కన్నీళ్లను ఎడారి చేయడానికి తడారిన బతుకుపై గీతమై తలరాతలు మార్వాలనీ కలలు కని కాలుమోపిన పాటల నెల వన్నెలకాడు. పల్లవుల పుక్కిటి పురానాలాపై ఒక కంటితో మంటను మండిరచిన అగ్గిబరాట. జంబూద్వీప స్వాప్నికుడు. మాదిగ మహాజన జంబూదేశ స్వాప్నికుడు. ఆదిజనల అగ్గిబరాట. తీండ్రించిన చూపులతో మారని వ్యవస్థమీద పూరించిన శంఖం. పుంఖాను పుంఖాలుగా కారు మబ్బుల్లో కమనీయ వెలుతురులాంటి పాటలై ఎగిరిన మహాజన మాదిగ కవి ఎర్ర ఉపాళినేనే. 

ఎర్ర ఉపాళి నేనే. కవి అసలు పేరు ఉప్పలయ్య. తల్లి కందుల చుక్కమ్మ, తండ్రి సిద్దయ్య, గ్రామము రాఘవాపూర్‌, యదాద్రి భువనగిరి జిల్లా. అతని పాటల్ని ‘పల్లె గొంతుకల పాటలు’ పేరుతో పుస్తకంగా ముద్రించాడు.

జంబు ద్వీపే, జంబు ఖండే, భరత ఖండే, భరత వర్షే,  అని పఠించే శ్లోకాన్ని ఆధారం చేసుకొని మాదిగ తత్త్వాన్ని ముడివిప్పి గుండెతడిని చూపుతున్న పాట నిక్కమైన జాతిరత్నంగా నిలుపుతాడు. నిశ్శబ్దంలో శబ్దం ధ్వని పుట్టించింది మాదిగ జాతేననీ తెలుపుతాడు. శ్రమకు శ్రీకారం చేపట్టిన విధానాన్ని వివరిస్తాడు. అంతటితోనే సరిపెట్టకుండా సచ్చిన జంతువునుండి చర్మాన్ని వొలిసి, నాదం పుట్టించిన పనితీరును వ్యక్తీకరిస్తాడు. ఈ జాతి మూలవాసి సాంస్కృతిక రంగానికి సారథిగా మేమే మాదిగ జాతి గురించి వివరిస్తాడు. 

నిశ్శబ్దాల అవనిలోన శబ్దం పుట్టించినోన్ని - శతాబ్ధాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోన్ని
జంబు ద్వీపాన్ని ఏలు కీర్తినీ అంబరాన సాటినోన్ని- మాదిగోన్ని మహాఆదివాన్ని –
ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని ॥2॥
1. సచ్చిన జంతువులనుండి చర్మాన్ని వొలిసినోన్ని - వొలిసిన చర్మం నుండి నాదం పలికించినోన్ని చిరునామ ఏదంటే కాళ్ల చెప్పు చూపినోన్ని ॥మాదిగోన్ని॥
2. సాంస్కృతిక రంగానికి సాగుతున్న ఉద్యమాన్ని - మరుగునపడ్డ మాజనా చరిత్ర తిరుగ రాసేటోన్ని
ఎవడన్నా ఏమన్నా అవునన్నా కాదన్నా - ఈ దేశానికి మూవాసినైనోన్ని- మళ్లీ మా రోజులే. వస్తాయనీ నమ్మేటోన్ని ॥మాదిగోన్ని॥ అంటూ మాదిగతత్త్వాన్ని గొప్పగా విశదీకరించాడు.  

ఎర్ర ఉపాళి పాటతో పాటు కవితల్ని అషాడమాసంలోని కారు మబ్బుల్లోంచి జిగేల్‌ మనే మెరుపులా పిడుగులై లిఖించాడు. ఒక్కొక్క అక్షరం ఎక్కుపెట్టిన బాణం. దిగంతాని చుట్టుముట్టిన పద ప్రయోగం ఉరుముల్లేని పిడుగులే. 

అతని జ్ఞానం లంద మెదడుల మరిగిన శుద్ధమైన తోలు. అగ్గిల కాల్సిన పిడికెడు వొట్టి తునుకలు. కరకర నముతుంటే గుప్పుమనే వాసన. భావం జుర్రుకుంటే సర్గం దిగొచ్చె పూలుగు బొక్క. అతని కవిత్వమైనా, పాటలైన మసాల మద్దిచ్చి యాలకులతో గుమగుమల వాసనతో వాడకట్టంత విసిరే తస్సలకూర. పాట లందనే కాదు. చెప్పుగూడ మీద వికసించిన మొగ్గపూసలు. జాతికి చేసిచ్చిన కిర్రు చెప్పుల చప్పుడు వినిపించే ఎర్ర ఉపాళి నేనే అనే ఈ కవి ఎవరు? నిజమే తెలుసుకుందాం తన మాటల్లో...

‘‘పేదరికం నా ఇంటి పునాదులు - దారిద్య్రం నా ఇంటి అంకరణలు దౌరభాగ్యం కన్నీళ్లు నాకున్న సిరి సంపదలు,  ... బతుకు పాటనై దరువేస్తున్న వాణ్ణి, కూటికిలేక తిప్పలే కానీ, నా గుణం సక్కని జనబలమున్నంక, నాకేం తక్కువ.  నాకేం తక్కువ, నాకేం తక్కువ’’ అంటూ మితి మీరిన ఆత్మ విశ్వాసం ప్రకటించిన వ్యకి కాదు కుల ఆత్మీయత కలగలిసిన వ్యవస్థ. అత్యుత్తమ అక్షరాల ఆత్మగౌరవ పతాక. తిరుగుబాటుకు పురోగమన ప్రతీక.

తన జాతిపై తనకున్న నమ్మకమే జీవితాంతం నడిపించింది. ఉన్న ఎర్ర ఉపాళి జన్మించింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండం రాఘవాపూర్‌. తల్లి కందుల చుక్కవ్వ, అవ్వతో కైకిలి, సుద్ధాలహనుమంతు పాటలోని వాస్తవ బుడ్డెడొడ్ల జీతగాడు. చదివింది పెద్ద బాలశిక్ష. ప్రధానోపాధ్యాయుడు తన గతి మారిందంటూ తను బతికినన్నాళ్లు పోతిగంటి నర్సింహా రెడ్డిని అగ్రవర్ణంలోని ఆదర్శ పురుషుని కొనియాడిన కృతజ్ఞుడు. 
ఇంకా తన గురించి చెబుతూ...

‘‘... నేను మాదిగిజాన్ని. అవమానానుంచి ఎన్నో అగ్నిగుండాలను దిగమింగినోన్ని. ఆవేశంతో మండే సూర్యునిలా గుండెగూడంలో దండు కడుతున్నవాన్ని  .... ఆది అంతము నేనే. అన్న జాంబవంతుని వారసత్వాన్ని నేనే, నేను, నేనే....గమ్మున ఈ  మనువాదాన్ని ఈ మట్టిలోనే పాతరపెడుతా.’’ అంటూ తన అంతరాత్మని ప్రకటించాడు. 

అంతరాత్మని అగ్గి గుండంచేసినా దిగంబర నేలాంటి ఎండిన మనసుపై జడివాన మంచులా కురుస్తాడు. ఎట్టి మనుషుల మట్టి రూపం. కీర్తి కిరీటం. మండే మాదిగ పొద్దుపొడుపు.

ఒంటి మీద పావుశేరు మాంసం లేకున్నా శెటాకు తాకతి లేకున్నా అక్షరాలతో మనువుగాన్ని శెక్కిళ్లు పట్టి నరం గుద్దిన జాతిరత్నం. తన గురించి చెబుతూ సుడిగాలిలా, సునామిలా చుట్టు ముడతా, మనుషుల్ని మనుషులుగా మనువాదాన్ని పాతర పెడుతానని అత్మ విశ్వాసాన్ని ధిక్కార స్వరాన్నిప్రకటించాడు. ఇక మనువు గురించి కైగట్టిన పాట బహుశా ఆ స్థాయిలో ఎవరు రాయరనే భరోసా ఉంది. మనువుకు తొడగొట్టి సవాల్‌ విసిరి మెడలొంచుతా ప్రతిజ్ఞ చేసిన మూలవాసి వారసత్వ కీర్తి కిరీటం అతడు. 

కొండీలు ఎక్కించి రగరగ రగిలే మనువుగాని మిండెన్ని నేనే అని ప్రకటించుకున్నాడు. చాతుర్వర్ణ వ్యవస్థను తులనాడుతూ నిరసించి వేల టన్నుల విశ్వాసాన్ని నింపుతాడు. మనువా నువు మల్ల జన్మెత్తురా నా మాదిగ శక్తి చూపెడుతా అని ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తాడు.
మట్టి బొమ్మకు ప్రాణం పోస్తవట. తలరాత రాస్తవట. అవ్వయ్య లేకుంట అట్లెట్ల పుడుతరు? మడిగుడ్ల నా కొడుక మెడబట్టి కొరికేస్త కరాఖండిగా చెప్పుతడు. చిన్న చిన్న ఉదాహరణతో పటిష్టమైన భావాన్ని స్ఫురింప జేస్తాడు.

మనువా నువ్వు మ్ల జన్మెత్తురా - నామాదిగ శక్తేందో సూపిత్తరా
మట్టి బొమ్మలకు జీవం పోస్తవట - పుట్టి గిట్టే తలా రాత రాస్తవంట
అవ్వయ్య లేకుంటు అట్టెట్ల పుడుతరు 
మడిగుడ్ల నాకొడుక మెడబట్టి కొరికేస్త ॥మనువా॥
1. రాయిరాయి రప్ప రాసుకున్నపుడే నిప్పు పుడుతుందన్న నిజం తెలువాదారా
చేయిచేయికి తగులుకున్నపుడే చప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా
మనసు మనసు ఏకమై కుసుకుంటే కొత్త మనిషిపుట్టునని మర్మమెరుగావారా
తోడు ముట్టాకుంటే పుట్టుకే లేదనే జాడ నెరుగవారా పాడు ముండాకొడుకా
బాపనోడెట్ల నోట్లేకేలి ఎట్ల పుట్టిండు వేదశాస్త్రాలను బట్టెట్ల పట్టిండు  ॥మనువా॥

ఎర్ర ఉపాళిని మాదిగ కవిగానే గాకుండా ప్రకృతి ఆరాధకుడిగా భావించడానికి ఉపాళి పాటలే ఉదాహారణ. 
బి.సి గురించి: జంధ్యం వేసుకున్నంత మాత్రాన బీ.సీలు అగ్రవర్ణాలు కాదు గనుక బీసీల్లో కొన్ని కులాలు పౌరోహిత్యం చేస్తున్న వాళ్లు మిగతా వాళ్ల కంటే మేమే అత్యధికుమని విర్రవీగే వారిపట్ల కూడా సానుభూతి కల్గినవాడు ఎర్ర ఉపాళి. ఎందుకంటే ఒక కులానికి మరొక కులానికి విభజించి నిశ్చెన మెట్ల వ్యవస్థ నిర్మించింది మనువాదం అని గట్టి నమ్మకం.

చాకలి కులం:  రజక కులం అనేక రాష్ట్రాల్లో చాకలివారు ఎస్సీల్లో కొనసాగుతున్నారు. చాకలి వారి జీవితాన్ని చూసి చలించిన ఉపాళి తదాత్మ్యం పొంది రాసాడు.
ఊరు ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి మై బట్టను సేకరించి మల్లె పూవలే ఉతికి ఎవరి బట్టు వారికి పంచేస్తారు. పొద్దంతా పనిచేసి ఉదయం, సాయంత్రం సలి అన్నం పెట్టినా సూరునికి దండంబెట్టి ఇడిసిన బట్ట ముల్లెను మెడమీద పెట్టుకుని పోతుంటారు. చాకలి జీవితాన్ని తన పాటలో అత్యద్భుతంగా వ్యక్తీకరించిన విధం చూడండి.

పల్లెంత సుట్టాసుట్టి ప్రతి ఇల్లు తలుపుతట్టి, 
అమ్మ సాకాల్లోమంటూ ఆకిట్లో అడుగూ పెట్టి
సలి బువ్వ సంకన పెట్టి సూరునికి దండంబెట్టి, ॥గంజో నీళ్లో ॥ శ్రమను గుర్తించి  మైల బట్టను కాన్పు నీసు కౌసు రకరకాల దుర్గ అందాలు  బట్టను మల్లె పువ్వులాగా  ఉతికి  శుభ్రపరిచే చాకలి వారి జీవితాన్ని వివిధ అ కోణాల్లో ఆవిష్కరించిన వినూత్నంగా మనందరికీ సహానుభూతి కలిగించిన మహాకవి ఎర్రఉపాలి నేనే.

సర్వాయి పాపన్నగౌడ్‌: దళిత బహుజను పక్షపాతి. బలం లేన్లో బమైన గొంతుక. యుద్ధ వీరుడు. అనేక మోసాలకు, అవమానాలకు గురి అయిన వెనుకబడిన కులాలకు వెన్నుదన్నుగా నిలిచిన యోధానుయోధుడు. సర్వాయి పాపన్న గౌడ్‌. అధికారులు చేస్తున్న మోసాలు ఎండగట్టి తల్లితో వాదిస్తున్న క్రమాన్ని ఉపాళి చాలా స్వభావసిద్ధంగా చిత్రించాడు.

ఎంతైనా కన్న ప్రేమకదా! తల్లి - కొడుకు నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వులేకపోతే నేను జీవించలేనంటుంది తల్లి. కానీ పాపయ్య మాత్రం నమ్మకం కలిగించి ఊపిరి బిగపట్టి ఉడుము పట్టుతో ఉద్యమాన్ని నిర్మిస్తనని నేను ముందుకు పోతా అని అమ్మతో చెప్తున్నా వాదాన్ని వింటే నిజమే అనిపించక మానదు. అంటే సమాజంలోని స్వభావాని నిప్పుల తప్పెటగా మోగించిన నినాదం ఉపాళి పాట.
అమ్మా ఈ బతుకు బతుకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తనమ్మ
బానిస బంధాలు తెంచేదా - మన బహుజనులకూ ప్రేమా దెచ్చేదా
నిమ్న జాతుల్లోన జ్యోతినై వెలిగి చీకటీ లోకాన్ని చీల్చేదానమ్మా 

గొల్ల మాదిగకూల ఉన్న సంబంధం: గుర్రం జాషువా తల్లి మాదిగ. తండ్రి గొల్ల. గొల్లోల్లకు మాదిగలకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ... ఈ రెండు కులాల మాట మీద నివడే క్షణాలు ఉదహరిస్తాడు. అట్లే మాదిగ డప్పుకూ, గొల్లోల్ల డోలుకు ఉన్న సంబంధం తోలుకు డోలుకు రక్త సంబంధం మున్నదంటాడు.

‘‘ఆది గొల్ల కుర్మవాన్ని - మాది గొల్లపోరగాన్ని’’ ॥ఆది గొల్ల ॥ అని పాడుతాడు.

కోయ గురించి: ఎస్సీ ఎస్టీలకు వృత్తులను వివరిస్తూ అందులోని సౌందర్యాత్మకతను అత్యున్నతస్థాయి కల్పించి వ్యక్తీకరిస్తాడు. కోయలు, ఎరుకలి వారు చెప్పే ఎరుకను గురించి వివరిస్తూ రాసిన పాటను మన మనసుల్లో ప్రతిబింబిస్తాడు. జరిగింది. జరగబోయేది. చెప్పుతం అని పాటయి పాడుతాడు. 
ఎరుక చెప్పుతమమ్మ ఎరుక ॥2॥
ఈ లోకాన మీకేమి ఎరుకో ఎరుకా - జరిగింది చెప్పుతం. జరిగేది చెప్పుతం ॥ఎరుక॥అంటూ ఎరుకలి అస్తిత్వాన్ని వివరిస్తాడు.

మాదిగ ఉపకులాల గురించి: 

ఈ దేశ మూల పురుషుడు ఆది జాంబవుని వారసు మాదిగలు. మాదిగలు ప్రత్యామ్నాయ సంస్కృతి పోషకలు. మాదిగలు తమ పితరుడైన ఆది జాంబవంతుని చరిత్రను తెలియజెప్పడానికి చిందోల్లతో చిందు జాంబవ బాగోతం (యక్షగానం).గోసంగులతో గోసంగి వేషం ద్వారా జాంబవంతుని చరిత్ర. మాష్టిలతో కథాగానం, డక్కలి వారితో పటం. నులక చందయ్యతో ప్రవచనం ఆయా ఉపకులాలకు త్యాగం ఇవ్వడం ద్వారా నిష్టగా చెప్పించుకుంటారు. 

చిందోళ్ల గురించి : 
జాంబవ తత్వం దృశ్య కావ్యంగా ప్రదర్శించే చిందోల్ల బాధలు విన్న, చూసిన ఉపాళి విషాదంగా విపిస్తాడు. కడుపు నిండా తిండి ఉండకున్నా ఆకలితో అమటిస్తున్నా వేషం కట్టి రాజులాగా, విదూషకునిలాగా ఆనందం పంచినా ఆకలిఛాయలు ఎక్కడా కనిపించనివ్వరనీ...
రంగు మాటున దాగిన చిందులూ -కన్నీళ్లనీ తాగే కనువిందులూ
అతుకుల బతుకుల చింతలూ - ఆకలి తీరని గొంతులూ అంటూ చిందోల్ల బతుకు గాయాలను గేయాలై వివరిస్తాడు. 
డక్కల్లోల్ల గురించి: మాదిగలకంటే ముందు చదివారు. వ్యాఖ్యానించారు. వీరు బూతవైద్యం, చెట్లవైద్యం చేస్తారు. మాదిగలకు వీళ్లు అంటరాని వారిగా కొనసాగినా జాంబవంతుని చరిత్రను పటం ద్వారా వారి బాధని పలికిస్తూ. ‘‘డక్కల్లోమయ్యమేమూ డక్కల్లోల్లమూ `
దిక్కు మొక్కులేక బక్క చిక్కిన్లోం॥ఆది॥  అంటాడు.
మాదిగ అమర వీరుల గురించి: భరతఖండే, భరతవర్షే,జంబుద్వీపే,..అంటూ వేదమంత్రాలు చదివే బ్రాహ్మణుల కంటే ఈ దేశపు మూలవాసులలు మాదిగలు. చీమకు కూడా హాని చెయ్యని జాతి మాదిగ జాతి. తరతరాలుగా అణచివేతకు గురి అవుతూనే ఉన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్ల సంవత్సరాలు గడిచినా మాదిగలపట్ల ఏమాత్రం కనికరం చూపలేదు. ఎస్సీ రిజర్వేషన్ల పేరిట మోసపోతున్న మాదిగలు తొంభై దశకంలో సంఘటితమయ్యారు. తమ హక్కుల కోసం మాదిగ దండోరా ఉద్యమం ప్రారంభించారు. ఆ క్రమంలో మా చేతిలో, ఉద్యమాన్ని రగిలించటం కోసం మాదిగ బిడ్దలు అనేకం చనిపోయారు. వారిని స్మరిస్తూ ఉపాళి రాసిన పాట.
మాదిగ మహా వీరులారా! ఆది జాంబవుని వారసులారా! ` అుపెరుగని వీరులారా! అసువులు బాసిన అమరులారా!
  తూర్పున పొడిసేటి పొద్ద్లు మెగులో బిడ్డలో.... 
మార్పు కై నడిసేటి ఉద్యమబాటలో బిడ్డలో
1. జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు 
హక్కు ఆయుధాన్ని నూరి దిక్కుదుర ఉరిమినారు 
విప్లవకాయిగా మారి విజయకేతనం ఎగరేసినారు ` ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో....
జాతిగతి మారుతుందని చాటినారా బిడ్డలో.... అని వపోత గీతం పాడతాడు. మనల్ని దు:ఖ సాగరంలో నింపి ఉద్యమానికి పురిక్పొుతూ నవనవలాడేలా అమరుల స్ఫూర్తిని కర్తవ్య బోధ చేస్తాడు. 

ప్రకృతి కవి: ఉపాళి నింగి నేల నీరు నిప్పు గాలితో నిర్మితమైన సమస్త ప్రకృతిని ఆరాధించే ప్రకృతి కవి. వీరు దర్శించే ప్రకృతి దళిత బహుజనులకు బ్రాహ్మనులకు ఉన్న తేడాను పశు పక్షుల్లో తేడానే ప్రతిబింబిస్తాడు. కాకి గురించి రాసిన వారు తెలుగు సాహిత్యంలో రాసిన వారు తక్కువ. జాషువా గబ్బిం గురించి రాస్తే ఉపాళి కాకి గురించి రాసిన పాటనను ఎదకు అద్దుకోవాల్సిందే. 

కాకి గొప్పతనం:
గుర్రం జాషువ గబ్బిలాన్ని ఉపయోగిస్తే ఉపాళి కాకి తత్త్వాన్ని ప్రతీక వాడాడు. కాకిని అపశకునపు పక్షిగా చూపుతుంటే ఉపాళి మాత్రం ఉన్నతీకరించాడు. మిమ చూసే చూపును బట్టి దృష్టి కనవడుతుందనే విషయాన్ని స్ఫురణకొస్తుంది. మామిండ్ల రామాగౌడ్‌ తర్వాత అంత అత్యున్నతంగా రాసిన గేయకవి ఉపాళినే చెప్పుకోవాలి. 
కాకి కావు కావు కావు అని అరుస్తూ ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అని వైరాగ్యాన్ని తెలియజేస్తుంది. చచ్చిన తర్వాత పితరులకుపెట్టే పిండా కూడును ఆరగిస్తూ పితరులను తలపిస్తుంది.
అందరు కవులు చాలావరకు వెన్నెలని కీర్తిస్తుంటారు. వెన్నెలలో ఊరేగుతున్నారు. జాబిల్లిలో ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ ఉంటారు. అందుకు భిన్నమైన కవి ఉపాళీ వెన్నెలకే జోల పాడుతా అని అంటాడు. సమస్త జీవజాతికి ఆనందాన్నిచ్చిన వెన్నెలకు హాయినిస్తాన జోల పాడుతున్న పాటను ఉంటే మనకే అర్థమవుతుంది. 
నింగిని నిట్టాడుగా చేసి మబ్బును తొట్టె కోసి `
నింగిని తాడుగా కట్టి మహారాణిలా నిన్ను కూర్చోబెట్టి 
అమ్మయి లాలించి పాలించి పసి పాపగా నిన్ను చేసి 
నిన్ను కొట్టుకుంటా ఊపుతో రావే ` ఓ వెన్నల ఊపిరిని ఉయ్యాల గట్టి  నిన్ను అలా మబ్బుల్లో ’’ అని వెన్నెలను కీర్తిస్తాడు. మనకూ సహానుభూతిని కల్గిస్తాడు. 

అక్షరాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్న కవి ఉపాళి. అక్షరం ఆయుధం. అక్షరం జీవం. ప్రాణం. దేహం. సమరం. అమరం. అక్షరాలు చదివి ఈ దేశముఖ చిత్రాన్ని మార్చిన మహాత్మ ఫూలే, అంబేద్కర్‌ గురించి తెలుసు కాబట్టి అక్షరం రాయకుండా ఉండలేకపోయాడు. అక్షరంపై అవగాహన కల్గించడానికి ప్రజా కవి చెప్పిన మాటలు

‘‘అక్షరమా మా ఆయుధమా. అక్షరమా అక్షరమా 
మా నినుగన్న మనిషికి రక్షణ ` నువ్వే లేని జగతి ప్రగతిని ఊహించగమా’’అంటూ అక్షరాల్ని కొనియాడారు. ప్రపంచంలో ఉన్న అతిసమర్థవంతమైన ఆయుధం విద్య అన్న మండేలా మాటు గుర్తుకు తెస్తాడు. ఇంకా పక్షంలో ఉన్న శక్తిని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మివ మనకు ఈ పాటలో తెలియజేస్తుంటారు.

ఆర్యుల రాక ముందు ఈ దేశంలో మాతృస్వామ్యం ఫరిఢవిల్లింది. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలను అబలాగా  జమకట్టినా వారి స్థానం మహోన్నతమైంది. మహాకవి ఆరుద్ర అన్నట్లు ‘‘చేతులెత్తి మొక్కుతాను, శిరసొంచి నమస్కరిస్తాను. మానవ జాతి అంతరించబోదనీ, మౌనంగా హామీ ఇస్తుంది. ప్రతి గర్భవతి’’ అని కొనియాడుతాడు. అలాగే తన తల్లి గురించి, మాతృత్వం గురించి మహోన్నతంగా కీర్తించి తన జన్మను సార్థకత చేసుకున్న కవిగా నిలిచిపోతాడు. 

‘‘అమ్మ నన్ను కన్నా రుణం తీరేదెలమ్మ - భూదేవి కన్నా గొప్పగుణం నీదేనమ్మా
బ్రహ్మనే కన్న కమ్మని పిలుపు అమ్మవైనావు
బ్రహ్మకి మరో జన్మవైనావు నాలోని మరో జీవాత్మ వైనావు’’అంటూ అమ్మను అంతేగాకుండా పుట్టినప్పటి నుండి స్నానం చేసిన తర్వాత పిల్లాలకు వేసే ఎన్నో చేసి మరి ఇంత వరకు కాపాడిన రుణాన్ని ఉంటాడు. దళిత తల్లులు తమ ప్లి గాలి, ధూళీ, సందు తగకుండా తీసుకునే జాగ్రత్తు సేవన్నింటిని కొనియాడుతుంటాడు.


విద్యార్థుల్ని రాసిన పాట నిజంగా మేల్కొల్పే పటలో కనపడుతుంది. ఉంటుంది. మేుకో విద్యార్ధి! మేుకోరా మబ్బు నుండి జాబిలి పిల్లలవై తేరుకోరా ॥మేలుకో॥ అంటూ భవిష్యత్తును నిర్మించేది నువ్వేనని బాధ్యతలు గుర్తుజేస్తాడు.

ఒకొప్పడు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాళ్లు రాజకీయనాయకులు. కానీ అందినంత దోచుకుంటూ ఉన్న నేటి నేతని కడిగి పారేస్తున్నాడు. లీడరూ! నీ క్యాడరూ నీ చేష్టను చూస్తూంటే క్యాడరు కాటగలుపుతోందంటూ హెచ్చరిక జారీ చేసాడు.

తెలుసుకో లీడరు మేలుకుంది క్యాడరూ - ఓట్ల కోసం ఓట్లు ఒట్లు తింటరు  ॥తెలుసుకో ॥ అని నేటి పరిస్థితిని ప్రపంచ బ్యాంక్‌ వద్ద తాకట్టు పెడుతున్న బతకును, లేనిది ఉన్నట్టు చూపే మాయజాలంగా మారిపోయింది ప్రస్తుత రాజకీయం. ఆశ్రితజన పక్షపాతం పెచ్చుమీరి  కమీషన్లకు అమ్ముడుపోయి దొంగలతో దోస్తీచేసి ఆర్థిక వ్యవస్థను, ఓటర్లను బతుకు బొమ్మను చేసి ఆడిస్తున్నారనీ మనసు తెరమీద దృశ్యీకరణగా చూపుతుంటాడు. 

తెలంగాణ అంటే ఉద్యమాల పుట్ట. ఆకలిని రంగరిస్తూ ఆలపించిన గీతం గతంకాదు వర్తమానం. కాలం నెత్తిన కాగడా నిలిపి తన కాంక్షల్ని నిలిపి పోరుజండా. తెలంగాణ బాధల్ని తాను అనుభవించి రాసిన పాట. వలపోత గీతంతో దు:ఖపు వలవిసిరుతుంటాడు.

తెలంగాణ తల్లి తల్లడిల్లిందో - ఎళ్ళిపోతున్నాని అని గొల్లుమంటుందో 
బాధల్లో నా బతుకు బందాయెనని - ఈదలేక ఇంత రందాయెనని అని తెలంగాణ గోసను విలపిస్తాడు. 
మాదిగలకు వృత్తి చిహ్నాలను లందకు సౌందర్యాత్మకతను జోడిoచి వినసొంపుగా పాడుతాడు. ఏ పాటరాసినా సహజసుందరంగా తీర్చిదిద్దుతాడు. మాదిగతత్వాన్ని భుజానికెత్తుకున్నంత పటిష్టంగా మాల కవులను తదాల్చుతాడు. కలేకూరి ప్రసాద్‌ని స్మరిస్తాడు. మద్దూరిను కొనియాడుతాడు. మాదిగతత్వమంటే మహజన తత్త్వం. బహుజన తత్త్వం. నిరూపించడానికి పాటను ఆయుధంగా సాయుధంగా మలచిన వాడు. మెప్పించి ఒప్పించిన బహుజనకళా తపస్వి ఎర్ర ఉపాళిగారు. ఏ పాటరాసినా కవిత్వం రాసినా సౌందర్యాత్మకంగా, స్వభావ సిద్ధంగా, ఉపమానాలతో ఉజ్జీవింపజేస్తాడు. వినే శ్రోతల్లో ప్రేక్షకుల్లో నిజమేనన్న భావాన్ని కల్గిస్తాడు. రంజింపజేసినంత సుళువుగా కర్తవ్య బోధజేసి పురికొల్పుతాడు. కానీ వారి చదువు అంతంత మాత్రమే అయినా పండితులను ఆలోచింపజేస్తాయి. జ్ఞానులకే అంతుపట్టని పదసంపద. పట్టున్న పదాడంబరం. పదబంధాల ప్రతీకలు. సాహిత్యంలో ఎర్ర ఉపాళిగారు నెలకొల్పిన అత్యున్నత పతాక.

పాటను నమ్ముకొని జీవించాడు. విప్లవోద్యమంలో మిళితమయ్యాడు. దళితోద్యమాని తన పాటతో హుషారెత్తించాడు. కులంకుతికెల మంటి సముద్రం మోకాలు మంటి అని నమ్మి జీవితపర్యంతం వరకు కొనసాగిన అంబేద్కర్‌ బహుజన పాటతను.  ఆత్మస్థైర్యాన్ని నింపి ఆత్మగౌరవానికి చిరునామాగా నిలిచిన వారిపాటు నడిచేకాలమ్మీద చెరుగని ప్రజాజీవిత సంతకం.
 
తన సాహిత్యానికి సాష్టాంగపడే సినిమాను తలదన్ని తలరాత మార్చుకోని నిరుపేద. తనగురించి చెప్పుకున్నట్లు తను కటికి దారిద్య్రం అనుభవించినా,  ఆకలిపేగులకు ఉరులేసి, కన్నీళ్లను దిగమింగినా కలకాలం పాటై బతికేవాడు. చనిపోయే నాటికికూడా ఇల్లులేనివాడు. ధనబలంలేదు. తానే చెప్పుకున్నట్లు కాకిబలగం కలవాడు. ఏమీ సంపాదించుకోకుండా తనపాటతో సమస్త జనసమూహాన్ని సంపాదించుకొన్నవాడు. 
గడియకోగండంగా బతుకుతూ తనువు చాలించినా తరాతరాత మారాలని కలలు కన్న ద్రష్ట, స్రష్ట. పాటల్లో ప్రజాజీవితాన్ని ఒలికించి, బాధల్ని పలికించిన వాడు. పాటై బతికినవాడు. పల్లవిగా జీవించగలవాడు. 
వేమన పద్యంలా నిలిచేపాట ఉపాళిది. మనువు వారసుల మూకదాడులు జరిపినా, అల్లర్లు లేపిన పోరుమంత్రంగా స్మరించేపాట మనువా మల్ల జన్మెత్తురా పోరు మంత్రంలా పనిచేస్తూనే ఉంటది. కొన్ని పాటలకు  చరిత్రలో చావులేనట్లే చావులేని పాటలు సృష్టించి ఉపాళిని పాటసాహిత్యం ఉన్నంత వరకు తెలుగు సాహిత్యంలో అజరామారంగా జీవిస్తూనే ఉంటాడు.
అనేక పాటకవులకు స్ఫూర్తి.  గుర్రం జాషువా నుడివినట్లు కవియు మరణించే నొకతార గగనమెక్కే అని చెప్పినట్లు బహుజన గుండెగూడాల్లో ఎప్పటికీ కొలువై నిలిచివుండే పాటలఖజానా. పోరు పాటచిరునామా ఎర్ర ఉపాళి నేనే.


ఈ వ్యాసం 2019 లో తెలుగెత్తి జై కొట్టు నవతెలంగాణ పబ్లిషింగ్ పుస్తకంలో ప్రచురితం.

  - డా. సిద్దెంకి యాదగిరి 
9441244773 
sygiri773@gmail.com
జంబూ సాహితీ 

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...