సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

అభ్యుదయ కవిత్వోద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అభ్యుదయ కవిత్వోద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మార్చి 2022, గురువారం

నూతనత్వం అభ్యుదయ కవిత్వోద్యమమం

నూతనత్వం అభ్యుదయ కవిత్వోద్యమమం

మనిషిని మనిషిగా చూడాలనే దృక్పథాన్ని కలగజేసిన అక్షరోద్యమం.  సామాన్య మానవునికి సాహిత్య గౌరవం కల్పించిన వేదం అభ్యుదయవాదం. అభ్యుదయం అనే పదమునకు మంగళము, శుభము, పురోగమనం, ప్రగతి, ఆంగ్లంలో progress అని అర్థాలు కలవు.

   తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల మైన మార్పునకు ప్రధాన లక్షణంగా అభ్యుదయ కవిత్వం అవతరించింది.

 అంతర్జాతీయంగా అభ్యుదయ కవిత్వం రాకముందే ఆ స్ఫూర్తిని పొందిన  కవులు తెలుగు సాహిత్యంలో ఉన్నారు.

 తెలుగులో 1935కి ముందే అభ్యుదయ ఛాయలు కనబడతాయి. శ్రీశ్రీ రాసిన తొలి గేయం విద్యున్మాలికలు 1933లో రాశాడు. 

నేను సైతం ప్రపంచాగ్నికి, 
ప్రపంచానికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం భువన భవనపు 
పైకి లేస్తాను. అని తన జయాబేరి కవిత ద్వారం 1933 లో శ్రీశ్రీ  తన ప్రాపంచిక దృక్పథాన్ని సామాజిక బాధ్యతను ప్రచుర పరిచాడు.

1934లో ఎన్ జి రంగ సంపాదకత్వంలో ‘రైతు భజనావళి’ గీతాలు ప్రచురించబడ్డాయి.

  1934లో తొలి రైతు గీతం గిరిరాజ్ రామారావు, శెట్టిపల్లి వెంకటరత్నం ఇరువురు కలిసి తొలి రైతు గీతం రచించారు.

“ఆగునా జీవాలు - సాగునా లోకాలు, రాజుగా మన మెంచి రైతు చూడకపోతే
దేశాలు తలెత్తుతునా - దాస్యపు ప్రాణాలు తానీడునా?” అని ఎలుగెత్తి  పాడినారు.
1935లో ‘ప్రభ’ సంకలనంలో తొలి ఎర్ర జెండా గీతం ప్రచురించబడింది. ప్రభ సంపాదకుడు గద్దె లింగయ్య గారు.

 1938లో క్రాంతి గీతాల సంకలనం కూడా వెలువరించారు.

1936 - 37 లో పెండ్యాల లోకనాథం గుంటూరు వారు తొలి కార్మిక గీతాన్ని అందించారు. 

అందులో 
“కూలీలందరు ఏకమైతే కూటికి తరుగేమిరా, 
కూలి వాళ్లలోనే బలిమి కాలమందు నుండె రా
కూలి వాళ్ళ మైన మనకు కులములు ఎందుకు తెలుపరా, 
కూలి వాళ్ల మైన మనము కలిసి ఉందాం సోదరా అని ఎలుగెత్తి పాడాడు. 

1938వ సంవత్సరంలో శిష్ట్లా ఉమామహేశ్వరరావు "నవమి చిలక", *విష్ణు ధనువు"ను ప్రచురించారు.

అంతర్జాతీయంగా వివిధ పరిణామాలు:
1905లో రష్యా పెట్టుబడిదారి విధానంపై తిరుగుబాటు చేసింది.

 1917లో పెట్టుబడి శక్తులను పడగొట్టి సోషలిస్టు విప్లవం సోషలిస్టు వ్యవస్థ కు పునాది వేశారు. 

1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆర్.ఎస్.సుదర్శనం మాటల్లో చెప్పాలంటే మానవతా సామ్య లౌకికవాద ప్రభావాన్ని కారణమైన అభ్యుదయ సాహిత్యోద్యమం తెలుగునాట విజృంభించ డానికి అంతర్జాతీయ స్థాయి నేపథ్యం ఉంది. 

1929 - 35 మధ్యకాలంలో 14 దేశాల్లో సోషలిస్టు వ్యవస్థ అవతరించింది.

 1930 ఆకలి దశాబ్దంగా ఆకలి బాధను తెలియజేసింది. 
1934లోజర్మనీ – హిట్లర్, 
ఇటలీలో ముస్సోలిని, 
జపాన్లో  - టు జో. మొదలగు నియంతలు అధికారంలోకి వచ్చారు. ఆయా దేశాల్లో ప్రాంతాల్లో వీటి మీద చేసిన తిరుగుబాటు అభ్యుదయానికి బీజాలు వేసింది. అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాక్సిం గోర్కీ ఆధ్వర్యంలో ’అంతర్జాతీయ పరిరక్షణ సదస్సు జరిగింది. అదే సమయంలో కళ కళ కోసమే అనే నినాదాన్ని ఆస్కార్ వైల్డ్ ఇవ్వడం జరిగింది. వివిధ దేశాలకు చెందిన రచయితలు హాజరయ్యారు భారతదేశం నుంచి చదవడానికి వెళ్లిన విద్యార్థులు లండన్ నుంచి పారీస్ నగరానికి వచ్చి ఈ సమావేశంలో హాజరయ్యారు. వారిలో సజ్జద్, ముల్కరాజ్ ఆనంద్, కెఎస్ భట్ మొదలగువారు ఉన్నారు.

1936లో భారత అభ్యుదయ రచయితల ప్రణాళిక రూపొందించుకున్నారు. 

1936 ఫిబ్రవరిలో ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురించారు. 9, 10 ఏప్రిల్ 1936  లక్నో నగరంలో అఖిల భారత రచయితల మహాసభలు మున్షి ప్రేమ్ చంద్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ స్ఫూర్తిని గైకొన్న తెలుగు కవులు ఆంధ్ర వర్తమాన లౌకిక సంఘం వారి ప్రోత్సాహంతో తెనాలిలో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తాపీ ధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ సంఘం ఏర్పడింది. తొలుత ఈ సదస్సులో శ్రీ శ్రీ లేడు.


అభ్యుదయ కవిత్వం నిర్వచనాలు:

‘అభ్యుదయ రచన సమకాలికమైన జీవిత పరిస్థితులకు రాజకీయ వాతావరణానికి ఆర్థిక సమస్యలకు సమాజ సంఘర్షణలకు నైతిక సందర్భాలకు వైజ్ఞానిక
 విశేషాలకు అనుగుణంగా అనుకూలంగా తగ్గినట్టే అవసరమైన మార్పులతో విలసిల్లాలని’ అభ్యుదయ కవిత్వం అభ్యుదయ పత్రిక మార్చి 1947,37 పుటలో పీవీ రాజమన్నారు అన్నాడు.

పీడించ పడేవాళ్ళు, పీడించే వాళ్లు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరుకోరు రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుట ధారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటించే వారు ఎప్పుడు అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలి అనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకుని వ్రాసేది అభ్యుదయ రచన’అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తృతీయ అభ్యుదయ రచయితల మహాసభ అధ్యక్షోపన్యాసం చేశారు.

‘తెలుగు సాహిత్యంలో అసలైన అభ్యుదయ భావనకు అంకురార్పణ చేసింది ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగులో అభ్యుదయ సాహిత్యం నిజానికి కవిత్వం తో మొదలు కాలేదు. నవలతో మొదలైంది’ అని రామకోటిశాస్త్రి పేర్కొన్నారు.

అభ్యుదయ రచయితలు తెచ్చిన విప్లవం రసావిష్కరణకు రసాస్వాదనకు సంబంధించినది. సాహిత్యం ఒక భోగ వస్తువుగా పరిగణించే వీరు తిరగబడుతున్నారు. నేటి రచయితలకు ప్రజలే ప్రమాణం.  కొన్ని కారణాల వల్ల సాహిత్యానికి దూరమైపోయిన ప్రజల జీవితాలను మళ్లీ నీ సారస్వతోన్ముఖంగా తిప్పటానికి నేటి రచయితలు పాటు పడుతున్నారని శ్రీ శ్రీ ‘తెలుగు తల్లి’ 1946 మార్చి పత్రికలో ‘అభ్యుదయ రచయిత- విప్లవ దృష్టి’ అనే వ్యాసంలో పేర్కొన్నారు.
చైతన్యమే పర్యవసానంగా కలది అభ్యుదయ సాహిత్యం అని వెల్చేరు నారాయణ రావు గారు నిర్వచించారు.

అభ్యుదయ కవిత్వ లక్షణాలు:

1. మానవ అభ్యుదయాన్ని కాంక్షించాలి. 2. ఆర్థిక అసమానతలు తొలగించి సామ్యవాద సమాజ స్థాపన కోసం
3. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడం 
4. సమసమాజ స్థాపన 
5. వర్ణ వర్గ రహితమైన సమాజ స్థాపన 
6. శ్రమదోపిడి లేని సమాజం కోసం 
7. మిగులు విలువ పంపిణి 
8. దేశ పారిశ్రామికీకరణ
9 నవ సమాజ నిర్మాణం కోసం 
10. వ్యక్తి చైతన్యాన్ని సంఘ చైతన్యంగా వర్తింపజేయడం అనే లక్షణాలు అభ్యుదయ కవితా లక్షణాలు నిర్ధారించారు.

అభ్యుదయ కవిత్వం విస్తరించి ఉన్న కాలంలో అభ్యుదయవాదినని చెప్పుకోవడం ఫ్యాషన్ అయింది అని కాంచనపల్లి చిన వెంకట రామారావు గారు పేర్కొన్నారు.

అభ్యుదయ రచయితల సంఘం తొలి సభ 1943 ఫిబ్రవరి 13 14 లో జరిగాయి.
రెండవ సభ 1944 తెలికచెర్ల వెంకటరత్నం అధ్యక్షులు, మూడో సభ 1945-46 దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన జరిగింది. 
 1947లో మద్రాసులో జరిగింది .
1955 బెజవాడలో శ్రీశ్రీ అధ్యక్షత.  1974లో ఒంగోలులో చాగంటి సోమయాజులు అధ్యక్షతన అరసం సభలు జరిగాయి.

 అభ్యుదయ కవిత్వంలో వస్తున్న ధోరణిని సినారె ఏడు రకాలుగా వర్గీకరించాడు.
1. వర్గ సంఘర్షణ
2. విప్లవ 
3. వీరగాధ కథలు 
4. యుద్ధ విముఖత 
5. సమాజ నిర్మాణం
6. తెలంగాణ విముక్తి 
7. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం

అభ్యుదయ కవిత్వానికి తోడ్పడిన పత్రికలు: 
వార్త యందు జగము వర్ధిల్లుచున్నది అని నన్నయ్య గారన్నట్లు అభ్యుదయ సాహిత్యానికి వాహకంగా నిలిచిన పత్రికలూ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 

అభ్యుదయ – (1958- 69నవ్య సాహిత్య పరిషత్తు) 
తెలుగుతల్లి - రాచమల్ల సత్యవతీదేవి, జ్వాల - ముద్దు కృష్ణ, 
ఉదయిని - కొంపెల్ల జనార్ధనరావు (శ్రీ శ్రీ మహాప్రస్థానం అంకితం ఇవ్వబడినది వీరికే), 
కాగడా – తాపీధర్మారావు, 
వీణ - పాటిబండ్ల మాధవి శర్మ
తెనుగు - వద్దిరాజు సోదరులు మొదలైన పత్రికలు ఎంతగానో అభ్యుదయ కవిత్వం వ్యాప్తిలో భావజాల ప్రచురణలో తోడ్పడ్డాయి.

వచన కవితకు ఆద్యుడుగా పేర్కొనదగిన కవి శిష్ట్లా ఉమామహేశ్వరరావు. తన (వచన) కవిత్వాన్నిప్రహ్లాద కవిత్వాన్ని ప్రహ్లాద కవిత్వం అన్నాడు.  ప్రహ్లాద కవిత్వంలో ఆరిపోయే దీపాన్ని రగులుతోంది పరిగెత్తే పామరుడిని నిలుస్తుంది.', 'నూతనమలో బహు నూతన కవిత్వం' అని నవమి చిలుక ముందుమాటలో పేర్కొన్నాడు. నవమి చిలుక 1938లో గ్రామీణ జీవిత నేపథ్యంగా, విష్ణుధనువు ప్రేమతో నిండిన కావ్యం. ఉమామహేశ్వరరావు నుద్దేశించి సినారె భావ కవిత్వం పై తిరుగుబాటు చేసేనే కానీ, కొత్త బాట వేయలేదని ఒప్పుకోక తప్పదు అని అన్నారు.

తొలి అభ్యుదయ కవితా సంకలనం ‘నయాగరా’ 1944లో ప్రచురించబడింది.  బెల్లంకొండ రామదాసు కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం నయాగరా సంకలనం తీసుకువచ్చారు. వీరే నయాగరా కవులుగా చెలామణి అయ్యారు. నయాగర కవితా సంకలనాన్ని అనిశెట్టి సుబ్బారావుకు అంకితమిచ్చారు. నువ్వు చేసిన మన్యం విప్లవం దేశానికి మార్గదర్శనం అని అల్లూరి గురించి రాసుకున్నారు.

తొలి వచన కావ్యం, వచన కవిత్వ సంపుటి 'నవమి చిలక'(1938). అభ్యుదయ కవిత్వంలో తొలి సంకలనం  ‘నయాగరా’. తొలి అభ్యుదయ కవితా సంపుటి శ్రీ శ్రీ ‘మహా ప్రస్థానం’ 1950లో ప్రచురితమైంది. కొంపల్లి జనార్ధన రావు గారికి అంకితం ఇవ్వబడింది.  ముందుమాట రాసింది చలం. 
నయాగరా కవులలో ఒకరైన బెల్లంకొండ రామదాసు –‘బ్రతికే క్రాస్, మనిషి ఒక క్రైస్ట్’ అని అన్నారు.

వచన కవితా పితామహునిగా బిరుదు గాంచిన కుందుర్తి ఆంజనేయులు గారు తెలంగాణ (18 పర్వాలు) నాలో నినాదాలు, నగరంలో వాన, హంస ఎగిరిపోయింది. మొదలైన కావ్యాలు రాశాడు. వారి కవిత పంక్తులు కొన్ని
“నా గీతం, నర జాతి విముక్తి సంగీతం.”
“ప్రయోజనం తండ్రిగా పరమ సౌందర్యం తల్లిగా పలికే ప్రతి పలుకు రసానంద కల్పవల్లి.”
“ఒక మనిషి నిద్ర లేచి, లక్ష మందిని నిద్ర లేపుతాడు”
“ఇది నా కవిత్వం, వినేవాడు నరుడు, చదువుసంధ్యలు రానివాడు పామరుడు” అని అన్నాడు.

1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది తర్వాత నేను తెలుగు సాహిత్యాన్ని నడిపించానని శ్రీ శ్రీ అన్నారు. అభ్యుధకవిత్వోద్యమాన్ని పతాక స్థాయికి తెసుకెల్లిన ఘనత వారికే దక్కుతుంది.  
స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం”
“నేనొక దుర్గం, నాదొక మార్గం, అనితర సాధ్యం నా మార్గం”
“మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం”
“నేను మంటల చేత మాట్లాడించి, రక్తం చేత రాగాలాపన చేస్తాను
“కదిలేది కదిలించేది, పాడేది ఆడించేది, పెనునిద్దుర వదిలించేదీ”
“అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం”
“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం
రంగం కానిచోటు భూస్థలమంతా వెదకిన దొరకదు.”

అనేకమైన అంశాలతో కొత్త పద్ధతుల్లో హస్త ప్రయోగం వస్తు నవ్యత శిల్ప చాతుర్యంతో శ్రీశ్రీ ఆకట్టుకున్నాడు.

శ్రీరంగం నారాయణ బాబు ‘సంఘర్షణ’, ‘ప్రవర’, ‘కదన కుతూహల రాగం’, మొదలైన కావ్యాలు వెలువరించారు. కదన కుతూహలం అనే కవితలో “రుధిర జ్యోతి జ్వలన లలన ప్రియుండ, విప్లవ రుషిని విద్రోహ కవిని” అని తన గురించి తాను పేర్కొన్నాడు.
“మరఫిరంగి మహతిగా మీటి, కదన కుతూహల రాగం వినిపిస్తాను” అని నారాయణ బాబు తన కవితా పంక్తుల ద్వారా అభ్యుదయాన్ని ప్రాచుర్యం కల్పించారు.

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి (పట్టాభి) ఫిడేలు రాగాలు డజన్, పఠాన్ పంచాంగం(1968), కైత నాదయిత 1978 మొదలైన కావ్యాలు రాశాడు.
అనుసరిస్తాను నవీన పంథా, కానీ భావ కవి కాన్నేనంహంబావ కవిని.”
“నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో, పద్యాల నడుములు విరుగ దంతాను, చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాలదండిస్తాను.” అని పట్టాభి తన కవితా పంక్తులు ద్వారా సంప్రదాయం మీద నిరసన తెలిపాడు. ఆస్కార్ వైల్డ్  కళ కొరకే కళ కళ కొరకే అని బలపరిచిన కవి పట్టాభి.

గుడిలోని దైవమా ఆలింపవోయి, గుడిలోని దైవమా పైకి రావోయి”
“మాల మెట్టిన నేల, మాల పెట్టిన సీమ,  మైళ పడినది.”- పురిపండా అప్పలస్వామి 

మానవ స్వాతంత్ర మాగ్నాకార్టాలైన,  రక్తాక్షరాలు వారాలు చేసేశాను”- తెన్నేటి సూరి

జన్మనెత్తిన మానవులకు జీవితమే పరమ ధనం, అయితే అది ఒక మారి అతనికి ఒసగబడిన ఒక వరం” పట్టాభి పేర్కొన్నారు. 

ఆవంత్స సోమసుందర్ రచనలు వజ్రాయుధం, ఊరు మారింది, వెన్నెలలో కోనసీమ, చీకటినీ ద్వేషిస్తాను మొదలైన పుస్తకాలు వెలువరించారు. 

అనిసెట్టి సుబ్బారావు ‘అగ్నివీణ’  ప్రచురించారు. 

నా కావ్యం ఒక కల్చర్ - నా కావ్యం ఒక సోల్జర్” -  రెంటాల గోపాలకృష్ణ
లెండి లెండి బానిసత్వపు నిద్ర నుండి,  మేల్కొనండి బానిసత్వపు నిద్ర”

“అధర్మము ప్రవర్తించిన చోట- అభ్యుదయ కవిగా అవతరింప” 

 'అదిగో అరుణ పతాకం. పేదవారికి ప్రాణం పీడిత ప్రజా కాదారం.'అని రెంటాల గోపాలకృష్ణ గలమెత్తాడు.  

కవిత కోసం నేను పుట్టాను. 
కాంతి కోసం కలం పట్టాను” అని ఆరుద్ర గారు అన్నారు. 

బోయి భీమన్న దీప సభ గుడిసెలు కాలిపోతున్నాయి. 

గజ్జెల మల్లారెడ్డి వజ్ర జిహ్వలో 
తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా వారుతుంది, 
డ్రైనేజీ స్కీం లేక డేంజర్ గా మారుతుంది” అని అన్నాడు. 

నేను కవిని, నేను రవిని, నా దేశ ప్రగతి రథం చోదకుడిని” అన్నది ఎల్లోరా.

కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అగ్నిశిఖలు – మంచు జడలు, 
సి విజయలక్ష్మి- త్రినేత్రం, 
సి.వి కృష్ణారావు- వైతరణి, మాది మీ ఊరే; 
శీలావి - కొడిగట్టిన సూర్యుడు, ముల్లెమ్మ, అద్దె గది, హృదయం దొరికింది; 
అద్దేపల్లి రామ్మోహన్ రావు - అంతర్జల. కె.వి.రమణారెడ్డి – అడవి, భువన ఘోష, స్టాలిన్ అస్తమయం, అంగార వల్లరి, రక్తాశ్రువులు, రణోణ్మాది; వీరు ప్రజాకవి సుంకర సత్యనారాయణకు ప్రజాకవికి బహిరంగ లేఖ' అను కవిత రాశారు.
 ఆలూరి బైరాగి రచనలు 'చీకటి నీడలు', 'నూతిలో గొంతుకలు'. నాక్కొంచెం నమ్మకమివ్వు అని పలికాడు. 

“జీవితం కరిగిపోయే మంచు. ఉన్నదాంట్లో నలుగురికి పంచు” అని అన్నది గోపాలచక్రవర్తి.
సినారె మంటలు మానవుడు అక్షరాల గవాక్షారాలు, విశ్వంభర, ప్రపంచ పదులు, నాగార్జునసాగర్. 
మొదలైన గ్రంథాల ద్వారా అభ్యుదయ సాహిత్యం పరివ్యాప్తమైంది. 

తెలంగాణలో అభ్యుదయ కవిత్వోద్యమం: ప్రపంచ వ్యాప్తంగా, సాహిత్యంలో వస్తున్న మార్పుల్ని, నిజాం నియంత్రణపై తిరుగబడుతున్న ప్రజల భావాలకు అద్దంపట్టే విధంగా తెలంగాణ కవులు కళలు ఎక్కుపెట్టారు. 
ఉర్దూలో ముఖ్దుమ్ మొహియుద్దీన్, దాశరథి- అగ్నిధార, రుద్రవీణ; 
కాలోజి నా గొడవ. మొదలైన రచనలు కలవు.
టేల్స్ ఆఫ్ తెలంగాణ అను గ్రంథాన్ని హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ రచించారు. 

 “నైజాము సర్కరూరా  ఓరన్నా నాజీల మించిందిరా, ప్రజారాజ్యానికి పోరాడు ప్రజలపై రాక్షస రకరకాలు చేస్తుంది” తిరునగరి రామాంజనేయులు పిలుపునిచ్చారు.

ఓ నిజాము పిశాచమా కానరాడు, 
నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, 
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు,
 నా తెలంగాణ కోటి రతనాల వీణ”
తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించెన్ కృపానం;
ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి 
మాగాణములను సృజియించి, ఎముకల్ నుసిసేసి పొలాలు దున్నిభో
షాణములు నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తె
లంగాణం రైతుదే ముసలి నక్క కు రాజరికము దక్కునే అని దాశరధి నిప్పులు కక్కారు.
 దాశరథి కృష్ణమాచార్యులు
సాహిత్యం ఉద్యమానికి ఊపిరిలూదింది. పోరాటానికి సయిరన్  అయింది. గడ్డిపోచలు కత్తులు పట్టాయి. ప్రతీకలతో పతాకస్థాయికి తీసుకుపోయిన సాహిత్యం అభ్యుదయ సాహిత్యం. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న సందర్భంలో అభ్యుదయ కవిత్వానికి ఆయువుపట్టు అయింది తత్ఫలితంగా చాలామంది కవులు తమ నిరసనను కవిత్వం వెలిబుచ్చారు ఆ కవిత చదివిన నిరసనకారులలో ఉత్తేజితమై ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు.
“చుట్టుముట్టు సూర్యపేట నట్టనడుమ నల్లగొండ, .... గొల్ల కొండ కింద కింద నీ ఘోరి కడతం కొడుకో
నైజాము సర్కరోడా అని రొమ్ము విరిసిన కవి రచయిత యాదగిరి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిక్షిప్తం చేసిన కవితా పంక్తులు చూద్దాం
ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడురా 
ఈ జులుం జబర్దస్త్ నెగుర తన్ని వేయరా
మేము తెలుగు వీరుడా రణము చేయలేము రా సుద్దాల హనుమంతు
ఆంగ్లంలో ‘టైల్స్ ఆఫ్ తెలంగాణ’ అను గ్రంథాన్ని హరిశ్చంద్ర చటోపాధ్యాయ రాశాడు. ఉర్దూలో ముఖ్ధుమ్ మొహియుద్దీన్. వచన కవితా పితామహుడు కుందుర్తి ‘తెలంగాణ’ కావ్యం రాశాడు. ఇది తెలంగాణలో తొలి వచన కావ్యం. తొలి తెలుగు విప్లవ కావ్యం పేరుగాంచింది. 

ఆరుద్ర ‘త్వమేవాహం’ పేరుతో తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు  లిఖించాడు. 

 సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి కలిసి ‘మా భూమి’ నాటకం ద్వారా తెలంగాణ పరిస్థితిని వివరించారు. దాశరథి అగ్నిధార, రుద్రవీణ; కాళోజి నా గొడవ. సోమసుందర్ వజ్రాయుధం, కె.వి.రమణారెడ్డి రెంటాల గోపాలకృష్ణ సర్పయగం, సంఘర్షణ ఎర్రోజు మాధవాచార్యులు, సుద్దాల హనుమంతు గారి పాటలు ఇవన్నీ అభ్యుదయ సాహిత్యానికి ఊపిరిలూదాయి.
“అది ఒక దయ్యాల మేడ, శిథిల సమాజాల నీడ పీనుగలను పీక్కు తినే, రాబందుల రాచవాడ
ఆద్యంతము అంతులేని అరిష్టాల మహా పీడ” అని ఉర్దూలో ముఖ్దుం మోహియొద్దీన్ తన నిరసనను తెలియజేశాడు.

“కైత చేత మేల్కొల్ప కున్న కాళోజి కాయము చాలింక” - కాళోజి – ‘నా గొడవ’పేర్కొన్నారు.

“ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభావింతురు, ఒక నెత్తుటి బొట్టు లోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు”-ఆవంత్స సోమసుందర్

“కవిత కోసమే పుట్టాను. కాంతికోసమే కాలము పట్టాను.”, “ఇది నాగలి ఇది దాగలి, ఇదే పునాది,  సైతాన్ కి ఇదే సమాధి” – ఆరుద్ర అన్నారు. 

“మంచివాని కంఠం కంచయిమొగాలి. మంచివాని కష్టం కనకమయి మొగలి.” అని వరవర రావు నినదించాడు. వీరి రచనలు చలినెగళ్ళు, జీవనాడి. 

మనిషి తన అనుభూతి లోంచి చైతన్యం వైపు నడుస్తున్నాడు అని భావించిన  సంపత్ కుమార్, వే. నరసింహ రెడ్డి, పేర్వారం జగన్నాథం, కోవెల సుప్రసన్నాచార్య మొదలగువారు 'చేతనావర్తం'1967లో కవితా సంకలనం తెచ్చారు. వీరు చేతనావర్త కవులుగా స్థిరపడ్డారు.

సాహితీ రంగంలో రాజకీయ వ్యూహం రాణించదు అని తేల్చి చెప్పిన మొదటి ఉద్యమం అభ్యుదయ సాహిత్యోద్యమం అని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు.

'మానవతను మట్టిలో పారేసి, మంచితనాన్ని మీరు భూమిలో పారేసి, అభ్యుదయం తెస్తామనడం ఆకాశాన్ని కోస్తాం అనడం, ప్రజా వంచన మెత్తని మార్గమని" పేర్వారం జగన్నాథం వ్యక్తీకరించాడు.

తెలుగు సాహిత్యంలో చెరుగని ముద్రవేసిన వాదం సామాన్య మానవుని కష్టాలను కన్నీళ్లను వెలిగించవలసిన అభ్యుదయ కవిత్వం లిఖించ వలసినంత లిఖించ లేకపోయింది. అభ్యుదయ కవిత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించక తన శక్తినంతా కోల్పోయి వివిధ వాదాలకు నెలవైంది. అభ్యుదయ కవిత్వ ఉద్యమం తర్వాత వచ్చిన దిగంబర, విప్లవ కవిత్వ మునకు తగిన బాటలు వేసింది.

డా. సిద్దెంకి యాదగిరి 
944124473

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...