కత్తి కంఠమే 'అసిపె'
'అసిపెనే
మా ఇంటికి బువ్వ
బతుకు బండి
మా జాతి జీవగర్ర వెనుగర్ర
కులవృత్తికి కూరాడు
అసిపె లేకపోతే బువ్వెక్కడిది?
అసిపె మా గుండె పెట్టె
మా ఇంట్లో దీపం' అని అస్తిత్వం ప్రకటిస్తున్న 'అసిపె' దీర్ఘకావ్య కవి వనపట్ల సుబ్బన్న.
అసిపెను కావ్య సింహాసనం మీద ఆత్మగౌరవం కల్పించి, నిరర్థకమైన వృత్తి చిహ్నాలను సార్ధకం చేస్తున్న కవి సుబ్బన్న.
కులవృత్తులతో ఊరుకు విడదీయలేని సంబంధం ఉంది. వృత్తి పని లేకుంటే ఊరు ఉత్తదైతది. అలాంటి సందర్భంలో అసిపెకు ఊరుకున్న సంబంధాన్ని వ్యక్తీకరిస్తూ....
'ఊరు
అందంగా లేదంటే
ఊరిలో అసిపె లేనట్లే' అని న్యాయం చెప్పి జీవితపు సారాన్ని చిత్రీకరించాడు.
ఊరు అందంగా లేదంటే ఊరు మనుషులు కురూపులుగా ఉన్నారని అర్థం. క్షవరాలు గడ్డాలు పెరిగి, మనుషులు గుడ్డేలుగుల్లాగా కనబడితే ఆ ఊరికి ఎక్కడైనా అందం ఉంటుందా? ఉండదు. అందుకే అలా అన్నారు.
వనపట్ల సుబ్బయ్య పేరు వర్తమాన తెలుగు సాహిత్యంలో సుపరిచితం. పాలమూరు మట్టి పరిమళాన్ని, తెలంగాణ జీవజాలును కవిత్వంగా వెలువరిస్తున్న సుబ్బన్న కవిత్వమై కత్తులతో కవాత్ చేస్తున్నాడు. చెమట జాలుని కావ్య జలధారగా ప్రవహింప చేస్తున్నాడు.
బహుజన తత్వాన్ని పునికి పుచ్చుకొని 'ధిక్కారా', లాంటి అనేక కవితా సంకలనాలు గతంలో వెలువరించారు. ఇప్పుడు తన అస్తిత్వాన్ని గొంతుక చేసి భాష్పధారగా "అసిపె" వెలువరించారు.
సుబ్బన్నది సుమంగళమైన వృత్తి. విద్రోహవివక్షను, ఆ వృత్తి సాధకబాధకాలను ఏకరువు పెట్టి ఆర్ద్రంగా మనసుపై చిద్రమైన బతుకుల్ని ముద్రించాడు.
తన నాన్న గొప్పతనాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అంటే మంగళ వృత్తి చేసిన అందరి నాయనల గురించి అని అర్థం. విశ్వజనీనం చేస్తూ పరాకాష్టగా చిత్రించాడు.
'నాయన భుజాన
అసిపెతో నడిచిన నేలంతా
నాకు ఇప్పుడిప్పుడే శ్రమసుగంధమై
నిలువెల్లా ఆవరిస్తుంది
నాయన నడకనే మహాకావ్యం....' అని అనడం ఎంత కవిత్వం చదివినా, పుట్లకొద్దీ సాహిత్యం అధ్యయనం చేసినా అలవాడని జ్ఞాన సంపద అంతా నాయన జీవితం చూసి అనుభవ పూర్వకంగా జ్ఞానార్జన గావించాడు. అనుసరిస్తున్నాడు. ఆచరిస్తున్నాడు. తనివి తీరా తన్మయత్వం చెందుతున్నాడు. ఇప్పుడు ఆ వృత్తి ఆయనకు ఉపాధి ధార.
నాయి బ్రాహ్మణుల జీవితము రోజురోజుకీ ఎట్లా కుంచించుకు పోతున్నదో? విధ్వంసం అవుతున్న వృత్తికి ఆత్మగౌరవం కావాలని నినదిస్తున్నాడు. మంగళ వృత్తిలో చాలా కీలకమైంది కత్తుల పెట్టె. దానిని 'అసిపె' అంటారు. ఆ పేరు మీద దీర్ఘ కావ్యం రావడం అస్తిత్వానికి గొప్ప ప్రతీకగా చెప్పుకోవచ్చు. వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా నట్టేట మునిగారో తెలియజేస్తున్నాడు.
'అసిపె చేతుల పట్టందే
పూట గడవని బతుకు
సౌరం కత్తులు నూరి నూరి రాయి అరిగినట్లే
బతుకు కరిగిపాయె' అని తరతరాల తండ్లాటను, వేదననను, వికసించని జీవితాల శోషను విషాదంగా ఆవిష్కరిస్తాడు.
హాస్పిటల్స్ లో నర్సింగ్ సిస్టం రావడం వల్ల మంత్రసానులకు గిరాకీ తగ్గిపోయింది కానీ ఒకప్పుడు వారు మంత్రసానులై చేసిందే చికిత్స. వారిని, పనితనాన్ని సౌందర్యాత్మకంగా ...
'అమ్మ
లోకానికి పుట్టుకనిస్తే
మంత్రసాని అమ్మల లోకానికి
పురుడు పోస్తదని....
ఆమె కాన్పు చేసిన బిడ్డలందరూ
ముక్కొంచని సూర్యులైండ్రు' అని సహజత్వంగా అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ లాగా ఆమె పనిని అత్యంత శోభాయమానంగా కీర్తిస్తాడు.
అమెరికా అధ్యక్షుడు వచ్చిన ప్రతిసారి హైదరాబాదు రోడ్ల పక్కన జీవితాలు రోడ్డున పడుతుంటాయి. అసలు అడియాసలతాయి.
'అమెరికా అధ్యక్షుడు
ఎవడొచ్చినా
రోడ్లమీద సెలూన్ డబ్బలు ఖాళీ' అని వృత్తిని కొల్లగొట్టి ఉపాధిని నాశనం చేసే వాళ్లపై అక్షరాల్లో అక్రోశాన్ని ప్రదర్శిస్తాడు.
వివిధ రకాలుగా వివక్షత చూపే వాళ్ళపై విరుచుకుపడతాడు. కన్న కొడుకులా శ్మశానానికొచ్చి క్షవరం చేసిన నన్ను అనుమానిస్తావా అని ప్రశ్నిస్తాడు
'శ్మశాశానంలో
నీకు తలకొరవి పెట్టిన
నీ పెద్ద కొడుకు ఎంతనో
అదే శ్మశానంలో
నీ జాతికి నీకు
కర్మ సవరం చేసిన నేనంతే
ఇప్పుడు చెప్పు
ఎవడు నాగరికడు ?
ఎవడు అనాగరికుడు? అని ప్రశ్నిస్తాడు. ఆత్మగౌరవం ఉండాలనే ఆరాటపడుతున్నారు.
ఆదరించని ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తూ
'నాద బ్రాహ్మణులను
ఏ సంగీత అకాడమీలు ఆదరించవని' విచార పడతాడు.
అన్ని వృత్తుల్లాగే మంగళి వృత్తి కూడా కార్పొరేట్ మయమైనది. వృత్తి కోల్పోవడం ఉపాధి కోల్పోవడం సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమాలపై కవి తన నిరసనను
'కార్పొరేట్ సెలవులకు
వెండి గొడుగులు పడుతున్న వెలుగు పూలకు
తిరుక్షవరం చేద్దాం
ఆసిపెని తెరిచి మంగలి కత్తులను నూరుదాం' అనిప్రకటిస్తాడు.
అస్తిత్వం మనగడుగుతున్నటువంటి సందర్భంలో మాట పాట కవిత్వం ఏదైనా ఆయుధం చేయడమే సాయుధమవుతుంది. ఆ సమర సంగ్రామములో సుబ్బన్న 'జెండాలకు దిమ్మలం కాదు
సామాజిక న్యాయ సాధనలో...
ఆధునిక మౌర్యులుగా చరిత్రను తిరగరాద్దాం' అని ప్రకటించడం సముచితంగాను సామాజిక బాధ్యతతో కూడిన విధానంగాను విద్యుక్త ధర్మంగాను ఉన్నది.
ఈ కావ్యంలో ఊరి పోలికలు ఉత్తమోత్తమ రీతిలో సృజించాడు. సామెతలను పలుకు బడులను, స్వభావోక్తంగా జల్లెడ పట్టి చిత్రించారు. వ్యక్తిత్వాన్ని, వ్యవస్థను, వివక్ష చూపే వాళ్ళపై ధర్మాగ్రహం వెళ్ళబుచ్చాడు. సుమంగలుర జీవితాలు, ఏం చేస్తే స్థితిగతులు మారుతాయో ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ, వివక్షత లేని సమాజాన్ని కలగన్న అక్షరం ఈ పుస్తకం, గొంతు ఎత్తి బహుజన వాదాన్ని ప్రవచిస్తుంది. ప్రకటిస్తుంది. కర్తవ్య దీక్షను బోధపరుచుతుంది.
అట్లా "అసిపె" దీర్ఘకావ్యం తన ఫలితాలు నిశ్శబ్దంగా మౌలికమైన మార్పు కోసం ప్రయత్నిస్తుందని భరోసా కల్పిస్తున్న
(వనపట్ల)కు హృదయపూర్వక అభినందనవందనాలు.
-డా. సిద్దెంకి యాదగిరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి