సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

6, మే 2024, సోమవారం

బాధ్య‘తల’కు బాట - నూనె సుక్క కథలు - డా. సిద్దెంకి యాదగిరి


బాధ్య‘తల’కు బాట - నూనె సుక్క కథలు
    - డా. సిద్దెంకి యాదగిరి 





జీవితాల్ని కథలుగా వ్యాఖ్యానించడమంటే మరుగున పడిన మానవ సంబంధాల ఎతలను దృశ్యీకరించడమే. నిజజీవితంలోని కనబడని కోణాల్ని, మనసు తడిని, ప్రేమ పదనను, ధర్మాగ్రహ పదునును అక్షరాల్లో అంతరాత్మను కథల్లో ఆవిష్కరించడమే కథనం.   నిబద్ధతతో నిజాయితీగా మానవీయతను నిలుపడమే కథల అంతిమ లక్ష్యం. బంధాలను అక్షరీకరించడం ద్వారా సంఘటనలకు జీవం పోసే అక్షర శిల్పి, కథకులు కొట్టం రామకృష్ణారెడ్డి. వారి కథలు జీవితాల్లోని అడుగంటిన ప్రేమను పాతాళగరిగెతో దేవి గిడస బారిన మనసుపై కుంభవృష్టిగా ఆర్ద్రతల్ని కురిపిస్తాయి. మమతల్నీ బాధ్యతగా హృదయంలోకి వొంపి అనుబంధాలను తిరిగి అంకురింప చేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి నిలదీసి అడుగుతున్నట్లు కనిపిస్తాయి. 

ఆధునిక జీవితంలో నూతన దంపతుల మధ్య అగాథం సృష్టిస్తున్న అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో దాంపత్య జీవితానికి మంట పెడుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తుంటాయి. మనసెరిగి మసలుకుంటే జీవితం ఎలా మారుతుందో నిరక్షరాస్యుల విచక్షణాత్మక నిర్ణయాన్ని ఆదర్శంగా చూపుతూ రాసిన కథ ‘అద్దం వెనుక’.
మనసుకు అవిటితనం లేని సీతమ్మకు భర్త రామయ్య అంటే మహా ప్రాణం. అతనికి, వ్యవసాయంలో, జీవితంలో అన్ని విధాలుగా తోడుండేది. ఒకనాడు సినిమా హీరో ప్రసేన్‌ చిత్రపటాన్ని చూసి ముచ్చటపడి కొనుక్కొచ్చి  దానిని రహస్యంగా అద్దం వెనుక దాచింది. సీతమ్మ మనసు గ్రహించిన రామయ్య చేసిన పనిని తెలిపే కథ ‘‘అద్దం వెనుక’’ చదివితే నేటి దంపతులకు అపార్ధాలు రావని తెలుపుతుంది. 

తండ్రి జబ్బుకు మందు తేవాలని కల్మకల్‌ వెళ్లిన రచయితకు మందు ఇచ్చిన సాకలి బాలయ్య వర్షం వస్తుందనీ, వెళ్ళవద్దని వారించినా వినకుండా బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో వయసుకు వచ్చిన మనుమరాలుతో ఉంటున్న ముసలమ్మ తుంగ గడ్డి గుడిసెలో ఆ రాత్రి ఆశ్రయం పొందుతాడు. వారిపట్ల ఎనలేని కృతజ్ఞతాభావంతో నిండిపోతాడు. తెల్లవారి బయలుదేరిన రచయితకు ఆ మనుమరాలి చూపులు ఎందుకు గుచ్చుకున్నయో, ఆ అనుభవాన్ని తలుచుకొని అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆ ఊరినీ, అక్కడి పరిస్థితుల్ని కళ్లగట్టినట్టుగా హృదయానికి హత్తుకునేటట్టు మారాలనీ బోధిస్తూ  ‘ఆఖరికి’ కథ పాఠకుల్ని మూలాలు మరువకూడదనీ గుర్తు చేస్తుంది. 

అర్థం వేరు. అంతరార్థం వేరు. వాస్తవాన్ని గుర్తించకపోతే జరిగిన అపార్థమే జనిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న తల్లి కొడుకుల మధ్య ఒకరి మొఖం ఒకరు చూడకుండా ప్రేమ లేకుండా చేసిన ‘నూనె సుక్క’ తల్లి కొడుకులను ఒక జీవితకాలం ఎందుకు విడదీసింది? కనపడని శూన్యాన్ని ఎలా నింపిందో తెలుసుకున్న రచయితకు నానమ్మ చెప్పిన జీవిత తాత్వికత, మార్మికతలో జీవితానికి సరిపడే ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆలోచనలో బాధపడిరదెవరో ‘నూనె సుక్క’ కథ చదవి అపార్ధాన్ని తొలగించుకోవాల్సిందే.

రాముడు విడిచి వెళుతున్నాడని అయోధ్య వాసులు ఒకవైపు విలపిస్తున్నారు. రుతుక్రమాన్ని మరిచి అడవిలోని ఫలాలు ఫలి స్తున్నాయి. ఏది తెచ్చిన కాకి ఎంగిలి అనీ అంటారని ఆయాసం వస్తున్న ఆవాసాన్ని వెతికిన వాయసం. బిచ్చగాడు ఎత్తుకుపోయిన నాటి సీతమ్మను నేడు కనుగొనడానికి జనావాసాల మధ్య,  తిరుగుతూ వాయసం ఏం వెతుకుతుందో తెలియాలి అంటే ‘కాకి రామమం’ చదవాలి. రంగు నలుపు. కానీ కాకి మనసు నల్లగా ఉంటుందా అని ప్రశ్నిస్తుందీ కథ. ఈ కథలో కాకులంటే అణగారిన వర్గాలే. 

ఎండాకాలం తాతిల్‌ (సెలవులు)అంటే పిల్లలకు తల్లిదండ్రులకూ ఇష్టమే. పిల్లాడిని తీసుకుని లక్ష్మీ మామ ఆడపడుచు దగ్గరికి రుక్కమ్మతో సహా వెళ్లడం వల్ల లక్ష్మీ ఆశ అడియాశ అయింది. వారం తర్వాత వారం రోజులు బిడ్డ అత్తమామను పిలిచి తన ఇంట్లోనే మర్యాద చేసిండు రాములయ్య. వాళ్ల తర్వాత వారం రోజులు బిడ్డ కలమ్మ తల్లిగారింట్లో ఉన్నది. కలమ్మను సాగనంపుతున్న బస్సులోనే లక్ష్మి తండ్రి లక్ష్మిని తీసుకెళ్దామని దిగిండు. తల్లి గారి ఇంటికి వెళ్లే లక్ష్మికి అత్త రుక్కమ్మ ద్వారా నూరు రూపాయలు ఇస్తాడు. తాతీలు దొరకగానే వద్దామని అనుకున్నానని తండ్రితో చెబుతుంది. లక్ష్మికి తన తండ్రి అత్తమామల గురించి చెప్పిన తాతీల్‌ ఎవరెవరికీ కావాలో ఎలా అందివ్వాలో తెలియజేసిన విషయం ఆర్ద్రంగా చెప్పిన బ్రహ్మ రహస్యం ఏమిటో తెలిస్తే గాని కన్నీళ్లతో అమ్మగారింటికి పోయే కోడల్ని మొట్టమొదటిసారిగా విడ్డూరంగా ఊరిలోని చుట్టుపక్కలోల్లు  చూసిండ్రని ‘తాతిల్‌’ కథను ఆత్మీయతతో ముగిస్తాడు. 

కథకుడు ద్రష్ట అయి భవిష్యత్తును ఊహిస్తాడు. అసహజమనిపించినా రచయిత సహజంగా తీర్చిదిద్దాడు. ప్రకృతిని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం బాగు చేస్తాడు ? దేవుడే ప్రకృతి. ప్రకృతే దేవుడుగా ఆచరించాలనీ, ఆరాధించాలనీ వివరిస్తుంది. అలా చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తు అభ్యున్నతికి పాటుపడ్డ వాళ్ళమైతామని బోధించే బాధ్యతని మేల్కొల్పే కథ 3456జిబి. ఈ కథ చదివితే ప్రకృతి వినాశనం కానివ్వ కూడదని గట్టిగా కోరుకున్న వాళ్ళమై గొప్ప బహుమానంగా ముందుతరాలకు అందజేయాలనీ సంకల్పించుకుంటాము. 

మనిషినై పుట్టనందుకు మురిసిపోతుందని తెలపడమంటే పశువుల గొప్పతనం కోడె పాత్ర ద్వారా ఉన్నతీకరిస్తాడు రచయిత.అప్పుడే పుట్టిన కోడె తల్లి మాటలు విని మురిసిపోయినా కష్టాలు తప్పలేదు. ముసలిదైన ఎద్దు నెమరేసుకుంటున్న జ్ఞాపకాల్లో కొత్తకోడల్ని హింసించి ఎలా బలితీసుకున్నారో ఎవరు బలిపసువులవుతున్నారో తెలుపుతూ పైసలు ఎదిరిచ్చి కష్టాలు కొనుక్కునే కోడళ్ళ బలహీనత మీద, చచ్చిపోయేలా కల్పించిన పరిస్థితుల మీద, జీవితకాలం పనిచేసి అతని అభివృద్ధికి ఆధారమైన ఆ పశువును కసాయి వాడికి అమ్ముతున్నపుడు ఆ పశువు జ్ఞాపకాల ఆత్మఘోషనే ‘బలిపసువు’ కథ బలి విధానాన్ని ధిక్కరిస్తుంది.

ఏ ఆధారం లేకుండా తన చెల్లెల్ని చంపిన వరకట్న పిశాచిపై తీర్చుకున్న పగకు శిక్ష విధించాలనుకున్న జడ్జి బాధితుడై మథనపడుతూ కుమిలిపోతూ ఒక్క శిక్షకైనా రెండో శిక్షకైనా అదే తీర్పు అనీ ఇవ్వాల్సిన తీర్పే ఇచ్చిన ‘తీర్పు’ కథ హృదయ ఫలకం పై చెక్కు చెదరకుండా ముద్రించబడుతుంది.

చెరపకురా చెడేదవు అని బోధించే కథ ‘ఆకుపచ్చటి నెత్తుటి జాడ’. శంకర్‌ రెడ్డిది ఓర్వజాలని మనస్తత్వం. కుమ్మరి మల్లయ్య జాగలోని మామిడి చెట్టు నీడ వల్ల పంట పండుతలేదనీ మనుషుల చేత కాత ఉండగానే దౌర్జన్యంగా కొట్టేస్తాడు. కుమ్మరి మల్లయ్య పిచ్చివాడై శాపనార్ధాలు పెట్టినందుకు రక్తం గారేటట్లు కొడతే చెట్టు మొదట్లోని తల్లి సమాధిపై పడి స్పృహ తప్పుతాడు. శంకర్‌ రెడ్డి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అతడి రెండో భార్య బావికాడి నివాసం నుంచి కనబడకుండా తప్పిపోయిన మిస్టరీ ఊహకందకుండా నడిపిన కథనం పాఠకున్ని విస్మయానికి గురిచేస్తుంది. 

అంతరిక్షజాడలు కనుగొంటున్న మనిషికి ఎదుటివారి అంతరంగంలోని స్వార్థం కనుగొనకపోవడమే అతి పెద్ద విషాదం. అంతరిక్ష యాత్రికుని మనసులో ఏముందో ఎవరికి అంతుపడుతుంది? ముక్కోణపు ప్రేమలో మిగిలేవి రెండే. మిగిలేది అంతర్ధానమే. స్వార్ధం రగిలించిన ప్రేమ కోసం అంతరిక్షంలో చేసిన అఘాయిత్యమే ‘ఎల్లలు’ కథలో గెలిచింది ప్రేమనా? స్వార్థమా ఏది గెలుస్తుందో చదివాక స్పష్టత కలుగుతుంది.

బతుకమ్మ పండుగకు తల్లి గారి ఇంటికి వచ్చిన బాల్య మిత్రురాల్లు వినోదా, సరోజ సుమతులు. పువ్వు ఏరడానికి పోయి అక్కడ సరోజ కుటుంబం పట్నం పోయి అప్పుల పాలైండ్రు. వినోద తక్కువ జీతమున్నా డబ్బు వెన్కకేస్తుండ్రు. ఏంటి మీ రహస్యం అని అడిగిన వినోదకు కరువులో ఉన్నా కష్టాలో ఉన్నా ఊల్లో ఉన్నా పట్నంల ఉన్నా ఎక్కడున్నా కష్టపడాలి. రేపటి కోసం పొదుపు చేయాలి. ఈ ఆలోచన, ఆచరణ లేకపోతే బతుకే ఆగమాగం అని పొదుపు రహస్యం చెప్పే ‘ఇగురం’ కథ ఏరుకొచ్చి పేర్చిన పెద్ద బతుకమ్మలా ప్రేరేపిస్తుంటది. 

చాలా మందికి కఠినపదాలకు అర్థాలు సమగ్రంగా తెలియవు. కథనేకాదు భాష కూడా అర్థమయ్యే విధంగా చెప్పడంలో రచయిత సిద్ధహస్తులు. సమూహంలోంచి వెలివేయబడితే ఒంటరితనమని, సమూహాన్ని వెలివేస్తే  ఏకాంతం అని పాత్రలు సమభాషిస్తాయి. ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య నిట్టూర్పే మానవ జీవితం. ఒంటరితనం ఓటమివైపు, ఏకాంతము గెలుపుకు బాటలేస్తాయనీ,  ఒంటరితనంలో సమాజం కోసం రచయిత లోలోన కుమిలిపోయే వ్యవస్థను చూసిన మనస్సుకు బతికినన్నాళ్లు ఈ బాధ తప్పదని ఉదాసీనంగా వెళ్లిపోవడమే ఏకాంతం కలిగించే జాలి అనీ డిస్ట్రక్టివ్‌ (విధ్వంసం)గా చెప్పే అంశం అబ్సట్రాక్టివ్‌ (అమూర్తం)గా వివరించే ‘ఒంటరి ఏకాంతం’ చదివితే ఎన్నో విషయాలు, విశేషాలు విధితమవుతాయి. ఈ కథ చదివాక కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం’అన్న ప్రసిద్ధ పంక్తులు గుర్తుకొస్తాయి.

ఊరిలో మనుషుల మధ్య సంబంధం కలిపేది వృత్తి పని. వృత్తి పనివాల్లను కలిపే వేదిక పంట పండాక ధాన్యం కొలిచే కల్లం. పనిచేయనోళ్లకు మన దాన్నెం పంచిపెట్టుడెందుకు తాతా అని అడిగినప్పుడు కడుపులో చేయి పెట్టి దేవి తీసిన సమాధానం తాత చెప్తూ ‘‘ఆళ్ళందరూ పరాయోళ్ళు కాదురా! కులాలు వేరైనా మనందరం ఒకటే. మనకు భూముంది. సేద్యం చేస్తం. గది మన వృత్తి. కమ్మరి కుమ్మర్లందరూ మన కోసం పని చేస్తరు. మనం వాళ్ల కోసం పని చేయాలి. మనకోసం వాళ్లు చేస్తారు. ఎవ్వలి పని ఆడే చేసుకుంటే మందితోటేం పని?’’ అని  ఏకత్వం మర్మం చెప్పే ‘బర్కత్‌’ కథ మనుషులంతా ఒక్కటనే నిజం కడుపుల ఆత్మ కండ్లకు దుఃఖం తెస్తది. ఈ కథ ముగింపు నేడు దేశమంతా కులాల మతాల పేరిట జరిగే అసహనం జరిపే ఆకృత్యాలకు చెక్‌ పెట్టి గుణపాఠం చెబుతుంది.

నాయకుడిగా ఎదగాలనుకుంటే మనొక్కరమే ఎదుగుతాం. నాయకులు తయారు చేయగలిగిన వాడే మహానాయకుడు అని పేర్కొన్న ఒక జింక నాయకత్వం వహిస్తూ జింకల గుంపును, కుర్ర జింకను కాపాడుతూ పులిని చంపేస్తూ తను చనిపోతూ పదుగురికి  మేలు చేసే చావు గొప్పదనీ జింక చేసిన త్యాగమే ‘యుద్ధం’ కథ. ఈ కథలో జింకలు మానవులకు ప్రతీకలు. ఈ కథలో మానవ సమూహాన్ని ఎలా కాపాడాలో నేతలకు బోధించే గురూపదేశం ఉంది. 

జీవితంలో సంపాదనే ముఖ్యం కాదు బిడ్డా అని ‘‘పానంతోటి బతకాలంటే ఊర్లలో బతకాలె’’నని ఊరిపై నున్న మమకారానికి ఆకారాన్ని చిత్రించే ‘రెండో ఉత్తరం’ కథ ప్రతీకాత్మక భవిష్యత్తు సందేశాన్ని తండ్రి ద్వారా కొడుకు అందిస్తుంది. ఊరిని ఇడ్సిపెట్టి ఉండుడంటే పానం లేకుండ బతికినట్లే అని చదివిన కొడుకు శాశ్వతంగా ఇండియా వస్తాడు. 

తెరచిన కిటికీలోంచి ప్రకృతిని చూసినప్పుడు అనేక దృశ్యాలు కనబడుతుంటాయి. ఆలోచనల్లోకి వెళ్లి భ్రమల్లో బతుకుతుంటాం కానీ నిజం వేరే ఉంటుంది. అతనికి బాల్యమిత్రుడు చావు గుర్తు తెచ్చుకొని మనసు శకలాలుగా విరిగిపడుతుంది. ఎంసెట్‌ మెడికల్‌ సీట్‌ మొదటి ర్యాంకు సాధించిన కొడుకు బీఎస్సి అగ్రికల్చర్‌ వైపు వెళ్తాననడం. కిటికీ దృశ్యాలతో ఆలోచనలు ఆచరణలు మూలాల్లోకి వెళ్లడం కోసం మమేకం చేసే కథ ‘తెరిచిన కిటికీ.’ గో బ్యాక్‌ టూ అగ్రికల్చర్‌ అని వివరిస్తుంది.

అనువణువునా పల్లె తనం నింపుకున్న మనిషి జీవన విధానమే ‘ఇగురంగల్లోడు’ కథ. ఎవరికి అర్థం కాకపోయినా బాధ్యతకు నిలువెత్తు విగ్రహం. నీతికి చిరునామా. రీతికి దిక్సూచి. కడుపు నిండా కనబడని ప్రేమ, కనిపించే శత్రువుగానే ఉన్నా కుటుంబం పట్ల అంకితభావమే. ఉల్లాసము నింపని వ్యక్తి పట్ల కుటుంబ సభ్యుల అనుబంధాల అల్లికే ఈ కథ. 

ఊరు దాటకున్నా సరే వ్యవసాయ దంపతుల అన్యోన్యతలు ఎలా రెట్టింపు చేస్తూ బావిని హనీమూన్‌ గా భావిస్తూ, పొలాన్ని ఫారిన్‌ ట్రిప్‌ గా చిత్రిస్తూ జీవిత యాత్ర కొనసాగించాలనే సందేశాత్మకమైన కథ ‘యాత్ర’. ఏవీ లేవని బాధపడటం కంటే ఉన్న వాటితో తృప్తి పడటం జీవితానికి మించిన సంతోషం లేదని ఆలుమగలు అరమరికల్లేకుండా ఎలా జీవించాలో తెలియజేసే కథ యాత్ర. నవల లా సాగిన వర్ణన.



వర్ణన`పోలికలు: కథలోని వర్ణన ద్వారా సంఘటన, పాత్రోచిత సంభాషణ, సమన్వయంతో పాటు సొగసైన వర్ణనతో రచయిత ఆకట్టుకుంటాడు. పోలికల ద్వారా కథనానికి రచయిత బలం చేకూరుస్తాడు. ‘నా ఎన్నెల ఎలుగుల కన్న ఎక్వ వెలుగు యాడ్కెలొచ్చింది’ అని సీత కండ్లని సూసి, సిగ్గుపడి మబ్బు సాటుకు దాక్కున్న సంద్రుడు. అని వ్యక్తీకరించడం ద్వారా అతిశయాన్ని అతికిస్తాడు.(ఆఖరికి కథ). సూర్యుడు ఊరిడిసి పెట్టి పోయిండు, పొద్దుగాల మల్లొస్తనని జెప్పి’ అని తాతిల్‌ కథలో పోలుస్తాడు. పెండ్లిపిల్ల కడిగిన ముత్యమోలే మంచిగున్నది. (బలిపసువు). ‘ఎవరి బతుకు వారే బతుకాలనీ కోడి పిల్లలు పెద్దగయినంక కోడి పిల్లలను ఎడవాపుతుంది’ లాంటి పోలికలు కావల్సినన్ని ఏరుకోవచ్చు.

ప్రతి కథలోనూ ఒక సామాజిక దృక్పథంతో రాయడం రచయిత సామాజిక బాధ్యతకు నిదర్శనం. మనుషులంతా మానవీయ సంబంధాలతో అనుబంధాలు పెనవేసుకొని జీవించాలని, లుప్తమవుతున్న విలువల్ని పెంపొందించాలని సందేశం ఇచ్చేవి ‘నూనె సుక్క’ కథలు.

ఆర్ద్రతను పిండి మనసును తడి చేసే కథలు. కనిపించని కల్లోలాన్ని కనిపించేలా చెక్కిన శిల్పాలు. ఎంచుకునే కథా వస్తువును లోతుగా పరిశీలించి, పరిశోధించి ఫలవంతంగా అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడం కొట్టం రామకృష్ణారెడ్డి ప్రత్యేకత. వారు కథ వస్తువు ఎంపికలో జాగ్రత్త వహిస్తాడు.

 ఎంచుకున్న కథ పట్ల స్పష్టత లేనిది రాయడు. ఎక్కడా అనవసరమైన వాక్యాలు, పదాలు పాఠకుల్ని ఇబ్బంది పెట్టవు. వారి శిల్పంలో మట్టి కూడా మాణిక్యంగా మారుతుందనడంలో అతిశయం కాదేమో. వీరి కథనం ప్రత్యేకమైన శైలితో ఉంటుంది. కథకు కథకు పోలిక లేకుండా, ఊహకు అందకుండా రాసే వీరి శ్కెలి ఎంతో రమణీయం. ఎంతో అధ్యయనం చేస్తే కానీ ఇలాంటి శైలీఅలవడదు. 

రాసిన కథలను వాసికక్కేలా తీర్చిదిద్దడం వారి నిపుణతకు, నిబద్ధతకు పరాకాష్ట. ఇవి టైం పాస్‌ కథలు కావు. తప్పక చదవాల్సిన బతుకు గాథలు. బాధ్యతలకు బాటలేసే  అత్యుత్తమ మా’నవ’ జీవితానికి  ప్రబోధించే ఆచరణాత్మక ఎతలు.

    ` డా. సిద్దెంకి యాదగిరి 9441244773

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...