సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

Telangana Dalitha Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telangana Dalitha Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

తెలంగాణ దళిత కథ - డా. సిద్దెంకి యాదగిరి


తెలంగాణ దళిత కథ

  





తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు తెలంగాణ పుట్టినిల్లు. కథా సాహిత్యం అంకురించింది కూడా ఈ నేలలోనే. గురుజాడ గారి ‘దిద్దుబాటు’ 1910 కథకంటే ముందే భండారు అచ్చమాంబ ‘ధనత్రయోదశి’ 1902లో రాయబడిరది1. నాటి నుండి నేటి వరకు తెలంగాణ కథా రచనలో సాంఘిక సమకాలీన పరిస్థితులు ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. 
దళితపదం వివరణ: ‘దళిత’ అను శబ్ధానికి అర్థం ఖండిరచబడిన, చీల్చబడిన, వెలివేయబడిన అను అర్థాలున్నాయి.2 Dalith అంటే  broken or reduced to pieces generally అనే అర్థాలు ఆంగ్ల నిఘంటువుల్లో అర్థాలున్నాయి. 1972లో మహారాష్ట్రలో దళిత ప్యాంథర్స్‌ మ్యానిఫేస్టో ప్రకటించిన ప్రకారం Member of scheduled castes and  tribes ,neo buddhhists the working people,the landless and poor peasants, women and all thise who are being expiated, politically, economilly and in the nameof religion. అని నిర్వచించారు. 
 
  ఆక్షరాలకు దూరమైన దుర్భల జాతులు అక్షరాల్నే ఆయుధాలుగా చేసి అసమానతలపై సమరం చేస్తున్నాయి. ఫూలే, అంబేద్కర్‌ స్ఫూర్తితో కలమెత్తి సమానత్వం కోసం నినదిస్తున్నాయి. బతుకు పొరలను తవ్వి సాక్షీభూత సాహిత్యాన్ని అందించడం కోసం అక్షరాల్తో నడుస్తున్న పొద్దు మీద చెరుగని ముద్రవేయడమే దళిత సాహిత్యం యొక్క ప్రధాన లక్ష్యమై ఉన్నది. 
  ‘‘నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించకునే హక్కులేని దళితులు ఈ రోజు సమాజ జీవితాన్ని శాసిస్తామని ముందుకొస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అపూర్వ సందర్భం’’ అని బాలగోపాల్‌ గారు తన  ‘దళిత’వ్యాస సంపుటిలో అభిప్రాయం వెలిబుచ్చాడు. 
‘‘దళితుల జీవితాన్ని చిత్రించేది. ఆర్తిని, ఆవేదనను, ఆగ్రహాన్ని, ప్రతిఘటనను ప్రతిబింబించేది, దళితులకు సుఖమయ మెరుగైన, సుఖమైన, అందరితో సమానమైన జీవితగమనాన్ని నిర్దేశించేది దళిత చైతన్యాన్ని వ్యక్తీకరించేది దళిత సాహిత్యం’’ అని ఎస్వీ సత్యనారాయణ గారన్నారు. 
దళితజీవితాల్లోన్ని వెతలను, వేదనలను విని, చూసిన సంఘటనలు, సన్నివేశాలను ఆధారం చేసుకుని, తదాత్మ్యం పొంది రాసిన కథలని దళితేతరులు రాసినప్పటికీ అవి దళిత కథలుగా పరిగణించాలి.
దళితోద్యమంలో భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. హైద్రాబాద్‌లో 1917లో స్థాపించిన ఆది హిందు ఉద్యమం ప్రోద్భలంతో 1936లో డా॥ బి.ఆర్‌ అంబేద్కర్‌ అఖిల భారత షెడ్యుల్డు కులాల సమాఖ్యను స్థాపించారు. ఈ ఉద్యమానికి ఎమ్‌. వి. భాగ్యరెడ్డివర్మ, బి.ఎన్‌. వెంకట్‌రావు, అరిగె రామస్వామి త్రిముఖ ద్వారాలుగా పనిచేశారు.3
కడుపు కాలుతున్నోళ్లకు తెలుస్తుంది ఆకలి బాధ. కడుపు నిండ తిన్నోల్లకు  కాదు అన్నట్లు బాధలు అనుభవించి అవమానాలకు గురై, అవహేళనల మధ్య నిత్యం తచ్చాడుతున్న అనుభూతుల్ని కలిగిన దళితులు రాసిన కథలే సహజత్వాన్ని చిత్రిస్తాయనేది నిజం.  కథా సాహిత్యంలో దళిత సహానుభూతితో, సంస్కరణవాదంతో రాసిన కథలూ ఉన్నాయి.  
తరతరాలుగా నీచమైన బతుకులు. కుటిలమైన అణచివేత. పశువుకన్నా హీనం. బాంచన్‌ కాల్మొక్త అంటూ వెట్టి చేయాలి. దయతలచి ఇస్తే తీసుకోవాలి. లేదంటే లేదు. ఆకలి కడుపును ఉరిపెడుతున్న మాడుతున్న పేగులతో ప్రాణం ఉన్నంత వరకు పనిచేసే వెట్టివాళ్లే దళితులు. పొద్దంతా పని చేసినా బావి నీళ్లు తాగనివ్వరు. అంటరాని తనం నీడపారనియ్యది. ఊరికి దూరం. బతుకు బారం. ఆలయ ప్రవేశం లేకున్న మనిషిని మనిషిగా పరిగణించేదిలేదు. దోపిడీలు, మానభంగాలకు లెక్కలేదు. దళితులు చేసిన చిన్న తప్పులకు కఠినమైన శిక్షలు. కడుపు నింపినా నింపకున్నా మాయితనం, నీరడితనం మొదలైన వృత్తులు చేయాలి. అదీగాక జీతం ఉండాలి. పొద్దటిది పొట్టకు, మాపటిది బట్టకు అన్నట్లు బాకి తేరది. బతుకు మారది. 
కడగొట్టు బిడ్డలైన దళితుల వెతలను తెలుగు సాహిత్యం అక్షరీకరించిన విధానాన్ని విభాగాల వారిగా పరిశీలన చేద్దాం. 

1. వెట్టి చిత్రణ: వెట్టి అంటే ఏమీ ఆశించకుండా పని చేయాలి. ఇచ్చిన కాడికి తీసుకోవాలి ఇవ్వకపోతే ఉచితంగా చేయడమే వెట్టి. మాదిగలు తాళ్లు పట్టాలి. తలుగులు వేయాలి. తోలు సంబంధమైన వస్తువులు తొండం, చెప్పులు, వ్యవసాయంలో తోడుండాలి. పండుగకు పబ్బానికి దప్పు కొట్టాలి. మాలలు బ్యాగరితనం(బొంద తోడడం, చితి కాలువడం) నీరడితనం చెరువు నీళ్లు పారియ్యాలి. 
తెలుగు కథా సాహిత్యంలో దళితేతరులు రాసిన తొలి దళిత కథగా శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రిగారి పుల్లంరాజు కథ (1925) తొలి కథగా నిర్ధారించబడిరది. దళితుడు రాసిన ‘‘వెట్టి మాదిగ’’4 కథను భాగ్యరెడి వర్మగారు లిఖించారు. ఇది ఆనాటి భాగ్యనగర పత్రిక ఆగష్టు, 1932లో అజ్ఞాతవాసి పేరిట ప్రచురితమయ్యింది. (తెలుగు కథకురాలు తాడి నాగమ్మ5) తెలంగాణ తొలి దళిత స్త్రీ రాసిన తొలికథ మామిడి సత్యవతి గారి ‘‘తెర తొలిగింది’’6.కథ 1960లో ప్రచురితమయ్యింది. బోయ జంగయ్య గారి లోకం 1973లో ప్రచురితం.
‘‘వెట్టి మాదిగ’7’ కథలో రామిరెడ్డి పోలీస్‌ పటేల్‌. ఇతడు కలహాలు పుట్టించుటలో నేర్పరి. విరోధులను అన్నమో రామచంద్రా అని విలపించేంతగా ఇబ్బందులకు గురిచేస్తాడు. అందువల్ల అతనంటే అందరికీ భయం. తన బంధువుకు ఉత్తరము పంపవలసినదని వంతు మాదిగను పిలుచుక రమ్మని తలారిని పంపిస్తాడు. మాదిగ ఈ రోజు వీలుకాదని చెప్పినందుకు తలారిని కోపముడుగు వరకు చెప్పుతో కొడతాడు. తలారి కిక్కురుమనకుండా మాదిగ వద్దకు వెళ్ళుతున్నపుడు ‘‘వెట్టి చేయుట కష్టమట. ఇక వీరల కొంపలు నాశనము చేతును ` ఎవ్వరు అడ్డము వచ్చెదరో చూచెదనుకాక’’ అని పటేల్‌ తిడుతుంటాడు. ఆనాడే వేరే భూకామందు ఆరు నెలలు చేసిన పనికి ఫలితము ఇచ్చును. కాని ఆ రోజే వెట్టికి పోయిన యెడల రావలసిన ధాన్యం రాదు. తనకు బదులు ఇంకొకరిని తోలుటకు పటేలు వద్దకు బయలుదేరుతాడు. అంతలో తలారి వచ్చి మాదిగ మల్లన్ని తిడ్తూ కొడ్తూ పటేలు వద్దకు ఈడ్చక పోతున్నపుడు నెత్తిన బలమైన గాయము తగిలి నెత్తురు వరదలా కారుతది. మల్లడు స్పృహ కోల్పోయాడు. నెత్తురు కళ్ల జూచిన పటేల్‌ శాంతించెను. తలారిని ఇద్దరు అనుయాయులతో వానింటికి వాన్ని పంపెను. వ్యాధిపీడితుడై ఉన్నందున ఆలుబిడ్డలు తిండిలేక కృశించిరి. ఆరునెలలు శవాకారముగా ఉండి మల్లడు చనిపోయెను. ఈ కథవల్ల పోలీస్‌ పటేల్‌ రామిరెడ్డి, పటేల్‌ వ్యవస్థ నిజాం కాలంలో వెట్టి ఎంత దుర్మార్గంగా ఉన్నదో మనమే ఊహించుకోవచ్చు. అని కథను ముగించి పాఠకునికి వదిలేస్తాడు. 
సురవరం ప్రతాపరెడ్డి గారి ‘సంఘాల పంతులు’8 తెల్లవారుజామున ఊల్లోకి వస్తున్నపుడు వాకిట్లో పడుకున్న వారిని సమయం ఆరా తీసినపుడు కుక్కలు మొరుగలేదు కాబట్టి మూడుగంటలు కావొచ్చు అంటాడు. ఆ ఊరి ఎస్సై జల్సాలకు కోళ్ళ్ల్లు ఆహారమవుతాయి. ఇదంతా వెట్టిలో భాగం. మాదిగల బతుకు కడు దయనీయం. ఎస్సై బార్య  రేలకట్టెల మోపు తెమ్మని వంతు మాదిగ ముసల్దాన్ని తెమ్మంటే తంగెడు కట్టెలు తెచ్చినందుకు తంతె ముసల్ది చనిపోతుంది.
మెదక్‌ జిల్లా నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారికంటే ముందుగా వెట్టికి వ్యతిరేకంగా బెల్లంకొండ నరసింహాచార్యులు రాసిన ‘సీయూసి సభలు’9 కథలో వివరించాడు. బి. సీతారామారావు ‘గరీబోన్ని’ అను కథ లో వెట్టిగురించి రాసాడు. 
వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ‘పరిగె’కథ9లో మల్లయ్య మాదిగ కులం. తల్లిలేదు. తండ్రి మంచం పట్టాడు. ఆకలితో అల్లాడి పడిపోయిన తండ్రి, చెల్లె ఆకలి తీర్చడం కోసం పొలంలో రాత్రి కుప్పకొట్టే కాడికి యాచించడానికి పోతాడు. యజమాని దానం చేయడని తలచి పొలంలో పరిగె ఏరుకుని పోతున్నప్పుడు యజమాని అటకాయిస్తాడు. మల్లయ్య బతిమాలుతాడు. దొంగతనం చేశాడనే నెపంతో ఆ పోలీస్‌ పటేల్‌ జైలు పాలు చేస్తాడు. 
చెల్లెలు మల్లయ్యకు బదులు వంతుమాదిగ పనిచేస్తుంది. మల్లయ్య జైలు పనిమీద అంగడికి పోయినపుడు పరిచయస్తుడు కల్సి తండ్రి చనిపోయాడనీ చెల్లెలు ఎటో వెల్లిపోయిందని తెలుసుకొని ఏడిస్తే జవాన్‌కు మాట వస్తుందని దు:ఖాన్ని బహుకష్టంగా ఆపుకున్నాడు. జైలుకు రాగానే మా చెల్లె ఏమై పొయిందోనని పెద్దగా ఏడ్చాడు. సర్వస్వతంత్రంగా ఏడ్చే స్థితి దళితులకు లేదనే విషయం స్పష్టమవుతుంది. పరిగె ఏరుకొని మోసపోయి సగం కోల్పోయిన విధానాన్ని బోయ జంగయ్య ‘లేకి బతుకులు’10అనే కథలో చిత్రించాడు. చంద్రమ్మ అను దళిత స్త్రీ సుశీల పొలంలో పరిగె గింజలు ఏరుకున్నది. తన పొలంలో పరిగె ఏరినందుకు ఆగ్రహించిన సుశీల చంద్రమ్మ ఏరుకున్న పరిగె గింజల్లోంచి సగం తనకే ఇవ్వాలంటుంది. పరిగె గింజల్లో ఎవరూ వాటా అడుగరని చంద్రమ్మ ఎంత బతిమాలిన ఫలితం ఉండదు. సుశీల వినదు. సగం గింజలు ఇస్తుంది. 
ఆధునిక వెట్టిని చిత్రించిన కాలువ మల్లయ్య ‘ఎట్టి’ కథలో భూస్వామి పాలేరును కరీంనగర్‌ తీసుకొచ్చి కట్టుకున్న ఇంటి పక్కన నీకు భాగమిస్తానని అన్ని పనులు చేయించుకొని నామమాత్రంగా కూలి ఇస్తాడు. కాలం గడిసిన తర్వాత మోసం చేస్తాడు.

2. కుల వివక్ష చిత్రణ: ‘‘నువ్వెటువైపు వెళ్లిన అటువైపు ఎదురొస్తుంది కులబూతం’ అని అంబేద్కర్‌ గారన్నట్లు అడగడుక్కు అంటరాని తనం కొనసాగుతుంది. కుల వివక్ష ఎంత దారుణంగ వుందో తెలియజేసే కాళోజి కథ ‘తెలియక ప్రేమ తెల్సి ద్వేషం’ అను కథలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభావంతో కార్యకర్తలు హరిజనాభ్యుదయం పేరన హరిజనులకు ఆలయ ప్రవేశం ఏర్పాట్లు జరుగుతున్నపుడు వ్యతిరేకించే బ్రాహ్మణులు దళితుల మధ్య కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాటలో ఒకర్నొకరు పొడుచుకొని ఒక బ్రాహ్మణుడు, ఒక దళితుడు చచ్చిపోయి స్వర్గంలో కలుసుకుంటారు. పరిచయం చేసుకుంటారు. అప్పటిదాక ఒకరిపై ఒకరు కురిపించుకున్న ఎనలేని ప్రేమను మరచిపోయి పరస్పరం తిట్టుకొవడం ప్రారంభించినారు. ఎవరేమిటో తెలియనంతవరకు ఏ ద్వేషములేదు. తెలియగానే ద్వేషం, దూషించుకోవడం. దళితకులాల పట్ల అసహ్యతను చిత్రించాడు. ఇందులో గొప్ప తాత్వికత ఉంది.
నిజాం కాలం నాటి పరిస్థితుల్ని దర్పణం పడుతూ మహ్మదీయ మతంలోకి మాల మాదుగుల మార్చుతున్న వైనాన్ని గూడ మొందారాలు తెంపి మత మార్పిడి చేసిండు మొల్లసాబ్‌. నమాజ్‌ సదివిచ్చిండు. అందరు గరం గరం బిర్యాని బోంసేసిండ్రు. ‘ఇనాం బూములు ఇత్తమనిరి గదరా’’ అని చర్చించుకుంటరు. ఫలితంలేదు. ఆశ చెప్పిన కరీం సాబ్‌ పోయిండు. మొల్లసాబ్‌ పోయిండు. ఇనాం శెలుకకు ఆశపడ్డ మాల మాదుగులకు నోట్లె మన్ను వడ్డట్టయ్యింది.
కుట్రల్ని, కుతంత్రాన్ని చిత్రిక పట్టి, కులోన్మాదాన్ని, దుర్భర జీవితాన్ని చిత్రించిన కథ డా. నందిని సిధారెడ్డి గారి ‘చిత్రకన్ను’12. ఊరిపెద్ద నర్సయ్య తల్లి సావు జేయడం కోసం దప్పులు కొట్టడానికి ఇరువై రూపాయలకు మాదిగలు రమ్మంటే రారు. మాదిగలు అడిగినంత యాభైరూపాయలు కూలీ ఇత్తమని ఒప్పుకున్నారు. మాదిగలంటే లోలోన కనపడని మంట కుట్రపూరితంగా మండుతుంటది. అక్కడ కాష్టం అంటుకుంటన్నప్పుడు ఇక్కడ మాదిగ గూడాన్ని తగలబెట్టారు. ఒకడు మాదిగల దగ్గరికి మంట మంట ఎగపోసుకుంటూ చెప్పడానికి వచ్చిన దీనస్థితి, వాళ్లందరు ఊపిరి తీసుకుంటూ గూడెందగ్గరికి వచ్చేసరికి మండుతున్న చితిమంటలని చిత్రించాడు.  
భూస్వాములకు దళితులకు జరిగిన కొట్లాటలో దళితుల్ని ఊచకోత కోస్తారు. ప్రతీకారంగా దళితులు భూస్వాములు దాచుకున్న ఆయుధాలతో భూస్వాముల మీద తిరుగుబాటును ఆవిష్కరించినబోయ జంగయ్య ‘ఎదురు తిరిగిన ఆయుధాలు’13కథలో చూస్తాము. 
గుప్తుల కాలం  స్వర్ణ యుగం కాదని చరిత్రను చిత్రించే కాలువ మల్లయ్య గారి ‘స్వర్ణ యుగం’ కథ. గుప్తుల కాలంలో దళితుల్ని ఊరవతలకి పంపడం ప్రారంభమైంది. దళితుల్ని హీనంగా చూసే మత గ్రంథాలు ఈ కాలంలో ఉద్భవించాయని అందువల్ల ఇది స్వర్ణ యుగం కాదని వివరిస్తుంది.
మండుటెండల్లో మంచినీళ్లను తీసుకపోతున్న పయనం చెప్పిన దొడ్డి రామ్మూర్తి గారి ‘తిత్తి’14కథ. మంచి నీళ్లు, కళ్లు పుట్టేది భూమిలోనే. ‘‘గీ బూమిల నీల్లకు కులముంద్గని. కల్లుకు కులం లేదు.’’ అని మండువల సమానత్వ తత్వం విప్పి చెప్పింది.
కులాంతర వివాహాలకు మద్దతిస్తున్న వాల్లకు, కుల నిర్మూలన పేరిట చేస్తున్న ఉద్యమాలను ఎదుర్కోవడానికి దళితుల్ని మానసికంగా దెబ్బతీసిన కథ బూతం ముత్యాలు ‘బొందల గడ్డ’15లో చిత్రించాడు. ఉద్యమకారులకు చెడు అలవాట్లు ఉండకూడదని తెలుపుతుంది. తాగవెట్టి, తినవెట్టి, మానసికంగా తాగుబోతుల్ని తయారు చేయడం కోసం బెల్టుషాపుల్ని పెడుతుంటిమని దొర, పటేల్‌ అనుకుంటారు. తాగుతున్న వాల్లకు మందులో ఇసం కలుపుతరు. ఏర్పడకుంట ఇంటికాడ జీపుల తెచ్చి దించుతరు. చేతికి మట్టి అంటకుండ పనికానిస్తరు.  
దొరల దాష్టికాలను వివరించింది పడాల రాములు ‘బలి’16 కథ. దొర జీతగాడు అందరికన్నీ ఎక్కువగా కష్టపడి దొరకు గుమ్ముల నింపుతున్న జీతగాడు తలారి రాందాస్‌. దొర ఓర్వలేక రాందాస్‌ భార్యను దొర చెరచితే ఆత్మహత్య చేసుకుంది. భౌతికంగా వృత్తి చేయనివారు జీవించడానికే అర్హులు కాదని గుండెడప్పు కనకయ్య గారి‘ఉత్పాదకులం’ కథ మంచి గుర్తింపును పొందింది.
అవసరానికనుగుణంగా కులాన్ని, అంటరానితనాన్ని వాడుతుంటారు. దళితులు పనిచేసేటప్పుడు లేని అంటుముట్టూ దళితులు ఇచ్చే వస్తువులకు అంటరానితనం ఉంటుందనీ దగుల్బాజీతనాన్ని తెలిపే కథ మాష్టార్జి రాసిన ‘అవసరమొస్తే’కథ చిత్రించింది. ధాన్యాన్ని పండిరచినప్పుడు లేని ముట్టుడు. ఆ ధాన్యాన్ని గరిసెల్లోకి ఎత్తినంతర్వాత ఎందుకు? ఆ ధాన్యంలో పసుపు చల్లి శుద్థీకరిస్తారు. వాళ్లకు తాకితే గో మూత్రం చల్లుకుంటారు. దళితులు తెచ్చిన వస్తువులపైన, సరుకులు, పండ్లు ఫలాలపైన గో మూత్రం, పసుపు మొదలైన చల్లి శుద్ధీకరిస్తారు. అంటే అవసరాన్ని బట్టే వివక్ష మారుతుంటదని వివరిస్తుందీకథ. 
అందుకో దండాలు బాబా అంబేడ్కరా అనే ప్రఖ్యాతగేయం రాసిన వాగ్గేయకారుడు మాస్టార్జీ రాసిన కథ ‘అవసరమొస్తే’కథలో దళితులు తెచ్చిన సరుకులు, ధాన్యం, పండ్లు, ఫలాలు, మొదలైన వస్తువులపై పసుపునీళ్లు, పసుపు చల్లడం. గోమూత్రం చిలుకరించి శుద్ధీకరించుకుంటారు. అవసరాన్ని బట్టి మాత్రమే వివక్షను ప్రదర్శిస్తారని తెలుపుతుంది. 
మాదిగ స్నేహితునితో అన్న పెళ్లికి అన్ని పనులు చేసింతర్వాత నువ్వు మాదిగవని కులవివక్షల్ని చూపిన కథ కేపి లక్ష్మి నరసింహ ‘అన్న పెళ్లయ్యేంత వరకు’ కొట్టొచ్చినట్లు చిత్రించాడు.  

3. దళిత వృత్తి చిత్రణ: దళితులు వృత్తులు ఉపకులాల వృత్తులు కథాత్మకంగా కళాత్మకంగా కథాసాహిత్యంలో ఇతివృత్తాలయ్యాయి.
డప్పు: డప్పు తొలి వాయిద్యం. పండుగలకు పబ్బాలకు ముందు నడిసేది. దప్పు దరువులతో విషాదము, వినోదము వినిపిస్తుంది.
ఐతా చంద్రయ్య గారి ‘డప్పు17 చిత్రీకరణలో మాదిగ జయమ్మ భర్త నాగరాజు గతంలో డప్పు వాయిద్యకారుడు. ‘తాలే లెల్లియ్యలే’ పాడుతుంటే మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసేది. ప్రస్తుతం అతడు లేడు. చదివి ఉద్యోగం చేస్తున్నందున కొడుకు డప్పు ముట్టుకోడు. మనువడు డప్పుతో ఆడి పగలగొడ్తాడు. జయమ్మ తల్లడిల్లిపోతుంది. తమ జీవితంలో డప్పుతో పెనవేసుకున్న అనుంబంధాలను, వాస్తవాలను తెలుపుతుంది.
దప్పులు కొట్టడంలో ప్రత్యేకమైంది సావుదప్పు. వివిధ పద్ధతుల్లో దరువులేస్తారు. ఒకవైపు దప్పుకొడుతూ మరోవైపు నుదుటితో చిల్లర పైసలు అందుకోవడం, మట్టి కప్పలో నిలిపిన రూపాయి నోట్లను కనురెప్పల మధ్య ఒడుపుగా పట్టుకోవడం మొదలైన నృత్యరీతుల్ని అంజయ్య గారి ‘ఇనాం శెలుక’11 కథలో చూడవచ్చు. మాల మాదుగులకు బూమి ఆశ చూపి మహ్మదీయ మతంలోకి మార్చుట కొరకుపెద్దింటి అశోక్‌ కుమార్‌ ‘సావుదప్పు18 కథ వివరించింది.
దాగుడు మూతలు ఆడటం చాలా మందికి బాల్యంలో ఉంటది. దప్పు శబ్దం ద్వారా మాదిగలు దాగుడు మూతలు ఆడుతారు. ఆడే విధానాన్ని గోగు శ్యామల ‘జాడ’19కథ ద్వారా అంతరించి పోతున్న కళకు అక్షరాత్మకంగా జీవం పోసింది. దెబ్బ కొట్టిన తీరు ముందుకు, పక్కకు, వెనుకకు, వెళ్లి దాసిన వస్తువును దొరికిచ్చుకుంటారు. దొరికిచ్చుకుంటే గెలిసినట్టుగా ప్రకటిస్తారు.
గ్లోబలైజేజషన్‌ పుణ్యమా ప్రతీది ప్యాకేజే. ఆధునిక సంస్కృతి అరవు తెచ్చుకుంటున్న వ్యవస్థలో చావుకూడా ఒక ప్యాకేజే అని చెబుతూ దప్పులు కొట్టడంతో శవయాత్ర ప్రారంభమైందని పేర్కొన్న కథ బి.వి.ఎన్‌ స్వామి గారి ‘చావు ప్యాకేజి’20 కథ.
చెప్పుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూనే ఆత్మ గౌరవం ప్రకటించిన దార్ల రామచంద్ర గారి కథ ‘కిర్రు చెప్పులు’21 కథ. మనుమరాలు అడిగినందుకు తాత చెప్పిన రహస్యం మన మాదిగ వృత్తి వూడితే వూడిరది. ఆత్మ గౌరవం మిగిలింది. అంటరాని తగ్గుముఖం పట్టింది. ఈ పాక్షిక మార్పుకు మానసిక సంతోషంగా ఉంది. ఆర్థిక విధానంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని వివరిస్తుంది.
చెప్పులు: మాదిగల వృత్తి చెప్పులు కుట్టడంతో అనుబంధాల్ని నెమరేస్తూ వొచ్చిన కథలు బోయజంగయ్య గారి కథ ‘చెప్పులు’,కేపి లక్ష్మినరసింహ కథ ‘సెప్పుల సాయవ్వ’, నోట్ల రద్దు వల్ల చెప్పులు కుట్టే జీవితాల్లోని అలజడిని సిద్దెంకి యాదగిరి ‘పిడుగు’ మొదలైన కథలు ఉన్నాయి. 
ఉపకులాల చిత్రణ : మాలలు, మాదిగలు దళితులలో ప్రధాన కులం. తమ కులాల ఔన్నత్యాన్ని కాపాడుటకు కొన్ని కులాలను పోషిస్తారు. వారు ఆశ్రితులు. వారే ఉపకులం. వారు తమ కులాల కీర్తి ప్రతిష్టలను వివరిస్తూ మరో తరతరానికి అందిస్తుంటారు.  ప్రత్యామ్నాయ సంస్కృతిని సారథులు. పటం, బాగోతం, కథాగానం, ప్రవచనం, యక్షగాన మొ॥న రూపాల్లో ప్రదర్శిస్తారు.
డక్కలివారు జాంబవంతుని చరిత్రను పటం ద్వారా వివరిస్తారు. డక్కలిని మాదిగలు ముట్టుకోరు. డక్కలి అన్నం అడుక్కునే విధానం ఆకిలి అంచుకు ఒక రోలు ఉంటుంది. మాదిగలు ఆ రోలు ఎక్కి అంటకుండా మీదినుంచి సిబ్బితో వేస్తరు. అనుకోకుండా ముట్టుకుంటే బంగారు తీగెతోని కాల్చాలి. మాదిగ విద్యార్థి స్వగతం. చదువు బుద్ధిని వికసింప జేస్తది. నేను బడిల ఎక్కువోల్లను ముట్టుకుంటున్నాను. మనోల్లను మనం ముట్టుకుంటే తప్పేంది? అని తల్లిదండ్రుల్ని ఎదురించిన సంస్కరణాత్మక కథ. పాఠశాల వయసులోనే దక్కలిని ముట్టుకున్నందుకు జరిగిన సంఘర్షణను తెలిపిన సిద్దెంకి యాదగిరి ‘బోధ’22 కథలో ‘‘బర్లకాడికి బర్లు పోతయి. గొర్లకాడికి గొర్లు పోతయి. మనిషి దగ్గరకి మనిషి పోకుంట ఎవడు జేసేరా వాని యాలిముండమొయ్య’’ అని ఉన్నత కుల పాత్ర ద్వారా సమానత్వాన్ని వివరిస్తుంది. 
మాదిగలు తమకున్న మాన్యంలో కొంత పొలం త్యాగానికి తీస్తారు. డక్కలి వారికి త్యాగం చెప్పడంలో మాదిగలు వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. కూడి చర్చిస్తున్నపుడు డక్కలి పోషవ్వ నా త్యాగానికని తీసిన భూమిలో పండిన పంటను ఇచ్చి త్యాగం చెప్పుమని సమస్యను పరిష్కారం చేసినట్లు చిత్రించిన కథ జూపాక సుభద్ర ‘రాయక్క మాన్యమ్‌’23 కథ వివరిస్తుంది. 
సిందోల్ల వృత్తి బాగోతం. మాదిగల ఆశ్రయం పొందుతారు. త్యాగం ఒప్పుకున్న తర్వాత ఆట ఆడుతారు. ఆటలు ఆడినన్ని రోజులు సంతోషంగా ఉంటుంది. మాదిగల్ని సిందోల్లు వరుసలతో పిలుస్తారు. సామ్రాజ్యవాద ప్రభావం ఎంత దారుణాన్ని సృష్టిస్తుందో తెలుపుతున్న కథలు వచ్చాయి. చిందు భాగవతుల జీవనరేఖ జీవన సంధ్యలో పూర్వపు యక్షగానాల ప్రదర్శనలు గుర్తుకొస్తాయి. ఆనాటి ప్రదర్శనలు కరువైనాయని ఐతా చంద్రయ్య ‘సంధ్యా సమయం’24 కథ ద్వారా వివరిస్తాడు.
త్యాగం చెప్పక పోవడం వలన జరిగిన అనర్థాలు తైదల అంజయ్య కథ ‘త్యాగం.25’లో వివరించారు. మాదిగలు త్యాగం చెప్పకపోవడం వలన ఉపాధిలేక ఊరిడ్సి పట్నం పోయి మంగళి పని చేస్తున్న సిందు నర్సయ్య, మాదిగ మల్లయ్యలు కలుసుకుంటారు. చిందు నర్సయ్య తన బాధల్ని చెప్పుకుంటాడు. 
వీరి మధ్య సంభాషణలు జరుగుతున్నంతసేవు మల్లయ్య ఆ.. ఊ అనుకుంటూ అరిసెంద్రుని ఏషమేసి స్మశానంల నిలవడ్డ   
సిందు నర్సయ్యనే మెదులుతుండు. గోసంగి ఏషమేసి చావడికాడ కులపురాణం విప్పిచెప్పుతున్న జాంబవంతడై చిందేస్తున్నడు.‘‘నువ్వన్నది నిజమేరా నర్సయ్యా! ఎవనికెవడేం బెట్టనపుడు ఎక్కువ, తక్కువ లెక్కడియి? కులాలెక్కడియి? లోకమ్మీదున్నయి రొండే కులాలు. ఉన్నోనిదో కులం. లేనోనిదోకులం. గంతే పాబిడ్డా! ఇగవోదాం.’’ అనుకుంటూ ఇద్దరు రోడ్డు మీదికి నడిసిండ్రు.
ఉపకులాలకు త్యాగం లేదని కొన్నిసార్లు అవమానపరచిన సంఘటనలు కూడా ఉంటాయి. జాంబ పురాణం ఎవనికి కావాలే. పని పాట లేక ఓ ఏషం కట్టుకోను వచ్చినారు. మొదలైన దూషణలు, తిరస్కారాలు కూడా స్వగతాలుగా ఉంటాయి. మనసు బాధల్ని గాథలుగా మలచడం కొందరికే సాధ్యం. వాటిని తెలుగు సాహిత్యంలో స్థానం కల్పించిన ఘనత డా. గడ్డం మోహన్‌రావు ‘త్యాగం’26 కథకి దక్కింది. పదిహేనేండ్ల తర్వాత ఊరికి త్యాగానికి వోతే సిందులకు జరిగిన పరాభావాన్ని కళ్లకట్టినట్లు  చూపించింది. వీరు రాసిన మరో ‘ఇచ్చురు గాళ్లు’27 కథలో ప్రధాన కులాల వారు ఆశ్రిత కులాలను ఎంత హేళనగా మాట్లాడుతారో తెలుపుతుంది. బొందలు తోడే బొందయ్య చనిపోతాడు. అతనికోసం బొందతోడేందుకు చదువుకున్న యువకులతో సహా ఎవ్వరు ముందుకురారు. దాంతో కూతురును బొందతోడిన సబలగా ఐతా చంద్రయ్య ‘సరళ’28 కథ ద్వారా నిరూపణ చేస్తాడు. బేగరి కథల పేర బూతం ముత్యాలు కథా సంపుటం తెచ్చాడు. గుడిపల్లి నిరంజన్‌ గారు ‘నీరటికాడి కల’ కథ నీటితో జీవితం చిత్రిస్తుంది. డా. తాళ్లపల్లి యాకమ్మ ఆశ్రిత కులాలైన చిందు వారిమీద ‘బతుకు’, డక్కలి వారి స్థితిగతులను వివరిస్తూ ‘ఆశ్రిత బతుకులు’ కథ రాసింది. 

4.దళిత స్త్రీ వాదం: స్త్రీ పురుషుల మధ్యగల అధికార సంబంధాలకు మాతృత్వానికి పవిత్రతను ఆపాదించి పెడుతున్న పితృస్వామ్యాన్ని, సవాల్‌ జేసింది స్త్రీవాదం. భారతదేశంలో పితృస్వామ్యమే కాదు కులస్వామ్యం కొనసాగుతుంది. తన పుస్తకం ముందుమాటలో దళిత స్త్రీ వాదం జూపాక సుభద్ర గారు ‘‘అగ్రకులాల స్త్రీలకు పితృస్వామ్యమే శత్రువు అంటారు. పితృస్వామ్య విముక్తే వారి విముక్తి. కాని దళిత మహిళల విముక్తి చాలా పీడనలతో ముడిపడి వుంది. కుల హింసలు, శ్రమదోపిడి, దొర, దొర్సాని ఇంటి మగస్వామ్యాలు, ఆకలి హింసలు యివన్నింటి నుంచి దళిత మహిళ విముక్తి చెందాల్సి వుంది29.’’అని ఒక స్పష్టత ఇష్టత ఇచ్చారు. పితృ స్వామ్యాన్ని, కులస్వామ్యాన్ని రెంటినీ మిళితం చేసి కథలు రాయడం దళితులకు తప్పనిసరి బాధ్యతయింది.  తెలంగాణ తొలి దళిత రచయిత్రి మామిడిపూడి సత్యవతి. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యల వల్ల స్త్రీ లేకుంటే పిల్లలుపడే కష్టాలను చిత్రించిన  ‘‘తెరతొలగింది’’30 కథ. శశిరేఖ, కృష్ణ కదులుతున్న రైలులో ఉన్నారు. కృష్ణ చెబుతుంటే వింటున్నట్టే వింటుంది. గుండె దడదడలాడుతుంది. ఆలోచనలు తలల్లోంచి ఆవిర్లు వస్తున్నట్లుగా వుంది. రైలు ఆగింది. ఒక ముసలమ్మ ఇద్దరు పిల్లలతో కంపార్టుమెంట్‌లోకి ప్రవేశించింది.
ముసలమ్మను శశిరేఖ ఆరా తీస్తుంది. దుర్మార్గుడైన మా కొడుకు మరో యువతి ఆకర్షణకు లోనవడం వల్ల బి.ఏ చదివిన కోడలు కుమిలిపోయింది. నేను వారించిన. ఇలాంటి సంబంధాలు ఎక్కువరోజులు ఉండయని చెప్పినా కనీసం పిల్లలకోసమైనా బతకాల్సింది. చనిపోయింది. ఆ యువతి రెండో భార్యగా తిష్టవేసిందని చెబుతుంటే కృష్ణ అసహనంగా చూస్తున్నాడు. నా పిల్లలకు సవతితల్లితో ఇలాంటి బాధలుంటాయని తలంచి రైలు కదులుతుండగానే శశిరేఖ దిగి బస్టాండ్‌ వైపు నడిసింది. 
ఎనిమిదేళ్ల కాపురంలో ఏ చింతలేని శశిని గారడి చేసాడు. బస్సులో పరిచయమై నెలరోజులే అయినా అతన్ని విడిచి వుండలేని పరిస్థితి. నా పిల్లలకోసమే నా జీవితమని తలుచుకుంటుంటే మనసు దూది పింజలా తేలిపోయింది. వచ్చి తలుపులు తీయగానే అత్త గయ్యిమని లేసింది. స్నేహితుల ఇండ్లలో ఉండిపోను ఈ ఒక్కసారి క్షమించండి అత్తయ్య అని వేడుకుంటుంది. యిక మనిద్దరమే ఒకరికి ఒకరం తోడు అన్నట్లుగా ఒకడి మీద ఒకడి కాలుచెయ్యి వేసిపడుకున్నారు. ఆ దృశ్యం చూడగానే  శశిరేఖ హృదయం ద్రవించింది. కన్నీటితో ఇద్దరినీ గుండెలకు హత్తుకుంది.
దళిత సర్పంచ్‌ల దీనస్థితిని చిత్రించిన డా. పసునూరి కథ ‘ఊగి ఊగి ఉయాల’31.‘‘ఏడ మారుతది బిడ్డా మన రాత! నేను సర్పంచినేగని నా ఇష్టంతోటి రాజ్యమేలనీకి సర్పంచ్‌ అయినానురా, ఆ పెద్దిరెడ్డి పటేల్‌ నిలబడితే నిలబడ్డ. ఏలి ముద్దరెయ్యమంటే ఏసిన. సూత్తాంటే ఐదేండ్లు వొడిసే ... సర్పంచ్‌గా వున్నా గూడా గిట్లనే కూలీనీ చేసుకుంటి. ఇప్పుడు సర్పంచిగిరి పోయినంక గూడ మల్ల గదే దిక్కైంది బిడ్డా’’అని అగ్రకుల స్త్రీవాదాన్ని తిప్పి కొట్టింది పెద్దమ్మ.
స్త్రీలపట్ల వివక్ష, హింస అస్థిత్వస్పృహ కలిగినప్పటినుంచే కథల్లోకి ప్రవేశించాయి. పురుషాధిపత్యానికి దళిత స్త్రీ ఎలా బలయితుందోడప్పోల్ల రమేష్‌ ‘దునియల’32 కథ చిత్రిస్తుంది. ఒక దశలో జీవితం మీద విరక్తిపుట్టినా చావడానికి సిద్దమై చావు పరిష్కారం కాదని అనుకున్నది బతికి సాధించడమే నిజమైన పరిష్కారం చూపుతది. 
ఉమాపతి బి. శర్మ ‘ఏది పాపం ` ఏది పుణ్యం’33 అనే కథలో శివరాత్రి నాడు నాగుమల్లి అనే మాల పిల్ల హరికథ వినడానికి వచ్చినామెను కులంపేరన దూషించి వెళ్లగొడుతారు. పోతున్న నాగుమల్లిని నోరుమూసి ఎత్తుకొని దొడ్లెకు గుంజుకపోయి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దొర పాము కాటుతో అంతమవుతాడు. 
మాతంగి, బసవిని, దేవదాసి..మొదలైన పేర్లతో పిలవబడుతున్న జోగినీల బతుకును చిత్రించిన ఐతా చంద్రయ్య ‘కలికి గాంధారి’34 కథ. బహుశ వీరిపై రాసిన తొలి కథ కావొచ్చు. గాంధారిని, తల్లిని, అమ్మమ్మను ఊరి దొర సంతతి ఉంపుడుకత్తెలుగా వాడుకుంటారు. గాంధారి తన కూతురు మేనకను చదివిస్తుంది. ఎల్లారావు కొడుకు మేనకను అత్యాచారం చేయబోతుంటే గాంధారి అతడిని కత్తి పీటతో పొడిసి జైలుకెలుతుంది. గాంధారి జైలునుంచి విడుదలయ్యే నాటికి ఎల్లారావు జైలు సూపరిండెంటుగా వస్తాడు. గాంధారిని పెళ్లిచేసుకుంటానంటాడు. గాంధారి ధైర్యంగా ‘‘నేను ఆనాటి గాంధారిలా కండ్లున్న గుడ్డిదాన్ని కాదు. నీ వంశం నీ కొడుకుతో అంతమైంది. నా వంశం నా మనువనితో షురువైంది.’’ అని తిరస్కరించి బయటకి వస్తుంది. 
  పాఠశాలలో ఉన్న స్నేహం ఊళ్లోకి వచ్చేసరికి ఏమవుతుందో తెలిపేది జూపాక సుభద్ర గారి ‘బల్లె దోస్తులు ఊల్లెగాదు’35లో బట్టలు, గాజులు ఇచ్చి పుచ్చుకోవడం కులం వల్ల ఏర్పడే అవస్థను తీర్చి దిద్దింది. మాదిగలకు బతుకమ్మ లేకుండా చేసిన మనువాదుల కుట్రల్ని పసిగట్టి చిత్రిక పట్టిన జూపాక సుభద్ర గారి ‘గద్దెత్కపోయిన బత్కమ్మ’ కథ చిత్రిస్తుంది. ఎక్కువ కులాలతో మిళితమవడాన్ని చిత్రించిన తప్పెట ఓదయ్యగారి ‘మల్లక్క’ కథ. మల్లక్క కుర్మ. రచయిత తన కుమార్తె అడిగినందుకు గతం చెప్పుతడు. మా అయ్య సచ్చిపోయినపుడు ఆ అక్కనే సందం చేసిందీ. నా సదువుకు సాయం. అతీగతీ లేని యాల్ల అన్నీ తానై నాకు సాయం చేసింది. ఆప్పటి బాధలు చెపుతూ మనసును పిండేస్తడు. అది కథకాదు జీవితం గనుక మనసుతెరల బతుకు వెన్నెలను పిండోలే ఆరవోస్తడు.
తెలంగాణ పలుకుబడులను ప్రయోగించిన పాకాల యశోదరెడ్డి గారి ‘కొత్త బాట’ కథలో పట్నం నుంచి ఇంటికి పోగానే పాలేరు బిడ్డా అక్కా అంటు వచ్చి కాళ్లను చుట్టుకుండడం వలన క్రమేపి అంటరాని తనం తగ్గుతుందని దర్పణం పడుతుంది.
బూతం ముత్యాలు ‘మాయమ్మ మల్లమ్మ’, జాజుల గౌరి ‘అమ్మ’ సిద్దెంకి యాదగిరి ‘నాయనమ్మ’ స్త్రీవాద కథలు.

5. విద్యాభ్యాస చిత్రణ:  ‘‘సామాజిక మార్పుకు విద్య ఒక ఆయుధం’’ అని డా. బి. ఆర్‌ అంబేద్కర్‌ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో మందిని విద్య వైపు మళ్లించింది. చదవు కోసం పడిన బాధల్ని గాథలుగా మలిచింది అక్షరం. కన్నీళ్లు మిగిల్చిన కష్టం కడతేరిన పిమ్మటకావ్య జగత్తులో కీర్తి కిరీటాన్ని ధరించింది. 
చదువుకోసం అంబేద్కర్‌ స్ఫూర్తి ఎంతో ఉపయోగపడిరది. జాజుల గౌరి ‘విద్యార్థి’36 కథలో దళిత పిల్లలు  వారి బాల్యం. వారి చదువు తీరుతెన్నులు  ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు, బాధలు ఆవేదనలు ఎలా వుండేవో చిత్రిస్తుంది. ఆలోచనలకు అంతుండదని వివరించడం ముఖ్యఉద్దేశ్యం. ఈమె రాసిన కథల్లో చదువుకు ప్రాధాన్యమిచ్చిన కథలు ‘చదువు’, ‘పగటిబెల్లు’. ఈ రెండు కథలు పేదపిల్లలకు అబ్బాయిల్లా అమ్మాయిలకు కూడా చదువాలని ఆశ ఉంటుంది. 
ఆర్థిక స్థితి చదువుకు ఆమడ దూరం తరిమేస్తుంది. అయినప్పటికీ గట్టి సంకల్పం లక్ష్యం వైపు పయనింపజేసేట్లు స్ఫూర్తి నింపే కథ గోగు శ్యామలగారి ‘రడం’37కథలో చిత్రించింది. 
కిటుకు తెలియాలి గాని బతుకు మారుతుందని తెలిపే కాలువ మల్లయ్య గారి ‘కిటుకు’38 కథలో చిత్రించింది. దళితులమైన మమ్ము గౌరవిస్తలేరు. దళితాసఫిర్‌ని చాలా గౌరవిస్తున్నారు. ఇది కేవలం చదువువల్లనే సాధ్యమనుకొని కొడుకును చదివించితే కొంతైనా గౌరవం పొందుతాడు.
చదువుపట్ల పేదలకుగల ఆర్థిని ప్రతిబింబిస్తూ బి.ఎస్‌. రాములు చిత్రించిన కథలు ‘బడి’, ‘పాలు’ కథలో మంచి చదువు చదివి మంచి ఉద్యోగాలు చేయాలని కలలు కనే ఇతివృత్తం. వీరి మరో కథ  ‘సదువు’లో లచ్చయ్యసారు తన శిష్యుడు గంగాధారి చదువుకోనని మొండికేయడంతో ఓదార్చి మనసులో అయినా పాఠాలను అందుకోగలవాడే తన స్వేచ్ఛకేదో అడ్డంకిగా ఈ చదువు నోట్సు మారిందనుకున్నాడు.
ఓ స్త్రీ చదువడం కోసం అడుగడుగున ఆటంకాలు. పెళ్లయ్యింది. దళితులు చదవడమే పెద్ద ఆటంకం.పట్టుదల ఉండాలే కాని ఏదైనా సాధించవచ్చని తెలిపిన కథ ‘అడగడుగున సుడిగుండం’ చదువుకోసం ప్రయాసపడి ప్రయోజకురాలయిన జీవితసత్యాన్ని ఆవిష్కరించింది.


6.దళితోద్యమ ప్రభావం: మహారాష్ట్రలో అన్నాబావుసాఠే తెచ్చిన దళితోద్యమ ప్రభావం ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ఎనభై దశకంలో అస్థిత్వ పోరాటాలు ఊపందుకున్నాయి. ప్రారంభంలో దళిత వాదం ఏకతాటి మీద ఉన్నది. క్రమేపి దళిత స్రీ వాదం, బీ.సి, మైనారిటి, దళిత క్రైస్తవ సాహిత్యాలుగా విడిపోయింది. 
మాదిగ పదం ఆత్మగౌరవ సూచకంగా ధరించేలా తెచ్చిన ఉద్యమం మాదిగ దండోరా. మంద కృష్ణ మాదిగ అనే పేరుతో ఆత్మగౌరవ ఉద్యమం తెచ్చింది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు ఉద్యమం పురుడుపోసుకుంది. దళిత సాహిత్య రెండు పాయలుగా చీలింది.
హైద్రాబాద్‌లో జరిగిన సంఘటనలాధారంగా అంబేద్కర్‌ జయంతులకు జరిగే చిత్ర విచిత్ర సంఘర్షణలకు తీవ్రమైన సమస్యలను చిత్రిస్తున్న ‘అంబేద్కర్‌ సాక్షిగా...’ కథ తెలియజేస్తుంది. అధికార, ప్రతిపక్షనేతలు పూల మాలలు వేస్తారు. మాల గ్రూప్‌, మాదిగ గ్రూప్‌లుగా విడిపోయి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. చివరకు మాలలు, మాదిగలు ఎవరు దండ వేయని పరిస్థితులు అంబేడ్కర్‌ సాక్షిగా జరిగాయని కథలో వివరిస్తాడు.
‘‘మాదిగల జీవితం నుండి దళిత సాహిత్యం పుట్టింది. కొనసాగుతుంది. మాదిగల జీవితాలే దళిత సాహిత్యానికి పట్టుకొమ్మలు అవుతున్నాయి’’39 అని గుండెడప్పు కనకయ్య పేర్కొన్నారు. మాదిగ దండోర ఉద్యమంకు కొంతమంది మాలరచయితలు మద్దతు పలికారు. కలెకూరి ప్రసాద్‌ మాటల్లో చెప్పాలంటే, ‘‘మాల మహానాడు పుట్టుకే దళిత చైతన్యానికి వక్రీకరణ.’’40 సమాజ ఉపయోగకరమైన ఎన్నో ఉద్యమాలను నిర్మించి, ఫలితాలు సాధించిన దండోర ఉద్యమం, వర్గీకరణ వద్దనే మహానాడు కుల స్పృహ పెంచినా దళితుల్లో రాజకీయ చైతన్యం నింపలేక రాజ్యాధికారం వైపు నడిరపించ లేకపోయాయి.
దండోర వర్గీకరణతో సమాజంలో ఉన్న సమస్యల మీద పోరు చేస్తూనే వుంది. దండోరా ఉద్యమం మాదిగలకే కాకుండా దళిత బహుజనుల్లో చైతన్యాన్ని తెచ్చింది. వివిధ కుల పోరాటాలు ఉద్భవించాయి. ఉద్యమ నేపథ్యాన్ని బలంగా చిత్రించిన ప్రక్రియ కవిత్వం. కథ. అనుకున్నన్ని కథలు రాలేదని విమర్శకుల అభిప్రాయం.
డా॥ నిత్యానంద రావు తెలంగాణా తొలి దళిత కథల గురించి ‘చినుకు’ పత్రికలో ప్రస్తావిస్తూ ‘‘గుండె డప్పు కనకయ్య పూర్తి దళిత భాషలో దళిత జీవితాన్ని దళిత సంస్కృతిని చిత్రిస్తూ ‘మేమిట్లుండం’ అన్న కథా సంపుటిని ప్రకటించాడు. ఇది తెలంగాణ తొలి దళిథ కథాసంపుటి. బోయ జంగయ్య దళితోద్యమం రాకముందు దళిత చైతన్యాన్ని చిత్రించిన ముందుతరానికి చెందినవాడైతే, దళితోద్యమ స్ఫూర్తితో తయారైన రచయిత కనకయ్య.  వీరి సంపాదకత్వంలో ‘ఎదురు చూపులు’(1999) తెలంగాణ మొట్టమొదటి దళిత కథా సంకలనం.సిద్దెంకి యాదగిరి ‘పంచుకోండ్రి’41కథ చిన్న చిన్న ఉదాహరణలతో వాస్తవాన్ని ఎంతో సమర్ధవంతంగా చిత్రించింది. వర్గీకరణ చేస్తానని చెప్పి మోసం చేసిన సోనియా గాంధీ హైద్రాబాద్‌ వచ్చినపుడు కాంగ్రెస్‌ భవన్‌ కాలపెడుతూ ఆ మంటల్లో తగలబడి కొన ఊపిరితో కొట్టుకాడుతున్న పొన్నాల సురేందర్‌ మాదిగ అవస్తను టీవిల్లో చూస్తూ సంఘర్షనకు లోనై, అమర వీరుల త్యాగాలను చూసి చలించిన మానసిక పరివర్తనలను చిత్రించినది ‘అమరలకు జోహార్‌’ కథ వివరిస్తుంది. మైనారిటి వాదంలో స్కైబాబా ‘జమ్మి’, ‘దస్తకత్‌’ క్రైస్తవ విధానంలోని అంత్య క్రియలను సిద్దెంకి యాదగిరి ‘సావు’ కథ చిత్రిస్తుంది.

7. నయా దళితవాదం:  ఈ దేశంలో కులం రోజు రోజుకీ అనేక రూపాల్లోకి మారి తీవ్రమవుతుంది. ‘‘కులం అనేక చోట్లకి అనేక రూపాల్లో మారుతున్నందు వల్ల దీనిని నయా దళితవాదం’’ అని ఏ. రవీంద్ర బాబు42గారన్నారు. బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ చట్టబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితుల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఉద్యోగానికి అందుబాటులో ఉంటున్న క్రమంలో పట్టణాల్లో, నగరాల్లో కిరాయిరూంలకు వెళుతున్నపుడు మారిన కులం గురించి తెలుస్తుంది. వస్తువులో వచ్చిన మార్పు దృష్ట్యా నయా దళితవాదం అంటున్నారు. కొందరు రంగు, కొందరు మాట విధానంతో మీరు రెడ్డీలా అని డొంక తిరుగుడుగా అడిగి కులం పేరు తెలుసుకుంటున్నారు.
గెజిటెడ్‌లాంటి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే కులం పేరు తెలియగానే మా వాళ్లు టులెట్‌ బోర్డు తీయనుట్టున్నారు. జస్ట్‌ నిన్ననే అడ్వాన్స్‌ ఇచ్చి వెళ్లారని చెప్పి కిరాయకు రూంలు ఇవ్వరు. కాలనీలో అట్లనో ఇట్లనో కాలనీలో పదేళ్ల నుంచి కిరాయికి, లేదా స్వంత ఇల్లు కట్టుకొని నివసిస్తున్నా వారి శుభకార్యాలకు పిలువరు, దళితుల శుభకార్యాలకు రారని చెప్పే సిద్దెంకి యాదగిరి ‘తప్ష’కథ. అపార్ట్‌మెంట్‌లలో కిరాయకు, గేటెడ్‌ కమ్యూనిటి, వివిధ పేర్లతో వెలిసే రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కులం ఉందని చెప్పే వాస్తవాన్ని విప్పి చెప్పే కథ పసునూరి రవీందర్‌ ‘గోవర్ణం’ కథ వివరిస్తుంది.
        ఎక్కడికి పోతున్నా కులం నీడలా వెంటాబడుతుందని వెలిబుచ్చే కథ డా॥ పసునూరి రవీందర్‌ ‘వేరెవర్‌ యూ గో’ కథ  పాశ్చాత్య మిత్రుడైన బెంగ్త్‌తో రచయిత గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నపుడు అనేక సంఘటనల సమాహారాన్ని ఆంగ్లంలో అనువదించి చెపుతుంటాడు. అప్పట్దాక చర్చలో పాల్గొన దొరను చూసి ‘‘వేర్‌ ఎవర్‌ యూ... గో ... ది క్యాస్ట్‌ ఫాలోస్‌ ఇండియన్స్‌’’ అని బెంగ్త్‌ అన్నాడు. స్కైబాబ గారి ‘విజిటేరియన్స్‌’ కథలో శాఖాహారులకు మాత్రమే ఇల్లు అద్దెకిస్తామని బాహాటంగా ప్రకటిస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి.

8. బహుజన తెలంగాణ వాదం: తెలంగాణ ఆరని పోరుకుంపటి. కరువు వాతలు. కన్నీళ్ల గోసలని ఒలికించారు. కలంతో పలికించారు.తెలంగాణ మలిదశ ఉద్యమం దళిత బహుజన విద్యార్థి యువకులు వీరోచితంగా పోరాడారు. దాదాపు పన్నెండు వందలకు పైగా బలిపీఠమెక్కిన విద్యార్థి యువకుల్లో నూటికి తొంభైశాతం దళిత బహుజనులే. 
తెలంగాణ పోరు సంఘటనలను, సంఘర్శనలను వివరించిన వాస్తవ జీవితాలు దళిత కథకులు కథలుగా సాహితీ నుదుటిపై తిలకం దిద్దారు. పసునూరి రవీందర్‌ ‘తను నేను ... ఇంకొన్ని కొత్తపొద్దులు’, సిద్దెంకి యాదగిరి ‘కీలెరిగిన వాత’, చెన్నరాజు గారి ‘పైలం బిడ్డా!’, పొన్నాల బాలయ్యగారి ‘పాలమూరు పాలేరు’, కథలు, మొ॥వి కలవు.

9.విప్లవ ప్రభావ చిత్రణ: డప్పు కొడుతూ జీవనం సాగించే ఒక తండ్రి తన కొడుకు పట్ల ఆలోచనలు వివరించే కాలువ మల్లయ్య గారి ‘అగ్ని గుండం’43 కథ  తెలంగాణ ప్రాంతం అంతా నక్సలైట్‌ ఉద్యమ తీవ్రతల వల్ల ఊళ్లు అగ్ని గుండాలు తలపిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదువుతున్న తన కొడుకు అంబేద్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుతాడా? ఎన్‌కౌంటర్‌ లో చనిపోతాడా? ఆలోచిస్తుంటాడు. అప్పటి పోలీస్‌ నిర్బంధం, రాజ్య నిరంకుశత్వ వైఖరిని ప్రతిబింబిస్తుంది. 
పాటలు తూటాలై ధ్వనిస్తాయని చూపే కాలువ మల్లయ్య గారి ‘వెంటాడే పాట’ కథ. నక్సలైట్‌ ఉద్యమపాట క్షిపణిలా ప్రజలగుండెల్ని మండిరచింది. పెళ్లిలో విప్లవ పాటలు వేసుకుని పెద్ద శబ్దంతో వింటున్నారు. ఈ పాటలు ఎందుకు? భక్తి పాటలు వేసుకోవాలని వారిస్తుంటారు. కాని నిర్వాహకులు ఇవే పాటలు వింటామని తెగోసి చెప్పడంతో పాటలు కూడా భయపెట్టాయని తెలియజేస్తుంది.
కె.వి నరెందర్‌ గారి ‘దొరొచ్చిండు’ కథలో పదహారేళ్ల కిందు ఊరిడ్సి పోవడానికి కారణమైన నక్సలైట్‌ తండ్రిని ఊల్లోకి వచ్చిచూపుకోసం హైద్రాబాద్‌ తీసుకెళ్లి కంటి ఆపరేషన్‌ చేయించాడు. చూపు వచ్చిన తర్వాత నన్ను నీ కొడుకు మరో పదేళ్లు ముందు నన్ను పట్నాలకు పంపించి ఉంటే సిటీనే కొనెటోన్ని. అని చెప్పుతుంటాడు. వచ్చేటపుడు ఈ వెలుతురు నాకొద్దని దొర ఇప్పించిన బస్సు కిటికీ గుండా బయట పారవేస్తడు. 

మరికొన్ని దళిత కథలు: ఆడెపు లోక్ష్మీపతి ‘రాబందులు’,  
 జూకంటి జగన్నాథం` ‘కళేబరం’, ‘చదువు కన్ను’, 
జాతశ్రీ ‘ఆర్దరావం’,   
దేవరాజు మహారాజు ‘పొడవని పొద్దు’,  
నవీన్‌ ‘నిప్పు రవ్వలు’,  
నాగమణి ‘మనువుగాడి పెళ్లి’   
 దార్ల రామచంద్ర ‘చెప్పులు’, 
‘బతుకు బడి’ కాసుల ప్రతాపరెడ్డి,
‘వెంటాడిన అవమానం’, ‘నీలి’, ‘కొత్తతరం’ ‘శిలువకు తొడిగిన మొగ్గ’, ‘ఎల్లమ్మ’, బి. దామోదర్‌ రావు  ‘గొర్లు’, ‘ఎట్టి’, ‘ధ్వని’, ‘ఊరిబాయి’ 
అల్లం రాజయ్య ‘మార్పు’, ‘సంఘం కథ’, ‘ఎదురుతిరిగితే’, ‘పుడమి పుత్రులు’, ‘మహదేవుని కల’, ‘మధ్యవర్తులు’
 ఐతా చంద్రయ్య ‘చంద్రహారం’, ‘పల్లెటూరి పిల్ల’
 తుమ్మేటి రఘోత్తం రెడ్డి ‘ధిక్కారం’, 
స్కైబాబ ‘ఓడిందెవరు’, 
మాష్టార్జి ‘అవసరమొస్తే’
పర్కపల్లి యాదగిరి ‘ఉసురు’ 
‘తెర తొలగింది’, ‘సుశీల’, ‘స్వేచ్ఛ’ మొదలైన కథలలో మామిడి సత్యవతి చిత్రించారు
'నాది బావ బెల్లం పెడితే', 'ఇన్స్పెక్టర్ మధు', 'అతుకుల బతుకులు' మొదలైన కథలు పోకల జోసెఫ్ రాశాడు
'అరిటాకులు' పైడి ముక్కల ఆనంద్ కుమార్
'అనురాగబాబు' తక్కెళ్ళ బాలరాజు
'గౌరడు' గూడ అంజయ్య
'పేదవాడి కన్ను' కలకోటి కిషన్ రావు, 
'ఇంకా ఎన్నాళ్లీ నరమేధం' దార్ల రామచంద్ర
'రెప్పల మీన రూపాయి' ఎండ్లూరి సుధాకర్ ఆనాటి సమాజంలోని అంశాలను వెలువరించారు.

'సమ్మక్క పున్నం'లింగాల రాజసమయ్య, 
'స్వాతి' బలిజేపల్లి విజయలక్ష్మి, 
'మనసు' ముగ్గురం రాజనర్సు, 
'బక్కయ్య నటన' చిలక భాస్కర్. 
'గంగమని', 'జనార్దన్ బతికే ఉన్నాడు' డా. దావీర రాములు, 
'పట్టాలత్తన్నయ్''శుద్ధి చేయాలె', 'రాయకమాన్యం', 'హౌ ఆర్ యు వెజ్', బడిలోనే దోస్తులు'మొదలైన కథలు రాసిన జూపాక సుభద్ర అత్యంత ప్రజాదరణ పొందాయి.
'మమేకం', 'వేకువ కోసం' పెరుమాళ్లా ఆనంద్, 
'జీతం' దాసరి లింగస్వామి, 
'రేపటి ప్రగతి', 'మేలుకొలుపు', 'నేటి సూర్యుడు'మల్లవరపు విజయ, 
'ఎర్ర దుక్కి', 'ఎగిరి ఎగరని జెండా' ఎం నారాయణ 
'దారులు' గట్టయ్య 
'జ్యోతి', 'దొరకని ప్రేమ' జూపూడి దిగిస రాశారు.
'కడుపు మంట' చైతన్య ప్రకాష్ 
'గంది దుళ్ళ' నూక పొంగు వెంకయ్య 
'రుణాను బంధం' అమృత వర్షిని జయరాజ్' దళితుల జీవితాన్ని రాశారు.
'నాన్నకు ఇచ్చిన మాట' కన్నెగంటి వెంకటయ్య
'రడం', 'తాటకి' గోగు శ్యామల
'అంతర్ మధురం' ముగ్గురం రామ్ శంకర్
'కావులూరు భద్రయ్య', 'మాతంగి దాసుదోషులెవరు?’, ‘మాతంగి’, ‘చెప్పిచ్చుక్కొడుతం’,కాలువ మల్లయ్య‘ఊరుమ్మడి బతుకులు’, సీయన్‌ రావు'' గుండె డప్పు కనకయ్య
'మాలపల్లె' భూతం ముత్యాలు
'గడ్డి పువ్వు' బోయిన్ భాస్కర్
'తెగిపడ్డ మల్లెలు' సుజాత సూర్య పల్లి
'తూర్పు' శ్రీనివాస్ గద్దపాటి
'పల్లేరు కాయలు' చిత్రం ప్రసాద్
'గ్రానైట్ భూతం' మల్లారపు రాజయ్య
'భూదేవి' తుమ్మల దేవరావు
'గూడెం లో ఎన్నెల' గరికపాటి మణిందర్
'రెండో మనసు మూడో మనిషి'గంధం విజయలక్ష్మి
'ఇల్లు దొరికింది', 'గుర్రప్పందాలు' డాక్టర్ మండల స్వామి
'బడిబాట' డాక్టర్ మంతని శంకర్
'మీరేమిటోళ్లు', 'మల్లక్క', 'కలి మాయ' తప్పట ఓదయ
'మాష్టి పోషవ్వ'  మేరీ మాదిగ
'గోరి', 'స్మోక్లెస్ కోల్' పొన్నాల బాలయ్య
'పాటనర్చిన నెమలి' పచ్చనూరు అనురాధ
'చిన్నమ్మ', 'వత్తవా మా ఊరికి' అయినాల సైదులు
'ముచ్చటగా మూడో ముడి' సంపతి సోమయ్య
 'కడుపు నొప్పి', 'అంటరాని ప్రేమ', 'పాతగోడలు', బైండ్ల సెంద్రయ్య కథలు' జిలుకర శ్రీనివాస్ 
'పని తట్ట',  'కుంగినపొద్దు' అనసూయ
'వెలి' పిట్టల శ్రీనివాస్
'తెగిపోని పేగు బంధం', 'కురుమయ్య కల' పరిమల్
'త్యాగం' తైదల అంజయ్య
'మనువుగాడి పెండ్లి' వి నాగమణి
'మమతల మల్లెలు', 'రక్షణ'తాళ్లపల్లి ఆట యాకమ్మ
'అద్దిల్లు' ఎలమంద
'గోవు' నిదానకవి నీరజ
'పరిమళం' నామా పురుషోత్తం
'కులం గాని కులం' బట్టు సుధాకర్
'బత్తెం' గాదె వెంకటేష్
'ఫెర్టిలిటీ' రజిత కొమ్ము
'కొన్ని ఎముకలు ఇంకొన్ని గింజలు', 'సాయం బండ'గుర్రం సీతారాం లు
'కిరాయిల్లు' విఠలాపురం పుష్పలత
'పాలమూరు పల్లె' గొర్ల బుచ్చయ్య
'ఇసుమూరు సోమక్క' సుధాకర్ అరూరి
డా. పసునూరి రవీందర్ 'సంపుడు పంజం', 'వేరెవర్ యూ గో', 'పెంజీకటి', అనగనగా ఒక బానిస కథ,  'తలదన్నినోడు'.... మొదలైనవి. 
సిద్దెంకి యాదగిరి ‘పిడుగు’, అంటరాని బతుకమ్మ’, 'బోధ' ఆఖరి కోరిక '
'కాల్వకిందికి' బండారు శంకర్ 
‘సాయిపెద్ది’, ‘గుండె నిండా జాలిబండ’, ఊరు మెచ్చిన మనిషి ..... మొదలైన కథలు గుడిపల్లి నిరంజన్‌  దళిత బతుకు చిత్రణ గావించాయి.
'మానేడు జొన్నలు', 'తండ్లాట' కథలు పులి కవిత రాశారు. 
'సున్నాలు'మెర్సి మార్గరెట్ (కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత 2017.), టూ హోగా జరా పాగల్' కథను కిరణ్ చర్ల రాశాడు. 
‘కంచం పొత్తు’, 'ఇచ్చురుగాళ్ళు', మొదలైన కథలు మాదిగ ఉపకులమైన చిందు జీవన విధానాన్ని గడ్డం మోహన్‌రావు చిత్రించాడు. 
'కూన మనసుల కులం', 'దునియాల' దప్పొల్ల రమేశ్; 'ముత్యాలు - సుబ్బలు', మారబత్తుల పెద్దన్న; దూలం - శవం' ఉదయభాను; 'అలసెంద్రవంక', 'ముసాఫీర్' కత్ర్హాలను అరునాంక్ లత; 'పైలమ్ బిడ్డా' అనే కథను చెన్నరాజు; 'ఇత్తరాకుల తట్ట' మేడిచైతన్య; 'సీతవ్వ', హైమవతి ; భీముడు', మా వూరికి దొరొచ్చిండు' కె. పి. లక్ష్మీనర్సింహ ; 'తొలిపొద్దు పెరుమాన్ద్ల రాము  మొదలైన ఆధునిక కథా రచయితలు రాశారు. 
 దళిత కథా సంపుటాలు:


దళిత చైతన్యంతో తొలుత వచ్చిన కథా సంపుటాలు 'లోకం', 'గొర్రెలు', 'హెచ్చరిక', 'దున్న', 'రంగులు', 'చీమలు', 'తెలంగాణవెతలు', 'భోజకతలు', 'ఇప్పపూలు', బొమ్మలు', 'ఆమె', 'ఉప్పునీరు' ఆమె... కథ సంపుటాలు బోయ జంగయ్య వెలువరించారు.

ఆర్తరావం, కుట్ర, చలివేంద్రం, ప్రభంజనం, కపోతం మొదలైన కథా సంపుటాలు జాతశ్రీ ప్రచురించారు.

దళితోద్యమంతో వచ్చిన తొలి కథా సంకలనం ‘ఎదురు చూపులు’ సంపాదకులు డా॥ గుండెడప్పు కనకయ్య, దళిత కథ సంపుటం ‘మేమిట్లుండం’
'మల్లెముగ్గల గొడుగు' ఎండ్లూరి సుధాకర్
'సెల్లా' దాసరి లింగస్వామి
'ఎర్ర దుక్కి' ఎం నారాయణ
'బొండిగ' దొడ్డి రామ్మూర్తి
 ‘మన్ను బువ్వ’ - జాజుల గౌరి, 
‘రేణ’ - చైతన్య ప్రకాశ్‌, 
రాయక్క మాన్యమ్‌’,  రిజర్వేషన్ భోగి' జూపాక సుభద్ర
‘ఏనుగంత తండ్రి కంటే ఏకులబుట్టంత తల్లినయం’ గోగు శ్యామల
 ‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’, కండిషన్స్ అప్లై  ` డా॥ పసునూరి రవీందర్‌ (తెలంగాణ నుంచి కేంద్ర సాహిత్య  యువపురస్కార్‌ గ్రహీత 2015) వీరి మరో కథా సంపుటి "కండీషన్స్ అప్లై"
'మిళింద' - ఏండ్లురి మానస(ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికి తెలంగాణలోనే జన్మిచింది. ప్రస్తుత నివాసం హైద్రాబాద్- కేంద్ర సాహిత్య యువపురస్కారం పొందిన తొలి దళిత కథకురాలు)
 ‘తప్ష కతలు’, - డా. సిద్దెంకి యాదగిరి (పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం చే 2019 కి గాను కథా ప్రక్రియలో ఉత్తమ్ గ్రంథ కావ్యంగా ఎంపికైంది. ) వీరి మరో కథా సంపుపుటి మూడు గుడిసెల పల్లె'
'మేలుకొలుపు' మల్లవరపు విజయ
మర్రి చెట్టు - మన్నే ఏలియా
‘ధగ్థం’, ‘బుగాడ’, ‘బేగరి’ కథలు ` బూతం ముత్యాలు
‘బొండిగ’ దొడ్డి రామ్మూర్తి, 
'తిరుగు ప్రయాణం ' నల్లాల లక్ష్మీరాజ్యం
బైండ్ల చంద్రయ్య కథలు - జిలకర శ్రీనివాస్
‘ముత్కారి పల్లాటాలు (ముసల్దాని మాటలు ` గోసంగి పదాలు ఊటంకిస్తూ..)డా. గంధం విజయలక్ష్మి, 
‘మమతల మల్లెలు’,‘రక్షణ’ డా. తాళ్లపల్లి యాకమ్మ, 
'జోలె విలువ'- హైమవతి 
‘అంబలి గంప’ కే.పి. లక్ష్మి నరసింహ .. మొ॥న కథా సంపుటాలు కలవు.

    తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథా సంకలనం కమ్మమ్ జిల్లా నుంచి . సి. జాన్ సుందర్ రావు
వెలువరించిన తొలి కథా సంకలనం 'కపోతం'- 1970 (చూ. తెలంగాణ దళిత కథ. శ్రీనివాస్,.
సంగిశెట్టి, నిరంజన్, గుడిపల్లి ముందుమాట- పుట.85 ఏడుగురి కథకులలో ఐదుగురు ఖమ్మం వారే
కావడం), భార్గవి రావు "ఇంకానా ఇకపై సాగదు" 1994 లో అనే తొలి దలికథా సంకలనం
వెలువరించారు.
తెలంగాణ బతుకు చిత్రాన్ని  సంకలనాలు అధికంగా చిత్రించాయి. తెలంగాణ తొలి దళిత కథా సంపుటి "మేమిట్లుండం" గుండె డప్పు కనకయ్య సంపాదకత్వంలో 1999 లో  దాదాపు పది కథలు ప్రచురించబడింది. దళిత అస్థిత్వంతో రాసిన తొలి దళిత కథా సంపుటి "ఎదురుచూపులు". దండోరా ఉద్యమ నేపథ్యంలో మాదిగల జీవితం ప్రధాన వస్తువుగా వచ్చిన కథలను గురించికూడా ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావన గురించి కింద చెప్పటం జరుగుతుంది.  'నల్లపొద్దు' దళిత స్త్రీల సాహిత్యం 1921-2002’ గోగు శ్యా మల 2003 ప్రచురించారు ‘నల్లరేగడిసాల్లు’ (మాదిగ ఉపకులాల ఆడోళ్ళ కథలు -2006) కథా సంకలనాల్లో తెలంగాణ దళిత ఉపకులాల  ఆడపడుచుల కథలూ ఉన్నాయి. ఇతర సంకలనాలలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రధానంగా సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో  "తెలంగాణ దళిత కథలు"ఎనభయ్ ఎనిమిది కథకుల కథలతో వెలువరించారు.. వృత్తి పదకోశంలా వృత్తి కథలు వెలువరించిన కవయిత్రి,  కథా  రచయిత్రి జ్వలిత సంపదలోకథ సంకలనం"మల్లేసాల".  ఇందులో 139 కథలతో తెలంగాణ సమాజంలో  ఉన్న వివిధ కథలుంటే దళిత, దళిత ఉపకులాలకు సంబందించిన కథలే ఇరువైకి పైగా ఉన్నాయంటే దళిత జీవితాన్ని ఎంత బలంగా కథల్లో చిత్రించిన బాదలున్నాయో తెలుస్తుంది.

        

తెలుగు సాహిత్యంలో కథా వార్షికలు ప్రారంభమయ్యి మూడు దశాబ్దాలు దాటినా దళిత కథా సాహిత్యంలో దళిత కథా వార్షిక రాలేదు. ఈ లోటును తీర్చూతూ 2020 లో ప్రారంభించబడిన జంబూ సాహితి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దళిత కథలతో దళిత కథా వార్షిక తీసుకరావడం దేశంలోనే తొలి దళిత కథా వార్షిక కావడం తెలుగు వారికి సంతోషదాయకం. 


దళిత కథా వార్షికలు జంబూ సాహితి ద్వారా డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఒదయ్య లు కలిసి తెస్తున్నారు. తొలి దళిత కథా వార్షిక 2020 "తొండం బొక్కెన"లో  ఉన్న కథలు ఉభయ తెలుగు రాష్ట్రాల కథలను చూడవచ్చు. వాటి వివరాలు   
1. కొలకలూరి ఇనాక్‌ ఇది ఒప్పు
2. జూపాక సుభద్ర మైక్రో సిట్టీలల్ల మన్నువడ
3. గోగు శ్యామల కరోనా సుగ్గి  
4. పసునూరి రవీందర్  శివన్న మరణం
5. భూతం ముత్యాలు  సావుకూడు
6. మన్నె ఏలీయా ఇదెక్కడి న్యాయం
7. జిలుకర శ్రీనివాస్‌  బైండ్ల సెంద్రయ్య బోనాల. 
8. ఎండ్లూరి మానస మెలీనా
9. ఎండపల్లి భారతి  సూరే గ్యానం
10. చరణ్‌ బొంబాయి పొట్టేలు
11. కెపి లక్ష్మీనరసింహ దోసిలి వట్టు
12. కౌలూరి ప్రసాదరావు  రెండు గ్లాసులు
13. తవ్వా వెంకటయ్య  కొండిగాడు
14. రామ్‌ పెరుమాండ్ల కన్నీటి కథ
15. తప్పెట ఓదయ్య మల్లక్క
16. సిద్దెంకి  మూడు గుడిసెల పల్లె
17. వేముల ఎల్లయ్య మారుతీ మర్డర్‌
18. గడ్డం మోహన్‌ రావు కులం తప్పు
19. డా॥ గంధం విజయలక్ష్మి  కొక్కిడి మిడుసుల్లు
20. గుడిపల్లి నిరంజన్‌  జీలుబండ
2021 "చిందూ నేల" కథ వార్షికలో  ప్రచురించిన కథల వివరాలు 











1. నిద్ర గన్నేరు   సతీష్‌ చందర్‌
2. పగిలిన పచ్చి పుండ్లు   జూపాక సుభద్ర
3. బతుకు నడక        భూతం ముత్యాలు
4. నర్సయ్య ధ్యానం   డా. జిలుకర శ్రీనివాస్‌
5. త్రీ కమాండ్మెంట్స్‌! ` చరణ్‌ పరిమి
6. ఎలకల రావిడి ఎండపల్లి భారతి
7. కుంగిన పొద్దు సిస్టర్‌ అనసూయ
8. బూబమ్మ - మల్లె పూల పందిరి పెద్దన్న
9. మా ఊరికి దొరొచ్చిండు! కె. పి. లక్ష్హీ నరసింహా   
10. విషనాగు కెంగార మోహన్‌
11. సమాధి తోట మేడి చైతన్య
12. కాలం మారింది డా. మండల స్వామి
13. పిడికె ఉప్పులేటి సదయ్య
14. కరేపాకు    ఇండస్‌ మార్టిన్‌
15. మీరెంటోళ్ళు సారు తప్పెట ఓదయ్య
16. బెస్త నర్సయ్య మామ  డా. సిద్దెంకి యాదగిరి

కథలతో ప్రచురించబడ్డాయి  
‘దళిత కథలు’ పేరుతో కె. లక్ష్మీనర్సయ సంపాదకత్వంలో వచ్చిన ఎనిమిది సంపుటాలు; 
  ‘ఉప్పు నీళ్ళు’, ‘హెచ్. సరస్వతి’, ‘నలుపు’; జూపాక సుభద్ర, గోగు శ్యామలల సంపాదకత్వంలో వెలువడిన ‘నల్ల రేగడిసాల్లు’ లాంటి కథానిక సంపుటాలు. దళిత కథను సుసంపన్నం చేశాయని తెలుగు దళిత కథా పరిణామంలో ఈ కథల ప్రాముఖ్యతను దార్ల వెంకటేశ్వర్ రావు పేర్కొంటాడు . 
తెలంగాణ దళిత కథా సాహిత్యంలో బతుకు చిత్రణ వెట్టితో మొదలై రకరకాల దోపిడీలను కళ్లకు గట్టింది. కుట్రల్ని బట్ట బయలు జేసింది. ఉద్యమాలను పిడికిట్లో పట్టి నిద్రాణంగా ఉన్న తావున అక్షర కిరణాలైంది. సంఘ సంస్కరణకు నడుం కట్టింది. అగ్రవర్ణ భావజాలంతో కలెవడ్తుంది. ప్రస్తుతం నయా దళిత వాదంతో నలువైపులా ప్రసరిస్తుంది. అయినప్పటికీ దళిత బతుకు చిత్రణ ఇంకా మిగిలే ఉంది. దాన్ని పూరించాల్సిన అవసరం కథకులందరి మీద ఉంది. 


తెలంగాణ దళిత సాహిత్యం, సంస్కృతి, కళారూపాలు, తెలంగాణ సారస్వత పరిషత్తు, మార్చి, 2020. హైద్రాబాద్‌ పుస్తకంలో ఈ వ్యాసం ప్రచురితం. (ఈ వ్యాసానికి చేర్పులు చేయనైనది)

    

1. సుజాతరెడ్డి, ముదిగంటి: 2009, తెలంగాణ నుంచే తొలి కథానిక, ఆంధ్ర జ్యోతి, తేది:  13.07.2009.
2. శబ్దరత్నాకరము, సీతారామాచార్యులు, బహుజనపల్లి,
3. శ్యామల, గోగుÑ నల్లపొద్దు 2004. హైద్రాబాద్‌ బుక్‌ హౌస్‌,
4,. సం॥ డా. సదానంద్‌ శారద, డా. ఏ.యం. అయోధ్య రెడి, డా. బి.వి.ఎన్‌ స్వామి  మూడు తరాల తెలంగాణ కథ 2017.
5. సం॥ శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీధర్‌, వెల్దండి తాడి నాగమ్మ
6. శ్యామల, గోగు, నల్లపొద్దు 2004. హైద్రాబాద్‌ బుక్‌ హౌస్‌,
7. సం॥ మల్లయ్య, కాలువ సదానంద్‌ శారద  తెలంగాణ కథలు.2005, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హై.
8 సం॥ డా. సదానంద్‌ శారద, డా॥ ఏ. ఎం. అయోధ్యారెడ్డి, డా. బి.వి.ఎన
స్వామి  మూడు తరాల తెలంగాణ కథ 2017. ప్రతాప రెడ్డి, సురవరం, సంఘాల పంతులు.
9. సం॥ మురళి, వేముగంటి, సంపత్‌ కుమార్‌ బెల్లంకొండ మెతుకు కతలు 2016 మరసం.
10. సం.  బోయ జంగయ్య కథలు. సం. నవీన్‌. అంపశయ్యÑ పెనుగొండÑ ఆం. ప్ర అరసం.గుంటూరు.  2016
11.సం॥ డా. సదానంద్‌ శారద, డా॥ ఏ. ఎం. అయోధ్యారెడ్డి, డా. బి.వి.ఎన్‌ స్వామి  మూడు తరాల తెలంగాణ కథ 2017. ప్రతాప రెడ్డి, సురవరం, సంఘాల పంతులు.
12 డా॥ సిధారెడ్డి, నందిని,‘చిత్రకన్ను’ మంజీర రచయితల సంఘం. 2016
13.సం. నవీన్‌. అంపశయ్య,  బోయ జంగయ్య కథలు. 2016 పెనుగొండ, ఆం. ప్ర అరసం.గుంటూరు.
 ముత్యాలు, బూతం,. బుగాడ కథలు. నల్గొండ. 2014,
14. సం॥ మల్లయ్య. కాలువ, శారద. సదానంద్‌,చంద్రÑ తెలంగాణ కథలు 2005, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హై.
15. ముత్యాలు, బూతం, బేగరి కథలు 2010, గుంపు సాహితీ సంస్థ, నల్గొండ.
16. సం॥ మురళి, వేముగంటి, సంపత్‌ కుమార్‌ బెల్లంకొండÑ మెతుకు కతలు 2016 మరసం. మెదక్‌
.17. చంద్రయ్య, ఐతాÑ  ఆనందనందనం జా.సా.పా. సిద్ధిపేట.  2007 
18.అశోక్‌ కుమార్‌, పెద్దింటి, మాయిముంత 2008
19. శ్యామల, గోగుÑ ఏనుగంత తల్లి కన్న ఏకుల బుట్టంత తల్లి నయం 2013,
హైద్రాబాద్‌ బుక్‌ హౌస్‌, హై.
20. సం॥ డా. సదానంద్‌ శారద, డా. ఏ.యం. అయోధ్య రెడి, డా. బి.వి.ఎన్‌ స్వామి  మూడు తరాల తెలంగాణ కథ 2017.
21. సం॥ మల్లయ్య. కాలువ, శారద. సదానంద్‌,చంద్రÑ తెలంగాణ కథలు 2005, 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హై.్‌ 
22. యాదగిరి, సిద్దెంకి, తప్ష కతలు, తెరసం సిద్ధిపేట జిల్లా. 2016.
23. సుభద్ర, జూపాక, రాయక్క మాన్యమ్‌. 2014, దండోరా ప్రచురణలు, హై. 
24.  చంద్రయ్య, ఐతా ఆనందనందనం జా.సా.పా. సిద్ధిపేట.  2007
25.. అంజయ్య, తైదల, సోయి త్రైమాసిక పత్రిక అక్టోబర్‌ ` డిసెంబర్‌ 2002.
26.  మోహన్‌రావు, గడ్డం,ఎంగిపూలు (అముద్రితం) కథా సంపుటి.
27. అదే.
28. చంద్రయ్య, ఐతా, ఆనందనందనం జా.సా.పా. సిద్ధిపేట.  2007
29. శ్యామల, గోగు,నల్లపొద్దు 2004. హైద్రాబాద్‌ బుక్‌ హౌస్‌,
30. అదే.
31.  రవీందర్‌, పసునూరిÑ అవుటాప్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియా, 2013. ఇండస్‌ పబ్లికేషన్స్‌, హై.
32. శ్యామల, గోగుÑ నల్ల రేగడి సాల్లు 2006.
33. సం॥ మురళి, వేముగంటిÑ సంపత్‌ కుమార్‌ బెల్లంకొండÑ మెతుకు కతలు 2016 మరసం.
34. 29. చంద్రయ్య, ఐతా, అంకితం 2008. జా.సా.పా. సిద్ధిపేట.  
35. సుభద్ర, జూపాక, రాయక్క మాన్యమ్‌. 2014, దండోరా ప్రచురణలు, హై.
36.  గౌరి, జాజుల, మన్ను బువ్వ, 2004 సా.తా.వి.వి విశాల సాహిత్య అకాడమి హై. 
37. శ్యామల, గోగు,  ఏనుగంత తండ్రి కంటే ఏకుల బుట్టంత తల్లి నయం. 
38. కాలువ మల్లయ్య కథలు. 2011
39.  గిరిజా మనోహరబాబు, జిÑ కథకు శతవసంతం హన్మకొండ, 2012. పుట`120
40. శ్రీదేవి, కిన్నెర,  కథా, విమర్శ, విశ్లేషణ, ప్రజా శక్తి బుక్‌ హౌస్‌, విజయవాడ. 2011 పుట. 88.
41.  యాదగిరి, సిద్దెంకి,  తప్ష కతలు, తెరసం సిద్ధిపేట జిల్లా. 2016.
42. సాహిత్యంలో నయా దళితవాదం. రవీంద్రబాబు, ఎ. వివిధ, ఆంధ్ర జ్యోతి 03.04.2017.
43. దళిత కథలు 2011, విశాలాంద్ర పబ్లికేషన్స్‌




ఆధార గ్రంథాలు:
మూడు తరాల తెలంగాణ కథ 2017. 
తెలంగాణ కథలు
తెలంగాణ దళిత కథలు 
బోయ జంగయ్య కథలు.
గూడ అంజయ్య కథలు  
నల్ల రేగడి సాళ్లు
నల్ల పొద్దు 
మాయి ముంత
కిర్రు చెప్పులు
ఏనుగంత తల్లి కన్న ఏకుల బుట్టంత తల్లి నయం
తాడి నాగమ్మ
మెతుకు కతలు
జైలు లోపల కథలు
మన్ను బువ్వ
రాయక్క మాన్యమ్‌
అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా
కండీషన్స్ష అప్లై 
మర్రి చెట్టు
తప్ష కతలు
మూడు గుడిసెల పల్లె 
ధగ్థం
బుగాడ
బేగరి కథలు
బైండ్ల సెంద్రయ్య కథలు
చిత్ర కన్ను 
అంకితం
ఆనందనందనం
సిద్ధిపురి కథలు
దళిత కథలుకథా, విమర్శ, విశ్లేషణ
కాలువ మల్లయ్య కథలు 
కథకు శతవసంతం
మిళింద 
మమతల మల్లెలు 
అంబలి గంప 
మా దిగ దృక్పథం
దళిత.........

(ఇంకా వుంది.)












డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...