కుల వివక్ష (Caste Discrimination): కులం ఒక సామాజిక వ్యవస్థ కాదు – అది ఒక మతం” – డా. బి.ఆర్. అంబేడ్కర్. “కుల వ్యవస్థ ఉత్త శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన కూడా” (Caste System is not merely division of labor. It is also a division of laborers అని అంబేద్కర్ మరింతగా నొక్కిచెప్పారు. ఆర్థిక, సామాజిక, మత, చట్టపరమైన లేదా రాజకీయ ప్రమాణాల ద్వారా వేరు చేయబడిన వ్యక్తుల సమూహాన్ని కులం అని అర్థం వస్తుంది. ఎటువైపు తిరిగినా ఎదురొచ్చేది కులం అని అంబేద్కర్ చెప్పినట్లు వివక్ష అక్కడున్నది. ఇక్కడలేదనేది లేదు. సర్వకాలాల్లో సర్వ వ్యాపితం అయింది. కుల వివక్ష పాథమిక హక్కులను కాలరాయడం, సమాజంలో అసమానతలను సృష్టించడం. ఈ వివక్షత వల్ల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. పౌర హక్కుల పరిరక్షణ చట్టం, SC/ST (అత్యాచార నిరోధక) చట్టం వంటి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. వివక్షను సంప్రదాయ కులవివక్ష, ఆధునిక కులవిక్ష అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. కొన్ని కథలను పరిశీలిద్దాం.
సంప్రదాయ కులవివక్ష: సంప్రదాయ కుల వివక్ష అనేది భారతీయ సమాజంలో పురాతన కాలం నుండి వస్తున్న సామాజిక అసమానత. కులం ఆధారంగా మనుషులను వర్గీకరించి, ఒక వర్గం వారిని అణచివేయడం, వారి హక్కులను కాలరాయడం దీని ముఖ్య ఉద్దేశం. వివక్ష చూపే విధానాలలో పధానంగా అంటరానితనం, దేవాలయ ప్రవేశం, పాఠశాలల్లో ప్రత్యేక కూర్చోబెట్టే విధానాలు, సామాజిక బహిష్కరణలు. వృత్తిపరమైన బలవంతం చేయాలనడం, సాంస్కృతిక ఆంక్షలలో వివాహాలు, పండుగలు, సామాజిక వేడుకలలో కూడా కులాంతర సంబంధాల అంశాలున్నాయి.
తెలుగు కథా సాహిత్యంలో దళితవాదం 1990 నుండి ఉద్యమ రూపంగా వచ్చింది. బోయ జంగయ్య కథలలో అధికం దళిత స్పృహతో దళితుల జీవన విధానాన్ని చిత్రించాయి. 1970 ముందు తెలుగు సాహిత్యంలో పల్లెబతుకుల విస్తృతి అందించాడు. కుల వివక్షకంటే ఎక్కువ కుల సమస్యలు ఏకరువు పెట్టాయి. మీ బర్రెకు ఉప్పునీళ్లు పోస్తం కానీ మాకొన్ని మంచి నీళ్లడిగినా పోయని కుల వివక్షను చూపిన కథ ‘ఉప్పు నీళ్లు’. ‘పాము’ కథలో తొడపాము ఉన్నవారితో సంభోగం చేస్తే చనిపోతారనే మూఢనమ్మకంలో పెద్దొర్సాని కొడుకు బతుకాలని వేసిన పన్నాగమే ఈత. ఈత నేర్పుమని చిందొర్సానిని నారిగాని వద్దకు పంపిస్తే శారీరకంగా ఒక్కటయ్యారు. నారిగాడు చావలేదు. కోడలు నారిగాన్ని వదులలేదు. కొడుకు కాపురం చక్కబడాలంటే నారిగాన్ని నిద్రలో చనిపోయేలా చేసారు. పాము కరిసిందని నమ్మించారు. దొరల జుల్మును ప్రశ్నించిన కథ ‘ఇంకనా ఇకపై సాగదు’. కలెక్టరయిన కొండయ్య బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులని మరిచిపోయాడని చెప్పే కథ ‘దొరసాని’.. వ్యవసాయం కాదనీ చెప్పులు కుట్టేలా కుట్ర పన్నిన కథే ‘ఇది కతా’. ఆర్థికలేమితో పాటు కుల వెనుకబాటుతనం ఉంటుందనీ, దేశంలో కమ్యూనిజం నిలబడలేక పోతుందంటాడు. ఈ విషయమై “వామపక్ష దృక్పథంలోంచి ఎదిగి దళిత దృక్పథంలో కథా ప్రస్థానం చేసిన రచయితగా జంగయ్యను” పరిశీలించాలని డా. తాళ్లపల్లి యాకమ్మ పేర్కొనడం సముచితంగా ఉంది. దళితులు రాసిన ప్రతి కథలో ఎంతో కొంత వివక్షాపూరిత బాధ కనపడుతుందంటే అతిశయోక్తి కాదు.
జాతాశ్రీ కథలు దళిత స్పృహతోనే రాసాడు. కరువు పరిస్థితుల వల్ల నీరు దొరకటం లేదు. మాలగూడెం అంతా బతుకడానికే వలస పోతున్నట్లు ‘వలస’ కథ చి తించింది. రాయప్ప చిన్నయ వైపు కడు దీనంగా పెదయా అని పిలుస్తుంటే అతని కళ్లు నీళ్లు అడుగంటిన బావిలా ఉన్నాయని పోల్చడం కరువుకు ప్రతీకగా ఉంది. ఉన్న ఊరును కన్నతల్లిని విడిచి వెళ్లుతున్నప్పుడు ధ్వంసమవుతున్న వాళ్ల గుండెల్ని చి తించిన తీరు పాఠకుడికి దు:ఖపుతెర విసురతది. అవసరానికనుగుణంగా కులాన్ని, అంటరానితనాన్ని వాడుతుంటారు. దళితులు పనిచేసేటప్పుడు లేని అంటుముట్టూ దళితులు ఇచ్చే వస్తువులకు అంటరానితనం ఉంటుందనీ దగుల్బాజీతనాన్ని తెలిపే కథ మాష్టార్జి రాసిన ‘అవసరమొస్తే’ కథ చిత్రించింది. రామిగాడు కూరగాయలు తెస్తే పటేలమ్మ కడుక్కుంటుంది. బియ్యం తెస్తే పసుపుతో పరిహారం చేస్తది. చక్కెర బస్తాను పొయ్యింట్ల పెట్టుమంటది. అంటుకాదా? అని అడిగితే అవసరాన్ని అంటు, ముట్టు పాటిస్తరా అని చెప్పుతది పటేలమ్మ. ధాన్యాన్ని పండించినప్పుడు లేని ముట్టుడు. ఆ ధాన్యాన్ని గరిసెల్లోకి ఎత్తినంతర్వాత ఎందుకు? ఆ ధాన్యంలో పసుపు చల్లి శుద్ధీకరిస్తారు. వాళ్లకు తాకితే గో మూత్రం చల్లుకుంటారు. దళితులు తెచ్చిన వస్తువులపైన, సరుకులు, పండ్లు ఫలాలపైన గో మూత్రం, పసుపు మొదలైన చల్లి శుద్ధీకరిస్తారు. అంటే అవసరాన్ని బట్టే వివక్ష మారుతుంటదని వివరిస్తుందీకథ.
కులం దళితుల్ని అవమానిస్తుంది. ఆగ్రహిస్తుంది. రూపం మార్చుకొని నిత్యం వెంటాడుతుంది. కులపంకిలం అనుభవించిన విధానాన్ని దళిత కథకులు చిత్రించారు. గిరిపుత్రులు అంటరానితనం ఎలా పాటించారో తెలిపిన జూపాక సుభద్ర కథ ‘అడవిని యిడువని అంటు’. అడవిలోకి వచ్చిన దోస్తుకు స్టీలు ప్లేట్లో అంబలి ఇస్తది. తల్లి తిడ్తది. కొడుతది. జర్నలిస్టుగా దళితులపై జరుగుతున్న ఘోరాలను రాస్తున్నప్పుడు తన కులం తెలియగానే తనలోతాను మథనపడే గోగు శ్యామల కథ ‘తెరీడిన పూవెండ’ చిత్రిస్తది. దళిత జర్నలిస్టు “నేను దళిత” అని అమెరికాలో ఆత్మగౌరవంగా ప్రకటిస్తది.
వ్యవస్థను ప్రశ్నించిన మన్నె ఏలియా కథ ‘అపచారమపచారం’. దళితులకు నీళ్లివ్వని బావిలో పంది పడ్డది. ఆ పందిపిల్లను తీయడానికి చిన్రాజిగాడు ఒప్పుకుంటాడు. తీసాక గుళ్లోని నందిని తాకి మొక్కుత అని అడుగుతాడు. సరే అని చెప్పి పనిచేసాక గుడి మెట్లనుకూడా తాకనివ్వరు. ఈ వ్యవస్థ మీద ‘థూ’ అని ఉమ్మేస్తాడు చిన్రాజిగాడు. వైంకుఠధామంలోనూ వివక్షను పెద్దన్న మారాబత్తుల ‘వైకుంఠ క్షామం’లో స్వభావోక్తంగా చిత్రించాడు.
ఏళ్లు గడిచినా ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మాదిగల జీవితమున్నదని తెలియజెప్పే రుద్రవరం ఎల్లయ్య కథ ‘మాదిగల తలరాత’. ఈ కథలో మాదిగ కులవృత్తి గురించి, సాయవ్వ దేవరాజు పాత్రలద్వారా చర్చకు పెడుతాడు. మాల మాదిగల మధ్య ఉన్న తేడాలు, మాలలు క్రైస్తవమతంలో యేసుపాదంలాంటి వారు ఎదిగిన తీరు కనబడుతుంది. మాదిగలంటే చులకనభావం వలన మాదిగల సామాజిక స్థితి కనబడుతుంది. దళితులలో ఉన్న తేడాలు స్పష్టంగా చూపించాడు. మాదిగ యాదయ్యకు మాల పరంజ్యోతి మధ్య చిగురించిన ప్రేమల్ని చూపుతాడు. కులాంతర పెళ్లిల్లు జరుగుతున్న తీరును వివరిస్తుంది. అన్ని పార్టీల పతిపక్షనాయకుడు ప్రభాకర్ డొల్లతనాన్ని తెలియజేస్తాడు. మాదిగలు వెట్టిచాకిరీ చేస్తే నేటి మాదిగలు కాంటాక్ట్ సఫాయి కార్మికులుగా కొనసాగుతున్న విషయాలను వివరిస్తూ మారని మాదిగల జీవితం గురించి తెలుపుతుంది. మాదిగలపై కుల వివక్ష మారుతలేదని తెలియజేస్తుంది.
బడిలో ఎంతో ఆత్మీయంగా ఉండే దోస్తులు ఇంటికొచ్చేసరికి కుల వివక్ష స్థలాన్నిబట్టి మారుతుందని తెలిపే జూపాక సుభద్ర కథ ‘బడిలే దోస్తు ఊల్లెగాదు’ ముసుగుల్ని తొలగించి చూపుతుంది. మాదిగ శ్రీలత, సాలె సువర్ణలు ఒక్క దగ్గరనే సదువుకున్నరు. ఉన్నత విద్యకు పక్కూరికి వెళతారు. ఒకరోజు బడిలో శ్రీలత వేసుకున్న సువర్ణ బట్టల్ని తల్లి కొమురవ్వ ఎందుకు తెచ్చినవే? దోస్తు గీస్తు అంత బల్లెనే గీ మన వూల్లెగాదు’ అంటూ గ్యాసునూనే పోసి ఆ బట్టలు అంటువెట్టింది.
ఆధునిక కుల వివక్ష: (ఇల్లు,) ఆధునిక కుల వివక్ష అంటే పాతకాలపు సాంప్రదాయ పద్ధతుల్లో (ప్రత్యక్షంగా అంటరానితనం చూపించడం వంటివి) కాకుండా, చదువుకున్న సమాజంలో, పట్టణాలలో, ఆధునిక రంగాలలో అదృశ్యంగా లేదా పరోక్ష రూపాల్లో సాగే వివక్ష : ఉదా. 1. కార్పొరేట్ రంగాలలో నెట్వర్కింగ్ మరియు సిఫార్సులు, 2. విద్యా సంస్థలలో రిజర్వేషన్ల ఆధారిత వేధింపులు(రోహిత్ … మరణాలు / రిజర్వేషను గాళ్లనడం) 3. కులం లేదా ఆహారపు అలవాట్లను (శాకాహారం/మాంసాహారం) సాకుగా చూపి దళితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడం 4. గేటెడ్ కమ్యూనిటీలు, 5. ట్రోల్ చేయడం(హ్యాష్‌ట్యాగ్‌లు (#)సాకుగా చూపి దళితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడం, 4. గేటెడ్ కమ్యూనిటీలు, 5. ట్రోల్ చేయడం(హ్యాష్‌ట్యాగ్‌లు (#) సృష్టించి రీల్స్, వీడియోల ద్వారా కుల అహంకారాన్ని డిజిటల్ రూపంలో ప్రదర్శించడం)
విదేశి విద్యార్థి బెంగ్త్‌తో చదువుతున్న రచయిత ఈ దేశంలో కులం ఎలా వెంట బడుతుందో, ఎలా వివక్ష చూపుతుందో తెలియజేసే పసునూరి రవీరందర్ కథ ‘వేరెవర్ యు గో’ తన మిత్రున్ని ఊరికి తీసుకొస్తూ రైల్లోని పయాణీకుల మధ్యన సంభాషణలో ‘సరే సారు, మీరు కులం లేదు. కుల వివక్ష లేదంటున్నరు కదా! మీ ఇంటి పక్కన నాకు ఇల్లిస్తరా చెప్పుండి’ అని ప్రశ్నించిన రచయిత మాటలకు పెద్దమనిషి బిత్తరపోయిండు. అతను పిలువగానే దొరా వస్తిని అనుకుంటూ వొచ్చిండు జీతగాడు మల్లయ్య. జరిగిన సంభాషణంతా బెంగ్త్‌కి ఇంగ్లీష్‌లో రచయిత వివరించాడు. బెంగ్త్ “వేరెవర్ యు గో… ది క్యాస్ట్ ఫాలోస్ ఇండియన్స్” అని అంటాడు. ఆధునిక రూపంలోకి మారుతున్న వివక్షను చిత్రించిన పసునూరిదే మరో కథ ‘గోవర్ణం’. వెంచర్లు కొత్తగా ఏర్పాటు చేస్తుంటారు. దళితులకు ప్లాట్ వి క్రయించమని చెప్పకుండా చాకచక్యంగా ఎలా డైవర్ట్ చేస్తారో తెలియజేస్తుంది. ప్లాట్ కొందామనుకున్నమిత్రునికి ‘గోవర్ణభూమి’ కేవలం జంధ్యం ఉన్నోల్లకేనటరా. ఆడ్ కింద ట్యాగ్ లైన్ వేస్తుండు” అని ఫోన్ చేసి వివరిస్తాడు.
అద్దిల్లు / కిరాయిల్లు: అంబేడ్కర్ ఇచ్చిన అక్షరజ్ఞానంతో వివిధ ఉద్యోగాలు పొంది పట్టణాలలో కిరాయికి పోతే కులం ఎంత వివక్షకు గురిచేసిందో తెలిపే సంఘటనలు కోకొల్లలు. అనుభవాలను అక్షరీకరించిన కథలు పరిశీలిద్దాం.
ఇల్లు ఇస్తున్నట్లే అనిపిస్తది. మీరేమిటోల్లు అని అడుగరు. మీరు వైశ్యాసా? రెడ్డీసా అని అడుగుతారు? కాదు. అంటాము. ఎంటిది? అన్నట్లు చూపులు ప్రశ్నిస్తాయి. చెప్పే పరిస్థితి కల్పిస్తారు. అతని భార్యని అడిగినట్లు అడిగి అడ్వాన్స్ తీసుకుందాట అని చెబుతారు. క్యాన్సిల్ చేస్తారు.
ఉన్నత చదువు చదివి ఉన్నతోద్యోగం చేసినా కిరాయిల్లు తీసుకున్నాక కులం ఎలా వివక్ష చూపుతుందో తెలిపే జూపాక సుభద్ర కథ ‘శుద్ధిజెయ్యాలె’. లెక్చరర్ ఉద్యోగికి ఆ ఊలో కిరాయిల్లు దొరికింది. ఇంట్లోకి వెళ్లాక కులం తెలిసింది. ‘వాళ్లు కడజాతోల్లట కదా! ఇల్లు ఖాళీ చెయమను. ఇల్లు శుద్ధి జెయ్యాలే.’ అని చె ప్రాసి ద్వారా లెక్చరర్‌కి వార్త పంపిం డు. ‘శుద్ధిచేయ్యాల్సింది యిల్లుకాదు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి’ అని తిట్టుకుంటూ కాలేజీలో సామాను పెట్టించుకున్న అనుభవానికి అక్షరరూపమే ఈ కథ. ఇంట్లోని పనిమనిషికి కులం తెలియగానే చెప్పక చెయ్యక పనికిరాకుండా పోయిన వివక్షను చూపిన వీరిదే మరో కథ ‘కూటికి పేదనైనా…’. ఉపేం ద్ర, శారదలకు పనికి కుదిరింది శారద. మిగిలిన అన్నం కూర తీసుకపోయేది. అక్క హాస్పిటల్‌కి వచ్చింది. ఆ తరువాత నాలుగు రోజులుగా శారద రాలేదు. అక్కను ఉపేంద్ర అడిగింది. కులం అడగింది. చెప్పిన. ‘బువ్వకూర’ గిన్నె ఆన్నే పారేసి ‘సీ.. సీ… థూ… థూ..’ అనుకుంట వెళ్లిపోయింది. పనిమనిషి చెప్పిన విషయాలు అక్క ద్వారా తెలుసుకున్నది. అప్పుడు అర్థమయ్యింది ఉపేంద్రకు. కూటికి పేదనైనా కులానికి తక్కువనా? అని పశ్న వేసినట్లే అనిపించింది.
కులం తెలియగానే ఛాందసవాద యజమాని ఇంట్లో వస్తువులు బయటపడేస్తాడు. వస్తువులన్ని డీసిఎంలో వేసుకొని తిరుగుతుంటే అంబేడ్కరిస్టు వచ్చి మా ఇంట్లో కిరాయి ఉండండి సార్ అని ఆహ్వానించడంతో కథలోని పా త్రగా మండల స్వామి ‘ఇల్లు దొరికింది’ అని తృప్తిపడుతాడు. ‘కిరాయిల్లు’ కథలో విఠలాపురం పుష్పలత వివరించింది. ఒక స్థాయికెదిగిన మాదిగ ఉద్యోగి మూలాన్ని మరిచి కిరాయి కోసం ఇబ్బందులకు గురిచేసే ఆత్మవిమర్శలాంటి కథ ‘పుండాకోరు’ను సిద్దెంకి యాదగిరి చిత్రించాడు.
కులం తెలిశాక ఎలా ఖాళీ చేయించడానికి వేసే దుర్మార్గపు ఎత్తులను విశదపరిచే ఎలమంద కథ ‘అద్దిల్లు’. నవదంపతులు ఇల్లు కిరాయికి తీసుకున్నారు. కొన్నాళ్లకు వాళ్లు మాదిగలు అని తెలిసింది. ఆ ఇంటి యజమాని వాళ్లను పంపించాలని ఎత్తుగడ వేసిండు. నిరోధ్ ప్యాకేట్ ఆ పిల్ల బ్యాగ్‌లో పెట్టిండు. అనుమానం పెనుభూతమైంది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఓనరు తాగిన చోట చెప్పుకోగ విన్నాడు. నవ దంపతులు చర్చించుకున్నారు. ఇద్దరు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. పెనుభూతమైన అనుమానం సమసిపోయింది.
అప్పట్దాక కలుపుగోలుగా ఉన్న మనుషులలో అకస్మాత్తుగా మార్చిన కుల వివక్షను తెలిపే పసునూరి రవీందర్ కథ ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’. పైండ్లైన ఇంటిలో వరకట్నం చర్చిస్తున్నప్పుడు మా కులంలో ఇంత వరకట్నం ఇవ్వక పోదురు అని చెప్పుతది వరవ్వ. ఏర్పడకుంట వారడగిన పశ్నకు ‘హరిజన్స్’ అని చెప్పుతది. ఆ ప్రభావంతో వరవ్వ కోడలు రజిత వివక్షలోనై ఒంటరిదైతది. భర్తకు ఫోన్ చేసి ఏడుస్తుంటది. తల్లిని తెలుసుకొని భార్యకు ఫోన్ చేసినా ‘యు ఆర్ ట్రైయింగ్ రీచ్ ద మోబైల్, ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ అని డిఫాల్ట్ గా నెట్వర్క్ స్వరం వినపడుతుంటది. ఔను మా బతుకులెపుడు ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియానే’ అని బాధపడుతుంటాడు సురేష్. ఈ కథ మనుషుల మధ్య వివక్ష మోడర్న్ గా ఎలా హింసిస్తుందో తెలుపుతుంది.
ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు పొందిన దళిత టీచర్లు ఇల్లు దొరకని కిరాయి బాధల నుంచి విముక్తి పొందాలని ఆలోచిస్తున్నారు. చిన్నదో పెద్దదో గూడు కోసం తిరిగీ తిరిగీ అసైన్డ్ ల్యాండ్లు కొనుక్కుని తాహతును మించిని ఇండ్లు కట్టుకున్నా కులం ఎలా విభజిస్తుందో తెలిపే కథ డా. సిద్దెంకి యాదగిరి కథ ‘తప్ష’. కన్నయ్య సారింట్ల పెండ్లి. అందరినీ పిలిచినట్లే ఇండ్లున్న వెంకయ్య, రాకేష్‌లను పిలిచిండు. పసుపులు ముట్టే పండుగకు ఆడోల్లను పిలువలేదు. రేకుల ఇల్లుగల నర్సయ్య టీచర్‌ను పిలువలేదు. ఏమి జరుగుతుందో అర్థం చేసుకున్నారు. అందరు కలుసుకొన్నారు. ఈ విభజించి పాలించడం వద్దు. ఆత్మ గౌరవం లేని చోట అడుగుపెట్టొద్దని తప్ష(తీర్మానం) చేసుకున్నరు.
రైలు ప్రయాణపు అనుభవాన్ని చిత్రించిన జూపాక సుభద్ర కథ ‘రిజర్వేషన్ భోగి’. రిజర్వు టికెట్ కొని సీటు కోసం వెతుకుతుంది. ‘హలో ఇది రిజర్వేషన్ డబ్బా! తెలిసే ఎక్కినవా? జెండల్ డబ్బగాదు పో. పో.’ అన్నడు. ‘పెద్దమనిషోలే ఉన్నవ్ బుద్ధిలేదా? నువ్వు కూసున్న బెర్తు నాది. రిజర్వు చేస్కుంటేనే గదా! ఇందులోకి వొచ్చింది.’ ఇయ్యర మయ్యర మాటలంది. సంజాయిషి ఇచ్చుకోబోయిండు. పరాయిదేశంల నల్లోడని దించేయబడ్డ గాంధీ జాతి వివక్ష పెద్ద చరిత్ర. నాలాంటి నల్ల బక్క మొకాలు రిజర్వషన్ టిక్కెట్‌తో ఎక్కినా సొంత దేశమోల్లే జనరల్ భోగిలోకి తరుమవట్టిరి. అనే అవుమానాలు కూడా ‘వార్త’ కాదెందుకో… అని ఆలోచిస్తూ తెల్లతెల్లవారుతుండగా నిద్దురలేని కళ్లతో స్టేషన్ల దిగింది రచయిత్రి.
ఆకలి అంటరానితనం మిక్స్‌చేసి, అగ్రవర్ణాల వారు మాదిగల్ని బొందపెట్టైనా సరే ఎలా ఎదుగుతారో తెలిపే పసునూరి రవీందర్ కథ ‘లీఫ్మెన్’. ఆకలి తాళలేక ఆకులు తినే మాదిగ లింగంను దేవున్ని చేసింది మీడియా. పూజలందుకుంటున్నలింగంను గోపాల్‌రెడ్డి చంపి ఏమీ ఎరుగకుండా గుడికట్టుమని లింగమయ్య బాబా దేశసంచారం పోయిండని ప్రజలధనం దోచుకోవడానికి మరో ఉపాయంతో సిద్ధపడ్తాడు. వీరిదే మరో కథ కులానికి, మతానికి, రాజకీయ వర్గాలకు, మా కులానికి సంబంధించిన వ్యక్తుల రక్తం మా తమే కావాలనే వాట్సాప్ గ్రూపులున్నాయి అంటే ఆలోచించాల్సిందే. అలాంటి ముసుగుల్ని చించేసిన పసునూరి రవీందర్ కథ ‘వాట్సప్ స్త్రీట్స్’.
చెన్నూరు మాలలను ఊచకోత కోసారని టీవి వార్తలు విని రా తికి రా తే బాధ్యతాయుత ఉస్మానియా విద్యార్థులు కమిటీగా వెళ్లి సమస్యను ఆరాదీసిన బాధ్యతను రికార్డుచేసిన దార్ల రామచం ద కథ ‘ఇంకా ఎన్నాళ్లీ నరమేథం’. దళిత యువకుడు అగ్రవర్ణాల యువతికి లిఫ్ట్ ఇచ్చినందుకు మూడూల్ల రెడ్డీలు వచ్చి మాలలను దొరికినోల్లకు దొరికినట్లే చంపేసిండ్రు.
దళితులను కుల వివక్ష బహురూపులుగా, బహు కోణాలుగా(కొన్ని చోట్ల గుళ్లోకి రానివ్వక పోవటం, జులూస్ తీయనివ్వక పోవటం, ప్రతిభ ఉన్నప్పటికీ రిజర్వేషన్ గాళ్లు అని సంబోంధించడం, అడక్వసి(సరిపడిన దానికంటే ఎక్కువ ఉన్నారనే నెపంతో రిజర్వేషన్లు అమలు పరచకపోవడం), కార్పోరేట్ సంస్థలలో ఉద్యోగాలు, పదోన్నతులు తమవారికే చెందేలా చేయడం. మొదటి ర్యాంక్ వచ్చినా రిజర్వు కేటగిరీలలో నింపడం లాంటి అనేక ఇంకా వెంటాడుతూనే ఉంది. వాటి గురించి సృజనకారులు రాయాల్సి ఉంది.
కుల వివక్ష అనేది కేవలం చరిత్రలో మిగిలిన అంశం కాదు. అది నేటికీ నానారూపాలుగా సజీవంగా ఉంది. సాంప్రదాయ అంటరానితనం నుండి ఆధునిక డిజిటల్ వివక్ష వరకు దళిత జీవితాల్లో దాని ముద్ర చెరగలేదు. తెలుగు దళిత కథకులు ఈ వాస్తవాలను ధైర్యంగా, నిజాయితీగా అక్షరీకరించారు. కులం పేరిట జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, అంబేడ్కర్ చూపిన దారిలో ఆత్మగౌరవంతో జీవించాలనే స్ఫూర్తిని ఈ కథలు అందిస్తున్నాయి. సాహిత్యం కేవలం వినోదానికి కాదు. అది మార్పుకు ఆయుధం. దళిత కథా సాహిత్యం ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగిస్తూ న్యాయమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతోంది.
వెట్టితనం (Bonded Labour / Forced Labour) అంటే వేతనం లేకుండా లేదా అతి తక్కువ వేతనంతో బలవంతంగా పని చేయించుకోవడం. ఇది ఒక సామాజిక దురాచారం. దీనిని వెట్టి చాకిరీ అని కూడా పిలుస్తారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన మరియు చట్టవిరుద్ధం. నిజాం కాలంలో వెట్టి చాకిరీ భయంకరమైన వ్యవస్థ. వెట్టి రద్దు చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ఇది నాటి గ్రామ సమాజంలో ఒక క్రూరమైన దోపిడీ. వెట్టి చాకిరీ వ్యవస్థలో శారీరక మరియు మానసిక హింస సాధారణంగా కనిపించేది. భూస్వాములు, పటేళ్ళు మాలమాదిగలను చిన్నచిన్న కారణాలకే కొట్టడం, భయంకరంగా హింసించి నియంత్రించేవారు. నిజాం వెట్టిని రద్దు చేసినా దొరలు, భూస్వాములు, జమీందార్లు యథేచ్ఛగా కొనసాగించారు. ఈ పరిస్థితి స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగింది. భారత ప్రభుత్వం వెట్టి చాకిరీని నిర్మూలించడానికి భారతదేశంలో ప్రత్యేక చట్టాలు (Bonded Labour System Abolition Act, 1976) వచ్చాయి. అప్పటి వరకు వెట్టి కొనసాగింది. 1. నిర్బంధం, 2. జీతం లేకపోవడం, 3. శ్రమ దోపిడీ-వెట్టితనం లక్షణాలుగా 1976 చట్టం చెబుతుంది. మాదిగలు మాయితనం (వ్యవసాయ సంబంధ పనులు), తాళ్ళు పట్టడం, చెప్పులు చేయడం, డప్పు కొట్టడం మొదలైనవి చేస్తారు. మాలలు కావలి కాయడం, సుంకరితనం (మస్కూరి), బేగారి పనులు మొదలైన చేస్తారు. అవసరాన్ని బట్టి పై రెండు కులాలు చేస్తాయి.
నిజాం కాలంలో సమాజమంతా నిశ్శబ్ద అణచివేతలో కొనసాగింది. ఆనాటి పరిస్థితులను చిత్రించిన కథ ‘వెట్టి మాదిగ.’ దీనిని అజ్ఞాతవాసి పేరిట భాగ్యరెడ్డి వర్మ ‘భాగ్యనగర’ పత్రికలో 1932లో ప్రచురించారు.
‘వెట్టి మాదిగ’ కథలో రామిరెడ్డి పాత్ర అత్యంత క్రూరత్వానికి, ఫ్యూడల్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని “అన్నమో రామచంద్రా” అని విలపించే స్థితికి తీసుకెళ్తాడు. రామిరెడ్డి అంటే ఆ గ్రామస్థులందరికీ భయం. రామిరెడ్డి ఉత్తరం పంపించాల్సి ఉంది. వంతు మాదిగను పిలిపించాలని తలారిని పంపిస్తాడు. అదే రోజున మరొక భూస్వామి ఆరు నెలలు చేసిన పనికి ధాన్యం ఇస్తానని చెప్పడం వలన, ఆ రోజు వెళ్ళకపోతే ఆరు నెలల గాసం ఇవ్వరు. అందువల్ల ఆ మాదిగ ఆ రోజు రావడం వీలు కాదని రేపు వస్తానని తలారికి చెప్పగా పటేల్ కి అట్లే చెప్తాడు. రామిరెడ్డి చెప్పుతో కొట్టి తలారిని అవమానిస్తాడు. పటేలు “వెట్టి చేయడం కష్టమట! ఇక వీళ్ళ కొంపలు నాశనం చేస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను” అని గర్జిస్తాడు . అంతలో తలారి వచ్చి మల్లన్నను తిడుతూ, కొడుతూ పటేలు వద్దకు ఈడ్చుకెళ్తాడు. మల్లన్న తలకు బలమైన గాయం తగిలి రక్తస్రావం అవుతుంది. స్పృహ కోల్పోతాడు. రక్తస్రావం గమనించిన రామిరెడ్డి కొంత శాంతించి, తలారిని ఇద్దరు అనుచరులతో కలిసి అతన్ని ఇంటికి పంపిస్తాడు. అయితే గాయాల వలన మల్లన్న దీర్ఘకాలం వ్యాధిపీడితుడై కుటుంబం ఆహారాలేమితో కష్టాలు పడుతుంది. ఆరు నెలలు శవంలా బాధపడిన తరువాత మల్లన్న మరణిస్తాడు. దళితుల జీవితం కడు దుర్భరమైంది. స్వాతంత్ర్యం లేని జీవితం దళితులదని తెలుస్తుంది. ఆరు నెలల గాసం సంగతేమో కానీ మల్లన్న ఆయువే పోయింది. హింసకు అద్దం పడుతుంది.
మూడు తరాల నుంచి చేసినా తీరని అప్పు మాకా? అని జీతగాళ్ళుగా ఉన్న నాల్గవ తరానికి చెందిన పెంటయ్య కొడుకు రాములు వెట్టి చేయనని హెచ్చరిక చేసిన బోయ జంగయ్య కథ ‘ఎచ్చరిక’ (1983). నర్సిరెడ్డి తాతాల నాటి ఆస్తి పది రెట్లు పెరిగింది. పెంటయ్య అప్పులు పెరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా చేసిన కష్టం ఏమైంది? ‘మీకు ఆస్తులు పెరిగితే మాకు అప్పులు ఎందుకు పెరిగాయని, మా లెక్క సరిగా తేలితే సరేసరి. లేకుంటే పనికి రానే రాం’ అని తండ్రీ కొడుకులు వెళ్ళిపోతారు. తెలంగాణ పల్లెల్లో ఉన్న అన్యాయాలను, అక్రమాలను, వెట్టి చాకిరీని చిత్రించిన కథ చదవడం ద్వారా ఆనాటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. దిక్కులేని దళితుల పట్ల ఎవరూ కాసింత కనికరం చూపలేదు. దళితులు కష్టపడి పని చేసి ఆకలిమంటల్లో ఆహుతి అయ్యారు. దళితుల బతుకులు దుర్భరంగా నిజాం రాజ్యంలో ఉన్నాయని, ఈ వెట్టి పరంపర అలాగే కొనసాగిస్తూ దుర్భరంగా మార్చారని వెట్టి కథలు తెలుపుతున్నాయి.
గూడ అంజయ్య రాసిన ‘భీరుపూరి’ కథలో చలిజ్వరంతో బాధపడుతున్నమాదిగ మల్లయ్యను గొరగొర లాక్కుపోయాడు. ‘మాల మాదిగులు పటేళ్ళు, పట్వారీలు అవుతారా? రాజులవుతారా?’ అని గోపాల్‌రావు దొర తిడతాడు. “అయ్యా! నా ప్రాణం మంచిగైనాక పనికొస్తాను” అని చెప్పినా దొర వినలేదు. సుంకరోళ్ళతో బండలు ఎత్తించాడు. జ్వరంతో బాధపడ్తున్న మల్లయ్య చల్లని చెమటలతో కనుగుడ్లు కిందికి మీదికి చేసుకుంటూ జీవిడిసాడు. మల్లయ్య కొడుకే భీరుపూరి. కొన్నాళ్ళకు భీరుపూరి మీద దొంగతనం కేసు పెట్టిస్తాడు దొర. అవ్వల్‌దారు విపరీతంగా కొడతాడు. దాచింది చెప్పనని చెట్టెక్కాడు. అందరూ చెట్టు పైకి చూస్తున్నారు. గోపాల్‌రావు దొరను కసీదీర తిట్టాడు. మలమూత్ర విసర్జన చేయడం వల్ల చెట్టుకింద తొక్కిసలాటలో రాయలింగు దొర కాళ్ళలో కాళ్ళు పెట్టి పడగొట్టాడు. భీరుపూరి ఉరేసుకొని చనిపోయాడు. ఈ కథలో వెట్టి చిత్రణ దుర్మార్గం కనబడుతుంది. మాలమాదిగులు లెక్కలేనివారిగా కనబడుతారు. కారా మాస్టార్ ‘యజ్ఞం’ కథలో విముక్తి కోసం తండ్రి కొడుకును చంపితే ఈ కథలో పీడించడం వలన తండ్రి, తిరుగుబాటు చేసి కొడుకు చనిపోతారు. వెట్టికి ప్రతినిధి గోపాల్ రావు దొరను పడగొట్టడం కొంత ప్రతీకారం కనబడుతుంది.
వెట్టి రద్దయినా ఆ ఆనవాళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయన్న చేదు నిజాన్ని, వెట్టి పన్నులు చెల్లించే విధానాన్ని వివరించే గుండె డప్పు కనకయ్య కథ ‘కుక్కపన్ను’. సంఘాల పంతులు కథతో పోల్చదగిన కథ. ఏనంక (వీణవంక ) సుధాకర్ రెడ్డి దొరకు కోపం రాకముందే కుక్కను పెంచడం కోసం పన్ను కట్టాలే. పన్ను కట్టడానికి వెళ్ళిన సంజీవుని లోపలకు పోనివ్వరు. కుక్క పన్ను కట్టాడు. కోళ్ళను పెంచుతున్నందుకు కోడిపుంజును అప్పగించాడు. ‘ఈ ముట్టుడేందో? అంటు ఏందో? నేను వేసిన ఎంగిలి తిన్నది. మా పెంట తిని, బలిసిన కోడి బహుమంచిగా ఉందిరా’ అని దొర అంటాడు. మా వాడను ఆనుకొని దొర పొలాలు. వాళ్ళతో వచ్చిన కుక్కలు మా కంపు తింటాయి. వాటిని చేరదీస్తారు. మీద ఎక్కించుకుంటారు. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకపోయే. ఆ బసి కుక్కలను చంపే రోజు వస్తుందని అనుకుంటూ ఇల్లు చేరుతాడు సంజీవ. వెట్టి భరించలేని వ్యక్తుల ఆలోచనలో మార్పులు మొదలవుతున్నాయని చిత్రించిన పరిస్థితులు ‘కుక్కపన్ను’ కథలో ఉన్నాయి.
మాదిగోని భార్యను పక్కలోనుంచి లాక్కెళ్ళిన ఉదంతాన్ని మామ సమ్మయ్య చావు నాడు వలపోతల్లో మేనకోడలు తెలుసుకున్న చేదు నిజమే జూపాక సుభద్ర కథ ‘పగిలిన పచ్చి పుండ్లు’. దుర్మార్గం ఎలా ఉండేదో కళ్ళకు కట్టిన బతుకును చదువుతుంటే పాఠకుడు విస్ఫోటనమై శకలాలుగా పడతాడు. సమ్మయ్యను కొట్టాడు. మల్లత్త ఎనిమిది నెలల గర్భిణిని దొర గుంజుకుపోయాడు. బావి వద్ద గుడిసెలో ఉంచాడు. అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు లేరు. ఇప్పటికీ పటేలు ఉంచుకున్న మాదిగదనే పేరు పోయినదని తల్చుకు తల్చుకు ఏడుస్తూ చెప్పుతుంటే ఆ రాత్రంతా ఆ ఎత రచయిత్రిని నిద్రపోనివ్వలేదు. చనిపోయిన మనిషి మా మామ. బతుకుతూ చనిపోయిన మనిషి ఆమె అని నిర్ధారించుకుంది.
చెరువు అంటే పరువు. అన్నీ జీవులకు ఆదరువు. కన్నా తల్లిలాంటి చెరువు కండ్లల్లో కరిగిపోతున్న కల. కళ తప్పుతున్న చెరువు మీది రంది ఎలా విషాదాన్ని తెలిపే గుడిపల్లి నిరంజన్ కథ ‘నీరటిగాడి కల’. నిద్రలో పచ్చని కల కళ తప్పుతుంది. చెరువున్న చోట కరువుండదని పాలకులకు తెలియకపోయే. పూడ్చని గండి పెద్దపులిలా నోరు తెరిచింది. నీళ్ళు నిలవడం లేదు. బావులు, బోర్లు ఎండుతున్నాయి. ‘‘…పుట్టెడు దుఃఖాన్ని ఆపాలే… చెరువును బతకనివ్వండా’’ చెరువును పట్టించుకోని వ్యవస్థ మీద కోపం. కళ్ళలో ఉక్రోషం, ఉద్వేగం పెరిగింది. రక్తప్రసరణ ఉప్పెనైంది. నరాలు చిట్లాయి. కల శాశ్వత నిద్రలో కలిసింది. తెల్లారి నీరటిగాడు చెరువు మట్టి వాసన కొట్టాడు. చెరువుతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పతాకస్థాయిలో చిత్రించిన కథ.
జీతం గింజలు అడిగినందుకు కొట్టబడిన కట్టుబానిస బతుకును చిత్రించిన దాసరి లింగస్వామి కథ ‘జీతం’. దెబ్బలను చూసిన కోడెదూడ నర్సయ్య వీపును నాకింది. ‘భీమా! నీకున్న పేమ లేదురా గీ కాపాయనకు, పుట్టి బుద్ధెరిగిన కాన్నుంచి నేను, నా పోరలు, పెండ్లాం మొత్తం బానిసలమైనం. అయినా కనికరం లేదు’ అని తన సొదను చెప్పుకుంటూ కుమిలిపోయాడు. పంచాయతీ పెట్టినా పటేలు దిక్కే మాట్లాడుతాడు పటేళ్ళందరూ. చివరకు ఆ పటేలుకే జీతం చేయాలని తీర్మానం చేస్తారు. జీతగాడికి, అతని కుటుంబానికి స్వేచ్ఛ లేదు. అణిచివేత. పేద వాడిని, కట్టుబానిసను ఎవరు కనికరించగలరని చెబుతుందీ కథ.
ముళ్ళు ఆకు మీద పడ్డది. చినిగిన ఆకు లోకానికి కనబడ్డది. నింద మోసిన నిర్భాగ్యురాలి జీవితమే పిట్టల శ్రీనివాస్ ‘వెలి’ కథ. తాగుబోతు తండ్రి పెద్దులు. తల్లి జచ్చిన బిడ్డ జానకమ్మ. పెద్దులును వెతకడానికి సహాయపడ్డ ఎంకన్న అంటే జానకమ్మ ఇష్టమైంది. ధర్మారెడ్డి గెలుపు కోసం చీఫ్ లిక్కర్ అమ్మి జైలు పాలయిన కొడుకు మీద రందితో ఎంకన్న తల్లిదండ్రులు కాలం చేశారు. కొన్నాళ్లకు విడుదలయ్యాడు. అన్నం వండుకొని ఎంకనికి సద్ది తెస్తుంది జానకమ్మ. వెంకన్న దగ్గరికి వచ్చినపుడు బిగుతైన జాకెట్, ఎత్తయిన ఒంపు సొంపులు చూసిన ధర్మారెడ్డి కొడుకు విక్రం రెడ్డికి జానకమ్మ మీద మనసు పడ్డది.. ఒకరోజు ప్రత్యర్ధుల్ని చంపాలని పథకం వేసి సోయి తప్పేలా తాగించాడు. ఎప్పటిలా సద్ది తెచ్చిన జానకమ్మను విక్రమ్ రెడ్డి బలాత్కారం చేసి అనుభవించాడు. తల్వార్ జూపించి “ఎవ్వలకైనా చెప్పితే నీవు ఉండవు. నీ అయ్యుండడు.” అని నోరు మూయించాడు. కడుపులో బడ్డ నలుసు పెరుగుతూనే ఉంది. ‘‘ఏదో మోసం జరిగింది. నా బిడ్డ అలాంటిది కాదు’’ అని కులం వారితో చెప్పిన పెద్దలు మాటలు ఎవరూ లెక్క చేయలేదు. ఎంకన్న నే కడుపుకు కారణమని పుకారెళ్ళింది. అరెస్టై జైల్లోకి వెళ్లిన ఎంకన్నకు విషయం తెలిసి బాధపడ్డాడు. జైలునుంచి కేసుకు తీసుకపోయేటప్పుడు పరిగెత్తే లారీ కిందపడి చనిపోయాడు. జానకమ్మ ఎనిమిది నెలల గర్భిణి. కులం నుంచి వెలివేశారు. రందితో పెద్దులు చనిపోయాడు. కొడుకును బడిలో చేర్పించింది జానకమ్మ. బడిలో జరిగిన అవమానాన్ని జానకమ్మకు కొడుకు చెప్పగా అదే రోజు రాత్రి ఏదో మందు తాగి చచ్చిపోయింది. ‘‘నడుమంత్రపు లంజ. ఎవనికాన్నో ఈన్నికన్నది. గిప్పుడు శరం వచ్చింది’’ అని గుసగుసలాడిన్రు. కొడుకు ఎవరు పిలిచినా ఎవరు రాలేదు. ఒక మూల నుంచి గుడిసె అంటుకున్నది. గీ పాడు లోకంలో ఇముడలేక అగ్గి పవేషం చేసి.. గీ లోకాన్ని తనే ‘ఎలేసి’ ఇన్ని దినాలు తను దిగమింగుకున్న నిజాన్ని తనెంటే తీసుకుపోయి మసి బొగ్గలే మిగిలిన తల్లిదిక్కు చూసుకుంటా నిలబడ్డడు. లోకం పోకడ తెలవని పశిపోరడు. చేయని తప్పుకు శిక్షను అనుభవించిన జానకమ్మ కొడుకు కోసం బతికిన జానకమ్మ. నిజం చెప్పలేక చచ్చిపోయింది. నిజాలు దాచుకొని కాలగర్భంలో కలిసిన ఎంతోమంది జానకమ్మలకు ఇది ఉదాహరణ.
మాయితనం చేయడం వలన ప్రతి ఆపత్కాలంలో ఆదుకున్న ఆపద్బాంధవుల్లా మసులుకున్న తప్పెట ఓదయ్య కథ ‘మల్లక్క’. కష్టపడి అంకితభావానికి మెచ్చిన గొల్ల మల్లక్క అయ్యకు పక్షవాతం వచ్చినప్పుడు తోడుగా ఉంది. పైసలు లేక తండ్లాడుతున్న ప్రతిసారి రచయితకు ఆదుకుంది. బి.ఎడ్. చేస్తున్నప్పుడు అప్పు ఇచ్చింది. పెళ్ళికి నిలబడి సకులం సాయం అందించింది. సంతానం కలుగుతున్నప్పుడు ఆర్థికంగా తోడుగా ఉంది. పంచాయతీలలో ఆసరాగా ఉంది. తన ఇంటిలో పండుగైనా చుట్టంలా పిలుచుకుంటుంది. రచయిత ఇంటిలో ఆమె లేకుండా పండుగ జరగదు. కొన్ని చోట్ల వెట్టి అణచివేస్తే మరికొన్ని చోట్ల ఆదరించినదీ మరవ వద్దు. ఇది మాదిగ వృత్తి సంబంధం తెచ్చిన వెట్టి మాయితనం వలన ఆత్మీయతలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ.
తెలంగాణ దళిత కథలు నిజాం కాలం నుంచి గ్రామీణ సమాజంలో నెలకొన్న వెట్టి వ్యవస్థ దారుణ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భూస్వాముల దోపిడీ, అప్పులు, హింస, మానసిక అణచివేతలే. తిండి, స్వేచ్ఛ, గౌరవం లేకుండా తరాల తరబడి బానిసత్వం అనుభవించిన దళితుల వేదనే ఆనాటి సామాజిక చరిత్రకు నిజమైన సాక్ష్యం. వెట్టి చాకిరీ వ్యవస్థ దళితులపై జరిగిన ఘోర దోపిడీకి ప్రతీక. ఆ బాధను, అవమానాన్ని, అణచివేతను స్పష్టంగా ప్రతిబింబించిన కొన్ని కథలు మాత్రమే..
తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు తెలంగాణ పుట్టినిల్లు. కథా సాహిత్యం అంకురించింది కూడా ఈ నేలలోనే. గురుజాడ గారి ‘దిద్దుబాటు’ 1910 కథకంటే ముందే భండారు అచ్చమాంబ ‘ధనత్రయోదశి’ 1902లో రాయబడిరది1. నాటి నుండి నేటి వరకు తెలంగాణ కథా రచనలో సాంఘిక సమకాలీన పరిస్థితులు ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.
దళితపదం వివరణ: ‘దళిత’ అను శబ్ధానికి అర్థం ఖండిరచబడిన, చీల్చబడిన, వెలివేయబడిన అను అర్థాలున్నాయి.2 Dalith అంటే broken or reduced to pieces generally అనే అర్థాలు ఆంగ్ల నిఘంటువుల్లో అర్థాలున్నాయి. 197౩లో మహారాష్ట్రలో దళిత ప్యాంథర్స్ మ్యానిఫేస్టో ప్రకటించిన ప్రకారం Member of scheduled castes and tribes ,neo buddhhists the working people,the landless and poor peasants, women and all thise who are being expiated, politically, economilly and in the nameof religion. అని నిర్వచించారు.
ఆక్షరాలకు దూరమైన దుర్భల జాతులు అక్షరాల్నే ఆయుధాలుగా చేసి అసమానతలపై సమరం చేస్తున్నాయి. ఫూలే, అంబేద్కర్ స్ఫూర్తితో కలమెత్తి సమానత్వం కోసం నినదిస్తున్నాయి. బతుకు పొరలను తవ్వి సాక్షీభూత సాహిత్యాన్ని అందించడం కోసం అక్షరాల్తో నడుస్తున్న పొద్దు మీద చెరుగని ముద్రవేయడమే దళిత సాహిత్యం యొక్క ప్రధాన లక్ష్యమై ఉన్నది.
‘‘నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించకునే హక్కులేని దళితులు ఈ రోజు సమాజ జీవితాన్ని శాసిస్తామని ముందుకొస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అపూర్వ సందర్భం’’ అని బాలగోపాల్ గారు తన ‘దళిత’వ్యాస సంపుటిలో అభిప్రాయం వెలిబుచ్చాడు.
‘‘దళితుల జీవితాన్ని చిత్రించేది. ఆర్తిని, ఆవేదనను, ఆగ్రహాన్ని, ప్రతిఘటనను ప్రతిబింబించేది, దళితులకు సుఖమయ మెరుగైన, సుఖమైన, అందరితో సమానమైన జీవితగమనాన్ని నిర్దేశించేది దళిత చైతన్యాన్ని వ్యక్తీకరించేది దళిత సాహిత్యం’’ అని ఎస్వీ సత్యనారాయణ గారన్నారు.
దళితజీవితాల్లోన్ని వెతలను, వేదనలను విని, చూసిన సంఘటనలు, సన్నివేశాలను ఆధారం చేసుకుని, తదాత్మ్యం పొంది రాసిన కథలని దళితేతరులు రాసినప్పటికీ అవి దళిత కథలుగా పరిగణించాలి.
దళితోద్యమంలో భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. హైద్రాబాద్‌లో 1917లో స్థాపించిన ఆది హిందు ఉద్యమం ప్రోద్భలంతో 1936లో డా॥ బి.ఆర్ అంబేద్కర్ అఖిల భారత షెడ్యుల్డు కులాల సమాఖ్యను స్థాపించారు. ఈ ఉద్యమానికి ఎమ్. వి. భాగ్యరెడ్డివర్మ, బి.ఎన్. వెంకట్‌రావు, అరిగె రామస్వామి త్రిముఖ ద్వారాలుగా పనిచేశారు.3
కడుపు కాలుతున్నోళ్లకు తెలుస్తుంది ఆకలి బాధ. కడుపు నిండ తిన్నోల్లకు కాదు అన్నట్లు బాధలు అనుభవించి అవమానాలకు గురై, అవహేళనల మధ్య నిత్యం తచ్చాడుతున్న అనుభూతుల్ని కలిగిన దళితులు రాసిన కథలే సహజత్వాన్ని చిత్రిస్తాయనేది నిజం. కథా సాహిత్యంలో దళిత సహానుభూతితో, సంస్కరణవాదంతో రాసిన కథలూ ఉన్నాయి.
తరతరాలుగా నీచమైన బతుకులు. కుటిలమైన అణచివేత. పశువుకన్నా హీనం. బాంచన్ కాల్మొక్త అంటూ వెట్టి చేయాలి. దయతలచి ఇస్తే తీసుకోవాలి. లేదంటే లేదు. ఆకలి కడుపును ఉరిపెడుతున్న మాడుతున్న పేగులతో ప్రాణం ఉన్నంత వరకు పనిచేసే వెట్టివాళ్లే దళితులు. పొద్దంతా పని చేసినా బావి నీళ్లు తాగనివ్వరు. అంటరాని తనం నీడపారనియ్యది. ఊరికి దూరం. బతుకు బారం. ఆలయ ప్రవేశం లేకున్న మనిషిని మనిషిగా పరిగణించేదిలేదు. దోపిడీలు, మానభంగాలకు లెక్కలేదు. దళితులు చేసిన చిన్న తప్పులకు కఠినమైన శిక్షలు. కడుపు నింపినా నింపకున్నా మాయితనం, నీరడితనం మొదలైన వృత్తులు చేయాలి. అదీగాక జీతం ఉండాలి. పొద్దటిది పొట్టకు, మాపటిది బట్టకు అన్నట్లు బాకి తేరది. బతుకు మారది.
కడగొట్టు బిడ్డలైన దళితుల వెతలను తెలుగు సాహిత్యం అక్షరీకరించిన విధానాన్ని విభాగాల వారిగా పరిశీలన చేద్దాం.
1. వెట్టి చిత్రణ: వెట్టి అంటే ఏమీ ఆశించకుండా పని చేయాలి. ఇచ్చిన కాడికి తీసుకోవాలి ఇవ్వకపోతే ఉచితంగా చేయడమే వెట్టి. మాదిగలు తాళ్లు పట్టాలి. తలుగులు వేయాలి. తోలు సంబంధమైన వస్తువులు తొండం, చెప్పులు, వ్యవసాయంలో తోడుండాలి. పండుగకు పబ్బానికి దప్పు కొట్టాలి. మాలలు బ్యాగరితనం(బొంద తోడడం, చితి కాలువడం) నీరడితనం చెరువు నీళ్లు పారియ్యాలి.
తెలుగు కథా సాహిత్యంలో దళితేతరులు రాసిన తొలి దళిత కథగా శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రిగారి పుల్లంరాజు కథ (1925) తొలి కథగా నిర్ధారించబడిరది. దళితుడు రాసిన ‘‘వెట్టి మాదిగ’’4 కథను భాగ్యరెడి వర్మగారు లిఖించారు. ఇది ఆనాటి భాగ్యనగర పత్రిక ఆగష్టు, 1932లో అజ్ఞాతవాసి పేరిట ప్రచురితమయ్యింది. (తెలుగు కథకురాలు తాడి నాగమ్మ5) తెలంగాణ తొలి దళిత స్త్రీ రాసిన తొలికథ మామిడి సత్యవతి గారి ‘‘తెర తొలిగింది’’6.కథ 1960లో ప్రచురితమయ్యింది. బోయ జంగయ్య గారి లోకం 1973లో ప్రచురితం.
‘‘వెట్టి మాదిగ’7’ కథలో రామిరెడ్డి పోలీస్ పటేల్. ఇతడు కలహాలు పుట్టించుటలో నేర్పరి. విరోధులను అన్నమో రామచంద్రా అని విలపించేంతగా ఇబ్బందులకు గురిచేస్తాడు. అందువల్ల అతనంటే అందరికీ భయం. తన బంధువుకు ఉత్తరము పంపవలసినదని వంతు మాదిగను పిలుచుక రమ్మని తలారిని పంపిస్తాడు. మాదిగ ఈ రోజు వీలుకాదని చెప్పినందుకు తలారిని కోపముడుగు వరకు చెప్పుతో కొడతాడు. తలారి కిక్కురుమనకుండా మాదిగ వద్దకు వెళ్ళుతున్నపుడు ‘‘వెట్టి చేయుట కష్టమట. ఇక వీరల కొంపలు నాశనము చేతును ` ఎవ్వరు అడ్డము వచ్చెదరో చూచెదనుకాక’’ అని పటేల్ తిడుతుంటాడు. ఆనాడే వేరే భూకామందు ఆరు నెలలు చేసిన పనికి ఫలితము ఇచ్చును. కాని ఆ రోజే వెట్టికి పోయిన యెడల రావలసిన ధాన్యం రాదు. తనకు బదులు ఇంకొకరిని తోలుటకు పటేలు వద్దకు బయలుదేరుతాడు. అంతలో తలారి వచ్చి మాదిగ మల్లన్ని తిడ్తూ కొడ్తూ పటేలు వద్దకు ఈడ్చక పోతున్నపుడు నెత్తిన బలమైన గాయము తగిలి నెత్తురు వరదలా కారుతది. మల్లడు స్పృహ కోల్పోయాడు. నెత్తురు కళ్ల జూచిన పటేల్ శాంతించెను. తలారిని ఇద్దరు అనుయాయులతో వానింటికి వాన్ని పంపెను. వ్యాధిపీడితుడై ఉన్నందున ఆలుబిడ్డలు తిండిలేక కృశించిరి. ఆరునెలలు శవాకారముగా ఉండి మల్లడు చనిపోయెను. ఈ కథవల్ల పోలీస్ పటేల్ రామిరెడ్డి, పటేల్ వ్యవస్థ నిజాం కాలంలో వెట్టి ఎంత దుర్మార్గంగా ఉన్నదో మనమే ఊహించుకోవచ్చు. అని కథను ముగించి పాఠకునికి వదిలేస్తాడు.
సురవరం ప్రతాపరెడ్డి గారి ‘సంఘాల పంతులు’8 తెల్లవారుజామున ఊల్లోకి వస్తున్నపుడు వాకిట్లో పడుకున్న వారిని సమయం ఆరా తీసినపుడు కుక్కలు మొరుగలేదు కాబట్టి మూడుగంటలు కావొచ్చు అంటాడు. ఆ ఊరి ఎస్సై జల్సాలకు కోళ్ళ్ల్లు ఆహారమవుతాయి. ఇదంతా వెట్టిలో భాగం. మాదిగల బతుకు కడు దయనీయం. ఎస్సై బార్య రేలకట్టెల మోపు తెమ్మని వంతు మాదిగ ముసల్దాన్ని తెమ్మంటే తంగెడు కట్టెలు తెచ్చినందుకు తంతె ముసల్ది చనిపోతుంది.
మెదక్ జిల్లా నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారికంటే ముందుగా వెట్టికి వ్యతిరేకంగా బెల్లంకొండ నరసింహాచార్యులు రాసిన ‘సీయూసి సభలు’9 కథలో వివరించాడు. బి. సీతారామారావు ‘గరీబోన్ని’ అను కథ లో వెట్టిగురించి రాసాడు.
వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ‘పరిగె’కథ9లో మల్లయ్య మాదిగ కులం. తల్లిలేదు. తండ్రి మంచం పట్టాడు. ఆకలితో అల్లాడి పడిపోయిన తండ్రి, చెల్లె ఆకలి తీర్చడం కోసం పొలంలో రాత్రి కుప్పకొట్టే కాడికి యాచించడానికి పోతాడు. యజమాని దానం చేయడని తలచి పొలంలో పరిగె ఏరుకుని పోతున్నప్పుడు యజమాని అటకాయిస్తాడు. మల్లయ్య బతిమాలుతాడు. దొంగతనం చేశాడనే నెపంతో ఆ పోలీస్ పటేల్ జైలు పాలు చేస్తాడు.
చెల్లెలు మల్లయ్యకు బదులు వంతుమాదిగ పనిచేస్తుంది. మల్లయ్య జైలు పనిమీద అంగడికి పోయినపుడు పరిచయస్తుడు కల్సి తండ్రి చనిపోయాడనీ చెల్లెలు ఎటో వెల్లిపోయిందని తెలుసుకొని ఏడిస్తే జవాన్‌కు మాట వస్తుందని దు:ఖాన్ని బహుకష్టంగా ఆపుకున్నాడు. జైలుకు రాగానే మా చెల్లె ఏమై పొయిందోనని పెద్దగా ఏడ్చాడు. సర్వస్వతంత్రంగా ఏడ్చే స్థితి దళితులకు లేదనే విషయం స్పష్టమవుతుంది.పరిగె ఏరుకొని మోసపోయి సగం కోల్పోయిన విధానాన్ని బోయ జంగయ్య ‘లేకి బతుకులు’10అనే కథలో చిత్రించాడు. చంద్రమ్మ అను దళిత స్త్రీ సుశీల పొలంలో పరిగె గింజలు ఏరుకున్నది. తన పొలంలో పరిగె ఏరినందుకు ఆగ్రహించిన సుశీల చంద్రమ్మ ఏరుకున్న పరిగె గింజల్లోంచి సగం తనకే ఇవ్వాలంటుంది. పరిగె గింజల్లో ఎవరూ వాటా అడుగరని చంద్రమ్మ ఎంత బతిమాలిన ఫలితం ఉండదు. సుశీల వినదు. సగం గింజలు ఇస్తుంది.
ఆధునిక వెట్టిని చిత్రించిన కాలువ మల్లయ్య ‘ఎట్టి’ కథలో భూస్వామి పాలేరును కరీంనగర్ తీసుకొచ్చి కట్టుకున్న ఇంటి పక్కన నీకు భాగమిస్తానని అన్ని పనులు చేయించుకొని నామమాత్రంగా కూలి ఇస్తాడు. కాలం గడిసిన తర్వాత మోసం చేస్తాడు.
2. కుల వివక్ష చిత్రణ: ‘‘నువ్వెటువైపు వెళ్లిన అటువైపు ఎదురొస్తుంది కులబూతం’ అని అంబేద్కర్ గారన్నట్లు అడగడుక్కు అంటరాని తనం కొనసాగుతుంది. కుల వివక్ష ఎంత దారుణంగ వుందో తెలియజేసే కాళోజి కథ ‘తెలియక ప్రేమ తెల్సి ద్వేషం’ అను కథలో కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో కార్యకర్తలు హరిజనాభ్యుదయం పేరన హరిజనులకు ఆలయ ప్రవేశం ఏర్పాట్లు జరుగుతున్నపుడు వ్యతిరేకించే బ్రాహ్మణులు దళితుల మధ్య కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాటలో ఒకర్నొకరు పొడుచుకొని ఒక బ్రాహ్మణుడు, ఒక దళితుడు చచ్చిపోయి స్వర్గంలో కలుసుకుంటారు. పరిచయం చేసుకుంటారు. అప్పటిదాక ఒకరిపై ఒకరు కురిపించుకున్న ఎనలేని ప్రేమను మరచిపోయి పరస్పరం తిట్టుకొవడం ప్రారంభించినారు. ఎవరేమిటో తెలియనంతవరకు ఏ ద్వేషములేదు. తెలియగానే ద్వేషం, దూషించుకోవడం. దళితకులాల పట్ల అసహ్యతను చిత్రించాడు. ఇందులో గొప్ప తాత్వికత ఉంది.
నిజాం కాలం నాటి పరిస్థితుల్ని దర్పణం పడుతూ మహ్మదీయ మతంలోకి మాల మాదుగుల మార్చుతున్న వైనాన్ని గూడ మొందారాలు తెంపి మత మార్పిడి చేసిండు మొల్లసాబ్. నమాజ్ సదివిచ్చిండు. అందరు గరం గరం బిర్యాని బోంసేసిండ్రు. ‘ఇనాం బూములు ఇత్తమనిరి గదరా’’ అని చర్చించుకుంటరు. ఫలితంలేదు. ఆశ చెప్పిన కరీం సాబ్ పోయిండు. మొల్లసాబ్ పోయిండు. ఇనాం శెలుకకు ఆశపడ్డ మాల మాదుగులకు నోట్లె మన్ను వడ్డట్టయ్యింది.
కుట్రల్ని, కుతంత్రాన్ని చిత్రిక పట్టి, కులోన్మాదాన్ని, దుర్భర జీవితాన్ని చిత్రించిన కథ డా. నందిని సిధారెడ్డి గారి ‘చిత్రకన్ను’12. ఊరిపెద్ద నర్సయ్య తల్లి సావు జేయడం కోసం దప్పులు కొట్టడానికి ఇరువై రూపాయలకు మాదిగలు రమ్మంటే రారు. మాదిగలు అడిగినంత యాభైరూపాయలు కూలీ ఇత్తమని ఒప్పుకున్నారు. మాదిగలంటే లోలోన కనపడని మంట కుట్రపూరితంగా మండుతుంటది. అక్కడ కాష్టం అంటుకుంటన్నప్పుడు ఇక్కడ మాదిగ గూడాన్ని తగలబెట్టారు. ఒకడు మాదిగల దగ్గరికి మంట మంట ఎగపోసుకుంటూ చెప్పడానికి వచ్చిన దీనస్థితి, వాళ్లందరు ఊపిరి తీసుకుంటూ గూడెందగ్గరికి వచ్చేసరికి మండుతున్న చితిమంటలని చిత్రించాడు.
గుప్తుల కాలం స్వర్ణ యుగం కాదని చరిత్రను చిత్రించే కాలువ మల్లయ్య గారి ‘స్వర్ణ యుగం’ కథ. గుప్తుల కాలంలో దళితుల్ని ఊరవతలకి పంపడం ప్రారంభమైంది. దళితుల్ని హీనంగా చూసే మత గ్రంథాలు ఈ కాలంలో ఉద్భవించాయని అందువల్ల ఇది స్వర్ణ యుగం కాదని వివరిస్తుంది.
మండుటెండల్లో మంచినీళ్లను తీసుకపోతున్న పయనం చెప్పిన దొడ్డి రామ్మూర్తి గారి ‘తిత్తి’14కథ. మంచి నీళ్లు, కళ్లు పుట్టేది భూమిలోనే. ‘‘గీ బూమిల నీల్లకు కులముంద్గని. కల్లుకు కులం లేదు.’’ అని మండువల సమానత్వ తత్వం విప్పి చెప్పింది.
కులాంతర వివాహాలకు మద్దతిస్తున్న వాల్లకు, కుల నిర్మూలన పేరిట చేస్తున్న ఉద్యమాలను ఎదుర్కోవడానికి దళితుల్ని మానసికంగా దెబ్బతీసిన కథ బూతం ముత్యాలు ‘బొందల గడ్డ’15లో చిత్రించాడు. ఉద్యమకారులకు చెడు అలవాట్లు ఉండకూడదని తెలుపుతుంది. తాగవెట్టి, తినవెట్టి, మానసికంగా తాగుబోతుల్ని తయారు చేయడం కోసం బెల్టుషాపుల్ని పెడుతుంటిమని దొర, పటేల్ అనుకుంటారు. తాగుతున్న వాల్లకు మందులో ఇసం కలుపుతరు. ఏర్పడకుంట ఇంటికాడ జీపుల తెచ్చి దించుతరు. చేతికి మట్టి అంటకుండ పనికానిస్తరు.
దొరల దాష్టికాలను వివరించింది పడాల రాములు ‘బలి’16 కథ. దొర జీతగాడు అందరికన్నీ ఎక్కువగా కష్టపడి దొరకు గుమ్ముల నింపుతున్న జీతగాడు తలారి రాందాస్. దొర ఓర్వలేక రాందాస్ భార్యను దొర చెరచితే ఆత్మహత్య చేసుకుంది. భౌతికంగా వృత్తి చేయనివారు జీవించడానికే అర్హులు కాదని గుండెడప్పు కనకయ్య గారి‘ఉత్పాదకులం’ కథ మంచి గుర్తింపును పొందింది.
అవసరానికనుగుణంగా కులాన్ని, అంటరానితనాన్ని వాడుతుంటారు. దళితులు పనిచేసేటప్పుడు లేని అంటుముట్టూ దళితులు ఇచ్చే వస్తువులకు అంటరానితనం ఉంటుందనీ దగుల్బాజీతనాన్ని తెలిపే కథ మాష్టార్జి రాసిన ‘అవసరమొస్తే’కథ చిత్రించింది. ధాన్యాన్ని పండిరచినప్పుడు లేని ముట్టుడు. ఆ ధాన్యాన్ని గరిసెల్లోకి ఎత్తినంతర్వాత ఎందుకు? ఆ ధాన్యంలో పసుపు చల్లి శుద్థీకరిస్తారు. వాళ్లకు తాకితే గో మూత్రం చల్లుకుంటారు. దళితులు తెచ్చిన వస్తువులపైన, సరుకులు, పండ్లు ఫలాలపైన గో మూత్రం, పసుపు మొదలైన చల్లి శుద్ధీకరిస్తారు. అంటే అవసరాన్ని బట్టే వివక్ష మారుతుంటదని వివరిస్తుందీకథ.
అందుకో దండాలు బాబా అంబేడ్కరా అనే ప్రఖ్యాతగేయం రాసిన వాగ్గేయకారుడు మాస్టార్జీ రాసిన కథ ‘అవసరమొస్తే’కథలో దళితులు తెచ్చిన సరుకులు, ధాన్యం, పండ్లు, ఫలాలు, మొదలైన వస్తువులపై పసుపునీళ్లు, పసుపు చల్లడం. గోమూత్రం చిలుకరించి శుద్ధీకరించుకుంటారు. అవసరాన్ని బట్టి మాత్రమే వివక్షను ప్రదర్శిస్తారని తెలుపుతుంది.
మాదిగ స్నేహితునితో అన్న పెళ్లికి అన్ని పనులు చేసింతర్వాత నువ్వు మాదిగవని కులవివక్షల్ని చూపిన కథ కేపి లక్ష్మి నరసింహ ‘అన్న పెళ్లయ్యేంత వరకు’ కొట్టొచ్చినట్లు చిత్రించాడు.
డప్పు: డప్పు తొలి వాయిద్యం. పండుగలకు పబ్బాలకు ముందు నడిసేది. దప్పు దరువులతో విషాదము, వినోదము వినిపిస్తుంది.
ఐతా చంద్రయ్య గారి ‘డప్పు17 చిత్రీకరణలో మాదిగ జయమ్మ భర్త నాగరాజు గతంలో డప్పు వాయిద్యకారుడు. ‘తాలే లెల్లియ్యలే’ పాడుతుంటే మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసేది. ప్రస్తుతం అతడు లేడు. చదివి ఉద్యోగం చేస్తున్నందున కొడుకు డప్పు ముట్టుకోడు. మనువడు డప్పుతో ఆడి పగలగొడ్తాడు. జయమ్మ తల్లడిల్లిపోతుంది. తమ జీవితంలో డప్పుతో పెనవేసుకున్న అనుంబంధాలను, వాస్తవాలను తెలుపుతుంది.
దప్పులు కొట్టడంలో ప్రత్యేకమైంది సావుదప్పు. వివిధ పద్ధతుల్లో దరువులేస్తారు. ఒకవైపు దప్పుకొడుతూ మరోవైపు నుదుటితో చిల్లర పైసలు అందుకోవడం, మట్టి కప్పలో నిలిపిన రూపాయి నోట్లను కనురెప్పల మధ్య ఒడుపుగా పట్టుకోవడం మొదలైన నృత్యరీతుల్ని అంజయ్య గారి ‘ఇనాం శెలుక’11 కథలో చూడవచ్చు. మాల మాదుగులకు బూమి ఆశ చూపి మహ్మదీయ మతంలోకి మార్చుట కొరకుపెద్దింటి అశోక్ కుమార్ ‘సావుదప్పు18 కథ వివరించింది.
దాగుడు మూతలు ఆడటం చాలా మందికి బాల్యంలో ఉంటది. దప్పు శబ్దం ద్వారా మాదిగలు దాగుడు మూతలు ఆడుతారు. ఆడే విధానాన్ని గోగు శ్యామల ‘జాడ’19కథ ద్వారా అంతరించి పోతున్న కళకు అక్షరాత్మకంగా జీవం పోసింది. దెబ్బ కొట్టిన తీరు ముందుకు, పక్కకు, వెనుకకు, వెళ్లి దాసిన వస్తువును దొరికిచ్చుకుంటారు. దొరికిచ్చుకుంటే గెలిసినట్టుగా ప్రకటిస్తారు.
గ్లోబలైజేజషన్ పుణ్యమా ప్రతీది ప్యాకేజే. ఆధునిక సంస్కృతి అరవు తెచ్చుకుంటున్న వ్యవస్థలో చావుకూడా ఒక ప్యాకేజే అని చెబుతూ దప్పులు కొట్టడంతో శవయాత్ర ప్రారంభమైందని పేర్కొన్న కథ బి.వి.ఎన్ స్వామి గారి ‘చావు ప్యాకేజి’20 కథ.
చెప్పుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూనే ఆత్మ గౌరవం ప్రకటించిన దార్ల రామచంద్ర గారి కథ ‘కిర్రు చెప్పులు’21 కథ. మనుమరాలు అడిగినందుకు తాత చెప్పిన రహస్యం మన మాదిగ వృత్తి వూడితే వూడిరది. ఆత్మ గౌరవం మిగిలింది. అంటరాని తగ్గుముఖం పట్టింది. ఈ పాక్షిక మార్పుకు మానసిక సంతోషంగా ఉంది. ఆర్థిక విధానంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని వివరిస్తుంది.
చెప్పులు: మాదిగల వృత్తి చెప్పులు కుట్టడంతో అనుబంధాల్ని నెమరేస్తూ వొచ్చిన కథలు బోయజంగయ్య గారి కథ ‘చెప్పులు’,కేపి లక్ష్మినరసింహ కథ ‘సెప్పుల సాయవ్వ’, నోట్ల రద్దు వల్ల చెప్పులు కుట్టే జీవితాల్లోని అలజడిని సిద్దెంకి యాదగిరి ‘పిడుగు’ మొదలైన కథలు ఉన్నాయి.
ఉపకులాల చిత్రణ : మాలలు, మాదిగలు దళితులలో ప్రధాన కులం. తమ కులాల ఔన్నత్యాన్ని కాపాడుటకు కొన్ని కులాలను పోషిస్తారు. వారు ఆశ్రితులు. వారే ఉపకులం. వారు తమ కులాల కీర్తి ప్రతిష్టలను వివరిస్తూ మరో తరతరానికి అందిస్తుంటారు. ప్రత్యామ్నాయ సంస్కృతిని సారథులు. పటం, బాగోతం, కథాగానం, ప్రవచనం, యక్షగాన మొ॥న రూపాల్లో ప్రదర్శిస్తారు.
డక్కలివారు జాంబవంతుని చరిత్రను పటం ద్వారా వివరిస్తారు. డక్కలిని మాదిగలు ముట్టుకోరు. డక్కలి అన్నం అడుక్కునే విధానం ఆకిలి అంచుకు ఒక రోలు ఉంటుంది. మాదిగలు ఆ రోలు ఎక్కి అంటకుండా మీదినుంచి సిబ్బితో వేస్తరు. అనుకోకుండా ముట్టుకుంటే బంగారు తీగెతోని కాల్చాలి. మాదిగ విద్యార్థి స్వగతం. చదువు బుద్ధిని వికసింప జేస్తది. నేను బడిల ఎక్కువోల్లను ముట్టుకుంటున్నాను. మనోల్లను మనం ముట్టుకుంటే తప్పేంది? అని తల్లిదండ్రుల్ని ఎదురించిన సంస్కరణాత్మక కథ. పాఠశాల వయసులోనే దక్కలిని ముట్టుకున్నందుకు జరిగిన సంఘర్షణను తెలిపిన సిద్దెంకి యాదగిరి ‘బోధ’22 కథలో ‘‘బర్లకాడికి బర్లు పోతయి. గొర్లకాడికి గొర్లు పోతయి. మనిషి దగ్గరకి మనిషి పోకుంట ఎవడు జేసేరా వాని యాలిముండమొయ్య’’ అని ఉన్నత కుల పాత్ర ద్వారా సమానత్వాన్ని వివరిస్తుంది.
మాదిగలు తమకున్న మాన్యంలో కొంత పొలం త్యాగానికి తీస్తారు. డక్కలి వారికి త్యాగం చెప్పడంలో మాదిగలు వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. కూడి చర్చిస్తున్నపుడు డక్కలి పోషవ్వ నా త్యాగానికని తీసిన భూమిలో పండిన పంటను ఇచ్చి త్యాగం చెప్పుమని సమస్యను పరిష్కారం చేసినట్లు చిత్రించిన కథ జూపాక సుభద్ర ‘రాయక్క మాన్యమ్’23 కథ వివరిస్తుంది.
సిందోల్ల వృత్తి బాగోతం. మాదిగల ఆశ్రయం పొందుతారు. త్యాగం ఒప్పుకున్న తర్వాత ఆట ఆడుతారు. ఆటలు ఆడినన్ని రోజులు సంతోషంగా ఉంటుంది. మాదిగల్ని సిందోల్లు వరుసలతో పిలుస్తారు. సామ్రాజ్యవాద ప్రభావం ఎంత దారుణాన్ని సృష్టిస్తుందో తెలుపుతున్న కథలు వచ్చాయి. చిందు భాగవతుల జీవనరేఖ జీవన సంధ్యలో పూర్వపు యక్షగానాల ప్రదర్శనలు గుర్తుకొస్తాయి. ఆనాటి ప్రదర్శనలు కరువైనాయని ఐతా చంద్రయ్య ‘సంధ్యా సమయం’24 కథ ద్వారా వివరిస్తాడు.
త్యాగం చెప్పక పోవడం వలన జరిగిన అనర్థాలు తైదల అంజయ్య కథ ‘త్యాగం.25’లో వివరించారు. మాదిగలు త్యాగం చెప్పకపోవడం వలన ఉపాధిలేక ఊరిడ్సి పట్నం పోయి మంగళి పని చేస్తున్న సిందు నర్సయ్య, మాదిగ మల్లయ్యలు కలుసుకుంటారు. చిందు నర్సయ్య తన బాధల్ని చెప్పుకుంటాడు.
వీరి మధ్య సంభాషణలు జరుగుతున్నంతసేవు మల్లయ్య ఆ.. ఊ అనుకుంటూ అరిసెంద్రుని ఏషమేసి స్మశానంల నిలవడ్డ
ఉపకులాలకు త్యాగం లేదని కొన్నిసార్లు అవమానపరచిన సంఘటనలు కూడా ఉంటాయి. జాంబ పురాణం ఎవనికి కావాలే. పని పాట లేక ఓ ఏషం కట్టుకోను వచ్చినారు. మొదలైన దూషణలు, తిరస్కారాలు కూడా స్వగతాలుగా ఉంటాయి. మనసు బాధల్ని గాథలుగా మలచడం కొందరికే సాధ్యం. వాటిని తెలుగు సాహిత్యంలో స్థానం కల్పించిన ఘనత డా. గడ్డం మోహన్‌రావు ‘త్యాగం’26 కథకి దక్కింది. పదిహేనేండ్ల తర్వాత ఊరికి త్యాగానికి వోతే సిందులకు జరిగిన పరాభావాన్ని కళ్లకట్టినట్లు చూపించింది. వీరు రాసిన మరో ‘ఇచ్చురు గాళ్లు’27 కథలో ప్రధాన కులాల వారు ఆశ్రిత కులాలను ఎంత హేళనగా మాట్లాడుతారో తెలుపుతుంది. బొందలు తోడే బొందయ్య చనిపోతాడు. అతనికోసం బొందతోడేందుకు చదువుకున్న యువకులతో సహా ఎవ్వరు ముందుకురారు. దాంతో కూతురును బొందతోడిన సబలగా ఐతా చంద్రయ్య ‘సరళ’28 కథ ద్వారా నిరూపణ చేస్తాడు. బేగరి కథల పేర బూతం ముత్యాలు కథా సంపుటం తెచ్చాడు. గుడిపల్లి నిరంజన్ గారు ‘నీరటికాడి కల’ కథ నీటితో జీవితం చిత్రిస్తుంది. డా. తాళ్లపల్లి యాకమ్మ ఆశ్రిత కులాలైన చిందు వారిమీద ‘బతుకు’, డక్కలి వారి స్థితిగతులను వివరిస్తూ ‘ఆశ్రిత బతుకులు’ కథ రాసింది.
4.దళిత స్త్రీ వాదం: స్త్రీ పురుషుల మధ్యగల అధికార సంబంధాలకు మాతృత్వానికి పవిత్రతను ఆపాదించి పెడుతున్న పితృస్వామ్యాన్ని, సవాల్ జేసింది స్త్రీవాదం. భారతదేశంలో పితృస్వామ్యమే కాదు కులస్వామ్యం కొనసాగుతుంది. తన పుస్తకం ముందుమాటలో దళిత స్త్రీ వాదం జూపాక సుభద్ర గారు ‘‘అగ్రకులాల స్త్రీలకు పితృస్వామ్యమే శత్రువు అంటారు. పితృస్వామ్య విముక్తే వారి విముక్తి. కాని దళిత మహిళల విముక్తి చాలా పీడనలతో ముడిపడి వుంది. కుల హింసలు, శ్రమదోపిడి, దొర, దొర్సాని ఇంటి మగస్వామ్యాలు, ఆకలి హింసలు యివన్నింటి నుంచి దళిత మహిళ విముక్తి చెందాల్సి వుంది29.’’అని ఒక స్పష్టత ఇష్టత ఇచ్చారు. పితృ స్వామ్యాన్ని, కులస్వామ్యాన్ని రెంటినీ మిళితం చేసి కథలు రాయడం దళితులకు తప్పనిసరి బాధ్యతయింది. తెలంగాణ తొలి దళిత రచయిత్రి మామిడిపూడి సత్యవతి. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యల వల్ల స్త్రీ లేకుంటే పిల్లలుపడే కష్టాలను చిత్రించిన ‘‘తెరతొలగింది’’30 కథ. శశిరేఖ, కృష్ణ కదులుతున్న రైలులో ఉన్నారు. కృష్ణ చెబుతుంటే వింటున్నట్టే వింటుంది. గుండె దడదడలాడుతుంది. ఆలోచనలు తలల్లోంచి ఆవిర్లు వస్తున్నట్లుగా వుంది. రైలు ఆగింది. ఒక ముసలమ్మ ఇద్దరు పిల్లలతో కంపార్టుమెంట్‌లోకి ప్రవేశించింది.
ముసలమ్మను శశిరేఖ ఆరా తీస్తుంది. దుర్మార్గుడైన మా కొడుకు మరో యువతి ఆకర్షణకు లోనవడం వల్ల బి.ఏ చదివిన కోడలు కుమిలిపోయింది. నేను వారించిన. ఇలాంటి సంబంధాలు ఎక్కువరోజులు ఉండయని చెప్పినా కనీసం పిల్లలకోసమైనా బతకాల్సింది. చనిపోయింది. ఆ యువతి రెండో భార్యగా తిష్టవేసిందని చెబుతుంటే కృష్ణ అసహనంగా చూస్తున్నాడు. నా పిల్లలకు సవతితల్లితో ఇలాంటి బాధలుంటాయని తలంచి రైలు కదులుతుండగానే శశిరేఖ దిగి బస్టాండ్ వైపు నడిసింది.
ఎనిమిదేళ్ల కాపురంలో ఏ చింతలేని శశిని గారడి చేసాడు. బస్సులో పరిచయమై నెలరోజులే అయినా అతన్ని విడిచి వుండలేని పరిస్థితి. నా పిల్లలకోసమే నా జీవితమని తలుచుకుంటుంటే మనసు దూది పింజలా తేలిపోయింది. వచ్చి తలుపులు తీయగానే అత్త గయ్యిమని లేసింది. స్నేహితుల ఇండ్లలో ఉండిపోను ఈ ఒక్కసారి క్షమించండి అత్తయ్య అని వేడుకుంటుంది. యిక మనిద్దరమే ఒకరికి ఒకరం తోడు అన్నట్లుగా ఒకడి మీద ఒకడి కాలుచెయ్యి వేసిపడుకున్నారు. ఆ దృశ్యం చూడగానే శశిరేఖ హృదయం ద్రవించింది. కన్నీటితో ఇద్దరినీ గుండెలకు హత్తుకుంది.
దళిత సర్పంచ్‌ల దీనస్థితిని చిత్రించిన డా. పసునూరి కథ ‘ఊగి ఊగి ఉయాల’31.‘‘ఏడ మారుతది బిడ్డా మన రాత! నేను సర్పంచినేగని నా ఇష్టంతోటి రాజ్యమేలనీకి సర్పంచ్ అయినానురా, ఆ పెద్దిరెడ్డి పటేల్ నిలబడితే నిలబడ్డ. ఏలి ముద్దరెయ్యమంటే ఏసిన. సూత్తాంటే ఐదేండ్లు వొడిసే ... సర్పంచ్‌గా వున్నా గూడా గిట్లనే కూలీనీ చేసుకుంటి. ఇప్పుడు సర్పంచిగిరి పోయినంక గూడ మల్ల గదే దిక్కైంది బిడ్డా’’అని అగ్రకుల స్త్రీవాదాన్ని తిప్పి కొట్టింది పెద్దమ్మ.
స్త్రీలపట్ల వివక్ష, హింస అస్థిత్వస్పృహ కలిగినప్పటినుంచే కథల్లోకి ప్రవేశించాయి. పురుషాధిపత్యానికి దళిత స్త్రీ ఎలా బలయితుందోడప్పోల్ల రమేష్ ‘దునియల’32 కథ చిత్రిస్తుంది. ఒక దశలో జీవితం మీద విరక్తిపుట్టినా చావడానికి సిద్దమై చావు పరిష్కారం కాదని అనుకున్నది బతికి సాధించడమే నిజమైన పరిష్కారం చూపుతది.
ఉమాపతి బి. శర్మ ‘ఏది పాపం ` ఏది పుణ్యం’33 అనే కథలో శివరాత్రి నాడు నాగుమల్లి అనే మాల పిల్ల హరికథ వినడానికి వచ్చినామెను కులంపేరన దూషించి వెళ్లగొడుతారు. పోతున్న నాగుమల్లిని నోరుమూసి ఎత్తుకొని దొడ్లెకు గుంజుకపోయి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దొర పాము కాటుతో అంతమవుతాడు.
మాతంగి, బసవిని, దేవదాసి..మొదలైన పేర్లతో పిలవబడుతున్న జోగినీల బతుకును చిత్రించిన ఐతా చంద్రయ్య ‘కలికి గాంధారి’34 కథ. బహుశ వీరిపై రాసిన తొలి కథ కావొచ్చు. గాంధారిని, తల్లిని, అమ్మమ్మను ఊరి దొర సంతతి ఉంపుడుకత్తెలుగా వాడుకుంటారు. గాంధారి తన కూతురు మేనకను చదివిస్తుంది. ఎల్లారావు కొడుకు మేనకను అత్యాచారం చేయబోతుంటే గాంధారి అతడిని కత్తి పీటతో పొడిసి జైలుకెలుతుంది. గాంధారి జైలునుంచి విడుదలయ్యే నాటికి ఎల్లారావు జైలు సూపరిండెంటుగా వస్తాడు. గాంధారిని పెళ్లిచేసుకుంటానంటాడు. గాంధారి ధైర్యంగా ‘‘నేను ఆనాటి గాంధారిలా కండ్లున్న గుడ్డిదాన్ని కాదు. నీ వంశం నీ కొడుకుతో అంతమైంది. నా వంశం నా మనువనితో షురువైంది.’’ అని తిరస్కరించి బయటకి వస్తుంది.
పాఠశాలలో ఉన్న స్నేహం ఊళ్లోకి వచ్చేసరికి ఏమవుతుందో తెలిపేది జూపాక సుభద్ర గారి ‘బల్లె దోస్తులు ఊల్లెగాదు’35లో బట్టలు, గాజులు ఇచ్చి పుచ్చుకోవడం కులం వల్ల ఏర్పడే అవస్థను తీర్చి దిద్దింది. మాదిగలకు బతుకమ్మ లేకుండా చేసిన మనువాదుల కుట్రల్ని పసిగట్టి చిత్రిక పట్టిన జూపాక సుభద్ర గారి ‘గద్దెత్కపోయిన బత్కమ్మ’ కథ చిత్రిస్తుంది. ఎక్కువ కులాలతో మిళితమవడాన్ని చిత్రించిన తప్పెట ఓదయ్యగారి ‘మల్లక్క’ కథ. మల్లక్క కుర్మ. రచయిత తన కుమార్తె అడిగినందుకు గతం చెప్పుతడు. మా అయ్య సచ్చిపోయినపుడు ఆ అక్కనే సందం చేసిందీ. నా సదువుకు సాయం. అతీగతీ లేని యాల్ల అన్నీ తానై నాకు సాయం చేసింది. ఆప్పటి బాధలు చెపుతూ మనసును పిండేస్తడు. అది కథకాదు జీవితం గనుక మనసుతెరల బతుకు వెన్నెలను పిండోలే ఆరవోస్తడు.
తెలంగాణ పలుకుబడులను ప్రయోగించిన పాకాల యశోదరెడ్డి గారి ‘కొత్త బాట’ కథలో పట్నం నుంచి ఇంటికి పోగానే పాలేరు బిడ్డా అక్కా అంటు వచ్చి కాళ్లను చుట్టుకుండడం వలన క్రమేపి అంటరాని తనం తగ్గుతుందని దర్పణం పడుతుంది.
5. విద్యాభ్యాస చిత్రణ: ‘‘సామాజిక మార్పుకు విద్య ఒక ఆయుధం’’ అని డా. బి. ఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో మందిని విద్య వైపు మళ్లించింది. చదవు కోసం పడిన బాధల్ని గాథలుగా మలిచింది అక్షరం. కన్నీళ్లు మిగిల్చిన కష్టం కడతేరిన పిమ్మటకావ్య జగత్తులో కీర్తి కిరీటాన్ని ధరించింది.
చదువుకోసం అంబేద్కర్ స్ఫూర్తి ఎంతో ఉపయోగపడిరది. జాజుల గౌరి ‘విద్యార్థి’36 కథలో దళిత పిల్లలు వారి బాల్యం. వారి చదువు తీరుతెన్నులు ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు, బాధలు ఆవేదనలు ఎలా వుండేవో చిత్రిస్తుంది. ఆలోచనలకు అంతుండదని వివరించడం ముఖ్యఉద్దేశ్యం. ఈమె రాసిన కథల్లో చదువుకు ప్రాధాన్యమిచ్చిన కథలు ‘చదువు’, ‘పగటిబెల్లు’. ఈ రెండు కథలు పేదపిల్లలకు అబ్బాయిల్లా అమ్మాయిలకు కూడా చదువాలని ఆశ ఉంటుంది.
ఆర్థిక స్థితి చదువుకు ఆమడ దూరం తరిమేస్తుంది. అయినప్పటికీ గట్టి సంకల్పం లక్ష్యం వైపు పయనింపజేసేట్లు స్ఫూర్తి నింపే కథ గోగు శ్యామలగారి ‘రడం’37కథలో చిత్రించింది.
కిటుకు తెలియాలి గాని బతుకు మారుతుందని తెలిపే కాలువ మల్లయ్య గారి ‘కిటుకు’38 కథలో చిత్రించింది. దళితులమైన మమ్ము గౌరవిస్తలేరు. దళితాసఫిర్‌ని చాలా గౌరవిస్తున్నారు. ఇది కేవలం చదువువల్లనే సాధ్యమనుకొని కొడుకును చదివించితే కొంతైనా గౌరవం పొందుతాడు.
చదువుపట్ల పేదలకుగల ఆర్థిని ప్రతిబింబిస్తూ బి.ఎస్. రాములు చిత్రించిన కథలు ‘బడి’, ‘పాలు’ కథలో మంచి చదువు చదివి మంచి ఉద్యోగాలు చేయాలని కలలు కనే ఇతివృత్తం. వీరి మరో కథ ‘సదువు’లో లచ్చయ్యసారు తన శిష్యుడు గంగాధారి చదువుకోనని మొండికేయడంతో ఓదార్చి మనసులో అయినా పాఠాలను అందుకోగలవాడే తన స్వేచ్ఛకేదో అడ్డంకిగా ఈ చదువు నోట్సు మారిందనుకున్నాడు.
ఓ స్త్రీ చదువడం కోసం అడుగడుగున ఆటంకాలు. పెళ్లయ్యింది. దళితులు చదవడమే పెద్ద ఆటంకం.పట్టుదల ఉండాలే కాని ఏదైనా సాధించవచ్చని తెలిపిన కథ ‘అడగడుగున సుడిగుండం’ చదువుకోసం ప్రయాసపడి ప్రయోజకురాలయిన జీవితసత్యాన్ని ఆవిష్కరించింది.
6.దళితోద్యమ ప్రభావం: మహారాష్ట్రలో అన్నాబావుసాఠే తెచ్చిన దళితోద్యమ ప్రభావం ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ఎనభై దశకంలో అస్థిత్వ పోరాటాలు ఊపందుకున్నాయి. ప్రారంభంలో దళిత వాదం ఏకతాటి మీద ఉన్నది. క్రమేపి దళిత స్రీ వాదం, బీ.సి, మైనారిటి, దళిత క్రైస్తవ సాహిత్యాలుగా విడిపోయింది.
మాదిగ పదం ఆత్మగౌరవ సూచకంగా ధరించేలా తెచ్చిన ఉద్యమం మాదిగ దండోరా. మంద కృష్ణ మాదిగ అనే పేరుతో ఆత్మగౌరవ ఉద్యమం తెచ్చింది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు ఉద్యమం పురుడుపోసుకుంది. దళిత సాహిత్య రెండు పాయలుగా చీలింది.
హైద్రాబాద్‌లో జరిగిన సంఘటనలాధారంగా అంబేద్కర్ జయంతులకు జరిగే చిత్ర విచిత్ర సంఘర్షణలకు తీవ్రమైన సమస్యలను చిత్రిస్తున్న ‘అంబేద్కర్ సాక్షిగా...’ కథ తెలియజేస్తుంది. అధికార, ప్రతిపక్షనేతలు పూల మాలలు వేస్తారు. మాల గ్రూప్, మాదిగ గ్రూప్‌లుగా విడిపోయి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. చివరకు మాలలు, మాదిగలు ఎవరు దండ వేయని పరిస్థితులు అంబేడ్కర్ సాక్షిగా జరిగాయని కథలో వివరిస్తాడు.
‘‘మాదిగల జీవితం నుండి దళిత సాహిత్యం పుట్టింది. కొనసాగుతుంది. మాదిగల జీవితాలే దళిత సాహిత్యానికి పట్టుకొమ్మలు అవుతున్నాయి’’39 అని గుండెడప్పు కనకయ్య పేర్కొన్నారు. మాదిగ దండోర ఉద్యమంకు కొంతమంది మాలరచయితలు మద్దతు పలికారు. కలెకూరి ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే, ‘‘మాల మహానాడు పుట్టుకే దళిత చైతన్యానికి వక్రీకరణ.’’40 సమాజ ఉపయోగకరమైన ఎన్నో ఉద్యమాలను నిర్మించి, ఫలితాలు సాధించిన దండోర ఉద్యమం, వర్గీకరణ వద్దనే మహానాడు కుల స్పృహ పెంచినా దళితుల్లో రాజకీయ చైతన్యం నింపలేక రాజ్యాధికారం వైపు నడిరపించ లేకపోయాయి.
దండోర వర్గీకరణతో సమాజంలో ఉన్న సమస్యల మీద పోరు చేస్తూనే వుంది. దండోరా ఉద్యమం మాదిగలకే కాకుండా దళిత బహుజనుల్లో చైతన్యాన్ని తెచ్చింది. వివిధ కుల పోరాటాలు ఉద్భవించాయి. ఉద్యమ నేపథ్యాన్ని బలంగా చిత్రించిన ప్రక్రియ కవిత్వం. కథ. అనుకున్నన్ని కథలు రాలేదని విమర్శకుల అభిప్రాయం.
డా॥ నిత్యానంద రావు తెలంగాణా తొలి దళిత కథల గురించి ‘చినుకు’ పత్రికలో ప్రస్తావిస్తూ ‘‘గుండె డప్పు కనకయ్య పూర్తి దళిత భాషలో దళిత జీవితాన్ని దళిత సంస్కృతిని చిత్రిస్తూ ‘మేమిట్లుండం’ అన్న కథా సంపుటిని ప్రకటించాడు. ఇది తెలంగాణ తొలి దళిథ కథాసంపుటి. బోయ జంగయ్య దళితోద్యమం రాకముందు దళిత చైతన్యాన్ని చిత్రించిన ముందుతరానికి చెందినవాడైతే, దళితోద్యమ స్ఫూర్తితో తయారైన రచయిత కనకయ్య. వీరి సంపాదకత్వంలో ‘ఎదురు చూపులు’(1999) తెలంగాణ మొట్టమొదటి దళిత కథా సంకలనం.సిద్దెంకి యాదగిరి ‘పంచుకోండ్రి’41కథ చిన్న చిన్న ఉదాహరణలతో వాస్తవాన్ని ఎంతో సమర్ధవంతంగా చిత్రించింది. వర్గీకరణ చేస్తానని చెప్పి మోసం చేసిన సోనియా గాంధీ హైద్రాబాద్ వచ్చినపుడు కాంగ్రెస్ భవన్ కాలపెడుతూ ఆ మంటల్లో తగలబడి కొన ఊపిరితో కొట్టుకాడుతున్న పొన్నాల సురేందర్ మాదిగ అవస్తను టీవిల్లో చూస్తూ సంఘర్షనకు లోనై, అమర వీరుల త్యాగాలను చూసి చలించిన మానసిక పరివర్తనలను చిత్రించినది ‘అమరలకు జోహార్’ కథ వివరిస్తుంది.మైనారిటి వాదంలో స్కైబాబా ‘జమ్మి’, ‘దస్తకత్’ క్రైస్తవ విధానంలోని అంత్య క్రియలను సిద్దెంకి యాదగిరి ‘సావు’ కథ చిత్రిస్తుంది.
7. నయా దళితవాదం: ఈ దేశంలో కులం రోజు రోజుకీ అనేక రూపాల్లోకి మారి తీవ్రమవుతుంది. ‘‘కులం అనేక చోట్లకి అనేక రూపాల్లో మారుతున్నందు వల్ల దీనిని నయా దళితవాదం’’ అని ఏ. రవీంద్ర బాబు42గారన్నారు. బాబా సాహేబ్ అంబేద్కర్ చట్టబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితుల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఉద్యోగానికి అందుబాటులో ఉంటున్న క్రమంలో పట్టణాల్లో, నగరాల్లో కిరాయిరూంలకు వెళుతున్నపుడు మారిన కులం గురించి తెలుస్తుంది. వస్తువులో వచ్చిన మార్పు దృష్ట్యా నయా దళితవాదం అంటున్నారు. కొందరు రంగు, కొందరు మాట విధానంతో మీరు రెడ్డీలా అని డొంక తిరుగుడుగా అడిగి కులం పేరు తెలుసుకుంటున్నారు.
గెజిటెడ్‌లాంటి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే కులం పేరు తెలియగానే మా వాళ్లు టులెట్ బోర్డు తీయనుట్టున్నారు. జస్ట్ నిన్ననే అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారని చెప్పి కిరాయకు రూంలు ఇవ్వరు. కాలనీలో అట్లనో ఇట్లనో కాలనీలో పదేళ్ల నుంచి కిరాయికి, లేదా స్వంత ఇల్లు కట్టుకొని నివసిస్తున్నా వారి శుభకార్యాలకు పిలువరు, దళితుల శుభకార్యాలకు రారని చెప్పే సిద్దెంకి యాదగిరి ‘తప్ష’కథ. అపార్ట్‌మెంట్‌లలో కిరాయకు, గేటెడ్ కమ్యూనిటి, వివిధ పేర్లతో వెలిసే రియల్ ఎస్టేట్ వెంచర్లలో కులం ఉందని చెప్పే వాస్తవాన్ని విప్పి చెప్పే కథ పసునూరి రవీందర్ ‘గోవర్ణం’ కథ వివరిస్తుంది.
ఎక్కడికి పోతున్నా కులం నీడలా వెంటాబడుతుందని వెలిబుచ్చే కథ డా॥ పసునూరి రవీందర్ ‘వేరెవర్ యూ గో’ కథ పాశ్చాత్య మిత్రుడైన బెంగ్త్‌తో రచయిత గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నపుడు అనేక సంఘటనల సమాహారాన్ని ఆంగ్లంలో అనువదించి చెపుతుంటాడు. అప్పట్దాక చర్చలో పాల్గొన దొరను చూసి ‘‘వేర్ ఎవర్ యూ... గో ... ది క్యాస్ట్ ఫాలోస్ ఇండియన్స్’’ అని బెంగ్త్ అన్నాడు. స్కైబాబ గారి ‘విజిటేరియన్స్’ కథలో శాఖాహారులకు మాత్రమే ఇల్లు అద్దెకిస్తామని బాహాటంగా ప్రకటిస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి.
8. బహుజన తెలంగాణ వాదం: తెలంగాణ ఆరని పోరుకుంపటి. కరువు వాతలు. కన్నీళ్ల గోసలని ఒలికించారు. కలంతో పలికించారు.తెలంగాణ మలిదశ ఉద్యమం దళిత బహుజన విద్యార్థి యువకులు వీరోచితంగా పోరాడారు. దాదాపు పన్నెండు వందలకు పైగా బలిపీఠమెక్కిన విద్యార్థి యువకుల్లో నూటికి తొంభైశాతం దళిత బహుజనులే.
తెలంగాణ పోరు సంఘటనలను, సంఘర్శనలను వివరించిన వాస్తవ జీవితాలు దళిత కథకులు కథలుగా సాహితీ నుదుటిపై తిలకం దిద్దారు. పసునూరి రవీందర్ ‘తను నేను ... ఇంకొన్ని కొత్తపొద్దులు’, సిద్దెంకి యాదగిరి ‘కీలెరిగిన వాత’, చెన్నరాజు గారి ‘పైలం బిడ్డా!’, పొన్నాల బాలయ్యగారి ‘పాలమూరు పాలేరు’, కథలు, మొ॥వి కలవు.
9.విప్లవ ప్రభావ చిత్రణ: డప్పు కొడుతూ జీవనం సాగించే ఒక తండ్రి తన కొడుకు పట్ల ఆలోచనలు వివరించే కాలువ మల్లయ్య గారి ‘అగ్ని గుండం’43 కథ తెలంగాణ ప్రాంతం అంతా నక్సలైట్ ఉద్యమ తీవ్రతల వల్ల ఊళ్లు అగ్ని గుండాలు తలపిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదువుతున్న తన కొడుకు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతాడా? ఎన్‌కౌంటర్ లో చనిపోతాడా? ఆలోచిస్తుంటాడు. అప్పటి పోలీస్ నిర్బంధం, రాజ్య నిరంకుశత్వ వైఖరిని ప్రతిబింబిస్తుంది.
పాటలు తూటాలై ధ్వనిస్తాయని చూపే కాలువ మల్లయ్య గారి ‘వెంటాడే పాట’ కథ. నక్సలైట్ ఉద్యమపాట క్షిపణిలా ప్రజలగుండెల్ని మండిరచింది. పెళ్లిలో విప్లవ పాటలు వేసుకుని పెద్ద శబ్దంతో వింటున్నారు. ఈ పాటలు ఎందుకు? భక్తి పాటలు వేసుకోవాలని వారిస్తుంటారు. కాని నిర్వాహకులు ఇవే పాటలు వింటామని తెగోసి చెప్పడంతో పాటలు కూడా భయపెట్టాయని తెలియజేస్తుంది.
కె.వి నరెందర్ గారి ‘దొరొచ్చిండు’ కథలో పదహారేళ్ల కిందు ఊరిడ్సి పోవడానికి కారణమైన నక్సలైట్ తండ్రిని ఊల్లోకి వచ్చిచూపుకోసం హైద్రాబాద్ తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయించాడు. చూపు వచ్చిన తర్వాత నన్ను నీ కొడుకు మరో పదేళ్లు ముందు నన్ను పట్నాలకు పంపించి ఉంటే సిటీనే కొనెటోన్ని. అని చెప్పుతుంటాడు. వచ్చేటపుడు ఈ వెలుతురు నాకొద్దని దొర ఇప్పించిన బస్సు కిటికీ గుండా బయట పారవేస్తడు.
మరికొన్ని దళిత కథలు: ఆడెపు లోక్ష్మీపతి ‘రాబందులు’,
'కొన్ని ఎముకలు ఇంకొన్ని గింజలు', 'సాయం బండ'గుర్రం సీతారాం లు
'కిరాయిల్లు' విఠలాపురం పుష్పలత
'పాలమూరు పల్లె' గొర్ల బుచ్చయ్య
'ఇసుమూరు సోమక్క' సుధాకర్ అరూరి
డా. పసునూరి రవీందర్ 'సంపుడు పంజం', 'వేరెవర్ యూ గో', 'పెంజీకటి', అనగనగా ఒక బానిస కథ, 'తలదన్నినోడు'.... మొదలైనవి.
సిద్దెంకి యాదగిరి ‘పిడుగు’, అంటరాని బతుకమ్మ’, 'బోధ' ఆఖరి కోరిక '
'కాల్వకిందికి' బండారు శంకర్
‘సాయిపెద్ది’, ‘గుండె నిండా జాలిబండ’, ఊరు మెచ్చిన మనిషి ..... మొదలైన కథలు గుడిపల్లి నిరంజన్ దళిత బతుకు చిత్రణ గావించాయి.
'మానేడు జొన్నలు', 'తండ్లాట' కథలు పులి కవిత రాశారు.
'సున్నాలు'మెర్సి మార్గరెట్ (కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత 2017.), టూ హోగా జరా పాగల్' కథను కిరణ్ చర్ల రాశాడు.
‘కంచం పొత్తు’, 'ఇచ్చురుగాళ్ళు', మొదలైన కథలు మాదిగ ఉపకులమైన చిందు జీవన విధానాన్ని గడ్డం మోహన్‌రావు చిత్రించాడు.
'కూన మనసుల కులం', 'దునియాల' దప్పొల్ల రమేశ్; 'ముత్యాలు - సుబ్బలు', మారబత్తుల పెద్దన్న; దూలం - శవం' ఉదయభాను; 'అలసెంద్రవంక', 'ముసాఫీర్' కత్ర్హాలను అరునాంక్ లత; 'పైలమ్ బిడ్డా' అనే కథను చెన్నరాజు; 'ఇత్తరాకుల తట్ట' మేడిచైతన్య; 'సీతవ్వ', హైమవతి ; భీముడు', మా వూరికి దొరొచ్చిండు' కె. పి. లక్ష్మీనర్సింహ ; 'తొలిపొద్దు పెరుమాన్ద్ల రాము మొదలైన ఆధునిక కథా రచయితలు రాశారు.
దళిత కథా సంపుటాలు:
దళిత చైతన్యంతో తొలుత వచ్చిన కథా సంపుటాలు'లోకం', 'గొర్రెలు', 'హెచ్చరిక', 'దున్న', 'రంగులు', 'చీమలు', 'తెలంగాణవెతలు', 'భోజకతలు', 'ఇప్పపూలు', బొమ్మలు', 'ఆమె', 'ఉప్పునీరు' ఆమె... కథ సంపుటాలు బోయ జంగయ్య వెలువరించారు.
ఆర్తరావం, కుట్ర, చలివేంద్రం, ప్రభంజనం, కపోతం మొదలైన కథా సంపుటాలు జాతశ్రీ ప్రచురించారు.
దళితోద్యమంతో వచ్చిన తొలి కథా సంకలనం ‘ఎదురు చూపులు’ సంపాదకులు డా॥ గుండెడప్పు కనకయ్య, దళిత కథ సంపుటం ‘మేమిట్లుండం’
'మల్లెముగ్గల గొడుగు' ఎండ్లూరి సుధాకర్
'సెల్లా' దాసరి లింగస్వామి
'ఎర్ర దుక్కి' ఎం నారాయణ
'బొండిగ' దొడ్డి రామ్మూర్తి
‘మన్ను బువ్వ’ - జాజుల గౌరి,
‘రేణ’ - చైతన్య ప్రకాశ్,
రాయక్క మాన్యమ్’, రిజర్వేషన్ భోగి' జూపాక సుభద్ర
‘ఏనుగంత తండ్రి కంటే ఏకులబుట్టంత తల్లినయం’ గోగు శ్యామల
‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’, కండిషన్స్ అప్లై ` డా॥ పసునూరి రవీందర్ (తెలంగాణ నుంచి కేంద్ర సాహిత్య యువపురస్కార్ గ్రహీత 2015)వీరి మరో కథా సంపుటి "కండీషన్స్ అప్లై"
'మిళింద' - ఏండ్లురి మానస(ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికి తెలంగాణలోనే జన్మిచింది. ప్రస్తుత నివాసం హైద్రాబాద్- కేంద్ర సాహిత్య యువపురస్కారం పొందిన తొలి దళిత కథకురాలు)
‘తప్ష కతలు’, - డా. సిద్దెంకి యాదగిరి (పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం చే 2019 కి గాను కథా ప్రక్రియలో ఉత్తమ్ గ్రంథ కావ్యంగా ఎంపికైంది. ) వీరిమరో కథా సంపుపుటి మూడు గుడిసెల పల్లె'
'మేలుకొలుపు' మల్లవరపు విజయ
మర్రి చెట్టు - మన్నే ఏలియా
‘ధగ్థం’, ‘బుగాడ’, ‘బేగరి’ కథలు ` బూతం ముత్యాలు
‘బొండిగ’ దొడ్డి రామ్మూర్తి,
'తిరుగు ప్రయాణం ' నల్లాల లక్ష్మీరాజ్యం
బైండ్ల చంద్రయ్య కథలు - జిలకర శ్రీనివాస్
‘ముత్కారి పల్లాటాలు (ముసల్దాని మాటలు ` గోసంగి పదాలు ఊటంకిస్తూ..)డా. గంధం విజయలక్ష్మి,
‘మమతల మల్లెలు’,‘రక్షణ’ డా. తాళ్లపల్లి యాకమ్మ,
'జోలె విలువ'- హైమవతి
‘అంబలి గంప’ కే.పి. లక్ష్మి నరసింహ .. మొ॥న కథా సంపుటాలు కలవు.
తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథా సంకలనం కమ్మమ్ జిల్లా నుంచి . సి. జాన్ సుందర్ రావు
వెలువరించిన తొలి కథా సంకలనం 'కపోతం'- 1970 (చూ. తెలంగాణ దళిత కథ. శ్రీనివాస్,.
సంగిశెట్టి, నిరంజన్, గుడిపల్లి ముందుమాట- పుట.85 ఏడుగురి కథకులలో ఐదుగురు ఖమ్మం వారే
కావడం), భార్గవి రావు "ఇంకానా ఇకపై సాగదు" 1994 లో అనే తొలి దలికథా సంకలనం
వెలువరించారు.
తెలంగాణ బతుకు చిత్రాన్ని సంకలనాలు అధికంగా చిత్రించాయి. తెలంగాణ తొలి దళిత కథా సంపుటి "మేమిట్లుండం" గుండె డప్పు కనకయ్య సంపాదకత్వంలో 1999 లో దాదాపు పది కథలు ప్రచురించబడింది. దళిత అస్థిత్వంతో రాసిన తొలి దళిత కథా సంపుటి "ఎదురుచూపులు". దండోరా ఉద్యమ నేపథ్యంలో మాదిగల జీవితం ప్రధాన వస్తువుగా వచ్చిన కథలను గురించికూడా ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావన గురించి కింద చెప్పటం జరుగుతుంది. 'నల్లపొద్దు' దళిత స్త్రీల సాహిత్యం 1921-2002’ గోగు శ్యా మల 2003 ప్రచురించారు ‘నల్లరేగడిసాల్లు’ (మాదిగ ఉపకులాల ఆడోళ్ళ కథలు -2006) కథా సంకలనాల్లో తెలంగాణ దళిత ఉపకులాల ఆడపడుచుల కథలూ ఉన్నాయి. ఇతర సంకలనాలలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రధానంగా సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో "తెలంగాణ దళిత కథలు"ఎనభయ్ ఎనిమిది కథకుల కథలతో వెలువరించారు.. వృత్తి పదకోశంలా వృత్తి కథలు వెలువరించిన కవయిత్రి, కథా రచయిత్రి జ్వలిత సంపదలోకథ సంకలనం"మల్లేసాల". ఇందులో 139 కథలతో తెలంగాణ సమాజంలో ఉన్న వివిధ కథలుంటే దళిత, దళిత ఉపకులాలకు సంబందించిన కథలే ఇరువైకి పైగా ఉన్నాయంటే దళిత జీవితాన్ని ఎంత బలంగా కథల్లో చిత్రించిన బాదలున్నాయో తెలుస్తుంది.
తెలుగు సాహిత్యంలో కథా వార్షికలు ప్రారంభమయ్యి మూడు దశాబ్దాలు దాటినా దళిత కథా సాహిత్యంలో దళిత కథా వార్షిక రాలేదు. ఈ లోటును తీర్చూతూ 2020 లో ప్రారంభించబడిన జంబూ సాహితి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దళిత కథలతో దళిత కథా వార్షిక తీసుకరావడం దేశంలోనే తొలి దళిత కథా వార్షిక కావడం తెలుగు వారికి సంతోషదాయకం.
దళిత కథా వార్షికలు జంబూ సాహితి ద్వారా డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఒదయ్య లు కలిసి తెస్తున్నారు. తొలి దళిత కథా వార్షిక 2020 "తొండం బొక్కెన"లో ఉన్న కథలు ఉభయ తెలుగు రాష్ట్రాల కథలను చూడవచ్చు. వాటి వివరాలు
1. కొలకలూరి ఇనాక్ఇది ఒప్పు
2. జూపాక సుభద్రమైక్రో సిట్టీలల్ల మన్నువడ
3. గోగు శ్యామలకరోనా సుగ్గి
4. పసునూరి రవీందర్ శివన్న మరణం
5. భూతం ముత్యాలు సావుకూడు
6. మన్నె ఏలీయా ఇదెక్కడి న్యాయం
7. జిలుకర శ్రీనివాస్ బైండ్ల సెంద్రయ్య బోనాల.
8. ఎండ్లూరి మానస మెలీనా
9. ఎండపల్లి భారతి సూరే గ్యానం
10. చరణ్ బొంబాయి పొట్టేలు
11. కెపి లక్ష్మీనరసింహ దోసిలి వట్టు
12. కౌలూరి ప్రసాదరావు రెండు గ్లాసులు
13. తవ్వా వెంకటయ్య కొండిగాడు
14. రామ్ పెరుమాండ్ల కన్నీటి కథ
15. తప్పెట ఓదయ్య మల్లక్క
16. సిద్దెంకి మూడు గుడిసెల పల్లె
17. వేముల ఎల్లయ్య మారుతీ మర్డర్
18. గడ్డం మోహన్ రావు కులం తప్పు
19. డా॥ గంధం విజయలక్ష్మి కొక్కిడి మిడుసుల్లు
20. గుడిపల్లి నిరంజన్ జీలుబండ
2021 "చిందూ నేల" కథ వార్షికలో ప్రచురించిన కథల వివరాలు
‘దళిత కథలు’ పేరుతో కె. లక్ష్మీనర్సయ సంపాదకత్వంలో వచ్చిన ఎనిమిది సంపుటాలు;
‘ఉప్పు నీళ్ళు’, ‘హెచ్. సరస్వతి’, ‘నలుపు’; జూపాక సుభద్ర, గోగు శ్యామలల సంపాదకత్వంలో వెలువడిన ‘నల్ల రేగడిసాల్లు’ లాంటి కథానిక సంపుటాలు. దళిత కథను సుసంపన్నం చేశాయని తెలుగు దళిత కథా పరిణామంలో ఈ కథల ప్రాముఖ్యతను దార్ల వెంకటేశ్వర్ రావు పేర్కొంటాడు .
తెలంగాణ దళిత కథా సాహిత్యంలో బతుకు చిత్రణ వెట్టితో మొదలై రకరకాల దోపిడీలను కళ్లకు గట్టింది. కుట్రల్ని బట్ట బయలు జేసింది. ఉద్యమాలను పిడికిట్లో పట్టి నిద్రాణంగా ఉన్న తావున అక్షర కిరణాలైంది. సంఘ సంస్కరణకు నడుం కట్టింది. అగ్రవర్ణ భావజాలంతో కలెవడ్తుంది. ప్రస్తుతం నయా దళిత వాదంతో నలువైపులా ప్రసరిస్తుంది. అయినప్పటికీ దళిత బతుకు చిత్రణ ఇంకా మిగిలే ఉంది. దాన్ని పూరించాల్సిన అవసరం కథకులందరి మీద ఉంది.
తెలంగాణ దళిత సాహిత్యం, సంస్కృతి, కళారూపాలు, తెలంగాణ సారస్వత పరిషత్తు, మార్చి, 2020. హైద్రాబాద్ పుస్తకంలో ఈ వ్యాసం ప్రచురితం. (ఈ వ్యాసానికి చేర్పులు చేయనైనది)
1. సుజాతరెడ్డి, ముదిగంటి: 2009, తెలంగాణ నుంచే తొలి కథానిక, ఆంధ్ర జ్యోతి, తేది: 13.07.2009.