కాలంపై కలం మోగిస్తున్న నిప్పుల తప్పెట
‘‘ప్రత్యామ్నాయ మేథోమథనం మానవ అస్తిత్వాన్ని చాటే అంతిమ లక్ష్యమై ఉండాలి.’’ డా॥ బి. ఆర్. అంబేడ్కర్.
నిందల్ని ఎదుర్కొని నిచ్చెనమెట్ల వ్యవస్థలో జ్ఞానాన్ని సాయుధంగా మలుచుకున్న అంబేడ్కర్ తొవ్వ దూగుతున్న జ్ఞానం ఈ దేశానికి వెలుగుల్ని పంచింది. ఆజ్ఞానం ఇప్పుడు ఆకాశంలో వేలాడుతున్న పొద్దును మున్నూటరవై డిగ్రీల దప్పు కుదురును చేసి మోగిస్తుంది. కుతకుత ఉడుకుతున్న బతుకుల్ని కవిత్వంగా సమానత్వం కోసం మా‘నవ’ అస్తిత్వాన్ని చాటింపు చేస్తున్న నిప్పుల తప్పెట మోగిసుస్తున్న వెలివాడ లంద స్వప్నం దళిత కవిత్వం. దళిత కవిత్వం రాస్తున్న ప్రముఖ దళిత కవి సంపాదకులు తప్పట ఉదయ ఆవిష్కరిస్తున్న పుస్తకమే 'అలకల పోత'.
పేదరికం బహుమానంగా ఇచ్చిన అయ్యవ్వను ఈసిడించలేదు. కడుపుల ఆత్మతో కళ్లకు అద్దుకున్నడు. కన్నీళ్లకు కారణమైన సమస్యలపై జిద్దుకు నిలవడ్డడు. అవ్వ సేను సేనుకు చల్లిన సెమట జల్లుల్ని తూట్లుపడ్డ బస్సు టిక్కెట్లని బాగా గుర్తించుకున్నడు. పనిల దిట్ట, మాయితనంల మునిగి మంచికి మారు పేరు తెచ్చుకొని మధ్యలోనే ఆగం చేసి వెళ్ళిన అయ్యని తలుసుకుంటుండు. మూలాల్ని స్మరిస్తూ పిడికెడు కలలని దోసెడు కన్నీళ్లతో ఎండమావుల్లాంటి స్వప్నం వెంట పరుగెత్తుతున్న జీవితం తప్పెట ఓదన్నది.
ఉదరపోషణకు ఎన్నో ఉద్యోగాలున్నా బాధ్యతాయుత పౌరుల్ని తీర్చే బడిపంతులు అయిండు. ఇపుడు పాఠంతో పాటు బతుకుపాఠంను బోధిస్తున్న అక్షర ప్రేమికుడు.
పలుక బలుపం పట్టి బడికి పోతున్నపుడు కుల వివక్ష బూతమై తరిమిన కాలం కాల్చిన వాతలున్నాయి. ఆదరణ అందించిన ఉన్నత కులాల సాన్నిహిత్యమూ ఉంది. కంట్లె ఒత్తులు పెట్టుకొని గురి కోసం గిరిగీసుకొని రాత్రీపగలు రాజీలేని పోరుతో సదువుతున్నపుడు అడుగడుగున సమాజాన్ని అర్థం చేసుకున్నడు. అవమానాలు లేని సమాజాన్ని కలగన్నడు.
అంతరాలని అంతం చేయడానికి సమసమాజ నిర్మాణానికి అక్షరాలను ఆయుధంగా ఎంచుకున్నడు. అనుభవాలను, అనుభూతులను, కన్నీళ్ల కలల గెలలతో సాహిత్య వాకిట్లో అలుకుపోసి ముగ్గేసినట్లు అస్తిత్వ గుర్తులతో ‘మొగ్గ పూసలు’ మొదటి పుస్తకంతో ముందుకొచ్చిండు. ఆ పరంపరలో మళ్లీ ``అలకలపోత`` కవిత్వంతో ఓదన్న వస్తున్నాడు.
వస్తు నవ్యత, పదచిత్రాలు, భావ చిత్రాలు మొదలైన అన్నింటి మేళివించి ఎంచుకున్న కవితా వస్తువులో ప్రత్యేకతను చాటుకుంటున్న కవిగొంతుక ఓదన్నది. అన్ని వాదాలతోపాటు దళితవాదాన్ని తనదైన శైలిలో ప్రదర్శిస్తున్న తీరు పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. నిరసన నిప్కల్ని రగిలిస్తున్నాడు. నిరాధారమైన పనితట్టని అట్టహాసమైన ప్రగతిగా మార్చుకుంటున్నాడు.
‘గోళమే లందగోలెం’ కవితలో
‘‘తోలు పర్రనే కాన్వాస్‌గా
పని కత్తుల్ని కుంచెని చేసి బతుకు చిత్రం గీస్తున్న
నిత్యం వన్నెతగ్గని వర్తమాన పటమే నేను’’అని తన అస్తిత్వంతో సమాజానికి పరిచయమవుతున్నాడు. తన పరిశీలనను, విషయాలను, వినూతనంగా వివరిస్తాడు. ఎక్కడా దళితవాదాన్ని బయటపెట్టడు. స్థూలంగా ఆలోచిస్తే గాని దళితాయనం అర్థంగాదు. విశ్వనరుడనని గుర్రం జాషువా గారు నుడివినట్లు ఓదన్న స్వీయ వ్యక్తీకరణ ‘అన్వేషణ’లో చూడండి.
‘‘ఆలోచన సుడుల్లో జ్వలిస్తున్నా
నిత్యం రగులుతునే వున్నా
నిర్మలత్వం కోసం వెదుకుతూ
విశ్వమంతట విస్తరిస్తున్నా’’ అని చెబుతుంటాడు. అవసరాన్ని బట్టి బడబాగ్నిలా జ్వలిస్తుంటాడు. నిత్యం రగులుతూ నిర్మలత్వం కోసం విశ్వమంతా విస్తృతమవుతున్నానని స్వీయ కార్యదీక్షతను ప్రకటిస్తాడు.
దారి చూపిన వేగు చుక్కలకు ప్రణమిల్లుతూ ఈ దేశం సర్వం కర్మమయమనే దోపిడి మనువాదాన్ని ధిక్కరించి సమాజంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాల్ని ధారపోసిన మహాత్మ జ్యోతిరావు ఫూలేని స్మరిస్తూ..
‘‘అంతరాల దొంతరల కులగజ్జి
కుటిలత్వాన్ని చీల్చి మనువాదులు కుట్రలపై
ఫెడేల్మని చర్సిన చర్నా కోలతడు’’ అని కుట్ర పూరితంగా పుట్టింది మొదలు పుల్లలలో పడేవరకు శాసిస్తూనే వుంటారు. కాని ఫూలేని మొద్దు నిద్దురని మేల్కొల్పే చర్నా కోలతో పోల్చడం సబబుగా ఉన్నది.
దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి. దళితుల జీవితాలు దుర్భరమవుతున్నాయి. దళితుల్ని హీనంగా చూస్తున్న సంఘటనలు కవిని ఉక్కిరి బిక్కిరి చేసాయి. మంథనిలో మధుకర్, నిజామాబాద్‌లో ఇశ్రాయేలు లాంటి కులహత్యల్ని వాటి పర్యవసనాల్ని తలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో నిప్పుల కుంపటిలా రాజుకుంటాడు. పరువు హత్యల్ని చూసి చలించి కన్నీరైతాడు. తేరుకుంటాడు. రాలిన మోదుగుపూలను ఏరి ధైర్యాన్ని అద్ది మన భుజానికి తగిలిస్తాడు. ‘మీ సొగసు మాకెందుకు’ అను కవితలో..
‘‘శవాల మధ్య మృత విద్యను అభయమిస్తూ
తెగిపడిన శంబుక తలకు
మా శుక్రాచార్యుడు జీవి పోస్తండు
తరతరాల పీడన నిర్మూలన కోసం
కంచికచెర్ల కోటేశు కణకణ మండే నిప్పుల కాట్నంలోంచి
ఎగసిపడుతున్న నిప్పురవ్వలై సందేశమిస్తుండు ’’ అనే అభివ్యక్తి ద్వారా నిజాన్ని కళ్ల ముందుంచుతాడు.
‘‘మీకు చేతనైతే నా మృతదేహాన్ని నాలుగు రోడ్ల కూడలిలో ఖననం చేయండి / ధిక్కార పతాకాన్నవుతా’’ అని రాసిన కలేకూరి ప్రసాద్ వాక్యరవ్వలు గుర్తుకొస్తయి. దళిత సాహిత్యం ఉవ్వెత్తున ఎగసిన కంచికచెర్ల కోటేశుతో సహా పురాణ ప్రతీకలైన శుక్రాచార్యుని ఉపమానించడం వలన ప్రజాకవి శివసాగర్ చెప్పినట్లు ఇప్పుడు నడుస్తున్నది చండాల చరిత్ర స్ఫురించేలా దృశ్యీకరిస్తాడు.
కుల మత లింగ ప్రాంత వివక్షలేని అంతర్జాతీయంగా మహా ఘనత వహించిన రాజ్యాంగం మనది. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అబలల్ని వేశ్యలతో పోల్చుతూ దూషిస్తుంటే కవి బాధతో మదనపడుతుంటాడు. ‘నిజప్రతి’ కవితలో..
‘‘జీవులన్నీ విభిన్న సమూహాల సమాహారమే
ప్రకృతే ప్రథమ సోపాన పట్టిక
జంబు ద్వీపమెప్పుడు బహుళజాతుల నిలయమే’’ అని జాంబవంతుడు పాలించినప్పటి నుంచి ఇప్పటి ఎన్నో భిన్న మతాలకు పుట్టినిల్లు. బహుళ జాతుల నిలయమని నినదిస్తాడు. అవాకులు చవాకులు పేల్చడం సరికాదని ప్రబోధిస్తాడు.
Poetry is criticism of life -Matthew Arnold చెప్పినట్లు బతుకు మూలాన్ని విమర్శీకరించడమే కవిత్వం. తన జీవిత మూలాన్ని కట్టిన మూటని విప్పుతాడు.
కుల వృత్తులు సాతలుగా విభజించబడి ఉండేవి. మాదిగలు చేసే పనిని మాయితనం, మ్యాతనం మొదలైన పేర్లతో పిలుస్తుంటారు. నార చీరడం, చెప్పులు ముడవడం, బాయికాడ పనిచేయడం. సాతలవల్ల ఎట్టికి దగ్గరైన బతుకులు సదువుకు దూరమయ్యాయి. సాతలమీద స్పష్టమైన అవగాహన కవికి ఉన్నది. ‘సాత’ కవితలో
‘‘సాత మట్టిని ముద్దాడి
అక్షరాలను దిద్దుకొని
కర్మ సిద్ధాంతంను తిరగ రాస్తూ ఆకాశమే హద్దుగా గమ్యాన్ని నింగిని ముద్దాడుతుంది’’ అని కర్మ సిద్దాంతంతో కలెబడుతూ భవిష్యత్తు సారెపై లక్ష్యాన్ని ఆవిష్కరిస్తాడు.
దళిత వస్తువు వ్యక్తీకరణలో సౌందర్యాత్మకతను జొప్పిస్తాడు. దళిత ప్రతీకలైన నల్లని, చెమట సుక్కలు, దళిత ప్రేమాయణం, మొదలైన మాదిగ వాసనలు పచ్చి పచ్చిగా వీస్తుంటాయి. ‘నీలిమ’ కవిత లో...
‘‘ఓ... నా... నల్లని కలువపువ్వా
మట్టిలో పుట్టి ఉప్పునీటిలో పెరిగిన
చెమటచుక్కల గంధమా
నీ ముందు కస్తూరి జిలుగులన్నీ దిగదుడుపే’’ అని చెప్పడంతో కళాత్మకతను ఆపాదించాడు. ఈ కవిత చదువుతుంటే ఎండ్లూరి సుధాకర్ గారి ‘చండాలిక’ కవితలోని ‘‘ఓ... నా చండాలిక నీ వెండి కడియాల కాళ్ల ముందు వేలయేల్ల ప్రబంధ కన్యలు వెలవెల బోయారు’’ అన్న పంక్తులు గుర్తుకు రాకమానవు.
అలమటించే ఆకలి పిడికెడు మెతుకుల్ని వెతుకుతుంటే ఉన్మాదం రాజకీయాన్ని తొవ్వుతుంది. సమానత్వం లేక సతమతమవుతున్న అలజడి జీవితాలు ఆధ్యాత్మిక జీవితం కోసం పరమతాల్ని ఆశ్రయిస్తాయి. ఎందెందు వెదకినా అందందు కులమే కలదన్నట్లు నిరూపణలు గావిస్తూ రాసిన కవిత ‘రాత’ వాస్తవానికి దర్పణంగా ఉన్నది. ‘‘కులం మారిన కరుణించదు ఈ గీత
మతం మారిన మారదు కులం వాత
కులం వాతకు లేదేం మార్గం?’’ అంటూ మతం మారిన కులఛాయాలు వెంటాడుతుంటాయి. ఇక్కడి తారతమ్య భేదాలు నీడలా తరుముతుంటాయని వాస్తవాల్ని చూపుతాడు.
సాధారాణ ఉపాధ్యాయులు బడికి తప్పరు. విద్యార్థికి అర్థం కాని కాకప్పు వారికనవసరం. పాఠం చెపుతూనే ఉంటరు. పిల్లలంటే కవిగారికి మహా ప్రీతి. పిల్లల నడుమ తాను, తన చుట్టూ పిల్లలు అన్నట్లుంటాడు. ఓదన్న సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయునిగా పాఠశాల బాధలే కాదు పిల్లల బాధల్ని చూసి చలించిపోతాడు. పాఠశాల కోవెలలో తండ్రిలేని విద్యాకుసుమం పాముకాటుతో నేలరాలింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక విలపిస్తాడు.
‘‘రూపమంతా సక్కదనం గాకున్నా
రూపు కట్టినట్టుగా... నా మదిలో వాడు
వాని జ్ఞాపకాల బతుకే ఒక పెద్ద ప్రశ్నగా...’’ (మదినిండా వాడే పుట.8) తన పాఠశాలను కమ్మిన విషాదాన్ని అక్షరీకరిస్తాడు.
ఓదన్నది తల్లిమనసు. కోడి తనపిల్లల్ని రెక్కల కింద పొదువుకున్నట్లు పిల్లలపై ఆశలు పెంచుకుంటాడు. ఆశయాల ను ఆవిష్కరిస్తుంటాడు. పట్టుకుచ్చుల పువ్వును తడిమినట్లు మృదువుగా దువ్వుతుంటాడు. నేటి బాలలు రేపటి పౌరులు అని ప్రపంచ భవిష్యత్తు వారిదేనని భరోసాగా చెప్పతాడు.
‘వారసులు’ కవితలో...
‘‘పిల్లలు సమసమాజ ప్రగతికి సోపానాలు
విశ్వానికి వారసులు
మన ఆశలకు ప్రతిరూపాలు’’ అని పిల్లలే ప్రగతికి సోపాలనాలని రేపటి ఆశల ప్రతిరూపాలుగా దర్శిస్తాడు.
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం తిరిగి రానిది. తరగని జ్ఞాపకాల గని. కానీ కొంత మందికి బాల్యంలేని జీవితాలను చూసి కరిగిపోతాడు. ‘‘నాకు బాల్యం లేదు’’ అన్న మ్యాక్జిమ్ గోర్కీ మాటలు స్ఫురిస్తాయి. ‘పగిలిన గాజు పెంకనే’ అనే కవితలో బాల్యం గురించి రాస్తూ...
‘‘బాల్యం చెరగిపోయిన తీయటి కళ
పట్టుజారి పలిగిపోయిన అద్దం
అతుకు పెట్టడానికి వీలులేని ముక్కల్ని ఏరినాకొద్దీ
నిలువుత కోస్తూనే ఉంటది.’’ అంతర్థానమైన బతుకులు పట్టుజారి పగిలిన అద్దం ముక్కలుగా పోల్చడం ఉన్నతమైన అభివ్చక్తిగా ఉంది.
‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. నీ అభిప్రాయం చెప్పడానికి నా ప్రాణాన్నైన అడ్డుపెడతా’’ అని ఫ్రెంచ్ రచయిత ఓల్టేర్ చెప్పినట్లు ప్రజల కోసం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెపుడు మాట్లాడుత’అని నిక్కచ్చితంగా ప్రవచిస్తాడు. అన్యాయం జరుగుతున్నంత సేపు ఉదాసీనంగా ఉండనంటూ ...
‘‘మనమంతా ఒకటనే తేనే పలుకులు
లోగుట్టు చెక్క భజనలు
లేళ్లను బుద్ధిజీవుల(లేల్ల)ను బలిచ్చే
పన్నాగాలైనపుడు?
నోరెత్తకుండ ఎలా ఉండగలను?’’
కవి ఒక కంట కన్నీళ్లనీ, మరో కంట అగ్నిని వెదజల్లగలడు. ఎతను పారించినట్లే పీడకుల్ని ఎదురించే పదునును పదాలకి తేజుతనాన్ని అద్దుతాడు. అన్యాయం జరుగుతున్నపుడు వైరాగ్యంతో వుండే వ్యక్తిత్వం ఓదన్నది కాదు. లోపల ఒకటి బయట మరొకటి వ్యక్తీకరిస్తే తప్పనిసరిగా ధిక్కరిస్తానంటాడు. మాటలకు అగ్ని స్నానం చేయించి పుటం వేసినట్లు పరిశుద్ధంగా మాట్లాడాలని తలుస్తాడు.
వాక్ శుద్ధి అంటే నమ్మకం.
అచంచలమైన విశ్వాసం. మాటల పరిణామ క్రమాన్ని వివరిస్తాడు. ‘వాక్ శుద్ధి’ కవితలో...
‘‘ఇపుడు మాటలు
నలుదిక్కులు ప్రాకే రవి కిరణాలౌతాయి
అంకురించే అస్తిత్వపు జాడలౌతాయి.’’ మాటల మహోన్నత తత్వం అక్షరాల ఎండుగ వోసి చెప్పుతడు.
కవి హృదయమంతా నిఖార్సయిన పల్లెతనమూ ఉంది. కవి పల్లె తనాన్ని మరువలేదు. పల్లెమీది మమకారాన్ని పల్లె అంత స్వచ్ఛంగా, సంస్కారయుక్తంగా విశదీకరిస్తాడు. పల్లె సుట్టూ ఉన్న జీవవైవిధ్యాన్ని నెమరేస్తాడు. మనల్ని బాల్యంలోకి తీసుకెళుతాడు. స్వభావోక్తంగా వివరిస్తాడు. ‘పల్లె దృశ్యం’ని ఆవిష్కరిస్తాడు.
‘‘గట్టు గట్టంతా పచ్చపచ్చని
పంట చేండ్ల నిగారింపు
తలెత్తుకొన్న మొక్కజొన్న తలసుంచులా
కొండలు నడుమ సూరీడు
పల్లె నుదుటి సింధూరం’’ అని పల్లెతనాన్ని వివరిస్తాడు.
కోల్పోతున్న పల్లెతనాన్ని కలవరిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మార్క్స్ మాటలతో ఉదహరిస్తాడు. మనసుల్ని చిత్రిస్తాడు. మనుషుల ప్రేమని వస్తువుల మీదికి మలుపుతున్న వ్యాపారంలో కొట్టుకపోతున్న మనిషితనాన్ని మానవత్వంతో వస్త్రగాలం పట్టి వడపోయాలని తలపోస్తాడు.
‘‘సరుకుల సంతలో
కరుగుతున్న మంచులా
మమతాను బంధాలు
తెలంగాణ పల్లె గుండెల్లో పొడుస్తున్న పొడుస్తున్న‘‘ (బంధము పుట 25) కన్నీళ్లతోనే కత్తులు నూరాలని బహుళజాతి మోసాల్ని నాటకీయంగా ప్రదర్శిస్తాడు. అక్షర సైరికుడు కాబట్టి అక్షరాలతోనే కవాత్ చేస్తాడు. పల్లెను మింగుతున్న నయా దళారులపై అక్షర తూటాలు ఎక్కుపెడుతాడు. గుట్టను ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ కవిత్వానికి పోరు మంత్రం వేస్తాడు. అదృశ్య విధ్వంసాన్ని తేటగా దృశ్యీకరిస్తాడు. ‘కాగుతున్న నిప్పుల కుండ’ కవితలో..
‘‘బహుళజాతి బద్ధ శత్రువు
జడలు విప్పి కారు మేఘంలో కమ్మేస్తూ
గీడనే పుట్టి పెరిగిన మల్లెమొగ్గలను
పల్లె సీమలను ముసి ముసి నవ్వులతో
కసి కసిగా కాటేస్తుంది’’ అని కుట్రల్ని బట్టబయలు చేస్తాడు. ఇవ్వాళ్ల పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా సామ్రాజ్యవాద బూతం కనపడకుండా వ్యాపిస్తున్న కైత్కాలను పసికట్టిండు. పల్లెల్ని నాశనము చేస్తున్న విధానాలను కాగుతున్న నిప్పుల కుండయి మసులుతుంటాడు.
పుట్టి పెరిగిన నేపథ్యాన్ని రాయని కవి వుండడు. తన ఊరిలోని బాధల్ని గాథలుగా మలుస్తాడు. ఊళ్లోని ప్రతిచోటకు పాఠకుల్ని తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కుటీలం లేదు. కలసిమెలసిన సహజీవనం. మమతల ఒడి మా ఊరు అని పరిచయం చేస్తూనే మారిన పరిస్థితుల్ని ఏకరువు పెడతాడు.
‘‘ఊరిప్పుడు
కాకులు గద్దలు తన్నుకుపోతున్న కోడిపిల్ల
దళారి చేతుల్లో మోసపడిన దిగులు
వచ్చలు వచ్చలుగా పెచ్చులూడుతున్న నొప్పుల పచ్చికుండ
మాడుతున్న రెక్కలమాటున రగులుతున్న నిప్పుల కుంపటి’’ అని ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాడు.
మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసాలు నింపి విభజిస్తున్న మత మారణహోమాన్ని, తత్ఫలితంగా జరుగుతున్న తీవ్ర పరిణామాల్ని వివరిస్తాడు. మనుషుల్లో ‘‘చైతన్యపు జ్వాల’’ రగిలిస్తాడు.
‘‘మనిషికి మనిషికి మధ్య కౌర్యం
ఉగ్గుపాల పోతగా
మతమౌఢ్యమేమో మానవతను బల్జేస్తుంది’’అని విశ్వవిద్యాలయాల్లో కుల మతాల కుళ్లుల్ని వెల్లడిస్తాడు. దళిత బహుజన విద్యార్థులు బాల్రాజ్, వేముల రోహితుల్ని రాలిన సంఘటల్ని గుంబనంగా స్పృశిస్తాడు.
తెలంగాణ పండుగలని ప్రచారం కల్పిస్తున్న ప్రభుత్వం కిందిస్థాయికి అందిందా లేదా అనేది పట్టించుకోదు. బతుకమ్మ పండుగకు ఎనలేని ప్రాముఖ్యతనిస్తూ ఉంటది. ఇప్పటికీ కొన్ని దళితవాడల్లో బతుకమ్మ ఆడిన దాఖలాలు లేవు. ఇంకా అంటరాని వారుగానే పరిగణించబడుతున్నారు. మాదిగలకు బతుకమ్మ పండుగ లేకుంట చేసిన వ్యవస్థమీద కవి తన నిరసన వెళ్లగక్కుతాడు. బతుకమ్మ మీద దాండియా దాడిని ఓదన్న నిరసిస్తాడు. తంగేడు వనంలో తండ్లాట కవితలో నవోదయాన్ని ఆహ్వానిస్తాడు. దూరమైన ‘బతుకమ్మ’ పండగలో ఎతల్ని పేర్చుతుంటాడు.
‘‘తంగేడు వనంలో
బతుకు తండ్లాట మొదలైంది
వెలివేయబడిన బతుకమ్మ
గంపెడాశతో తూర్పును తడుముతుంది
రేపటిని వెలుతురు కోసం’’ అని కొత్త దృక్కోణాన్ని కలగంటాడు. బతుకమ్మందరిదని చాటుతుంటాడు.
విలయానికి కారణమవుతున్న సామాజిక మాధ్యమాలు మోసుకొచ్చిన దుర్మార్గాన్ని అక్షరబద్ధం చేస్తాడు. ఒక అబలను మూకుమ్మడిగా తగలబెడుతున్న దుస్సంఘటనను చిత్రిస్తూ..
‘‘సదాచార సంస్కృతిలోని అరాచకమా
అతివల్ని ఆహుతి చేస్తున్న వాచాలత్వమా
నీ రెండు నాల్కల ధోరణి శ్రీఘ్రముగా నాశనమగు గాక’’ అని విపరీతాన్ని కవి శపిస్తాడు.
తెలంగాణ ఔన్నత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇక్కడి నేలలోని జిద్దును గానం చేస్తాడు. గాయాలను స్మరిస్తాడు. పోరాటపంథాను యుద్ధగీతికగా మలుచుకున్న విధానాన్ని వివరిస్తాడు. ‘బృందగానం’ కవిత ద్వారా
‘‘అస్తిత్వమే ఊపిరిగా
పోరాటమే ఆరాధనగా ఓ యుద్ధగీతికైంది’’ అని ప్రతిబింబిస్తాడు.
మూలాన్ని మరువకూడదని మట్టి సంబంధాన్ని మన్నికగా రాస్తాడు. నిరాకారంగా కనిపించే మట్టిలో జనావళిని పోషిస్తున్న వాస్తవాన్ని కళ్లకు కడుతాడు. మట్టిలోని మమకారాన్ని తట్టి లేపుతాడు. ‘మట్టి సంబంధం’ అనే కవితలో మట్టి తత్వాన్ని వివరిస్తాడు.
‘‘మట్టిలో ఒడువని ముచ్చటుంది
మట్టికి మనిషికి విడదాయరాని బంధం ఉంది
నెనురుండాలె గని ఎప్పటికీ తెగని సంబంధముంది’’
పుల్వామా దాడి అనంతరం సర్జికల్ జరిపిన దాడుల్లో అభినందన్ వర్తమాన్ ధైర్య సాహసాలకు ఎంత హింసిస్తున్నా తొణకని ఆత్మస్థైర్యానికి దేశం యావత్తు శిరసొంచి నమస్కరించింది. ఓదన్న మాటల్లో ఒక ప్రత్యేకత చూడండి.
‘‘దేశానికి పెట్టని కోటగ నిల్సినోడ
నిస్వార్థ త్యాగానికి పట్టం గట్టిన వీరుడా...
అజేయుడా నీకు సలాం’’ అని దేశభక్తిని కీర్తిస్తాడు.
ఈ పుస్తకంలో తెలంగాణ దళిత, మాదిగ వృత్తి పదాలు అద్భుతంగా ప్రయోగించాడు. అత్తర గాలం, అద్దె పొందికలు, రికాం, వనెం, ఎల్లెలుకల, గంపెడాశ, అందు బొందుగుల, గొండిగ, పుటుక్కున, గల్మ, ఇద్దెకాడ్వి, ఉర్మిర్మి, నిగురాన్ మొదలైన ఎన్నో పదాలను సాహిత్యంలో ప్రయోగించాడు.
ఇది రెండవ పుస్తకం గనుక కవిత్వం ఎలా ఉండాలో ఉండకూడదో ఓదన్నకు తెలుసు. చిక్కదనం చక్కదనం మేళవించిన కవిత్వం వస్త్రగాలం పట్టే వడపోతలో కాలంతో కలెవడి నిలుస్తది. జన జీవన నాలుకలపై నడయాడుతది. అధ్యయనంతో విశ్వమంతా విస్తృతమయ్యేంత కృషి చేస్తాడని నమ్మకం కల్గిస్తున్నాడు. దాదాపు అన్ని చలనాలు ఆకళింపు చేసుకున్న కవి తప్పెట ఓదన్న. ఏది రాసినా దానిలో లీనమవుతాడు. అనుభూతితో రాస్తాడు. మనసుతో దేవుతూ హత్తుకునేటట్లు వ్యక్తీకరిస్తాడు.
-డా॥ సిద్దెంకి యాదగిరి
9441244773.
అలకల పోత పుస్తకావిష్కరణ
తేది :27-10-24
స్థలం ఫిలిం భవన్ కరీంనగర్
సమయం: ఉదయం 10 గంటల నుంచి.
అందరూ హాజరై సభను విజయవంతం చేయగలరు.