సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

25, జనవరి 2025, శనివారం

మాదిగ కళాతత్వం - ‘జాంబవ పురాణం’


మాదిగ కళాతత్వం  - ‘జాంబవ పురాణం’

                             -డా॥ సిద్దెంకి యాదగిరి 
ఈ దేశ సంస్కృతి, నాగరికత మూలవాసుల జీవన విధానంతో మొదలయ్యాయి. ఈ దేశానికి మొదటి మూలవాసి జాతి మాదిగజాతి. మాదిగజాతి మూలపురుషుడు ఆదిజాంబవంతుడు. జాంబవంతుడు ఏలిన జంబూద్వీప సంస్కృతే ఈ దేశ సంస్కృతి. జాంబవంతుడు లేని భారతదేశాన్ని ఊహించలేం కూడా. వారిద్వార సృష్టించబడిన సంస్కృతిని నాగరికతను మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణ ఇతిహాసాలు ఇవ్వవలసినంత ప్రాధాన్యత యివ్వలేకపోయాయి.

ఎడ్వర్డ్‌ బర్నైట్‌ టైలర్‌ అన్న మానవశాస్త్రవేత్తPrime Culture 1871 (ఆదిమ సంస్కృతి) అన్న గ్రంథంలో సంస్కృతి నాగరికత గురించి ఈ విధంగా వివరించాడు. ((Culture or civilisation, taken in its widest ethrographic sense, is that complex whole wich includes knowledge, bellief, art, morals, law, custom, and any other capabilities and habits aequired by man as a member of society (p71:1)) సంస్కృతీ లేదా నాగరికతను విస్తృతమైన జాత్యుపజాతుల మానవశాస్త్రం అర్థంలో తీసుకుంటే ఒక సంక్లిష్ట సమాహారం అని చెప్పవచ్చు. దానిలో విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతిసూత్రాలు, చట్టం. ఆచారాలే కాకుండా మానవుడు సమాజ సభ్యుడైనందువల్ల అతడు ఆర్జించిన ఇతర సమర్థతలూ కలసి అలవాట్లూ కూడా కలసి ఉంటాయి) 

మాదిగ జాతి భారతదేశంలో కడగొట్టు జాతిగ వెలివేయబడిరది. అనేకమైన కట్టు భానిస బతుకు వెల్లదీసింది. ఏర్పడని వివక్షల కక్షల్ని మోస్తూ కాలం ఎళ్ళదీస్తుంది. సమసమాజ నిర్మాణానికి తనవంతు కృషిగా సాంస్కృతిక విప్లవానికి ఊపిరిలూదింది. బతుకు ఎట్టిలో తాకట్టు పడ్డప్పట్టికీ ఉపకులాలను పోషిస్తూనే తన జాతి గౌరవాన్ని, ఉదారతను నిలుపుకుంటూ వుంది. సాంస్కృతిక విప్లవం రానిదే రాజకీయ విప్లవం రాదని బలంగా నమ్ముతూ బ్రహ్మాణీయ భావజాలానికి సమాంతర వ్యవస్థను కాపాడుతూనే ఉంది.

మాదిగల మూలపురుషుడు జాంబవంతుడు. జాంబవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ చారిత్రక నేపథ్యాన్ని ప్రదర్శిస్తూ వివరించే వాళ్లు సింధోల్లు, డక్కలివారు, నులక చందయ్యలు, మాదిగ మాష్టీలు, మాదిగ బైండ్లవారు. జాంబవపురాణం యక్షగానం (వీధి నాటకం) ద్వారా  సిందోళ్లు, పటం ద్వారా డక్కలి వారు, ప్రవచనం ద్వారా నులక చందయ్యలు, కథాగానం ద్వారా మాష్టీలు, (బైండ్లలు ఎల్లమ్మ చరిత్ర కథాగానం పట్నాలద్వారా) వివరిస్తున్నారు. వీరితో పాటు తమ జాతి ఔన్నత్యాన్ని కీర్తించటానికి, వంశ చరిత్ర పరిణామ క్రమాన్ని తరం నుంచి మరో తరానికి మరిచిపోకుండా ఉండడం కోసం ఉపకులాలను పోషిస్తుంది మాదిగజాతి. 

మాదిగలు జాంబవపురాణం వినడం, చెప్పించుకోవడం అతినిష్టగా వేడుకలు నిర్వహించుకుంటారు. పై ఉపకులాల వారు ఒక్కో ప్రదర్శన ఒక్కో విధంగా ఉన్నప్పటికీ అదంతా జాంబవంతుని చరిత్రనే. ఎవరు ప్రదర్శించినా ఆదిపురుషుడు, అందరికీ తాత. ఆది జాంబవుడి వృత్తాంతాన్ని వివరించేవే.

జాంబవపురాణం ద్వారా చెప్పే కథలో సంఘ సంస్కరణవాద దృక్పథం కలదు. ఈ దేశ సమసమాజానికి తన జీవితాన్ని ధారవోసిన డా॥ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ కంటే ముందుగా, సమానత్వాన్ని కాంక్షించిన మహాత్మ జ్యోతిరావు పూలేచే రచింపబడిన గులాంగిరి గ్రంథంలో బ్రాహ్మణీయ భావజాలాన్ని థొండిబా ఈ ప్రపంచానికి లిఖితపూర్వకంగా పరిచయం చేసాడు.
 అంతకు ముందు పురాతన కాలంనుంచే మాదిగలు సాంస్కృతిక సంస్కరణ వాదానికి ఆద్యులు.

భారతదేశ సంఘ సంస్కరణవాద మూలపురుషుడుగా రాజరామ్మోన్‌రాయ్‌ని పేర్కొంటారు. తెలుగు సమాజంలో వేగుచుక్కగా వెలుగొందుతున్న గురజాడ అప్పరావు, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగువారు చేసిన సంస్కరణలు ఆయా అగ్రవర్ణాలకే చెందింది. కానీ మాదిగల కళాపోషణ ద్వారా సాంస్కృతిక పరిణామము చెంది సంస్కరణ సమాజంలోని అన్ని కులాలను కలుపుక పోయే విధంగా ఉంది. మాదిగలు కళా పోషకులు. దయార్థ హృదయులు. తమ సాంస్కృతిక విప్లవం ద్వారా సమసమాజాన్ని నిర్మించుటకు తమవంతు కృషి చేసారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రత్యామ్నాయ సంస్కృతి.

చిందు జాంబవ పురాణం:

చిందువారు, చిందువాళ్ళు, చిందోళ్ళు, సిందోళ్ళు, అనేవి ఈ కులానికి ఉన్న ఇతర పేర్లు. వీరిని చిందు మాదిగలు అని కూడా పిలుస్తారు. చిందులు తొక్కడం అనేది జాంబవంతుని వేషం కట్టి కోపంతో ఎగురుతున్నపుడు చిందులు తొక్కుతున్నాడనే అర్థంలో ఉపయోగిస్తారు. నర్థించడం. గంతులు వేయడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. మాదిగలకు కళాసేవ అందించడం వీరి కులవృత్తి. చిందు అను పదానికి సూర్యారాయాంధ్ర నిఘంటవు ప్రకారం నాట్యము, నాటకము, నృత్తము సంస్కృత పదాలకు పర్యాయ పదంగా ఉంది. తెలుగు సాహిత్యంలో పాల్కుర్కి సోమనాథుని పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో ఉపయోగించబడిరది. కాబట్టి చిందు కులం పదకొండవ, పన్నెండవ శతాబ్ధివరకే ఉన్నట్లు మనకు తెలియుచున్నది. అందువల్ల వెయ్యి సంవత్సరాల చరిత్ర చిందు కళకు ఉన్నదని రూఢ అవుతుంది. ‘కూచిమంచి తిమ్మకవి నీలాసుందరీ పరిణయం’లో సీ. వీడెపో నందుని విరిబోడి ముందఱ మొనసి చిందులు దొక్కు ముద్దులాడు (3.ఆ. 52ప పద్యము) అను నాట్యము చేయు ప్రయోగంలో ఉపయోగించారు. జక్కిణి, చిందు కులవాచకంగా వినియోగించడం వెన్నెలకంటి సూరన విష్ణుపురాణం(7ఆ. 277ప.)లో ఉంది. ‘క్రీడాభిరామం’, ‘భీమ ఖండం’, ‘కాశీ ఖండం’, ‘దశకుమార చరిత్ర’, ‘ఆముక్త మాల్యద’, మొ॥గు సాహిత్య గ్రంథాలలో, ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, ‘రెడ్డి రాజుల చరిత్ర’ వంటి చారిత్రక గ్రంథాలలో చిందుల ప్రస్తావన ఉంది. చిందాడు, చిందిలిపడి, చిందిలిపాటు, చిందిలిమందిలి, చిందిలు చిందుగొను, చిందుద్రొక్కు, చిందుపరుపు, చిందులువాణు, వంటి పదప్రయోగాలు ప్రాచీన కావ్యాలలో ఉన్నాయి. 

చిందువారు ప్రదర్శించే కళారూపాన్ని చిందు యక్షగానం, చిందుభాగోతం, బాగోతం అని పేర్లతో జనవ్యవహారం కలదు. ఏ పేరుతో పిలిచినప్పటికీ ఇది యక్షగాన ప్రక్రియ. ఇది సమాహార కళ. తెలంగాణలో సిందోల్లు దసర పండుగ ముందు కానీ దసర పండుగ అనంతరం వారు సకుటుంబం సమేతంగా ప్రదర్శనలు ఇవ్వటానికి ఊరూరు సంచారం జేస్తారు. చిందు కుటుంబాలకి కొన్ని ఊళ్లు వతను(హక్కు)గా ఉంటాయి. వతను ఉన్న ఊరు మీదికి మరొక చిందు కుటుంబంవారు రారు. ఆశ్రయించరు. భాగోతం ప్రదర్శన కోసం పరస్పర సహాయం కోసం వేరే కుటుంబాల వారు కూడా వెళుతారు. ఏ ఊరికి వెళ్లినా మొదట వీరు పెద్ద మాదిగను కలిసి, మేం త్యాగం / తాగం అడుక్కోవటానికి వచ్చినం అని చెప్పుతారు. వీరు అన్నపానాదుల కోసం మాదిగల్నే ఆశ్రియిస్తారు. మాదిగలందరు కలసి ఒక నిర్ణయం తీసుకొని తాగం చెప్పితే ఆట సురువు చేస్తరు. 
చిందువారు వారి ప్రదర్శనకు ఉపయోగపడే అలంకరణ సామాగ్రిని వారే తయారు చేసుకుంటారు. వేషాలమీదికి కావల్సిన వస్త్రాలు, గదలు, భూషాణాలు, రంగులు, తెరలు, గవ్వల దండలు మొదలైనవి తయారు చేసుకుంటారు1. 

చిందు జాంబవ పురాణం యక్షగానం అని చెప్పటానికి వీలుకాదు2. వీరి ప్రదర్శన మూడు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. రాత్రి పూటనే ప్రదర్శిస్తారు. ఆ తర్వాత రోజున జాంబపురాణ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన పట్టపగలు జరుగుతుంది. ఊరేగింపు కూడా వుంటుంది. ఎల్లమ్మ వేషం ఇంటింటికి తిరుగుతుంది.

ఆ గ్రామంలోని పెదమాతరి ఇంట్ల జాంబవుడు, బ్రాహ్మణ వేషం వేసి తయారవుతారు. జాంబవంతుడు తయారవడానికి చిన్న పూజ చేస్తారు. డప్పులు కొడుతారు. వేషం వేసే విధం అన్ని వేషాలకంటే భిన్నంగా వుంటుంది. నుదుటికి ఓంకార శబ్ధం. నొసటి కుడిభాగమున సూర్యుడు. ఎడమ భాగమున చంద్రుడు. ముక్కు నుంచి నొసటి చివరి వరకు నామం పెడ్తరు. కంఠం నందు గవ్వలు. ఛాతి దర్శనం. ఎన్క దర్శనము. పులితోలు అంగి తొడుగుతారు. కాశ మీద ఏడు కాశలు కడ్తరు. దండలు, దస్తర్లు ఎల్లమ్మ వేషమ్మీదివి. వోర కొప్పు. హంస కలువ ఒక్కటి. బొట్టు శేరు. ఎడమ చెయ్యిల పువ్వు. కుడి చేత చిరుత కొంగవాలు కత్తి. బొడ్డుగంట. కాళ్లకు గజ్జెలు కట్టి, ఇంకొంత మంది గజ్జెల్లాగు తొడుగుతరు3. 

వేషం తయారైన తర్వాత సాంబ్రాణి(గుగ్గిలం) వేస్తారు. అప్పుడు పాత్రధారి పూర్తిగా మారి జాంబవంతుని రూపంలో దేవుని ఆకారంలో వస్తాడని విశ్వాసం.  ప్రదర్శనలో వాయించే మద్దెల, హార్మోనియం, తాళాలు, మోగిస్తారు. ఉల్లెడ (చెద్దరి గొడుగులాగా) పట్టి గౌరవ ప్రతిపత్తులతో ఊరేగిస్తుంటారు. జాంబవంతుని వేషాన్ని గోసంగి వేషం అంటారు. గోసంగి వేషం వేసినవారు వేరే వేషం వేయకపోవటం మూలంగా గోసంగి వేషంకు ప్రాధాన్యత ఎక్కువ అని తెలుస్తుంది.

శ్లో॥ ‘న భూమి నజలంచైవ నతేజో నచవాయు
    నచంబ్రహ్మ నచం విష్ణు నచం రుద్రశ్చ తారక:
సర్వశూన్యం నిరాలంబో స్వమంభు ఆదిజాంబవ:’ అని4
శంఖు మా తలిదండ్రి జనులారా వినుడీ 
ఆదిలోనే పుట్టి ఆదిలోనే పెరిగి 
వేదా వేదా బ్రాహ్మణులకు వేదంబు చెప్పితి 
మూలంబు చెప్పితి మునులకపుడు 
చేత చిరుత కొంగవాలు కత్తి
మరి కోరమీసంబు కాశ మీద కాశగట్టి 
కాళ్ళకు గజ్జెలు గట్టి వస్తినయ్యా
కదిలె గోసంగి... అని గోసంగి వేషంలో పరిచయం చేసుకుంటాడు. వస్తూ వస్తూ జనం మధ్యన జాంబవుడికి, బ్రాహ్మణుడికి మధ్య వాదాలు జరుగుతుంటాయి. దేవతలది రాతిలింగమని విర్రవీగే బ్రహ్మకు మాది ప్రాణలింగమని నిరూపిస్తాడు. విశ్వకర్మ జననం. ఆదిశక్తి పురాణం. పశుపతి, శంబరుడు, యుగమునుల జననం. కామధేనువు, కల్ప వృక్షముల జననం. పంచదాయిల జననం. ఇతర కులాలకు పనిముట్లు పుట్టిన విధం. ఇతర కులాల వారిని ఏల్యం (హేళన) చేసినా పట్టించుకోరు. వాగ్వాదంలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతుంటాయి. హాస్యం పండుతుంది. బ్రాహ్మణున్ని అపహాస్యం చేయడం జరుగుతుంది. మధ్య మధ్యలో దరువులు, పాటలు పాడుతుంటారు. ప్రతి వాదులాటలో జాంబరుషి బ్రహ్మను ఓడిస్తాడు. సృష్టి ఆవిర్భవించిన విధానాన్ని వివరిస్తాడు. త్రిమూర్తుల జననం. సప్తసముద్రాల ఉద్భవం. అన్నీ క్రమానుగుణంగా వివరిస్తుంటాడు. ఈ దేశానికి నేనే మొదటి రాజును తను మోసపోయింది వివరిస్తాడు. 

రాజుగా బతికిన నన్ను, తదనంతరం నా వంశం బానిసత్వంలోకి కూరుకపోయిన విషయాలు. జరిగిన మోసాల్ని పేర్కొంటాడు. మాదిగ అను పేరు ఎట్లా వచ్చిందో వివరిస్తాడు. అంటే మానసిక పరివర్తన తేవడానికి సాంస్కృతిక విధాన్ని ఉపయోగించుకొని సంస్కరణ వాదాన్ని విత్తుతాడు. 
మాదిగ అను పేరు రావడానికి తర్కం కూడా చిందు జాంబవ పురాణంలో వివరించివుంది. ఆది జాంబవ మహాముని సూదిమాన్‌ పర్వతము పైన తపము జేయుచుండగ యిట్లని పిలిచెను. ఓయీ! తాతా! హిమచైలము కొండపై కామధేనువు మరణించినది. ఆర్య బ్రాహ్మణులు నిన్ను రమ్మనిరి. తాతా! మహా దిగిరా!5 (తాతా! మాదిగిరా!) అని పిలుస్తాడు.  జాంబవముని తపము చాలించి వస్తూ తనమీద ఉన్న లింగములు తెగిపడ్డయి. తెగిపడ్డ లింగములు కోమట్లకు, జంగాలకు చెందినయి. ప్రాణ లింగమొకటే ఉన్నది6. అట్లా ప్రాణ లింగము మాదేనని వివరిస్తాడు.

ఈ వాదం చూస్తుంటే మహాత్మ ఫూలే గారి గులాంగిరి థోండిబా వివరించినట్లుగా వుంటుంది.
జాంబవంతుడు ఆర్యులను, త్రిమూర్తులను దునుమాడి శక్తిని శాంతి పరుచుటకు గోసంగి వేషము కట్టుటకు జంబూద్వీప మహా చక్రవర్తులు, రాణులు ముప్పది రెందు బిరుదానములు ఇచ్చిరి. చపలకమహాముని ` డప్పు, విశ్వకర్మ` చిర్ర, చిరుత కొంగవాలు కత్తి, రౌంద్రముని ` పులిచర్మం, ఆదిశక్తి బొడ్డుగంట,..అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఇస్తారు. మహా యుద్ధం చేసేను. ఇంద్రాదులను తరిమివేసెను. జాంబవంతుని గొప్ప బలాన్ని స్మరించుటకు గోసంగి వేషము కడుతారు.
‘‘తకతాలెల్లె లెల్లెలో...
హరితాలెల్లె లెల్లెలో
శివ తాలెల్లె లెల్లెలో’’ అని పాడుతాడు.  జాంబవంతుని వేషం వేసిన చిందు కళాకారుడు మాదిగలతో పాటు ఊరివారి గౌరవ మర్యాదలు పొందుతాడు. 

ఎల్లలకు అమ్మ ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ. చిందు జాంబవ పురాణమున ఎల్లమ్మ ఏషానికి ఎనలేని కీర్తి కలదు. ఎల్లమ్మ ఇల్లిల్లు తిరుగుతుంది. దేవత నడిచి వచ్చినట్లు భావించి ప్రసన్నం చేసుకుంటారు. ఆది జాంబవుడి వంశంన జనించిన చ్యవన శేఖర మహారాజు జనరంజక పాలన చేస్తూ చంద్రగిరిని ఏలుతున్నాడు. ఆ మహారాజు కుమార్తె మావురాల ఎల్లమ్మ. ఎల్లమ్మ  యుక్త వయసుకు రాగానే ఆమె మేనబావయగు మహీష్మతి కృతవీర్యుని కుమారుడు కార్త వీర్యార్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. 

ఆ సమయమున వండుటకు కుండలేదు. పులుసన్నం పెట్టుటకు శక్తిలేదు. చినిగిన ధోవతితో మాషిన నెత్తితోటి జమదగ్ని , చ్యవన శేఖర మహారాజు దగ్గరకేగి భిక్షాందేహి అంటాడు. రాజు అభయమొసంగిన పిమ్మట ఎల్లమ్మను కోరుతాడు. ఆడితప్పని రాజు కన్యాదానంబుగ ఎల్లమ్మను ఇస్తాడు.

బ్రాహ్మణుల నీచకార్యముల వల్ల అందరు కార్త వీర్యార్జునికి మొర పెట్టుకోగ జమదగ్నిని ఓడిరచెను. జమదగ్నినిని చంపవలదని కార్తవీర్యార్జుని(కార్తీక రాజును) వేడినందున చంపక వదిలివేసెను. జమదగ్ని బ్రహ్మకు మొరపెట్టిన బ్రహ్మ, ఇంద్రుడు, పరుశురాముని సేనలు కుతంత్రము చేసి కార్తీకరాజును చంపివేసిరి. జమదగ్ని ఎల్లమ్మను చంపుమని పరుశురామున్ని ఉసిగొలిపితే ప్రాణాలు దక్కించుకొనుటకు జాంబలగిరి పట్నంబుకేగి జాంబవుని ప్రార్థించి నీ చర్మపు లందలో మునిగియుండెదనిన అందుకు అభయమిచ్చెను7. ఎల్లమ్మను కాపాడెను. 

గోసంగి వేషం ముగిసిన తర్వాత చిందోల్ల కుటుంబం నుంచి ఒకరు ఎల్లమ్మ ఏషము కడుతరు.
 లందకాడ పొద్దున్నేకొత్త సాపయోసి, గొంగడి పరిశి పసుపుతో స్నానం చేయిస్తరు. అల్పె శీరె. అల్పె(పలుచని) రవికె. కొత్తచీర, కొత్త రవికె. తవ్వెడు, గిద్దెడు బియ్యం, కుడక, ఖజ్జెరపండ్లు, పోకలు, రథం పోకలు, అయిదు సారెల బియ్యం పోస్తరు. కుంకుమ  బొట్లు మొకమంత పెడ్తరు. గవ్వల హారాలు ధరిస్తుంది. డప్పులతోటి, జమిడికలతోటి, ఆడుకుంట, పాడుకుంట నడివూల్ల (శాందిరి)పందిరి ఏసిన కాడికి వోతది. సేతుల కొంగవాలు కత్తి. ఈరగోల సేతులుంటది8. పచ్చని పందిట్ల కేలి మాదిగిండ్లకు జోగుకువోయి, ఊల్లె తిరుగుతది. ఊరంత తిరిగినంక ఊరి దగ్గరలోని చెరువులో మొకం కడుగుతది. ఏ లంద కాడయితే ఏషం కట్టిందో ఆ లందకాడ పట్టురాసుడు, ఊదుపొగ, నిమ్మకాయలు, అమ్మవారి దండకం సదువుతరు.
అమ్మా! జగదాంబ! హా మాతా!
జగన్మాత! లోకాలనేలు మాత!
తల్లీ ఎల్లమ్మా! చల్లగవుంచు!
పాడి యందు, పంటయందు9. అని స్తోత్రం చదువుతరు. అమ్మవారు ఉగ్రరూపం దాల్చుతది. గావు పడితే సల్లవడుతది. అప్పుడు శాంతి రూపము దాల్చుతది. ఎల్లమ్మ దేవత ఏషం కట్టి ఖండాంతర ఖ్యాతి తెచ్చిన చిందు ఎల్లమ్మ గొప్ప చిందు కళాకారిణి. సమసమాజ నిర్మాణంలో చిందుల జాంబవ పురాణ ప్రదర్శన సంస్కరణ వాదానికి మూలభూమిక అని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు.

1. డక్కలి జాంబ పురాణం: మాదిగల మూల పురుషుడు ఆది జాంబవంతుని చరిత్రను చెప్పే వారిలో డక్కలివారు ఒకరు. వీరు పటం సహాయంతో జాంబవ చరిత్రను వివరిస్తారు. జాంబ పురాణం మాదిగలదే అయినా సకల చరాచర జీవరాశి ఉత్పన్నం గూర్చి వివిధ కులాల ఉపకులాల ఉత్పత్తి ` అస్తిత్వాల గురించి విపులంగా తెలియజేస్తుంది. డక్కలి పురాణంలో ప్రధాన కథలు ఐదు. 1. ఆది పురాణం(సృష్టి పురాణం), 2. పార్వతీ కళ్యాణం, 3. మాల చెన్నయ్య పురాణం, 4. ఆరంజ్యోతి కళ్యాణం, 5. బలభద్ర విజయం. 

1. ఆది పురాణం(సృష్టి పురాణం): ఇందులో సృష్టి (సౌర మండలం) ఉద్భవించక ముందు ఏకో నారాయణుడు ఆది జాంబవుని, ఆదిశక్తిని సృష్టిస్తాడు. 


శ్లో॥ నభూమి నజలం చైవ నతేజో నచవాయు: 
                ననభో, నచంబ్రహ్మ....10  అని చిందు జాంబవ పురాణంలో చెప్పిన శ్లోకమే వీళ్ళు పాడుతారు. ఆది శక్తి ఆది జాంబవుడి శాపం వల్ల నెమలిగా మారి మూడు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లలోంచి అండ, పిండ, బ్రహ్మాండాలుగా త్రిమూర్తులు జన్మిస్తారు. మానవ సృష్టి జరుగాలని కొడుకులను పొందు కోరుతది. బ్రహ్మ, విష్ణువు తిరస్కరిస్తే వారిద్దరిని చంపేస్తుంది. తన మేనమామ జాంబవంతుని సలహా మేరకు శంకరుడు ఆదిశక్తిని పెళ్ళాడుతానని చెప్పి ఆదిశక్తి సమస్త శక్తి యుక్తుల్ని వరముల ద్వారా స్వీకరించిన పిమ్మట ఆదిశక్తిని భస్మం బూడిద జేస్తాడు. తన అన్నలను బతికించుకుంటాడు. ఆది శక్తి భస్మాన్ని మూడు కుప్పలుగా చేసి సరస్వతి, లక్ష్మీ, పార్వతిలుగా మార్చి పెళ్లాడుతారు. మొదటి భాగంలో త్రిమూర్తుల జననం `  ఆది శక్తి మరణం ఈ భాగంలో ప్రధానం.

2. పార్వతీ కళ్యాణం:  ఆది శక్తి భస్మాన్ని మూడు కుప్పలుగా చేసి సరస్వతి, లక్ష్మీ, పార్వతులను త్రిమూర్తులు స్వీకరిస్తారు. ఆ కళ్యాణానికి మహా బలవంతుడైన అగస్త్యమునిని రాకుండా నిలువరించడానికి శివుడు విశ్వకర్మని ఉపయోగిస్తాడు. విశ్వకర్మ అగస్త్యున్ని పెళ్ళికి వెళ్లకుండా ఆపుతాడు. అలా ఆపుతున్న క్రమంలో శక్తి హీనుడవుతాడు. శక్తివంతునిగా తీర్చిదిద్దడానికి జాంబవంతుడు తన ఇద్దరు కుమారుల్లో ఒక్కన్ని చంపి వాడి శరీర అవయవాలతో కావల్సిన పరికరాల్ని అందిస్తాడు. ఆ పరికరాలతో తాళిబొట్టు తయారు చేసి ఇస్తే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. జాంబవుడి ఏ కుమారుడు చనిపోయాడో వాడి డొక్కలోంచి డక్కలిని ఉత్పత్తి చేస్తారు. విశ్వకర్మ వాన్ని పెంచి పెద్ద జేస్తాడు. 


3. మాల చెన్నయ్య పురాణం: దీనికి సముద్ర మథనం ` కామధేనువు కథ అని మరో పేరు. దేవ దానవులు కలసి చేసిన క్షీర సాగర మథనంలో విషం, అమృతం, కామధేనువు పుడ్తాయి. వాటికి త్రిమూర్తులు కావలి కాస్తుంటారు. శివపార్వతుల గంగాస్నాన ప్రయాణంలో పార్వతి ఋతు చక్రం అవుతుంది. ఆమె రోతతో తడిసిన చీరను చెన్నంగి తొర్రలో దాస్తుంది. దానిమీద శివుడి ‘నీడ’ పడి కుమారుడు పుడుతారు. చెన్నంగి తొర్రలో పుట్టినవాడే చెన్నయ్య. కామధేనువుకు చెన్నయ్య కాపుకాసినప్పటికీ పాలు నిషిద్ధం. అందుకు ఆశపడ్డపుడు కామధేనువు చావుకు కారణమవుతాడు. చనిపోయిన కామధేనువు మాంసాన్ని చెన్నయ్య, తన తాత జాంబవుడితో కలసి భుజిస్తాడు.  మాంసం తిన్న మాల చెన్నయ్య, మాదిగ జాంబవులు శివుడి శాపానికి గురవుతారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యితో కామధేనువు మాంసం ఐదో వంట అవుతుంది. ఇదే భాగంలో చాకలి సర్వాయి, కుమ్మరి సాగరుల జన్మ వృత్తాంతాలు కూడా వుంటాయి. 


4. ఆరంజ్యోతి కళ్యాణం: ఆరం జ్యోతి పురాణమే వశిష్ట పురాణం. అది నాల్గవది. ఇందులో పరాశర బ్రహ్మ ఊర్వశిని పెళ్లాడడం. వాళ్ళిద్దరికీ పుట్టిన వశిష్టుడు. మాతంగ పట్టణానికి చెందిన అరుంధతిని చేపట్టడం ప్రధానాంశాలు. అరుంధతీ వశిష్టుల పూర్వ జన్మ వృత్తాంతం కూడా ఇందులో చోటు చేసుకొంది.


బండికి చుట్టూ ఉల్లెడ కట్టి ఎవరికీ కనిపించకుండా సవారి కచ్చురంలో నులక చందయ్యలు ప్రయాణిస్తూ వుంటారు. వారిది ఎక్కువ వ్యవహారిక భాష. వారి గ్రంథం చుట్ట చుట్టి ఉంటుంది. అచ్చం బ్రాహ్మణుని ఉచ్ఛారణతో పోలి వుంటుంది. ఇతర పురాణాలను మాదిగవారి కోరికపై వివరిస్తారు. వీరు మాదిగలకు పంచాంగం కూడా చెబుతారు. 

వత్తిని నులకత్రాడుగా అల్లి రుద్రాక్షలను తాడునకు అమర్చినందువల్ల లోకములో నిన్ను, మిమ్ములను ప్రజలు నులకసంగయ్య(చందయ్య)అని పిలువగలరని శ్వాసముని చెబుతాడు. నులక చందయ్యలు జాంబవ వారసులకు గురువులయ్యారు.13 

నులకచందయ్యల పురాణపఠనం మౌఖికంగా చెబుతారు. వీరి పూర్వీకుల వద్దనుంచి వచ్చిన కాగితాల్లో రాసిన జాంబపురాణం దాదాపు ముప్పై గజాల పొడవువుంటుంది.14  వీరు జాంబవ పురాణం చెబుతారు. మధ్య మధ్యలో చదివిన అంశాలను వ్యాఖ్యానం చేస్తారు. మిగతా ఉపకులాల జాంబపురాణం వలెనే ఈ ప్రవచనం ఉంటుంది. వీరు నాలుగు, ఐదు రోజులు ప్రవచనం చెబుతారు.

మాదిగ కులం జాతిని, రీతిని తెలియజెప్పేది జాంబపురాణమే15 అన్నది అక్షరాల నిజం. 
నులక చందయ్యలు ఉండేది. ప్రస్తుతం జనగాం జిల్లాలో కొలనుపాకలో ఉన్నారు. కొలనుపాకలో మాదిగల మఠం ఉన్నది. పద్దెనిమిది కులాలకు చెందిన పద్దెనిమిది మఠాలు ఒక్క చోట ఉండేవని చెబుతారు. నులక చందయ్యల నిర్వహించే శివాలయం ఉంది. ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిదని చెబుతారు. నులక చందయ్యలు కొలను పాకను దక్షిణకాశీ పేర్కొంటారు.  

ఈ దేశంలో సంస్కర్తలు ఎందరో పుట్టారు. మాదిగలు ఉద్ధరించిన సంస్కర్తలు లేరనే చెప్పకతప్పదు. గురజాడ, కందుకూరివారు బ్రాహ్మణ కులాలని సంస్కరించారు. తెలుగుభాషను సాహితి పరిశోధన పేర భాషను మోటబొక్కెనలతో తవ్విపోసిన వారికి జాంబపురాణం కనపడక పోవడం బాధాకరం. క్షమించరాని తప్పిదంగా భావించినా తప్పులేదు. మహాత్మ జ్యోతిబాపూలే చెప్పిన సంస్కరణవాద అంశాలు ఎన్నో వందల ఏళ్లనుంచి మాదిగతత్వాన్ని చెబుతున్న ఉపకులాలని అభినందించాల్సిందే. కళల్ని నమ్ముకొని జీవిస్తూ  కళాతత్వాన్ని నలుదిక్కుల వెదజల్లుతున్న కళాకారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిందే. వారి కృషిని చూసి మాదిగ జాతి ఒక్కటే కాకుండా తెలుగు సాహిత్యం గర్వపడాల్సిందే. మాదిగలు ఉపకులాలను అక్కున చేర్చుకొని అంతరించి పోతున్న సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. తెలుగు నిట్టాడు నిలువులైన మాదిగ కవులు, మేధావులు, నేతలు వీరిని పట్టించుకోవాలి. రాతలో, ఉపన్యాసాల్లో కాకుండా చేతల్లో సహాయం అందించాలి. ప్రభుత్వం మరింత చేయూత నిచ్చి అంతరించి పోవడానికి మరణపు అంచున నిలుస్తున్న కళల్ని, కళాకుటుంబాల్ని ఆదరించాలి. ఫించన్లు ఇచ్చి కళాకారులని పోషించాలి. స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్రను పోషించాలి.

గిరిజన దినోత్సవం వలే అస్తిత్వపు దినాన్ని ప్రతి ఏటా జరిపి కులపురాణాలను చెప్పించాలి. రాష్ట్ర అవతరణ సందర్భాల్లో కళల్ని ప్రదర్శించే ఏర్పాటు చేయాలి.
ఈ దేశానికి చెందిన ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆద్యులు మాదిగలు. మాదిగల సంస్కృతి. అణచివేసే బ్రాహ్మణీయ భావజాలానికి  అసలైన ప్రత్యామ్నాయం జాంబవ పురాణం. అదే విధంగా మాదిగేతర ఆశ్రిత కులాల సాహిత్యాన్ని వెలుగులోకి తేవలసిన అవసరం కూడా వుంది.

అంతరించిన పోతున్న కళలకు అక్షర రూపం కల్పించి చరిత్రలో సుస్థిరస్థానం పొందేలా కృషిచేసిన, చేస్తున్న జయధీర్‌ తిరుమల్‌ రావు, పులికొండ సుబ్బాచారి, గడ్డం మోహన్‌రావు లాంటి వాళ్లను మాదిగలే గాకుండా జాతి యావత్తు అభింనందించాల్సిందే. ఈ కళలను, అస్తిత్వాన్ని ప్రవచించిన యోగులగు దున్న ఇద్దాస్‌, చిందు జాంబపురాణం రాసిన గడ్డం మచ్చయ్యదాసు లాంటి వల్ల రచనలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత రాబోవు పరిశోధకులపైనా, విశ్వవిద్యాలయపు ఆచార్యులపైనా, విశ్వవిద్యాలయాలపైనా ఉంది.

మాదిగల సంస్కృతిని, కళలను కాపాడుతూ వస్తూన్న మాదిగల ఉపకులాలగు చిందు, డక్కలి, మాష్టి, నులకచందయ్యలు, కావలసినంత గుర్తింపుకు నోచుకోవడం లేదు. నిజం చెప్పాలంటే మాదిగలు ఎట్టిలో మగ్గుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్నపుడు ఉపకులాల కళా పోషణను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించుకున్నారు. ఒకప్పటి  జాతి చైతన్యం ప్రోత్సాహం ప్రస్తుతం అధికం కావల్సినంతా అయిందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరించిపోతున్న కళలల్ని నిర్మించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రపంచీకరణ పుణ్యమా అని మానవ సంబంధాల్ని వస్తుసంబంధాలనుంచి విముక్తి గావించడంలో ముందుండాలి. ఆదిమ కళల్ని అంతరించి పోతున్న కళలకు జీవం పోయాలి. ఉపాధిలేక ఆత్మనూన్యతకి గురైవచ్చిన కళా విద్యను వదులుకుంటున్నారు. ఇప్పటికైనా వీటిని పరిరక్షించవలసిన మాదిగలకు, ప్రభుత్వానికి వుంది. ముఖ్యంగా మాదిగ విద్యావేత్తలు, కళాకారులు, నాయకులు ఆ దిశగా కార్యాచరణ నిర్ణయించుకుని కళలను ఆదరించవలసిన అవసరం ఈ తరంపైనా ఎంతైనా ఉంది.
  ఈ దేశ సంస్కృతి పునాదులు మూలవాసుల కుల పురాణాలపైనే ఆధారపడి వుందనేది నగ్న సత్యం. కులపుపురాణాలే ఈ దేశపు పునాదులు.







పాదసూచికలు:
1. నేను చిందేస్తే... సం. మోహన్‌రావు, గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.
2,3, అదే.
4. గడ్డం మచ్చయదాసు విరచిత చిందు జాంబవపురాణం.సం. మోహన్‌రావు,గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.
5. కొలనుపాక, నులకచంద్రయ్యల ఆదిజాంబవ మహాపురాణం, సుబ్బాచారి, పులికొండ, ద్రావిడ విశ్వ విద్యాలయం,2008.
6. కొలను పాక నులక చందయ్యల ఆదిజాంబవ పురాణము, సుబ్బాచారి, పులికొండ. ద్రావిడ విశ్వవిద్యాలయం,2008.
7.గడ్డం మచ్చయదాసు విరచిత చిందు జాంబవపురాణం.సం. మోహన్‌రావు,గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.
8. నేను చిందేస్తే... సం. మోహన్‌రావు, గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.
9. అదే.
10. డక్కలి జాంబ పురాణం, తిరుమల్‌ రావు, జయధీర్‌. జానపద పబ్లికేషన్స్‌, 2011.
11, 12 అదే.
13. కొలనుపాక నులకచందయ్యల ఆదిజాంబవ పురాణము, సుబ్బాచారి, పులికొండ. ద్రావిడ విశ్వవిద్యాలయం,2008
14. అదే.
15. రంగధాంపల్లి, దబ్బెట నర్సయ్య గారితో జరిపిన సంభాషణ

ఉపయుక్త గ్రంథాలు:
1. గడ్డం మచ్చయదాసు విరచిత చిందు జాంబవపురాణం.సం. మోహన్‌రావు,గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.
2. నేను చిందేస్తే... సం. మోహన్‌రావు, గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.
3. డక్కలి జాంబ పురాణం, తిరుమల్‌ రావు, జయధీర్‌. జానపద పబ్లికేషన్స్‌, 2011.
4. కొలనుపాక నులకచందయ్యల ఆదిజాంబవ పురాణము, సుబ్బాచారి, పులికొండ. ద్రావిడ విశ్వవిద్యాలయం,2008
5. చిందుల హంస.. సం. మోహన్‌రావు, గడ్డం, చిందు పబ్లికేషన్స్‌, హాజిపూర్‌. 2015.


డా॥ సిద్దెంకి యాదగిరి M.A., MA (Edu), Ph.D.
9441244773,

                                                                Email: sygiri773@gmail.com
                                                                (2017)




కత్తి కంఠమే 'అసిపె'

కత్తి కంఠమే 'అసిపె'


'అసిపెనే

మా ఇంటికి బువ్వ

బతుకు బండి

మా జాతి జీవగర్ర వెనుగర్ర 

కులవృత్తికి కూరాడు

అసిపె లేకపోతే బువ్వెక్కడిది?

అసిపె మా గుండె పెట్టె

మా ఇంట్లో దీపం' అని అస్తిత్వం ప్రకటిస్తున్న 'అసిపె' దీర్ఘకావ్య కవి వనపట్ల సుబ్బన్న.

 అసిపెను కావ్య సింహాసనం మీద ఆత్మగౌరవం కల్పించి, నిరర్థకమైన వృత్తి చిహ్నాలను సార్ధకం చేస్తున్న కవి సుబ్బన్న.

కులవృత్తులతో ఊరుకు విడదీయలేని సంబంధం ఉంది. వృత్తి పని లేకుంటే ఊరు ఉత్తదైతది. అలాంటి సందర్భంలో అసిపెకు ఊరుకున్న సంబంధాన్ని వ్యక్తీకరిస్తూ....

'ఊరు

అందంగా లేదంటే

ఊరిలో అసిపె లేనట్లే' అని న్యాయం చెప్పి జీవితపు సారాన్ని చిత్రీకరించాడు.

ఊరు అందంగా లేదంటే ఊరు మనుషులు కురూపులుగా ఉన్నారని అర్థం. క్షవరాలు గడ్డాలు పెరిగి, మనుషులు గుడ్డేలుగుల్లాగా కనబడితే ఆ ఊరికి ఎక్కడైనా అందం  ఉంటుందా? ఉండదు. అందుకే అలా అన్నారు.

వనపట్ల సుబ్బయ్య పేరు వర్తమాన తెలుగు సాహిత్యంలో సుపరిచితం. పాలమూరు మట్టి పరిమళాన్ని, తెలంగాణ జీవజాలును కవిత్వంగా వెలువరిస్తున్న సుబ్బన్న కవిత్వమై కత్తులతో కవాత్ చేస్తున్నాడు. చెమట జాలుని కావ్య జలధారగా ప్రవహింప చేస్తున్నాడు.

బహుజన తత్వాన్ని పునికి పుచ్చుకొని 'ధిక్కారా', లాంటి అనేక కవితా సంకలనాలు గతంలో వెలువరించారు. ఇప్పుడు తన అస్తిత్వాన్ని గొంతుక చేసి భాష్పధారగా "అసిపె" వెలువరించారు.

సుబ్బన్నది సుమంగళమైన వృత్తి. విద్రోహవివక్షను, ఆ వృత్తి సాధకబాధకాలను  ఏకరువు పెట్టి ఆర్ద్రంగా  మనసుపై చిద్రమైన బతుకుల్ని ముద్రించాడు.

తన నాన్న గొప్పతనాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అంటే మంగళ వృత్తి చేసిన అందరి నాయనల గురించి అని అర్థం. విశ్వజనీనం చేస్తూ పరాకాష్టగా చిత్రించాడు.

'నాయన భుజాన

అసిపెతో నడిచిన నేలంతా 

నాకు ఇప్పుడిప్పుడే శ్రమసుగంధమై

నిలువెల్లా ఆవరిస్తుంది 

నాయన నడకనే మహాకావ్యం....' అని అనడం ఎంత కవిత్వం చదివినా, పుట్లకొద్దీ సాహిత్యం అధ్యయనం చేసినా అలవాడని జ్ఞాన సంపద అంతా నాయన జీవితం చూసి అనుభవ పూర్వకంగా జ్ఞానార్జన గావించాడు. అనుసరిస్తున్నాడు. ఆచరిస్తున్నాడు. తనివి తీరా తన్మయత్వం చెందుతున్నాడు. ఇప్పుడు ఆ వృత్తి ఆయనకు ఉపాధి ధార.

నాయి బ్రాహ్మణుల జీవితము రోజురోజుకీ ఎట్లా కుంచించుకు పోతున్నదో? విధ్వంసం అవుతున్న వృత్తికి ఆత్మగౌరవం కావాలని నినదిస్తున్నాడు. మంగళ వృత్తిలో చాలా కీలకమైంది కత్తుల పెట్టె. దానిని 'అసిపె' అంటారు. ఆ పేరు మీద దీర్ఘ కావ్యం రావడం అస్తిత్వానికి గొప్ప ప్రతీకగా చెప్పుకోవచ్చు. వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా నట్టేట మునిగారో తెలియజేస్తున్నాడు.

'అసిపె చేతుల పట్టందే

పూట గడవని బతుకు

సౌరం కత్తులు నూరి నూరి రాయి అరిగినట్లే

బతుకు కరిగిపాయె' అని తరతరాల తండ్లాటను,  వేదననను, వికసించని జీవితాల శోషను విషాదంగా ఆవిష్కరిస్తాడు.

హాస్పిటల్స్ లో నర్సింగ్ సిస్టం రావడం వల్ల మంత్రసానులకు గిరాకీ తగ్గిపోయింది కానీ ఒకప్పుడు వారు మంత్రసానులై చేసిందే చికిత్స. వారిని, పనితనాన్ని సౌందర్యాత్మకంగా ...

'అమ్మ

లోకానికి పుట్టుకనిస్తే 

మంత్రసాని అమ్మల లోకానికి

పురుడు పోస్తదని....

ఆమె కాన్పు చేసిన బిడ్డలందరూ

ముక్కొంచని సూర్యులైండ్రు' అని సహజత్వంగా అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ లాగా ఆమె పనిని అత్యంత శోభాయమానంగా కీర్తిస్తాడు‌.

అమెరికా అధ్యక్షుడు వచ్చిన ప్రతిసారి హైదరాబాదు రోడ్ల పక్కన జీవితాలు రోడ్డున పడుతుంటాయి. అసలు అడియాసలతాయి.

 'అమెరికా అధ్యక్షుడు

ఎవడొచ్చినా

రోడ్లమీద సెలూన్ డబ్బలు ఖాళీ' అని వృత్తిని కొల్లగొట్టి ఉపాధిని నాశనం చేసే వాళ్లపై అక్షరాల్లో అక్రోశాన్ని ప్రదర్శిస్తాడు.

వివిధ రకాలుగా వివక్షత చూపే వాళ్ళపై విరుచుకుపడతాడు. కన్న కొడుకులా శ్మశానానికొచ్చి క్షవరం చేసిన నన్ను అనుమానిస్తావా అని ప్రశ్నిస్తాడు

'శ్మశాశానంలో

నీకు తలకొరవి పెట్టిన

నీ పెద్ద కొడుకు ఎంతనో

అదే శ్మశానంలో

నీ జాతికి నీకు

కర్మ సవరం చేసిన నేనంతే

ఇప్పుడు చెప్పు

ఎవడు నాగరికడు ?

ఎవడు అనాగరికుడు? అని ప్రశ్నిస్తాడు. ఆత్మగౌరవం ఉండాలనే ఆరాటపడుతున్నారు.

ఆదరించని ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తూ

'నాద బ్రాహ్మణులను

ఏ సంగీత అకాడమీలు ఆదరించవని' విచార పడతాడు.

అన్ని వృత్తుల్లాగే మంగళి వృత్తి కూడా కార్పొరేట్ మయమైనది. వృత్తి కోల్పోవడం ఉపాధి కోల్పోవడం సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమాలపై కవి తన నిరసనను 

'కార్పొరేట్ సెలవులకు 

వెండి గొడుగులు పడుతున్న వెలుగు పూలకు

తిరుక్షవరం చేద్దాం

ఆసిపెని తెరిచి మంగలి కత్తులను నూరుదాం' అనిప్రకటిస్తాడు.

అస్తిత్వం మనగడుగుతున్నటువంటి సందర్భంలో మాట పాట కవిత్వం ఏదైనా ఆయుధం చేయడమే సాయుధమవుతుంది. ఆ సమర సంగ్రామములో సుబ్బన్న 'జెండాలకు దిమ్మలం కాదు

సామాజిక న్యాయ సాధనలో...

ఆధునిక మౌర్యులుగా చరిత్రను తిరగరాద్దాం' అని ప్రకటించడం సముచితంగాను సామాజిక బాధ్యతతో కూడిన విధానంగాను విద్యుక్త ధర్మంగాను ఉన్నది.

ఈ కావ్యంలో ఊరి పోలికలు ఉత్తమోత్తమ రీతిలో సృజించాడు. సామెతలను పలుకు బడులను, స్వభావోక్తంగా జల్లెడ పట్టి చిత్రించారు. వ్యక్తిత్వాన్ని, వ్యవస్థను, వివక్ష చూపే వాళ్ళపై ధర్మాగ్రహం వెళ్ళబుచ్చాడు. సుమంగలుర జీవితాలు, ఏం చేస్తే స్థితిగతులు మారుతాయో ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ, వివక్షత లేని సమాజాన్ని కలగన్న అక్షరం ఈ పుస్తకం, గొంతు ఎత్తి బహుజన వాదాన్ని ప్రవచిస్తుంది. ప్రకటిస్తుంది. కర్తవ్య దీక్షను బోధపరుచుతుంది.

అట్లా "అసిపె" దీర్ఘకావ్యం తన ఫలితాలు నిశ్శబ్దంగా మౌలికమైన మార్పు కోసం ప్రయత్నిస్తుందని భరోసా కల్పిస్తున్న


(వనపట్ల)కు హృదయపూర్వక అభినందనవందనాలు.

-డా. సిద్దెంకి యాదగిరి.

విద్యా హక్కు (RTE) చట్టం, 2009 యొక్క ప్రధాన లక్షణాలు

విద్యా హక్కు ( RTE) చట్టం , 2009 యొక్క ప్రధాన లక్షణాలు భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ...