చదువండి ఆలోచించి చెప్పండి.
సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము, ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము
సాధన, దక్షత, సాధుభాషణమును, సద్వివేచనమును, సద్గమనము,
దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము,
కరుణ, క్షమ, పరోపకారబుద్ధియనెడి
యాలోచనారీతు లమరియుండు
మనుజులెపుడును మాన్యులు, మంగళ
స్వ రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
జగతిగతి విరచితులు, సజ్జనులువారు.
ప్రశ్నలు
1. పై పద్యం దేన్ని గురించి చెబుతున్నది?
ఈ పద్యం గొప్ప వారి గురించి మంచి వారి గురించి తెలియజేస్తుంది.
2. పై పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి?
సహనము సత్యము ఆత్మవిశ్వాసము సాధన యోగ్యత మితభాషణ మంచి వివేచన మంచి నడవడిక దానగుణం ధైర్యము త్యాగము సునిసిత బుద్ధి, హితం కోరే గుణము పుణ్యఫలము కరుణ క్షేమ పరోపకార బుద్ధులు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
3. మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు?
మంచి లక్షణాలు గల వారిని సజ్జనులు అని అంటారు.
4. అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి?
అలాంటి వారిని గురించి తెలుసుకోవడం అంటే వారి గొప్ప గుణాలను మనం ఆదర్శంగా తీసుకోవడం వారితో సాంగత్యం చేయడం అంటే వారి జీవితాన్ని చదవడం అంటే వాటిని ఆచరించాలని అనుకోవడం
పాఠం ఉద్దేశం
సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకున్నా, స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్పూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి. నరసింహారావు వ్యాసం రాశాడు. మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.
Page14
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.
ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సం||పు డిసెంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.
రచయిత పరిచయం
భారత ప్రధానిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పి.వి. పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్థులు రుక్మిణమ్మ, రంగారావుగారలకు దత్తపుత్రుడు. స్వామి రామానంద తీర్థ పి.వి.కి రాజకీయ గురువు. బూర్గులవారు గురుతుల్యులు.
(1921-2004)
విద్యార్థిదశలోనే హైద్రాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. 1938లో హైద్రాబాద్ రాష్ట్రకాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలందించాడు. చతురతతో భారత రాజకీయయవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు.
తెలుగుభాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో 'కాకతీయ' అనే పత్రికను నడిపించాడు. విశ్వనాథ 'వేయిపడగలు' నవలను హిందీలోకి "సహస్రఫణ్” అనే పేరుతో అనువదించాడు. దీనికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన 'ది ఇన్సైడర్' అనేక భాషల్లోకి అనువదించబడింది. 'పన్ లక్షత్ కోన్ ఘ' అనే మరాఠి పుస్తకాన్ని తెలుగులో 'అబలా జీవితం'గా ఈయన అనువదించాడు.
నిరాడంబరజీవితం, నిజాయతీ, దేశభక్తి కలిగిన పి. వి. నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండలా స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు.
విద్యార్థులకు సూచనలు
. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
. పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.
విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుకల
Page 15
ప్రవేశిక
ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడనాడక పోవడం గొప్పవారికే సాధ్యమౌతుంది. జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిశ్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా "సరే! ఇవన్నీ ఆటలో భాగమేగా!" అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమౌతుందా? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు? ఈ పాఠం ద్వారా తెలుసుకొంది.
స్వర్గీయ డా. బూర్గుల రామకృష్ణారావు గారి 5వ వర్ధంతి సందర్భంలో వారిని గురించి వ్యాసమేదైనా యివ్వవలసిందిగా మిత్రులు కొందరు నన్ను కోరారు. డా. రామకృష్ణారావుగారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరిగొని భావోద్రేకంతో నా మనస్సు ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటుంది. నా భావాలన్నింటిని యీ వ్యాసంలో వివరించడం ఎలాగ? అవన్నీ వ్రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని రేఖామాత్రంగా నా భావాలను యిక్కడ పొందుపరుస్తాను.
కీ.శే.డా. రామకృష్ణారావుగారిని గురించి చరిత్రకారులు ఏమి వ్రాస్తారో మనం తేలికగానే ఊహించుకోవచ్చు. "డాక్టరు రామకృష్ణారావుగారు ఫలాన తేదీన ఫలాన గ్రామంలో పుట్టారు. పూనాలోని ఫెర్గూసన్ కాలేజి నుండి పర్షియన్భాష ఐచ్ఛిక విషయంగా తీసుకొని పట్టభద్రులయ్యారు. పర్షియన్ ట్యూటరుగ కొంతకాలం పనిచేశారు. తరువాత న్యాయవాద పట్టా పొంది ఫలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు అయ్యారు. ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసారు. ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు స్టేటు కాంగ్రెసులో వారొక ప్రముఖ నాయకులు, మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, రెండు రాష్ట్రాలకు గవర్నరుగాను పని చేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అనేక కమిటీలకు, కమీషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. గుండెపోటు వలన 1967 సెప్టెంబరు 14వ తేదీన కన్నుమూశారు" మొదలయిన అంశాలు వ్రాస్తారు. చారిత్రకంగాను, కాలక్రమ ప్రకారంగాను అది అంతా నిజమే. కాని, అంతమాత్రం చేత డా. రామకృష్ణారావుగారి అసలు వ్యక్తిత్వం మనకు అవగతం కాదు.
Page 16
ప్రతి మానవునిలోను సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. దానిని గురించి వాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకొన్న ఆ కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంది. తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకొంటూ తమ శక్తిసామర్ధ్యాలను, అమూల్య సమయాన్ని వ్యర్థపరుచుకొంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కాని యిందుకు డా. రామకృష్ణారావుగారు మాత్రం అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెల్లప్పుడు అన్ని విషయాలు ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెపుతూ వుండేవారు. ఎంత ఉంటే అంతే. వీసం ఎత్తు ఎక్కువాలేదు, వీసం ఎత్తు తక్కువా లేదు.
వారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని కొంతమంది అంటారు. కాని అంతకంటే సత్యదూరమైన విషయం మరొకటి లేదని నా భావన. నిజానికి ఒడ్డూ పొడుగూ ఉన్న చాలామందికంటే కూడ వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. తమ వామన రూపాన్ని గురించి స్నేహపూరితమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి భావనిర్లిప్తతతో చెప్తూ ఉండేవారు. లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్ బ్రాత్ అసాధారణ పొడగరితనం కంటె డా. రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు. పూర్వపు హైదరాబాదు సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డా. రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో అరేబియారాజు ఇబన్ ఉద్ను పుష్పమాలాలంకృతునిగా చేసిన సందర్భంగా అతిథి ఆతిథేయులిర్వురు పరస్పర సౌజన్య సౌహార్దాలతో ఎటువంటి ఫీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం యిప్పటికీ చాలా మందికి జ్ఞాపకముండే ఉంటుంది. అలాగే ఒక విందు సందర్భంలో ప్రొ. గాల్ బ్రెత్, డా. రామకృష్ణారావు గార్ల ఫొటో తియ్యడం ఫొటోగ్రాఫర్ల కళానైపుణ్యానికొక గీటురాయి అయి ఆ సందర్భానికొక చక్కని వినోదాన్ని చేకూర్చింది.
ఆలోచించండి - చెప్పండి.
అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి? ఎప్పుడు?
* ఇతరులకంటే తాను అధికుడనని- పించుకోవాలనే ఉబలాటం. పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
సత్యదూరమైన విషయం అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడుతారు?
II
*అవసరమైతే విరాట్ రూపం....*
వారు గుర్తించబడడానికి, గుర్తించబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానేలేదు. అంతకన్న గహనమైన దేదో వారి వ్యక్తిత్వంలో వుండి ఉండాలి. ఏదో నిత్య నైమిత్తికంగా (routine) వారు గుర్తించబడడంకాని, గుర్తించబడకపోవడం గాని జరుగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తివలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. పని పూర్తి అయిన వెంటనే తిరిగి తమ వామన రూపంలో ఇమిడిపోతూ ఉండేవారు, మరొక అవసరం వచ్చేవరకు. అందుచేత వారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరుగలేదు. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో యిమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో యిమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే డా. రామకృష్ణారావుగారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధపు లోతులలోనే పరిలక్షితమౌతూ ఉండేవి.
*న్యాయవాదిగా*
న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండేవి. వారి ప్రాక్టీసు roaring practice (క్షణం తీరికలేనిది) అని చెప్పడానికి వీలులేదు. అలా అని వారికి కేసుల కొరత ఎప్పుడూ ఉండేదికాదు. కాని వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినట్టివి. ఫీజు లేనట్టివీను. ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి, ధనసంపాదనకు ఉపకరిస్తే, డా. రామకృష్ణారావుగారి విషయంలో మాత్రం అది తారుమారైంది. వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. డా.రామకృష్ణారావుగారి శక్తిసామర్థ్యాలు, ప్రజ్ఞా ప్రాభవాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రతవలన కేసులమీద ఎక్కువ ధ్యానముంచలేరేమో అన్న అనుమానంకూడా ఆ క్లయింట్ల మనస్సులలో ఉంటూ ఉండేది. నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేదికాదు. కేసు చేపట్టేటప్పుడే వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్నిరేఖామాత్రంగా వ్రాసిపెట్టుకొనే వారు అంతే. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే డా. రామకృష్ణారావుగారి జాజ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనాఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం నేను స్వయంగా చూచాను. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశిత మేధాసంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది వారి అనన్యమైన వాదనా పటిమ.
*ప్రోత్సాహం*
సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. నేను వారివద్ద అందరికంటె జూనియర్గా ఉండేవాడిని. కాని తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేషమమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా. రామకృష్ణారావుగారికి నామీద ఉంటూ ఉండేది. చొరవతోను, నిరాఘాటంగాను, నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. నా యీ చొరవ వారి సీనియర్ గుమాస్తాకు కోపకారణమై ఆయన నామీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు. ఒకసారి డా. రామకృష్ణారావుగారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోదముద్ర వెయ్యడం, అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. అప్పటినుండి మా యిరువురి మధ్య సీనియర్, జూనియర్ సంబంధంపోయి నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయి చర్చాసంబంధం ప్రారంభమైంది. నేను అంచనా వేసుకొన్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తిసామర్ధ్యాలున్నాయని, స్వయంగా గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లపుడూ జోహారు లర్పిస్తూనే ఉంటాను. వారు నాలో పూరించిన ఆ ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలలోను, యితర చోట్లను కూడ శ్రీరామరక్షగా ఉంటూ వస్తూంది. ప్రాతఃస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావుగారి విశిష్టవ్యక్తిత్వ మట్టిది.
రాజకీయాలలో వారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినప్పటికి వారు పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తూఉన్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహకోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికినీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీచట్టాన్ని తయారుచేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయిన భూకామందులు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.
Page18
పూర్వపు హైదరాబాద్ సంస్థానవిచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తివాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మపరిత్యాగానికీ, చివరకు సక్రియ రాజకీయాలనుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు. డా. రామకృష్ణారావుగారు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, మంచి వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు. ఒకసారి నిర్ణయం తీసుకొన్నారంటే ఆరునూరైనా దానిమీద స్థిరంగా నిల్చేవారు. ఇదీ డా.రామకృష్ణారావుగారి సంక్షిప్త రాజకీయచరిత్ర.
ఆలోచించండి- చెప్పండి.
ఎవరైనా గుర్తింపుపొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
* అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి? ఇది ఎవరికి అవసరం? ఎందుకు?
'కొరుకుడు పడకపోవడం' అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడతారు?
III
సౌజన్యానికి మారుపేరు :
వారి విశిష్టవ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఉంది. గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీరామకృష్ణారావుగారు. శరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరే వారు. మతదురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాంకు బద్ధవ్యతిరేకి అయినప్పటికినీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమమిత్రులు, ఆప్తులూను! అతి నిరాడంబరముగా వారు మతాతీతస్థితిని పాటించేవారు. వారి డ్రాయింగు రూం ఒక సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాలముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీటోపీలవారు, ఖద్దరుధారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒకరేమిటి, అన్ని రకాలవారు, వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరు అయ్యేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే డా. రామకృష్ణారావుగారు మూడు విభిన్నతరాల చివరి వారధిలా కన్పించేవారు. ఇంతటి విశాలవ్యక్తిత్వంతో వారు అనాటి ప్రజాజీవితాన్ని తీర్చిదిద్దారు.
నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభా నాయకులుగా వారు సునిశితమేధ, పరిమార్జితభాష, వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరచిన ఉన్నతప్రమాణాలను, నేటికి ముఖ్యంగా యీ రోజులలో ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకొంటూ ఉంటారు. అవసరమైనపుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపుబొట్టుమాట అలా ఉంచి, ఒక్క కన్నీరుబొట్టు పడడంగాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడంగాని జరిగేదికాదు. పార్లమెంటేరియన్గా డా. రామకృష్ణారావుగారి అద్వితీయ కళాకౌశలమట్టిది.
బహుభాషావేత్త :
వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినదే. వారు చదువుకున్న చాలా భాషలు వాటియందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డా. రామకృష్ణారావుగారు ప్రతిరోజూ అర్ధరాత్రివరకు ఆఫీసు ఫైళ్ళు చూచుకొని, ఆ తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ, డా. రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీజగత్తుకు చెందినవారని నా నమ్మకం. ఇది చాల వింతగానే తోచవచ్చు. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరుగవలసినంత ఎక్కువగా జరుగలేదు.
Page 19
బహుముఖప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. డా. రామకృష్ణారావుగారు ముట్టని, పెంపొందించని క్షేత్రం ఏదీ లేదంటే అందులో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. కాని ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశిత మేధాసంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో, ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికే వారికి అవకాశం కలుగలేదు. రాజకీయవేత్తగా కూడ వారు తమ కాలంనాటి అంటే దేశచరిత్రలో చాల ప్రధానమైన, ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. నాబోటి హితైషులెంత చెప్పినప్పటికీ వారా పనులు చేయలేకపోయారు. ఆ విధంగా వారు తమ జీవితకాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ, చేయకుండా వదిలివేసింది కూడా అంతకన్న ఎక్కువ విలువైనదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులెవరికంటె కూడ వారే మిక్కిలి సమర్థులు. ఇందుకు నేనూ, నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం.
వారి ఔదార్యం, ఉపకారబుద్ధి ఎంతవరకు ఉండేదంటే, ఒక్కొక్కపుడది ఒక దోషంగా పరిణమించేది. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడ వారు నెమ్మదిగా నచ్చచెప్తూ ఓపికగా చాలసేపు కూర్చొనేవారు. అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉండిఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. కాని డా. రామకృష్ణారావుగారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే, శక్తిని, సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది. ఏమైతేనేమి? వారావిధంగా మలచబడ్డారు. అది అంతే.
ఉపకారశీలి
డా. రామకృష్ణారావుగారిది పెద్దకుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుబడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలుకూడ ఎంతో ప్రేమతోను, ఓర్మితోను, గంటల తరబడి వేచిఉంటూ ఉండడం, వారు రాగానే "సోదర సోదరీమణులారా; నేను అలవాటు ప్రకారం నేడు కూడ ఆలస్యంగానే వచ్చాను" అంటూ ఉండడం పరిపాటి అయిపోయింది.
వారి సామాజికయాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగలేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మనస్తైర్యాన్నీ సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కాని, ప్రత్యర్థులు దూషించినప్పుడుగాని వారనేదల్లా ఒకటే- “సరే- అవన్నీ ఆటలో ఉండేవేగా" అని.
డా.రామకృష్ణారావుగారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు.
ఆలోచించండి- చెప్పండి..
గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థంఎందుకు చేయాలి?
* మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా? లేక ఇతరపనులకా?
రామకృష్ణారావుగారిని పి.వి.గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు'కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్ప పేరు సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? ఏమేం చేయాలి?
Page 20
ఇవి చేయండి
1. అవగాహన - ప్రతిస్పందన
1. కింది అంశం గురించి మాట్లాడండి.
ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది.
దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
2. కింది విషయాలు పాఠంలో ఏయే సేరాల్లో ఉన్నాయి.
వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.
వ్యక్తిత్వం
పేరా సంఖ్య
సంబంధించిన అంశాలు
మహోన్నత వ్యక్తిత్వం
విశిష్ట వ్యక్తిత్వం విశాల వ్యక్తిత్వం
3. పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
4. కింది గద్యాన్ని చదువండి.
క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది. స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి వాటిమీద ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపచేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.
*. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి?
ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి?
ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు?
ఈ) రుద్రమదేవి సమర్థత యేమిటి?
ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
P21