సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

bhoomika లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhoomika లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

12. భూమిక

12. భూమిక 

చదువండి – ఆలోచించి చెప్పండి.


పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది. ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు – జవాబులు


ప్రశ్న లు1.
పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
పుస్తకాలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తిని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి.


ప్రశ్న 2.
ఎటువంటి పుస్తకాలను చదువాలి ?
జవాబు:మనకు స్ఫూర్తినిచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదువాలి.

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదువాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది ?
జవాబు: పుస్తక పరిచయ వాక్యాలు మనకు ఏదైనా పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కలిగిస్తాయి.

ప్రశ్న 4.
మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి.
జవాబు:మహాప్రస్థానం, మహాభారతం, రామాయణం, దేవరకొండ, అమృతం కురిసిన రాత్రి.

ఆలోచించండి – చెప్పండి 

పాఠం ఉద్దేశం

ముందుమాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘నెల్లూరి కేశవస్వామి ఉత్తమకథలు’ సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.



కవి పరిచయం

రచయిత : గూడూరి సీతారాం
నివాసం : రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేట
జననం : 18.07.1936
మరణం : 25.09.2011
రచనలు : 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. కొన్ని మాత్రమే ప్రస్తుతం దొరుకు తున్నాయి.
ప్రత్యేకత : తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత.
ఇతర అంశాలు : తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు.
ఇతర రచనలు : మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం మొదలగునవి.

ప్రవేశిక

కథలు ఒకప్పుడు మానసికానందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీరంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్త్వాన్ని, సంఘర్షణను భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు.

విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ తో పోల్చదగిన వాడు. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసు కోవడం ఎంతైనా అవసరం.

విద్యార్థులకు సూచనలు

పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.
ప్రక్రియ – పీఠిక

ఈ పాఠం ‘పీఠిక’ ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి.

నెల్లూరి కేశవస్వామితో స్నేహం ………. సాహిత్యంలో ఈ కథలకు విశిష్ట స్థానం ఉంది.

ప్రశ్న 1.
కథలకు, కవిత్వానికి గల భేదం ఏమిటి ? మీకు ఏవంటే ఇష్టం ? ఎందుకు ?
జవాబు:
కథలు సరళభాషలో సాగే వచన రచన. విశిష్టమైన వస్తు, శిల్పంతో సాగే రచన కథలు. ఛందస్సుతో ముడిపడి సాగే రచన కవిత్వం. ప్రాసలతో, అలంకారములతో కూడిన రచన కవిత్వం. నాకు కవిత్వం అంటే ఇష్టం. వినసొంపుగా, పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అందుకని కవిత్వం అంటే నాకు ఇష్టం.

ప్రశ్న 2.
నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?
జవాబు:
తెలంగాణ రైతు పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో 4 వేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. ఈ కారణాల వల్ల హక్కుల కోసం, స్వాతంత్ర్య కోసం ప్రజలు ఉద్యమించి ఉండవచ్చు.
ప్రశ్న 3.
హైదరాబాదు నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
హైదరాబాదు నగరంలోని ప్రజల జీవితాలను, సంస్కృతిని బాగా పరిశీలించాలి, విశ్లేషించాలి. ఆ పట్టణ ప్రజల మానసిక స్థితిని కూడా అవగాహన చేసుకోవాలి. సమాజంలో నానాటికి వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలి.

ఫ్యూడల్ సమాజంలో ఉండే బాధలు, వ్యతిరేకతలు పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛా వాయువుల హాయిని కూడా పరిశీలించాలి. రకరకాల కులవృత్తులను పరిశీలించాలి.

ఉద్యమాలు, రాజకీయ మార్పులు, సంస్కృతి, గ్రామీణ జీవితం ఇలా అన్ని కోణాలలోనూ హైదరాబాదు నగరాన్ని పరిశీలించాలి. పై వాటి నన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వివరించడమే చిత్రించడం. అది తెలుగుభాషలో చేస్తే తెలుగులో చిత్రించడం అంటారని మాకర్థమైంది.

ఆలోచించండి – చెప్పండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, …….. కేశవస్వామి హృదయం ఉంది.

ప్రశ్న 1.
అపార్థాలు ఎందుకు వస్తాయి ?
జవాబు:
అవగాహనా లోపం వలన అపార్థాలు వస్తాయి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, వారి ఆలోచనా విధానం నచ్చకపోయినా అపార్థాలు తలెత్తుతాయి. మరియు ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు విభిన్నంగా ఉండటం వలన అపార్థాలు ఏర్పడతాయి. అపార్థాలు మనిషిలోని ఆలోచనా శక్తిని వక్రమార్గంలో నడిపిస్తాయి. మనిషిని భ్రమకు లోనుచేసి వ్యక్తుల మధ్య సంబంధాలను దూరం చేస్తాయి.


ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింప చేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అపుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహింపవచ్చు.

ప్రశ్న 2.
‘చార్మినార్’ కథలను ఎందుకు చదువాలి ?
జవాబు:
చార్మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితంలో సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. కాబట్టి తప్పక చదువాలి.
ప్రశ్న 3.
రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి ?
జవాబు:
11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవనవిధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేసాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ఆదానప్రదానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించిందని దాని అర్థం.

ఆలోచించండి – చెప్పండి.

అందులో భాగంగా చూసినప్పుడు …………. వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేశవస్వామి కథలు

ప్రశ్న 1.
హృదయ సంస్కారం అంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
హృదయ సంస్కారం అంటే మనసులో ఉండే మంచి భావన. నాకు మా తాతగారు, అమ్మా, నాన్నలు మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని చాలా విషయాలు, కథలు చెబుతుంటారు.

ఉదాహరణకు మా తాతగారు మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. మా తాతగారి చిన్నతనంలో బాల్యవివాహాలు జరిగేవిట. ఒకసారి మా గ్రామంలో ఒక 12 సం॥ల అమ్మాయిని పెళ్ళిచూపులు చూసుకొందుకు 60 సం॥ల వృద్ధుడు వచ్చేడుట. ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. డబ్బుకు ఆశపడి వృద్ధుడికి పెళ్ళి చేద్దామనుకొన్నారు. వృద్ధుడు అమ్మాయి నచ్చిందన్నాడు.

వాళ్ళడిగిన డబ్బిచ్చాడు. ఆ అమ్మాయిని వృద్ధుడు ‘నేను నీకు నచ్చానా?’ అన్నాడుట. భయం, భయంగా ‘ఊ’ అందిట. ‘మరి, నేను చెప్పినట్లు వింటావా ?’ అన్నాడట, ‘ఊ’ అంది. ‘నీకేమిష్టం ?” అన్నాడు. ‘చదువు’ అంది అమ్మాయి.

అంతే వృద్ధుడు పకపకానవ్వాడుట. ‘పెళ్ళి ముహూర్తం పెట్టించమంటారా ? బాబూ అని అమ్మాయి తండ్రి అడిగాడుట.

‘పెట్టించండి. కానీ, పెళ్ళికి కాదు. దత్తతకు, ఈ రోజు నుండి మీ బంగారుతల్లి నాకు బంగారు తల్లి అయింది. బాగా చదివిస్తాను. మంచి కుర్రాడికిచ్చి పెళ్ళిచేస్తాను. రామ్మా ! మనింటికి వెడదాం’ అన్నాడట. ‘అదీ హృదయ సంస్కారం’ అన్నారు మా తాతగారు. ఆ అమ్మాయి తర్వాత బాగా చదువుకొని జిల్లా కలెక్టరైందిట. ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపిందట.

ప్రశ్న 2.
“స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది”? – సమర్థించండి.
జవాబు:
అవును. “స్నేహాని కన్న మిన్న లోకాన లేదు కన్నా” అని కదా ! ఇది మతం, కులం, ప్రాంతం, భాషలను చూడదు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది. “కేవలం మనుషులం” కథలో హుస్సేన్మీర్జా, మహబూబ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి స్నేహానికి మతం అడ్డు రాలేదు. ఇది చక్కని కథ. నేను స్నేహం మతాల సరిహద్దులను
చెరిపివేస్తుందని నమ్ముతాను.

ప్రశ్న 3.
పేదల కష్టాలు ఎట్లా ఉంటాయి ? పేదల జీవితాల్లో మార్పులు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది ?
జవాబు:
పేదల కష్టాలు వర్ణించటానికి కూడా వీలుకానివి. ఆర్థికం, సామాజికం అనే సమస్యలతో అతలాకుతలం అవుతారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి. రాయితీలు ఇవ్వాలి. సబ్సిడీలు ఇవ్వాలి. వారికి ప్రభుత్వం విశ్వాసం, భరోసా కల్పించాలి.

కూడు, గుడ్డా, నీడ కల్పిస్తే చాలావరకు వారి జీవితాల్లో వెలుగులు (మార్పులు) వచ్చినట్లే.

ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
 1.కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమాలలో ఏమేం చేస్తారో చెప్పండి.
జవాబు:

సభా నిర్వహణ : అతిథులను, పుస్తక రచయితనూ, సమీక్షకున్నీ వేదికపైకి పిలిచి సభ నిర్వహిస్తారు.
పుస్తకావిష్కరణ : ముఖ్య అతిధి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తారు.
పుస్తక సమీక్ష : సమీక్షకుడు పుస్తకంలోని అంశాలను రేఖా మాత్రంగా స్పృశిస్తూ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
ప్రసంగాలు : అతిథులు పుస్తకం గురించి, రచయిత గురించి ప్రశంసిస్తూ మాట్లాడతారు.
కవి సత్కారం : పుస్తక రచయితను అందరూ సన్మానిస్తారు.
కవి స్పందన : ఈ కార్యక్రమ నిర్వహణపై కవి లేదా రచయిత తన స్పందనను తెలియజేస్తారు.
ప్రశ్న 2.
నేటి సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉందో చెప్పండి.
జవాబు:
మానవ మనస్తత్వాన్ని, సమాజంలోని కుళ్ళునూ, సమాజపు స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు చూపించే రచయితలు అవసరం. సమాజానికి ప్రతినిధిగా రచయిత ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఒక సమస్యను చూపి, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పగలిగే రచయితలు అవసరం.

సమాజంలోని రుగ్మతలను, మూఢనమ్మకాలను, దురాచారాలను ఖండించగలిగే నిర్భయత్వం గల రచయితలు కావాలి. ఉదాహరణకు వేమన, శ్రీశ్రీలాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం.

ప్రశ్న 3.
ఈ పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

 1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ‘ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు’ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
(లేదా)
‘ఒక భాషలోని సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అప్పటి సమాజ స్థితిగతులను గ్రహించవచ్చు’ దీన్ని విశ్లేషించండి.
జవాబు: నెల్లూరి కేశవస్వామి గారి ‘చార్మినార్ కథలు’ చదివితే ఆనాటి నవాబుల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి డేవిడీల గురించి తెలుసుకోవచ్చు. ఆనాటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే ఆ రోజులలో కల్మషం ఎరుగని స్నేహాలు, ఆత్మీయతలు, కులమతాలకు అతీతమైన వారి మమతలు తెలుస్తాయి.
అలాగే ఆంగ్లసాహిత్యం చదివితే, ఆంగ్ల దేశాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. బ్రిటిషుకాలంనాటి ఇంగ్లాండు పరిస్థితులు తెలియాలంటే ఆనాటి బ్రిటన్ సాహిత్యం చదవాలి. ప్రేమచంద్, కిషన్చందర్ సాహిత్యం చదివితే ఆనాటి ఉర్దూ, హిందీ భాషా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయి.
రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివితే ఆనాటి బెంగాల్ పరిస్థితులు తెలుస్తాయి. వారి సంప్రదాయాలు తెలుస్తాయి.

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు రాయండి.
(లేదా)
తెలంగాణ భాషలోని పలుకుబడులను గురించి విశ్లేషించండి.
జవాబు: పలుకుబడి అంటే ఉచ్ఛారణము, వచో నిబంధనము, ఒడంబడిక, మాటచెల్లుబడి అని నిఘంటువులో చెప్పబడింది. తెలంగాణ ప్రాంతంలోని మాట చెల్లుబడి, మాటల ఉచ్ఛారణము అని అర్థం. ఏ భాషకైనా పలుకుబడులు, జాతీయాలు, గుండెకాయ (ముఖ్యమైనవి) వంటివి. అవి భాషను పదికాలాల పాటు నిలిపి ఉంచుతాయి.
ఉదాహరణలు :
సామెతలు :
అతి రహస్యం బట్టబయలు.
నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగు- తుందన్నదట.
మావోనికి ముప్ఫైరెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు తనకు దెలది ఒకడు చెపితే వినడు.
చెరువుల పడ్డాన్ని తీసి బావిలేసినట్లు.
జాతీయాలు : జాతీయం – సందర్భం
అగ్గిబుక్కుట – కోపంతో ఉడికిపోవుట
ఉడుంపట్టు – గట్టి పట్టుదల
ఒంటికోతి – ఏకాకి, ఒంటరివాడు
కడుపు కుటుకుట – ఓర్వలేనితనం

ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం తోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమర్థ మయిందో తెలుపండి.
(లేదా)
తెలంగాణ కథల పుట్టుక గురించి, సామాజిక చైతన్యం గురించి రాయండి.
జవాబు: కథ, వస్తు, శిల్ప నైపుణ్యంతో ఉంటుంది. తెలంగాణ కథ మొదటి నుండి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వచ్చింది. 1902 నుండి తెలంగాణ కథ ప్రారంభమైంది. పుట్టుకనుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. ఉద్యమాలు, పోరాటాలు మున్నగునవి పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇందుకు తోడ్పడింది. ఈ విధంగా తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యం, ఉద్యమాలు, పోరాటాలను చూపిస్తూ వచ్చిందని నాకర్థమయింది.

2.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి. 
మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు”. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలా గ్రంగా అర్థం చేసుకోవచ్చు” ఎట్లాగో రాయండి.
(లేదా)
పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకము యొక్క విశేషాలను తెలుసుకోవచ్చు. దీన్ని సమీక్షించండి.
జవాబు: పీఠిక లేదా సమీక్షను చదివితే చాలా విషయాలు తెలుస్తాయి.
పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని సవివరంగా వివరిస్తుంది.

 పుస్తక సమీక్ష.
ఇది విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
నైతిక విలువలను వివరిస్తుంది.
సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.
మానవుల మనస్తత్వాన్ని, సంఘర్షణను తెలుపుతుంది.
చార్మినార్ కథలు సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర అని చెప్పవచ్చును.
పాఠకుడు మూలగ్రంథాన్ని చదివే తీరిక లేనప్పుడు పుస్తకం సమీక్ష కొంతవరకు విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.
పుస్తక సమీక్షలు ఆధారం ఒక్కొక్కసారి ఒక గ్రంథంతో ప్రజాదరణ పొందిన సందర్భాలూ ఉన్నాయి.
నిష్పక్షపాతంగా, నిర్భయంగా రచనలను సమీక్ష చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఆ పుస్తకం ఆమూలాగ్రంగా అర్థంచేసుకోటానికి వీలు కలుగుతుంది.
పుస్తక సమీక్షను చదివితే ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదువాలనే ఉత్సాహం, ఉత్సుకత కల్గించేలా సమీక్ష ఉండాలి.
(లేదా)

ఆ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి.
(లేదా)
కేశవస్వామి రచనల విశిష్టతలను విశ్లేషించండి.
జవాబు: విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధమైన ప్రేమ్చంద్, కిషన్ చందర్ లతో పోల్చదగిన వారు.
తొలి కథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969 ఆగస్టులో వెలువడింది.
రెండవ కథా సంకలనం “చార్మినార్ కథలు”. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన ఇది. దీనిలో హైదరాబాద్ రాజ్య చరిత్ర, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రించారు.
“యుగాంతం” కథలో హైదరాబాద్ గురించి వివరించారు. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ ఎట్లా జీవనాన్ని కుదిపేసాయో అట్లే హైదరాబాద్ రాజ్యంలో 1946 – 50ల మధ్య పరిస్థితులు ఎలా కొనసాగాయో వివరించబడింది. సమాజం, మానవ సంబంధాల గురించి వివరించబడింది.
“వంశాకురం” కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది.
“కేవలం మనుషులం’ కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్రాయ్ సక్సేనాల మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ.
“భరోసా కథ” నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ.
“ఆఖరి కానుక” కథ రోజు రోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియచేస్తుంది.
ఈ విధంగా కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం గారు అద్భుతంగా, సజీవంగా, సప్రమాణకంగా వ్యాసం రాశారు.

ప్రశ్న 3.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
జవాబు: వివిధ రంగాల్లో కృషిచేసిన మహిళామూర్తుల సేవలను స్మరిస్తూ ‘మహిళావరణం’ అనే గ్రంథాన్ని కొందరు రచించారు. దీనికి ముందుమాటను ప్రముఖ వ్యాసకర్తలు రచించారు. సమాజంలో వివిధరంగాల్లో రమణీయమైన సేవలను చేసిన వారి త్యాగాలను, సాహసాలను చక్కగా వివరించారు.
ఎందరో స్త్రీలు ఉద్యమాలు చేశారు. చదువులు చదివారు. రాజకీయ నాయకులైనారు. డాక్టర్లు అయ్యారు. నాటక, క్రీడ మొదలైన రంగాల్లో రాణించారు. అయినా వారికి తగిన గౌరవం చరిత్రలో దొరకలేదు. పురుషాధిక్యంతో స్త్రీల సేవలను చరిత్ర గుర్తించడం లేదు. స్త్రీలందరు అద్భుతమైన చరిత్ర నిర్మాణానికి ఎంతో మూల్యం చెల్లించారు. ఎన్నో త్యాగాలు చేశారు.

వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన మహిళలను ఎంపిక చేసి, వారి వివరాలు, వారి ఇంటర్వ్యూలను కలిపి ‘మహిళావరణం’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆర్థికపరమైన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వందమంది మహిళల గురించి మాత్రమే ఇందులో ప్రస్తావించారు.

వారికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ పుస్తక నిర్మాణంలో ఎందరో తమ సహాయసహకారాలను అందించారు. వారందరి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. రచయితలు వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

III. భాషాంశాలు
పదజాలం
 1.గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
జవాబు: దృష్టి (ఆలోచన)
ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యత తో మెలుగుతారు.
జవాబు:స్నేహం
ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
జవాబు: చేతిచలువ
ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
జవాబు: మిక్కిలి ప్రసిద్ధి.
ఉ) పూర్వం జమీందారులు దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
జవాబు: సంపన్నులు నివసించే పెద్ద భవంతి
 2. కింది పదాలను వివరించి రాయండి.
జవాబు:
అ) హృదయసంస్కారం : మనసుకు సంబంధించిన సంస్కారం. ఇది ఎంతో విలువ కలిగినది. సొంత కూతురులా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టారు.
ఆ) సామాజిక పరిణామం : సమాజపరంగా జరిగే మార్పు యుగాంతం కథలో వివరించబడింది. మానవ సంబంధాలు, మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు “యుగాంతం” అనే పేరు సార్ధకతను చేకూర్చింది.
ఇ) భారతీయ సంస్కృతి : ఇది ఎంతో విశిష్ఠమైంది. 11వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లిం వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై జీవన విధానంపై చెరగని ముద్ర వేసారు.
ఈ) అతలాకుతలం : విపరీతంగా శ్రమపడడం లేదా క్రింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత శ్రమ అనే అర్థంలో దీన్ని వాడతారు. అతలము అనగా ‘పాతాళము’. కుతలము అనగా భూమి అని అర్థం.

వ్యాకరణాంశాలు
1. కింది పదాలకు విగ్రహవాక్యాలురాసి, సమాసాలు గుర్తించండి.

అ) దశకంఠుడు = దశ కంఠములు కలవాడు – బహువ్రీహి సమాసము
ఆ) పీతాంబరుడు = పీతము అంబరముగా కలవాడు – బహువ్రీహి సమాసము
ఇ) అరవిందానన = అరవిందము ఆననముగా కలది – బహువ్రీహి సమాసము
ఈ) మృగనేత్ర = మృగము వంటి నేత్రములు కలది – బహువ్రీహి సమాసము
ఉ) చంచలాక్షి = చంచలమైన అక్షములు కలది – బహువ్రీహి సమాసము
ఊ) మానధనులు = మానమే ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము
ఋ) రాజవదన = రాజు యొక్క వదనం కలవాడు – బహువ్రీహి సమాసము
ౠ) నీరజభవుడు = నీరజము నుండి పుట్టినవాడు – బహువ్రీహి సమాసము

2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.
అ) “హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది” అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు. (ప్రత్యక్షం)
జవాబు:
హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. (పరోక్షం)

ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవ స్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామియని గూడూరి సీతారాం అన్నాడు. (పరోక్షం)

ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు. (ప్రత్యక్షం)
జవాబు:
చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు. (పరోక్షం)

3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.

అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని చేత తమస్ నవలలో చిత్రించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)

ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించ దగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు. (కర్మణి వాక్యం)

శ్లేషాలంకారం


కింది వాక్యాలను పరిశీలించండి.

అ) మిమ్ముమాధవుడు రక్షించుగాక !
అర్థం :

మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !
ఆ) మానవ జీవనం సుకుమారం.
అర్థం :

మానవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.
పై అర్థాలను గమనించినారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.) ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.

4. కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.

1. రాజు కువలయానందకరుడు :
రాజు = ప్రభువు, చంద్రుడు
కువలయం = భూమి, కలువపూవు
ఆనందకరుడు = ఆనందింప చేసేవాడు
1వ అర్ధములో = ప్రభువు భూమిని ఆనందింప చేసేవాడు.
2వ అర్థములో = చంద్రుడు కలువ పూవులను ఆనందింపచేసేవాడు.
అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని శ్లేషాలంకారం అని అంటారు.


2. నీవేల వచ్చెదవు.

నీవు ఏల వచ్చెదవు = నీవు ఏల వచ్చెదవు.
నీవేల వచ్చెదవు = నీవు ఏ సమయంలో వచ్చెదవు.
ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థాలను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.
5. క్రింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.

అ) మావిడాకులు తెచ్చివ్వండి.

మామిడి ఆకులను తెచ్చి ఇవ్వమని ఒకటి.
మా ‘విడాకులను’ తెచ్చి ఇవ్వమని ఒకటి అర్థం స్ఫురిస్తుంది. ఇది శ్లేషాలంకారం.
ఆ) వాడి కత్తి తీసుకోండి.

వాడి యొక్క కత్తిని తీసుకోమని
వాడియైన (పదును గల) కత్తిని తీసుకోమని ‘అర్థం’ వాడబడింది.
ఇది శ్లేషాలంకారం.

ఇ) “ఆమె లత పక్కన నిలుచున్నది”.

ఆమె లత అనే ఆమె ప్రక్కన నిలుచున్నది (ఒక అర్థం)
ఆ, మెలత (స్త్రీ), ప్రక్కన నిలుచున్నది (రెండవ అర్థం) ఇది శ్లేషాలంకారం.

ప్రాజెక్టు పని


వార్తా పత్రికలు లేదా మ్యాగజైన్లలో వచ్చిన పుస్తకం పరిచయాలను / సమీక్షా వ్యాసాలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
బతుకు పుస్తకం అనేది సావిత్రి సమగ్ర రచనా సంపుటిలోనిది. బతుకు పుస్తకం లక్ష్మణరావుగారి జీవితచరిత్ర. ఇది ఆంధ్రజ్యోతి వారి వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది.

‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావు గారు రచించిన ‘అతడు-ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది.

లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.
మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

విశేషాంశాలు
1. హైదరాబాద్ రాజ్యం : 1724లో అసఫ్ జాహీ వంశీయుడైన నిజం ఉల్ముల్క్ ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొగలాయీ చక్రవర్తులకు అత్యంత విశ్వాసపాత్రుడు. హైదరాబాద్ రాజ్యాన్నే ‘హైదరాబాద్ సంస్థానం’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఏడుగురు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని మూడు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కలిసి ఉండేవి.

2. తెలంగాణ రైతాంగపోరాటం: వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై రైతులు చేసిన పోరాటం ఇది. చారిత్రాత్మకమైన ఈ పోరాటం 1946-51 సంవత్సరాల మధ్య కొనసాగింది. భూమికోసం – భుక్తి కోసం – బానిసత్వ విముక్తికోసం పేదరైతులు చేసిన ఈ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.


3. దేవిడి : నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను ‘దేవిడీ’ లు అనే పేరుతో పిలిచేవారు. ఇవి పెద్ద భవంతులు. వీటిలో సంస్థానాలకు చెందిన సంపన్నులు నివసించేవారు. హైదరాబాద్ పాతనగరం తోపాటు తెలంగాణలోని పలు పట్టణాలలోనూ పాతబడిన దేవిడీలు కనబడతాయి.

4. పాన్దాన్ : తాంబూలాన్ని వేసుకునేవారు. తమలపాకులతోపాటు సున్నం, కాచు, పోకలు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పెట్టెలో సర్దిపెట్టుకునేవారు. దానిని ‘పాన్దాన్’ అనే పేరుతో వ్యవహరించేవారు. ఇది ఉర్దూపదం.

5. కోహినూర్ : కుతుబ్షాహిల ఖజానాలో ఉండేది ఈ కోహినూర్ వజ్రం. ఈ వజ్రం బరువు 750 ఇంగ్లీషు కారెట్లుగా నిర్థారించారు. కోహినూర్ వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలోనే అత్యంత విలువైనది, విశిష్టమైనది.

సూక్తి : మంచిపుస్తకం మంచిమనసుకు మరోపేరు సొంతపుస్తకం మంచి మనిషికి మరోతోడు.

చదువండి – తెలుసుకొండి

విశ్వకవి ‘గీతాంజలి’
సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా రచయితగా తత్త్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. రవీంద్రునిపేరు వినగానే చప్పున స్ఫురించేవి. ‘జనగణమన’ గీతం, ‘గీతాంజలి’. ‘జనగణమన’ గీతం భారత జాతీయగీతంగా గుర్తింపబడింది.

బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా ఇతని లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయగీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు. ‘శాంతినికేతన్’ పేరున ఆదర్శవిద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డాడు. ఈ సంస్థద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించాడు.

కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన ‘గీతాంజలి’. 1913లో దీనికి ‘నోబెల్ సాహిత్య పురస్కారం’ దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు. ‘గీతాంజలి’ భారతీయ భాషల్లోకి మాత్రమేకాక ఎన్నో విదేశీ భాషలలోకి అనువదింపబడింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

‘గీతాంజలి’లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో

ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించ గలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి,
పేదలను కాదనకుండా, అధికారదర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె. భాగ్యలక్ష్మి

పదాలు – అర్థాలు

I

భూమిక = ప్రదేశము
సాయుధ = ఆయుధాలతో
విరివిగా = ఎక్కువగా
ధ్యాస = ఆలోచన, దృష్టి
విశ్లేషణ = వివరణ
చిత్రించబడ్డాయి = వివరించబడ్డాయి
విజృంభించి = అతిసయించి
దివాన్ = మంత్రి
జనాభా = పరివారము
కోఠీ = వేశ్యావాటిక
అంతర్యుద్ధం = లోలోపల వారిలో జరిగే
ఒప్పందం = ఒడంబడిక
రిటైర = పదవీ విరమణ
విశిష్ట స్థానం = ప్రత్యేక స్థానం
సంక్షుభిత = చిన్నాభిన్నమైన


II

నిర్దిష్టం = నిర్దేశించబడిన
వెలువడింది = వచ్చింది
అంకితం = ఒక గ్రంథమును వ్రాసి మఱి యొకరి పేర కృతి ఇచ్చుట
అపూర్వము = అపురూపము, క్రొత్తది, కారణం లేనిది
ఆదానప్రదానాలు = ఇచ్చిపుచ్చుకొనుట
నేపథ్యం = వస్త్రాద్యలంకారం, వేషము నాట్య స్థానము, నాట్య రంగమందు తెర లోపలి ప్రదేశం
తమస్ = చీకటి
పరిణామాలు = మార్పులు

III

ప్రోగ్రాం = కార్యక్రమము
మహోన్నతము = గొప్పదైన
అతీతంగా = అతిక్రాంతము, కడచినది
పొడసూపితే = కలిగితే
సున్నితమైన = మృదువైన
అతలాకుతలం = నలుగుట, శ్రమము, చెదరిపోవుట
సౌలభ్యం = సులభత్వం
దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి

________________________________

విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కోసం.

 2017లో  నేను రాసిన వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను 
-------------------------------------------------

                                నెల్లూరి కేశవ స్వామి కథలు


       


అలజడి జీవితాలు. జనాకాశానికి వేలాడుతున్న నిరాశల ఆకలి. రజాకార్ల దురాగాతాలకు రక్షణ కరువైన సమాజం రజాకార్లకు వంతపాడే జాగీర్థారీ వ్యవస్థ. పన్నుల రూపంలో పల్లెల వెన్నువిరుస్తున్న కౄరత్వం. మట్టి మనుషుల ఎట్టి బతుకులు. లుప్తమవుతున్న మానవత్వాన్ని, నైతిక విలువల్ని, సమాజం చిన్నాభిన్నమవుతున్న అనేక కోణాలు కనబడుతాయి.


 ముస్లిం సంప్రదాయాల్లో ఉన్న ఛాందస భావాలు. అత్యుత్తమమైన వున్నత విలువలు కలిగిన మహమ్మదీయ కుటుంబాలు. హిందూ ముస్లిం సఖ్యత. ఒకవైపు రాజకీయం ప్రేరేపిస్తున్న అల్లరి. ఇంకా వినాశనం చేస్తున్న విధ్వంసం.  మరొకవైపు అరాచకంలోనూ ఆత్మీయత వెల్లువల్ని చూడవచ్చు.‌  కథకుడు నెల్లూరి కేశవ స్వామి తన కథల్లో అక్షరీకరించాడు. 

పసిడి బొమ్మ కథా సంపుటి 1969లో వెలువరించారు. ఈ పుస్తకాన్ని భాసరబట్ల కృష్ణారావుకు అంకితం చేశారు. ఛార్మినార్ కథా సంపుటి వెలువరించారు.  వెలుతురులో చీకటి సుప్రసిద్ధ నవల.

      ఆనాటి సామాజిక చిత్రణ, మానసిక సంఘర్షణలకు నిజాం రాజ్య పరిణామాలకు నిలువుటద్దం కేశవస్వామి కథలు. భారత యూనియన్‌లో విలీనమై స్వతంత్య్ర రాష్ట్రంగా 8 సం॥లు కొనసాగిన హైద్రాబాద్‌ రాష్ట్రం భాషపేర మోసం చేయబడిరది. అనేక పోరాటాలు, విరామమెరుగని పోరుబాటలు, అమరుల వీరత్వం వల్ల ప్రత్యేక రాష్ట్రం అరువై ఏళ్లకు కాని సిద్ధించింది కాదు.

ఈ కథలకు, ముందు మాట రాసిన గూడూరి సీతారం గారు వివరిస్తూ ‘స్వామి కథలు అలనాడు హైద్రాబాద్‌ రాజ్యంలోని గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్‌, జాకోబు వజ్రాల వంటివని పేర్కోన్నాడు. నెల్లూరి కేశస్వామి కథలు మనసుల్లో అల్లుకొనే కథలు, చదవడం వలన ఆనాటి సమాజంని అర్థం చేసుకోవచ్చును. ఇవి చదివి ఆచరించాల్సినంత సందేశము ఇందులో ఉంది.

ఈ కథ ముస్లిం కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్న దుస్థితిని తెలుపుతుంది కథలు అరబ్బు షేక్‌లకు అమ్ముకోబడిన ‘అమీనా’ వల్ల కాస్త ఆర్థిక సౌలభ్యం తెలుపుతుంది. ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న క్రమంలో తన పాత ప్రియున్ని కలుసుకుంది. నికాహ పేరు ఇద్దరికి విషమిచ్చి చంపిచేయబడుతారు. అరువై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఈ తంతు కొనసాగుతుందని పేపర్లో వార్తలు ప్రచురించబడుతున్నాయంటే కేశవ స్వామి ఎంత స్రష్టనో ద్రష్టనో అవగతమవుతుంది.

నెల్లూరి వారి ఎంపిక చేసిన కొన్ని కథల్ని మనకు పుస్తకరూపంలో అందించినందుకు నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ వారికి కృతజ్ఞతలు. తెలంగాణ ఆనాటి జీవితాల్ని అక్షరబద్దం చేసి మనకందించిన నెల్లూరి కేశవస్వామి సదా పూజ్యనీయుడు.  స్వామిగారి కథల్ని ఆనాటి తెలంగాణ జీవితాల్లో ఉన్న బహుముఖ కోణాల్ని దర్శించవచ్చు. కాలంపైన రజాకార్ల బర్రలు వాతలు తేలినట్లు కనవడ్తయి. విలీన సంబురాలు ఎగసిపడుతయి. రజాకార్లు వదిలివెల్లిన బానిసతనం కూడా దర్శనమిస్తున్నాయి. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఆనాటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతాం. తెలంగాణ మట్టిపొత్తిళ్ళని తట్టిలేపిన కథలు. ఈ కథల్లోని నీతిని అందరు ఆచరించటమే వారికిచ్చే అసలైన గౌరవం.



       హైద్రాబాద్‌ విలీనమవుతున్న సందర్భంలో రాసిన కథ ‘యుగాంతం’ ఖాసీం రజ్వీ దురంతాలు. హిందూ ముస్లింల అలజడులు వివరించడు. ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టిన కథ ‘యుగాంతం’ కథను ప్రత్యేకంగా చెప్పాలి. భారత్‌ పాక్‌ విడిపోయినపుడు ఆనాటి పరిస్థితులు, సంక్షోభాలు హత్యకాండను ‘తమస్‌’ నవలలో చిత్రించినట్లు హైద్రాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనమవుతున్నపుడు అలాంటివే సంఘటనలకు ఉదాహరణ. సామాజిక మార్పు. రాజరిక వ్యవస్థ అంతం నూతన దశలోకి సమాజం. మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలకు అధ్బుతంగా చిత్రించాడు. 


  యుగాంతం కథ:నొక్కి వినండి 



పోలీస్‌ యాక్షన్‌ ప్రారంభమైందనీ తెలియగానే హిందువుల గుండెల మీది కుంపటి తీసేసినట్లైంది. నగరమంతా కర్వ్యూ విధించారు. రాత్రి పదిగంటలపుడు తలుపుకాడ్కి వచ్చి ‘‘స్వామీ! స్వామీ!!’’ అనే పిలుపు విన్నాడు. తల్లి వారిస్తున్న దిలావర్‌ అని నిర్ధారణ కొచ్చి లోపలికి ఆహ్వానించాడు. స్వామీని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

 ‘‘ఏమైందనడిగితే నిజాం లొంగిపోయాడని జవాబిచ్చాడు. ఇవ్వన్ని ఇప్పుడెందుకు?’’ స్వామి తల్లి భోజనం పెట్టింది కడుపు నిండా తిన్నాడు.

స్వామి దిలావర్‌ని ఇప్పుడు చెప్పుమనగానే ‘‘యూనియన్‌ సైన్యాలు నల్లగొండకు చేరుకున్నాయి. అతికష్టమ్మీద లారీ మీద రెండు మైళ్ళు వచ్చాను. ఆ లారీఫేలయింది. మరో లారి ఆపి ఇక్కడకు చేరుకున్న’’అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు.

 ‘‘సైన్యం వారు నిన్నేమంటారు?’’ అని ఎదురు స్వామి ప్రశ్నించాడు. నేను నిజాం రజాకార్‌ని మన క్లాస్‌మేట్‌ ఇక్బాల్‌ మా నాయకుడు. మేము ఉపనాయకులం. నల్లగొండలో దాడులన్ని మా ఆధ్వర్యంలో జరిగేవి.’’ అని అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పసాగాడు.

దిలావర్‌ని కాపాడుటక కొరకు శతవిధాల కృషిచేస్తాడు. 


పోతూ పోతూ ఒక మూటను వదిలి వెళ్ళిపోతాడు. మాటను విప్పి లెక్కిస్తే మూడువేల హాలి(నిజాం) కరెన్సీ ఉంది. దిల్లూ కోరిక మేరకు పన్నెండు వందల రూపాయల కల్దార్‌(భారత) కరెన్సీ గా మార్చాడు. దిలావర్‌ అత్త గారింటికి వెళ్లి ఆరాతీశాడు. అతని కోసం ఎవరు రాలేదు.

‘‘దిల్లూ! ఇప్పుడు .. ఈ వేళప్పుడు బయటకు వెళ్తున్నావా?’’ అని స్వామి అడిగాడు. 

‘‘అవును మక్కా మస్జిద్‌కు నమాజ్‌కు చదువడానికి వెళ్తున్నాను. ఆ మస్జీద్‌లో నమాజు చదవటం ఆఖరు సారేమో’’ అంటూ స్వామి చేతుల్లోకి తీసుకున్నాడు. స్వామికి అర్థం కాలేదు. సమయం లేకపోవడం వలన వివరణ అడిగే ప్రయత్నం చేయలేదు. దిలావర్‌ మళ్లీరాలేదు.  

పదిరోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. డియర్‌ స్వామి నీకు నీనుంచి కనపడనంత దూరం వచ్చేసినందుకు క్షమించుమని, అమ్మకు చెప్పలేక వచ్చినందుకు బాధపడ్తాడు. తాను బతుకాలంటే కొత్త జీవితం ప్రారంభించడానికి, పాక్‌ వెళ్తున్నాని చెబుతాడు. తన భార్య రంకుతనం వల్ల తన బతుకు నాశనమైందనీ, తాను మరో పెళ్ళితో నూతన జీవితం ప్రారంబిద్దామనుకుంటే పోలీస్‌ యాక్షన్‌తో అంతా తలకిందులైందంటాడు. నేను తెచ్చిన సొమ్ముకు నువ్వే వారసుడివి. కానీ నువ్వు తీసుకోవని తెలుసు. ఆ దోపుడు సొమ్మును బీదలకు ఎలాగైనా అందిస్తే అందించగలవు.’’ అని చెప్పినట్లుగా ఉత్తరం వచ్చింది.

స్వామి తనకు తెలిసిన కలెక్టర్‌కు కొల్లగట్టిన సొమ్మును అందజేస్తాడు.       


2. రూహీఆపా:

బంధాలకు, బంధుత్వాలకు పట్టం కట్టిన  మరోకథ ‘‘రూహీఆపా’’లో విలువలు వివరించాడు. 

ముజ్రాలనే బోగం సానులకు కన్నెరికం జరిపించడం గొప్పవేడుక. రాధ సంగీతం మాస్టారుతో లేచిపోయింది. రాథ స్థానంలో రాధ చెల్లెలు రమణిని ముస్తాబ్‌ చేసింది తల్లి. (నవాబును చూసిన రమణీ కూడా నవాబంటే ఇలా ఉండాలనుకుంది. సంగీతం, పాట పాడి వినిపించగానే నవాబు గారు రమణీ తల్లితో మాట్లాడి పల్లెంలో నోట్ల కట్టలు పెట్టి వెళ్ళిపోయాడు.)

      ‘‘వారానికి రెండు సార్లు నవాబుగారి దేవిడి(భవంతి)కి వెళ్ళాలి. ఆయన పేరు యూసుఫ్‌ నవాబ్‌. చాలా ధనవంతుడు. ఏమంటావే?’’ అని తల్లి అడిగితే నీయిష్టం అని రమణి అన్నది. 

. ‘‘నీ పేరు రమణి బాగాలేదు. రూహీ అని పిలువచ్చునా?’’ అని నవాబు అడిగితే ‘‘సరే మీ ఇష్టం’’ అని అంగీకరించింది. అలా రెండేళ్ళుగడిచాయి.

ఒకనాడు దేవిడి పోయే వరకు నవాబు పోలిన వ్యక్తి కూర్చున్నాడు. రూహిని గమనించి ప్రక్క వ్యక్తి లేచి నిలబడి ప్రతి సంస్కారంతో నమస్కారం చేశాడు. ఇతను చోటే నవాబు సలీం ఉద్దీన్‌ఖాన్‌ అని పరిచయం చేసాడు యూసుప్‌ నవాబ్‌. 

పరిచయం జరుగుతున్నపుడు ‘‘అవును నాన్న గారు! మీరు చెప్పింది అక్షరాల నిజం’’ అనగా రూహీ ఉలిక్కిపడ్డది. 

నేను బొంబాయికి వెళ్తున్న. తిరిగి రావడానికి వారం పది రోజులు పట్టవచ్చునని యూసుప్‌ చెప్పాడు. కచ్చేరి అనంతరం తిరిగి వచ్చిన రూహీకి సలీం ముఖం గుర్తురావడంతో ‘అబ్బా! ఎంత అందంగా ఉన్నాడో. ఒక్క చూపులోనే తన మనస్సు దోచుకున్నాడు...’’ అనుకుంటూ మధుర స్మృతులతో రాత్రి గడిచిపోతుంది. తెల్లతెల్లవారుతుండగా నిద్రపట్టింది రూహీకి.

‘‘రమణీ! రమణీ!! నవాబ్‌ సాబ్‌ నిన్ను తీసుకురమ్మనరట.’’ లేపింది తల్లి. 

నవాబ్‌ సాబ్‌ బొంబాయి పోలేదా? అనుకొని గబగబా తయారై కారులో వెళ్ళిపోతూ‘‘నవాబ్‌ సాబ్‌ ఊరికి వెళ్లలేదా?’’ అని అడిగింది. 

‘‘నిన్ను పిలిచింది చోటే నవాబ్‌’’ అని కార్‌ డ్రైవర్‌ ఉత్తరమివ్వగానే కారపమంది. కారాగింది. నవాబ్‌ గారి లేని సమయంలో నన్ను పిలిపించారే. తన కిది ఇష్టంలేదు. మరి తాను ఇప్పుడేం చేయాలి? ఆలోచనలు ఆపి మొండిగా ముందుకు కారు సాగిపోయింది.

దేవిడి ముందు కారు ఆగగానే ‘‘ఆదాబ్‌! మీ కోసమే ఎదురు చూస్తున్నాను. నాన్న లేనపుడు మీరు రావడం ఇబ్బంది పడ్తున్నారా? కారు తెప్పించమంటారా?’’ అనగానే లేదన్నట్లు తలూపింది. 

‘‘ఒకమారు లోపలికి వస్తారా?’’ అని దీనంగా అడగ్గానే భయం భయంగా అదిరిపడే ఎదతో చోటే నవాబును అనుసరించింది రూహీ. చీకటింట్లోకి వెళ్ళారు. భయమెక్కువైంది. మరింత చీకటి గదిలోకి తీసుకువెళ్తున్నాడు. సలీం స్విచ్చ్‌ వేయగానే గది దేదిప్యమానమైంది. పెద్ద పట్టె మంచం, గులాబి తెర. రూహీకి మనసు మనసులో లేదు. అటువైపు చూడుమని తెల్లటి వస్త్రం కప్పబడి ఉన్న గుడ్డను తొలగించి ఫోటో చూపించాడు. 

‘నేను ఫోటో ఎపుడు దిగలేదే? నా ఫోటో ఎక్కడది!’ అని ఆలోచిస్తుండగా...

 ‘‘ఈమె, మా అక్క రూహీ ఆపా’’ అని పరిచయం చేశాడు. 

 రమణీ వణికిపోయి ఒల్లంతా చెమటతో హాల్లోకి ఉరికి వచ్చి సోఫాలో చతికిల పడింది. 

‘‘ఇపుడు అర్థమయిందనుకుంటాను. మిమ్మల్ని రూహీ అని ఎందుకు పిలిచారో? మీరంటే ఎంత ఆపేక్షో....’’ అని చెబుతున్నాడు.

‘‘దయచేసి కారు తెప్పించండి. ఇంటి కెళ్ళాలి’’ 

సలీం రూహీ మొఖం చూసి ‘‘సరే’’ అంటూ డ్రైవర్‌కి కేకేశాడు. కారులో దబాలున కూర్చున్న రూహీ చెయ్యి ఊపుతున్న సలీంని చూడలేదు. రమణీ కాదు రూహీ ఆపా.


 3. వంశాంకురం :     అలీఖాన్‌ సంపన్నుడు. ఆలీఖాన్‌ కొడుకు ఇమ్రాన్‌ఖాన్‌ అభ్యుదయవాది. ఒకనాడు భోజనం చేస్తున్నపుడు నజ్మాని పెళ్లి చేసుకోవాలని ఆలీఖాన్‌ హుకుం జారీ చేస్తే తిండి మధ్యలోంచి వెళ్లి బెడ్రూంలో కుమిలిపోతాడు.

 ఓదార్చుతున్న తల్లితో నజ్మా పట్ల నాకా ఉద్దేశ్యం లేదు. నేను స్వంత చెల్లెలుగా భావించుకున్నాను. 

అంతలోనే ఆలీఖాన్‌ వచ్చి ‘‘చూడు బేటా! నీ దోస్తులు హిందువులని తెలుసు. వాళ్లు మేనమామ,  మేనత్త, చివరకు తోడబుట్టిన అక్క కూతుర్ని పెళ్ళి చేసుకుంటారు. మా తమ్ముడు చనిపోయేటపుడు, తన కూతురుని నీకు పెళ్లి చేస్తానని హామి ఇచ్చాను. నీవు పాటించాల్సిందే’’ అని వెళ్లిపోయాడు.

అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఏడాది తిరక్కుండానే కనడానికి నజ్మా హైద్రాబాద్‌ కి వస్తుంది. 

నొప్పులు తీవ్రమైనపుడు డా. దేశాయి కోరిక మేరకు బొంబాయి నుండి డా. అబిదాను రప్పించారు. అన్ని రకాల పరీక్షలు చేస్తుంది. ఉత్సాహంతో ఇమ్రాన్‌ ఖాన్‌ అడుగుతుంటే దాటవేస్తూ క్యాంటీన్‌లో, కార్లో, చివరకు ఎయిర్‌ పోర్ట్‌లో చెబుతానంటది. ఎయిర్‌పోర్ట్‌లో అన్ని విషయాలు డా. దేశాయికి చెప్పాను వెళ్లి కలువుమంటది.

ఆలీఖాన్‌కి వంశాంకురం కావాలని పట్టు. ఇమ్రాన్‌ఖాన్‌కు తన భార్య(నజ్మా) కావాలంటాడు. ఒక షరతు. మళ్లీ గర్భవతి కాలేదని చెప్పినా నాకు నజ్మానే కావాలంటాడు. కడుపు మసిలిపోతున్న ఆలీఖాన్‌ను అతని భార్య ఓదార్చింది. నజ్మా బతికి బయట పడ్డది. నజ్మాకు రాత్రింబగళ్ళు సేవచేస్తున్నాడు.

ఒకరోజు ఆలీఖాన్‌ నజ్మా తల్లిని పిలిపించుకున్నాడు. మనకు వంశాంకురం కావాలి. ఇమ్రాన్‌కు మరో పెళ్ళి చేస్త. నజ్మా మొదటి భార్యగానే ఉంటుందని చెపుతున్నపుడు నజ్మా తల్లి ఇంటికి పరిగెత్తింది. 

తల్లీబిడ్డలు అలుముకొని కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. 

 వచ్చిరాగానే మీ నాన్న పిలుస్తున్నాడని తెలుపగానే నజ్మా ఇంటి నుండి ఇమ్రాన్‌ ఖాన్‌ వెళుతాడు. తన తండ్రిని ధిక్కరించి నజ్మా ఇంటి వైపు వస్తుంటాడు. 

‘‘ప్రియమైన ఇమ్రాన్‌! నన్ను కంటికీ రెప్పల కాపాడుకుంటున్నావు. సంతోషం.నేనుండగా నువ్వు మరో పెళ్ళి చేసుకోవు. పెద్దనాన్న తన మాట నెగ్గించుకోవటానికి ఎంతకైనా తెగిస్తాడు. నేను మధ్యలో వచ్చాను. మధ్యలో పోతున్నా. నీ ఒళ్ళో కన్నుమూయాలని ఆశపడ్డ. నేనుండగా మరో పెళ్ళి చేసుకోవు నువ్వు. ఈ పాటికే పెద్దనాన్నకు ధిక్కరించి వచ్చే స్తుంటావు. చివరి ఊపిరి వరకు నిన్ను స్మరించే... నీ నజ్మీ’’ అంటూ లేఖ రాసి కొనఊపిరితో కొట్టుకాడుతది. మానసిక సంఘర్షణలను అంతర్గత దృక్కోణాలను అక్షరీకరిస్తాడు.


4. అదృష్టం: 

మనుషుల్ని విధిరాతలు ఎంత వరకు నియంత్రిస్తాయో, ఎంత వరకు ప్రభావితం చేస్తాయో తెలియజేసే మంచి కథ ‘అదృష్టం’ చదివితే అవగతమవుతుంది. 

వాసు, ఖాసీం ఇద్దరు చిన్నప్పటి క్లాస్‌మెట్‌లు. వాసుని ఖాసీం తన ఇంటికి తీసుకువెళ్తాడు. నీది అదృష్టంరా అని పరస్పరం అనుకుంటు ఉంటారు.  

ఖాసీం ఒక కథ చెబుతుంటాడు. ‘‘ఒక కలెక్టర్‌ సంతానం లేక ముగ్గురు పెళ్ళాలను చేసుకున్నాడు. చివరి భార్యకు ఆయనకు పాతికేళ్ళ తేడా. అదే ఆఫీసులో ఒక క్లర్క్‌ కోశాధికారంలోంచి పదివేలు డ్రా చేసి గుర్రాప్పందాల్లో ఖర్చు చేసి బందీ అవుతాడు. క్లర్క్‌ భార్య కలెక్టర్‌ కాల్లమీద పడి వేడుకోగానే సరే అని విడిపిస్తానని హామి యిచ్చినాడు. అతను ఆమెను మోసగించి జీడిమెట్ల ప్రాంతంలో అత్యాచారం చేస్తాడు. ఆమెను కారు ఇంటి వద్ద దించిపోతుంది. అవమాన భారంతో గాజులు దంచుకొని తాగి చనిపోతుంది. భార్యను చూసి భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పిల్లాడు అనాధగా మిగిలాడు.

      ఈ విషయం తెలుసుకున్న చిన్న భార్య బాధ భరించలేక కలెక్టర్‌ వేటకు పోయి పులివాత పడ్తాడు. బేగం సాబ్‌ సంతాన హీనురాలు కాబట్టి ఆస్తికి వారసురాలు కాదు. పెళ్ళికి తన భర్త రాసిచ్చిన ఆస్తి తనకు చెందాలని నిర్ణయం తీసుకుంది. ఆస్తి ఇవ్వలేదని అత్తింటిపైన, నా జీవితం నాశనము చేశారని తల్లి గారికి చిల్లి గవ్వ చెందకూడదనుకుంటది. మా మతంలో దత్తత లేదు. ఆసర్రాప్‌(క్లర్క్‌) కొడుకును పెళ్ళాడింది.’’ 

మధ్యలో కల్పించుకొన్న వాసు ‘‘మరి వయసు?’’ అని అడిగాడు. 

‘‘ఏమంత పెద్దది గాదు, పది పన్నెండేడ్లు తేడా. అది మా మతంలో నిషిధ్దం కాదు.’’

ఇంతకీ ఈ కథ ఎందుకు చెబుతున్నావు అని  వాసు అడిగాడు ఇంకా అర్థం కాలేదా? ఆ అనాధను నేను. ఆమె నా భార్య. ఇప్పుడు చెప్పు నువ్వు అదృష్టవంతుడివా? నేనా? అంటున్నపుడు కాసీం కళ్లునిండాయి.


5. విముక్తి కథ:

నేను ఎలాగు ఉంటే ఏమిటి? నాకు శీలవతి అయిన భార్య కావాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు.  కానీ అందుకు విరుద్ధంగా, వాస్తవంగా జీవించడానికి కొందరే ఇష్టపడుతుంటారు. అలాంటివారే అభ్యుదయవాదులు. సంపన్నులైన ముస్లింలు పెళ్లికి ముందు దాసీల జీవితాలను నాశనము చేస్తున్న విధానాన్ని తులనాడుతూ అభ్యుదయవాదులు ఏవిధంగా అండగా నిలుస్తున్నారో తెలుపడానికి ఆధారం ‘విముక్తి కథ.’ ఇందులో రచయిత మంచి చెడు రెండు కోణాలను ఆవిష్కరిస్తాడు.

బేగం సాహేబ్‌ యాజమానురాలు. తన పెద్ద కుమారునికి పెళ్లికి ముందు జగ్గును పంపి సిరాజ్‌తో సృష్టికార్యం జరిపిస్తుంది. ఈ తంతును గమనించి ఉన్నత చదువు చదివిన అన్న సిరాజ్‌ ను నిలదీస్తే అందరిచేత సుల్తాన్‌ ఎక్కిరించబడ్డాడు. జగ్గు గర్భం ధరించింది. జగ్గు జీవితం నాశనమైంది. 

      తమ ఇల్లలో దాసీలను ఆట వస్తువులుగా వాడుకునే ఆచారాన్ని పటా పంచెలుచేయ్యాలనే ఆలోచన తట్టింది. ఇస్లాం చరిత్రలో ఎం.ఏ పూర్తి చేసుకొని ఇల్లు చేరాడు సుల్తాన్‌.     

సీరాజ్‌కు చేసినట్లే సుల్తాన్‌కు షీరాతో సృష్టి కార్యం చేయించాలనుకున్నారు. సుల్తాన్‌ తిరస్కరించాడు. తెల్లారి అక్క భర్త షౌకత్‌ వచ్చి ఏం. ప్రొఫెసర్‌ గారు నిన్న నీకోసం షీరాను పంపితే వద్దన్నావేంది? దాన్ని అంతంగా అలంకరించింది. మీ అక్కయ్యే అని చెపుతున్నపుడు. షీరాతో నా పెళ్ళి జరిపించమన్నాడు. ‘‘ఆహ్హాహ్హ’’ అని హేళనగా నవ్వి అది దాసిది. 

 కోపంతో ‘‘వెళ్ళిపో నా గదిలోంచి’’ అని వెళ్ళగొట్టాడు. కుటుంభ సభ్యులందరిలో సుల్తాన్‌ పలుచనయ్యాడు. పరిస్థితులను తనకనుకూలంగా మలుచుకోవాలని నిశ్చయించుకున్నాడు.

అక్కకు తప్పైందని చెప్పి బావను బతిమాలాడు. అమ్మను బుజ్జగించాడు. పరిస్థితులు సద్దుమణిగాయి. షీరాతో రోజు స్వర్గసీమలో తేలియాడుతున్నాడు. పదో రోజున ప్రొఫెసర్‌ నుంచి లేఖ వచ్చింది. ఆలీఘడ్‌ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా డ్యూటీలో జాయిన్‌ అవ్వమని ఆ లేఖ సారాంశం. 

అమ్మ ఇంకొక్క కోరిక ఆగ్రా, అజంతా, ఎల్లోరా చూస్తానమ్మా! అని అడిగినపుడు సరే అంటుంది. అమ్మ దాసి దాన్ని షీరాను పంపవా? దాసీయే కదా సరే అని తల్లి తనకొడుకు సంతోషాన్ని కాదనలేకపోయింది. సుల్తాన్‌, షీరా ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోతూ ఒక ఉత్తరం రాసాడు.

‘‘అమ్మకు పాదాభివందనాలు, మన దుర్మార్గపు నవాబు ఆచారాల నుంచి బయటపడ్డాను. రెండవది నేను పెళ్ళి చేసుకున్నాను. నువ్వు నాకోసం పెంచి పెద్ద చేసిన షీరా నీ కోడలు. మమ్మల్ని వెతకొద్దు. షీరాను చిన్నకోడలుగా స్వీకరించే రోజున తప్పకుండా వస్తాము." లేఖలో నివేదించి వెళ్ళిపోతాడు.


6. కేవలం మనుషులం: 

మానవత్వమే మహోన్నతమనీ తెలియజెప్పే కథ ‘‘కేవలం మనుషులం’’ కథ. కవల్‌, బిల్కిస్‌లు ఇద్దరు వైద్య విద్యార్థులు ప్రేమలో పడతారు. పెళ్ళికి ఒప్పుకుంటారు. కాని మా మత ప్రకారం పెళ్ళి చేయాలని అటు హిందువులు, ఇటు ముస్లిం పెద్దల వాదులాటతో పెళ్లి పెండింగ్‌లో పడ్డది. చెప్పా పెట్టకుండా మారేజ్‌ ఆక్ట్‌ ప్రకారం నెల రోజుల గడువు కూడా పూర్తయింది. మారేజ్‌ పూర్తి అయింది. మేము పెళ్ళి చేసుకున్నాం. మా దృష్టిలో మతం వ్యక్తిగత విషయం. పెళ్లి సామాజిక వ్యవస్థ. మానవత్వమే మతం. మానవ సేవే ధ్యేయం. మేం కేవలం మనుషులమని స్నేహితుల మధ్య ప్రమాణం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. మతాల సరిహద్దులని చెరిపిన స్నేహం, పెళ్ళిగా మార్చుకున్న ఆదర్శం.


7.ప్రతీకారం

నవాబ్‌ సాబ్‌, నవాబ్‌ సాబ్‌ బేగం దంపతులు వీరి కొడుకు నవాబ్‌ పాషా. లచ్చుబాయి వంట మనిషి. ఈమె.... కొడుకు పాషు. లచ్చుబాయి నవాబ్‌ పాషాకు పాలు పట్టింది.  నవాబ్సాబ్ లచ్చుబాయి కొడుకు పాషు.

బేగం నవాబ్‌పాషా తల్లీ కొడుకులు ఎప్పుడు అవమానిస్తుంటారు. పాషు తల్లితో ఇంత అవమానంతో ఇక్కడ జీవించటమెందుకంటే 

తల్లీ లచ్చుబాయి ‘‘కర్మరా బాబు కర్మ’’ అని ఎప్పట్లాగే చెప్పి బాధ పడ్తది.

వంట మనిషిగా ఉన్న లచ్చుబాయి దగ్గుతూ నెత్తురుకక్కినపుడు ఆమెను ఇంట్లోంచి తరిమేస్తారు. హకీంసాబ్‌ అను వైద్యుడు వైద్యం చేస్తుంటాడు. రోజూ ఆయాసంతో బాధ పడ్తుంటది. పాషు రాత్రంతా మేలుకుంటాడు.

ఒక రోజూ రాత్రి నవాబ్‌ సాబ్‌ లచ్చూబాయితో గుసగుసలాడుతూ ‘‘త్వరలో నీకు నయమై పోతుంది. మంచి వైద్యం చేయిస్తాను’’ అని భరోసా చెబుతున్నపుడు పాషు గురించి అడుగుతది..

 ‘‘పాషు పాషు గురించి నువు నిశ్చితంగా వుండుమని’’ చెప్పి వెళ్లిపోతున్నపుడు పాషుకు మెలుకువ వస్తది. తెల్లారె సరికి లచ్చుబాయి చనిపోయింది. 

లచ్చుబాయి హిందువా? ముస్లిమా? దహనం చేయాలా? ఖననం చేయాలా? అని చర్చిస్తున్నపుడు ఏడుపు ఆపి వింతగా వింటున్నాడు పాషు. బుడన్‌ఖాన్‌తో సహా అందరు నిఖా చేసుకుంది కాబట్టి ముస్లిమని తీర్మానించారు.   బాబాను అడిగి తన గతం గురించి తెలసుకుని బాధపడ్తాడు పాషు. తానే నవాబ్‌ పెద్ద కొడుకునని నిర్దారించుకుంటాడు. నవాబ్‌ సాబ్‌ మంచాన పడ్డపుడు పాషు పరపతి పెరిగింది గుడ్డిరాణితో నవాబు పాషాకి పెళ్ళి జరిగింది.

చమ్కీ అను దాసి అన్నం తెస్తే చల్‌ పో అని పాషు వెళ్లగొట్టిండు. చీకట్లో ఆకలితో మెలుకువ వచ్చింది. మృదువైన వేళ్లతో నోటికడ్డంగా పెట్టి పాషును లేవనివ్వలేదు గుడ్డిరాణి. 

‘‘ఏ గుడ్డిరాణీ నవాబ్‌ పాషా?’’ అని అనగానే వాడో నపుంసకుడు(హిజ్రా) అని చెప్పింది. 

‘‘నవాబ్‌ పాషా...! నవాబ్‌ పాషా!! గెలుపు నాదే! గెలుపు నాదే!! గుడ్డిరాణి(దుల్హాన్‌ పాషా)ని కబంధ హస్తాల్లో కసిగా బంధించాడు. దాంతో ప్రతికారం తీర్చుకున్నాడు పాషు. 

 కథా సంపుటిలో మొత్తం 11 కథలు కలవు. పసిడి బొమ్మ, ‘అలవాటు’, ‘అభిమానం’, ‘పరీక్ష’ ‘అక్కయ్య పెళ్ళి’ కథలు, మానసిక కథలు, సంఘర్షణాత్మకంగా చిత్రించబడ్డాయి. ‘ఆఖరి కానుక’, ‘పరీక్ష’ ‘అతిథి’, ‘భరోస’.....మొదలగునవి అన్ని వివిధ పార్శాలను ప్రతిబింబించాయి.


- డా. సిద్దెంకి యాదగిరి 9441244773.

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...