సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

bhagya reddy varma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhagya reddy varma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2023, మంగళవారం

6. భాగ్యోదయం - భాగ్యరెడ్డి వర్మ


  6. భాగ్యోదయం

వీడియో పాఠాలు 

భాగ్యోదయం   



భాగ్యోదయం 2 


పాఠ్యాంశ వివరణ:

 

 

(భాగ్య+ఉదయం =. భాగ్యోదయం - అ కారానికి ఉ పరమైనపుడు ఓ వచ్చింది. అ కారానికి ఇ,ఉ,ఋ లు పరమైనపుడు వరుసగా ఏ,ఓ,అర్ లు ఏకాదేశ మవుతాయి. ఏ,ఓ,అర్ లు వ్యాకరణ పరిభాషలో గుణములు. గుణములు ఎకాదేశంగా వచ్చే సంధి గుణసంధి.)

   ఉదయం అనగా వృద్ధి, సృష్టి, పుట్టుక, పైకివచ్చుట, ఉన్నతి, పొద్దుపొడుపు అని మొదలైన అర్థాలు గలవు. భాగ్య అనగా అదృష్టము, సుకృతము, శుభకర్మను అనుభవించుట మొదలైన అర్థములు కలవు.


   “ఒక క్రమములో భాగ్యోదయం అనగా అదృష్టము వలన పొందిన ఉన్నతి అని చెప్పవచ్చు.” కానీ వాస్తవానికి ఈ పాఠము భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో సంమజ ఉన్నతికి చేసిన కృషి గురించి వివరించే జీవిత చరిత్ర ప్రక్రియకు చెందిన వ్యాసము.


ప్రక్రియ పరిచయం

   ఈ పాఠ్యభాగం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి జీవిత విశేషాలను ఇతరులు రాయడం. జీవిత చరిత్ర ప్రక్రియను ఆంగ్లములో బయోగ్రఫీ అంటారు.


కవిపరిచయం:    కృష్ణస్వామి ముదిరాజ్
   ఈ పాఠ్యభాగ రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. 
భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన ‘భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర’   గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం.   


 
 జననం: 25-8-1893        మరణం:15-12-1967
రాజకీయ వేత్త,         స్వాతంత్ర్య సమరయోధుడు,    జర్నలిస్ట్, సమాజ సంస్కర్త.
 

 

1957 లో హైదరాబాద్ నగరమేయర్ గా ఎన్నికై నగరాభివృద్ధికోసం రాబోయే ముప్ఫైఏండ్ల అవసరాలకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేసిన దార్శనికుడు.
 ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించాడు.
 హైదరాబాద్ నగరాన్ని చాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు.

   1948లో ఉర్దూలో ‘హైదరాబాద్-కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.

భారత ప్రభుత్వంచే ‘భారత స్వాతంత్రోద్యమ చరిత్ర’ రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు.

“తన మిత్రుడు భ్యాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసాడు.”

 

నేపథ్యం/ఉద్దేశం:

స్వయంకృషి, ఆత్మ విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. స్వార్థం పెరిగి పోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

I. అవగాహన ప్రతిస్పందన: 



II. వ్యక్తీకరణ - సృజనాత్మకత 

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి 

అ)చదువుకుంటే కలిగే లాభాలను తెలపండి

జ. చదువుకుంటే కలిగే లాభాలు: విద్య వలన వినయ, విధేయతలు, సంపదలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. చదవడం వలన విచక్షణాత్మక నిర్ణయం చేసి మంచి నిర్ణయం తీసుకుంటాం. మంచి చెడులను బేరేజ్ వేస్తాం. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం అవగతమవుతుంది. దురలవాట్ల వలన కలిగే నష్టాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చదువుకున్న వారికి ఉపాధి, ఉద్యోగం దొరుకుతాయి. పనిలో నైపుణ్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం అభివృద్ధి కావడం వలన తనమీద తనకే నమ్మకం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకో గల సామర్థ్యం లభిస్తుంది. చదవడం వలన మనిషి పరిపూర్ణవంతుడు అవుతాడు.

ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి?

జ. సమానత్వం రావాలంటే...:

సమాజంలో అందరికీ సమాన హక్కులు లభించాలి. అందరూ చదువుకోవాలి. చదువుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్కాలర్షిప్లు మొదలైనవి చేయూతునివ్వాలి. భూమిలేని వారికి భూమిని పంచాలి. నిరుద్యోగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందజేయాలి. అందరి మధ్య చిన్నతనం నుండే సమభావన కలిగించాలి. మూఢ నమ్మకాలను తొలగించాలి. హేతువాద శాస్త్రీయ దృష్టి పెంపొందించాలి. చైతన్యం కలిగించాలి. అందరిలో ఆ సుమానతలు తొలగించి సమానత్వం పెంపొందించాలి. అప్పుడే నవ సమాజం ఏర్పడుతుంది.

 ఇ) అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి?
 
జ. అంకితం అనగా చేసే పని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండడం. అంకితభావం అంటే పూర్తిగా వశమైనట్లు భావించడం. అంకితభావంతో పనిచేయడం అంటే పూర్తిగా పనిలో మునిగిపోవడమే. ఏమి ఆలోచించకుండా పని గురించి ఆలోచించడం, ఆచరించడం అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే అంకితభావం. ఫలితాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేవరకు శ్రమించడమే అంకితభావం. అలా చేయడాన్ని అంకితభావంతో పనిచేయడం అంటారు.


ఈ) వ్యసనాల వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

జ. వ్యసనం విరామం లేని అలవాటు. అలవాటు అంటే అదే పనిగా చేసే పని. విషనాలలో సద్వసనం మంచిది. దుర్వసనం లవాటయితే బతుకు దుర్భరమైపోతుంది. అనారోగ్యం బారిన పడతాము. ఆర్థిక ఖర్చులు పెరిగిపోతాయి. అప్పులు ఎక్కువ అవుతాయి. గొడవలు పెరుగుతాయి బంధువులు స్నేహితులు చుట్టాలు అందరూ దూరమవుతారు ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. మరణం కూడా సంభవించవచ్చు. అందుచేత చెడు వ్యసనాలను, చెడు వ్యసనాలలో చిక్కుకుపోయిన వారిని చైతన్యపరిచి చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడమే మన ధర్మం. మన కర్తవ్యం కూడా.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలు జవాబులు రాయండి.

అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదలడానికి మీరేం చేయగలరు?

జ. మన చుట్టూ సమాజం ఉంటుంది సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు అందరూ బాగుండాలి అప్పుడే అది మంచి సమాజం అని పిలవబడుతుంది మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్ధాలను వివరించకుంటే ప్రాణాలకే హానికరంగా మారుతాయి చెడు అలవాట్లను మాన్పించడానికి మనం కృషి చేయాలి. భక్తి మంచిదే కానీ శకునాలు చూడడం అతి భక్తి పేరు చెప్పి రోజులకు రోజులు ఉపవాసాలు ఉండి ఆరోగ్యాన్ని కోల్పోవడం మంచిది కాదు అని వివరించాలి. నిమ్మకాయలు కోడి గుడ్లు, కర్రె కోళ్లు మొదలైనవి చెడు చేతబడి లేదని వివరిస్తాము. అనారోగ్యం కలిగినప్పుడు వైద్యం వద్దకు వెళ్లాలి. మంత్ర శక్తులు అనే పేరు చెప్పి భూత వైద్యుల వెంట పోవడం వలన చికిత్స తీసుకోవడం మూలంగా మరింత అనారోగ్యం పాలవుతారని తెలియజేస్తాము.

జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రదర్శనలు, ఉపన్యాసాలు ఇప్పిస్తాం. ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం. మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని మూఢనమ్మకాల నుండి విముక్తి చేస్తాం. శశాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేసి మూఢనమ్మకాలు లేని గ్రామంగా మమ్మల్ని మేము ప్రకటించుకుంటాం.


(లేదా)

ఆ) భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృష వివరించండి.

జ. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషి: ఆది హిందువులు అనుభవిస్తున్న అనేకమైన దురవస్థల నుండి వారిని దూరపరచడానికి భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలాన్ని అంకితం చేశాడు. తన అంకితభావం వలన అనేక కుటుంబాలు వాస్తవ స్థితికి వచ్చాయి.  తమ దృష్టికి కారణం తమ అజ్ఞానం అవిద్య, ఉదాసీనత  అనే విషయాన్ని భాగ్యరెడ్డి వర్మ గారు తన ప్రసంగాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా వారు అర్థం చేసుకునే విధంగా చేశారు. మానవులలో ఎక్కువ తక్కువలు లేవని అందరూ సమానమేనని తెలుసుకునేలా చేశారు. తన జీవితకాలంలో 3348 ప్రసంగాలు ఇచ్చి ఆది హిందువులను చైతన్య పరచడమే కాకుండా దేవదాసి మురళి వేశ్య సంప్రదాయాలను రూపుమాపాడు.

ఆది హిందువులకు చదువుపై శ్రద్ధ కలిగించాడు. పాఠశాలలు నడిపించాడు. తాగుడు మొదలైన దురలవాట్లను మాన్పించాడు. మూఢాచారాలను తొలగించాడు. ఆటపాటల ప్రదర్శన నిర్వహించి వారిలోని బలమైన ఆకాంక్షలను వెల్లడి చేశాడు. ఆది హిందువులకు ప్రభుత్వం అండగా నిలిచేలా కృషి చేశాడు. 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా ఇట్లా ఈ సమాజం కోసం పాటుపడిన వాళ్లలో ఎవరి గురించైనా 'అభినందన' వ్యాసం రాయండి.

జ.  మదర్ థెరిసా పేరు మానవత్వంతో పెనవేసుకుపోయింది. మదర్ థెరిసా, గొప్ప మానవతావాది, ఆగస్టు 27, 1910న భారతదేశంలో జన్మించారు. ఆమెకు పుట్టినప్పుడు ఆగ్నెస్ అనే పేరు పెట్టారు.

పేదలు, నిరుపేదలు మరియు వెనుకబడిన వారికి సహాయం చేయడానికి మరియు సేవ చేయడానికి ఆమె 1వ మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించారు. ప్రజలకు సహాయం చేయడంలో ఆమె చేసిన సేవ మరియు నిజమైన భక్తి ఫలితంగా ఆమెకు ఇటలీలో పోప్ బిరుదు లభించింది.

పాడుబడిన మరియు అనాథలైన వేలాది మంది పిల్లలు ఆమెలో మోక్షాన్ని పొందారు. నిరుపేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయడం దేవునికి సేవ చేయడం, కరుణ మరియు ఆప్యాయత తన ఉద్దేశ్యానికి మూలస్తంభాలు అని ఆమె పేర్కొన్నారు. నిరుపేదలు మరియు పిల్లల సంక్షేమం కోసం ఆమె పట్టుదల మరియు నిబద్ధత కోసం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

మదర్ థెరిసా తన పనికి అనేక బహుమతులు అందుకుంది మరియు వాటిలో కొన్ని:

  1. 1980: భారతరత్న
  2. 1979: శాంతి నోబెల్ బహుమతి
  3. 1973: టెంపుల్టన్ ఫౌండేషన్ అవార్డు
  4. 1972: శాంతి కోసం జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు
  5. 1962: రామన్ మెగసెసే అవార్డు
.


లేదా 

నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి

ఇతడు వాకాడులోను చుట్టుపక్కల గ్రామాలలోను అనేక సంస్థలు నడిపాడు. వాటిలో కొన్ని

  • నేదురుమల్లి వెంకటరెడ్డి మెమోరియల్ బేసిక్ ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల
  • హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘము
  • హరిజన విద్యార్థి వసతి గృహము
  • ఎల్లశిరి ఫిర్కా హైస్కూలు
  • ఎస్.ఎ.ఎల్.సి. ఉన్నత పాఠశాల
  • ఆంధ్ర విద్యార్థి శరణాలయము
  • డి.ఇ.ఎల్.మిషన్ స్కూలు
  • సీతమ్మ పారిశ్రామిక పాఠశాల
  • కాళిదాస బాలుర వసతి గృహము

మొదలైనవి. 


లేదా 

రోమ్ చాను షర్మిల కవయిత్రి మరియు మానవ హక్కుల కార్యకర్త. 1972 మార్చి 14న నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె హైస్కూల్‌ను పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. పది మంది మాలోమైట్‌ల హత్యల ద్వారా ఆమె చాలా తీవ్రంగా హత్తుకుంది, ఆమె బలవంతంగా భావించింది. సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA)ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె 5 నవంబర్ 2000న తన 16 ఏళ్ల నిరాహార దీక్షను ప్రారంభించారు.

AFSPA భారత సాయుధ దళాలను వారెంట్లు లేకుండా శోధించడానికి అనుమతిస్తుంది. ఆమె నిరాహారదీక్ష ప్రపంచవ్యాప్త ట్రెండ్‌గా మారింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంకితభావం గల మహిళలను మానవ హక్కుల కోసం పనిచేయడానికి ప్రేరేపించింది.

మణిపూర్ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల 5,757 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఎట్టకేలకు తన ఏడాది నిరాహార దీక్షను ముగించారు. చాలా మంది యువ కార్యకర్తలు ఆమె ఉపవాసం నుండి ప్రేరణ పొందారు.

సంబంధిత కథనం: అలాగే, దేశం అభివృద్ధికి సహకరించిన ఇతర మహిళల గురించి కూడా చదవండి. అటువంటి మహిళల గురించి తెలుసుకోవడానికి లింక్ చేసిన కథనాన్ని తనిఖీ చేయండి.

  1. భారతదేశ మహిళా జాతీయ నాయకులు
  2. భారతదేశంలో తెలియని మహిళా స్వాతంత్ర్య సమరయోధులు
  3. మహిళా స్వాతంత్ర్య సమరయోధుల ప్రసిద్ధ నినాదాలు
  4. మొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు
  5. అరుణా అసఫ్ అలీ స్వాతంత్ర్య సమరయోధురాలు
పై మూడింటిలో ఒకటి మాత్రమే రాయగలరు.

III. భాషాంశాలు

పదజాలం:

1. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి. అ)అండ : ఆధారం ఆదరువు ఆలంబన ఆసరా ఆశ్రయం

          అ) అండ :  ఆధారం, ఆదరువు, అలంబనం, ఆసరా, ఆశ్రయం 

ఆ)ఉన్నతి : గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి

ఇ)స్వేచ్ఛ:  స్వచ్ఛందము, అలవోక, స్వతంత్రత, స్వాతంత్ర్యం.

ఈ) వికాసం : వికసనం, ప్రఫల్లం, వికసించడం, అభివృద్ధి చెందడం.


2. కింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. అ)ఏకతాటిపై : మనమంతా ఏకతాటిపై నిలవాలి.

అ) ఏకతాతిపై: మనమంతా దేశం కోసం ఏకతాటిపై నిలవాలి. 

ఆ)మచ్చుతునక : తెలంగాణ వైభవానికి సిద్దిపేట ఒక మచ్చుతునక.

ఇ)మహమ్మారి : నేటికీ వరకట్న మహమ్మారి కలదు.

ఈ) నిరంతరం : విద్యార్థులు నిరంతరం విద్యపై దృష్టించాలి.


3. కింది పదాలను పదబంధాలను వివరించి రాయండి 

అ)అంకితం కావడం : చేయదలచుకున్న పని యందు తప్ప వేరే ఆలోచన లేకపోవడం

ఇ) నైతిక మద్దతు : ధన సహాయం మొదలైన చేయలేకపోయినా కనీస బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించడం.

ఇ) చిత్తశుద్ధి : మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించడం 

ఈ) సాంఘిక దురాచారాలు: సంఘ పరమైన చెడు ఆచారాలు.

ఉ) సొంత కాళ్లపై నిలబడడం: ఇతరులపై ఆధార పడకుండా జీవించడం.


వ్యాకరణాంశాలు:

ప్రత్యక్ష కథనం

కింది వాక్యాలను పరిశీలించండి

అ) "అక్కా ! ఆ చెరువు చూడు"

ఆ)"నేను రాన్రా తమ్ముడు"

ఇ) "పిల్లలూ ! రేపు బీర్ పూర్ జాతరకు వెళ్తున్నాను"

ఈ) "మేమూ వస్తాము సర్"

పై వాక్యాలను పరిశీలించారు కదా పై వాక్యాలు నేను మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి కదా ఇట్లా ఉత్తమ పురుషులను వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లు ఉంటాయి కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు (" ") ఉండాలి.

కింది ఉదాహరణలను పరిశీలించండి.

అ)"మనుషులంతా పుట్టుకతో సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు" అన్నాడు భాగ్యరెడ్డి వర్మ 

ఆ) రుద్రమదేవితో తల్లి నారాంబ "నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావిచక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి కానీ కన్నీళ్లు ఉండకూడదు" అన్నది.

సారాంశం:

భాగ్యరెడ్డి వర్మ 1888లో జన్మించాడు. 

   ధర్మ శాస్త్రాలు చరిత్ర ను బాగా అధ్యయనం చేసి సమాజంలో ఉండే కుల వ్యవస్థ దాని నిజ స్వరూపాన్ని అవగతం చేసుకుని, అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకుని, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించాడు. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు చేపట్టాడు.


   ఏమీ ఆశించకుండా చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల తో పని చేశాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేసాడు. నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం వలన కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయ మయ్యాయి.

   సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొని ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో వివరించి చెప్పి తాగుడు మాన్పించాడు.

  ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిలభారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో అనేక సభలలో పాల్గొని 3,348 ఉపన్యాసాలు ఇచ్చి, అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేసాడు.

 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది-హిందూ యువతీ యువకులు సువర్ణ యువతీ యువకుల తో సమంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మాడు. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది.












           




అదనపు సమాచారం 

భాగ్యరెడ్డి వర్మ జీవితము సాహిత్యము

బహుజన స్పూర్తి ప్రధాతలు జాతీయ సదస్సు november 2022

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్ సిద్దిపేట.  

          ఒకటి భాషాపరమైన వివక్ష. రెండోది మనుషుల మధ్య వివక్ష. వివక్ష మనుషుల్ని విభజిస్తూ రాజ్యమేలుతున్న కాలంలో ఒక విత్తు మొలకెత్తుతూనే వివక్షలేని సమాజాన్ని వాగ్ధానం చేసింది. ఆ విత్తు నేలలో పడగానే చీమలు, పెరుగుతున్నపడు పశువులు, ధ్వంసం చేయాలనుకున్నా మొక్కయి ఎదిగి, పాదు అయి పూచి, మధుర ఫలాలను అందించింది. ఎదగడమే ఉద్యమంగా బతుకుతూనే భిన్న సంస్కృతులకు ఎదిగి పూచిన పాదైంది. అందరికీ నీడనిచ్చింది. కలగన్న స్వప్నం సాకారం కోసం జీవితాన్ని అంకితం చేసింది. ఆ విత్తనమే మ్యాదరి వెంకయ్య భాగ్యరెడ్డి వర్మ. వారి అసలు పేరు మ్యాదరి భాగయ్య.

          మ్యాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 మే, 22న హైదరాబాద్‌లో భాగయ్య జన్మించాడు. అంటరాని కుల పంకిలంలో జన్మించినా చిన్నతనంలోనే వివక్షను అనుభవించాడు. ఏ వివక్షను అవమానంగా అనుభవించాడో ఆ వివక్షను రూపుమాపాలని కంకణం కటుకున్నాడు. కడదాక నిబద్దుడై జీవించాడు. ఫలితం కోసం పరిశ్రమించారు.


          బాల్య దశ: పువ్వు పుట్టగానే పరిమళించినట్లు విద్యా సుగంధాలను అద్దుకున్నాడు. చిన్నతనంలో తండ్రి చనిపోయాడు. అప్పటి వరకున్న బాల్యం కష్టాల కొలిమిలో కూరుకపోయింది. సమస్యలు వెంటబడ్డాయి. కన్నీళ్లు వేధించాయి. కనికరంలేని కాలం అగ్నిలో పడినా బతుకు సువర్ణ భూషితమైంది. వారి అంకితభావం వజ్రానికి మారుపేరైంది. ఆదర్శంగా నిలిచింది. దీపధారిలా తోవ చూపింది.

          భాగయ్య అందరిలాంటి వాడు కాడు. ఆశాజీవి. సంక్షోభంలో సంకల్పం వదులుకోలేనితనం. అంకుఠిత దీక్షా దక్షతలు వారి పుట్టు వన్నె. ఆశయమే పెట్టువన్నెగా బరిలో నిలిచిన సుచరిత వారిది. తల్లి నడిపే చిన్నపాటి కిరాణం మీద పిల్లలందరు చదువుతున్నారు. భాగయ్య ఆలోచనలు కుటుంభం చుట్టూ, సమాజం చుట్టూ తిరిగాయి. పసివయసులోనే కుటుంభానికి భారం కావొద్దనీ టెన్నీసు కోర్టులో బంతి అందించే కుర్రవాడిగా పనిలో చేరాడు. బాల్యదశలో రావిచెట్టు రంగారావుగారనే బ్రాహ్మణుడు వీరి విద్యాభ్యాసానికి చేయూతనిచ్చాడు.

          బాగయ్య చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఎక్కువ. చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవాడు. తార్కికంగా ఆలోచించేవాడు.  వీరి ఇంటికి శైవమత గురువు తరుచూ వచ్చి బోధనలు చేసేవారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు. వీరు రాక ముందు ఆయన అంటరానివారుగా చూడబడుతున్న దళితులు పాలకులుగా వుండేవారు. రెడ్డిఅన్న పదం రేడు నుండి వచ్చింది. రేడు అనగా పాలకులు అని అర్థం చెప్పేవాడట. తన కుల గురువు చెప్పిన విషయాలు బాగయ్య మనసులో ఎంతగా నాటుకు పోయిందంటే వాటిని నిజ జీవితంలో ఆచరించే స్థాయికి తీసుకెళ్లింది. మా పూర్వీకులు పాలకులే కదా! నేను పాలకుడిని ఎందుకు కాకూడదు?’ అని ఆయనకు ఆలోచన తట్టింది. ఆ విధంగా పేరుకు వెనుక రెడ్డి పెట్టుకున్నాడు.

          సామాజిక న్యాయం తపించిన మహాత్మ జ్యోతిరావ్‌పూలే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాగయ్య అంబేద్కర్‌ కన్న ముందే దళితుల కోసం పాటుపడ్డారు. సమస్యలకు పరిష్కారం చూపారు. నిమ్న వర్గాలలో ఆత్మగౌరవాన్ని పెంపొందించాడు. మేం పంచములం కాదు. ఈ దేశ మూలవాసులమని ఆదిహిందువులమంటూ ఉద్యమానికి నాంది పలికారు.

          భాగ్యరెడ్డివర్మ హరిజనోద్ధరణకు కంకణబద్ధుడైనాడు. దేవదాసి, జోగిని, ముర్లి మొదలైన దుర్మార్గపు సంప్రదాయాలపై తిరుగుబాటు శంఖం పూరించాడు. అందుకు తగిన కార్యాచరణను ఎంచుకున్నాడు. అందుకోసం తన్ను తాను చెక్కుకున్నాడు. వెలివేయబడిన జీవితాలకు వెలుగునిచ్చాడు. భాగ్యరెడ్డి ఆచరణవాది. కార్యశీలి. మేల్కొల్పడానికి గొంతులేనోల్ల గొంతుకగా మారాడు. బలహీనుల బలమైన బలంగా రక్షణ నిలువాలనుకున్నాడు. తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ భాషలలో అనర్గళంగా వాదోపవాదాలు చేశాడు.

          హరిజనవాడలను సందర్శించాడు. వారిలో ఒకడిగా మిళితమయ్యాడు. కలుపుగోలుగా మమేకమయ్యాడు. వారు చైతన్యవంతులుగా చేయటానికి తన జీవితాన్ని అంకితం చేసాడు.  

          వర్మ పదునెనిమిదవ యేట విద్యావంతురాలైన లక్ష్మిదేవితో 1906లో వివాహమైంది. ఆమె రెడ్డి కులస్తురాలు. మొటాటి ఎల్లారెడ్డి కూతురు. కామారెడ్డి పట్టణ వాస్తవ్యరాలు. వీరి ఏకైక పుత్రుడే ఎం. బి. గౌతమ్‌. లక్ష్మిదేవి మార్చి 4వ తేదీ 1987లో మరణించింది1.

 

ప్రజా జీవితం: భాగ్యరెడ్డి ప్రజాజీవితం పద్దెనిమిదేళ్ల వయస్సు అనగా టీనేజీలోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. స్వామి అత్యుతానందతోపాటు కలిసి ఆదిహిందూ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోసాగాడు భాగ్యరెడ్డివర్మ. విద్య యొక్క ప్రాశాస్త్యాన్ని గుర్తించిన భాగ్యరెడ్డి చదువుకు ప్రాముఖ్యత నిచ్చారు. విద్య వలన మనసు వికాసం చెందుతుందని నమ్మకం కలిగించేవారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగులా ఉపయోగపడుతుందని ఉపదేశించేవాడు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపడానికి బాగ్యరెడ్డి వర్మ 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యా బోధన గావించడం కోసం హైదరాబాదులోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడు.

          జీవితాలు మారాలంటే చదువే ఆయుధమని తలంచాడు. అజ్ఞానంపై సమరం సాగించాడు. అట్టడగు బతుకులలో ఆశలు నింపాడు. ఆశయాలుగా మార్చాడు. విద్యావశ్యకతను అందరికంటే అధికంగా ఆది హిందువులకే అవసరమని 1911వ సంవత్సరంలో మన్య సంఘంగా మార్చాడు.

 

           1938నాటికి ఆది హిందూ పాఠశాలల సంఖ్య 26కి పెరిగాయి. విద్యార్థుల సంఖ్య 2500గా నమోదై ఉంది. తొలిదశలో దక్కన్‌ హుమనిటేరిన్‌ లీగ్‌(జీవ రక్షక జ్ఞాన్‌ ప్రచార మండలి) పాఠశాలల నిర్వహణకు నిధులు సమకూర్చేది. ఉదార స్వభావం కలిగిన అగ్రకుల హిందువులు, ఇతరులు విరాళాలు సమకూర్చేవారు. అప్పటి హైకోర్టు న్యాయమూర్తి రాయ్‌ బాలముకుంద్‌, ఆయన కుమారుడు బారిస్టర్‌ రాయ్‌ కిషన్‌, ధర్మవీర్‌ వామన్‌ నాయక్‌ జాగీర్ధార్‌, రాజా ప్రతాప్‌ గిరీజీ. న్యాయమూర్తి ఆర్‌. ఎస్‌ నాయక్‌ వెన్నుదన్ను నిలిచి సహాయ సహకారాలు అందించారు.

          భాగ్యరెడ్డి స్మారకంగా 1943లో ఆయన కొడుకు మాదరి భాగ్యరెడ్డి పారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తరువాత మనవడు అజయ్‌ గౌతమ్‌ నడిపిస్తున్నాడు.

ధర్మ ప్రచారణీ ప్రచురణ సంస్థ ప్రారంభించారు. ఇది జగన్మిత్ర మండలికి అనుబంధంగా ఏర్పాటు చేసారు. చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించేవారు.

          ఏక కాలంలో అనేక పాఠశాలలు నడపడం తలకు మించిన భారంగా మారింది. తగిన నిధులు, వసతులు సమకూర్చాలనీ ఆనాటి నిజాం ప్రభుత్వానికి డిమాండ్‌ చేసినప్పుడు 1933లో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆది హిందూ విద్యార్థులకు తెలుగులో బోధించాలన్న ప్రభుత్వ ప్రతి పాదనకు వర్మ ఒప్పుకున్నాడు. 1934 నవంబరులో ప్రభుత్వం స్వాధీన పర్చుకున్నది.

          సమాజంలో వేళ్లూనుకపోతున్న దుర్మార్గపు జాఢ్యమగు దేవదాసి పేరిట నాశనం అవుతున్న బాలికల జీవితాలను చూసి భాగ్యరెడ్డి వర్మ చలించిపోయాడు. అప్పటికే విద్యాబోధన కోసం ఏర్పాటైన జగన్మిత్ర మండలి జనవరి1, 1911లో మన్యసంఘంగా మార్చారు.

          మన్య సంఘం లక్ష్యాలు: 1. అంటరాని వర్గాల పిల్లలకు చదువు చెప్పించాలి.  2. బాల్య వివాహాలను రూపుమాపాలి.

          3. పెండ్లిండ్లు, పండుగలు, పబ్బాల వంటి సమయంలో తాగుడువంటి దురాచారాలని మానిపించాలి. మాంసాహారాన్ని తగ్గించాలి.

          4. అంటరాని వర్గాలలో పాతుకుపోయిన దేవదాసి, జోగిని, ముర్లి వంటి సాంఘిక దురాచారాలని నిషేధించాలి2.

          పాఠశాల ప్రారంభ, ముగింపు సమయాల్లో విద్యార్థులను, వివిధ సందర్భాలలో భాగ్యరెడ్డి దళితులనుద్దేశించి ప్రసంగించేవారు. పేదరికం, అవిద్య వలన ఎలా మోసపోతామో అలతి అలతి పదాలతో నిజ జీవితంలో నిత్యం ఎదురయ్యే ఉదాహరణలతో కూలంకషంగా వివరించేవారు. మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న అనర్థాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించేవారు.

          అనేక అంశాల పట్ల అవగాహన పెంచడం కోసం ఆనాడున్న వినోద కార్యక్రమాలను వాహకంగా చేసుకున్నది. మన్యసంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు.

          మన్యసంఘం ఆధ్వర్యంలో భజన మండళ్లు రీడిరగ్‌ రూములు ఏర్పరచాడు. అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచారు. ఆ పత్రికలు దళిత యువతీ యువకులు సాంఘిక సమకాలీన అంశాల పట్ల అవగాహన కల్పించడానికి తోడ్పడేవి.

 

 

          దేవదాసి వ్యవస్థ: రజస్వల అయిన బాలికచే జోగుపట్టడం ఊరిపెద్దతో సమాగం(కన్నెరికం)చేయించడమే జోగిని. దేవునికి అర్పించి           బాలికను భూస్వాములుపయోగించుకోవడం, నిరసించాడు. దేవదాసి వ్యవస్థ నిర్మూలించాలనీ కార్యోన్ముఖులయ్యారు. 1922లో జరిగిన(ఆది జన జాతియోన్నతి సభదీనినే ఆది హిందూ జాతియోన్నతి సభఅని కూడా పిలుచుకునేవారు.) ఆది హిందూ సోషల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశం యొక్క ప్రధాన తీర్మానం అమ్మాయిలను దేవతలకు అర్పించవద్దనీ చేశారు. ఇంకా జంతు బలులు, బాల్య వివాహాల వ్యతిరేకంగా పోరాటం చేసింది మన్య సంఘం. భాగ్యరెడ్డి అలుపెరగని పోరాటం వలన ఆనాటి నిజాం ప్రభుత్వమగు దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు.

          భూత దయగలిగిన భాగ్యరెడ్డి 1912లో అహింస సమాజం స్థాపించారు. ఈ సంస్థ స్థాపించే నాటికి భాగ్యరెడ్డి వర్మ శాకాహారిగా మారిపోయాడు. ఈ పరంపరలో భాగంగా ఈ సంస్థలు జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలిగా 1915వ సంవత్సరంలో మార్చబడ్డది.

          ఆనాటి కాలంలోని అంటు వ్యాధులుగా భావించే కలరా, ప్లేగు చాలా భయంకరమైనవి. బడుగు ప్రజలకు మరియు సమాజంలో ఉన్న అందరి నిమిత్తం ఒక సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన భాగ్యరెడ్డి 1912లో స్వస్తదళ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన కార్యనిర్వాహకులుగా ఉన్నప్పటికీ తనతో పాటు అరిగె రామస్వామి, వాల్తాటి శేషయ్య, వెంకటరామ్‌, జే.హెచ్‌ సుబ్బయ్య, ముదిగొండ లక్ష్మయ్య, ముత్తయ్య, శివరామ్‌, పులినరింలు లాంటి ప్రముఖులు చురుగ్గా పాల్గొనేవారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో వీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ఎన్నో విధాలా ఆసక్తి రేకెత్తించేవి. స్వస్థదళ్‌ వాలంటీర్లు అనాథ మృతదేహాలను తొలగించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మొదలైన బాధ్యతగా చేసేవారు.  

          స్వస్థదళ్‌ సంస్థను 35 మంది దళిత కార్యకర్తలతో ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నగరంలో ప్లేగు కలరా వ్యాధులు ప్రబలినప్పుడు ఈ సంస్థ ఎంతగానో సహాయ సహకారాలు అందించి ఆరోగ్యకర వాతావరణం కోసం పాటు పడ్డాడు. స్వస్థ దళ్‌ చిహ్నము రెడ్‌ క్రాస్‌ మాదిరి ఆరెంజ్‌ రంగులో ఉండేది. 1925లో హైదరాబాదులో ప్లేగు ప్రబలినప్పుడు ఉదారమైన సేవలు అందించింది. అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు.

          అంటరాని తనాన్ని అరికట్టడానికి, కులతత్వ భూతాన్ని నిర్మూలం చేయడానికి ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం ఎంతగానో మాట్లాడేవి. అనుకున్నది అనుక్నుంత ఏదీ జరిగేది కాదు. మానవులంతా సమానమనీ మానవతా దృష్టితో ఆర్య సమాజం కొంత మేరకు కృషి చేసింది. ఆర్య సమాజం నిమ్న వర్గాలు సమాజంలో గౌరవ ప్రదంగా బతుకడానికి సమాన స్థాయి హోదానిచ్చి అండగా నిలిచారు. ఆర్య సమాజం ఆశించిన విధంగా అప్పటికే హైద్రాబాద్‌ సంస్థానంలో కృషి చేస్తున్నది భాగ్యరెడ్డి.            

          భాగ్యరెడ్డి పని చేసిన పెద్ద సంస్థ ఆర్య సమాజం ఆనాటి నిజాం రాజ్యంలో దళిత కులాల వారిని కార్యకర్తలుగా స్వీకరించే ఏకైక సంస్థ ఆర్య సమాజం 1910 నాటికి మహారాష్ట్ర ప్రాబల్యం ఎక్కువగా ఉంది క్రైస్తవ్యం ఆర్యసమాజం బ్రహ్మసమాజం బౌద్ధం మొదలైన ప్రభావాలన్ని ఉన్నాయి.       

          సామాజిక బాధ్యత వహిస్తున్న హిందూ సమాజానికి భాగ్యరెడ్డికి 1913లో జరిగిన వైదికధర్మ ప్రచార పరిషత్తుకు చెందిన బాజీ కృష్ణారావు పండితుడు ఆర్య సమాజ్‌వార్షిక సదస్సులో ఇతనికి ఆర్య సమాజదీక్షను ఇచ్చి, యజ్ఞోపవీతం ధరింపచేశాడు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వర్మఅన్న బిరుదును ప్రధానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు. (బిరుదు రాజు రామరాజు రాసారు.) అంతకు ముందే శర్మ బిరుదును స్వీకరించుమని ఆర్య సమాజం అడిగితే నేను కార్యసాధకుడిని కాబట్టి వర్మ బిరుదమే తీసుకుంటానని చెప్పారట.

          హరిజనులందరూ చదువుకోవాలని, మద్య మాంసాలు త్యజించాలని, దేవదాసి, జోగిని పద్ధతులను మానుకోవాలని, బాల్యవివాహాలను బహిష్కరించాలని, మతసామరస్యం పాటించాలని, ఆర్య సమాజ ధర్మాన్ని పాటిస్తూ మూఢనమ్మకాలు పాటించరాదని విశేషంగా ప్రచారం చేశాడు. ఇతని ఉపన్యాలపై ప్రేరణ పొంది అనేకమంది హరిజనులు హైద్రాబాదు సంస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యులై, విద్యాధికులై సన్మార్గంలో నడిచారు.

ఆర్య సమాజం, బ్రహ్మ సమాజంలతో విభేదించడం:

          1913 వరకు భాగ్యరెడ్డి వర్మకు ఆర్య సమాజ్‌కు సవ్యంగా సాగిన మితృత్వం సిద్ధాంతాల ఆచరణ వద్ద బెడిసికొట్టింది. భాగ్యరెడ్డి వర్మ పాఠశాలలో చదువుచున్న విద్యార్థికి వేద పఠనంలో ప్రథమ బహుమతి లభించింది. ఆనాటి ప్రముఖ సంస్కర్త ఆ బాలుడిని వేదికమీదికి వెంటబెట్టుకొని వెళుతుండగా ఒక దళిత బాలుడికి వేద పఠనంలో బహుమతి రావడాన్ని జీర్ణించుకోలేని  ఆశ్రమ అధిపతి ఒక దురుసు వ్యాఖ్య చేయడం భాగ్యరెడ్డి వినడం. ఆర్య సమాజంతో తెగదెంపులు చేసుకోవడం జరిగాయి.

          1914లో మన్య సంఘం కార్యాలయంలో ఆంధ్ర ప్రాంతపు బ్రహ్మ సమాజపు శాఖ ఏర్పడిరది. బ్రహ్మ సమాజంలో దీర్ఘకాలం కొనసాగలేక తనదైన స్థితిలో ముందుకు సాగాడు భాగ్యరెడ్డి.

          సామాజిక రుగ్మతలను సాంఘిక దురాచారాలను తీసుకుని నాటకాల ద్వారా చైతన్యం నింపడానికి భాగ్యరెడ్డి వర్మ గారు 1917లో సంఘ సంస్కరణ నాటక మండలిని స్థాపించారు.

          హైద్రబాద్‌, సికింద్రాబాద్‌ పట్టణాలకి వలస వచ్చిన పల్లెటూరి వారు ఇండ్లలో పాచి పనులు చేసి శ్రమ దోపిడికి గురయ్యేవారు. వారి శ్రేయస్సుకై డోమెస్టిక్‌ సర్వేంట్స్‌ యూనియన్‌ను స్థాపించారు. 1916 మార్చి 17వ తేదీన చాధర్‌ఘాట్‌లో ‘‘విశ్వ గృహ పరిచారక సమ్మేళనం’’ జరిపించారు. 

          బెజవాడలో మైలవరం రాజావారి నాటక మందిరంలో ప్రాదేశిక పంచమ సదస్సు 1917లో గూడూరు రామచంద్ర రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆ కార్యక్రమానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. తన అధ్యక్ష ఉపన్యాసంలో దళితుల యొక్క దీనస్థితిని వివరించారు. అంటరానివాళ్ళపై పంచమ వర్ణం అనే పదం పురాణాల్లో మరే ఇతర హిందూ ధర్మ శాస్త్రంలో కనిపించదని గట్టిగా వివరించారు. తెల్లారేసరికి పంచమ సదస్సు కాస్త ఆది ఆంధ్ర సదస్సుగా మారిపోయింది.

          హైద్రాబాద్‌ బ్రహ్మ సమాజ అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌. జి. వెల్లింకర్‌ అధ్యక్షత వహించి అఖిల భారత ఆస్తికవాద మహాసభ కలకత్తాకు భాగ్యరెడ్డి వెళ్లారు. అదే సమయంలో కలకత్తాలో అఖిల భారత హిందూ సంస్కరణ మహా సభ కూడా జరుగుతుంది. ఆ సభకు  ప్రపుల్ల చంద్ర రాయ్‌ అధ్యక్షత వహిస్తున్నారు. ఆ సభలో ‘‘అంత్యజుల ఉద్దరణ’’ మీద భాగ్యరెడ్డివర్మ ప్రసంగించారు.

          ఆది హిందువుల ప్రస్తుత దుస్థితికి బ్రాహ్మణ వాదమే కారణమని, ఒకప్పుడు ఈ జంబూ ద్వీపంలో దళితులదే పై చేయిగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆ సభలో ఆయన ప్రసంగాన్ని విన్న గాంధీజి తన ప్రసంగంలో ఊటంకించారు. తరువాత గాంధీ హైదరాబాదు సందర్శించినపుడు భాగ్యరెడ్డి నడుపుతున్న పాఠశాలలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఇసామియా బజార్‌లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన తెలుగు మీడియం పాఠశాలలను సందర్శించిన గాంధీ, తెలుగుతో పాటు హిందీని కూడా పాఠ్యాంశంగా పెట్టాలని సూచించారు.

          ఆది ఆంధ్ర ఉద్యమం:  ఈ దేశ మూలవాసులం మనం. ఇతర దేశాలనుంచి వలసొచ్చిన వాళ్లను, మూలవాసులను కలిపి  విదేశీయులు హిందూ దేశం అని పిలుస్తున్నారు కానీ హిందూ ఏ మతస్తులను ఉద్దేశించింది కాదన్నారు. ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న మూలవాసులే ఆది జనం కాబట్టి వారి ప్రాంతానికి ముందు ఆది చేర్చడంతో ఆది ఆంధ్ర ఉద్యమమైంది.

          1917 నవంబర్‌ 4,5,6 తేదీలలో ఆది ఆంధ్రమహా జనసభజరిగింది. ఇదే తొలి పంచమ సదస్సు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు. పంచమ పదాన్ని ఖండిరచారు. వర్ణ వ్యవస్థలో ఐదవ వర్ణం వేదాలలో, పురాణాలలో లేదని వివరించారు. తెల్లారే సరికి బ్యానర్లు మారిపోయాయి. తొలి పంచమ సదస్సు కాస్త ఆది ఆంధ్రుల సదస్సుగా మార్చారు.

          ఈ సదస్సునందే నిమ్న కులాలలయిన అంటరాని వర్గాలను ఆది ఆంధ్రులుగా పిలువాలని తీర్మానించారు. తమిళులని ఆది ద్రావిడులుగా, ఆది మహా రాష్ట్రీయులుగా, ఆది కర్ణాటకులుగా పిలువాలనీ, అఖిల భారత స్థాయిలో ఆది హిందువులుగా పరిగణించాలని తీర్మానించారు.

          రెండవ రోజు 1917 నవంబర్‌ 5న జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశాలు కొన్ని. పాఠశాలలో, సత్రాలలో అందరితో పాటుగా సమాన ప్రవేశాలు ఉండాలన్నారు. బావులలో నీళ్లు తోడుకునే విధంగా, మిగులు భూములను ఆది హిందువులకు ప్రభుత్వమే పంచాలన్నారు. గ్రామస్థాయి, మున్సిపాలిటి, జిల్లా, శాసనమండలి మొదలైన వాటిలో ఆది ఆంధ్రులను సభ్యులుగా నియమించాలని ఆనాటి ప్రభుత్వాలను డిమాండు చేశారు. సభ రెండవ రోజున 18 తీర్మానాలను సదస్సు ఆమోందించింది.

          హిందూ దేశములోని యన్ని భాగముల పంచములలో హైద్రాబాదు పంచములు అన్ని వ్యవస్థలలో ఉన్నతి నొందిన వారని చెప్పుట యతిశయోక్తి కాదు. నాగరికతయందేమి, మే విధముగ నైనా, హిందువులకు తీసిపోవువారు గాక దినదినము వృద్ధి గావించుచున్నారు. ... జాతి బేధములులనేని మహమ్మదీయ నిజాం రాష్ట్రము కావుననే మా యున్నతికి నేయాంటకములు లేవు. .... మేము ప్రత్యేకముగా పాఠశాలలు స్థాపించవలసి వచ్చింది. మాకు వేరు వేరు అంగళ్లు లేవు. అచ్చట అందరికీ సమాన హక్కులు కలవు3

          ఆది ఆంధ్ర తొలి సభ తీర్మానములు: 1. ఇక నుండి గా’, ‘గాడుఉండకూడదు. దాసు’, ‘స్వామి’, ‘అన్నఅని వాడవలయును. 2. ఈ సభను ఆది ఆంధ్ర మహా సభ అని పిలువాలి. 3. మనం ఆది ఆంధ్రులమని పిలిపించుకొవాలి. 4. మాల, మాదిగ గూడెములని కాక ఋషుల గూడెం, మహనీయుల గూడెం అని డిస్ట్రిక్‌ గెజిట్‌లలో మార్చుమని కోరాలి. 5.  మనము చచ్చిన జంతువులను తినగూడదు. 6. శుభా శుభ కార్యములలో కల్లు, సారాయి ఉపయోగించకూడదు. 7. గో మాంసం తినకూడదు. 8. పరిసరాల పరిశుభ్రత ఉంచకోవలయును. 9. పిల్లలకు చదువు చెప్పించవలయును. 10. ప్రతి గ్రామములో పంచాయితీలను ఏర్పాటు చేసుకోవలయును అని తీర్మానించారు.4

          ‘‘విద్య మనకు చాలా ముఖ్యం. ముఖ్యంగా బాలికలకు విద్య నేర్పవలయును. ఒక బాలిక చదివినచో సంసారమునకంతయు మేలు చేయగలదు’’ అన్న భాగ్యరెడ్డి గారి ఉపన్యాసం ఆంధ్ర రాష్ట్ర అణగారిన వర్గాలు మేలుకొల్పాయి. దేవాలయ ప్రవేశం వృధా ప్రయాస అని చెప్పారు. అంటరాని ప్రజలు ఏనాడు హిందూ వర్గాలలో భాగం కాదనీ నొక్కిచెప్పారు. ఈ సదస్సు జరుగుతున్న మూడురోజుల పాటు బెజవాడ కనకదుర్గ మందిరాన్ని మూడురోజుల పాటు మూసివేశారు.

          ‘‘మాంటేగ్యు మద్రాసుకు వచ్చుచున్నందున వారిని పంచముల ప్రతినిధులు కలసికొని శాసన సభలలో పంచములకు ప్రత్యేక ప్రాతినిధ్యము కావలెనని అడుగుటకు,....నిశ్చయించితిమి. వారందరి అభిప్రాయము ప్రకారము హైదరాబాదులోని సుప్రసిద్ధ ఆదియాంధ్ర నాయకులగు భాగ్యరెడ్డి వర్మగారిని, చుండ్రు వెంకటరామయ్యగారిని మేమందరము నడిచి వందలకొలది పంచమ ప్రతినిధులు వెంటరాగా బెజవాడ పురవీధులలో నూరేగించితిమి... రామిగాడు, సుబ్బిగాడు అని నీచమైన విధముగా పిలువకూడదని, రామయ్య, సుబ్బయ్య అని మాత్రమే పిలువవలెనని, అటులనే సర్కారు లెక్కలలో వ్రాయవలెనని తీర్మానించితిమి. భాగ్యరెడ్డి వర్మగారి యుపన్యాసము గంభీరముగనుండెను. ఆదియాంధ్రుల యిక్కట్టుల గురించి వారు వివరించిరి5.

          1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్రమహాసభలు దాదాపు ప్రతి సంవత్సరం జరిగాయి. అంటరానివారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండు చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 నిజాం దేశ జనాభా గణనలో (మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలను కలుపుకొని ఉన్న) మహర్‌, చమర్‌, ధేర్‌, మాంగ్‌ మొదలైన దళితులను ఆహిందువులుగా నమోదు చేసింది.

          వర్మ ఆంధ్ర ప్రాంత విస్తృత పర్యటించారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ భాగంగా ఉన్న ఆంధ్రా ప్రాంతంలో అనేక సదస్సులలో ప్రసంగించారు. తమను ఆది ఆంధ్రులుగా, ఆది ద్రావిడులు(అంటరాని తమిళులు)గా తీర్మానాలు చేసి మద్రాసు ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం వలన అప్పటి మద్రాసు ప్రభుత్వం భాషా ప్రయుక్త  ప్రాంతాలననుసరించి జీవోనెం. 817ను 1922 సంవత్సరం మార్చి 25వ తేదీన విడుదల చేసింది6.

           వీరు పంచమ అను పదానికి వ్యతిరేకంగా చేసిన కృషివలన 1922 జనవరి 20న మద్రాసు శాసనమండలి ‘‘దక్షిణ భారత ప్రాచీన జాతులగు పంచమ’, ‘పరయపదాలకు బదులు ఆది ఆంధ్ర’,‘ఆది ద్రావిడపదాలను ఉపయోగించాలని తీర్మానం చేసింది. అంతకు ముందున్న రికార్డులలోని పంచమ’, ‘పరయపదాలను తొలగించాలని తీర్మానించారు.

          1919లో ఆది హిందూ సమ్మేళనాన్ని ప్రారంభించి, దళితుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి మొహల్లా పంచాయితీలను నెలకొల్పారు. దళిత చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల వస్తు ప్రదర్శన నిర్వహించారు.

          ఉత్తర భారతంలో అంబేడ్కర్‌ చేసిన ప్రతి ఉద్యమానికి హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ చేసిన దళిత ఉద్యమమే మూలమైంది. కాగా దేశవ్యాప్తంగా సాగిన మూలవాసి ఉద్యమాలకు మన భాగ్యరెడ్డివర్మ చూపించిన దారే మార్గమైంది.

          హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బి.ఎస్‌.వెంకట్రావులను ముగ్గురినీ దళితత్రయంగా పరిగణిస్తారు. అయితే వీరిలో భాగ్యరెడ్డి వర్మకు అగ్రస్థానం ఉండేది.

          ఉత్తరదక్షిణ భారతదేశాన్ని ఐక్యం చేస్తూ దళితజాతి చైతన్యానికి కేంద్ర బిందువై నిలిచారు భాగ్యరెడ్డివర్మ. అంతటి మహానీయునికి గుర్తించదగ్గ స్మఅతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించకపోవడం విచారకరం.

          1931 లోని నవంబర్‌ 7వ తేదీన నిజాం రాష్ట్ర ఆది-హిందూ రాజకీయ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ గారు అధ్యక్షత వహించారు.

          1931లో ప్రారంభించిన భాగ్య నగర్‌ పత్రిక 1937 డిసెంబర్‌ ఆది హిందూ పత్రికగా మార్చారు7.

          1932లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలోని తాళ్లరేవు లో ఫిబ్రవరి 27,28లో జిల్లా ఆది ఆంధ్రమహాసభకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు.

          1933లో నాగపూర్‌లో ఆది-హిందూ సదస్సులో మొదటి రోజు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు.

          1919లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోను, 1920లో గుడివాడలోను, 1921 జనవరి 9న బందరు, భీమవరం, 1922ఏలూరులలోనూ, 1924 గుంటూరు కుసుమ ధర్మన్న 1925 అనంతపూర్‌ పనులు 1926 వెంకటగిరి దేవేంద్రుడు 1928 నర్సాపూర్‌ వెస్ట్‌ గోదావరి భాగ్యరెడ్డి వర్మ 1929 విజయవాడ ఆదినారాయణ పనుల 1930 అనంతపూర్‌ దేవేంద్రుడు 1935 రాజమండ్రి వెంకటరమణయ్య 1936 విజయనగరం కురుమయ్య 1938 తల్లనీవు తూర్పు గోదావరి జిల్లా జరిగిన ఆది ఆంధ్రుల సదస్సులకు ఆయన అధ్యక్షుడుగా ఆహ్వానించబడటం దళిత ఉద్యమ నాయకుడుగా ఆయన ఎంతగా గుర్తించబడ్డాడో, గౌరవించబడ్డాడో సూచిస్తాయి. ఆ క్రమంలోనే ఆయన సాహిత్య నాయకుడు కూడా కాగలిగాడు. అందుకు ఉదాహరణలుగా రెండిరటిని పేర్కొనవచ్చు. అవి -ఒకటి కుసుమధర్మన్న రాసిన మాకొద్దీ నల్ల దొరతనము’ (1921) గేయం. రెండు ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల మాలపల్లి’ (1922) వీరి కృషి నేపథ్యంగా రాయబడినవే.

          మత విశ్వాసాలు:  భాగ్యరెడ్డివర్మకు హిందూమతంపై విశ్వాసం లేదు. మొదట్లో అర్య సమాజం, బ్రహ్మసమాజం బోధనలను ఆచరించేవాడు. బ్రహ్మసమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించడం, యజ్ఞోపవితాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గుచూపాడు.

          అర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్యసమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడంలేదని గమనించాడు. విలువలు లేనిచోట జీవించడం దుర్లభమని భావించాడు. అర్య సమాజం, బ్రహ్మసమాజం ఏవీ దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని నిర్దారించుకున్నాడు.

          మనుషులందరికీ సమాన హోదా కల్పించిన బౌద్ధం పట్ల, గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాలపట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్దమే సరైనదని తీర్మానించుకున్నాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకొనేవాడు. తన ఏకైక కుమారునికి గౌతమ్‌ అని పేరు పెట్టుకున్నాడు

          తెలంగాణ నేలపై గ్రంథాలయోద్యమం సాగుతున్న దశలో బాధ్యతగా 1918లో భాగ్యరెడ్డి ఒక గ్రంథాలయం స్థాపించాడు. దానికి రామ్మోహన్‌ రాయ్‌ గ్రంథాలయంఅని నామకరణం చేసారు.

          వీరశైవం, వీర వైష్ణవం పోటాపోటీగా నడుస్తున్న కాలంలో తీవ్ర వ్యతిరేకత. మతం పేరిట దూషణలు కొనసాగుతున్నాయి. ముందు మనుషులు మనమంతా ఒకటి. ఆ తర్వాతే మతం అనీ ఇద్దరినీ సంతృప్తి పరచాడు. 1919లో ఆది హిందూ వైష్ణవ సమ్మేళన జరిపించి మనమంతా ఒకటే అనే భావన కలిగించారు.

          1919లో కృష్ణ జిల్లా ఆది ఆంధ్ర సదస్సు మచిలీపట్నంలో జరిగింది. 1920లో గుడివాడలో ప్రొవిన్షియల్‌ ఆది ` ఆంధ్ర మహాసభ జరిగింది. మార్చి 25, 1921లో కృష్ణ జిల్లా భీమవరంలో జరిగి ఆది ఆంధ్ర సదస్సులకు భాగ్యరెడ్డిగారు అధ్యక్షత వహించారు. ఆలిండియా ఆది -హిందూ సోషల్‌ కాన్ఫరెన్స్‌ హైదరాబాదులో 1922 మార్చి 29 నుండి 31 వరకు జరిగింది. ఆ కార్యక్రమానికి చీఫ్‌ ఆర్గనైజర్‌గా భాగ్యరెడ్డి పని చేశారు. అక్టోబర్‌ 17,18, 1925లో జరిగిన అనంతపూర్‌ ఆది ఆంధ్ర మహాసభకు రెడ్డిగారి అధ్యక్షత వహించారు. అనంతపురం నందలి సమావేశంలోనే ‘‘చండాలురు ఎవరు?’’ అను అంశంపై సవివరమైన ప్రసంగం చేసాడు. 1929లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్‌కి భాగ్య రెడ్డి గారే అధ్యక్షత వహించారు. 1930 డిసెంబర్‌ 18న విజయవాడలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభకు భాగ్యరెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

          1931 సెప్టెంబర్‌ 27,28 తేదీలలో ఉత్తర ప్రదేశ్‌లో లక్నోలో ఆల్‌ ఇండియా ఆది ` హిందూ డిప్రెస్డ్‌ క్లాస్‌లో ఒక ప్రత్యేక రాజకీయ సమావేశం రెండవ రౌండ్‌ టేబిల్‌ నిమిత్తం ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించినది భాగ్యరెడ్డి. దేశంలోని 7కోట్లమంది దళితుల సమస్యలు బ్రిటిష్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి లండన్‌లో జరిగే రెండవ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి అంబేద్కర్‌ని ప్రతినిóగా పంపాలని ప్రతిపాంచి ఆ తీర్మాణాన్ని ఆమోదింపచేశారు. అంబేద్కర్‌ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి ‘‘దళితుల ఎకైక ప్రతినిధి’’గా చేయగలిగాడు.

          1933లో నాగ్‌పూర్‌ ఆది హిందూ సదస్సు అధ్యక్షత వహించారు. 1936 విజయనగరంలో ఇండిపెండెంట్‌ ఆది జన సదస్సును ప్రారంభించారు. (సమాంతర మాస పత్రిక, మే, 2007)

          ఎదుటి వాళ్ల మనసును ఎంతగా గౌరవిస్తాడో తెలుపడానికి జరిగిన సమావేశం ఉదాహారణగా నిలుస్తుంది. ఆది హిందువులకు తగిన ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ప్రత్యేక ఎలక్ట్రో రేటు ఏర్పాటు చేయాలంటూ మరో తీర్మానాన్ని ఆమోదిస్తుండగా ఉత్తర భారత దేశానికి చెందిన కొంత మంది ప్రతినిధులు వర్మ అనే పదం ఆర్య హోదాను సూచిస్తుంది కాబట్టి తొలగించుకుంటే బాగుంటుంది అని సూచించారు. వెంటనే భాగ్యరెడ్డి వర్మ గారు తన పేరులోని ఇస్తున్నట్లు ప్రకటించి ఆ తీర్మానంపై భాగ్యరెడ్డి అని సంతకం చేశారు8. 

          సభలు సమావేశాలు నిర్వహించకూడదని నిజాం ప్రభుత్వం విడుదల చేసిన షరతులు అమలులో ఉన్నప్పటికి 1931లో వంబర్‌ 7వ తేదీన బొల్లారంలో జరిగిన ఆది `హిందూ రాజకీయ సభకు భాగ్యరెడ్డి అధ్యక్షత వహించారు.

          పాత్రికేయుడిగా.. అంటరాని వర్గాలకు అభ్యున్నతికి అంకితమైన భాగ్యరెడ్డి వర్మ పత్రిక ఒకటి పెట్టాలన్న ఆలోచన కలిగింది. తన ప్రజలను మేల్కల్పడానికి సాంఘిక సమకాలీన అంశాల పట్ల అవగాహన కలిగించాలని తలిచాడు. మాన్య సంఘంసెక్రటరీగా ఉన్న ఎస్‌. ముత్తయ్య సంపాదకుడుగా ఆంగ్లంలో వచ్చిన పత్రిక ది పంచమమార్చి 31,1918 నాడు వెలువడినది. అంబేద్కర్‌ మూక్‌ నాయక్‌ పత్రిక కంటే ముందుగా ఈ పత్రిక ప్రారంభమైందన్నమాట. పక్ష పత్రికగా భాగ్య నగర్‌ పత్రికను డిసెంబర్‌ మాసం 1931వ సంవత్సరాన వర్మ ప్రారంభించారు. ఈ పత్రిక సహాయ సంపాదకునిగా సమర్థుడు, యువకుడు, కాకినాడకు చెందిన గోవాడ నిరీక్షణరావు పనిచేసేవారు. (నిరీక్షణ రావును పద్మశ్రీ ఎం. బి. గౌతమ్‌ కలిసినట్లుగా రాసుకున్నాడు.)

          భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్‌ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు. వర్మ రాసిన ఆ నవల గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదు, కానీ ఆయనే స్వయంగా నవల రాశాడని, ఆ నవల పేరు కూడా ప్రజలకు అంతగా తెలియదు.

          పంచములు, అవర్ణులు, మాలా, మావంటి పేర్లతో కాకుండా వారిని ఆ హిందువులుగా పిలవాలని భాగ్యరెడ్డి చేసిన డిమాండ్‌ను నిజాం ప్రభుత్వం అంగీకరించింది.

          కథా రచయితగా.... దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు ఆర్య సమాజం తన ప్రభావాన్ని చూపింది. అట్లా ఆర్య సమాజ బోధనలకు ప్రభావితుడైన భాగ్యరెడ్డి తొలి తెలుగు(తెలంగాణ) దళిత కథ వెట్టి మాదిగ’ (1932) అజ్ఞాత వాసి పేరిట రాసాడు. తన భాగ్య నగర్‌ పత్రికలో ప్రచురించాడు. ఈ సంస్కరణ భావాలున్న కథగా నిలిచింది9.

          వెట్టి మాదిగకథలో ఏమీ ఆశించకుండా చేసే అన్ని రకాల కుల వృత్తుల చేసే ఉచిత పని వెట్టి. వెట్టిలో సొంత పనులు వదులుకొని కడుపు మాడుతున్న చావు బతుకుల నడమ బతుకీడుస్తున్న చేసే విధంగా నిరంకుశంగా ఉంది.     

          ‘‘రామిరెడ్డి రెండు వందల భూస్వామి. నిరంకుశుడు. కలహభోజనుడు. రామిరెడ్డి బంధువుకు ఉత్తరము పంపవలసినందున తలారి ఊరివంతు మాదిగను తీసుకురమ్మని పంపాడు. వంతు మాదిగకు ఆ రోజునే వేరే భూస్వామి ఇవ్వవలసిన గింజలు అదే రోజున ఇవ్వనున్నందన అవశ్య కారణమని మాదిగ మల్లడు తెలిపెను. పిలుచుక రాలేదని కాలుకున్న చెప్పు ఊడదీసి కోపముడుగు వరకు కొట్టెను. వెంటనే తలారి వెళ్లి మాదిగ మల్లన్ని కొట్టుకుంటూ తోలుకొని వచ్చెను. రామిరెడ్డి మల్లన్ని చూడగానే కట్టె సవరించుకొని పటేలు చేతులు నొప్పి మర్దించె వరకు కొట్టెను. మల్లడు ఎదిరించడాయెను. తుదకు మల్లడు స్పృహ తప్పిపోయెను. నెత్తురు వరదలై ప్రవహింప దొడగెను. నెత్తురు కనుల చూసిన వెంటనే పటేలు శాంతించెను. 

          వెంటనే తలారిని పిలిపించి ఇంటి వద్ద విడిచిపెట్టి రమ్మనెను. మల్లడు వ్యాధి పీడుతుడై సుమారు ఐదారు నెలల వరకు శవాకారముగా పడివుండెను. రామిరెడ్డి ఎంతటి కఠినాత్ముడో పాఠకులే గ్రహించవలెను10.’’

          తొలి ఆంధ్ర మహాసభ జోగిపేట కేంద్రంగా 1930లో జరిగింది ఆది ఆంధ్రుల తరపున భాగ్యరెడ్డి వర్మ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ సమయంలో మహా సభలో కలకలం చెలరేగింది భాగ్యరెడ్డివర్మ వేదిక మీదికి రావడం పై ఆగ్రహంతో కొందరు సభ నుంచి వెళ్లిపోవడం తర్వాత పెద్దలు సర్ది చెప్పడం వివాదం సర్దుకోవడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రసిద్ధి ఒక అపశ్రుతి11 కె. శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

          భాగ్యరెడ్డి వర్మ జన జీవితంలో పెట్టినదాదిగ ఆయన 3348 ప్రసంగాలు ఇచ్చినట్లు తేలింది. ఆయన కృషి పోరాట ఫలితంగా ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమ పడి అంటరాని వర్గాల వారిని ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి వుండాలె12.

          భాగ్యరెడ్డి వర్మ కార్యాచరణ బహుముఖీనమైనది. బహు విస్తృతమైనది. వారు వేసిన ప్రతి అడుగు నిమ్నకులాల అభ్యున్నతికి తోడ్పడిరది. అంటరానితనాన్ని నిర్మూలించడంలో సహకరించింది. వేరు వేరు సందర్భాల్లో గాంధీలాంటి జాతీయ స్థాయి నాయకులతో జాతీయ సదస్సులలో వేదికలు పంచుకున్నారు. భారత జాతి అభ్యున్నతి కోసం పాటు పడ్డాడు. సంఘంలోని దురాచారాలను తిడుతూ కూర్చోక తన వంతు బాధ్యతను సమర్ధవంతంగా చేసాడు. తెలంగాణతో పాటు మద్రాసు, దేశంలోని వివిధ ప్రాంతాలను కలియ తిరిగాడు. అంబేడ్కర్‌ను రౌండ్‌ టేబిల్‌ సమావేశానికి పంపడంలో శక్తి వంచనలేకుండా కృషిచేసాడు.

           నేటి యువతకు భాగ్యరెడ్డి వర్మ జీవితం ఎంతో ఆదర్శం. అవమానాలను సన్మానాలు మలుచుకున్నాడు. కుర్రవానిగా ఉన్నప్పుడే టెన్నీసు అందించే బాలుని జీవితం ప్రారంభించాడు. కుటుంభానికి ఆసరా అయ్యాడు. నేటి యువత టీనేజి పిల్లలు ఎంజాయి పేరిట ఎయిమ్‌ వదులుకుంటున్నారు. వారికి భాగ్యరెడ్డి గారి జీవితం పెద్ద గుణపాఠం. పద్దెనిమిదేళ్ల వయస్సులోనే సమాజం గురించి ఆలోచించాడు. అనుకున్నది సాధించడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాడు. కార్య రంగంలోకి దిగాడు. తను చదువుకున్నాడు. చదువు చెప్పించడానికి పాఠశాలలు ప్రారంభించాడు. సామాజిక బాధ్యతగా సంఘంలోని దురాచారాలను నిర్మూలించడానికి కృషి చేసాడు. నాయకునిగా ఎదిగాడు.

          డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ అన్నట్లు నీ కోసం జీవిస్తే నీలో మిగిలిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో మిగిలిపోతావు అన్నట్లు భాగ్యరెడ్డి వర్మ గారు ఒక్కడిగా ఈ నేల మీదికొచ్చినా సమాజాన్ని సంస్కరించాడు. వందేళ్లు దాటినా జీవిస్తున్నాడు. జీవిస్తాడు. మనిషిగా మన మధ్య వారు లేరు. వారి ఆలోచనలున్నాయి. వారి ఆశయాలూ ఉన్నాయి. ఆచరించిన దిశా నిర్దేశనమూ ఉంది.

 

పాద సూచికలు:

 

1. మూల భారతీయుల ఉద్యమ ప్రస్థానం, సమాంతర పబ్లికేషన్స్‌, హై. 2017. పుట 119.

2. భాగ్యోదయం, గౌతమ్‌, ఎం.బి. సమాంతర పబ్లికేషన్స్‌, హై. 12`2009. పుట.7

3. ఆది ఆంధ్ర ఉద్యమెం` భాగ్యరెడ్డి వర్మ పాత్ర. సం॥ జగన్‌ రెడ్డి, సామిడి. సమాంతర పబ్లికేషన్స్‌, హై. పుట. కవర్‌ పేజి

4. ఆది ఆంధ్ర ఉద్యమెం` భాగ్యరెడ్డి వర్మ పాత్ర. సం॥ జగన్‌ రెడ్డి, సామిడి.                             

5. నా జీవిత కథ, నవ్యాంధ్రము, కాళేశ్వర రావు, అయ్యదేవర, 1950: 240`241.

6. ఆది ఆంధ్ర ఉద్యమమం ` భాగ్యరెడ్డి వర్మ పాత్ర. సం॥ జగన్‌ రెడ్డి, సామిడి. సమాంతర పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌`2005. పుట 15.

7. డాక్టర్‌ చిన్నారావు సమాంతర మాస పత్రిక మే 2007

8. సమాంతర మాస పత్రిక, మే 2009) ఆనాటి తీర్మానాలపై భాగ్యరెడ్డిగా మాత్రమే సంతకం చేసారు.

9. తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు ` రెండో భాగం) సం॥ సుజాత రెడి, ముదిగంటి., శ్రీనివాస్‌, సంగిశెట్టి. 2005. ముందు మాట`10.

10. తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు ` రెండో భాగం) సం॥ సుజాత రెడి, ముదిగంటి., శ్రీనివాస్‌, సంగిశెట్టి. 2005. ముందు మాట`50.

11. తెలంగాణ సాహిత్య వికాసం. శ్రీనివాస్‌, కె. తెలంగాణ ప్రచురణలు. 2015, పుట 188

12. భాగ్యోదయం’ ` కృష్ణ స్వామి, ముదిరాజ్‌. 10వ తరగతి, తెలుగు. తెలంగాణ పాఠ్యపుస్తకం `2015. (నేటికి కూడా పాఠ్య భాగమే.)

 

 

ఆధార గ్రంథాలు:

 

మూల భారతీయుల ఉద్యమ ప్రస్థానం,

భాగ్యోదయం,

నా జీవిత కథ, నవ్యాంధ్రము,

ఆది ఆంధ్ర ఉద్యమమం ` భాగ్యరెడ్డి వర్మ పాత్ర.

సమాంతర మాస పత్రిక, మే 2009

తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు ` రెండో భాగం)

తెలంగాణ సాహిత్య వికాసం.

 

బహుజన స్పూర్తి ప్రధాతలు జాతీయ సదస్సు నవోమ్బర్ 2022

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్ సిద్దిపేట్ 








7

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...