సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

VIII. 11. కాపు బిడ్డ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
VIII. 11. కాపు బిడ్డ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మార్చి 2024, బుధవారం

VIII. 11. కాపు బిడ్డ



కాపుబిడ్డ

పాఠం ఉద్దేశం : 

ఏ ప్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకుని ఉండి, రైతులను తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పని చేసినా హాయిగా బతకలేరు. దిన దిన గండం, అమాయకత్వం, అహింసా తత్త్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

ప్రక్రియ:
ఈ పాఠం కావ్య (ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం. (ప్రస్తుత పాఠ్యాంశం గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపుబిడ్డ’ కావ్యంలోని ‘కర్షక ప్రశంస’ అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని (శమ ఇందులో వర్ణించబడ్డాయి.

కవి పరిచయం:

రచయిత : గంగుల శాయిరెడ్డి
జననం : 08-06-1890
మరణం : 04-09-1975
జన్మస్థలం : జనగామ జిల్లాలోని ‘జీడికల్లు’ గ్రామం.
రచనలు : ‘కాపుబిడ్డ’ కావ్యంతో పాటు ‘తెలుగుపలుకు’, ‘వర్షయోగము’, ‘మద్యపాన నిరోధము’. ఇంకా గణితరహస్యము, ఆరోగ్యరహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు : శైలి సరళంగా, సులభంగా గ్రహించ గలిగినది. సహజకవిగా పేరు పొందిన ‘పోతన’ పట్ల ఆరాధనాభావం గల శాయిరెడ్డి, ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో, ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.

ప్రవేశిక:


I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1. “రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ? చర్చించండి.
జవాబు.
శరీరాన్ని నిలబెట్టే ముఖ్య భాగం వెన్నెముక. అలాగే దేశంలోని ప్రజలకు అన్నంపెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రైతు లేనిదే రాజ్యంలేదు… అంటూ ఉంటారు. రాత్రనక పగలనక రైతులు ఆరుగాలాలు కష్టపడి పండిస్తుంటే మనం కాలి మీద కాలేసుక్కూర్చుని ఆనందంగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఆనందాన్నిచ్చిన రైతు పరిస్థితి ఏమిటని మనం ఆలోచించటం లేదు.

పేదరైతుకు సామాన్యుడైన వినియోగదారుకు మధ్య ఉన్న దళారులు మేడల మీద మేడలు కడుతూ కోట్లు కూడబెడుతూ ఉంటే రైతుకు గిట్టుబాటు ధరలేక రెండు పూటలా గంజి కూడ లేక పస్తులుంటున్నాడు. పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొంటున్నాడు. ఇదీ ఈనాడు రైతు పరిస్థితి. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులకు తగినధర తామే నిర్ణయించుకొనే అవకాశం ఇస్తే వారి బతుకు కొంచెమైనా మెరుగుపడుతుందని నా అభిప్రాయం.
ప్రశ్న 2.
రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.
జవాబు.
రైతు యొక్క జీవన విధానాన్ని కవి ముని జీవితంతో పోల్చాడు. మునుల వలె రైతు ఎండ, వాన, చలి, లెక్కచేయడు. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తాడు. మౌనంగా ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. రైతు దినచర్య ముని దినచర్యలాగే ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇంద్రభోగాలనైనా లెక్కచేయకుండా తిరస్కరిస్తాడు. ఈ లక్షణాలన్నీ మునుల జీవిత విధానాన్ని పోలి ఉంటాయని కవి అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 3.
“రైతులు కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు” – అని ఎందుకంటారు?
జవాబు.
ఎండల తాకిడికి తట్టుకోడానికి ఎత్తుమేడలు లేకపోతే చెట్ల నీడల్లో ఉంటాడు. ఇల్లంతా వాన చినుకులతో తడిసిపోతే పొదరిళ్ళలో కాలక్షేపం చేస్తాడు. వణికించే చలి నుండి కాపాడుకోడానికి గడ్డివాములలో దూరతాడు. రాత్రి పూట చీకటిలో ఏ పుట్టల మీదో మిట్టల మీదో కాలం గడుపుతాడు. మునుల్లాగా కారడవుల్లో పాములు, తేళ్ళు, పులులు మొదలైన వాటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇలా కష్టాలను కూడా సుఖాలుగానే భావిస్తాడు రైతు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది పద్యమును చదివి ఖాళీలను పూరించండి.
‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రు మిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

భావం : సైరికులు అనగా రైతులు వారు లను మిత్రులను. శత్రువు సహిస్తారు. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.

2. కింది పద్యాన్ని చదివి దానికింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

“ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా! నీదు పల్లెను గాంతురెవరు.”

(అ) ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి
జవాబు:(డి) బురద

(ఆ) ‘ఎగురజిమ్ముట’ అనగా
(ఎ) కాలిపోవుట
(బి) గాలికి పైకి విసురు
(సి) కూలిపోవుట
(డి) కిందపడుట
జవాబు:(బి) గాలికి పైకి విసురు

ఇ. ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది ?
(ఎ) పలకరించుట
(బి) పులకరించుట
(సి) వర్షాకాలం మొదలు
(డి) ఎండాకాలం మొదలు
జవాబు:
సి) వర్షాకాలం మొదలు

ఈ. కాంతురెవరు అనడంలోని ఉద్దేశం
(ఎ) ఎవరు చూస్తారు?
(బి) ఎవరు పట్టించుకుంటారు?
(సి) ఎవరు అంటారు?
(డి) ఎవరు వింటారు?
జవాబు:
(ఎ) ఎవరు చూస్తారు?

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “ఇంద్రపదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు ? (లేదా) ఇంద్రుని కంటె రైతు గొప్పవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఇంద్ర పదవిలో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరతాడు. స్వర్గసుఖాలు, అప్సరసలు, అమృతపానం లేకుండా ఉండలేడు. నందనవనంలో విహారాలు వారి కెంతో ప్రీతి. ఈ విధంగా విలాసాల్లో మునిగిపోతాడు ఇంద్రుడు. కాని తనరక్షణ తను చేసుకోలేక ఇతరులపై ఆధారపడతాడు. రైతుకు పైన చెప్పిన సుఖాలన్నీ నీచమైనవి. తన చుట్టూ ఉన్నవాటినే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తాడు. తన అవసరానికి మించి ఏమీ కోరడు. తానే అందరి ఆకలి తీరుస్తాడు. అంతేగాక తన రక్షణ తానే చూసుకోగలడు. ఎవరి మీదా ఆధారపడడు. అందుకే ఇంద్రుని కన్న రైతు జన్మ గొప్పది.

ఆ. “జై జవాన్! జై కిసాన్!!” అంటారు కదా! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి?
జవాబు.
జవాను అంటే సైనికుడు. రాత్రింబవళ్ళు ఆరుబయట సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. శత్రువులను తన మాతృభూమిలోనికి అడుగుపెట్టనివ్వడు. భూమాతను సదా కాపాడుతాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలనూ ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు. కిసాను అంటే రైతు కూడా రాత్రింబవళ్ళు ఆరుబయట తన పొలాలకు కాపలాకాస్తాడు. ఈతి బాధల నుండి పంటను రక్షించుకుంటాడు. నేల తల్లిని సదా గౌరవిస్తాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలను ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.

ఇ. రైతులకు గల ఐదు సమస్యలను చెప్పండి.
జవాబు.
రైతు ఎండ, వాన, చలి, చీకటి అన్నీ భరిస్తూ ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. అతనికి ఉండడానికి సౌకర్యవంతమైన ఇల్లులేదు. ఇంత కష్టపడినా భార్యాబిడ్డలకు తృప్తిగా తిండిపెట్టలేడు. తన ఆకలి దప్పికలు తీరవు. చలి వణికిస్తున్నా చల్లని నేలపై పండుకోవలసిందే. ఎర్రటి ఎండలో, రాళ్ళల్లో, ముళ్ళలో నడుస్తున్నా కాళ్ళకు చెప్పులుండవు. వడగళ్ళు రాలుతున్నా, పెనుగాలికి దుమ్ము కళ్ళలో పడుతున్నా ఉరుముల్లో మెరుపుల్లో తిరగవలసిందే. ఇవన్నీ రైతుకు గల సమస్యలే.

ఈ. “రైతు ప్రకృతితో మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.
జవాబు.
రైతు అహర్నిశలు ప్రకృతితో మమైకమై ఉంటాడు. వేసవి కాలపు మండు టెండలో కూడా తన పని పూర్తి చేస్తాడు. వానలో నానిపోతూ, చలిలో వణికి పోతూ కూడా నేలను దున్నుతాడు. రాత్రనక, పగలనక రాళ్ళలోను అడవిలోను తడబడకుండా తిరుగుతుంటాడు. నిద్రవస్తే తలకింద చేయి పెట్టుకొని ఏ చింతా లేకుండా గులకరాళ్ళపై నిద్రపోతాడు. ఇలా ప్రకృతిలోని ప్రతిమార్పునూ గమనించుకుంటూ ఉండేవాడు రైతు మాత్రమే అనిపిస్తుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.
జవాబు.
రైతు కష్టం : రైతు ఏడాది పొడుగునా కష్ట పడి పంటలు పండించాలి అంటే అతనికి ఎంతో శక్తికావాలి. ఆ శక్తి కావాలంటే కడుపునిండా తినాలి. కడుపునిండా తింటేనే గదా కష్టపడగలిగేది! అలాగే అతడి భార్యాబిడ్డలు సుఖంగా ఉంటే అతడు సంతోషించగలడు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే రైతుపడ్డ కష్టానికి తగినంత ఫలితం చేతికందాలి. మనం రైతును సుఖపడనిస్తున్నామా? లేదే! అతను చేసిన కష్టానికి తగిన వెలకట్టకుండా కష్టాల ఊబిలో ముంచేస్తున్నాం.

మన సుఖం : రైతు శ్రమఫలాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఆహారాన్ని తింటూ, రైతును పట్టించుకోవడం లేదు. రైతును చిన్న చూపుచూస్తున్నాం.

పరిస్థితి మారాలి : సమాజంలో ఈ పరిస్థితి మారాలి. రైతుకు తన శ్రమఫలానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించాలి. దళారులను, స్వార్థ పరులనూ పక్కన పెట్టి వినియోగదారునికీ రైతుకూ సరాసరి సంబంధాన్ని ఏర్పరిస్తే ఇద్దరూ సుఖపడతారు. ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిన ధరలు నేలకు దిగుతాయి. రైతు కూడా సమాజంలో పదిమందితో బాటు తాను కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుం

ఆ. కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని కవి అన్నాడు కదా ! అలా నమస్కరించదగిన రైతులు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు.
దేశంలోని ప్రజలకు అన్నం పెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రాత్రినక, పగలనక రైతులు ఎల్లవేళలా, ఆరుకాలాలు కష్టపడి పనిచేసి, పంట పండిస్తుంటే, అతని కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రైతు పరిస్థితి ఏమిటని ఆలోచించము. రైతుకి, వినియోగదారుడికి మధ్యనుండే దళారులు లక్షలకొద్దీ ధనం సంపాదిస్తుంటే, రైతులకు గిట్టుబాటు ధరలేక, రెండుపూటలా తీసుకోవడానికి గంజీ కూడా లేక పస్తులుంటాడు.

పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు. ఎండ, వాన, చలి లెక్కచేయడు. నిరంతరం తనువేసిన పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. కష్టసుఖాలు ఏవి వచ్చినా మునిలాగా ఒకే విధంగా ఉంటాడు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం ఉండదు. అందుకే కవి కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ. పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.
రైతు ఆత్మకథ
జవాబు.
నేనొక రైతును. ఆరుగాలాలు శ్రమించి పంటలు పండిస్తాను. ప్రపంచానికి ఆకలి తీరుస్తాను.మండు వేసవి ఎండలలో ఆ వేడికి కాలిపోతూ పనిచేస్తాను. వానలో నానుతూ చలికి వణుకుతూ నాగలితో పొలం దున్నుతాను. అడవులలోనైనా రాళ్ళలోనైనా రాత్రిగాని పగలుగాని ఎలా అవసరమైతే అలా వెళుతుంటాను. అలిసిపోతే గులకరాళ్ళను కూడా పట్టించుకోకుండా తలకింద చేయి పెట్టుకొని పడుకుంటాను.

నాకు శత్రువులు, మిత్రులు, కష్టసుఖాలు అన్నీ సమానమే. కార్చిచ్చును, ముళ్ళను, వడగళ్ళను, పెనుగాలి దుమ్మును, ఉరుములు మెరుపులను అన్నింటినీ భరిస్తాను. మంచు కురుస్తున్నా పచ్చిక మీద పడుకుంటాను. ఒక్కొక్కసారి కటిక చీకట్లో దారితప్పిపోతే ఆకలి దప్పికలకు బాధ పడతాను. ఇన్ని కష్టాలు పడినా నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను.
ఎండలకు వానలకు చలికి తట్టుకోడానికి నాకు మంచి ఇల్లు లేదు. చెట్ల నీడల్లోనూ పొదరిళ్ళ బురదలోనూ గడ్డివాములలోనూ తలదాచుకుంటాను. ఒక్కొక్కసారి క్రూరమృగాల మధ్య తిరగవలసి వచ్చినా ధైర్యం కూడగట్టుకొని ఉంటాను. తెల్లవారు జామునే లేచి స్నానం చేయటం, సాత్వికమైన ఆహారం తినటం నా పద్ధతి. ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. మాయమాటలు, మోసాలు, ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకున్నంతలో ఇతరులకు పంచి పెడతాను.
ఈశ్వరుడిచ్చే ఇంద్రపదవిగాని, ప్రకృతి కాంత వలపులుగాని నాకవసరంలేదు. నేను తినే జొన్న సంకటే నాకు పరమాన్నం. నేను కట్టే నూలు బట్టలే చీనాంబరాలు. నా చేతికర్ర నా వజ్రాయుధం. నా కంబళి నాకు వజ్రకవచం. నా పంటపొలాలే నందనవనాలు, నిధి నిక్షేపాలు. నాకున్నంతలో తృప్తిపడతాను. పరుల కోసం పాటుపడతాను. నేను కోరేదొక్కటే. నా శ్రమను గుర్తించండి. తగిన విలువ నివ్వండి.

(లేదా)

అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.

అభినందన పత్రం

కృషీవలా!
ఆరుగాలాలు శ్రమించి అమృతం లాంటి పంటలు పండించి ప్రజలకు పంచుతున్నావు. ఒక్కదినమైనా విశ్రాంతి ఎరుగక కృషిచేస్తావు. నీ కృషికి మా కైమోడ్పులు.

అన్నదాతా!
అన్నంలేనిదే ఏప్రాణీ బ్రతకలేదు. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని ఉత్పత్తి చేసి మనుషులను బ్రతికిస్తున్నావు. గడ్డీగాదంతో పశువులను బ్రతికిస్తున్నావు. అటువంటి నీకు మా జోతలివే.

హాలికా!
పచ్చని పైరులతో చెట్లతో కాలుష్యాన్ని రూపు మాపి అందరికీ ప్రాణవాయువు నందిస్తున్నావు. ఏ వైద్యుడూ ప్రసాదించలేని ఆరోగ్యాన్ని నీవు ప్రసాదిస్తున్నావు. నీకివే మా కృతజ్ఞతాంజలులు.

అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో సంతృప్తి పడిపోతూ సత్ప్రవర్తనతో జీవిస్తావు. తగువులు నీ దరి దాపులకు రావు. మితభాషివై అందరి మేలు కోరుతూ అందరి ప్రేమను చూరగొన్నావు. నీ ఆదర్శ జీవనానికి మా అభినందనలందుకో.

V. పదజాల వినియోగం

1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

(అ) హలం : నాగలి : హలం బలరాముని ఆయుధం.
(ఆ) సైరికులు : రైతులు : సైరికులు అహోరాత్రాలు కష్టపడి పంటలు పండిస్తారు.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
రాత్రి, గరువము, బ్రహ్మ, పసరము, పసువు, చిచ్చు, చందురుడు, పశువు, చంద్రుడు, శుచి, గర్వము, రాతిరి, బొమ్మ

ప్రకృతి వికృతి
రాత్రి రాతిరి
బ్రహ్మ బొమ్మ
శుచి చిచ్చు
గర్వము గరువము
పశువు పసరము, పసువు
చంద్రుడు చందురుడు

3. కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.
(అ) మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు. తాపసికి దీక్ష ఎక్కువ.
జవాబు.
ముని, తాపసి

(ఆ) వానరులు రాళ్ళు తీసుకొనిరాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు.
జవాబు.
రాయి, శిల

(ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి.
జవాబు.
మాపువేళ – సాయంకాలం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

(అ) తాపసేంద్ర = తాపస + ఇంద్ర = గుణసంధి
(ఆ) పరమాన్నము = పరమ + అన్నము = సవర్ణదీర్ఘ సంధి
(ఇ) కేలెత్తి = కేలు + ఎత్తి = ఉత్వ సంధి
(ఈ) గాఢాంధకారము = గాఢ + అంధకారము = సవర్ణదీర్ఘ సంధి
(ఉ) కొంపంత = కొంప + అంత = అత్వసంధి

2. కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.

(అ) రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.
జవాబు.
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది. ఒక విషయాన్ని మరొక విషయంతో అందంగా పోల్చి చెప్పటం ఉపమాలంకారం. వర్ణించే విషయం ఉపమేయం. పోలిక చెప్పే విషయం ఉపమానం. పోలిక తెలిపేపదం ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు గల పోలిక సమాన ధర్మం. ఇక్కడ రైతును మునితో పోల్చి వర్ణించారు. రైతు-ఉపమేయం. ముని ఉపమానం. వలె ఉపమావాచకం. తెల్లవారు జామున లేవడం సమానధర్మం. కనుక ఇది ఉపమాలంకారం.

(ఆ) వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉన్నది. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం. పోలికను ఊహించటం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ చెట్టుకొమ్మను గొడుగువలె ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం.
(ఇ) అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ?
జవాబు.
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం ఉన్నది. ఒకే హల్లు ఒక వాక్యంలో చాలాసార్లు వస్తే దానిని వృత్త్యనుప్రాస అంటారు. ఈ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం ఆవృత్తమైంది.

3. ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.
పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
మొదటి అక్షరానికి లె (ఎ) – రీ ( ఈ) యు ( ఉ) – చుం ( ఉ)
10వ అక్షరానికి యతి చెల్లింది.
పై పాదాలలో ప్రాసగా క్క-క్కి-అనే హల్లు వచ్చింది.
పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.

నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైతి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ‘ప్రాస’ అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస నియమం” అంటారు.

పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఉత్పలమాల :
(1) ఇది వృత్త పద్యం.
(2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
(3) ప్రతి పాదంలో వరుసగా భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వస్తాయి.
(4) ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
(5) ప్రాస నియమం వుంటుంది.
(6) ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

4. ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.
పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే…
ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘త్త’తో, ‘బు’ కు “పుతో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా ని – న్ అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.

చంపకమాల:
(1) ఇది వృత్త పద్యం.
(2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
(3) (పతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
(4) (పతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
(5) (ప్రాస నియమం వుంటుంది.
(6) (పత్రి పాదంలోను 21 అక్షరాలుంటాయి.
5. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయుండి.
(అ) తనకు ఫలంబలేదని యెదం దలపోయడు క్ర్తిగోరు నా
జవాబులు 
ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను నజభజజజర అనే గణాలు ఉన్నాయి. పై పాదంలో మొదటి అక్షరమైన ‘త’ కు 11వ అక్షరమైన ‘దం’తో యతిమైత్రి. పాదానికి 21 అక్షరాలుంటాయి.

(ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
జవాబు.
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో (ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘ఆ’ కు 10వ అక్షరమైన ‘నం’ తో యతిమైత్రి.

(ఇ) బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
జవాబు.
ఇది చంపకమాల పద్య పాదము. ఇందులో (ప్రతి పాదానికి నజభజజజర అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘బ’కు 11వ అక్షరమైన ‘బ’తో యతిమైత్రి.

(ఈ) హర్తకుఁ గాదుగోచరమహర్నిశమున్ సుఖ పుష్టిసేయుస
జవాబు.
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘హ’ కు 10వ అక్షరమైన ‘హతో యతిమైత్తి.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

శ్రీ ప్రసార మాద్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.
జవాబు.
పరిచయం :
టీవీలో నేను చూసిన వ్యవసాయదారుల కార్యక్రమంలో డా॥ వి. ప్రవీణ్ రావుగారితో శిరీష చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.

సేకరణ :
డా॥ ప్రవీణ్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. మన దేశంలో సేంద్రియ వ్యవసాయ స్థితిగతులపై శిరీష అడిగిన ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 25 ని॥ పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో సేంద్రియ వ్యవసాయ విధానం, లాభాలు, శిక్షణ, రైతు విద్య, మార్కెటింగ్, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారాలు తదితర విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. నాకు అర్థమైన విషయాలను నివేదికలో పొందుపరుస్తున్నాను.

నివేదిక :

ప్రపంచమంతటా వాతావరణ కాలుష్యం అధికమై మానవ జీవనం ప్రమాదంలో పడిపోయిన ఈ తరుణంలో జీవవైవిధ్య రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, మానవారోగ్యాన్ని కాపాడుకునేందుకు, తక్కువ ఖర్చుతో రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తూ లాభాలను అందించగల వ్యవసాయ విధానం “సేంద్రియ సేద్యం”. ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, బెరళ్ళు, పశువుల పేడ, నూనెలు, రసాలు ఉపయోగించి పంటలకు అవసరమైన ఎరువును, క్రిమిసంహాయరక మందులను తయారు చేయడం, విత్తనశుద్ధి, పంటల పెంపకం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక పదార్థాలను నియంత్రించడం సేంద్రియ సేద్యం యొక్క ప్రత్యేకతలు.

ఈ విధానంలో వ్యవసాయం చేయడంలో పశుపోషణ కూడా ఒక భాగం. పశువులను శ్రద్ధగా, పద్ధతి ప్రకారం పోషించడం వల్ల వాటి నుంచి లభించే మలమూత్రాలు సస్యరక్షణకు, పోషణకు ఎంతగానో ఉపకరిస్తాయి. మంచి వాతావరణం, కావలసిన పోషక పదార్థాలు తగినంతగా లభించడం వల్ల పశుపక్ష్యాదులు వృద్ధి పొంది, పంట నష్టాన్ని చాలా వరకు నివారిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత కారణంగా మార్కెట్లో అధిక ధరలు పలికి, రైతుకు లాభం చేకూరుస్తాయి. ఈనాడు మార్కెట్లో దొరికే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ రసాయనాల బారిన పడి ప్రజారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

సేంద్రియ సేద్యంలో అది పూర్తిగా నివారింపబడటం వల్ల అందరూ వాటిని ఇష్టపడతారు. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లకు కూడా రసాయనాల బాధ తప్పని ఈ కాలంలో ఇటువంటి వ్యవసాయం ఎంతో శ్రేష్ఠమని, భారతదేశంలో పరిస్థితులు, జీవన విధానం ఈ పద్ధతికి బాగా నప్పుతుందని డా॥ వి. ప్రవీణ్ రావుగారు చెప్పడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని రైతులందరూ అనుసరించాలని, ప్రజలు బాగా ఆదరించాలని, ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించాలని, వ్యవసాయాధికారులు చక్కగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.




డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...