మే మాసం తంగేడు పత్రికలో
భగవంతం గారి 'లోయ చివరి రహస్యం' కథ సంపుటి పై
నా సమీక్ష.
ప్రచురించిన తంగేడు యాజమాన్యానికి, సంపాదకులు కాంచపల్లి గోవర్ధన రాజు గారికి, ఘనపురం దేవేందర్ గారికి కృతజ్ఞతలు.
తప్పకుండా చదివి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలు రాయగలరు.
శూన్యం భర్తీ చేసిన లోయ చివరి రహస్యం
‘గద్యం కవీనాం నికషం వదంతి’ అనే ప్రసిద్ధోక్తి ఉంది అంటే కవి ప్రతిభకి గద్యమే గీటురాయి అని అర్థం. అలా గద్యాన్ని హృద్యంగా, మార్మికత కలసిన తాత్వికతతో రసోద్భవం కలిగించేలా రచించించిన కథల సమాహారమే రచయిత భగవంతం వెలువరించిన ఆయన మొదటి కథా సంకలనం ‘లోయ చివరి రహస్యం’.
కవి కథకుడు అయితే పదునైన వాక్యం ఎలా ప్రయోగించగలడో, వాక్య విన్యాసాలతో , పదాల అల్లికలతో ఎలా పఠనానందం కలిగించగలడో ఈ కథలు చదివితే తెలుస్తుంది.
ఈ కథల్లో మౌనం మాట్లాడుతుంది. శబ్ధం నిశ్శబ్ధాన్ని వెదుక్కుంటుంది. కథనం వేసవిలో చల్లగాలిలా మనసులోకి వీస్తుంది.
‘చల్లగాలి చర్మాన్ని దీవిస్తోంది’ అంటూ మొదలయ్యే ‘చంద్రుడు గీసిన బొమ్మలు’ కథలో చుట్టూ ఉన్న శూన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నట్టుగా వెన్నెల ఉందని కవిత్వీకరిస్తాడు రచయిత. ఆ పున్నమి రాత్రి చంద్రున్ని చూస్తూ పరవశానికి లోనైనా కథలోని పాత్రకు
‘‘బుద్ధుడు
చూసిన చంద్రున్ని
నేను చూస్తున్నాను’’ అనే భావనా కలిగి ఆ భావం జపనీస్ కవితా ప్రక్రియ అయిన హైకూలా అనిపించడంతో అలాంటి భావన కలిగినవారు సృష్టిలో ఇప్పటివరకూ ఎవరెవరు ఉన్నారో తెలియజేయగలవనే చంద్రుడిని అడిగిన ప్రశ్నకు చంద్రుడు సమాధానమిచ్చాడా? లేదా? అనేది కథ చదివి తెలుసుకోవాల్సిందే.
పక్షిలా రూపాంతరం చెందాలని బయలుదేరిన మనిషికి మనిషిలా రూపాంతరం చెందాలని బయలుదేరిన పక్షి ఎదురుపడితే ఎత్తైన కొండల మధ్యలో ఉంచి లోతైన లోయలమీదుగా రైలు పట్టాల మధ్యలోంచి వారి ఇరువురు రాత్రంతా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే- చివరికి వారు ఆశించిన ప్రయోజనం నెరవేరిందా లేదా అవగతం అవ్వాలంటే ‘లోయలోని రహస్యం’ కథను చదవాలి.
జీవన ఎడారిలో ఆశల పూలు పూయించే మరో కథ ‘వెలుతురు’. ఆత్మహత్య చేసుకుందామని చెరువులోకి దూకిన యాభై ఏళ్ల వ్యక్తిని చెరువులోని చంద్రుడి ప్రతిబింబం కాపాడి ఒడ్డున తన ఒళ్ళో పడుకోబెట్టుకొని స్వాంతన చేకూరుస్తూ ఆ చెరువులోని చేపలు చెప్పిన కవిత్వం చెప్పి, అతనికి జీవితం మీద ఆశలు రేకెత్తిస్తుంది. ఆ కవితల్లోని ఒకే వాక్యం ఇచ్చిన కాంతి సహాయంతో అతడు తన మిగిలిన జీవితం వైపు బయలుదేరుతారు. ఆ వాక్యం ఏమై ఉంటుందో ఆ చెరువులోని చేపలు చెప్పిన కవితలు ఏమిటో అసలు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో ‘వెలుతురు’ కథలో మనకు తారసపడతాయి.
‘కొండను తవ్వి ఎలుకలు పట్టినట్లు’ అనేది నానుడి. అయితే ఒక ఎలుకకు ఎవరికి రాని సందేహం ఒకటి వస్తుంది. ‘ఈ మనుషులు కొండను తవ్వి ఎలుకను పట్టడానికైనా శ్రమిస్తారు కానీ ఎలుకను తవ్వి కొండను పట్టడానికి ఎందుకు ప్రయత్నించరు’ అని. అసలు ఎలుకను తవ్వి కొండలు ఎందుకు పట్టాలి అన్న సందేహం మీకు కూడా వచ్చినట్లయితే ఒక పురాతన మానవుడు పురాతన ఎలుక చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఆ ప్రయోగాన్ని ‘వెలుగు పూలు’ కథ మనసుకు హత్తుకునేటట్లు ఆవిష్కరిస్తుంది.
వేసవి సెలవుల్లో భువనేశ్వర్ దగ్గర అడవుల్లో ‘శూన్యాన్ని ఆరాధించే యోగుల బృందాన్ని’ కలవడానికై ప్లాన్ చేసుకున్న ఒక వ్యక్తి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని అనుభూతుల్ని మిగిల్చింది అన్నింటికన్నా ముఖ్యంగా చివరికి ఏమైందో తెలుసుకోవడానికి చిట్టచివరి సున్నా కథను తప్పక చదివి తీరాలి మార్మికత, తాత్వికత రెండు పట్టాల చివరి వరకు కొనసాగుతూ ఉత్కంఠంగా సాగిన కథ ఇది.
ప్రపంచంలో మనం ఉన్నట్లు మన చుట్టూ ప్రపంచం ఉంటుంది. ఎవరికి వారే ఒక ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల్లో జీవితం కొందరికి కలలోని కలలా అనిపిస్తుంది. అలాంటి ఒక్క కల రావడానికి ముందు వెనుకా ఒక వ్యక్తి చేసిన ప్రయాణమే ‘గోధుమ రంగు ఆట’ అనే కథ. ప్రఖ్యాత రచయిత త్రిపుర ‘భగవంతం కోసం’ కథకు కొనసాగింపు లాంటి కథ.
ఒక్క శీర్షికలోనే తప్ప ఈ కథలు ఇంకెక్కడా ‘భగవంతం కోసం’ కథ తాలూకు నీడలు పడకుండా రచయిత జాగ్రత్త పడ్డాడు అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో నీ కథలలో అధికసార్లు ప్రయోగించిన పదం శూన్యం మనుషులకు ప్రకృతికి మధ్య ఏర్పడిన శూన్యం భర్తీ చేయబడాలని ఈ రచయిత ఆశిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ కథలన్నీ చదివాక, పుస్తకం చదివాక పూర్తయ్యాక మనసులో హృదయంలో ఆత్మలో ఒక సహానుభూతి మిగిలిపోతుందని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. ఇది రచయిత తాత్వికంగా, తార్కికంగా, మార్మికంగా తన బయటకి లోపలికి చేసిన ప్రయాణం తాలూకు అనుభూతులతో అనుభవాల సంపుటి.
వాక్యాన్ని వడగట్టి నిలిపిన గతకాలపు రచనల చింత ఈ పుస్తకాన్ని చేర్చవచ్చు. కొత్తగా రచనలు చేయాలనుకునే వారే కాకుండా రచనలు చేస్తున్న వారు కూడా తప్పక చదవాల్సిన పుస్తకం లోయ చివరి రహస్యం.
ఈ పుస్తకం వివరాలు:
‘‘లోయ చివరి రహస్యం’’ (కథలు), రచన: భగవంతం, పేజీలు: 117, వెల: రూ. 150, ప్రతులకు: ఎమెస్కో, 9000413413, 9399328997.
డాక్టర్ సిద్దెంకి యాదగిరి ౯౪౪౧౨౪౪౭౭౩