సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

జంబూ సాహితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జంబూ సాహితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మే 2026, బుధవారం

neeli nela ethalu - 1, తెలంగాణ దళిత కథా పరిణామం



తెలంగాణ దళిత కథా పరిణామం 



"వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యాన్ని స్థాపించాలి." — డా. బి. ఆర్. అంబేడ్కర్.

"నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించుకునే హక్కులేని దళితులు ఈ రోజు సమూహ జీవితాన్ని శాసిస్తామని ముందుకొస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అపూర్వ సందర్భం" అని బాలగోపాల్ తన 'దళిత' వ్యాససంపుటిలో అభిప్రాయపడ్డాడు.

మనిషిని మనిషిగా కాక కులదృక్పథంతో చూసే నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఏర్పడడంతో భారతీయ సమాజం అంతరాలతో, అభ్యంతరాలతో నిండిపోయింది. వైరుధ్యాలతో కులగర్వం పెరిగింది. ఏ రెండు కులాలు ఒకటిగా లేకపోవడం, ఏ కులానికి ఆ కులపు ప్రత్యేకత ఉండడం ఒక ముఖ్య కారణమయ్యాయి. ఛాందసవాద ఆచారాలు, కఠిన సంప్రదాయాలు, మూఢత్వంతో నిండిన కట్టుబాట్లు, నియమాలు రూపొందించుకోవడం వల్ల కులాల మధ్య, మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టించబడి అధికమయ్యాయి. కొంచెం తీవ్రత తగ్గినా చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. తత్ఫలితంగా మనుషుల మధ్య స్పష్టమైన విభజనరేఖ గీయబడింది. ప్రాచీన సాహిత్యంలో అధికభాగం వర్ణవ్యవస్థను సమర్థించింది.

వర్ణవ్యవస్థను రూపుమాపాలని కలలుకన్న సాహిత్యం మనుషులంతా ఒక్కటే అని చాటింది. అందరూ ఒక్కటే అనే సిద్ధాంతం ద్వారా పాల్కురికి సోమన్న, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, దున్న ఇద్దాసు మొదలైనవారు తమ పద్యాలు, గేయాలు, తత్త్వగీతాల ద్వారా తెలుగు సమాజంలో మార్పును ఆకాంక్షించారు. సాహిత్యంతో బలమైన ముద్రవేశారు. అయినప్పటికీ కుల ఛాందసవాదం ఊగి ఆగిన ఊయల తీరే ఉంది.

ఫూలే దంపతుల నిస్వార్థ సేవ, అంబేడ్కర్ పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా హరిజనోద్ధరణకు పిలుపునిచ్చింది. నిరసనల నడుమ దళితుల ఆలయ ప్రవేశాల కోసం కృషిచేసింది. స్వాతంత్ర్య కాలంలో ఆధునిక భావాలు ఆహ్వానించబడినప్పటికీ అవి వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తేలేకపోయాయి. కూటికి పేదనే అయినా కులానికి తక్కువనా? అనే కులాహంకారం నిండిపోయింది.

కులాలకు మూలం వర్ణవ్యవస్థ. కులనిర్మూలన జరగాలంటే వర్ణనిర్మూలన జరగాలని 'వర్ణనిర్మూలన' సిద్ధాంతాన్ని గ్రంథరూపంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించారు. కులవ్యవస్థ మనుషుల్ని కలవనివ్వలేదు. "కులవ్యవస్థ శ్రామికుల్ని సైతం విభజించింది" అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు. కులం మనుషులను విభజించడానికి మాత్రమే ఉపయోగపడిందని అర్థమవుతుంది. ఒక కులం మీద ఒక కులం నిచ్చెనమెట్ల తీరుగా తారతమ్యాలు సృష్టించబడ్డాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తన Who Were the Shudras (1946) అనే పుస్తకంలో, శూద్రులు అనాదిగా హిందూ సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థలో నాల్గవ వర్ణంగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవకులుగా పరిగణించబడ్డారని పేర్కొన్నారు. వీరు ఆర్యుల తెగలకు చెందినవారని, బ్రాహ్మణులతో జరిగిన సంఘర్షణ కారణంగా హోదా కోల్పోయి తక్కువ కులంగా మారిన రాజవంశీకులని ఆయన వాదించారు. ఇదే అంశాన్ని — బింబిసారుని (క్రీ.పూ. 542) కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థలో భాగమైన శూద్రులకన్నా హీనంగా మరొక వర్ణం, పంచమవర్ణాన్ని సృష్టించినట్లు — రొమిల్లా థాపర్ (తరతరాల భారత చరిత్ర) పేర్కొన్నారు. కాలక్రమేణ కులాల మధ్య అంతరాలు ఆర్థిక, ఆధ్యాత్మిక, వృత్తిపర, సామాజిక వివక్షకు దారితీశాయి. నీచవృత్తులు చేసే మనుషులను నీచంగా చూడడంతో అంటరానితనం వేళ్లూనుకుపోయింది. ఒకప్పుడు వెలుగువెలిగిన ఈ దేశ మూలవాసులు శూద్రులుగా మార్చబడ్డారని అవగతమవుతుంది. శూద్రులు పంచములుగా పిలువబడుతున్నారు. పంచములు అంటే హిందూ సాంప్రదాయ చాతుర్వర్ణ వ్యవస్థ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) పరిధిలోకి రాని, ఆ వ్యవస్థకు వెలుపల ఉన్న అణగారిన వర్గాల వారు (దళితులు/అస్పృశ్యులు) అని అర్థం. వీరు సాంప్రదాయ కులనిచ్చెనమెట్లలో ఐదవ వర్ణంగా లేదా అంతకంటే తక్కువగా పరిగణించబడేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో హరిజనులు (దేవుని బిడ్డలు) గా సంబోధించబడినవారే ఇప్పుడు దళితులుగా పిలువబడుతున్నారు. స్వాతంత్ర్యానంతర కాలంలో దళితుల జీవితం తెలుసుకోవాలంటే సాహిత్యం అధ్యయనం చేయాల్సిందే. సాహితీ ప్రక్రియలు చాలా ఉన్నాయి. కథకు మానవ జీవితంలో విశేషమైన పాత్ర కలదు. పండిత పామర జనరంజకంగా ఆదరించబడుతుంది.


దళిత పదం వివరణ: 'దళిత' అను శబ్దానికి ఖండించబడిన, చీల్చబడిన, వెలివేయబడిన అను అర్థాలున్నాయి. (ఇంగులం — దళిత అస్తిత్వ వ్యాసాలు, శ్రీనివాస్, సంగిశెట్టి). 1972లో మహారాష్ట్రలో దళిత పాంథర్స్ మ్యానిఫెస్టో ప్రకటించిన ప్రకారం — "దళితులంటే... షెడ్యూల్డ్ ట్రైబ్స్, నయా బౌద్ధులు, శ్రామికులు, భూమిలేని పేదలు, రైతులు, మహిళలు, ఆర్థికంగా, రాజకీయంగా, మతం పేరిట దోపిడీకి గురయినవారందరూ దళితులే!" అయితే ప్రస్తుతానికి 'దళిత' అనే పదం షెడ్యూల్డ్ కాస్ట్స్‌కు పరిమితమైంది. సామాజికంగా అంటరానివారిగా పరిగణింపబడుతున్న కులాలకు మాత్రమే ఈ పదం వర్తించబడుతోంది.


తెలుగులో దళిత సాహిత్య భూమిక: 9వ శతాబ్దంలో శాసనభాషగా, 11వ శతాబ్దం నుండి అనువాదంతో ప్రారంభమైన తెలుగుకు వెయ్యేళ్ల లిఖిత చరిత్ర ఉంది. ఆధునిక తెలుగు దళిత సాహిత్యం పేరులేని రచయిత రాసిన 'మాలవాండ్ర' పాటతో (1919) ప్రారంభమైందని చెప్పాలి. మంగిపూడి వేంకటశర్మ 'నిరుద్ధ భారతం' (1933), కథాప్రక్రియలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర (1925) పత్రికలో 'పుల్లంరాజు', 'ఇలాంటి తవ్వాయి వస్తే' కథలతో దళిత దృక్కోణం వెలువడింది. అడివి బాపిరాజు 'నరసన్న పాపాయి', కరుణకుమార 'పోలయ్య', చలం 'హరిజన సమస్య', గోపిచంద్ 'చెప్పులు కుట్టేవాడు' మొదలైన కథలు వెలువడ్డాయి. ఈ కథలను సహానుభూతి సాహిత్యమే తప్ప అనుభూతి సాహిత్యం కాదని విమర్శకులు తేల్చారు.

తొలి తెలుగు దళితకథ, తొలి తెలంగాణ దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 1931లో 'వెట్టిమాదిగ' కథను అజ్ఞాతవాసి పేరిట రాశాడు. ఈ మధ్యకాలంలో సంగిశెట్టి శ్రీనివాస్ వివరిస్తున్న కథ 'నేరేడు పండ్ల కంటు' (గోలకొండ పత్రిక 1926–1935) 1930లో శ్రీనివాస్ అనే యానాం దళితుడు రాసిన తొలి దళిత కథగా ప్రకటిస్తున్నాడు. తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ 'ఇంకెక్కడి విజయం' (1934) గృహలక్ష్మి పత్రికలో అచ్చయింది. తెలంగాణ తొలి దళిత కథా రచయిత్రి జనగామకు చెందిన మామిడి సత్యవతి 'తెరతొలగింది', 'హితువు', 'సుశీల', 'స్వేచ్ఛ' మొదలైన కథలు రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత కథాసంకలనం డా. ఆర్. చంద్రశేఖరరెడ్డి మరియు కె. లక్ష్మీనరసయ్య సంపాదకత్వంలో 'దళిత కథలు' (1996) విశాలాంధ్ర ప్రచురించింది.

కంచికచెర్ల కోటేశు హత్య (1968, ఫిబ్రవరి 24) తో దళిత స్పృహ రచయితలలో కలిగినా, మహారాష్ట్రలో దళిత పాంథర్స్ వల్ల దళిత సాహిత్యం సామాజికోద్యమంగా వికాసం చెంది తెలుగు నేలకు వ్యాపించింది. కారంచేడు సంఘటన (1985, జూలై 17) దళిత సృజనకారులలో మరింత దళిత దృక్పథాన్ని మేల్కొల్పింది. తెలుగు సృజనకారులు వివిధ ప్రక్రియలను ఆశ్రయించి ప్రజలను జాగృతం చేశారు. ప్రధానంగా పాట సుడిగాలిలా చుట్టేసింది. కథా ప్రక్రియ అందరికీ చేరింది.


దళిత కథ పుట్టుక: మనిషి పుట్టినప్పుడే కథ పుట్టిందంటారు కదా! మరి దళితకథ? జీవితంలోంచి, అణచివేతలోంచి, పీడనలోంచి ఉద్భవించింది. దళితకథలో శిల్పం, శైలీ లేదు, నైపుణ్యం లేదనే వారున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వివక్షలేని జీవితం దళితులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందనే విషయం గ్రహించాలి. అందమైన అల్లిక గురించి ఆలోచించకుండా అణచబడుతున్న జీవితాల గురించి ఆలోచించినప్పుడు ఇలాంటి విమర్శ రాదు. దళితులకు విశేషమైన జీవితముంది. విషయ విస్తృతి ఉంది. లెక్కకు మించి వివక్షలు (అకాడెమిక్ అన్‌టచ్‌బిలిటీస్) ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారికి కిరాయి ఇల్లు దొరకని వ్యవస్థలోనే ఉన్నామనేది ఎవరూ ఆలోచించరు. దళిత కథ దినదిన ప్రవర్థమానమవుతూనే ఉంది.

దళిత దృక్పథంతో తొలి కథాసంపుటి బోయ జంగయ్య 'లోకం' (1997). తొలి దళిత కథాసంకలనం ప్రచురించారు. భార్గవీరావు సంపాదకత్వంలో 'ఇంకానా? ఇకపై సాగవు' (1994), గుండెడప్పు కనకయ్య సంపాదకత్వంలో వెలువడిన కథాసంకలనం 'ఎదురుచూపులు' (1998), వారిదే దళిత చైతన్యంతో రాసిన తొలి కథాసంపుటి 'మేమిట్లుండం' (1998) వెలువడ్డాయి. గోగు శ్యామల సంపాదకత్వంలో 'నల్లపొద్దు' (2002) — యాభై రెండు మంది దళిత స్త్రీల సాహిత్య సంకలనం; జూపాక సుభద్ర, గోగు శ్యామల సంపాదకత్వంలో 'నల్లరేగడి సాళ్లు' (2006) — మాదిగ ఉపకులాల మహిళా కథలు; జాజుల గౌరి 'మన్ను బువ్వ' (1999) మొదలైన కథాసంపుటాలు వచ్చాయి. డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య సంపాదకులుగా జంబూ సాహితీ సంపాదకత్వంలో దళిత కథావార్షికలు రూపుదిద్దుకున్నాయి — 'తొండం బొక్కెన' (2020, దేశంలోనే తొలి దళిత కథావార్షిక), 'చిందూనేల' (2021), 'సాక' (2022), 'కొమ్ము' (2023), 'గండదీపం' (2024).


తెలంగాణ కృషి: తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటయ్యాక కథాసాహిత్యంపై వెలువరించిన సంకలనం 'మూడు తరాల తెలంగాణ కథ'లో తెలంగాణ తొలి దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 'వెట్టిమాదిగ' కథకు, యువ దళిత కథా రచయితలకు చాలామందికి స్థానం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ, దామోదరరావుల సంపాదకత్వంలో ఆంగ్లంలో Telangana Harvest: Telugu Short Fiction (1912–2011) — తొలితరం కథకులతో పాటు జాజుల గౌరి, జాతశ్రీ, పసునూరి రవీందర్‌ల కథలున్నాయి. తెలంగాణ తొలి కేంద్ర సాహిత్య యువపురస్కారం డా. పసునూరి రవీందర్ 'అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా' (2015) కథలకు వరించడం దళిత కథకు దక్కిన ఆత్మగౌరవమే. సిద్దెంకి యాదగిరి 'తప్ష' కథల సంపుటికి 2019 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారం వరించడం కూడా దళిత కథకు దక్కిన గౌరవంగా భావించాల్సిందే. తెలంగాణ దళిత కథను సుసంపన్నం చేస్తూ కథలు రాస్తూ అస్తిత్వ పతాక ఎగురవేస్తూ దళిత జీవితాలను ఆవిష్కరిస్తున్నారు.


తెలంగాణ కథాసాహిత్య చరిత్ర: తెలంగాణలో పురుడు పోసుకున్న దళితోద్యమం భారతదేశానికే దిక్సూచిగా నిలిచింది. హైదరాబాద్‌లో 1917లో స్థాపించిన ఆది హిందూ ఉద్యమం ప్రోద్బలంతో 1936లో డా. బి.ఆర్. అంబేడ్కర్ అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్యను స్థాపించారు. ఈ ఉద్యమానికి ఎం.వి. భాగ్యరెడ్డి వర్మ, బి.ఎన్. వెంకటరావు, అరిగె రామస్వామి త్రిముఖ ద్వారాలుగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమాల ఖిల్ల. నిరంతరం చైతన్యం పుణికిపుచ్చుకున్న నేల. ఈ నేలలో కథాసాహిత్యం కూడా పోరుగాథలను, ఉద్యమాలను చిత్రించింది. దళిత కథల్లో అస్తిత్వంతో పాటు దళిత దృక్పథాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించాయి. 'వెట్టిమాదిగ' కథతో ప్రారంభమైన తెలంగాణ అనేక కథలకు జీవంపోసింది. కథాసంపుటాలు, సంకలనాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో ఎనభై ఆరుగురు దళిత కథకుల కథలతో 'తెలంగాణ దళిత కథలు' పుస్తకానికి రాసిన ముందుమాటలో సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ దళిత కథలను ఐదు దశలుగా విభజించారు — తొలిదశ భాగ్యరెడ్డి వర్మ కాలం (1931–1956), రెండో దశ బోయ జంగయ్య కాలం (1956–1970), మూడో దశ జాతశ్రీ–కనకయ్యల కాలం (1970–2000), నాల్గో దశ స్త్రీ త్రయ కాలం (2000–2014), ఐదో దశ యువకాలం (2014– ...). ఆయా కాలాల్లో ప్రభావితం చేసిన రచయితల వల్ల ఆ కాలాలుగా విభజించారు. వారు సూచించిన కాలానంతరం కూడా కథలు రాశారు — ఉదా. బోయ జంగయ్య కాలం 1956–1970 అనుకుంటే వారు 'మూలాలు' కథ 2005లో రాశారు. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేస్తే పొడిచిన పొద్దును, నడిచిన కాలాన్ని, గడిచిన బతుకు వేదనలను అధ్యయనం చేస్తే దళితుల జీవితం అర్థమవుతుంది. కాలాలు సరే కాని కథకులను కాలకర్తలుగా కాకుండా కాలాన్నే ప్రమాణికంగా తీసుకుందాం. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేద్దాం.


15, జులై 2025, మంగళవారం

"కొమ్ము" దళిత కథ 23 సంపాదకులతో 'సంచిక' ఇంటర్వ్యూ






కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ

నమస్కారం. సార్.
సంపాదకులు: నమస్కారం సార్.
~
1. జంబూ సాహితీ తరఫున మీ సంపాదకత్వంలో 'కొమ్ము' దళిత కథా సంకలనం వెలువరించినందుకు అభినందనలు. దళిత కథా వార్షిక సీరిస్‌ 2020లో మొదలైంది. అప్పటి నుంచి మీ ముగ్గురే సంపాదకులుగా ఉంటున్నారా? లేక ప్రతీ సంవత్సరం కొత్త సంపాదకులు బాధ్యత తీసుకుంటున్నారా?
సం: మేం ముగ్గురమే కొనసాగుతున్నాము. 2020 లో వెలువడిన తొలి దళిత కథ 'తొండంబొక్కెన', దేశంలో వెలువడిన తొలి దళిత కథ వార్షికగా ప్రసిద్ధికెక్కింది.
2.  చిందూ నేల-2021,
3. సాక - 2022,
4. కొమ్ము - 2023 ఆయా సంవత్సరంలో వెలువడిన కథల నుండి ఎంపిక చేసిన ఉత్తమ కథలను సంకలనంగా తెస్తున్నాం. ప్రారంభం నుంచి ఇప్పటివరకు నేను( డా. సిద్దెంకి యాదగిరి), గుడిపల్లి నిరంజన్ తప్పెట ఓదయ్య లము కలిసి సంపాదకులుగా వ్యవహరిస్తున్నాము. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం.
 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


2. జంబూ సాహితీ దళిత కథా వార్షికల ప్రచురణకే పరిమితమా లేక దళిత రచయితల కొత్త పుస్తకాలు ప్రచురిస్తుందా? జంబూ సాహితీ నేపథ్యం గురించి వివరించండి.
సం. ప్రారంభం నుంచి ఇప్పటివరకు దళిత కథ వార్షికలకి తొలి ప్రాధాన్యమిస్తున్నాము. మీరన్న కోరిక ఆలోచనలో ఉంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మున్ముందు విస్మృతికి గురైన దళిత సాహిత్యంను జంబూ సాహితీ ప్రచురించడానికి ముందుంటుంది.
2019 మార్చిలో కరోనా పాండమిక్ సిచువేషన్ ప్రపంచాన్ని బంధించింది. ఆ సమయంలో కవులు, కళాకారులు, రచయితలు తమదైన శైలిలో సామాజిక మాధ్యమాలను ఆశ్రయించి ఫేస్బుక్ యూట్యూబ్, జూం మొదలైన అంతర్జాల వేదికల ద్వారా పుస్తకావిష్కరణలు, సమీక్షలు, పరిచయాలు, విశ్లేషణలు ఇంటర్వ్యూలు మొదలైనవి. అలా సాహితి కార్యక్రమాలు  జరుగుతున్న నేపథ్యంలో దళితులకు వేదికంటూ లేని సమయంలో దళిత కథా సాహిత్యం, సంస్కృతి, జీవితాల మీద చర్చించడం జంబూ సాహితీ వేదికగా కార్యక్రమాలు ప్రారంభించాం. ఆనాటి జూమ్ వేదికలకు మా ముగ్గురితో పాటు జూపాక సుభద్ర, గోగు శ్యామల, డా. తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, సంపంగి శంకర్, గంధం విజయలక్ష్మి మొదలగు వారము కలిసి నిర్వహించాము. ఆ కార్యక్రమాలకు ఆయా రంగాలలో విషయ నిపుణుల ద్వారా జూమ్, గూగుల్ మీట్ వేదికగా ప్రసంగ కార్యక్రమాలు నిర్వహించాం, అలా నిర్వహించడానికి మేము ఎంచుకున్న పేరు జంబు సాహితీ. ఈ పేరును ఎంచుకోవడానికి గల కారణం భారతదేశాన్ని జంబుద్వీపమని  పిలుస్తారు‌. చారిత్రకారుల అభిప్రాయం ప్రకారం దళితులే ఈ దేశ మూలవాసులు. ఈ దేశ చారిత్రక పునాదులు దళితులే. పురాణ సాహిత్య క్రమాన్ని అనుసరించి ఈ దేశాన్ని మహాబలశాలి, అరి వీర భయంకరుడు, ధైర్యవంతుడు, కరుణ రసా హృదయుడు, జాంబవంతుడు అనే మహా చక్రవర్తి పరిపాలించాడు. అతని మూలంగానే ఈ దేశానికి జంబుద్వీపమని పురాణాల్లో పిలువబడుతుంది. వారి సంతతి మాదిగలు మరియు దళితులు. మనం ఎక్కడికి వెళ్లినా మన మూలాలను మర్చిపోవద్దని పెట్టుకున్న పేరే జంబు సాహితి. జంబూ  సాహితీ అంతర్జాల వేదికగా 36 ప్రసంగాలు నిర్వహించింది. జంబూ సాహితీ ప్రధాన భూమిక పోషిస్తూ ప్రముఖుల 32 ప్రసంగాలు యూట్యూబ్ లో నిక్షిప్తం చేసాం.
 

జంబూ సాహితి


3. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం ప్రచురణ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టారు? పూర్తయి పుస్తక రూపంలోకి రావడానికి ఎంత కాలం పట్టింది?
సంపాదకులు: 2023 జనవరి మొదటి తేదీ నుంచి కొమ్ము (తర్వాత పేరు పెట్టాము) డిసెంబర్ 31 వరకు నిరంతరం కొలుసాగుతుంటది. దళిత కథ అంటే దళితులు మాత్రం రాసిన కథలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లలో ఎక్కడ ప్రచురితమయ్యాయి మొదటిగా వెతుకుతాము. మేము (సంపాదకులుగా) చదువుతాము. ప్రాథమిక దశలోనూ కొన్ని కథలు ఎంపిక చేసి అందులోంచి మరికొన్నిటిని వడపోసి ఫిబ్రవరి నెలాఖరువరకు డ్రాఫ్ట్ కాఫీని సిద్ధం చేసుకుంటాము. మార్చి / ఏప్రిల్ లో ప్రముఖులకు ఈ కథలను పంపించి వారి సూచనలు సలహాలు పాటిస్తాం. తుది నిర్ణయం మాత్రం సంపాదకులుగా మేమే తీసుకుంటాం. పుస్తమ్కమ్ పూర్తయ్యే సరికి అక్టోబర్ మాసం  వచ్చింది.
 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


4. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం ప్రచురణలోని సాదకబాధకాలను వివరిస్తారా? ఏవైనా ఆటంకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?
రచయిత తన పుస్తకాన్ని తేవడానికి అనేక వ్యయప్రయాసలకోర్చేది మీకు తెలియంది కాదు. వ్యక్తిగతంగా ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం వ్యవస్తీకృత పనులలో ఉండదనే విషయాన్ని గమనించాలి. ఏ విషయమైనా మేము ముగ్గురం ప్రతిపాదించుకొని చర్చించుకొని, విశ్లేషించుకొని స్పష్టంగా ఒక అంచనాకు వచ్చి ముందుకు వెళుతూ ఉంటాం. కథల్ని వెతకడం, చదవడం, ఎంపిక చేయడం, డీటీపీ చేయడం, పేజీ సెట్టింగ్, కవర్  డిజైనింగ్, బుక్ సెట్టింగ్, బుక్ ప్రింటింగ్, ఆవిష్కరణ సభ నిర్వహణ మొదలైన అన్ని ఖర్చులు కలుపుకుంటే ప్రతి సంవత్సరం దాదాపు నలభై వేల రూపాయల ఖర్చు దాటుతుంది. మేము చిరు ఉద్యోగులం. ఉపాధ్యాయులం. మాకు ఉన్న వెసులుబాటును అనుసరించి మూడు సంకలనాలు సొంతంగా మేమే తెచ్చాము. నాలుగవ కథా వార్షికకు తెలంగాణ ఉద్యమకారులు, దళిత మేథావి, ఉద్యోగ నాయకులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య కమిషనర్ గారు తాను సహకారం అందిస్తానని, నా వంతు సహకారం ఉండనీ అని వారు అన్నారు. పదిహేను వేల రూపాయల సహకారం అందించారు. వారి తల్లిగారు ఎంతో మంది ఉద్యమ కారులకు ఆశ్రయమిచ్చింది. అందువల్ల తిప్పర్తి గాలమ్మకు అంకితం ఇవ్వడం సహేతుకమని భావించి ఆమెకి అంకితం ఇచ్చాము. కొలకలూరి ఇనాక్, ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు, సతీష్ చందర్, ఆచార్య గుండె డప్పు కనకయ్య, ఆచార్య సూర్యా ధనంజయ్, ఆచార్య కాశీమ్, ఆచార్య కోయి కోటేశ్వర రావు, జీలుకరా శ్రీనివాసు, గడ్డం మోహన్ రావు,  ప్రోత్సాహమూ ఉంది. ఫెస్బుక్ వాల్ పైన అభినందనలు చెప్పనివారూ వున్నారు. ఎవరో మెచ్చుకోవాలనీ ఈ పని చేయడంలేదు. మావంతు బాధ్యతగా తలపెట్టిన కార్యంగా భావిస్తున్నాము.  ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలని పానుగంటి లక్ష్మీ నరసింహా రావు సాక్షి వ్యాసాల్లో చెప్పినట్లు పని చేసేవారినే విమర్శిస్తారు. ఆ విమర్శలను నిర్ధేశంగా మార్చుకుంటాము. 


జంబూ సాహితి

 
5. సంపాదకులు ముగ్గురు, ఎవరెవరు ఏయే బాధ్యతలు చూసుకున్నారు? సలహాలు, సూచనలు కాకుండా ఒకరి పనుల్లో ఒకరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదైనా వచ్చిందా? వస్తే ఎందుకని వచ్చింది?
సంపాదకులు: ప్రధానంగా కథలు చదవడం అందరి బాధ్యత. ఎవరి అభిప్రాయాలు వాళ్లు రాసుకుంటాం. చర్చించుకుంటాము. ప్రజాస్వామ్య పద్ధతిలో భావాలను విశ్లేషించుకుంటాం. ఒకరి పనులలో ఒకరం జోక్యం చేసుకోం. సేకరణ నుంచి మొదలుకొని పుస్తకం ముద్రించబడి ఆవిష్కరణ కార్యక్రమం వరకు బాధ్యతలను పంచుకుతాము. ఎవరమైన ఏ పనినైనా చేయడానికి సంసిద్ధమవుతాము. ఫోన్ ల నుంచి మొదలుకొని  అధ్యక్షతను, వందన సమర్పణను, ఫోను చేయడంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. కార్యక్రమం పూర్తయ్యాక మళ్లీ పున: సమీక్షించుకుంటాం. పుస్తక బాధ్యతల విషయానికి వస్తే డిటిపి వర్క్ నేను (సిద్దెంకి) చేస్తాను. నేను, గుడిపల్లి, తప్పెట చదివి, దోషాలు, వాక్య క్రమాలు గుర్తించి సవరిస్తాము.  కొత్త రచయితలైతే చర్చిస్తాము. పుస్తకం అందంగా రావడం కోసం, కవర్ డిజైనింగ్ మొదలైన పనులను సాంకేతిక నిపుణులకు అప్పగిస్తాం. దళిత కథ - 2023 కథ వార్షిక 'కొమ్ము' డ్రాఫ్ట్ కాఫీ చదివి తమ అభిప్రాయాలు తెలియజేసిన వారిలో మన్నె ఏలియా, డా.  తైదల అంజయ్య ముందు వరుసలో ఉంటారు.
 
6. ఈ సంకలనం కోసం కథల ఎంపికలో ఏ ప్రమాణాలు పాటించాలని నిర్ణయించుకున్నారు? ఇతర సంస్థలు ప్రచురించే వార్షిక కథా సంకలనాలకన్నా ఏ రకంగా ఇది భిన్నమైనది?
సంపాదకులు: దళిత కథకు అధిక ప్రాధాన్యత ఇస్తాము. అట్లాగని దళితులు రాసిన ప్రతీ కథ దళిత కథ కాదు. ఒకవేళ దళితేతర కథ  మంచి కథ అయితే కూడా స్వీకరిస్తున్నాము. దళిత బహుజనవాదానికి చోటు కల్పిస్తాము.

జంబూ సాహితి

7. జంబూ సాహితీ గత సంకలనాలతో పోలిస్తే, 'కొమ్ము దళిత కథ - 2023' లో వైవిధ్యం ఏమిటి? ఈ సంకలనం ప్రత్యేకత/విశిష్టత ఏదైనా ఉందా?
సంపాదకులు: ఉంది. సామాజిక, రాజకీయ, ఆధునిక వివక్షను చిత్రించాయి. పదిహేను కథలు పదిహేను కోణాలలో ఆవిష్కరించాయి. ఏ కథా వార్షికకు ఆ వార్షిక దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది. దళిత కథలకు దళిత జీవితమే ఇంధనం. దళిత బతుకులే శైలీ, వస్తు, శిల్పాలు. దళిత బతుకును ఏ  త్రాసు(తక్కెడ) కొలుస్తుంది?  దళిత కథలలో ఏడుపులు పెడబొబ్బలే కాదు ధిక్కారాలు, ఎత్తిన పోరుభావుటాలు, రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ స్పూర్తి, అంబేడ్కర్, జగ్జీవాన్ రామ్ ల  మార్గదర్శకత్వం, జాషువా పద్యాలు, మొత్తంగా చెప్పాలంటే మొండి బాధలే అక్షర రూపంలో నడిపిస్తూనే ఉంటున్నాయి. వేముల ఎల్లయ్య కక్క నవలలా, నాగప్పగారి సుందర్రాజు మాదిగోడు కాథలులా రూల్స్ని బ్రేక్ చేస్తున్నాయి. దళిత కథ సమస్య తీవ్రతని అవగాహన కల్పిస్తుంది.  ఆలోచింపచేస్తుంది. పరిష్కార మార్గాలు చూపుతుంది. ఒక సంవత్సరంలో వచ్చిన కథలు మరో సంవత్సరంలో వచ్చిన కథలకు భిన్నంగా ఉంటాయి.

జంబూ సాహితి

 
8. స్థూలంగా దళిత కథలు అన్నప్పుడు అవమానాలు, హేళనలు, ఆర్థిక లేమి, అవకాశాలు లేకపోవడం వంటి అస్తిత్వ నేపథ్యపు ఇతివృత్తాలే ప్రధానంగా స్ఫురిస్తాయి. మరి ఈ సంకలనంలోని కథలలో వస్తు వైవిధ్యం ఉండేలా ఏ జాగ్రత్తలు తీసుకున్నారు?
సంపాదకులు: కాలే కడుపుకు మండే గంజి ఆకలి తీరుస్తది అనుకుంటే ఆలోచనలు కూడా అలానే ఉంటాయి.  స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు సమీపిస్తున్న దళితులకు ఆత్మగౌరమ్ దక్కడం లేదంటే నమ్మరు కానీ సంఘటనలు పరిశీలించండి సమస్యలు అర్థమౌతాయి. నొప్పి కలిగినోడు విలపిస్తాడు కానీ వినోదాన్ని ఆలపించడు.  దళిత కథలు రాస్తున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. రెండు రాష్ట్రాలలో కలిపి సీరియస్ గా రాసేవాళ్లు కేవలం  30 మంది లోపు కథకులే ఉన్నారు. వస్తు వైవిధ్యం గురించి హిజ్రాలలో మానవత్వం తెలిపే సోలోమన్ వవిజయ్ కుమార్ కథ శీలమంతురి రైల్వే గేటు దగ్గర కొజ్జ , ఆడపిల్లలు ముల్లులా బతకాలనే సతీష్ చందర్ కథ ముల్లు’, అంతరానితనం ఆకాశమంత దుక్కమంటూనే ప్రత్యామ్నాయం చూపే జూపాక సుభద్ర అంటూ ముట్టు’, అసలు పిసినారులను ముసుకుల్ని పటాపంచలు చేసే పసునూరి రవీందర్ బుచ్చయ్య బతుకు మర్మం’, వలస బతుకుల దీనత్వం చిత్రించిన ఇండ్ల చంద్ర శేఖర్ బేల్దారి’, మౌనంగా ఉంటూ మాట్లాడే మర్రి చెట్టు మన్నే ఏలియా సాక్షి ఆత్మీయతలు పంచే ఆవిడ చావు మానవ చిరునామా కాండ్రేగుల రావలచ్చుం కొట్టు’, దళితుల ప్రేమ గురించి మాదిగ రాజయ్య’, రచ్చకట్టలు తెలుపుతాయి.  చేదు నిజం’, నిలువెత్తు దుఖం’,  మొదలైన కథలు వినూత్నంగా ఉన్నాయి.
 
9. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనంలో లబ్ధప్రతిష్ఠులైన కథకుల కథలతో పాటు కొత్త/వర్ధమాన కథకుల కథలకు స్థానం దక్కిందా?
సం: ఐదు దశాబ్దాలుగా కథలు రాస్తున్న ఆచార్య కొలకలూరి కథ దళిత కథ 2020 లో ప్రచురించబడ్డది. అదే సంవత్సరం చరణ్ పరిమి బొంబాయి పొట్టేలు కథ ప్రచురించాము. ఆ కథ సంపుటి 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహితీ పురస్కార పోటీలో చివరి దాకా నిలిచింది. రామ్ పేరుమాండ్ల, కేపీ లక్ష్మీనరసింహ 'దోసిలి పట్టు', మేడి చైతన్య, కిరణ్ చర్ల, సిస్టర్ అనసూయ 'కుంగిన పొద్దు' డిజి హైమావతి 'బొందల గడ్డకు దూరంగా' కౌలూరి ప్రసాదరావు 'రెండు గ్లాసులు' కెంగార మోహన్, అనిల్ డ్యాని, గంధం విజలక్ష్మి, గడ్డం మోహన్ రావు, తవ్వ వెంకటయ్య, మండల స్వామి, దుర్గాని రాజు,మెర్సి మార్గరేట్, మేడి చైతన్య, పెద్దన్న, మొదలైన వారి కథలు సేకరించి జంబు సాహితీ వార్షికలలో స్థానం కల్పించింది.

జంబూ సాహితి

10. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం కోసం ఎంపికైన కథలు కాకుండా, ఏదైనా కథ బాగుండి కూడా, మీ ప్రమాణాలలో ఒదగకపోవడం వల్ల సంకలనంలో చేర్చకపోవడం జరిగిందా?
సం. జరిగింది. అనుకున్న ప్రమాణాల ప్రకారం కథ లేకుంటే నిస్సంకోచంగా పక్కన పెట్టాము. ఇక ముందు దళిత జీవిత చిత్రన చేసిన కథకే ప్రాధాన్యత ఇవ్వనున్నాము.


 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ


11. భవిష్యత్తులో సంకలనం వెలువరించేందుకు, పత్రికలలో ప్రచురితమైనవి కాకుండా, ప్రత్యేకంగా ఒక థీమ్ ఇచ్చి కథలు వ్రాయించి ప్రచురించే అవకాశం ఉందా? ఆ విషయంలో మీ బృందం ఆలోచనలేమిటి?
సం. ఆలోచనలు ఉన్నాయి. దళిత కథను గొప్ప కథగా తీర్చి దిద్దాలనే సంకల్పం జంబూ సాహితీకి ఉంది. దళిత కథా శిక్షణ కార్యశాల నిర్వహిస్తాము. త్వరలోనే ఐదవ వార్షిక అనంతరం తప్పకుండా వీటిపై దృష్టి సారిస్తాము. కథా  విమర్శ వ్యాసాలను తెస్తాము.


 
జంబూ సాహితి

12. కొన్ని వార్షిక కథాసంకలనాలలో కొందరు కథకుల కథలు ప్రతి ఏడాదీ చోటు దక్కించుకుంటాయనీ, వేరే వారికి అవకాశం దక్కదన్న అభిప్రాయం పాఠకులలో ఉంది. మీరు ప్రచురించే సంకలనాలలో ఇలా జరగకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
సం. మీరన్నది నూటికి నూరు పాళ్ళు  నిజం. మంచి కథకు తప్పనిసరి చోటు మాత్రం తప్పకుండా ఉంటుంది. రాసిన ప్రతీ కథకు ఎక్కడా చోటు దొరకక పోవచ్చు. అయినంత మాత్రాన కథ కాకుండా పోదు. వేరే సంకలనాలలో దళితేతరులు దళితకథ ఒక్కటో రెండో కథలను రిజర్వేషన్ కింద అచ్చు వేస్తారు. మేము అందరికీ చోటు ఇస్తామని హామీ ఇవ్వటం లేదు.. అలా దళిత కథకు చోటు దక్కకపోడం లేదనీ, వాళ్లెవరో చోటు కల్పించేదేముంది. మా దళిత కథ - మా ఆత్మ గౌరవ పతాక”గా తీర్చి దిద్దుతున్నాము. దళిత కథ వార్షిక తెస్తున్నాం.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువ కథకులు తప్పనిసరిగా చోటు దక్కే విధంగా ఎవరికి వారు నైపుణ్యవంతంగా కథలు తీర్చిదిద్దుకోవాలి. మాస్టర్ పీసుల్లాంటి కథలను అధ్యయనం చేయాలి. మంచి కథ ఎందుకైనదో ఆలోచించాలి. మన కథను ఇంతకంటే ఏమి చేయలేను అనే వరకు చదవాలి. వస్తు విసృతితో పాటు వస్తున్నవ్యత ఉండాలి. రాస్తున్న వస్తువు మీద సంపూర్ణమైన అవగాహన తెచ్చుకొని రాయాలి.  శైలి, శిల్పం, కథనం, సమర్థవంతంగా నిర్వహించాలి. స్పార్క్ లాంటి ముగింపుతో ఆలోచనత్మక సందేశం కలిగిన కథలై ఉండాలి.  జీన్ పాల్ సాంగ్త్రే అన్నట్టు ఈ కాలానికి చెల్లని కథ (సాహిత్యం) ఏ కాలానికి చెల్లదు. ఆ విధంగా నడుస్తున్న కాలాన్ని పొడుస్తున్న పొద్దును సాంఘిక సమకాలీన పరిస్థితులకు దర్పణం పట్టాలి. రాయడానికి ముందు అవగాహనతో రాయాలి. నూతనంగా ఉండాలి. కథకి సార్వజనీనత కల్పించినప్పుడు taప్పకుండా ఎంపిక అవుతుంది.

జంబూ సాహితి

 
13. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనంలో మీకు వ్యక్తిగతంగా ఏ కథ బాగా నచ్చింది? ఎందువలన? సంపాదకుడిగా కాకుండా, ఓ పాఠకుడిగా మీ అభిప్రాయం చెప్పండి.
అన్నీ మంచి కథలే. సతీష్ చందర్ కథ ముల్లు కథ లో స్త్రీలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేసే కథ. జూపాక సుభద్ర కథ అంటూ ముట్టు ఒక పాఠకుడిగా నాకు బాగా నచ్చాయి.

జంబూ సాహితి

 
14. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనాన్ని పాఠకులకు ఎలా చేరువ చేస్తున్నారు? ఈ పుస్తకానికి వచ్చిన స్పందన ఏమిటి?
కొమ్ము దళిత కథను పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్ లో, తెలుగుబూక్స్. కామ్ అంతర్జాలంలోనూ  అందుబాటులో ఉంచాం. మంచి స్పందన వస్తుంది. దళిత కథను చాలామంది అభిమానిస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఈ దళిత కథను ఉద్యమం గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. కోరిన వారికి వ్యక్తిగతంగా కావాలని ఫోన్ చేసినవారికి పంపిస్తున్నాం.
 
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ

15. తదుపరి సంకలనం కోసం పనులు మొదలయ్యాయా? కొత్త అవకాశాలు లభించి బతుకులు బాగుపడ్డాయనో, గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారి చీకట్లు తొలగుతున్నాయనో చెప్పే కథల్ని పాఠకులు ఆశించవచ్చా?
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కథలు మారుతాయి. దళిత కథలు మారాలంటే దళిత జీవితాలు మారాలి. సమాజంలో మార్పు రావాలి. మనిషిని మనిషిగా గౌరవించే రోజు రావాలి. కుల వివక్ష పోవాలి. కుల నిర్మూలన జరగాలి. అంబేద్కర్ కలలు నిజమవ్వాలి.  కథలు మారిన, మారని పరిస్థితులు తప్పకుండా ప్రతిబింబిస్తాయి. మాకు మేం నిత్య నూతనమవుతాము.... నవనవలాడే దళిత కథ సాహిత్య ఆకాశంలో రెపరెపలాదడిస్తాము.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు సంపాదకులు ముగ్గురికీ ధన్యవాదాలు.
సంపాదకులు: ధన్యవాదాలు.

కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ