గోనబుద్ధారెడ్డి
పాఠం ఉద్దేశం :
రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు. తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రం పై వారధి నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. అతనికి వానరులు రాళ్లు, చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత ఎట్లా సహాయం చేయబోయిందో ఈ పాఠంలో చదువుతాం. ద్విపద పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభివృద్ధిని కల్పించడం, అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపద లో రెండు పాదాలుంటాయి. ఇది వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణం లోని యుద్ధకాండలోనిది.
కవి పరిచయం:
కవి పేరు : గోనబుద్ధారెడ్డి
కాలం : 13 శతాబ్దం
రచన : రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు రచించాడు. మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠల భూపతి పూర్తి చేశారు.
కవిత శైలి : సరళం మధురం
ఇతర విశేషాలు : గోన బుద్ధారెడ్డి కాకతీయుల సామంత రాజు వర్ధమానపురం (నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లాలోనిది) రాజధానిగా పాలించాడు.
ప్రవేశిక : పరస్పర సహాయ సహకారాలు మనుషులకైనా జంతువులకైన అవసరం. అయితే సమాజంలో మూడు రకాల మనుషులు ఉంటారు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరిన చేయరు. రెండవ రకం వారు మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సాయం చేస్తారు. మూడో రకం వారు ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణాలు కలిగిన ఉడత గురించి ఈ పాఠంలో చదువుకుందాం.
I. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడం
1. మీరు ఎవరికైనా సాయం చేశారా? అప్పుడు వారు ఏ విధంగా స్పందించారు?
జవాబు: నేను చాలాసార్లు చాలామందికి సాయం చేశాను. నా సహాయం అందుకున్న వారి ముఖములో సంతోషాన్ని చూశాను.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం కింది అర్థం గల పద్యపానాలను మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి
అ. త్వరగా సేతు నిర్మాణం కావాలి.
జ. గొబ్బున సేతువు కొనసాగవలెయు
ఆ) తన ఒంటి కంటిన ఇసుకను రాలుస్తున్నది.
జ. తనమేని ఇసుక వడగట్ట పై రాల్చి
ఇ) పలువిదాల పొగడి.
జ. పలుతెరంగుల జాల ప్రస్తుతి జేసి
ఈ) భక్తితో గడ్డి పోచంత పనిచేసినా అది కొండతో సమానం.
జ. ఎవ్వడు మది నిల్పి యెసగు దృణంబు నవ్వేల్పు గిరిబోలు
2. కింది పద్యాలు చదివి సరైన జవాబును గుర్తించండి.
ఉపకారికి ఉపకారం
విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారం
నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతీ!
అ) అపకారి
జ. (క) కీడు చేసేవాడు
ఆ)పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది
జ. (ఘ) నేర్పరి
ఇ) గొప్ప విషయం
జ. (క) అపకారికి ఉపకారం చేయడం
ఈ) పద్యంలో తప్పు అని అర్థం వచ్చే పదం
జ. ఖ) నెపము
పద్యమ మకుటం
జ. క) సుమతీ
III. స్వీయ రచన
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
అ) తొందర గా సేతు నిర్మాణం కొనసాగాలని ఉడత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి?
జవాబు. సేతువు నిర్మాణం పూర్తయితే గాని రాముడు సైన్యంతో లంక చేరలేడు. లంకకు వెళ్ళకపోతే అక్కడ రావణుని చెరలో సీతమ్మ కష్టాలు తీర్చలేడు. దుర్మార్గుడైన రావణుని సంహరిస్తే తప్ప లోకాలకు వాని పీడ వదలదు. సీతను విడిపించుకొని తెచ్చుకోవాలంటే వనవాసం గడువుకూడా పూర్తైపోతోంది. గడువు పూర్తయ్యే లోపల అయోధ్య చేరకపోతే భరతుడు ప్రాణాలు వదులుతానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక తొందరగా సేతువు నిర్మాణం పూర్తి కావాలని ఉడుత అనుకున్నది.
ఆ) భక్తితో చేసే చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది సమర్థిస్తూ రాయండి.
జవాబు:భక్తితో చేసిన చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఉడుత రాముని మీద భక్తితో తన శక్తిమేరకు సాయం చేయాలనుకుంది. వానర వీరులు చేసే పనిలో ఉడుత చేయగలిగిన పని చాలా తక్కువ. ఐనా ఉడుత నిరాశ పడకుండా సముద్రం నీటిలో మునిగి గట్టుమీద ఇసుకలో పొర్లి వంతెన మీద ఆ ఇసుక దులిపింది. ఇక్కడ ఎంత ఇసుక మోసింది అనికాదు చూడాల్సింది. ఉడుత భక్తిని గమనించాలి. శ్రీరాముడు గమనించాడు. తన వద్దకు ఉడుతను రప్పించుకొని తన కుడి చేతితో ప్రేమగా దాని వీపు మీద నిమిరాడు. ఆయన వేళ్ళ గుర్తులు దాని వీపు మీద మూడు చారలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ అవి ముచ్చట గొలుపుతూ శాశ్వతంగా ఉండి పోయాయి.
ఇ) రాముడు ఉడత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు. అట్లాగే మీరు చేసిన సహాయాన్ని ఇతరులు మెచ్చుకున్న సంఘటన గురించి రాయండి.
జవాబు. మా నాన్నగారు నా పుట్టిన రోజున, నీ స్నేహితులందరినీ పిలుచుకో. పార్టీ ఇద్దువు గాని అన్నారు. నేను నాన్నగారి నడిగి అనాథాశ్రమంలోని పిల్లల్ని పిలిచి వారితో కలిసి పుట్టిన రోజు చేసుకున్నాను. వారందరికీ మిఠాయిలు, పళు కేకు పంచి పెట్టాను. ఆటలు ఆడుకున్నాము. వారందరికీ బహుమతిగా పెన్నులు, పుస్తకాలు ఇచ్చాను. వాళ్ళెంతో సంతోషించారు. నేను చేసిన ఈ పనికి నా తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, ఇరుగు పొరుగు వారు ఎంతో మెచ్చుకున్నారు. ఒక మంచి పని చేశానని నాకు గర్వమూ, ఆనందమూ కలిగాయి.
ఈ) ఈ పాఠం ఆధారంగా గోడ బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది?
జవాబు.ఈ పాఠం ద్విపద ఛందస్సులో ఉన్నది. చక్కగా పాడుకోవచ్చు. ఇక కవి ఇందులో చెప్పిన కథ ఉడుత చేసిన సాయం. ఇందులో భాష భావం తేలికగా అర్థమయ్యేటట్లు తేలికైన పదాలు ఉపయోగించాడు కవి. ఉడుత చేసిన పని చదువుతుంటే ఎదురుగా జరుగుతున్నట్లే అనిపిస్తుంది. అంత స్పష్టమైన వర్ణనలు. నాకీ పాఠం ఎంతగానో నచ్చింది.
2. కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.
ఉడత సాయం పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు: సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను.” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా, నిర్మలభక్తితో సముద్రంలో మునిగి వచ్చి యిసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉన్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, తమ్ముడు లక్ష్మణుని పిలిచి “నా పై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది.
బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో, గడ్డిపోచంత (కొంచెం) పనిచేసినా అది కొండతో సమానం. భక్తే ప్రధానం కదా!” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేతితో దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడు రేఖలు చూడడానికి అందంగా, ఆనందకరంగా ఏర్పడ్డాయి.
IV. సృజనాత్మకత / ప్రశంస:
ఈ పాఠాన్ని గేయ రూపంలో రాయండి.
చిన్ని ఉడుత చూడండి ఎంత ముద్దుగా ఉందో
వీపుమీద నల్లనైన – మూడు చారలున్నాయి
ఎక్కడివీ ఈ చారలు – కనులకింపు గొలుపుతూ
చూపు తిప్పుకోనీవు – ముచ్చటైన చారలు
రాముడిచ్చినాడమ్మా – ఉడుతకు ఈ అందాలు
మునివేళ్ళతో వీపునిమిరి తన ప్రేమను అద్దినాడు
ఎందుకంత ప్రేమంటే – దాని కథను వినండి
“రాముడు లంకను జేరగ – కోతులు వంతెన గట్టెను
పెద్ద పెద్ద బండరాళ్ళు – మోయుచున్న కోతులగని
శ్రీరాముని కార్యంలో – నేను ఏమి చెయ్యగలను ?
అని ఆలోచించి ఉడుత – శ్రీరాముని పాదాలను
భక్తితోడ మదిని దలచి సముద్రంపు నీటమునిగి
తన ఒంటిని తడుపుకొని – గట్టుమీద ఇసుకలోన
అటూ ఇటూ పొరలాడి – అంటిన ఆ ఇసుక తెచ్చి
మరల నీట మునిగింది వంతెనపై దులిపింది
అలుపులేక సొలుపులేక – మరల మరల తిరిగింది
అది చేసిన సాయానికి అది చూపిన వినయానికి
ముచ్చటపడి శ్రీరాముడు – మునివేళ్ళతో నిమిరెదాని
వీపున నల్లని చారలు – శాశ్వతముగ నిలచిపోయె
లేదా
పక్క పేజీలో బొమ్మను చూసి సంభాషణలు రాయండి.
చీమ : ఉడుతమ్మా! రా. ఏంటిలా వచ్చావు ?
ఉడుత : ఊరికెనే నిన్నుచూసి పోదామని వచ్చాను చీమమ్మా!
చీమ : చాలా సంతోషం. ఇదిగో ఈ వేరుసెనగ పప్పులు తిను.
ఉడుత : ధన్యవాదాలు. నీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందా ఆహారం.
చీమ : అవును. కష్టపడి తెచ్చుకున్నదాంట్లో కొంత తిని కొంత దాచుకుంటాం.
ఉడుత : అలాగా! దాచుకోటానికి, ఉండటానికి మీరు కట్టుకున్న ఇళ్ళు ఎంత బాగున్నాయో!
V. పదజాల వినియోగం
ఈ క్రింది వాక్యాలు చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి.
అ)
శిఖరం అద్రి కొండ
ఆ)
వంతెన, వారధి, సేతువు
ఇ)
పచ్చిక, గడ్డిపోచ, తృణం
ఈ)
సముద్రం, వార్ది, వనధి.
కింది వాక్యాలలోని ప్రకృతి వికృతిలో గుర్తించి రాయండి.
అ) (వికృతి)దవ్వు - దూరం (ప్రకృతి)
ఆ) (ప్రకృతి) సహాయం - సాయం(వికృతి)
ఇ) (ప్రకృతి) శక్తి - సత్తువ (వికృతి)
భాష గురించి తెలుసుకుందాం
అ) రవి పుస్తకం తెరిచి పాఠం చదువుతున్నాడు (క్రియ)
ఆ) రాముడు సీతతో కలిసి అరణ్యానికి పోయాడు (నామవాచకం)
ఇ) కిరణ్ పరుగుపందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు (సర్వనామం)
ఈ) అయ్యో ! అంత పని జరిగిందా (అవ్యయము)
ఉ) పండుగ రోజు విమల కొత్త బట్టలు కొన్నది (విశేషణము)
2. కింది వాక్యాల్లో విభక్తి ప్రతియాలను గుర్తించి వాటి కింద గీతలు గీయండి అవి ఏవి భక్తులో బ్రాకెట్లో రాయండి.
అ) మౌనిక మల్లెపూల ను ధరించింది (ద్వితీయ విభక్తి )
ఆ) రాజేందర్ అడవికి వెళ్లి ఉసిరికాయలు తెచ్చాడు (షష్టి విభక్తి)
ఇ) చిన్నపిల్లలు పెద్దల తో గౌరవంగా మెలగాలి (తృతీయ విభక్తి)
ఈ) కీర్తన ఇంజనీరింగ్ చదవడం కోసం బాసర వెళ్ళింది (చతుర్థి విభక్తి)
ఉ) సహాయం చేయడం వల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు (పంచమి విభక్తి)