అరణ్యకాండ
- విరాధ వధ
- అగస్త్యాశ్రమ దర్శనం
- పంచవటిలో నివాసం
- శూర్పణఖ భంగం
- ఖరదూషణాదుల సంహారం
- రావణునితో శూర్పణఖ గోడు
- రావణునకు మారీచుని హితవు
- మాయలేడితో మోసం
- సీతాపహరణం
- జటాయువు మరణం
- కబంధుని శాప విమోచన
- శబరి సేవ
విరాధ వధ: తుంబురుడనే గంధర్వుడు కాని కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. అతనికి ఏ శస్త్రంతోనూ చావకుండా వరముంది. రామునిచేతనే అతనికి శాపవిముక్తి కావాలి. ఆ విరాధుడు సీతను పట్టుకుపోసాగాడు. కాని రాముని పదును బాణాలవలన కోపించి, సీతను విడచి, రామ లక్ష్మణులను చేతులలో ఇరికించుకుపోసాగాడు.
రామ లక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు. శాపవిముక్తి కలిగిన విరాధుడు వారెవరో తెలిసికొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు.
బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని కోసమే తాను బ్రహ్మలోకానికి వెళ్ళకుండా వేచియున్నాడు. తన తపస్సు పుణ్యాన్ని రామునికి సమర్పించి, వారిని సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళమన్నాడు.
అగస్త్యాశ్రమ దర్శనం
సుతీక్ష్ణ మహర్షి చెప్పిన ప్రకారం సీతారామలక్ష్మణులు ముందుగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని ఆతిథ్యాన్ని స్వీకరించారు. ముందుకు సాగి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకొన్నారు. అగస్త్యుడు మృత్యువును జయించిన మహాతపస్వి. వింధ్య పర్వతం పెరుగుదలను నిలిపాడు. నరమాంస భుక్కులైన వాతాపి ఇల్వలులను నాశనం చేశాడు. దక్షిణ దిక్కును మునులకు ఆవాస యోగ్యంగా చేశాడు.
పంచవటిలో నివాసం:
పర్ణశాలలో సీతారామలక్ష్మణులు గోదావరీతటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్ళేదారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్ద రాజు కనిపించాడు. తాను దశరధుని మిత్రుడనని, ఆశ్రమసమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు.
పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు. అది సీతాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు.
శూర్పణఖ భంగం:
రామునితో మాట్లాడుతున్న శూర్పణక
రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఆమె కామరూపి. ఒకమారు వారి పర్ణశాలకు వచ్చి రాముని చూచి మోహించి తనను పెళ్ళి చేసుకోమని అడిగింది. రాముడు, లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. ఆమె కోపించి సీతను తినివేయబోయింది. అపుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసివేశాడు.
శూర్పణఖ యేడుస్తూ తన సోదరుడైన ఖరునితో జరిగిన విషయం మొరపెట్టుకుంది. ఖరుడు యముళ్ళాంటి పధ్నాలుగు రాక్షసులను పిలిచి రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు. పదునాలుగు బాణాలతో రాముడు వారిని సంహరించేశాడు. శూర్పణఖ బావురుమంటూ ఖరునివద్దకుపోయి అతను చేతకానివాడని దెప్పిపొడిచింది. ఉద్రిక్తుడైన ఖరుడూ, అతని సేనాధిపతి దూషణుడూ వీరాధివీరులైన పధ్నాలుగు వేల రాక్షససేనతో దిక్కులు పిక్కటిల్లే పెడబొబ్బలతో, భేరీభాంకారాలతో, సాగరంవలె పొంగుతూ రామలక్ష్మణులపై దండెత్తారు.
ఖరదూషణాదుల సంహారం
ఖరునిపై బాణ ప్రయోగం చేసిన రాముడు
ఆకాశంలో పుట్టిన ఉత్పాతాలను గమనించాడు రాముడు. రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ధనసు ధరించి, సీతను వెంటబెట్టుకొని, ఒక దుర్గంలా ఉన్న గుహలోనికి వెళ్ళిపోయాడు. అగ్నిలాగా వెలుగుతున్న రాముడు కవచం తొడుగుకొని ధనుర్ధారియై నారి మోగిస్తూ రాక్షసులకు ఎదురు వచ్చాడు. వారి యుద్ధం చూడడానికి ఆకాశంలో మహర్షులు, దేవ గంధర్వ సిద్ధ చారణాదులు గుమికూడి రామునకు మంగళం పలికారు.
పధ్నాలుగు వేల మంది రాక్షసులూ, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు మరణించడంతో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకకు పోయింది. తన పెద్దన్న రావణుని తీవ్రంగా నిందించి హెచ్చరించింది – నువ్వు స్త్రీలోలుడవై రానున్న అపాయాన్ని తెలిసికోలేకపోతున్నావు. రాజు అనేవాడికి సరైన చారులుండాలి.