సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

24, డిసెంబర్ 2023, ఆదివారం

"సమానతకై నినదించే - సాక" నమస్తే తెలంగాణ


మిత్రులందరికీ జంబూ శనార్థులు 
 జై భీమ్ లు
2022 దళిత కథ వార్షిక గురించి నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధంలో ప్రచురించిన సంపాదక వర్గానికి మరియు మధుకర వైద్యులు అన్నగారికి కృతజ్ఞతలు.

సాక
దళిత కథావార్షిక - 2022.

*సమానతకై నినదించే బతుకులు - 'సాక' కథలు* 

జీవితాన్ని దాచకుండా దండోరా వేసినట్టు చెప్పడంలో కథా ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. సుత్తి లేకుండా చెప్పడంలోనే కథకుడి నేర్పరితనం కనపడుతుంది. 
 సాంపే జల్లి వాకిట్లో ముగ్గు వేసినంత అందంగా కథ అల్లడంలోనే కథకుడి నైపుణ్యం (skill) తెలిసిపోతుంది. 

బతుకును, జీవితాన్ని ఏ ప్రమాణాలు కొలుస్తాయి? వస్తువు శిల్పము శైలి ప్రమాణాల కందని జీవితం ఉంటుంది. ఇది దళిత కథ. ఇందులో అలంకారాలు, విచిత్ర విన్యాసాలు పదప్రయోగాలు ఉండవు. బతుకును చిత్రించిన బాధలే ఉంటాయి. జీవితాన్ని మించిన కథ ఇంకేం ఉంటుంది? ఈ వార్షికలోని దళిత కథలు బతుకునే చిత్రించాయి. బాధలను ప్రతిబింబించాయి. 

 'జంబూ సాహితీ' నుండి వెలువడుతున్న వార్షికలలో 'సాక' ముచ్చటగా మూడవది.
'సాక'కు అర్పించడం, అర్పణం, తర్పణం, ధారపోయడం లాంటి అర్థాలున్నాయి.

ప్రతి సంవత్సరం దళిత కథను రికార్డు చేయడం, వాటిలోని మేలైన కథలను ఒక దగ్గరికి చేర్చడం జంబు సాహితీ ప్రతి సంవత్సరం చేస్తున్న ఆనవాయితీ.
ఈ కథలు పత్లా కథలు కావు. గుండె లోతుల్లోని తేమను ఉసిలించే కథలు. నిద్రాణమై ఉన్న మనిషిని చర్రున సరుపు సరిచి లేపే చైతన్య పూరితమైన కథలు. ఇందులో భిన్నమైన కథా వస్తువులు ఉన్నాయి.

ఇప్పుడు కథల గురించి కొత్తగా మాట్లాడుకోవాలి. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే రచయిత జీవితాన్ని అర్థం చేసుకోవాలి - సెయింట్ బోవే (1804 - 1869) చెప్పినట్లు దళిత కథ అర్థం చేసుకోవాలంటే దళితులు అనేక వేదనల మధ్య, జీవితాలను కోల్పోయిన దుస్థితుల మధ్య నలుగుతున్న స్థితిని కొత్తగా సరికొత్తగా మాట్లాడుకోవాలి.

నిజానికి దళితులకు తమకు ఏమి కావాలో స్పష్టంగా తెలిసినా, వస్తువు 'ఎంపిక' సమస్య ఒకటి ఎప్పుడూ ఉండనే ఉంది. ఎన్నో బాధలు. ఏ బాధలు ముందుగా అక్షరీకరించాలో కొద్దిగా సందిగ్ధత ఉంటుంది. అయినప్పటికీ అన్ని బాధలు కథలు కాలేవు. అందరూ బలంగా మాటల్లో రాజ్యాధికార కాంక్షను 'వ్యక్తం' చేస్తున్నారు కానీ ఉన్నత వర్గాల వారి 'మనీ క్రీడను' తట్టుకోలేకపోతున్నారు. అంతర్గతంగా కుల ప్రస్తావనలు ఎలా తికమక పెడుతున్నాయో? జీవితాంతం ఎలా బాధిస్తున్నాయో? ఎలా భయపెడుతున్నాయో అనుబంధాలను తెంచేయటాన్ని దళిత కథలు నిప్పుల తప్పటై మోగుతున్నాయి

 తండ్రీ కూతురు ఒక్కటై తల్లిని వేధించడానికి ఏది కారణమై ఉంటుందో తల్లి జీవితాన్ని వెంటాడుతున్న సమస్య ఏంటో తెలుసుకోవాలంటే సతీష్ చందర్ 'యువరానర్' కథ చదివితే జీవితమంతా బాధించిన విషయం అవగతమవుతుంది.

కుల వివక్ష ప్రతినిధి అయి పీడించిన వ్యక్తిని అంతిమ సంస్కారంలో అయిన వాళ్లు, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు రాలేదు. మహోన్నత మనసుతో పురుగులు పడ్డ శవాన్ని దళితులు ఎలా మోసారో తెలియజేసే జూపాక సుభద్ర కథ "అప్పు పడ్డది సుమీ"చదవాల్సిందే.
 

కులం గొప్పదైతే గొప్ప కాదు. గుణం గొప్పగా ఉండాలని, ఆ గొప్ప గుణం దళితులకు ఉన్నదని ఎలా రూపుకం చేసిందో జిలకర శ్రీనివాసు రాసిన 'బురద గుంట' కథ అధ్యయనం చేస్తే గాని అర్థం కాదు.

బతుకు పోరులో ఓడి గెలిచిన సైనికుల గొప్పతనం,
బతుకంతా సాము చేసి నిలిచి గెలిచిన సుందరమ్మ స్ఫూర్తి ఏమిటో అర్థం కావాలంటే చల్లపల్లి స్వరూపారాణి రాసిన "సాము"కథ అవాహన చేసుకోవాల్సిందే. 

దళితులు పెను వేసుకున్న క్రైస్తవ్యం, పోరాటం నేర్పిన కమ్యూనిజం, అస్తిత్త్వమే అంతిమ కలికితురాయని ప్రకటించిన అంబేద్కరిజం, వీటి మధ్యలో డోలాయమానమైన స్థితి నుంచి ఒక నిశ్చిత ఆలోచన తెలియాలంటే పసునూరు రవీందర్ కథ
 'ఒక నేల మూడు ముఖాలు' త్రికర్ణ శుద్ధిగా పఠించాల్సిందే.

జీవితాన్ని ఎలా జీవించవచ్చో నేర్పుతుంది మంచి దళిత కథ. తెలుగు కథ ఇంకా అంటరానితనం దాటి లేకపోయినా అపవాదు ఒకటి ఉండడానికి కారణం కులమే.
 'ముక్కు ఉన్నంతసేపు పడిశం ఉంటుంది' అన్నట్లుగా సనాతన ధర్మం ఉన్నంత వరకు రోజులు దళితులకు వివక్ష అంటరాని తప్పేటట్లు లేదు. ఈ విషయాన్ని చాలా కథలు తెలియజేస్తున్నాయి.

స్వీయ అస్తిత్వ పరిరక్షణకై వైరుధ్యాల తగ్గింపుకై కృషి జరగాలి.
మనుషులు ఎందుకు ఇంకా మారడం లేదు, ముఖ్యంగా చదువుకున్న మనిషి ఎందుకు ఇంతలా కుల చట్రంలో కుచించుకుపోతున్నాడు? అనే ప్రశ్నలకు ఈ కథలు కొంత సమాధానాన్ని ఇవ్వగలవు.

లోపలి బాధను తోడిపోసిన కథ చరణ్ పరిమి రాసిన కథ 'అతిథితో అక్కడిదాకా!. గుండెను పిండేసే కథ ఇది. హవింగ్ లైఫ్, హవ్ నాట్ లైఫ్ కు మధ్య ఏదో కనెక్షన్ తెగిపోయినట్టు ఈ కథ మనకు తెలిపుతుంది .

క్రైస్తవం హైందవికరించబడిందా? హిందువులు క్రైస్తవికరించ బడుతున్నారా? అనే మీమాంసను క్లియర్ జేసే వాస్తవిక కథ మెర్సీ మార్గరేట్ రాసిన కథ 'వర్షం సాక్షిగా'.... తెలియాల్సిందే...

 ఒకే ఊరి నుండి అగ్రకుల పటేలు రామారావు, మాదిగ కులానికి చెందిన రాములు ఇద్దరు పట్నం వలస వచ్చి, పట్నం వచ్చినాక కూడా కులవివక్షను, ఆధిపత్యాన్ని వదులుకోలేని తనాన్ని పటేల్ యొక్క అహంకారాన్ని పట్టించే కథ తాళ్లపల్లి యాకమ్మ రాసిన 'వెన్నెల గొడుగు' కథ. అదేవిధంగా అగ్రకులాలకు దళితులు ఆయుధాలు ఎలా బలైపోతున్నారో తెలియజేసే కథ కెంగార మోహన్ రాసిన 'సమిధలు' కథ.

చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత, చాలామంది దళితులు తమ మూలాలను మరిచిపోతున్నారు.సోఫిస్టికేటెడ్ లైఫ్ కు అలవాటు పడిన తర్వాత తాను నడిసొచ్చిన, ప్రయాణాన్ని, మార్గాన్ని తామే అవమానిస్తుంటారు కొందరు దళితులు . "ఎంత దూరం వెళ్లినా మేము మాకులాగానే ఉంటాం" అంటూ మూలాలను తెలియజేసే కథ అనిల్ డానీ గారి వీకెండ్ కథ.

గర్భిణీ స్త్రీ చనిపోతే బొందల గడ్డలో పూడ్చిపెట్టనీ య్యకుండా అవమానించి, అడ్డుకొని,కడాకు బొందల గడ్డలో కూడా స్త్రీ వివక్ష ఎదుర్కొంటున్నదని తెలియజేసే కథ డి.జి హైమావతి రాసినటువంటి బొందల గడ్డకు దూరంగా అనే కథ.

ఇవే కాకుండా రత్నాకర్ పెనుమాక, సొలోమోన్ విజయ్ కుమార్, సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్ రాసినటువంటి కథలు కూడా ఆలోచింపజేస్తున్నాయి.

అసూయ అనేది దోపిడి కులాలు, దోపిడీకి గురయ్యే కులాల్లోనే కాదు. కింది కులాల్లో కూడా అంతర్గతంగా ఉంది. ఆ అసూయ పెరిగిపోతుంది.ఇది తగ్గించాలి అంటే ఇంకా ఉత్తమ కథలు రావాలి.

ఆధిపత్య వర్గాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. అంబేద్కర్ మార్గాన్ని ఆచరించాలి అని ఈ కథల్లో అంతర్గతంగా ఒక ఆలోచన ఇండికేట్ ఉన్నది.

ఈ కథల్లో సాంస్కృతిక వ్యత్యాసం, కులమతాల ఆర్థిక వ్యత్యాసం, ఆధిపత్యాలు మొదలగు వస్తువులతో కథలు నడిచాయి.దళిత జీవితం అధునాతనమైన వ్యవస్థలోకి చేరికోవాలని కోరుతున్నాయి ఈ కథలు. జీవితానికి సంబంధించిన సున్నితమైన సమస్యలను సెన్సిటివ్గా వ్యక్తీకరించిన కథలుఇవి.

 జంబు సాహితీ ప్రచురించిన రెండు కథా వార్షికలను ఆదరించినట్టుగానే ఈ మూడవ 2022వ కథా వార్షికను కూడా ఆదరించి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా సాహితీ
పాఠకులను కోరుతున్నాము. కథలను ఎంపిక చేయడంలో మాకు కష్టమైనప్పటికిని ఇష్టంగా చేస్తున్న పనిగా భావిస్తూ అందరికీ జై భీమ్.

                  ఇట్లు
       జంబూ సాహితి
         సంపాదకులు
      డా. సిద్దెంకి యాదగిరి
      గుడిపల్లి నిరంజన్
       తప్పెట ఓదయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...