సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

పద్యం




కరిదిగుచు మకరి సరసికి

గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి

భరమనుచును నతల కుతల భటులదిరిపడన్

భావం: ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్నవీరులు ఈ రెండిటినీ చూసి ఇవి రెండూ ఒకదానిని మించినవి మరొకటి అని భయపడసాగారు.


అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా

పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో

త్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై

వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉంది. అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో కల్పవృక్ష వనం ఉంది. అందులో అమృతసరోవరం ఉంది. దాని తీరంలో చంద్రకాంత శిలావేదిక ఉంది. దాని మీద కలువపూలు పరచిన శయ్య ఉంది. ఆ శయ్య మీద లక్ష్మీదేవితోఆనందిస్తున్నాడు దీనజనశరణ్యుడయిన శ్రీమన్నారాయణుడు. తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ... సర్వేశ్వరా, పరాత్పరా! నన్ను రక్షించు... రక్షించు అని పిలవటంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి...

అలైవె కుంఠపురంబులో అంటే అక్కడ వైకుంఠపురంలో. నగరిలో అంటే రాజభవన సముదాయంలో. ఆమూల సౌధంబు దాపల అంటే ఆ ప్రధాన సౌధానికి సమీపంలో. మందారవనాంతర అంటే మందారవనం మధ్యభాగాన. అమృతసరస్ అంటే అమృతసరస్సు యొక్క. ప్రాంత అంటే సమీపంలో. ఇందుకాంత + ఉపల అంటే చంద్రకాంతపు రాళ్లమీద. ఉత్పల పర్యంక అంటే కలువపూల శయ్యమీద. రమావినోదియగు అంటే లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడైన. ఆపన్న ప్రసన్నుండు అంటే కష్టాలలో ఉన్నవారిని రక్షించేవాడు. విహ్వల అంటేఅదుపుతప్పిన. నాగేంద్రము అంటే గజరాజు. పాహిపాహి అనన్ అంటే రక్షించు - రక్షించు అనే. కుయ్యి + ఆలించి అంటే పిలుపు విని. సంరంభియై అంటే ర క్షించాలను ఉత్సాహం కలవాడై...


అడిగెదనని కడువడి జను

నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్

వడివడి జిడిముడి తడబడ

నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్

భావం:

అడిగెదను + అని అంటే ఆ విధంగా తొందరగా బయలుదేరటానికి కారణం అడుగుతానని. కడు వడిన్ చనున్ అంటే చాలా తొందరగా భర్త వెంట వెళ్లింది. అడిగినన్ అంటే విషయం ఏమిటని అడిగినట్లయితే. తను మగుడన్ అంటే తనకు తిరిగి. నుడువడని అంటే చెప్పడని. నడ + ఉడుగున్ అంటే వెనకాల నడవటం మానుకుంది. వెడవెడ అంటే నెమ్మది నెమ్మదిగా. చిడిముడిన్ అంటే తొట్రుపాటుతో(మనసుకు సంబంధించిన). తడబడన్ అంటే తడబాటు కలుగగా (శరీరానికి సంబంధించిన). అడుగు + ఇడున్ అంటే ముందుకు అడుగుపెట్టింది. అడుగు + ఇడదు అంటే అంతలోనే అడుగు వేయదు. జడిమన్ అంటే నిశ్చలత్వంతో. అడుగిడునెడలన్ అంటే అడుగు పెట్టే సందర్భంలో.


ఎక్కడనున్న సద్గుణము లేనియు నౌదలదాల్చుటందు వే

ఱొక్కరిగాంచి ముందర నహోయని, వెన్కల వెక్కిరింప కే

మక్కువ భ్రాతృవత్సలత, మత్సరమున్‌ విడనాడి యుండుటల్‌

నిక్కపు టొజ్జబంతులయి నిల్చెదరీ తెలగాణ సత్కవుల్‌

(వానమామలై వరదాచార్యులు)


ఇంతటి సద్గుణ సంపన్నత, ఇంతటి భ్రాతృవత్సలత, మాత్సర్య రాహిత్యం వంటి గుణాలవల్ల తెలంగాణ సత్కవులకు ప్రశంసలు దక్కినా సాహిత్య చరిత్ర మాత్రము చాలా వరకు చిన్నచూపే చూసింది.


*సుమతీ శతకము*


కులకాంత తోడ నెప్పుడు

గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,

కలకంఠి కంట కన్నీ రొలికిన

సిరి యింట నుండ నొల్లదు సుమతీ !


*భావం: భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు.*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"

"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"  వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషను కాదని ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని తెలుగు స్థానంల...