సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

17, డిసెంబర్ 2022, శనివారం

వీర తెలంగాణ

వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించటం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. తెలంగాణా ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో వినవచ్చు.

 వీర అనగా శత్రువును వణికించువాడు, పరమత సహనము లేనివాడు, కుంకుమ పువ్వు మొదలగు అర్థములు గలవు. తెలంగాణ అనగా పూర్వము హైదరాబాదు నిజాము ఏలుబడిలో నున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని భాగము, తెలుగుదేశ సంబంధమైన, తెలుంగు ఆణెం, తెలుగు స్థానం మొదలైన అర్థాలు గలవు.

       తెలంగాణలో జరిగిన అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపిన తెలంగాణ ప్రజల సాహసాన్ని వీరత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టే ఆదునిక పద్య ప్రక్రియకు చెందిన పాఠం ఈ వీర తెలంగాణ.

ప్రక్రియ పరిచయం
             పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. ప్రాచీన పద్య రచనలు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేవి కావు. కఠినమైన గ్రాంథిక భాషలో ఉండేవి. కాని ఆధునిక పద్యం అలాకాదు. అందరికి అర్థమయ్యే సులభ శైలిలో సరళంగా ఉండడం వీటి ప్రత్యేకత.


కవి పరిచయం
            ఈ పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన ఉద్యమ వీరుడు. ‘ముసలి నక్కకు రాచరికంబు తగునే’ అంటూ నిజాంను వ్యతిరేకించి జైలు పాలైన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. జైలుకు వెళ్ళి జైలు గోడల మీద కుడా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసాడు. తెలుగు సాహిత్యానికి ఇతడు చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి.

      తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి.గాలిబ్ గజళ్ళను తెలుగులోకి అనువదించాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు, నవమి, యాత్రాస్మృతి వ్మోదలైనటువంటి గ్రంథాలను, ఆణిముత్యాల వంటి సినిమా పాటలను రచించాడు. 

        ప్రస్తుత పాఠ్యభాగం వీర తెలంగాణ డా. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది.


పాఠం నేపథ్యం/ఉద్దేశం 
          తెలంగాణలో రజాకార్లు అరాచకత్వాన్ని ఎదిరించి పోరాడిన ధీరులు ఎందరో ఉన్నారు. వారిలో లో ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమై తెలంగాణ ధైర్యసాహసాలను పద్యాల రూపంలో దాశరథి ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించటం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. తెలంగాణా ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో వినవచ్చు 
         తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 

         తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 

      మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.


కంఠస్థ పద్యాలు - తాత్పర్యాలు

*ఉ. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!

          ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా

          జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్

          చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!


          తాత్పర్యం: అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!


*మ తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా

            జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ

            తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం

            చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్

           తాత్పర్యం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.


*మ తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం

          చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ

          జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా

         ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

       తాత్పర్యం: అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...