సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

Dasharathi patalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dasharathi patalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జులై 2025, బుధవారం

"దాశరథి పాటలు" - డా. సిద్దెంకి

                                



               దాశరథి పాటలు -డా. సిద్దెంకి యాదగిరి.

           ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్‌ బడగొట్టి మంచి మా

గాణములన్‌ స్రుజించి ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని భో

షాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం

గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?

 

అని నిజాంపై  గర్జించిన దాశరథి ప్రజాకవి. దాశరథి వేడుకలో అక్షరాలను అందమైన అల్లికలు అల్లి పూలలా వెదజల్లలేదు. నియంతపై నిప్పులు కుమ్మరించాడు. ధిక్కరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెగించాడు. మరణానికి ఎదురేగి మహాగానము చేసిన ఉప్పెన, ఉపద్రవము. యుద్ధక్షేత్రంలో నిలబడి తగిలిన గాయాలను తడుముకుంటూ నిప్పులుచెరిగే ఈటెల్లాంటి పదాలను విసిరి, విజృంభణ చేయడమంటే మరణంపైన రణం చేయడమే. పద్యాలతో చైతన్యం రగిలించి, క్షిపణుల్లాంటి అక్షరాలతో ఆయుధాలు చేయడమూ, సమూహాన్ని సాయుధ చేయడమంటే మృత్యువుతో కలెబడడమే. భయపెట్టే చావును భయపెడుతూ ముసలినక్కకు రాజరికం దక్కునే అని నినదిస్తూ ముందకుసాగిన అక్షరశరధి,


ఆశయరథి
, ప్రజాకవి దాశరథి.

దాశరథి పాటలు- 20.07 2025 సంచిక పత్రిక

దాశరథి పాటలు -2 తేది: 27-07-2025



 

  దాశరథి కలము, గళం మిళితం చేసిన నిఖార్సయిన నిలువెత్తు తిరుగుబాటు భావుటా దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పండిత పామర జనరంజకంగా మలిచాడు. ఆ పద్యాలు ప్రజలనాలుకలపై ‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని నినదించిన సామూహిక యుద్ధమంత్రమైంది. రణతంత్రమైంది.

గడ్డిపోచల్లాంటి ప్రజల్ని తల్వార్లుగా మలిచిన అక్షరకేతనం, ఆత్మవిశ్వాసం నింపిన అగ్నిధార. రుద్రవీణను పలికించిన కవిత్వధార దాశరథి పద్యంతోపాటు లలితగీతాలు, సినిమా పాటలు, నాటికలు, కథలు, గజళ్లు, అనువాదము, విమర్శ, మొదలైన ప్రక్రియలకు ప్రాణం పోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న ఖమ్మంజిల్లా చినగూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్‌ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మంజిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్‌ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషుసాహిత్యంలో బి. ఏ చదివాడు. అగ్నిమంటల పోరుబాటలోనే ప్రారంభమైన సాహిత్యయానం అనేక ప్రక్రియల గుండా వెళ్లింది.

దాశరథి లలిత గీతాలు: లలిత గీతాలు సహజమైన భాష. మృదువైన భావాలు, సరళమైన శైలిలో, లయతో కూడి, వినటానికి హృద్యంగా ఉండే కవితను ‘లలిత గీతం’ అంటారు. ‘‘గళగళలాడే భావనలను గానముగా మార్చేకళే లిలిత గీతం. ఇది శ్రావ్యంగా, హృద్యంగా, సామాన్యుడి మనసును తాకేలా ఉండాలి. భావానికి పదాన్ని విశేషమైన ప్రజాదరణ పొందాయి. లలిత గీతాలను వివిధ వస్తు విభాగాలు మనం చూడవచ్చు. ప్రకృతి, ప్రణయం, ప్రబోధం, సంస్కృతి, దేశభక్తి మొదలైన విభాగాల్లో వస్తునవ్యతతో, వస్తు విస్తృతితో రచించిన భావకవి దాశరధి కృష్ణమాచార్యులు. వారి లలితగీతాలు ‘నవ మంజరి’1950, ‘తేనెపాటలు’1960, ‘వలపు పాటలు’ 1963 పేర్లతో ప్రచురితమయ్యాయి. దాశరథి లలిత గీతాలు ఆకాశవాణిలో దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.

దాశరథి పాటలు- 20.07 2025 సంచిక పత్రిక

దాశరథి జాతీయ సదస్సు 09-07-2025 చిత్రాలు

1950-59 మధ్యకాలంలో 20 లలిత గీతాలతో ‘నవమంజరి’ ప్రచురితమైంది. ఈ సంపుటిలోని పాటలు మధుర గుళికలు. నూతన భవ కథ ఊహాజనిత కాల్పనికత కలబోతగా సాగింది.

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో 

 ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో               ॥ఆ చల్లని॥

భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో    

 - ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో

ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో

 - కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో  ॥ఆ చల్లని॥


మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో-

 రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో

కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో

- ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో        ॥ఆ చల్లని॥

అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమదెంత దూరమో -కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో

పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో-గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో   ॥ఆ చల్లని॥

1949లో ముద్రితమైన ‘‘అగ్నిధార’లో ఈ పాట ఉంది. ‘భరతావని బలి పరాక్రమం చెరవిడే దింకెన్నాళ్లకో’ అని రాసాడంటే ఆ పాట 1947కి ముందే రాశాడేమో అనుకోవాల్సి వస్తుందని దివి కుమార్‌ కుమార్‌ (సాక్షి పత్రిక, 15-04-2014) అభిప్రాయపడ్డాడు. ఈ పాటను మొదటిసారిగా 1991లో జరిగిన కర్నూలు ఉపఎన్నికల్లో పీవీ నరసింహారావుకి వ్యతిరేకంగా మండల సుబ్బారావు కమ్యూనిస్టు నాయకునికి మద్దతుగా ఈ పాట బాణికట్టి అరుణోదయ రామారావు ఆ సభలో పాడాడు. ఈ పాటను కార్యక్రమంలో అనేక విధాలుగా మార్చి గాయకులు ఆలపిస్తున్నారు. ‘కానరాని భానువులెందరో’ అని దాశరథి రాస్తే భాస్కరులందరో అని గాయకులు పాడుతున్నారు. ఈ పాట కవికి అజరామరమైన కీర్తిని తెచ్చి పెట్టింది. సజీవులుగా ఉంచింది.

తల నిండా పూదండ దాల్చిన రాణి

మొలక నవ్వులతోడ మురిపించబోకే-మాటల్లో మాటల్లో మరిపించబోకే          ॥తలనిండ ॥

పూల వానలు కురియు మొయిలువో - మొగలిరేకులలోని సొగసువో! నా రాణి! ॥తలనిండ॥

నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు - నీ నీలవేణి లో నిలిచే నాకాశాలు       ॥తలనిండ॥

నన్ను చూచి నవ్వి ` పున్నమి వెన్నెల కాచి నా కొరకు కన్నీరు కురిసి వర్షము తెచ్చి

తల నిండా పూలు ధరించిన ఓ రాణి నవ్వులతో మురిపించబోకు మాటలతో మరిపించబోకు పూల వానలు కురిసే మేఘనివు అందాల మొగలిరేకులు నా రాణి అని ప్రేయసిని ఒక ప్రియుడు కోరుతున్న సందర్భాన్ని లలిత మనోహరంగా ఆవిష్కరించాడు.

తెలంగాణ సాహిత్య అకాడమీ మలిముద్రణ గావించిన ‘పూల పాటలు’ అనే సంకలనం నుంచి దాశరధి పూల గురించి రాసిన పాట

ఓ మృణాళిని! ఓహో మృణాళిని - ఓ మృణాళిని! ఓహో మృణాళిని

నీ పుష్పవేదిపైని రమ నివాసమ్ము - నీ దివ్య వీధిలోన ఉషావిలాసమ్ము

నీ పూల పందిళ్ళలో లక్ష్మీ నృత్యమ్ము - నీయాకు పై నీటిచుక్క ఏ ముత్యమ్ము             ॥ఓ మృణాళిని॥

ఓ తామరాకు నీ పుష్ప వేదికపై లక్ష్మీనివాసం, నీ దివ్య వీధులలో ఉషావిలాసం నీ పూలపందిళ్ళలో లక్ష్మి నృత్యం చేస్తుంది. నీ ఆకుపై నీటి చుక్క ఏ ముత్యం రూపము ధరిస్తుందో అని తామరాకును పొగుడుతుంటాడు.

అద్దమే చూచితినా అందులోన నీవేనే - పద్దెమే రాసితినా ప్రతి పదమూ నీవేనే

ఎందుకే అందముగా నన్ను చూసి నవ్వేవు - అంతలో కోపముగా పిడుగులను రువ్వేవు

మళ్లీలి చల్లని నీ నయనాలు ` నీడలా నీ వెంటే ఎన్నిసార్లు నడిచానే

మేడలా నా మదినే నీకోసం మలిచానే

అద్దం చూసిన అందులో అతని ప్రియురాలు రూపం కనబడుతుంది. కవికి పద్యం రాసిన ప్రతి పదంలో ఆమె కనబడుతుంది. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? అంతలోని కోపముగా చూపులు రువ్వుతున్నావు. నా గుండె పగిలిపోతుంది అని బాధపడుతూ నీవు నడిచొస్తే నా మది పువ్వులెన్నో పూస్తుంది. కోపమే చూపితే నా గుండె పగిలిపోతుందని తెలియజేస్తాడు.

నాలో చందమామ చిందు లేసే - చల్లనైన చందమామ చిందులేసే

నా మనసులో ఉన్న మధురమైన హాయి నిండెనే - కొమ్మపైన కోయిలమ్మ పాడే కమ్మగా

ఆ పాట విన్న మనసు నాలో పరవశించగా - మధురభావ లాహిరిలో తేలిపోతినే

వసంతాన్ని తెచ్చిన ఉగాదిని, నూతన సంవత్సర ఊహలను నిజం చేస్తూ ప్రకృతిని కలుపుతూ రాసిన దాశరథి పాటలో కనబడుతున్నది.

నిండుపున్నమి పండు వెన్నెలలో - నిను చేరగ నే నెటుల రాగలనో

నీలి నీలి ఆకసము నీడ - నే కాలి సవ్వడి లేక రాబోతే

మనసు నీకై పరుగు తీసెను - నా తనువు నీకై వేచెనురా

నిండుపున్నమి రోజున ప్రియుని చేరబోతుంటే ఆకాశము, తారలు, చంద్రుడు చూసిన విధానాన్ని, తెల్లని మల్లెలతో వెళుతుంటే నల్లని గండు తుమ్మెదలు అడ్డగించినా నా తనువు నీకై వేచియున్నదని అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న లలితగీతం.

ప్రభో మేలుకోరా ప్రభాతమైనది రా

బందీలైన తుమ్మెదలాన్ని ఇందీ వరముల విడిచెనురా - కిరణాలతో కమల నయనాలు కలిసే తరుణమాయరా మేలుకోరా


దాశరథి పాటలు- 20.07 2025 సంచిక పత్రిక

దాశరథి పాటలు -2 తేది: 27-07-2025

సదస్సు 09-07-2025 చిత్రాలు

ప్రభువును మేలుకొమ్మని సుప్రభాతంలా కొలుస్తుంటాడు బంధీలైన తుమ్మెదలు ఇందివరములను విడిచాయి. కిరణాలతో సూర్యుడు వస్తున్నా సమయం అవుతుంది. ప్రతి పువ్వులో పొంగుతున్న మధువును ఒలికించడానికి పువ్వులు విచ్చుకుంటున్నాయి మేలుకో ప్రభు మేలుకో అని ప్రభువును మేల్కొల్పుతాడు.

ఎవరిదో ఈ రేయి ఈ రేయి ఈ రేయి, నవ్వులు నవ్వే పువ్వులు రువ్వే జవ్వనిదోయి, ఈ రేయి పువ్వు బోణిదే ఈ రేయి

వలరాజున కే గిలిగింత లేడే కలువ కంటి చలువ కంటిదే ఈ రేయి

ఈ రాత్రి ఎవరిదని ప్రశ్నిస్తాడు? నవ్వుల పువ్వులు రువ్వే జవ్వనిదని జవాబిస్తాడు. ఇది కన్నుకొసలతో కాంక్షలు రేపే కామిని రేయి అని రాత్రి శృంగారపరం చేస్తాడు.

మ్రోయింపుమూ నవవేణువు - తీయని వేణువు

నవజీవనరాగంతో - నాట్యమాడ ప్రతి రేణువు

నవ వసంతమే తేరగా - నెల బాలుడు దివి జేరగా

లోకము శోకమ్మువీడగా - జల రాశుల్లో దూరగా

కొత్తవి నువ్వు పలికించు నవజీవనరాగంతో నాట్యమాడడానికి ప్రతి రేణువు అనుకూలంగా ఉంది. వలపుల గంటలు మ్రోయుతుండగా వనమున కోయిలు కూయుచుండగా మదనుడు బాణముతో దూరుచుండగా మ్రోయుమని వేణువును వేడుకుంటాడు.

మానవతను ప్రేమించే మంచిరోజు రావాలి ` మమతను సమతను పంచే సౌజన్యం కావాలి 

భరతమాత బిడ్డలుగా ప్రజలందరూ బతకాలి - ప్రగతిని అవరోదించే వగతులను మార్చాలి

కులమతాలకు అతీతమవు గుణము పెంచుకోవాలి - మనమంతా కలిసి మెలిసి మనుగడ సాధించాలి

ఈ లలిత గీతములో మానవతను ప్రేమించే మంచి రోజురావాలనీ కోరుతాడు. మమతలు, సమతలు పెరుగాలనీ ఆకాంక్షిస్తాడు. తారతమ్యాలు లేకుండా భరతమాత బిడ్డలుగా బతకాలని వాంఛిస్తాడు. కులమతాల వ్యత్యాసాలు లేని గుణాలు పెంపొందించుకోవాలనీ, మనిషి సంఘజీవియని మరిచిపోకూడదనీ మరిమరి కోరుకుంటాడు.

దాశరథి రచనల్లో ‘పిల్లలారా!’ గీతం ఓ ఆణిముత్యం. భారత ప్రభుత్వం వారి సౌజన్యంతో ఆకాశవాణి ద్వారా, ఎన్సీఈఆర్టీ వారి సెంట్రల్‌ ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ద్వారా అన్ని రాష్ట్రాలలోని స్కూళ్లలో పిల్లలకు నేర్పబడిరది. పిల్లలు ఈ దేశపు భవితవ్యాన్ని నిర్దేశించే వారు కాబట్టి వారి వ్యక్తిత్వాలు తీర్చిదిద్దటానికి, జాతీయత పెంచటానికి ఈ గీతం ఎంతో ఉపయోగకరం. దాశరథి ముందు చూపుకు, విశాల హృదయానికి, ఈ గీతరచనా పటిమకు చేతులెత్తి మొక్కాల్సిందే.

పిల్లల్లారా పాపల్లారా.. రేపటి భారత పౌరుల్లారా..

పెద్దలకే ఒక దారిని చూపే.. పిన్నల్లారా పిల్లల్లారా..

మీ కన్నుల్లో పున్నమి జాబిలి - ఉన్నాడు.. ఉన్నాడు.. పొంచున్నాడు

మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు - ఉన్నాడు.. ఉన్నాడు.. అతడున్నాడు

భారత మాతకు ముద్దుల పాపలు - మీరేలే.. మీరేలే...

అమ్మకు మీపై అంతేలేని - ప్రేమేలే.. ప్రేమేలే...                         ‘‘పిల్ల’’

దేశభక్తి పరిఢవిల్లేలా జాతిపతాకాన్ని ఎగురవేసి జాతి గౌరవాన్ని కాపాడవలసిందిగా పిల్లలను కోరారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేలా ఒక్క భారతీయతనే మన మతంగా ఎంచుకొని బడిలో కలసిమెలగాలని ఉద్బోధించారు. అఖండ భారతావనిలో కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచి వీడరాని బంధాలను పెంపొందించాలని చాటారు.

నీలో దీపం వెలిగించు - నీవే వెలుగై వ్యాపించు..’ అంటూ మనిషి సంస్కరించుకోవాలని సాగిన ఈ గీతాన్ని డా.ఎం.బాల మురళీకృష్ణ ఆకాశవాణి కోసం ఆలపించారు. ‘బృందావనమెందుకు - యమునా తటమెందుకు, నా ముందుర నీవుంటే - నందనవనముంటే’,

చెరకు విల్లు చేతబూని రా - అరవిందం బాణంగా రా,

హృదయాలను గెలుచుకో - ప్రణయాలను పెంచుకో’ అనే పాటను ఎస్‌పి జానకి పాడిరది. దాశరథి లలిత గీతాలలో వస్తు నవ్యత ఎక్కువగా కనిపిస్తుంది.

            దేశభక్తి గీతాలు: దాశరథి స్వాతంత్య్ర సమరయోధులు. దేశభక్తి గీతాలు రాసాడు. వాటిని నేటికీ జెండా వందనం రోజున ర్యాలీలలో పాడుతుంటారు. నాటికీ నేటికీ వాటి విశ్వాసనీయత, సార్వజనీనత అమోఘం. అద్భుతం. అంతకుముందు ఆ తర్వాత వచ్చిన దేశభక్తి పాటలపూదోటలో పారిజాతమే. దాశరథి పాటల ప్రత్యేకతే అది.

విశాల భారత దేశం మనది - హిమాలయాలకు నిలయమిది

ఇలాంటి దేశంలో ప్రజలంతా - విశాల హృదయంతో మెలగాలి

మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి - భారతీయులం అందరం భారతదేశం సుందరం  ॥విశాల॥

ప్రేమపతాకం చేతగొని ఐక్యపథంపై పయనిద్దాం

త్యాగశక్తి మనమహాయుధంగా దేశశత్రువులనెదిరిద్దాం                                                            ॥విశాల॥  అని సాగే పాటలో విశాలభారతదేశంలో ప్రజలంతా ఒక్కటే హృదయంతో కలసి మెలసి మెలగాలి. దేశంలో అనేక కులాలు, మతాలు వేరైనా మనం భారతీయులం, భారతదేశం అందరిది అనే ఏకతాభావం కలిగి ఉండాలనే బోధిస్తుంది. ద్వేషం, రోషం తొలగించుకోవాలి. ప్రేమ విస్తరిల్లాలి. బుద్ధగాంధీ బోధనలతో ఐక్యపథంపై నిలబడాలి. జాతీయ సమైక్యతను పెంచుకోవాలనీ ప్రబోధిస్తుంది.

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం,

శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం

మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం

ప్రపంచాన మన దేశం - ప్రతిభను నిలబెడదాం ప్రతిభను నిలబెడదాం  అనే పాటరూపంలో ప్రతిజ్ఞ చేయించినట్లే ఉంటుంది. ఈ పాట నా బాల్యంలో పాడాను. ఇదే పాటను నా విద్యార్థులచే పాడిస్తున్నాను. ఈ పాట అత్యంత సుళువయిన పదాలతో విన్నంతనే అర్థమయ్యే విధంగా ఉంటుంది. పిల్లలకు కూడా కంఠతా వచ్చేస్తుంది.

1960లో ఆదిలాబాద్‌ ఆకాశవాణి కేంద్రం వారు రికార్డు చేసిన పాట

స్వేచ్ఛ భారతి జోహారు స్వాతంత్ర భారతి జోహారు - హిమగిరీశము నుండి అమృత వారధిదాకా

అఖిల భారత జనుల నలరించు తల్లి ` నదులతో గిరులతో మరుశాసనములతో’ అని స్వేచ్ఛా భారతికి జోహారులు స్వాతంత్య్ర భారతికి జోహారులు అర్పిస్తుంటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి ప్రబోధ గీతం

ఎగరేతామా సొగసైనా మనజండా - దిగివచ్చి దేవతలు దీవెనెలిస్తుండా             ॥ఎగరేతామా॥

మనదేశం మనజాతి అంతా మనదేనోయ్‌ - మనదేశపు సంపదంతా మనకేనోయ్‌        ఎగరేతామా॥

సొగసైన మనభారత జండాను వినీలాకాశంలో ఎగరేద్దామా. దివినుంది దిగివచ్చి దేవతలు దీవెనలు ఇస్తారు. పల్లెలోన, ఢల్లిలోన ప్రజలదీ రాజ్యం, భయం లేని జీవితంతో సేద్యం చేద్దాం. మనదేశ సంపదంతా మనదే. సమిష్టిగా కృషిచేద్దామనే కర్తవ్యబోధ ఉంది. దాశరథి 
దేశభక్తి గీతాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో కానీ అవి ఇచ్చే ఆత్మవిశ్వాసం అనంతం. 

ప్రజాకవి దాశరథి - సినీరంగ ప్రవేశం:



కవి స్వతంత్రుడు. ప్రజాకవికి ఎనలేని స్వేచ్ఛ ఉంటుంది. కాలాన్ని కలంతో శాసించిన కవే అయినా సినిమా నియమాలన్నీ వేరుగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకవి అస్వతంత్రుడు. సినిమా పాట కొన్ని నిబంధనల సంకెల్ల మధ్యన బంధించబడి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, సన్నివేశం ఈ మూడింటి మిళితమే సినిమా పాట. దర్శకుడు, సంగీత దర్శకుడు చెప్పే సన్నివేశానికి, దర్శక, నిర్మాతలను ఒప్పించేవిధంగా పాట రాయాల్సి ఉంటుంది. ఇదంతా దాశరథికి కొత్తదే అయినా కవిత్వంలో చేసిన ప్రయోగాలు ఎన్ని ఉన్నాయో సినిమా పాటలలోనూ అన్ని ప్రయోగాలున్నాయి. కవిత్వంలో సుదీర్ఘ సమాసాలు ‘సూర్యచంద్రాగ్ని వాయువు భూమి గగనములు’, ‘దినకరచంద్రరవికిరణజ్వాలామాలికలు’, మొదలైన ప్రయోగాలను వదిలి, అతి సుళువైన అలతి అలతి లలిత పదాలను కలిపి జనరంజకంగా సినిమా పాటలు రచించిన ప్రయోగశీలి, నైపుణ్యశాలి దాశరథి.

సుదీర్ఘ సమాసాలతో రచన చేస్తే ప్రేక్షకున్ని చేరకపోవచ్చు. అదే కవిత్వమయితే పుస్తకంలో పదేపదే చదివి అర్థం చేసుకునే నిదానంగా అవకాశం ఎక్కువ. ప్రేక్షకుడు, శ్రోత సినిమా పాట వింటాడు. పాడుకుంటాడు. పరవశిస్తాడు. విన్నంతనే అర్థమవ్వాలి. అలాంటి పాటల్ని అవలీలగా, అలవోకగా లలితమైన పదాలతో అద్భుతమైన భావకతను ప్రవేశపెట్టి దాశరథి రాశారు.

దాశరథి సినిమా రంగంలో ప్రవేశించేనాటికి లబ్ధ ప్రతిష్టులైన సముద్రాల, పింగళి, మల్లాది, శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర, ఆత్రేయ, కొసరాజు లాంటి కవులు వెండితెరపై వెలుగుతున్నా, దాశరథి సినిమా రంగంలో ప్రవేశించి ప్రయోగాలతో తనదైన ముద్రవేశాడు.

భాషాపరంగా దాశరథి ఎన్నో అవాంతరాలు అవలీలగా అధిగమించాడు. ఇంటో సంస్కృతం. వీధిలో ఉర్ధూ ప్రభావం ఉన్నా తెలుగులో విస్తృతమైన కృషిచేసాడు. సంస్కృత గ్రంథాలను ఒంటబట్టించుకున్నారు. గాలిబ్‌ గజళ్ల్లు తెలుగులోకి అనువదించారు. మీరా అసదుల్లా ఖాన్‌ గాలీబ్‌ రాసిన గీతాలలో ‘ఇష్క్‌ పర్‌ జోర్‌ నహి - హై యే ఓ ఆతిష్‌ గాలీబ్‌, కి లగాయిన లగే, ఔర్‌ ముజాయిన బనే’ అనగా తెలుగు అనువాదం ‘ప్రణయమనగా అగ్గి వంటిది. అంటించిన అంటదు. ఆర్పినంతన ఆరబోదు’’ అనే గాలీబ్‌ తత్త్వాన్ని దాశరథి 1961లో ‘గాలిబ్‌ గీతాలు’ అనే పుస్తకం అనువదించి అక్కినేని నాగేశ్వరరావుకి అంకితం ఇచ్చారు. ఆ స్వేచ్ఛానువాదాన్ని, శైలిని గమనించిన నాగేశ్వరావు అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాత దుక్కిపాటి మధుసూదన్‌ రావుకి పుస్తకం ఇచ్చి, ఇది చాలా అద్భుతమైన అనువాదమని కొనియాడాడు. దాశరథి నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే మంచిదని ఒక చిన్న సలహా ఇచ్చారంట. నిర్మాత దుక్కిపాటి మధుసూదన్‌ రావు ఒప్పుకున్నారు. అక్కినేని తన సినిమాకి పాట రాయించుకున్నారు. అప్పటికే ఆత్రేయ తాను దర్శకత్వం వహిస్తున్న ‘వాగ్దానం’ సినిమాకి తాను గీతరచన చేస్తూనే లబ్ద ప్రతిష్టులైనటువంటి రచయితలతో పాటలు రాయించాలని శ్రీశ్రీని, ఆరుద్రని, దాశరథిని మద్రాసుకి పిలిపించారు. అప్పుడు దాశరథికి ఒక ప్రణయగీతం, స్వేచ్ఛా, భావగీతం రాయమని కోరారు. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని దాశరథి వదులుకోలేదు.

పల్లవి:    నా కంటిపాపలో నిలిచిపోరా - నీవెంట లోకాల గెలువనీరా

ఆమె:     ఈనాటి పున్నమి - ఏనాటి పున్నెమో - జాబిలి వెలిగేను మనకోసమే                         ॥ఈనాటి॥

అతడు: నెయ్యాలలో తలపుటుయ్యాలలో - అందుకొందాము అందని ఆకాశమే

ఆమె:     ఈ పూలదారులు ఆ నీలితారలు - తీయనిస్వప్నాల తేలించగా

అతడు: అందాలను తీపిబంధాలను అల్లుకొందాము డెందాలు పాలించగా ॥ఈనాటి॥ అని రాసిన ఈ పాట, ఇది ప్రేయసి ప్రియుల మధ్య ప్రణయాన్ని లాలిత్యమైన శృంగారాన్ని గురించి రాసిన అద్భుతమైన పాట కనిపిస్తుంది. ఆకాశాన్ని అందుకున్న ప్రేమికుల పరవశం వెన్నెల స్నానాలు చేయించింది. ఆ జంట తన్మయత్వము చెందిన పున్నమి బహుజన్మల పుణ్యం వలన సిద్ధించిందని సమీకరణ చేయడం కవి ప్రతిభకు పరాకాష్ట. జాబిలి, మేఘాలు, తారలు ద్వారా ప్రేమను అభివ్యక్తం చేస్తారు. వెన్నెల స్నానం, ఆకాశంలో వలపురాగాలు వంటి చిత్రాత్మక భావనలు. మొదటి పాటలో తన ప్రతిభ పాటవాలను ప్రదర్శించి విమర్శకుల మెప్పు పొందాడు. అయితే వాగ్దానం సినిమా విడుదల కాలేదు.

            సినీ ప్రజానీకానికి అది ఇంకా చేరకముందే నాగేశ్వరరావు ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో సాలూరి రాజేశ్వరరావు సంగీతబాణికి అనుగుణంగా రాయాలి. సాలూరు రాజేశ్వరరావు జగణాలున్న ట్యూన్‌ యిచ్చి ‘చాలా కష్టమండోయ్‌ రాయడం’ అని సవాలు చేశారు. సంగీత దర్శకులు కోరుకొనిన రీతిలో ఆ బాణీలో పాటను 15 నిమిషాలలో అందించాడు. బాణీ వెంట భావం వెళ్ళాలి. భావం వెంట బాణీ రాదు. అలా రచించిన ఆ పాటనే...

పల్లవి: ఖుషీఖుషీగా నవ్వుతూ - చలాకి మాటలు రువ్వుతూ, హుషారు గొలిపేవెందుకే- నిషా కనులదానా’

చరణం:ఆమె :మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలీ మీనా -  నింగిదాటి ఆనందసాగరం పొంగిపొరలె నాలోనా

ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ - హుషారు గొలిపే నిందుకే నిషా కనులవాడా!

చరణం: అతడు : ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందమా నేడే `

ఆమె: నీలినీలి మేఘాల రథముపై తేలిపోద మీనాడే

అతడు: చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా

ఆమె: నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా

ఇద్దరూ: ఖుషీఖుషీగా నవ్వుతూ - చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా వుందాములే - హమేషా మజాగా

ఖుషీఖు(జగణం - తనాన) షీగా నవ్వుతూ - చలాకి(జగణం - తనాన) మాటలు రువ్వుతూ, హుషారు(జగణం - తనాన)గొలిపే వెందుకే- నిషా క(జగణం - తనాన)కనులదానా, మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలీ మీనా, నింగిదాటి ఆనందసాగరం పొంగిపొరలె నాలోనా, ‘‘ఖుషీఖుషీగా’’, ‘‘చలాకి మాటలు’’, ‘‘హుషారు’’, ‘‘మజ్నూ’’, ‘‘లైలా’’ ఈ పదాలు ఉర్దూ శైలిని తెలుగులో కలిపి, ఒక కొత్త ధ్వని, ప్రాస, తీయదనాన్ని అందించాయి.

‘‘ఇంద్రధనుస్సుపై ఆడుకుందామా’’, ‘‘చంద్రుడు నేనై నీవు వెన్నెలూ కలసిపోవుదమా... అని మనసును ఆవిష్కరించారు. ఇద్దరు మిత్రులు’లో ఎస్‌. రాజేశ్వర్రావు సంగీతంలో దాశరథి రాసిన రెండు పాటలూ గొప్పవే. మొదటిది ‘ఖుషీఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’. రెండోది ఖవ్వాలి పాట. ఆ పాటతో తెలుగు సినిమాల్లో ఖవ్వాలి పాటలకు శ్రీకారం చుట్టారాయన.

ఆ రోజు మొదటి పాట ఓకే కాగానే దుక్కిపాటి మధుసూదన్‌ రావు ‘‘మాకు ఖవ్వాలి పాట కావాలి’’ అన్నారు.  రెండు క్షణాలు ఆలోచించి ‘‘నవ్వాలి నవ్వాలి, నీ నవ్వులు నాకే ఇవ్వాలి’’ అని అన్నారు. అంతే, అందరు ఆశ్చర్యపోయారు. ట్యూన్కి ఆ పదాలు అల్లుకుపోయాయి. నిమిషాల్లో పాట పూర్తయ్యింది. ‘‘అమ్మో! హైదరాబాద్‌ దెబ్బ గట్టిదే’’ అనుకున్నారట అంతా. ఇలా మొదలైన దాశరథి సినిమా పాటల ప్రస్థానానికి తిరుగు లేకుండా పోయింది.

పల్లవి:    నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే యివ్వాలి

            అందాల చిన్నవాడ బంగారు వన్నెకాడ 

నీకున్న చింతా వంతా యీనాడే తీరాలి                           ॥నవ్వాలీ॥

చరణం1 : కలిమీ బలిమీ కలవాడవోయి - కలతలలో మునిగిపోనేలనోయి

                        మనసూ దోచుకొనీ ఏ చిన్నదో దాచినదా 

                        నిన్ను కవ్వించీ నిన్ను నమ్మించీ - దగా చేసి పోయినదా            ॥నవ్వాలీ॥

చరణం: మీ కోసమేనోయి నా విలాసము - మీ అందరిదేనోయి యీ వినోదము

      పున్నమ చందురుడు చిందించే అందాలు - కలువల కన్నిటికీ కలిగించును సరదాలు             ॥నవ్వాలీ॥

దాశరథిగారి ఉర్దూ భాష ప్రావీణ్యం, తెలుగు సినీగీతాలను నవీనశిల్పంలో నిర్మించడానికి తోడ్పడిరది. ఈ నిర్మాణంలో వెలువడిన తొలి పదశిల్పమే యీ గీతం. నాయికా నాయకులు, తమ ప్రణయం, పరిణయంగా మారే పరిణామాన్ని ఊహించుకున్న తీరును దాశరథి చిత్రించారు.

అనుబంధం, ఒకరికొకరి అవసరం, ఆత్మీయత ప్రధానంగా వ్యక్తమవుతున్న పాటను బాబూ మూవీస్‌ (1962) చిత్రం కోసం రాశారు.

పల్లవి: ఆమె: నన్ను వదలి నీవు పోలేవులే - అదీ నిజములే, పూవులేక తావి నిలువలేదులే లేదులే             ॥నన్ను॥

అతడు: తావిలేని పూవు విలువలేదులే - ఇదీ నిజములే నేను లేని నీవు లేనెలేవులే లేవులే

చరణం1: ఆమె: నా మనసే చిక్కుకునే నీ చూపులవలలో - నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో

          చిరకాలపు నా కలలే యీనాటికి నిజమాయె - దూరదూర తీరాలు చేరువై పోయె... ఓ...

అతడు: తావిలేని పూవు విలువలేదులే - ఇదీ నిజములే, నేను లేని నీవు లేనెలేవులే లేవులే

చరణం3: అతడు: తొలినాటి రేయి - తడబాటు పడుతూ, మెలమెల్లగా నీవు రాగా

                                   నీ మేని హొయలు - నీలోని వగలు నాలోన గిలిగింతలిడగ

                   ఆమె:           హృదయాలు కలసి - ఉయ్యాల లూగి, ఆకాశమే అందుకొనగా,

                           పైపైకిసాగి మేఘాల దాటి - కనరాని లోకాలు కనగా...                          ॥నన్ను॥

జీవితాన్ని శుభప్రయాణంగా చూపిస్తూ, ప్రేమను శుద్ధమైన, పరిపూర్ణమైన అనుభూతిగా నిలుపుతుంది. ఈ పాటలో నాయికానాయకుల ప్రణయ జీవనం, పూవుతావి వలె అవిభాజ్యంగా ఉండాలని, అంబరాన్ని దాటి ఆనందతీరాల వైపు సాగిపోవాలనే అంశాన్ని రసరమ్యంగా వర్ణించారు. లలిత పదాలతో దాశరథి మనసు మెలికలు పెట్టాడు. ‘చూపులవల’, వంటి పదబంధాలు కొత్తగా పరిచయమయ్యాయి.

ప్రణయ గీతాలలో పేరేన్నికగన్న పాటగా నిలిచిపోయిన దాశరథి పాట ‘తోట రాముడు’(1975) సినిమాలోని అలక, ప్రేమ ఒలకపోస్తూ కమనీయంగా కలిపి రాసిన పాటగా నిలిచిపోయింది.

పల్లవి: అతడు: ఓ బంగరు రంగుల చిలకా పలకవే - ఆమె: ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ

అతడు: నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ                                 ॥ఓ అల్లరి॥

ఆమె. నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ

అతడు. పంజరాన్ని దాటుకునీ, బంధనాలు తెంచుకొని -నీ కోసం వచ్చా ఆశతో,

చరణం. అతడు. మేడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ - నిరుపేదను వలచావెందుకే

ఆమె: నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే                           ఓ బంగరు॥

            చరణం. సన్నజాజి తీగుందీ, తీగమీద పువ్వుందీ - పువ్వులోని నవ్వే నాదిలే

            కొంటె తుమ్మెదొచ్చింది - జుంటి తేనె కోరిందీ

            అందించే భాగ్యం నాదిలే - ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ॥ఓ అల్లరి॥ ॥ఓ బంగరు॥

            ఆధునిక భావాలు గల నవయువతీ హృదయ స్పందనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. ప్రేమంటే ఆస్తులు, అంతస్తులు కావు. అంతరంగంలో దాగిన ఆత్మీయత, ఆప్యాయత కలగలిసిన జీవితకాలపు నమ్మకాన్ని అక్షరీకరించాడు. మేడ మీద చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలిచావెందుకు అని అడిగినప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కథ నిన్ను చేరడానికి నీ చేతులలో పులకించడానికి అని చెప్పడం ఎంత సహజంగా ఉందో, ఎంత మధురంగా ఉంటుందో ప్రేమలో ఉన్న నిచ్చలత తాలూకు స్పర్శ, ఆకాంక్షల మిశ్రమాన్ని చాలా సున్నితంగా అలతి అలతి పదాలతో కవితాత్మక గీతంగా మన హృదయాన్ని తాకుతాయి.

1970లో విడుదలైన ‘శ్రీదేవి’ సినిమాలో నాయికా నాయకులు పంపుకున్న ప్రేమలేఖల తీరు రమణీయంగా రచించాడు. వారి విరహవేదనను విపులీకరిస్తూ మనసుని ఇచ్చి పుచ్చుకున్నట్లు రాసిన తీరులో మాధుర్యం పొంగిపొరలింది.

పల్లవి: రాశాను ప్రేమలేఖలెన్నో... దాచాను ఆశలన్ని నీలో - భువిలోన మల్లియలాయే... దివిలోన తారకలాయే నీ నవ్వులే ॥రాశాను॥

 చరణం1 : కొమ్మల్లో కోయిలమ్మా.. కోయన్నది, కొమ్మల్లో కోయిలమ్మా కోయన్నది... నా మనసు నిన్నే తలచీ ఓ యన్నదీ

మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది... చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది               ॥రాశాను॥

చరణం 2 : నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో...  ఊహూ.. - నీ చల్లని రూపం ఉందీ నా కనులలో... 

నాలోని సోయగమంతా విరబూసెలే... - నాలోని సోయగమంతా విరబూసెలే... మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

చరణం 3 : అందాలా పయ్యెద నేనై ఆటాడనా... ఆ..... కురులందు కుసుమం నేనై చెలరేగనా.... ఆ.... 

నీ చేతుల వీణను నేనై పాట పాడనా... నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా   ॥రాశాను॥

 ఉప్పొంగే ప్రేమ భావాలను ఎత్తిపోసిన లోతైన గాఢత గలిగిన భావోద్వేగ సంబంధాన్ని ఈ పాట వ్యక్తీకరిస్తుంది. ఆమె నవ్వుల్ని దివిలోని తారకలాయే నీ నవ్వులే అనడం వినీలాకాశంలో నక్షత్ర శోభలా ఉందని చెబుతుంది. నీ చేతుల వీణను నేనైపాట పాడనా అని తన ప్రియురాలు చేతుల్లో వీణగా ఊహించుకుంటాడు. ఆమె చేతులు ఆ స్పర్శ సంగీతం రాగాలుగా పలుకుతుందని ఊహిస్తాడు. కురులందు కుసుమం నేనే అనగా జడలో పువ్వును నేనే అని వివరిస్తాడు. ఎన్నో భావాలను ప్రేమలేఖలో రాశానని వివరిస్తాడు.

   జీవితంలో పెళ్లి గొప్ప వేడుక. ఆ పెళ్లి గురించి ఊహించుకుంటారు. అలాంటి ఊహల గురించి ‘శ్రీ రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌’ (1976) చిత్రంలో అద్భుతంగా రాశారు.

పల్లవి: ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా ॥2

అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా - దీవనలు ఇస్తారంటా              ॥ఆకాశ॥

1. తళుకు బెళుకు నక్షత్రాలు - తలంబ్రాలు తెస్తారంటా ॥2

మెరుపు తీగ తోరణాలు - మెరిసి మురిసి పోయేనంటా - మరపు రాని... వేడుకలంటా  ॥ఆకాశ॥

2. పిల్ల గాలి మేళ గాళ్ళు పెళ్ళిపాట పాడేరంటా ॥2

రాజహంస జంట చేరీ రత్న హారతిచ్చేరంటా - రాసకేళి...జరిపేరంటా...      ॥ఆకాశ॥ 

3. వన్నె చిన్నెలా ఇంధ్రధనసు పై వెన్నెల పానుపు వేసేనంట ॥2

మబ్బులు తలుపులు మూసేనంటా....ఆ..ఆ...ఆ...- మబ్బులు తలుపులు మూసేనంటా..                  

మగువలు తొంగి చూసేరంటా - మనలను.. గేలి.. చేసేరంటా..                                 ॥ఆకాశ॥

వారి పెళ్లి ఆకాశంలో లేదా స్వర్గంలో జరుగుతుందని ఊహాలోకంలో వివరిస్తారు. ఆ పెళ్ళికి ఆకాశమే పందిరి. తళుకు బెలుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట అనడం ఖగోళశోభ జోడిరపు. మెరుపుతీగలే తోరణాలుగా ఊహించటం పెళ్లి వేడుకతో శోభాయమానంగా అలంకరించినట్లుగా ఉంది.

జన్మజన్మాల బంధాన్ని విశ్లేషిస్తూ రాసిన పాట ‘పూజ’(1975) చిత్రంలో  ప్రేక్షకులపై చెదరని ముద్రవేసింది. ఈ చిత్రంలో అన్ని పాటలు దాశరథి రాసినవే. దాశరథి మంచి అనువాదకుడు. సంగీత దర్శకులై రాజ్‌ నాగేంద్రలు కన్నడంలో తీసిన ‘పూజ’ సినిమాలోని ‘ఎందెందు నిన్నను మరెదు’ బాణీనే యథాతదంగా తీసుకున్నారు. అనువాదంలా గాకుండా ఇక్కడి స్థానీయతని జొప్పించి అద్భుతంగా తెలుగు పాటలా రాసాడు. ఈ పాట దాశరథిó ఖ్యాతినందించిన ఆల్‌ టైం హిట్‌ గా నిలిచింది.

పల్లవి: అతడు. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ - ఆమె. ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

అతడు. ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను

 - ఆమె. ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ॥ఎన్నెన్నో॥

ఆడనా.. పాడనా.. ఆడనా...

చరణం: కోటి జన్మలకైనా కోరేదొకటే - నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి

ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా - ఈ పొందు ఎల్ల వేళలందు

ఉండనీ. ఉండనీ.. ఉండనీ..

‘‘నీలో సగమై ఎపుడూ నేనుండాలి’’, ‘‘నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా’’ ఈ వాక్యాలు ప్రేమికుల ‘‘జీవితసాఫల్యాన్ని’’, ‘‘పరిపూర్ణతను’’ ప్రేమికుల ఏకత్వాన్ని తెలియజేస్తాయి. ‘‘విరిసిన కుసుమం నీవై’’, ‘‘జాబిలి నే’’, ‘‘మేఘం నీవై నెమలిని నేనై’’ మొదలైన పోలికలు చాలా బాగున్నాయి. ఈ పాట ఈనాటికీ ప్రతి వివాహవేదికలపైనా, ఆర్కెస్ట్రాలో గాయనీ గాయకులు పాడుతుండడం మనం చూడవచ్చు.

 ‘గూడుపుఠాణి’(1972) చిత్రంలో తన తనివి తీరలేదే పాట వెంట శ్రోతలను పరిగెత్తిస్తాడు. వారి మనసే ఆవిష్కరణ చేసాడా అని అనిపిస్తుంది.

పల్లవి: తనివి తీరలేదే - నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం

చరణం: ఎన్నో వసంతవేళలలో - వలపుల ఊయలలూగామే ॥ఎన్నో॥

                        ఎన్నో పున్నమిరాత్రులలో - వెన్నెల జలకాలాడామే ॥2

                        అందని అందాల అంచుకే చేరిననూ                         ॥2

                        విరిసిన పరువాల - లోతులే చూసిననూ                      ॥తనివి॥

చరణం: ఎప్పుడు నీవే నాతో ఉంటే... - ఎన్ని వసంతాలైతేనేమి

ఎన్ని వసంతాలైతేనేమి - కన్నుల నీవే కనబడుతుంటే...

ఎన్ని పున్నమలు వస్తేనేమి - వెచ్చని కౌగిలిలో

హాయిగా కరిగించిననూ - వెచ్చని కౌగిలిలో                            ॥తనివి॥

ప్రేయసి ప్రియులు తనివి తీరలేదని ఎంతసేపు గడిపిన మనసుకు తృప్తికలగలేదనీ, పరస్పరం తమభావాల్ని పంచుకుంటున్నటువంటి సందర్భంలో అంతరంగాలను ఆవిష్కరించిన మనసుల సునాదం. ఇందులో ‘వలపుల ఊయల’, ‘వెన్నెల జలకాలు’, చంద్రుని కాంతితో పోల్చడం వల్ల శృంగార రసానికి ఒక దృశ్యరూపాన్ని ఆపాదించింది. అందని అందాల అంచు అందలేదని తృప్తి చెందలేదని సూచిస్తుంది. తేనెల కురిపించు హృదయం అనే పంక్తులు అద్భుతంగా దాశరధి చిత్రించారు.

సంగీతమే జీవితంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ చెళ్ళపిళ్ళ సత్యం ఒకరు. ఆయన తెలుగు, కన్నడ భాషలలో దాదాపు అరవై వరకు చిత్రాలకు సంగీత దర్శకబాధ్యతలను నిర్వహించారు. తెలుగు చిత్రరంగంలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన మొదటి చిత్రం 1973లో వచ్చిన ‘కన్నె వయసు’. అందులోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...’ పాట ఆయన స్వరపరచిన పాటల్లో ఆయనకు ఇష్టమైనదిగా చెప్పవచ్చు. ఆపైన ఆయన ఎన్నో మధురమైన పాటలకు స్వరకల్పన అందించారు. అలాగే, దాశరథి గారంటే చిత్రరంగంలో ఒక ఉన్నతమైన అంచనాలతో కూడిన గుర్తింపు ఉంది. ఆయన వ్రాసిన ఏ ప్రణయ రాగమైనా అది వినూత్నమై మనసును ఆకట్టుకుంటుంది. కారణం దాశరథి కలం నుండి జాలువారే భావ ప్రకటన అంత మధురంగా ఉంటుంది. 

ఏ దివిలో విరిసిన పారిజాతమో - ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో - 

నా మదిలో నీవై నిండిపోయెనే            ॥ఏ దివిలో॥

నీ రూపమె దివ్య దీపమై నీ నవ్వులె నవ్య తారలై - నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

1. పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే 

- నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే 

- నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే

కాలి అందియలు ఘల్లుఘల్లుమన - కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే             ॥ఏ దివిలో॥

2. నిదుర మబ్బులను మెరుపుతీగవై ` కలలు రేపినది నీవే

బ్రతుకు వీణపై ప్రణయరాగములు - ఆలపించినది నీవే

పదము పదములో మధువులూరగా కావ్యకన్యవైరావే                                                    ॥ఏ దివిలో॥

దాశరథి పాటల పూదోటలో విరిసిన పారిజాతం. ఈ పాటతో ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం సినీ స్వరజీవితాన్ని మలుపుతిప్పిన మధురగీతంగా నిలిచిపోయింది. ఈ పాట నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. లేత సిగ్గులు పల్లవించగా రావే. రాజహంసలా రావే అని ప్రేయసిని పిలుస్తాడు. బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలకించినది నీవే. పదము పదములో మధువులూరగా కావ్య కన్యకవై రావే అని పిలువడం ఆహర్యాన్ని వర్ణిస్తూ ఆహ్వానించడం ఎంతో సముచితంగా ఉంది.

దేశభక్తి గీతాలు: దాశరథి దేశభక్తి గీతాలు దేశభక్తిని నూరిపోసాయి. వారి తొలి సినీగీతం. గాంధీజి ఉప్పు సత్యాగ్రహం నాటిది. బ్రిటిష్‌ వారు పన్నుల పేరిట రైతుల నెత్తురు పీల్చినారు. వాటి నేపథ్యంగా వచ్చిన ‘పదండి ముందుకు!’(1962) చిత్రంలోని పాటలు.

పల్లవి :   మేలుకో సాగిపో - బంధనాలు తెంచుకో  ॥2

         - బరువులూ బాధలూ అందరితో పంచుకో  ॥మేలుకో॥

చరణం:   పల్లెనకా, పట్నమనక అందరమూ కలసి

 - కులమనకా మతమనకా మనం కలిసిమెలసి

      దేశాన్ని దోచుకునే తెల్లవాణ్ణి తరిమీ - జైళ్లలోని వీరులను నేడే విడిపించుకో   ॥మేలుకో॥

చరణం: తలయెత్తుకు తిరగలేని బతుకు లెందుకోయ్‌ - పరదేశపువాడు పెట్టు మెతుకులెందుకోయ్‌

                        భరత జాతి గౌరవాన్ని కాపాడవోయ్‌ - తెల్లవాడు వెళ్లువరకు వెంటాడవోయ్‌ 

దాశరథిగారి తొలి సినీ ప్రబోధగీతమిది. ఈ పాటకు మరో ప్రత్యేకత మహమ్మద్‌ రఫి తెలుగు తెరకు పరిచయమయ్యారు. సినిమా కథాకాలం గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం నాటిది. బ్రిటిష్‌ వారు పాలన పేరుతో రైతుల నెత్తురు పీల్చినారు. ఎదురించిన దేశభక్తులను బంధించారు. సమస్త ప్రజలు ఉద్యామించాలనీ సాగిన గీతం. ఈ పాట ఒక ఉద్రేకభరితమైన జాగరణ గీతం సామాజిక చైతన్యం, జాతి గౌరవం, పేదల శ్రమ, బ్రిటిష్‌ పాలన కీచకత్వం.. ఇవన్నీ కలగలిసిన సారవంతమైన సందేశం.

ప్రకృతి సంబంధిత పాటలు: ‘పిట్టే’ కదా అని తేలిక భావంతో చూడవద్దని ఆ చిన్ని మననులో ప్రపంచమంతా దాచుకొన్నదని చెప్పారు.

పల్లవి: గోదారి గట్టుంది - గట్టుమీద సెట్టుంది. సెట్టుకొమ్మన పిట్టుంది 

- పిట్టమనసులో ఏముందిఓ... ॥గోదారి॥

చరణం: ఒగరు ఒగరుగా పొగరుంది - పొగరుకుతగ్గ బిగువుంది,

తియ్యతియ్యగా సొగసుంది - సొగసునుమించే మంచుంది                       ॥గోదారి॥

చరణం: పిట్టమనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది. అంతు దొరకని నిండుగుండెలో.

ఈ పాటకు ప్రేరణ తమిళ పాట ‘‘తనయన్‌’’ (1962)లోని కణ్ణదాసన్‌ రచించిన ‘‘కావేరి కరై ఇరుక్కు...’’ పాట నుండి తీసుకున్నదని దాశరథి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడ కావేరి నది తీరపు సౌందర్యం వర్ణన కాగా, ఇక్కడ గోదావరి గట్టు, పిట్ట, ప్రకృతి సౌందర్యం, మానసిక భావాలు ప్రాధాన్యంగా ఉన్నాయి.

గోదారి గట్టుపై కూర్చుండి పిట్ట మనసు గురించి ఆలోచించడం మనసులో కలిగే అనుభూతి ప్రకృతి ప్రేమ జీవన రహస్యాల సంఘమే ఈ పాటలో కనబడుతుంది. మనిషి గుండెలో ఉండే అనుభూతులు ఆశలు ప్రేమలు వాటి కొలతలు ఉండవు. పిట్ట ప్రతీక చిన్నది. అది సూచించే భావాలు నూతనమైనవి. ఎండా పువ్వు ముళ్ళు మొదనవి జీవితంలోని సుఖదుఃఖాలు. పిట్టమనసు అంతర్గత స్థితిని, అంతులేని లోతులను వెల్లడిపరిచే, వెల్లడిపరచని అంశాలుగా చిత్రీకరించారు.

లేడీ ఓరియెంటెడ్‌ పాటలు: దాశరథి స్త్రీలపై సహానుభూతి కలిగి, పక్షపాతిగారాసిన పాటలు చాలా ఉన్నాయి. స్త్రీ అంతరంగ ఆవిష్కరణ ఆ పాటలలో మనకు దర్శనమిస్తుంది. వేదన, విరహము, బాధలు మొలైనవన్నీ కూడా అందులో కనిపిస్తాయి.

పూలరంగడు’ సినిమా (1967)లో ఒంటరితనం ఏవిధంగా బాధిస్తుందో తెలిపిన విరహవేదన.

 పల్లవి : నీవురావు నిదురరాదు - నిలిచిపోయీ రేయి ॥నీవు॥

చరణం: తారా జాబిలి ఒకటై సరసమాడె ` ఆ రేయి చింతా చీకటి ఒకటే చిన్నబోయే ఈ రేయీ

చరణం: కౌగిలిలో ఒదిగిపోయి, కలలుగనే వేళాయె ఎదురుచూసి, ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె             ॥నీవు॥

విరహగీతాల రచనలో దాశరథి విలక్షణతను వివరించే గీతమిది. నాయకుడు రానందుకు, నిదురే రావడం లేదా నాయికకు. అందులో విశేషమేమిలేదు, కానీ రేయే నిలిచిపోయిందని చమత్కరించారు దాశరథి.

ఆ రేయి రెండు రకాల అనుభూతులనందిస్తుంది. తారాచంద్రుల సరససల్లాపాలకు అనుకూలమే కాని నాయికలోని విరహవేదనకు ప్రతికూలమయిందట. ఆమె విచారాన్ని (చింత) చీకటితో పోల్చారు.

మనుషులు మమతలు’(1965)సినిమాలో ముక్తపదగ్రస్తంతో రాసిన పాట ఆపాతమధురం. వెన్నెల మేఘాలలో శృంగార రసోద్దీపితల వస్తువులు. చల్లని వెన్నెలరాత్రిలో నాయిక చేతిలో మ్లెల పరిమళాలను ఆస్వాదిస్తూ భర్తను కలగంటున్న సందర్భంలో రాసిన పాట

పల్లవి: రాధ: వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమఘుమలు - వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమఘుమలు

ఘుమ ఘుమలో..ఓఓ..గుస గుసలు - ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు

చరణం: నీ హృదయంలో..నిలవాలని..ఈఈఈఈ - నీ కౌగిలిలో..కరగాలని..ఈఈ

నీ హృదయంలో..నిలవాలని..ఈఈఈఈ ` నీ కౌగిలిలో..కరగాలని..ఈఈ

నీవే నీవే..కావాలని..ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు                                     ॥ వెన్నెలలో ॥

ఈ పాట, నీ హృదయంలో నిలవాలని.. నీ కౌగిలిలో కరగాలని’’, ‘‘హృదయంలో నిలవడం’’,  ‘‘పూల పల్లకిలోన తేలిపోయే సమయాన’’ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలను, కోరికలను, సన్నిహిత క్షణాలను చాలా అందంగా వ్యక్తం చేస్తాయి. ‘‘వెన్నెల’’, ‘‘మల్లెలు’’, ‘‘పూల పల్లకి’’ వంటి పదాలతో రసరమ్య శృంగార కావ్య దృశ్యాన్ని సృష్టించాయి.

భక్తి పాటలు: దాశరథి బయటకి కమ్యూనిస్టుగా వ్యవహరించినా భక్తి పాటలకు ప్రాణంపోసాడు. వారిలోని ఆధ్యాత్మికత భక్తులందరినీ తదాత్మయం చెందిస్తుంది. వారి భక్తిపాటలు ఇప్పటికీ ఆలపించబడుతున్నాయంటే ఆ పాటల విశిష్టత మనకు అర్థమవుతుంది. ‘అమాయకురాలు’(1971) చిత్రంలోని పాడెద నీ నామం అనే పాట వీణపాట.

పల్లవి: పాడెద నీ నామమే గోపాలా!

హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా                        ॥పాడెద॥

చరణం: మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా! 

ఆశలతోనే హారతిచేసి పదములు పూజింతురారా                            ॥పాడెద॥

చరణం: నీ మురళీగానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా 

పొన్నలుపూచే బృందావనిలో వెన్నెల కురిసే

సంగీత సాహితీ విలువలు పుష్కలంగా వున్న గీతమిది. లలితంగా సాహిత్యంలో ‘వీణ’ శబ్దం లేనప్పటికీ తెరపైన ఇది వీణ పాటగానే చూపించారు. ‘పాడెద నీ నామమే’, ‘నీ మురళీ గానమే’ చరణానికి ముందు వీణపై వినిపించిన స్వరఖండికలు అలరిస్తాయి.

అంతా మనమంచికే’ (1972) సినిమాలో తిరుమల వేంకటేశ్వరుని పాట.

పల్లవి: నీవేరా నా మదిలో - దేవా తిరుమలవాసా! 

ఓ శ్రీనివాసా! నీ పదదాసిని నేనేరా            ॥నీవేరా॥

చ: యెంతో మధురం నీ శుభనామం జగతికి దీపం నీ దివ్యరూపం ఆశలపూలే - దోసిట నింపి వేచే భాగ్యము - నాదేరా॥నీవేరా॥

చ: నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచాను స్వామీ -

నీ సన్నిధియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదేరా ॥నీవేరా॥

నవవిధ భక్తి మార్గాలలో సమర్పణ మొకటి. స్వామివారి చరణాలపై పూవుగా ఉండాని, తన జీవితాన్నే హారతిగా అందించాలనుకునే ఆర్థభక్తిని అందంగా ఆవిష్కరించారు.


దాశరథి పాటలు- 20.07 2025 సంచిక పత్రిక

దాశరథి పాటలు -2 తేది: 27-07-2025


శివతత్వం: దాశరథి వైష్ణవుడైనా శైవగీతాలు కూడా అద్భుతంగా రచించాడు. బాబు పిక్చర్స్‌, సంజీవిని ఫిలింస్‌, శ్రీరమణ చిత్ర, మట్టిలో మాణిక్యం (1971) చిత్రంలోని పాట.

పల్లవి: శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీ శేశైలవాసా          ॥శరణం॥

చరణం: భక్తుల బ్రోచే స్వామివి నీవే పేదల పాలిటి పెన్నిధి నీవే

సకల జీవులను చల్లగ చూచే కరుణామయుడవు నీవే                                           ॥శరణం॥

చరణం: నీ ఆలయమే శాంతికి నిలయం నిను సేవించే బ్రతుకే ధన్యం తిరుమలవాసా

శ్రీ వెంకటేశా మా యిలవేలుపు నీవే                                                             ॥శరణం॥

తిక్కన చెప్పిన హరహరద్వైతంను ఈ పాటలో పాటించి సమన్యాయం చేసారు.

రామమయం: జగమంతా రామమయం అని ఆలపించు భక్తులకు, రాముని గుణగణాలను కీర్తిస్తూ రాసిన పాటలో ఓర్పును ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన తత్త్వం నేటికీ ఆదర్శమే. 

జగదభిరామా! రఘుకులసోమా! శరణము నీయవయా రామా! కరుణను జూపవయా!

కౌశికు యాగము కాచితివయ్యా! రాతిని నాతిగ జేసితివయ్యా

హరువిల్లు విరచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణరామా             ॥శరణము॥

రాముని తత్త్వాన్ని, మనస్తత్వాన్ని, దృక్పథాన్ని, మహిమను, ఘనతను, స్వభావాన్ని సంక్షిప్తంగా రామాయణ సారంగా మలచిన గీతమిది. మారుమూల వల్లెల్లోని రామాలయాల్లో నేటికినీ భజనగీతంగా పాడుకోబడటం విశేషం.

కృష్ణ తత్వం: దాశరథి స్వయాన వైష్ణవుడు కావడం వల్ల స్వామికార్యం, స్వకార్యం అన్న చందంగా రామ, కృష్ణ, వేంకటేశ్వరులను కొనియాడాడు. ‘శ్రీకృష్ణ విజయం’(1971) చిత్రంలోని పాట.

పల్లవి: జయహే! నవనీలమేఘ శ్యామా! వనమాలికాభిరామా! 

- నీ గానమ్ములో ఈ లోకమ్ములే పులకించు దేవ దేవ ॥జయహే॥

చరణం: వేదాల కొసలందు వెలుగొందు స్వామీ! వ్రేపల్లెవాడలో వెలసినా వేమీ!

మానవుని దేవునిగ మలచనే కాదా! ఔలె! సరేలె! భలే లీలలే!

చరణం: ఇలలోన ధర్మమ్ము నెలకొల్పనెంచి యెన్నెన్నొ రూపాల యేతెంతు వీవు!

వేడినవారిని విడనాడబోవు! నిజం... నిజం... ముమ్మాటికిది నిజం! మధురం మధురం! అధరం మధురం! అధరము సోకిన వేణువు మధురం! నామం మధురం! రూపం మధురం! పిలుపే మధురం! తలపే మధురం! నీవే మధురం ॥జయహే॥

యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అని గీతలో తెలియజేసిన విధంగా, ధర్మానికి హాని జరిగినపుడల్లా శ్రీహరి ఏదో ఒక అవతార మెత్తుతుంటాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు వేద స్వరూపుడు. అందుకే వేదాల కొసలందు అని అన్నాడు.

మాతృదేవత’ 1979లో వచ్చిన చిత్రంలో కృష్ణున్ని కొలువడానికి తన మనసును కోవేల చేశాననీ సాగే పాటలో మా ఇరువురి ఆనందం కలకాలం మది నిండాలి అని సాగే అన్యోన్య దాంపత్యాన్ని కోరుకుంటుంది. 

పల్లవి: మనసే కోవెలగా మమతలు మల్లెలుగా 

నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా.. కృష్ణా.. ఆ..ఆ..

చరణం: ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం

కలకాలం మదినిండాలీ కలలన్నీ పండాలి - మన కలలన్ని పండాలి  ॥మనసే॥            

చరణం: నీ చూపులలో చూపులతో.. నీ ఆశలలో ఆశలతో` ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై.. ఒకరికి ఒకరై బ్రతకాలి            ॥మనసే॥

నీ చూపులలో చూపులతో ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి అని కోరే ఈ పాటలో కృష్ణ భక్తి అపారంగా కనబడుతూ ఉంటుంది.

కైస్తవ గీతాలు: తెలుగులో క్రైస్తవ భక్తిగీతాల రచనకో ప్రత్యేక పరిభాషను వాడుతుంటారు. ప్రభువు, దీనులు, కొలుచుట మొదలైనవి సాధారణంగా కానవచ్చే పదాలు. ‘మిస్సమ్మ’ చిత్రంలో పింగళి రాసిన ‘కరుణించు మేరి మాతా’ గీతం తర్వాత మళ్లీ అంత ఉదాత్తంగా దాశరథి రాసిన క్రైస్తవ భక్తి గీతం. ఈ పాట ఆ రోజుల్లో ప్రజాదరణ పొందింది. ‘ప్రేమజీవులు’ (1971) చిత్రంలో...

పల్లవి: దయచూడు యేసు ప్రభువా నీ వారి కావరావా 

నిన్నే తలిచేమూ - నిన్నే కొలిచేమూ               ॥దయ॥

చరణం: కనులైన లేని చీకటి బ్రతుకు వెలిగించు

జ్యోతి నీవే దివిలోనా - భువిలోనా - నీ రూపే నిండెనయ్యా మా తల్లి తండ్రి నీవేర్చాయి.

చరణం: ఏ దారి లేని దీనులకోసం                                                                                          ॥దయ॥

లోకాన వెలసినావు - కరుణించీ - దీవించే నీ నామం ముక్తి మార్గం - నీవున్న చోటే స్వర్గం

కరుణ, ముక్తి మార్గం, స్వర్గ భావనలు హృదయాన్ని ఆకర్షిస్తాయి. యేసు దివ్యత్వం, దీనుల రక్షణ భావనలు ఆకట్టుకుంటాయి.

వీణపాటలు: వీణపాటలకు పెట్టింది పేరు దాశరథి.

పల్లవి: పాడెద నీ నామమే గోపాలా! ` హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా                        ॥పాడెద॥

చరణం: మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా! ఆశలతోనే హారతిచేసి పదములు పూజింతురారా            ॥పాడెద॥

వీణ’ శబ్దం లేనప్పటికీ తెరపైన ఇది వీణ పాటగానే చూపించారు. మోహన, నటభైరవి రాగాలను అపురూపంగా వాడి, సాలూరి రాగరంజితం చేశారు. ‘పాడెద నీ నామమే’ నని గాంధారం నుండి పై స్థాయి గాంధారానికి నడిపించారు. ముఖ్యంగా ‘నీ మురళీ గానమే’ చరణానికి ముందు వీణపై వినిపించిన స్వరఖండికలు అలరిస్తాయి.

అంతా మనమంచికే’(1972), చిత్రంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుని గురించి రాసిన పాట విందాం.

పల్లవి: నీవేరా నా మదిలో - దేవా తిరుమలవాసా ! ఓ శ్రీనివాసా ! నీ పదదాసిని నేనేరా            ॥నీవేరా॥

1: యెంతో మధురం నీ శుభనామం జగతికి దీపం నీ దివ్యరూపం ఆశలపూలే - దోసిట నింపి వేచే భాగ్యము - నాదేరా॥నీవేరా॥

2: నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను నీపదములపై వాలిన సుమమై నిలిచే భాగ్యము నాదేరా॥నీవేరా॥

3:నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచాను స్వామీ నీ సన్నిధియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదేరా    ॥నీవేరా॥

నవవిధ భక్తి మార్గాలలో సమర్పణ మొకటి. స్వామివారి చరణాలపై పూవుగా ఉండాని, తన జీవితాన్నే హారతిగా అందించాలనుకునే ఆర్థ భక్తిని అందంగా ఆవిష్కరించారు.

ఆత్మీయులు’(1969), చిత్రంలో  

పల్లని: మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నో

చెలరేగె కలనైన కనని ఆనందం యిలలోన విరిసె మదిలో              ॥మదిలో॥

చరణం1: సిగ్గుచాటున నా లేతవలపు మొగ్గతొడిగింది 

పాలవెన్నెల స్నానాలు చేసి పూలుపూసింది                  ॥మదిలో॥

చరణం2: కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను 

అందాల తారలు మెరిసి చెలికాని చెంతచేరేను ॥మదిలో॥

చరణం3: రాదలోని అనురాగమంతా మాధవునిదేలే 

వేణులోలుని రాగాలకోసం వేచియున్నదిలే                ॥మదిలో॥

సంగీత, సాహిత్యాల పరంగా ఎంతో ప్రామాణిక గీతమిది. దాశరథి పాటలపై పుస్తకం రాసిన డా. వి.వి. రామారావు గ్రంథానికి ‘‘మదిలో వీణలు మ్రోగే’’ శీర్షికగా, యీ పాట పల్లవిని తీసుకోవడం జరిగింది. పాట ఆద్యంతం కావ్యనిర్మాణ శిల్పంలో కవి సమయాలతో సాగి అలరిస్తుంది. మదిలో వీణలు మ్రోగడమంటే, మధురమైన ప్రణయరాగం ఎదలో రవళించిందన్న మాట. నాయికలో తొలిప్రేమ మొగ్గతొడిగి, పాలవెన్నెలతో పునీతమై వికసించి, సరసశృంగార సరస్సులో కలువగా పరిణమించినదన్న అభివ్యక్తిలో ఒక్కో దశను దాటిన ఆమె వలపు పరిణామం సూచించబడిరది. దాశరథి పాటలరాశిలో అమృత కలశం యీ గీతం.

జమీందారుగారి అమ్మాయి’(1975), సినిమాలో రాసిన పాటలో సిరిమల్లె పువ్వు కురిసింది అంటూ సాగుతుంది.

పల్లవి: మ్రోగింది వీణా! పదే, పదే హృదయాలలోనా.. ఆ దివ్యరాగం అనురాగమై - సాగిందిలే ॥మ్రోగింది॥

చరణం: సిరిమల్లె పువ్వు- కురిసింది నవ్వు నెలరాజు అందం - వేసింది బంధం

 ఆ బంధమే మరీ, మరీ ఆనందమే ॥మ్రోగింది॥

దాశరథి వీణ పాటలలో, మరొక అమృత కలశం యీ గీతం. లలిత పదాలతో భావ బంధురంగా రాశారు. హీరో మనసు నిండా ఆమె రూపమే నిండి పోవడం వలన హృదయం అనుభూతుల సంద్రమైపోయింది. ‘ఆమె నవ్వింది’ అని వాచ్యం చేయకుండా, ‘‘సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు’’ అని ప్రతీకాత్మకంగా (సింబాలిక్‌ గా) చెప్పడం విశేషం. ఈ పాటను చిత్రంలో వేర్వేరు సందర్భాలలో, పదాలలో చిన్న మార్పులతో, హీరో పరంగా, హీరోయిన్‌ పరంగా వాడారు.

ఈ పాట బాణీకి మూలం, తమిళంలో యస్‌.పి.బాలు పాడిన ‘తేన్‌ సిందుదే వానం, ఉనయ్‌, ఎనయ్‌ తాలాట్టి దే’ పాట. (చిత్రం- పొన్నుక్కు తంగమనసు) ఈ చిత్రానికి కూడా జి.కె. వెంకటేశ్‌ స్వరకర్త. అయితే బాణీని మాత్రం వారి వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మాస్ట్రో ఇళయరాజా యిచ్చాకే కణ్ణదాసన్‌ రాశారు. కన్నడంలో కూడా యీ బాణీతో చేసిన పాట హిట్టయింది. వీణావాద్య విద్వాంసుడైన జి.కె. వెంకటేశ్‌ యమన్‌ రాగంలో, శిష్యుడు ఇళయరాజా చేసిన బాణీనే ఆమోదించి దాశరథితో పాట రాయించారు. జి.కె.గారి వీణానాదస్వర విన్యాసం నిజంగానే మన హృదయాలలో పదే పదే సరనాదాన్ని మ్రోగిస్తూనే వుంటుంది.

అమాయకురాలు’(1971) సినిమాలో వీణ మీద రాసిన పాట అద్భుతంగా సాగిన పాట ఆద్యాత్మికతను తొణికిసలాడిరచింది.

పల్లవి: పాడెద నీ నామమే గోపాలా -  హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా                         ॥పాడెద॥

చరణం1: మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా - ఆశలతోనే హారతిచేసి పదములు పూజింతురారా ॥పాడెద॥

చరణం2: నీ మురళీగానమే పిలిచెరా - కన్నుల నీమోము కదలెనులేరా - 

పొన్నలుపూచే బృందావనిలో వెన్నెల కురిసే 

యమునాతటిపై నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా 

సంగీత సాహితీ విలువలు పుష్కలంగా వున్న గీతమిది. రాధ తన ప్రణయ భావాన్ని, మధురబాధను మమతల మాలికలలో, ఆశలహారతితో అందించినట్లు అక్షరీకరించారు.

సాహిత్యంలో ‘వీణ’ శబ్దం లేనప్పటికీ తెరపైన ఇది వీణ పాటగానే చూపించారు. మోహన, నటభైరవి రాగాలను అపురూపంగా వాడి, సాల రాగరంజితం చేశారు. ‘పాడెద నీ నామమే’ నని గాంధారం నుండి పై స్థాయి గాంధారా నడిపించారు. ముఖ్యంగా ‘నీ మురళీ గానమే’ చరణానికి ముందు వీణపై వినిపించిన స్వర ఖండికలు అలరిస్తాయి.                                           

ఒకే కుటుంబం’(1970) చిత్రంలో సర్వమతాల సారం ఒకటేనని తెలియజేస్తూ రాసిన పాట అందరికీ ఒక్కటే దేవుడని పాట ప్రారంభంలోనే  రహీము, రాముడు, ఎవరైనా దేవుడొక్కడే అని పరమత సహనం బోధిస్తాడు. మతాలు ఏవైనా మంచి మనసు ఉంటేనే మనిషంటాము అని మనీషి తత్త్వాన్ని బోధించే ఈ చైతన్యవంతమైన పాటలో డప్పు మోగిస్తూ పాడడము చిత్రీకరించారు.

పల్లవి: అందరికీ ఒక్కడే దేవుడూ ` కొందరికి రహీము కొందరికి రాముడు ` ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే॥అందరికీ॥

పై వేషం చూసి నీవు భ్రమపడరాదు 

మేడి పండు మెరుగంతా మేలిమికాదు

ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు 

పక్కనున్న మానవుని ఎందుకు మరచేవు

మానవసేవే మాధవ సేవ బాధపడే సోదరులను ఆదుకొనేము

  మనుషులమై మనమంతా కలిసుంటాము            ॥అందరికీ॥

చరణం: కష్టపడే నీతిపరుని కడుపు నిండదు దోచుకునే దొరగారికి తృప్తివుండదు

స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము శ్రమజీవుల కష్టఫలం యిప్పిస్తాము

అహంస బోధిస్తాం, ప్రశాంతి సాధిస్తాం లోకంలో ఆకలే లేకుండా చేస్తాము ` మనుషులమై మనమంతా కలిసుంటాము॥అందరికీ॥

మానవసేవవ బాధపడే సోదరులను ఆదుకుంటాము. మనుషులమై మనమంతా కలిసుంటాము. మత సామరస్యాన్ని బోధించే యీ గీతాన్ని స్వామి వివేకానంద బోధనల ప్పూర్తితో మానవతా విలువలతో రాశారు. ప్రబోధాత్మక గీతంగా ప్రజాదరణ పొందింది.

మానవ సంబంధాలు: దాశరథి సినీగీతాలలో మానవ సంబంధాలను నిలబెట్టడానికి ప్రతి అక్షరాన్ని పేర్చి, కూర్చి ప్రేమలు ఉప్పొంగే విధంగా రచించారు. హృదయాలను కలకాలం నిలిచేదీ నిజమైన జన్మబంధమని తెలుపుతూ ‘రక్త సంబంధం’(1962) చిత్రంలో అన్నా చెల్లెల  , కుటుంబం గురించి సవివరంగా వివరించాడు.

పల్లవి: రక్త సంబంధం ఇదే రక్త సంబంధం - హృదయాలను కలిపేది కలకాలం నిలిచేదీ నిజమైన జన్మబంధం ॥రక్త సంబంధం॥

చరణం:చెల్లి సుఖమె తన సుఖమని యెంచును - చెల్లి కొరకు గుండెలు కరగించును

తల్లి దండ్రి లేని లోపం తొలగించినాడు ` పాపం ఏనాటికైన గాని విడిపోని దివ్యబంధం...             ॥రక్త సంబంధం॥

చరణం: ఒకే గూటిలోని చిన్నిపిల్లలు, ఒకరి విడిచి ఒకరు బ్రతుక నొల్లరు

దేహాలు వేరుగానీ హృదయాలు రెండు ఒకటే సుడిగాలు లెన్ని రానీ తెగిపోని మధుర బంధం...            ॥రక్త సంబంధం॥

ఈ రక్త సంబంధం సినిమాకు టైటిల్‌ సాంగ్‌. అన్నాచెల్లెళ్ల బంధానికి దర్పణం పట్టి పాటను రాసారు. హృదయాలను కలిపేది, కలకాలం నిలిపేదే రక్తసంబంధమని నిర్వచించి, ఎలాంటి వైపరీత్యాలు ఎదురైనా శాశ్వతంగా నిలిచే దివ్యబంధమని పేర్కొన్నారు.

బుల్లెమ్మ బుల్లోడు’(1972) చిత్రంలో మాతృత్వాన్ని పతాక స్థాయిలో నిలిపిన పాట. ప్రతి ప్రాణికి అమ్మ అన్నది కమ్మని మాట, అంతులేని సొమ్ము హృద్యంగా సాగింది.

అమ్మ అన్నది ఒక కమ్మని మాట - అది ఎన్నెన్నో తెలియని మమతల మూట

దేవుడే లేడనే మనిషున్నాడు - అమ్మే లేదను వాడు అసలే లేడు

తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ॥2

ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు                                                               ॥అమ్మ అన్నది॥

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కతే - అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కతే

అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ నాదీ                        ॥అమ్మ అన్నది॥

అమ్మ ఉన్న ఇంటిలో లేనిది లేదు. అందరికి ఇలవేల్పు అని వివరిస్తాడు.

అన్నా చెల్లెల అనుబంధాన్ని వింటుంటే మనసు ద్రవిస్తుంది. ఎన్నిసార్లు విన్నా తెలియకుండా మనసు మానేరు అవుతుంది. నేటికీ రాఖీ పౌర్ణమీ రోజున పాటను పదేపదే వినేవాళ్లు కూడా వున్నారు. అలాంటి అనుబంధాల్ని మనసు బంధాలుగా నిలపడం దాశరథికి వెన్నతో పెట్టిన ఉబికి వచ్చే పాటల ఊట. ‘చిట్టి చెల్లెల్లు’(1970) చిత్రంలో పాపాయి గురించి రాసిన పాటలో నీకన్నా నాకెవరే అని చెప్పె మాటలు మనల్ని అన్నతనంలో పెద్దరికాన్ని, బాధ్యతల్ని గుర్తుచేస్తాయి.

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప - బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే

నీకన్నా నాకెవరే - అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

ఆ చల్లని జాబిలి వెలుగు - ఆ చక్కని చుక్కల తళుకు - నీ మనుగడలో నిండాలమ్మా 2

మనకే లోటు రానీయదులే - అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

బజ్జోవే బుజ్జాయి నేనున్నది - నీ కొరకే నీకన్నా నాకెవరే

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప, ల ల

భవిష్యత్తు అంతా పసిపాపదేనని ప్రకటిస్తాడు ప్రజా కవి దాశరథి.

ఆడపడుచు’(1967) చిత్రంలోని పాట అన్నా చెల్లెల అనుబంధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళింది.

పల్లవి :అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం 

ఓ అన్నా నీ అనురాగం...

పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం                 ॥ఓ అన్నా॥            

చరణం: మల్లెలవంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి ` ఎల్లకాలము ఈ తీరుగానే చెల్లిని కాపాడాలి..

పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం            ॥ఓ అన్నా॥

చరణం: ఇల్లాలినై నేనెచటికేగినా...  చెల్లిని మదిలో నింపాలి

ఆడపడచుకు అన్నివేళలా...  తోడూ నీడగా నిలవాలి

పుట్టిన రోజున మీ దీవేనలే...  వెన్నెల కన్నా చల్లదనం             ॥ఓ అన్నా॥

అన్న గొప్పతనాన్ని వివరించింది. దొరబాబు చిత్రంలో ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే అన్నని చూపిస్తానని పాట ద్వారా వివరిస్తాడు.

ఊయలలూపుతున్న శిశువును చూసి తల్లి పాడుతున్న పాటలో నా చెంత నీ ఉంటే స్వర్గమే నాదౌనూ అని తల్లి మనసును స్వభావోక్తిలో పలికిస్తాడు. ‘భద్రకాళి’(1977) చిత్రంలోని కన్నయ్యపై పాడిన పాటలో ఉప్పొంగుతున్న మాతృహృదయావిష్కరణ చేసాడు.

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా - నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ

ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ - జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ             ॥చిన్ని చిన్ని కన్నయ్యా॥

గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే ` కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే

నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ` ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ

జోలపాట పాడేనూ - లాలిపాట పాడేనూ            జోలాలి...2,

తీయని కలలతో తన ఒడిలో నిద్రపోతున్న శిశువుని చూసి తల్లి జీవితార్థం పొంది మురిసిపోతుంది. ఈ బంధం ఏడేడు జన్మలకు చెదరని అని చెప్పే ఈ గీతం మాతృస్నేహానికి జీవితం ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆలంకారికంగా రసభరితంగా రచించిన ఈ పాట, మాతృత్వపు భావాల్ని సుస్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

 ‘చల్లని నీడ’(1968) చిత్రంలో పూల పరిమళం కన్నా, మమతల మల్లెలు పప్పు అని వాటిని గుమగుమలాడిరచిన మానవ సంబంధాలు పసిపాపే నేనీ చెప్పడం ఆదర్శంగా నిలిచింది.

పల్లవి: మల్లెల కన్నా జాబిల్లి కన్నా ॥2చల్లని పాపాయి లాలీజో॥2

చ. లోకాలు నిదురుంచు వేళాయెరా - కలలందు విహరించ రావేలరా

తారలతో ఆడుకోవాలిరా - మేఘాలలో తేలిపోవాలిరా                               ॥మల్లెల కన్నా॥

చ. నీ వారు లేరన్న భయమేలరా-  నేనుండగా నీకు లోటేమిరా

కన్నులలో దాచుకుంటానురా కనుపాపలా చూచుకుంటానురా ॥మల్లెల కన్నా॥ జోల పాటలు పూల పరిమళంతో అలతి అలతి పదాల అల్లికలతో చంటి పాపం మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని మృదువుగా రాశాడు.

తొలి సంతానం అంటే దంపతులకు ఎంతో పరోక్షం ఉంటుంది వారి ఆరాటాలను అత్యద్భుతంగా చిత్రించిన పాట

నాది ఆడజన్మే’’(1965) చిన్నారి పొన్నారి పువ్వా అని పొగడుతూ మన పొదరిందటి పువ్వూ నిను చూసి నను చూసి నవ్వు అని అనడంతో సహజత్వం ఉట్టిపడుతుంది.

అతడు. చిన్నారి పొన్నారి పువ్వు - విరబూసి విరబూసి నవ్వు

ఆమే. మన ఇంటి పొదరింటి పువ్వూ - నిను చూసి నను చూసి నవ్వూ            ॥చిన్నారి పొన్నారి ॥

చ. ఆమె. హృదయాన కదలాడు బాబూ - రేపు ఉయ్యాల జంపాలలూగగు

పసివాడు పలికేటి మాటా ముత్యాల రతనాల మూటా                           ॥చిన్నారి పొన్నారి ॥

చ. ఆమె. ఒడిలోన పవళించు వేళా - నేను పాడేను ఒక జోల పాటా

అతడు. కనుమూసి నిదురించు బాబూ - కలలందు జోగాడగలడు                   ॥చిన్నారి పొన్నారి ॥

పాడడం అన్నకు చిరునామాగా మిగిలిపోయింది.

దాశరథి స్త్రీల పరంగా రచించిన పాటలు ఆత్మవిశ్వాసం నింపాయి. ‘ఆడదాన్ని ఆట బొమ్మ అనుకుంటారు’ అని అగ్ని పరీక్ష చిత్రంలో వివరించారు. వలచిన మనసే మనసు అనే పాట చదరంగం సినిమాలో స్త్రీలకు స్వాతంత్రం ఉంటేనే వలితాలకది స్వర్గమని వ్యక్తీకరించాడు.

భలే రంగడు’(1969), చిత్రంలో నిన్న నేడు నిరంతరం నాదే అని ప్రకటించుకున్న ఆత్మగౌరవ పతాకం కలిగిన పాట.

పల్లవి : నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే యెవరేమన్నా యెన్నటికైనా గెలుపు నాదేలే                 ॥నిన్న॥

చరణం: కల్లాకపటం యెరగని వాణ్ణి గాలిపటంలా తిరిగే వాణ్ణి పెంకిఘటంలా నిలిచే వాణ్ణి నిండుగుండెతో బతికేవాణ్ణి ‘‘నిన్న

చరణం : మంచివాళ్ళతో నేస్తం కడతా బడా చోరుల భరతం పడతా చీకూ చింతా లేకుండా సంతోషంగా జీవిస్తా...

స్వాభిమానం, ఆత్మవిశ్వాసం గల నాయకుని వ్యక్తిత్వానికి నిర్వచనంగా యీ గీతాన్ని రాశారు. భూత భవిష్యత్‌ వర్తమానాలకు అతీతంగా నిలచే కవిత్వం సృష్టించే వాడే మహాకవి. ఈ పాట సినిమాపరంగా కాకుండా చూస్తే దాశరథి వ్యక్తిత్వం కూడా ధ్వనిస్తుంది. మంచి వాళ్లతో నేస్తంగా ఉంటానని బడాచోరుత భరతం పడతానని, చీకూ చింతా లేకుండా సంతోషంగా జీవిస్తానని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని ప్రకటించడమే. తన దృక్పథాన్ని తెలియజేయడమే. 

సామ్యవాద లక్షణం: దాశరథి వ్యక్తిత్వం అందరూ బాగుండాలనే మనస్తత్వం. సమసమాజాన్ని కాంక్షించే మనసు కావడం మార్పు నిత్యపరిణామ క్రమమమని దాన్ని ఆహ్వానించాలి. ఆస్వాదించాలని అందులో మంచి కోరుతాడు. ‘నిలువు దోపిడి’(1968) చిత్రంలో లోకం మారుట సహజం. మారుతున్న పరిస్థితులపై కోపమెందుకు? అని ప్రశ్నిస్తూ సాగిన పాట చూడండి. 

పల్లవి: లోకం యిది లోకం మారుట దానికి సహజం మారితే ఎందుకుకోపం ॥లోకం॥

చరణం:వసంతకాలం వచ్చిందంటే వనమంతా విరబూస్తుందీ ` మదిలో వలపే వెలిగిందంటే

మనిషిలో మార్పే వస్తుందీ                                                                                               ॥లోకం॥

చరణం: పాతొక రోత కొత్తక వింత వాటి కలయికే జగమంతా అందానికి అంతేది ఆనందానికి హద్దేది ॥లోకం॥

చరణం: ఎల్లోరా గుహ శిల్పాల్లో ` శిల్పాల్లో పిల్లను చూసి మురిశారు మురిశారు

ఆ వొంపులను ఆ సొంపులను అనుకరించితే తిట్టారు తిట్టారు                                                             ॥లోకం॥

పపంచంలో మార్పు అనేది సహజం. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. శిశిరం పోయి వసంతం వస్తుంది. అలాగే మనిషిలో, మనసులో కూడా మార్పు అనివార్యమని సూచించారు. కాబట్టి మారుతున్న సమాజం పట్ల కోపం కూడదనే భావంతో రాసిన పాట. ఈ పాటను సాంస్కృతిక ఉత్సవంలో ఒక నృత్యగీతంగా చిత్రీకరించారు.

వసంతకాలం రాగానే ప్రకృతిలో మార్పు వస్తుంది. అలాగే మనిషి హృదయంలో ప్రేమ చిగురించగానే, ఆత్మలో మార్పులు జరుగుతాయి. భాషలు ఏవైనా మన వేషం ఏదైనా మనసే మంచిది కావాలి. లోకం పోకడ తెలియాలి. ఈ లోకం పోకడ తెలియాలి.

దేశంలో విగ్రహాల పూజ ఎక్కువైంది. వ్యక్తి పూజ విస్తృతమైందని తెలుపుతూ నాయకుల స్ఫూర్తిని నింపుకోవాలనీ, వారిచ్చిన ఆచరణను మరిచి విగ్రహాలను ప్రతిష్టించడం వ్యర్థమని ‘కాలం మారింది’(1972) చిత్రంలో నిజం తెలుసుకొమ్మని తెలుపుతూ రాసిన పాట డప్పుచరిత్రలో ఒక మైలురాయి. నేతల విగ్రహాలు, వీధులకు పేర్లు పెట్టే వాళ్లకు చెంపపెట్టులాంటి హెచ్చరిక చేసిన పాట దాశరథి అందించారు.

పల్లవి: విగ్రహాలను ప్రతిష్టించమని - వీధులకు తమ పేర్లు పెట్టమని మన నాయకులెవరూ అనలేదండీ

అనుపల్లవి :చరణం: పేదలపాలిటి పెన్నిధి గాంధీ - దీనుల పాలిటి దేవుడు గాంధీ

అంటరానితనమై పీడిరచే - అంటు వ్యాధికే వైద్యుడు గాంధీ, అతని దారిలో నడవండి-అతనికి శాంతిని చేకూర్చండీ ॥నిజం॥

స్వతంత్ర భారత సారధి నెహ్రూ - తూర్పు పడమరల వారధి నెహ్రూ, శాంతి విధాత - జాతికి నేత, సామ్యవాద సంధాత నెహ్రూ

అతని బాటలో నడవండి - అతని ఆశలూ తీర్చండీ                                                                          ॥నిజం॥

కులమత బేధంలేని సమాజం ` ధనికుడు పేదలేని సమాజం `

దోపిడి రాపిడిలేని సమాజం - ద్రోహం మోసంలేని సమాజం              

     భారతదేశం ఒకటే ఒకటని ప్రపంచమంతా చాటాలి -

 వీరనాయకుల వారసులమని పేరు ప్రతిష్టలు తేవాలి...

వారి కలలన్నీ నిజము కావాలీ... ఈ అభ్యుదయాన్ని కోరుకుంటాడు. విగ్రహాలను పెట్టడం, వీధులకు నాయకుల పేర్లు నామకరణం చేయడం కాదు వారి ఆశయాలను ఆచరించాలని సాగుతుందీపాట. గాంధీ, నెహ్రూ, ఇందిరల నాయకత్వాన్ని కొనియాడుతాడు. భారతదేశంలో ధనిక పేద తేడాలేని సమాజం ఆవిష్కారం కావాలని కలలు కన్నాడు. 

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ గారి దర్శకత్వంలో అభ్యుదయ రచయిత, ప్రముఖ పత్రికారచయిత వాసిరాజు ప్రకాశం నిర్మించిన సామాజిక సందేశాత్మకచిత్రం ‘కాలం మారింది’. కథాపరంగా అంతర్‌ కళాశాల సాంస్కృతికోత్సవం సందర్భంగా హీరో నిర్వహించే నృత్యరూపకంగా దాశరథి రాసిన అభ్యుదయ గీతమిది. ఇందులో దాశరథి తన సామ్యవాద భావాలను వ్యక్తీకరించారు. విగ్రహాలను ప్రతిష్టించి, వీధులకు పేర్లుపెట్టి, రాజకీయ నేతల వ్యక్తి ఆరాధనకు స్వస్తి చెప్పాలన్న దాశరథి మాటలు నేటికీ శిరోధార్యాలు.

పల్లవి: మారలేదులే యీ కాలం మారలేదులే

యీ లోకం దీనులకు హీనులకుప తీరలేదులే యీ శోకం                   ॥మారలేదులే

అందరిలో వుండేది ఒకే రక్తమైనా 

 అందరినీ సృష్టించింది ఒకే దైవమైనా

కులం పేరుతో మతం ముసుగులో ప్రాణమున్న మనిషినే సమాధిచేశారే...       ॥మారలేదులే॥

వారే నీవారు... అనాధలు, అభాగ్యులు. వారే నీ బంధువులు -

బాధితులు, పీడితులు కంటినీటితోనే తమ కడుపులను నింపుకొనే అంటరాని వారు... వారే నీవారు...

ఈ కోవెలలో యిక నీకు చోటు లేదమ్మా ఈ లోగిలిలో యిక నిలువనీడ లేదమ్మా!

‘‘కాలం మారింది’’ సినిమాలో మారలేదులే

దేశానికి మహమ్మారిలా సోకిన అంటరానితనాన్ని నిరసించిన గాంధీజీ సమసమాజం కోసం కృషి చేశారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ వర్ణ వ్యవస్థలో మార్పు రాలేదు. తరాలు మారినా దృక్పథాలు మారలేదు. అందుకే కాలం మారలేదు’ అని పల్లవితో ప్రారంభించారు.

అంటరాని వాడికి జన్మించిన బిడ్డ, అగ్రవర్ణాల వారింట పెరిగి పెద్దదవుతుంది. ఆమెను పెళ్లాడడానికి ముందుకు వచ్చిన తను, ఆమె జన్మరహస్యం తెలుసుకొని నిరాకరిస్తాడు. వాస్తవాన్ని తెలుసుకొన్న నాయిక దుఃఖిస్తుంది. ఈ సన్నివేశానికి నేపథ్యగీతంగా రాశారు.

చాలా కాలం తదుపరి రాజేశ్వరరావు స్వీయ సంగీతంలో పాడారు. ఈ పాటలో ముఖ్యంగా ‘కులం పేరుతో’ పంక్తి వద్ద యస్‌.డి.బర్మన్‌ స్వరపరచిన ‘రాధానే మాలా జబ్‌’ (తేరే మేరే సప్ని -1971) గీతంలోని ‘ప్రీత్‌ కా జుడీ, డోర్క్యా బంధి’ బాణీలను యధాతథంగా తీసుకోవడం గమనించవచ్చు.


దాశరథి పాటలు- 20.07 2025 సంచిక పత్రిక

దాశరథి పాటలు -2 తేది: 27-07-2025


లుప్తమవుతున్న విలువలు: ‘సమాజంలో లుప్తమవుతున్న విలువలను చూసి బాధపడుతూ సాగే పాటను ‘ఒకే కుటుంబం’(1970) కోసం రాసాడు. నేటి మానవుడు మంచిని మరిచిపోతున్నాడు. వంచనతో మనిషి పశువవుతున్నాడని తెలియజేస్తున్నాడు. 

పల్లవి: మంచిని మరచీ - వంచన నేర్చీ మంచిని మరచీ - వంచన నేర్చి నరుడే యీనాడూ - వానరుడైనాడూ వానరుడైనాడూ ॥మంచిని॥

చరణం1: చదువూ, తెలివీ పెంచాడూ 

 చంద్రలోకము జయించాడూ నీతులు చెప్పీ, గోతులు తవ్వీ పాతాళానికి జారాడూ

మెదడే పెరిగీ హృదయం తరిగీ - నరుడే యీనాడూ వానరుడైనాడూ - వానరుడైనాడూ

చరణం2 : అందరి చెమటా చిందించాడూ - 

సంపద ఎంతో పెంచాడూ పంపక మంటూ వచ్చే సరికీ 

అంతా తనదే అన్నాడూ - 

ధనమే హెచ్చీ గుణమే చచ్చీ - నరుడే యీనాడూ వానరుడైనాడూ - వానరుడైనాడూ

సైన్స్‌, టెక్నాలజి సాధించిన అభివృద్ధిలో మానవుడు చంద్రునిపై కాలుపెట్టాడు. విశ్వాంతరాళాల రహస్యాల్ని ఛేదించాడు. కానీ అంతర్ముఖీనుడు కాలేకపోతున్నాడు. దిగజారిన విలువలతో స్వార్థపరుడైనాడు. అందుకే తిరోగమనం చెందుతున్నాడని ఆవేదనతో వర్ణించాడు. డార్విన్‌ పరిణామ సిద్ధాంతం కోతి నుండి మనిషి ఆవిర్భవించాడని చెబుతుంది. ఈ జీవశాస్త్ర అంశాన్ని తీసుకొని ‘నరుడు వానరుడైనాడని’ వ్యంగ్యంగా రాశాడు.

ఆకలిని మరిపించడానికి మానసికంగా మురిపించడానికి దాశరథి రాసిన గేయం ‘మానవుడు దానవుడు’లో ఉంది.

దాశరథి పాటలలో మల్లెలు గులాబీలు పారిజాతాలు మొదలైన పూలపరిమళాన్ని ఘుమఘుమలు వెదజల్లాడు. వెన్నెల, తుమ్మెద, చిలకా, గోరింకలు, చీకటి, పారిజాతం,... మొదలైనవి విరివిగా ప్రయోగించాడు. చైతన్యానికి ప్రతీకలుగా దీపాలు వాడుకున్నాడు.

 దాశరధి పాటలలో వస్తునవ్యత, వస్తు విస్తృతి ఎంతగానో కనబడుతుంది. రసావేశం ఎక్కువే అని చెప్పాలి. ‘మనసు మాంగల్యం’ అనే చిత్రంలో గుండెలోని గాయాలే మన్నించే గేయాలని పాట పుట్టుకకు కవిపడే అంతర్‌ మథనాన్ని వివరించారు. దాశరధి పాట వల్ల ఆ సినిమాకు సన్నివేశ బలం లేకున్నా సినిమాకి బలం కలిగిందన్న ప్రశంసలు పొందుకున్నారు.

దాశరథి రెండు దశాబ్దాల సినీగేయ సాహిత్య ప్రయాణం ‘నువ్వు చల్లంగా ఉండాలి’ అని దీవిస్తూ ‘బంగారు బాట’(1982) చిత్రంతో ముగిసింది. దాదాపు 650 పైగా పాటలు రాసిన దాశరధి సినీకవిగా ప్రఖ్యాతిగాంచాడు.

1977లో ఆస్థాన కవిగా నియమించబడ్డ దాశరథి 1984 వరకు నిర్దక్షిణ్యంగా ఎన్టీఆర్‌ ప్రభుత్వంచే తొలగించబడ్డాడు. ఆ అవమాన భారంతో కృంగి కృషించి, నశించి గుండెపోటుతో మరణించాడు. ‘నా గీతావళి ఎంతదూరం ప్రయాణంబౌనో అంతదాక ఈ భూగోళంబునకు అగ్గిపెట్టెద’ అని ప్రకటించిన విధంగా పద్యాలు, పాటలు, సాహిత్యమంతా తెలుగువాడి హృదయంలోకి ప్రవేశిస్తుంది. తెలుగు ప్రజల నాలుకలపై ధ్వని శబ్దమై నాట్యమాడుతాడు. పాఠకులకు, శ్రోతలకు తన అక్షరాలతోనే కాదు. తన ఆచరణద్వారా టన్నుల కొద్దీ ఆత్మ విశ్వాసం నింపుతూనే ఉంటాడు. సాహిత్యాకాశంలో నిత్యం ప్రజ్వలించే తార దాశరథి.

ఆధార గ్రంథాలు:

అగ్నిధార

నవమంజరి

యాత్రాస్మృతి

మదిలో వీణలు మ్రోగే

దాశరథి సినిమా పాటలు

సాహిత్య ప్రపంచంలో దాశరథి

వివిధ పత్రికలు, యూట్యూబ్‌, ఆకాశవాణి

ఇతరములు....


దాశరథి పాటలు- 20.07 2025 సంచిక పత్రిక

దాశరథి పాటలు -2 తేది: 27-07-2025


                                                                      డా. సిద్దెంకి యాదగిరి

                                                                 9441244773

                                                          sygiri773@gmail.com